ఊరట
- T. V. L. Gayathri
- May 18
- 4 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Vurata, #ఊరట, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Vurata - New Telugu Story Written By - T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 18/05/2025
ఊరట - తెలుగు కథ
రచన: T. V. L. గాయత్రి
పూణే నగరంలో గత ఇరవైఏళ్ళుగా ఉంటున్నాము. కరోనా తర్వాత మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆ విషయాలు మనం గమనించకపోవచ్చు. ఈరోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. ఉదయం నిద్ర లేవగానే గుడికి వెళ్దామన్నాడు మా ఆయన. ఎగిరి గంతేసాను. సాధారణంగా గుడికి వెళదామనే ప్రపోజల్ నేనే పెడుతుంటాను.
మా ఆయనకి ఆఫీసులో ఏదో సమస్య వచ్చిందట. అది తీరిపోతే గుడికి వచ్చి దర్శనం చేసుకుంటానని దణ్ణం పెట్టుకున్నాడట. మా ఆయన అంతే! ఏదన్నా కష్టం వచ్చి పడితేనే ఈయనకు అర్జంటుగా దేవుడు గుర్తొస్తాడు.
"అలా కాదు ఎప్పుడూ దేవుడిని తలుచుకోవాలి!" అంటాను నేను.
"అంత టైం లేదబ్బా! " అంటారు.
"మరి కష్టం వచ్చినప్పుడు మాత్రమే హడావుడిగా దేవుడిని ప్రాధేయపడటం ఎందుకు?"అంటాను కోపంగా.
ఏం జవాబు చెప్పాలో ఈయనకు తెలీదు. అప్పటికప్పుడు తప్పించుకోవాలని
"రేపట్నించి చూడు! నువ్వు లేచేసరికి సంధ్యావందనం చేసేస్తా!" అంటారు నమ్మకం కలిగేటట్లు.
అలాటి రేపు ఎప్పుడూ రాలేదు.
సరే ఆయనతో నా కెందుకు? ఇంట్లో కొబ్బరికాయ లేదు. బిగ్ బాస్కెట్లో తెప్పిద్దామంటే టైమ్ లేదు.
" తొందరగా తెములు!" అంటూ మా అయన ఒకటే హడావుడి చేస్తున్నాడు.
వెళుతూ వెళుతూ దారిలో కొనుక్కుందాములే అనుకుంటూ కారెక్కి కూర్చున్నాను. దారిలోనే రాకేష్ కిరణా షాపు ఉంది. కారు దిగి షాపు దగ్గరికి వెళ్ళాను.
నన్ను చూడంగానే "ఎన్నాళ్లకు మేమ్ సాబ్!" అంటూ చాటంత మొహం చేసుకొని పలకరించాడు రాకేష్.
"ఎలా ఉన్నావు రాకేష్? వ్యాపారం ఎలా ఉంది? "అడిగాను.
కరోనా ముందుదాకా రాకేష్ మాకు నెలవారి సరుకులు తెచ్చి పెట్టేవాడు. కరోనా వచ్చాక బిగ్ బాస్కెట్, అమెజాన్, ప్లిప్ కార్ట్ అలవాటయ్యాయి. దాదాపుగా రాకేష్ దగ్గర సరుకులు తెప్పించుకోవడం మానేశాము.
"ఏముంది మేమ్ సాబ్! అంతటా కార్పొరేటు కంపెనీల హవా నడుస్తోంది.. వాళ్ళు క్షణాల్లో ఇంటికి డెలివరీ చేస్తుంటే మా వ్యాపారాలు ఏం బాగుంటాయి? నష్టాలు తప్పటం లేదు.. మీలాంటి వాళ్ళందరూ మా దగ్గర కొనుక్కోవడం మానేశారుగా!" అన్నాడు నిష్టూరంగా.
మనసుకు చాలా కష్టం వేసింది. షాపులో ఎక్కువ సరుకులు కూడా లేవు. ఎప్పుడూ నలుగురైదుగురు కుర్రవాళ్ళతో కళకళలాడుతూ ఉండే షాపది. ఈరోజు షాపులో రాకేష్ ఒక్కడే ఉన్నాడు. అతడి మొహంలో దీనత్వం తొంగి చూస్తోంది. చాలా బాధ వేసింది. కొబ్బరికాయ తీసుకున్నాను. దేవాలయానికి వెళ్లి ఇంటికి వచ్చాను. సరుకులు తెప్పించుకోవటం నా పనే కదా! ఇప్పటినుండి రాకేష్ దగ్గరే సరుకులు కొందామని నిశ్చయించుకున్నాను.
ఒకటో తారీకుకు కొంచెం ముందుగా సరుకులు రాసి పంపించాను. అన్ని సరుకులను రాకేష్ ఒక్కడే మోసుకొచ్చాడు.
"మీకు తెలిసిన వాళ్లకు కూడా చెబుతారా మేమ్ సాబ్!" అంటూ అభ్యర్థించాడు.
"తప్పకుండా చెప్తాను!" అంటూ భరోసా ఇచ్చాను.
సంతోషంగా డబ్బులు తీసుకొని నమస్కారం చేసి వెళ్లిపోయాడు రాకేష్.
మా కాలనీలోని అపార్ట్మెంట్లలో ఉండే ఆడవాళ్ళందరికీ కలిపి ఒక వాట్సప్ గ్రూపు ఉంది. దానిలో రాకేష్ గురించి రాసి కిరాణా షాపుల్లో సరుకులు తెచ్చుకుంటే చిరు వ్యాపారస్తులకి లాభంగా ఉంటుందని, వాళ్లకు కొంత మేలు చేసిన వాళ్లమవుతామని అభ్యర్థించాను. స్పందన మిశ్రమంగా వచ్చింది. కొందరు జవాబు ఇవ్వలేదు. మరికొందరు పాజిటివ్ గా స్పందించారు.
ఒక్కసారిగా మనుషుల్లో మార్పురాదు. ఇనాటి విషయాల గురించి పదేపదే చెబుతూ ఉండాలి. నెలకోసారైనా ఇలాంటి విషయాల గురించి గ్రూపులో చర్చిద్దామని మెసేజ్ పెట్టాను. ఇంకో నెల గడిచింది. రాకేష్ సరుకులు తీసుకొని వచ్చాడు.
"ఇప్పుడు ఎలా ఉంది వ్యాపారం?" అడిగాను.
" పర్వాలేదు మేమ్ సాబ్! మీ అపార్ట్మెంట్ల నుండి కొద్దికొద్దిగా ఆర్డర్స్ వస్తున్నాయి. అయితే వెంటనే డెలివరీ చేయాలంటున్నారు. అందుకే ఇద్దరు కుర్రవాళ్లను పెట్టుకున్నాను!" అన్నాడు రాకేష్.
"నువ్వు కంగారు పడకు రాకేష్! కార్పొరేటు కంపెనీల వాళ్ళలాగా నిమిషాల్లో డెలివరీ చేయాలి అనుకోవడం నీలాంటి చిరు వ్యాపారికి సాధ్యం అవదు. ఎంతమందిని కుర్రవాళ్ళని పెట్టుకుంటావు? ఒక పూట టైం అడుగు! ఒక పూటలో డెలివరీ చెయ్యి! నాణ్యమైన సరుకులు అందించు!" అని సలహా ఇచ్చాను.
"సరే మేమ్ సాబ్!" అంటూ వెళ్లిపోయాడు రాకేష్.
నేను ఆ నెలలో మాకు కాలనీలో ఉండే ఆడవాళ్ళతో రెండు సార్లు మాట్లాడాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కొందరు ఎక్కువ మందిలో మార్పు వచ్చింది.
అంతటితో నా పని అయిపోయింది అనుకోవడం లేదు. ఖాళీ సమయంలో వేరే వేరే కాలనీలకు వెళ్లి అక్కడ ఉండే ఆడవాళ్ళతో పరిచయం చేసుకొని చిరువ్యాపారస్తుల గురించి చెప్పడం మొదలుపెట్టాను.
మా ఆయనకి నేను చేస్తున్న పని చెప్పగానే "ఎందుకబ్బా ఊరికే గాసి పడతావు? హాయిగా ఇంట్లో ఉండరాదూ!" అన్నాడు.
"పాపం!రాకేష్ లాంటి వాళ్లు చాలామంది ఉన్నారు కదా! వాళ్లకు కొంచమైనా ఊరట కలుగుతుందని!" అన్నాను.
మా ఆయన నన్ను మెచ్చుకోలుగా చూసాడు. అయితే నాతోపాటు ఎవరు కలిసి వస్తారు? ఈ విషయం గురించి లోకల్ పేపర్లో రాశాను. సోమేశ్వర్ అనే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వెంటనే స్పందించాడు.
"ఈ మధ్య రిటైర్ అయిన వాళ్ళం కొందరం కలిసి చిరువ్యాపారస్తుల కోసం ప్రచారం మొదలుపెట్టాము!" అని చెప్పాడు.
నాకు చాలా సంతోషం వేసింది. ఏదైతేనేం నేను ఒంటరిదాన్నికాదు. చిరువ్యాపారస్తుల శ్రేయస్సు కోరుతూ కొంతమంది ఈ పూణే నగరంలో ప్రచారం చేస్తున్నారు. ఎప్పటికైనా వాళ్లకు మంచిరోజులు వస్తాయనే ఆశిద్దాము. //
(సమాప్తం )
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Comments