top of page

సమస్య

Updated: Jun 13

#JeediguntaSrinivasaRao, #Samasya, #సమస్య, #JeediguntaSrinivasaRao, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Samasya - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 18/05/2025

సమస్య - తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



ఒక్కడే కొడుకు కావడం తో చరణ్ ని కంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు మధు, అమ్మాణీ దంపతులు. చరణ్ కూడా తల్లిదండ్రులు ఆశల ప్రకారం చక్కగా చదువుకుంటూ మంచి బాలుడు గా పేరు తెచ్చుకుంటున్నాడు.


ప్రతి శనివారం తల్లిదండ్రుల తో కలిసి వాళ్ల వూరిలో వున్న వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళటం అలవాటు. ఆ అలవాటు తన ఇంజనీరింగ్ పూర్తి అయ్యి ఉద్యోగం వచ్చినా మారలేదు.


“నాన్నా! నేను హైదరాబాద్ కి వెళ్ళి ఉద్యోగం చేస్తో ఒక్కడిని వుండే బదులు మీరు కూడా నాతో రావచ్చు కదా” అన్నాడు చరణ్.


“చూడు చరణ్.. ఎల్లకాలం నీతో మేము వుండలేము. రేపు నీకు పెళ్లి అయితే నువ్వు, నీ భార్య, తరువాత నీ పిల్లలు.. యిలా కొత్త బంధాలు ఏర్పడాలి. మా బాధ్యత నీకు పెళ్లి చెయ్యడం వరకు మాత్రమే. ఆ తరువాత మిమ్మల్ని చూసి ఆనందిస్తూ శేషజీవితం మీ అమ్మా నేను ఈ పుట్టిన వూరిలోనే లాగించేస్తాము” అన్నాడు.


“అయితే కొడుకు గా నా బాధ్యత ఏమి లేదా మీ విషయం లో” అన్నాడు చరణ్. 


భారంగా ఊపిరి తీసుకుని మధు కొడుకు తో అన్నాడు “చూడు చరణ్! నీకు పెళ్లి అయ్యే అంత వరకు మాతో కలిసి నీ ఒంటరితనం మర్చిపోతావు. ఆ తరువాత నీకు భార్య అనే తోడు దొరుకుతుంది. అప్పుడు నీ అవసరాలు ఆమె చూసుకుంటుంది. అప్పటివరకు ప్రతి విషయం లో అమ్మా అది కావాలి, నా బట్టలు ఎక్కడ పెట్టావు అమ్మా అని అడిగే నువ్వు ఒక్కసారిగా ఆ పనులు నీ భార్యని అడగటం మొదలుపెడ్తవు. దానితో సహజంగా మాకు ‘చూడు ఇన్నాళ్ళు మన వెంట తిరిగిన కొడుకు పెళ్ళాం రాగానే మారిపోయాడు’ అనే బాధ కలుగుతుంది.


ఈ బాధ మా అమ్మా నాన్న అంటే మీ బామ్మా తాతయ్య కూడా యిలాగే అనుకుని వుంటారు, యిప్పుడు మేము రేపు మీ పిల్లాడు. పెళ్లి అయితే ఇది సహజం, ఎవ్వరి తప్పు కాదు. అందుకే పిల్లల పెళ్లి అయిపోయిన తరువాత తల్లిదండ్రులు కృష్ణా రామా అనుకుంటూ ఒకరి కోసం ఒకరు ఉండాలి కాని యింకా పిల్లల జీవితం లో పెత్తనం కావాలి అని అనుకోకూడదు. అందుకే మొదటి నుంచి నువ్వు విడిగా ఉండటం మంచిది అని నా అభిప్రాయం” అన్నాడు.


“అంటే నాకు పెళ్లి అయిన తరువాత మీ కోడలు మిమ్మల్ని నన్ను విడకొడుతుంది అని అంటారా? ఆలా అయితే నేను పెళ్లి చేసుకోను” అన్నాడు చరణ్. 


“నాయనా. నాకు యిప్పుడు యాబై అయిదు ఏళ్ళు.యిప్పుడు అలాగే అనిపిస్తుంది తల్లిదండ్రుల కోసం త్యాగం చెయ్యాలి అని, కాని అది ఏ తల్లిదండ్రులు ఒప్పుకోలేరు. తమ పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని పిల్లా పాపలతో సుఖం గా వుండాలి అని కోరుకుంటారు. అయినా అప్పుడే ఎందుకు నీకు బెంగ, వీలున్నప్పుడు నువ్వు రావచ్చు, మాకు వీలున్నప్పుడు మేము వస్తాము. హైదరాబాద్ మీ అమ్మ చూడలేదు యిప్పటివరకు” అన్నాడు తండ్రి.


“సరే ఎలాగో ఎల్లుండి బయలుదేరి నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం లో చేరాలి, ఈ రోజు శుక్రవారం. గుడికి వెళ్ళి వద్దాం పదా” అన్నాడు కొడుకు తో. 


మొత్తం యిద్దరు బయలుదేరి గుడికి వెళ్లారు. ప్రతీ వారం వచ్చే వాళ్ళు కావడంతో అర్చకుడు రమణాచారి గారు నవ్వుతూ పలకరించి వీళ్ళ పేరున అర్చన చేసి తీర్థం యిచ్చాడు.


ఎందుకో పూజారిగారు ఏదో బాధపడుతున్నట్టుగా వుండటం ప్రతిసారి గమనిస్తున్న మధు “అయ్యా గురువుగారు! మీరు ఏమి అనుకోను అంటే ఒక మాట అడగాలి అనుకుంటున్నాను” అన్నాడు రమణాచారి గారితో. 


జనం కూడా తక్కువగా ఉండటం తో తన సహాయకుడికి తీర్థం గిన్ని యిచ్చి “అలా పదండి, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం” అని ముందుకు నడిచాడు ఆచారిగారు.


గుడిలో స్థంభం కి ఆనుకొని కూర్చుని రమణాచారి గారు మధు ని కూడా కూర్చోమని, చరణ్ తో “నువ్వు అలా గుడి చుట్టూ ప్రధక్షణాలు చేసి రా నాయనా” అని పంపించి, “చెప్పండి మధుగారు” అన్నాడు. 


“ఏమి లేదు ఆచారిగారు, మేము మమ్మల్ని కాపాడమని అడగటానికి గుడికి వస్తాము, మీరు నిత్యం ఆ దేముడి దగ్గరే వుంటారు కదా. ఎందుకో నిరుత్యాహం గా వుంటారు. కారణం చెప్పగలిగితే చెప్పండి. మనం యిరవై ఏళ్ళ నుండి ఒకరికొకరు తెలిసినవాళ్ళం” అన్నాడు మధు.


“పెద్దగా చెప్పుకునే బాధ కాకపోయినా, మీరు ఉహించినట్టు కొంత అలజడి వుంది. నాకు ఒక్కత్తె కూతురు. పేరు రమ్య. చిన్నప్పుడు నుంచి చదువులో ఫస్ట్ రావడం తో అది ఇంజనీరింగ్ చదువుతాను అని పట్టుపట్టింది. నేను నా భార్య మనకెందుకు అంత పెద్ద చదువులు, మడికట్టుకుని దేముడి ప్రసాదం చేసి గుడికి పంపించగలిగితే చాలు, మంచి అర్చకుడిని యిచ్చి నీ వివాహం చేసి పంపించే స్తొమత మాత్రమే నాకు వుంది అని చెప్పినా, మొండిపట్టు పట్టడం వలన మన గుడి ధర్మకర్తలు దయవల్ల ఇంజనీరింగ్ చదివించాను. 


మీకు తెలుసుగా మా ఇళ్లలో మగపిల్లలు ఎక్కుగా ఏదో ఒక గుడి చూసుకుని సెటిల్ అయిపోతారు. యిప్పుడు మా అమ్మాయి తను ఉద్యోగం చేస్తాను అలాగే తనంత చదువుకున్నవాడినే పెళ్లి చేసుకుంటాను అని గొడవ మొదలుపెట్టింది, మీరే చెప్పండి మా ఆచారాలకు తగ్గట్టుగా బ్రాహ్మణ కుటుంబంలో వేరే శాఖ వారు దొరుకుతారా, దొరికినా ఈ పూజారి కూతురుని చేసుకుంటారా.. అదే బాధ” అంటూ “అదిగో సాయంత్రం నైవేద్యం కి ప్రసాదం తీసుకుని వస్తోంది.. అదే మా అమ్మాయి” అని లేచారు ఆచారి గారు.


‘అదేమిటి తన కొడుకు చరణ్ అక్కడ అమ్మాయి తో నవ్వుతూ మాట్లాడు తు వస్తున్నాడు’ అనుకున్నాడు మధు.


పూజారి గారి అమ్మాయి తండ్రి కి ప్రసాదం డబ్బా యిచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. తన దగ్గరికి వచ్చిన చరణ్ తో “ఎవ్వరితో రా మాట్లాడుతున్నావ్?” అని అడిగాడు. 


“మన గుడి పూజారి గారి అమ్మాయిట, నాకు ఇంజనీరింగ్ లో ఒక సంవత్సరం జూనియర్. బాగా చదువుతుంది, మంచి అమ్మాయి అని పేరుంది, అయితే మన ఊరే అని తెలియదు, యిక్కడ నన్ను చూసి పలకరించింది, ఈ గుడి వాళ్లదే అంది, మనం యిన్నాళ్ళు వేంకటేశ్వరస్వామి గుడి అనుకున్నాము” అన్నాడు నవ్వుతూ.


పూజారి గారు ఒక అరిటాకు లో ప్రసాదం తీసుకుని వచ్చి మధు చేతిలో వుంచాడు. ప్రసాదం తీసుకుని తండ్రీ కొడుకులు యింటికి బయలుదేరారు.


“ఏమిటి యింత లేట్ అయ్యింది?” అంటూ తలుపు తీసింది అమ్మాణీ. 


“ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటో కూర్చున్నాము పూజారి గారు నేను” అన్నాడు మధు ప్రసాదం పొట్లం భార్య చేతికి యిచ్చి. 


“రాత్రి భోజనం అయిన తరువాత ఆరుబయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు తండ్రి కొడుకులు.


“నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే ఆనందనగర్ లో ఈ ఊరు నుంచి వెళ్లి బిజినెస్ చేస్తున్న నా స్నేహితుడు హరిబాబు ని కలవు. అతను నీకు మంచి యిల్లు అద్దెకు చూపిస్తాను అన్నాడు, ఎవ్వరితోను విరోధం పెట్టుకోక నీ ఉద్యోగం నువ్వు చేసుకో, మనకి తెలియని ఊరు లో జాగ్రత్తగా ఉండాలి” అన్నాడు కొడుకుతో.


“అలాగే నాన్న, మీరు కంగారు పడకండి. యిల్లు తీసుకున్న తరువాత కొన్నాళ్ళు మీరు నాతో వుంటే చాలు” అన్నాడు చరణ్. 


“అది సరే, ఒక ప్రశ్న. మన బ్రాహ్మణ కులం నానాటికి తగ్గిపోతోంది కదా, పిల్లలకి పెళ్లిసంబంధాలు దొరకడం లేదు, దానికితోడు మనలోనే అనేక శాఖలు, వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు కలుపుకోరు, యిది అంతా అవసరమా” అన్నాడు మధు.


“నాన్నా! శాఖాహరులై ఆచార వ్యవహారాలు కలిస్తే ఏ కులం అయినా ఒక్కటే, ముఖ్యం గా ఆహార విషయం లో తేడాలు వుంటే కష్టం. అందుకే యివి అన్ని కలిసిన సంబంధాలే చూసుకుంటారు” అన్నాడు చరణ్. 


“అయితే ఒక విషయం చెప్పు. మన గుడి పూజారి గారి అమ్మాయి ని నువ్వు చేసుకోవడానికి ఆయన పూజారి తనం అడ్డం అనుకుంటావా” అని అడిగాడు కొడుకుని. 


తండ్రి ప్రశ్నకి తెల్లబోయి “అసలు ఆ ఆలోచన కూడా నా మనసులో లేదు” అన్నాడు చరణ్. 


పూజారిగారు తన కూతురు గురించి చెప్పిన విషయం చరణ్ కి చెప్పి, “చూడు చరణ్! వారి వాళ్లలో చాలా మంది మగపిల్లలు పూజారులు గా సెటిల్ అవుతున్నారుట, ఆ అమ్మాయి తనతో సమానంగా చదివిన అబ్బాయినే చేసుకుంటాను అంటోంది. ఈయన అటువంటి సంబంధం తెచ్చే స్థోమత లేదు అని బాధపడుతున్నాడు. సాయంత్రం అమ్మాయి ని చూసాను. బంగారం బొమ్మలా వుంది, నువ్వు కూడా ఆ అమ్మాయికి మంచి సర్టిఫికెట్ యిచ్చావు కాబట్టి నువ్వే ఆ అమ్మాయి ని పెళ్లి చేసుకుని మనలో మనకి శాఖా బేధాలు లేవు అని చెప్పచ్చుగా” అన్నాడు.


“నాకు టైం కావాలి. ఈలోపు అమ్మని ఒప్పించండి” అన్నాడు.


అంతే! కలిసొచ్చిన కాలం లో నడిచివచ్చిన పిల్లలు అన్నట్లు గా పూజారి గారు ఒప్పుకోవడం నుంచి అన్ని పనులు చక చక జరిగి చరణ్ పెళ్లి పూజారి గారి అమ్మాయి రమ్య తో జరగడం, హైదరాబాద్ లో కాపురం పెట్టడం జరిగిపోయాయి. మధు అమ్మాణి కూడా కొడుకు కోడలితో పాటు హైదరాబాద్ వెళ్లిపోయారు.


మధు తాతగారు అయ్యారు. మనవడికి ఏడాది పుట్టినరోజు కూడా వచ్చింది. ఇల్లంతా పుట్టినరోజు హడావుడి కనిపిస్తోంది. గెస్ట్స్ వెళ్ళిపోయిన తరువాత చరణ్ తల్లిదండ్రులు వున్న గదిలోకి వచ్చి “నాన్నా, మీ సలహా కావాలి” అన్నాడు. 


మంచం మీద లేచి కూర్చొని “ఏమైంది చరణ్? ఎందుకు అలా వున్నావు” అన్నాడు మధు. 


“మా ఆఫీస్ వాళ్ళు నన్ను అమెరికా రెండు సంవత్సరాల కోసం వెళ్లమంటున్నారు, మీ కోడలు కూడా మా ఆఫీసులోనే కాబట్టి, వాళ్ళు తనని కూడా పంపటానికి ఒప్పుకున్నారు, నాకు మిమ్మల్ని ఈ వయసులో వదిలి పరాయి దేశం వెళ్ళడం యిష్టం లేదు” అన్నాడు చరణ్.


“మీ ఆవిడ ఏమంటోంది?” అని అడిగాడు కొడుకుని. 


“తను కూడా ఏదీ తేల్చుకోలేకపోతోంది, ఈ వారం లో ఏ విషయం చెప్పాలి ఆఫీసు లో” అన్నాడు. 


“చూడు.. మీ పెద్దనాన్న పిల్లలు యిద్దరు అమెరికాలోనే వున్నారు, వాళ్ళు విశాఖపట్నం లో వృద్దాశ్రమం లో వుంటున్నారు. మొన్న మా అన్నయ్య అన్నాడు అక్కడే చాలా బాగుంది అని. మీరు కూడా వచ్చేసేయండి పిల్లల భవిష్యత్ కి మనం అడ్డంగా ఉండకూడదు అన్నాడు. నేను చెప్పాను నాకు ఆశ్రమం లో ఉండాలిసిన అవసరం లేదు నా కొడుకుకి ఇండియా నే యిష్టం వాడు అమెరికా వెళ్తాను అని అనడు అన్నాను. 


ఈ మాటలు జరిగి వారం కాలేదు, యిప్పుడు మీ ఆఫీస్ వాళ్ళు మీ ఇద్దరిని అమెరికా వెళ్ళమనటం విధిలీల గా అనిపిస్తోంది” అన్నాడు.


“అందుకే నాన్న.. నేను రేపే ఆఫీస్ వాళ్ళకి చెప్పేస్తాను, మేము వెళ్లలేము అని, అవసరం అయితే వేరే ఉద్యోగం చేసుకుంటాము” అన్నాడు. 


“చూడండి.. మనం జీవితం చివరి భాగం కి వచ్చేసాము, మన కోసం పిల్లాడి భవిష్యత్ పాడు చేస్తామా చెప్పండి. వాడి అదృష్టం బాగుండి చిన్న వయసులోనే అమెరికా లో ఉద్యోగం వచ్చింది అంటే మనం సంతోషించాలి” అంది భార్య అమ్మాణీ.


“నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. రేపో మాపో పోయే మన కోసం వాడు మంచి అవకాశం వదులుకోకూడదు” అన్నాడు మధు.


“మేము వెళ్ళిపోతే మీరు యిక్కడ ఒంటరిగా ఎలా వుంటారు నాన్న, నేను అమెరికా వెళ్లినా మీ గురించే ఆలోచన ఉంటుంది” అన్న కొడుకు భుజం మీద చెయ్యి వేసి “ఒంటరి ఎందుకు అవుతాము రా, మమ్మల్ని యిక్కడ ఏదైనా మంచి వృద్దాశ్రమంలో చేరిపించు, మీరు ఎలాగో రెండు సంవత్సరాల తరువాత వచ్చేస్తారు కదా, ఈ అవకాశం పాడు చేసుకోకుండా అమెరికా వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకుంటే మంచిదేగా” అని ఒప్పించాడు.


పిల్లలకు ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ చెప్పి విచారంగా ఇంటికి చేరారు మధు అమ్మాణీ దంపతులు. “నెలాఖరువరకు ఈ యింట్లో ఉండచ్చు, ఈలోపుగా పూర్తి వెజిటేరియన్ వృద్దాశ్రమం వుంటే వెతికి బాగుంటే అందులో వుందాము. ఈ ముచ్చట కూడా తీరుతుంది, రెండేళ్లు ఎంత సేపులో గడుస్తాయి” అన్నాడు భార్యకి ధైర్యంచెప్తో.


అన్నివిధాలా మధు కి నచ్చింది సత్యా వృద్దాశ్రమం. ఉదయం నుంచి రాత్రి వరకు భోజన సౌకర్యంతో పాటు డాక్టర్ సౌకర్యం కూడా ఉండటం తో డబ్బు కట్టేసి చేరిపోయారు. కొంతమంది వంటరి వాళ్ళు, చాలా మంది వృద్ధ దంపతులు తో వుంది ఆశ్రమం. కొద్ది రోజులకి ఒకరితో ఒకరికి పరిచయం పెరిగి యిక్కడ బాగానే వుంది కాలక్షేపం అనుకున్నాడు. 


వంటల మీద యిష్టం ఉండటం తో వంటసాలా కి ఇంచార్జి గా వుంటాను అని ఆశ్రమం యాజమాన్యం ని అడిగి ఆ పనిలో పడిపోయాడు మధు. అమ్మాణీ తన వయసు వాళ్ళకి సాయంత్రం పురాణం చెప్తో కాలం గడుపుతోంది. కొద్ది నెలలోనే మధు దంపతులు అక్కడ వున్న వాళ్ళతో విడదీయలేని బంధం ఏర్పడింది.


ఆరోజు ఆదివారం. తెల్లవారి ఏడుగంటల వేళ మంగళవాయుధ్యాల చప్పుడు విని ఒక వృద్దురాలు పక్కన వున్న ఆవిడతో “ఏమిటండి ఈ వృద్దాశ్రమంలో సన్నాయిమేళం?” అని అడిగింది. 


“అయ్యో మీకు తెలియదా.. అమెరికా నుంచి మధు అమ్మాణీ గారి కొడుకు కోడలు తల్లిదండ్రులని విడిచి వుండలేక ఇండియా వచ్చేసి తల్లిదండ్రులని తమతో ఇంటికి తీసుకుని వెళ్లిపోతున్నారు” అంది.


“మనకి కూడా అటువంటి రోజు వస్తుందా” అంటున్న ఆ పండు వృద్ధురాలు కి ఏమి చెప్పాలి.? యిది ఒక్కరి సమస్య కాదు ఎంతోమందిది.


తల్లిదండ్రుల చివరి మజిలి వరకు కన్నందుకు వదిలేయకుండా చూసుకోవటం సంతానం బాధ్యత. 

సంపాదన కి అంతే ముంది.


 శుభం 

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree


ree












Comments


bottom of page