top of page

దర్శనం

#GSSKalyani, #GSSకళ్యాణి, #Darsanam, #దర్శనం, #Devotional, #TeluguBhakthiKathalu

Darsanam - New Telugu Story Written By - G. S. S. Kalyani

Published In manatelugukathalu.com On 17/05/2025

దర్శనం - తెలుగు కథ

రచన: G. S. S. కళ్యాణి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



అప్పుడప్పుడే తెల్లవారుతోంది. టీవీలో గోలోకనాథస్వామి భగవద్గీత గురించి ప్రసంగం చెప్తున్నారు. ముందుగదిలో ఉన్న సోఫాలో కూర్చుని, వేడి వేడి కాఫీని తాగుతూ ఆ ప్రవచనం వింటోంది సావిత్రి. 

ఇటు కాఫీ రుచినీ, అటు గోలోకనాథస్వామి మాటలనూ ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ తన్మయత్వంలోపడి సమయాన్నే మర్చిపోయిన సావిత్రి, "నాకివాళ ఆఫీసులో మీటింగ్ ఉంది. త్వరగా వెళ్లాలి సావిత్రీ!", అన్న ఆమె భర్త రాఘవ మాటలకు ఉలిక్కిపడి ఇహలోకానికి వచ్చింది. 


"అదిగో! మీకు టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్ సిద్ధంగా ఉంచాను. మీకూ, పిల్లలకీ లంచ్ తయారవుతోంది. మరో అరగంటలో వంట పూర్తవుతుంది", అంటూ మిగతా కాఫీని ఊదుకుంటూ నాలుగు గుటకల్లో హడావుడిగా గొంతులో పోసేసుకుని, వంటింట్లోకి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది సావిత్రి. 


మధ్యాహ్నం ఇంటిపనులకు కాస్త విరామం ఇచ్చి సావిత్రి నడుంవాల్చబోయింది. సరిగ్గా అదే సమయానికి సావిత్రి స్నేహితురాలు కళ, సావిత్రిని చూసిపోదామని వచ్చింది. స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా గోలోకనాథస్వామివారి ప్రస్తావన వచ్చింది. 


"నీకోవిషయం తెలుసా కళా?! గోలోకనాథస్వామివారి ప్రవచనం వింటూ నేను వేరే లోకానికి వెళ్ళిపోతానంతే! అంత అద్భుతంగా చెప్తారాయన! నాలాంటి సామాన్యులకు కూడా అంతటి భక్తి భావన కలిగిస్తున్నారంటే ఆయన నిజంగా మహనీయులు!", కళతో అంది సావిత్రి. 


"ఆయన గొప్పతనం గురించి నాకు తెలియకపోవటమేమిటి సావిత్రీ? నేను ఎప్పటినుంచో గోలోకనాథస్వామివారి భక్తురాలిని! నీకు తెలియదా? నేను ఆయన వెంట తీర్థయాత్రలు కూడా చేశాను. ఆయన చేత్తో ప్రసాదం అందుకోగలిగాను కూడా", కొద్దిపాటి గర్వంతో చెప్పింది కళ.


"అవునా?? నువ్వు చాలా అదృష్టవంతురాలివి కళా! నాక్కూడా అలాంటి అవకాశం వస్తే బాగుండు! ఆయన్ని ఒక్కసారి దర్శనం చేసుకోవాలని ఉంది", అంది సావిత్రి.


"అది అంత సులువైన పనేం కాదు. మా గురువుగారు అందరినీ తన దగ్గరకు రానివ్వరు. ఎవరో ముఖ్యమైనవాళ్ళు మాత్రమే ఆయనకు అతిదగ్గరగా వెళ్ళి, ఆయన చేత్తో ఇచ్చే ప్రసాదం తీసుకోగలుగుతారు. ఆయనకు బోలెడు మహిమలు కూడా ఉన్నాయని భక్తుల విశ్వాసం!", అంది కళ.


"అయితే నేను ఆయన్ని టీవీలో చూసుకోవాల్సిందేనా?", నిరాశగా అంది సావిత్రి.


"అబ్బ! అంత దిగులు పడకులేవే! నీకొక మార్గం చెప్తా. ఆయన ఊరూరా తిరుగుతూ భగవద్గీత ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. వచ్చేనెల అక్కడినుంచీ రాగానే కొత్త యాత్ర మొదలుపెడతారట. ఆయనతోపాటూ భక్తులు కూడా యాత్రలో పాల్గొనచ్చు. యాత్ర జరుగుతున్న రోజుల్లో భగవద్గీతలో ఒక అధ్యాయం మొత్తం కంఠస్థం చేసినవారికి ప్రతిరోజూ పరీక్ష పెడతారట. మనం ఎంచుకున్న భగవద్గీత అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నీ తప్పులు లేకుండా అప్పజెప్పగలిగితే ఆయనే స్వయంగా తయారుచేసిన ప్రసాదం మనకు ఇస్తారట. నేనైతే ఈసారి జరగబోయే యాత్రకు వెడుతున్నా. నువ్వు కూడా నాతో రావచ్చు. నీ ఇష్టం!", అంది కళ.


"ఎంత మంచి మాట చెప్పావు కళా! నేను కూడా తప్పకుండా వస్తా", అంది సావిత్రి. 

కొన్ని వారాల తర్వాత గోలోకనాథస్వామి యాత్ర ప్రారంభించనున్నారన్న సమాచారం సావిత్రికిచ్చింది కళ. 


విషయం తెలుసుకున్న రాఘవ, "నువ్వు అలా యాత్రకు వెళ్ళిపోతే ఇల్లెలా నడుస్తుంది సావిత్రీ? మరోసారి ఆలోచించు", అన్నాడు. 


"మన ఇంట్లో ప్రతిరోజూ అందరికన్నా ఎక్కువ పనులు చేసేది నేనే. నాకంటూ ఒక ఇష్టం, నాకంటూ కొంత సమయం ఉండాలని నేను ఎప్పుడూ కలలుకంటూ ఉంటాను. నా కలను నిజం చేసుకునే అవకాశం వచ్చింది. నేనేమీ విహారయాత్రలకో సరదాకోసమో వెళ్ళట్లేదు కదా! గురువుగారి దర్శనం కోసం వెడుతున్నాను. నాతోపాటూ మీకూ, పిల్లలకూ మంచి జరగాలని నా ప్రయత్నం. దయచేసి అడ్డు చెప్పకండి", అంది సావిత్రి.


సావిత్రి ఎప్పుడూ తనతో అలా ఎదిరిస్తున్నట్లుగా మాట్లాడి ఎరగడు రాఘవ. ఇక యాత్ర విషయంలో సావిత్రి నిర్ణయం మారదని గ్రహించిన రాఘవ, గొడవపడటం ఇష్టంలేక, సావిత్రి కోరిక మేరకు గోలోకనాథస్వామి ఆశ్రమంలో ఆమెను దింపి ఇంటికి వచ్చాడు. పిల్లలు ముందు కొంచెం పేచీలు పెట్టినా రాఘవ సద్ది చెప్పడంతో ఊరుకున్నారు.


యాత్ర ప్రారంభం అయ్యింది. కళ చెప్పినట్లుగానే యాత్రలో పాల్గొనడానికి జనం తండోపతండాలుగా వివిధ ప్రదేశాలనుంచీ వచ్చేశారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. అందరి ధ్యేయం ఒక్కటే! గురువుగారి చేతులమీదుగా ఆయన వండిన ప్రసాదం స్వీకరించాలని. ఆ జనం మధ్యలో కూర్చున్న సావిత్రికి గురువుగారి దర్శనం దుర్లభమని అనిపించింది. 


అదే విషయం కళతో అంటే, "ఇది గురువుగారు మనకు పెట్టే పరీక్ష! నేను చెప్పినట్లు భగవద్గీతలో ఎదైనా ఒక అధ్యాయం కంఠస్థం చేసి అక్కడ ఏర్పాటు చేసిన మైకులో కళ్ళు మూసుకుని తడబడకుండా చెప్పెయ్. ఆయన పూజలో ఉన్నా భక్తులు చెప్పే శ్లోకాలన్నీ జాగ్రత్తగా వింటారట. పూజ పూర్తి కాగానే ఆరోజు మైకులో భగవద్గీత శ్లోకాలు చెప్పిన వారిలో ఇద్దరిని తన వద్దకు పిలిచి ప్రసాదం పెడతారట", అంటూ సావిత్రిని ప్రోత్సహించింది కళ.


కళ చెప్పిన మాటలను నమ్మిన సావిత్రి భగవద్గీత పుస్తకం తీసుకుని పట్టుబట్టి మొదటి అధ్యాయం పూర్తిగా కంఠస్థం చేసింది. కళ కూడా సావిత్రితోపాటూ మరొక అధ్యాయం కంఠస్థం చేసింది. 

ఒకరోజు, గురువుగారి పూజా కార్యక్రమం జరుగుతూ ఉండగా కళ, సావిత్రిలిద్దరూ తమ తమ అధ్యాయాలను మైకులో శ్రావ్యంగా పాడి వినిపించారు. వారితోపాటూ మరికొందరు కూడా భగవద్గీత శ్లోకాలను పఠించి మైకులో వినిపించారు. గోలోకనాథస్వామి పూజ పూర్తయ్యాక ఇద్దరు భక్తుల్ని పిలిచారు. వారిలో కళ, సావిత్రి - ఇద్దరూ లేరు!


"మళ్ళీ ప్రయత్నిద్దాం!", అంది కళ. సరేనంది సావిత్రి.


అలా గోలోకనాథస్వామి వెంట ఊరూరా తిరుగుతూ, ఆయన అనుగ్రహాన్ని పొందటంకోసం భగవద్గీతలో అధ్యాయం తర్వాత అధ్యాయం నేర్చుకుంటున్నారు కళ, సావిత్రిలు.

ఇలా ఉండగా ఒకనాడు రాఘవ సావిత్రికి ఫోన్ చేసి, "సావిత్రీ! నువ్వు యాత్రకు వెళ్ళి చాలా రోజులైంది. ఇంటిపనులూ, ఆఫీసుపనులూ పిల్లల బాధ్యతతోసహా అన్నీ ఒక్కడినే చూసుకోవడం కష్టంగా ఉంది! నువ్వు ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది!", అన్నాడు.


"గురువుగారి దర్శనం ఇంకా కాలేదు. ఇంకొక్క వారం రోజులు ఓపిక పట్టండి. వచ్చేస్తా!", అంది సావిత్రి.


మరుసటి వారం భగవద్గీతలోని మరొక అధ్యాయం కంఠస్థంచేశారు కళ, సావిత్రిలు. ఈసారి గోలోకనాథస్వామి కళను పిలిచి, ఆమెను ఆప్యాయంగా పలకరించి ప్రసాదం ఇచ్చారు. తనను పిలవకపోయేసరికి సావిత్రి మనసు విలవిలలాడిపోయింది.


"నిరాశ చెందకు సావిత్రీ! ప్రయత్నం ఆపకు. గురువుగారు నిన్ను కూడా ఏదో ఒక రోజు పిలుస్తారు! నన్ను నమ్ము", అంది కళ.


'నేను కూడా గురువుగారి కృపను ఎలాగైనా పొందుతా!', అని అనుకుంటూ భగవద్గీతలో మరొక అధ్యాయం పట్టుదలతో కంఠస్థం చేసింది సావిత్రి.


రోజులు గడుస్తున్నాయి కానీ గోలోకనాథస్వామి సావిత్రిని మాత్రం పిలవడంలేదు. నిరాశానిస్పృహలు సావిత్రి మనసును ఆవహించాయి.


అంతలో రాఘవ సావిత్రికి ఫోన్ చేసి, "సావిత్రీ! నువ్వెక్కడున్నా వెంటనే బయలుదేరి ఇంటికి రావాలి! మన చిన్నోడు చింటూ నీమీద బెంగపడ్డాడు. వాడికి నూటనాలుగు జ్వరం!", అన్నాడు.

యాత్ర నిర్వాహకులకు చెప్పి సావిత్రి బస్సులో ఇంటికి బయలుదేరింది. తిరుగు ప్రయాణంలో రకరకాల ఆలోచనలు సావిత్రి మనసును చుట్టుముట్టాయి.


'పైకి దైవాంశసంభూతులల్లే కనపడినా గోలోకనాథస్వామివారికి కొందరు భక్తులంటేనే ఇష్టం. అందుకే నేను ఎంత కష్టపడినా నావంక ఆయన కన్నెత్తైనా చూడలేదు! కళ ఫ్రీలాన్స్ ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించి, అందులో కొంత ఆశ్రమానికిస్తోంది. అందుకనే గురువుగారి కరుణను అంత తేలిగ్గా పొందగలిగిందనుకుంటా! నాకు ఉద్యోగమా? సద్యోగమా?! పొద్దుటినుంచీ రాత్రివరకూ ఇంటిపని చెయ్యడమేతప్ప పైసా సంపాదన లేదు. అయినా, గురుదర్శనం పుణ్యాత్ములకు దక్కుతుంది కానీ నావంటి పాపాత్ములకు కాదు!', అనుకుంటూ మరింత కృంగిపోయింది సావిత్రి.


సావిత్రి దిగాల్సిన ఊరు రావడంతో తన సంచీ తీసుకుని, బస్సు దిగి దిగులుగా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా నడుస్తూ తమ ఇల్లు ఉన్న సందులోకి తిరిగింది సావిత్రి. అయితే ఆ వీధిలో తమ ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటం గమనించింది సావిత్రి. సావిత్రి గుండె ఒక్క క్షణం ఆగింది. ఏం జరిగి ఉంటుందోనని ఆలోచించిన వెంటనే భయంతో సావిత్రి వెన్నులో వణుకు పుట్టింది! 


"నా బిడ్డ..! నా బిడ్డ..! నా బిడ్డకేమైంది?", అంటూ పరుగు పరుగున ఇంటి సమీపానికి వచ్చిన సావిత్రికి అక్కడున్న జనం చేతిలో పళ్ళూ, పువ్వులూ కనిపించాయి. 


అందరూ సావిత్రివైపు తిరిగి ఆమెను చిరునవ్వుతో పలకరించారు. ప్రమాదమేమీ జరగలేదని గ్రహించిన సావిత్రి మనసు కాస్త కుదుటపడింది. కానీ వారంతా తమ ఇంటి బయట ఎందుకున్నారో అర్థంకాలేదు సావిత్రికి. జనం మధ్యలోంచీ దారి చేసుకుంటూ ఇంట్లోకి వచ్చిన సావిత్రి అక్కడి దృశ్యాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలతో నిశ్చేష్టురాలైపోయింది. తమ ముందుగదిలో ఉన్న సోఫాలోకూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నారు గోలోకనాథస్వామి!


అంతలో, "అమ్మా..!", అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సావిత్రి కాళ్ళను వాటేసుకున్నాడు ఆరేళ్ళ చింటూ. 


"రా సావిత్రీ! గురువుగారు నీకోసమే వచ్చారు. ఆయన మన చింటూకి ప్రసాదం తినిపించగానే వాడి జ్వరం తగ్గిపోయింది!", అన్నాడు రాఘవ ఆనందంగా. 


సావిత్రి గోలోకనాథస్వామికి నమస్కారం చేసింది. సావిత్రి మనసులో ఎడతెరపిలేకుండా వస్తున్న సందేహాలకు గోలోకనాథస్వామి సమాధానం ఇస్తూ, "అమ్మా సావిత్రీ! నువ్వు గత కొన్ని వారాలుగా నాతో యాత్ర చేస్తున్నావు. నా దర్శనం కోసం తపిస్తున్నావు. భగవద్గీతలో అధ్యాయాలు నోటికి నేర్చుకున్నావు. చాలా సంతోషం! అయితే ఆ భగవద్గీత మనకు అందిస్తున్న ఒక అమూల్యమైన సందేశం ఏమిటో తెలుసా తల్లీ? మన ధర్మాన్ని మనం ఎల్లవేళలా ఆచరించాలి! నువ్వు బాగా చదువుకున్నప్పటికీ కళలా ఉద్యోగం చెయ్యాలని అనుకోలేదు. పెళ్ళి చేసుకుని గృహిణిగా సనాతనధర్మాన్ని ఆచరిస్తూ జీవితం గడపదల్చుకున్నావు. వివాహానికి ముందు నువ్వు మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయమది. ఒక ఇల్లాలి ధర్మం తన భర్తకూ, పిల్లలకూ సమయానికి కావలసినవి అమర్చి పెడుతూ, ఆ పనులన్నీ భగవద్సేవగా భావించడమే కదా?


అటువంటివారు గురుకృపను పొందాలంటే అన్నీ వదిలి గురువుకోసం వెదకుతూ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు తల్లీ! నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉంటే ఆ గురువే నీ దగ్గరకు వచ్చిమరీ నువ్వు కోరుకున్న విధంగా నీకు దర్శనం ఇస్తాడు! నిన్ను ముక్తి మార్గంవైపు నడిపిస్తాడు!", అన్నారు. 


ఆ మాటలు విన్న సావిత్రి సత్యాన్ని గ్రహించింది. 


తను చేసిన తప్పు తెలుసుకుని, "స్వామీ! మీ శక్తిని శంకించి ఘోర అపరాధం చేశాను. నన్ను క్షమించండి గురుదేవా! నేను ఎక్కడో మనసులో అనుకున్న విషయాలన్నీ తెలుసుకోగలిగిన సర్వజ్ఞులు మీరు! అసలు, కొద్దిసేపటి క్రితంవరకూ వేరే ఊళ్ళో వేదికమీద ప్రసంగిస్తున్న మీరు, నాకన్నా ముందు మా ఇంటికి రావడమేమిటీ? నా కోసం వేచి ఉండటమేమిటీ?? మీరు చూపిస్తున్న మహిమనూ, కరుణనూ అర్థం చేసుకుంటూ ఉంటే నా మనసు పులకించిపోతోంది! దివ్యానుభూతితో ఒళ్ళు గగుర్పొడుస్తోంది!! స్వామీ! ఇక నన్ను ఉత్తమ మార్గంలో మీరే నడిపించాలి!", అంటూ గోలోకనాథస్వామి పాదాలపై పడింది సావిత్రి.


"నీ తప్పు నువ్వు తెలుసుకుని, దాన్ని సరిదిద్దుకోవడమే ప్రగతికి తొలిమెట్టు తల్లీ! భగవద్కృప నీకు కలుగుగాక!", అంటూ సావిత్రి చేతిలో తను తయారుచేసిన ప్రసాదాన్ని పెట్టాడు గోలోకనాథస్వామి.


"ధన్యురాలిని గురుదేవా!", అంటూ ప్రసాదం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని, భక్తిపారవశ్యంలో మునిగిపోయింది సావిత్రి! 


*****


G. S. S. కళ్యాణి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం'  కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను. 





תגובה אחת


@GSSKalyani05

• 3 hours ago

కథను స్పష్టంగా, భావయుక్తంగా చదివి వినిపించిన పద్మావతి గారికి అనేక ధన్యవాదాలు!

לייק
bottom of page