నంది వర్ధనం
- Sathyanarayana Murthy M R V
- May 18
- 6 min read
#నందివర్ధనం, #NandiVardhanam, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #కొసమెరుపు

Nandi Vardhanam - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy
Published In manatelugukathalu.com on 18/05/2025
నంది వర్ధనం - తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“ఏమండీ ఓ పాల పాకెట్ తీస్కురండి” చెప్పింది వనజమ్మ.
“మేకు ఉంటే చెప్పు” అన్నాడు రాఘవరావు.
“లేదండి. ఇందాకట నుండీ కనిపించడం లేదు”
జవాబిచ్చింది వనజమ్మ.
రాఘవరావు “ఊ సరేలే” అని షర్టు వేసుకుని బయటకు వెళ్ళాడు పాల పేకెట్ తేవడానికి.
పక్క వాటాలోంచి స్వాతి “ఒరేయ్ అన్నయ్యా, నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేయరా?” అని బతిమాలుతోంది.
“మేకుని పిలువు. తను తీసుకువెళ్తాడు” తాపీగా చెప్పాడు కిరణ్.
“చాలా సేపటినుండీ కనిపించడం లేదు. నువ్వు త్వరగా రారా.. నాకు టైం అవుతోంది” మళ్ళీ అన్నయ్యని బతిమాలింది స్వాతి.
“అబ్బబ్బ. నన్ను ప్రశాంతంగా ఫోన్ చూసుకోనివ్వవు కదా” అని బయటకు వచ్చి, బైకు తీసి స్వాతిని తీసుకుని కాలేజీ వైపు వెళ్ళాడు కిరణ్.
వీళ్ళ ఇంటి పక్కనే ఉన్న డాబాలో ఉంటున్నాడు రిటైర్డ్ మాస్టారు కేశవరావు. నాలుగు విశాలమైన గదులతో, ఇంటి ముందు, వెనకా వరండాలతో చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. పిల్లలు ఇద్దరూ హైదరాబాద్ లో ఉంటున్నారు. వరండాలో ఎప్పుడూ నాలుగు కుర్చీలు వేసి వుంటాయి. మాష్టారి మిత్రులు వచ్చి కబుర్లు చెప్పి వెళ్తూ ఉంటారు. మాస్టారు కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నారు. గేటు తీసుకుని భూషణరావు లోపలకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
‘వాకింగ్ అయిపోయిందా?” అడిగాడు కేశవరావు.
“ఆ.. అయ్యింది” అని నిట్టూరుస్తూ టీపాయ్ మీద ఉన్న బాటిల్ తీసుకుని మంచినీళ్ళు తాగాడు భూషణరావు.
కేశవరావు “లక్ష్మీ, ఓ కాఫీ తీసుకురా భూషణం వచ్చాడు” అని పిలిచారు.
“అలాగే” అని జవాబిచ్చింది వెంకటలక్ష్మి.
భూషణరావు రోజూ వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు, కేశవరావు ఇంటి దగ్గర ఆగి కాఫీ తాగి మరీ వెళ్తాడు. పక్కవీధిలోనే అతని ఇల్లు. అయినా ఇంటికి వెళ్లి కాఫీ తాగడు. ఇక్కడే కాఫీ తాగి కాసేపు కబుర్లు చెప్పి, అప్పుడు ఇంటికి వెళ్తాడు. ఇద్దరూ ఒకే స్కూల్ లో పనిచేసి రిటైర్ అయినా, ఇద్దరి మనస్తత్వాలు వేరు.
‘ఒకరికి పెట్టాలి’ అనే గుణం కేశవరావుది. ‘ఒకరి నుండి ఏదైనా సరే తీసుకోవాలి’ అనే స్వభావం భూషణరావుది.
కాసేపటికి వెంకటలక్ష్మి కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయింది. కాఫీ తాగుతూ, ఎదురింటి మేడ కేసి చూసి “మేకు ఇంకా బయటకు రాలేదులా ఉంది” అన్నాడు భూషణరావు.
“ఏం అలా, ఎలా చెపుతున్నావు?” అడిగాడు కేశవరావు.
“దండెం మీద వాళ్ళ ఆవిడ బట్టలు, పిల్లాడి బట్టలు ఆరవేసి లేవుగా. అవి అన్నీ మన వాడి డ్యూటీయే గా” అని వంకరగా నవ్వాడు భూషణరావు. అది విని కేశవరావు చాలా బాధపడ్డాడు.
“చూడు భూషణం. ఒకరిని వేళాకోళం చెయడం భావ్యం కాదు. అతనికి ఉద్యోగం లేదు. అతని భార్య కాన్వెంట్లో పనిచేస్తోంది. ఆ అమ్మాయి పెందరాళే వెళ్ళాలి. మన గవర్నమెంట్ స్కూల్ లా వారికి సరిఅయిన వేళలు ఉండవు. కాన్వెంట్ ప్రారంభానికి ముందుగా వెళ్ళాలి, పిల్లలు అందరూ వెళ్ళాకా అప్పుడు ఇంటికి బయల్దేరాలి. తను వంట చేసుకుని, తనకీ కొడుక్కి బాక్స్ లు సర్దుకుని ఆమె బయల్దేరుతుంది. అందుకని భార్యకి సాయం చేస్తున్నాడు. ఇందులో తప్పేముంది?” అడిగాడు కేశవరావు.
“ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడుగా. ఆడపని, మగపని రెండూ చేయాలి. లేకపోతే తిండి పెట్టదుగా ఆవిడ” కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి గట్టిగా నవ్వాడు భూషణరావు. తర్వాత కాసేపు తమ మిత్రుల గురింఛి మాట్లాడి వెళ్ళిపోయాడు భూషణరావు. కొద్దిసేపటికి వెంకటలక్ష్మి లోపలనుండి వచ్చి మాస్టారి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది.
“ఏమంటాడు మీ మిత్రుడు. ఆ మేడ మీద కుర్రాడి గురించేనా మాట్లాడుతున్నాడు” చిరాగ్గా అడిగింది భర్తని. మౌనంగా తలూపాడు కేశవరావు.
“వాడికి ఎన్నో సార్లు చెప్పాను, మేడమీద కుర్రాడికి ఒక పేరుంటుంది. దానితో పిలవాలి. లేదా మేడమీద కుర్రాడు అని పిలువు. ఊహూ.. వినడుగా. ‘మేకు’ అని పిలుస్తాడు, వ్యంగ్యంగా. వీడి జబ్బు మన పక్క ఇంటివాళ్లకి కూడా వచ్చింది. వాళ్ళూ ‘మేకు’ అనే అంటూఉంటారు. కానీ అతని ఎదురుగా, ‘బాబూ’ ‘నాయనా’ అని ఎంతో ప్రేమ కురిపిస్తూ పిలిచి, తమకి కావాల్సిన పనులు చేయించుకుంటారు. అసలు ఒక వ్యక్తిని హేళన చేయాలన్న ఆలోచన ఎంత తప్పో వాళ్ళు గ్రహించడం లేదు” బాధగా అన్నాడు కేశవరావు.
“ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. తను ఉద్యోగం చేస్తున్నానని, కుటుంబాన్ని పోషిస్తున్నానని ఏనాడూ గర్వం ప్రదర్సించదు. భర్తని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. అతను కూడా అంతే. రెండు కిలోమీటర్లు దూరం వున్న కాన్వెంట్ కి, భార్యని కొడుకుని స్కూటీ మీద తీసుకువెళ్ళి దింపి వస్తాడు. ఆ తర్వాత బజారుకు వెళ్ళవలిసివస్తే, సైకిల్ మీద వెళతాడు. ఇరుగు, పొరుగు ఎవరు సాయం అడిగినా చేస్తాడు.
విసుగు అన్నది అతని మోహంలో నేను ఎప్పుడూ చూడలేదు. అతనికి కూడా ఏదైనా చిన్న ఉద్యోగం దొరికితే బాగుండును. వాళ్ళ సంసారం కుదుటపడుతుంది” సానుభూతిగా అంది వెంకటలక్ష్మి.
ఆమె మాటలకి తల పంకించాడు కేశవరావు.
“నేను అతన్ని ఒకసారి అడిగాను, ఏమి చదువుకున్నావని? ఇంటర్మీడియట్ వరకు మాత్రమె చదువుకున్నానని, తండ్రి ఆరోగ్యం బాగుండక పోవడంతో, చదువుకి స్వస్తి చెప్పి తండ్రిని చూసుకున్నానని చెప్పాడు. తండ్రి చనిపోయాకా కొంత కాలం ఒక కిరాణా షాపులో పనిచేశానని, ఎక్కువసేపు నిలబడడం, అటూ ఇటూ తిరగడం వలన అలిసిపోయానని చెప్పాడు. డాక్టర్ కి చూపించుకుంటే, ఎక్కువ శ్రమ లేకుండా
ఒకచోట కుదురుగా ఉండే ఉద్యోగం చూసుకోమని చెప్పారని అన్నాడు. నువ్వు కూడా చూసావుగా, అతను దారుడ్యం కలిగిన మనిషి కాదు, బక్కగా ఉంటాడు. లేకపోతే మన పుల్లారావు బట్టల కొట్టులో సేల్స్ మాన్ గా ఉద్యోగం వేయిద్దామని అనుకున్నాను. అందుకే పదిమంది చిన్న పిల్లల్ని అతని దగ్గరకు ట్యూషన్ కి పంపుతున్నాను” అన్నాడు కేశవరావు.
“మంచిపని చేసారు. అతనికంటూ కొంత సంపాదన ఉంటే, ఆ తృప్తి, అభిమానం వేరుగా ఉంటాయి. ప్రతి రూపాయికి భార్య ముందు చేయి చాపాలంటే, ఎవరికైనా సిగ్గుగా ఉంటుంది” అంది వెంకటలక్ష్మి.
“లక్ష్మీ, మనం ఒక్కళ్ళమే బాగుండాలని అనుకోకూడదు. మన చుట్టపక్కల వారు కూడా బాగుండాలని కోరుకోవాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. అందరూ సుఖంగా ఉంటారు” అన్నాడు కేశవరావు. భర్త వైపు మెచ్చుకోలుగా చూసింది వెంకటలక్ష్మి.
..
ఆరోజు ఉదయం మేడమీద కుర్రాడు, భార్యని స్కూటీ మీద కాన్వెంట్ కి దింపడానికి కిందకు వచ్చాడు. కేశవరావు గబా గబా నడుచుకుంటూ రోడ్ దాటి వారి దగ్గరకు వచ్చాడు.
“విష్ యు హ్యాపీ టీచర్స్ డే అమ్మా” అని ఒక కొత్త పెన్ ఆమెకి ఇచ్చాడు. ఆమె “థాంక్స్ అంకుల్ గారూ” అని ఆయనకీ నమస్కరించి స్కూటీ ఎక్కింది. మేడమీద కుర్రాడు చిన్నగా నవ్వి, భార్యని కొడుకుని తీసుకుని కాన్వెంట్ వైపు బయల్దేరాడు. కేశవరావు ఆనందంగా నవ్వుకుంటూ, రోడ్ దాటి తమ ఇంటికి వచ్చాడు. కుర్చీలో కూర్చుని ఎదురింటి వైపే చూడసాగాడు.
పేరుకి మేడ అయినా, పైన మూడు గదులే ఉన్నాయి. చాలా భాగం ఖాళీగా ఉంది. అక్కడ కొన్ని పూల కుండీలు పెట్టింది ఆమె. రోజూ సాయంకాలాలు శ్రద్ధగా వాటికి నీళ్ళు పోస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె భర్త పిల్లలకి ట్యూషన్ చెబుతూ ఉంటాడు. కేశవరావు ఆమె చేసే ప్రతీ పనీ పరిశీలిస్తూ ఉంటాడు. వెన్నెల రాత్రులలో భర్తా, కొడుకుతో కలిసి, ఆమె, ఆరుబయట, వెన్నెలలో భోజనాలు చేయడం రెండు మూడు సార్లు చూసాడు కేశవరావు. భార్యని తీసుకువచ్చి ఆ దృశ్యం చూపించాడు.
వెంకటలక్ష్మి ఒకటే మాట అంది. “డబ్బు ఉండడం గొప్ప కాదండి. మనకి ఉన్నదాంట్లోనే సుఖంగా బతకడమే ‘గొప్ప’. ఆ అమ్మాయి తన పరిసరాలలోనే స్వర్గాన్ని సృష్టించుకుని ఆనందంగా ఉంటోంది. నిజంగా ఆ అమ్మాయి చాలా గ్రేట్”.
ఆరోజు సాయంత్రం ఆ అమ్మాయి కొడుకుని తీసుకుని కేశవరావు ఇంటికి వచ్చింది. రెండు స్వీట్లు తీసి భార్యా భర్తలు ఇద్దరికీ ఇచ్చి, వారి పాదాలకి నమస్కరించింది.
“ఏమిటమ్మా విశేషం?” అడిగాడు కేశవరావు.
“ఉదయం మీరు నాకు శుభాకాంక్షలు చెప్పారు కదా అంకుల్. ఈరోజు మా కాన్వెంట్ వారు నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చి సన్మానం చేసారు” సంతోషంగా చెప్పింది ఆమె. వెంకటలక్ష్మి ఆమెని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని “నువ్వు ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అంది. కొద్దిసేపు మాట్లాడి ఆమె తన ఇంటికి వెళ్ళిపోయింది కొడుకుని తీసుకుని.
ఇది జరిగిన నెలరోజులకి కేశవరావు, భూషణరావు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు వారి ఇంటి వరండాలో కూర్చుని. ఎదురింటి దగ్గర నాలుగు మోటార్ సైకిళ్ళు ఆగాయి. నలుగురు వ్యక్తులు దిగి మేడమీడకు వెళ్ళారు. రెండు నిముషాలకు మరో నాలుగు మోటార్ సైకిళ్ళు ఆగాయి. మరో నలుగురు దిగి వారూ, మేడ మీదకి వెళ్ళారు. వారి చేతులలో వీడియో కెమెరాలు ఉన్నాయి.
కేశవరావు, భూషణరావు ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కేశవరావు ఇంటి పక్కన ఉన్న ఇంట్లో వారు కూడా బయటకు వచ్చి ‘ఏమి జరుగుతొందా?” అని ఆసక్తిగా చూస్తున్నారు. ఒక అరగంట గడిచింది. మేడమీదకు వెళ్ళినవారు కిందకు దిగి మోటార్ సైకిళ్ళు ఎక్కి, వెళ్లిపోతున్నారు. అందులో ఒక కుర్రవాడిని గుర్తు పట్టిన భూషణరావు “ఒరేయ్ కృష్ణా ఇలా రా ఒకసారి” అని పిలిచాడు.
మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళబోతున్న కృష్ణ, ఆగి రోడ్ దాటి కేశవరావు ఇంటికి వెళ్ళాడు. మాస్టర్లు ఇద్దరికీ నమస్కరించాడు. అతను వాళ్ళ స్కూల్ లోనే చదువుకున్నాడు. ప్రస్తుతం ఒక పత్రికకు విలేకరిగా పనిచేస్తున్నాడు.
“కృష్ణా, ఏమిటి విశేషం. మీరు అందరూ మేడ మీదకు వెళ్ళారు. ఆ టీచరమ్మకి ఏదైనా అవార్డు వచ్చిందా?” అడిగాడు భూషణరావు.
“ఆమెకి కాదండి. ఆయనకి అవార్డు వచ్చింది” నవ్వుతూ అన్నాడు కృష్ణ.
“అతనికా.. ?” కేశవరావు, భూషణరావు ఇద్దరూ ఒకేసారి అన్నారు.
“అవునండి. ఆయనకే. వర్ధన్ గారు మంచి ఆర్టిస్ట్. పర్యావరణం గురించి కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖనా పోటీలలో ఆయన చిత్రంకి మొదటి బహుమతి లక్షరూపాయలు వచ్చింది. పది రోజులలో ఢిల్లీ లో జరిగే సభలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఆయన బహుమతి అందుకుంటారు. ఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్ టికెట్లు కూడా గవర్నమేంట్ వారే ఇస్తున్నారు. గతంలో కూడా ఆయన కొన్ని అవార్డులు అందుకున్నారు. కానీ మాకు ఎప్పుడూ చెప్పలేదు. ఈ విషయం కూడా ఇంగ్లీష్ పేపర్లలో ముందుగా వచ్చింది. అది చూసి మేము వచ్చాము, ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి ” అన్నాడు కృష్ణ.
విషయం తెలుసుకోవడానికి అక్కడికి చేరిన పక్కింటి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఆ మాట విని.
రెండు నిముషాలు ఉండి, వెళ్ళిపోయాడు కృష్ణ. వరండాలో నిలబడి విషయం విన్న వెంకటలక్ష్మి, గబ గబా బయటకు వచ్చి రోడ్ దాటి ఎదురింటి మేడ మీదకు వెళ్ళింది వర్ధన్ ని అభినందించదానికి.
కేశవరావు మిత్రుడి కేసి చూసి చిన్నగా నవ్వాడు.
“చూసావా భూషణం ఏమి జరిగిందో? నాణానికి ఒక వైపే చూడకూడదు. రెండో వైపు ఏముందో తెలుసుకోవాలి అని అంటారు. నువ్వు ‘మేకు’ అని, ఆడంగి పనులు చేస్తాడని విమర్శించిన ఆ మేడ మీద కుర్రాడి వలన, మన ఊరి పేరు దేశం అంతా మారుమోగుతోంది. ఎవరిలో ఏ విద్య దాగి ఉందో, ఏ ప్రతిభ
నిగూఢమై ఉందొ ఎవరూ చెప్పలేరు. అందుకే మనం ఆచి, తూచి మాట్లాడాలి” అని అన్నాడు కేశవరావు.
భూషణరావు మారు మాట్లాడలేదు. కొద్దిసేపు ఉండి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
ఒక గంట పోయాకా టౌన్ లోని లయన్స్ క్లబ్ వారు, రోటరీ క్లబ్ వారు వచ్చి వర్ధన్ ని అభినందించారు. వారు చాలా సేపు అతనితో మాట్లాడి, ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళారు.
సత్యవర్ధన్, భార్య కొడుకుతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గారి నుండి బహుమతి, సత్కారం అందుకుని రావడం, సత్యవర్ధన్ చిత్రాలు అన్నీ లయన్స్, రోటరీ క్లబ్ వారు కలిసి పుస్తకంగా రంగులలో తీసుకురావడం స్పీడ్ గా జరిగిపోయాయి. ఆ పుస్తకం పేరు “నంది వర్ధనం”.
సత్యవర్ధన్ భార్య పేరు ‘నందిని’.
*******
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


@kathaveechika3572
•2 hours ago
🎉
మంచి కథ. మొదట సంబరాల రాంబాబుని ( సినిమా) గుర్తుకు తెచ్చింది. ముగింపు బాగుంది. నీతి వాక్యం సూటిగా వుంది.
@umadevi8931
• 4 hours ago
కథ చాలా చాలా బావుంది.ఎప్పుడో అచ్చు లో చదివినా.. ఇప్పుడు వింటుంటే మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాను
@mrvsmurthy311
•6 hours ago
చాలా బాగా చదివారు మేడం.. ధన్యవాదాలు..