top of page

అంతకు ఇంత ఇంతకు ఎంతో

#SudhavishwamAkondi, #AnthakuInthaInthakuEntho, #అంతకుఇంతఇంతకుఎంతో, #సుధావిశ్వంఆకొండి, #TeluguMoralStories, #నీతికథలు, #కొసమెరుపు


Anthaku Intha Inthaku Entho - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 19/05/2025 

అంతకు ఇంత ఇంతకు ఎంతోతెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


పూర్వం ఒక ఊళ్ళో రంగయ్య అనే చిన్న రైతు ఉండేవాడు. ఏదో తనకు పండిన పంటలో తను తినగా మిగిలినది పేదలకు దానం చేసేవాడు కొంత. 


వేసవికాలంలో చలివేంద్రం పెట్టి ఉచితంగా బాటసారులకు నీరు అందించేవాడు. అలాగే అన్నార్తులకు తనకు ఉన్నంతలో ఆహారం కూడా ఇచ్చేవాడు. కానీ తను వారి నుంచి ఏదీ ఆశించేవాడు కాదు. దానివల్ల కనీసం మనసులో కూడా పుణ్యం కోసం చేస్తున్నాను అనే భావన కూడా ఉండేది కాదు అతనిలో! తనకు ఉన్నంతలో అవసరమైన వారిని ఆదుకోవాలనే తాపత్రయం మాత్రమే ఉండేది. 


 కాలక్రమంలో అన్ని బాధ్యతలు తీర్చు కున్నాడు. వృద్ధాప్యం వచ్చింది. అప్పుడు కూడా క్రమం తప్పకుండా నలుగురికి సహాయం చేసేవాడు. చివరకు చివరి ఘడియలు వచ్చాయి. ఏ విధమైన కష్టం లేకుండా అనాయాసంగా మరణించాడు. 


 తను చేసిన ఈ దానధర్మాల వల్ల మరుజన్మలో ఒక రాజ్యానికి రాజుగా జన్మించాడు. ఏమీ ఆశించకుండా చేసిన ఆ పుణ్య ఫలితంగానే పూర్వజన్మ జ్ఞానం కూడా వచ్చింది ఈ రాజుకు. దానివల్ల ఈ జన్మలో కూడా ఎప్పుడూ ఇలా దానధర్మాలు చేయాలని అనుకున్నాడు.

 "ఆ జన్మలో చేసిన దాన ఫలితంగా రాజు జన్మ లభించింది. ఇప్పుడు కూడా మరింత ఎక్కువగా దానాలు చేస్తే ఇంకా ఎంత గొప్ప జన్మ వస్తుందో కదా!" అని అనుకునేవాడు. 


 తను రాజుగా పట్టాభిషిక్తుడు అయిన వెంటనే తను రోజూ దానం చేయాలి అని నియమం పెట్టుకున్నాడు. రాజ్య పరిపాలన, ప్రజల సంక్షేమం, తాను రాజుగా నిర్వహించ వలసిన బాధ్యతలు పక్కన పెట్టి, ప్రతి రోజూ రాజ్యంలో ఉన్నవాళ్ళను పిలిపించి దానం చేస్తూ ఉండేవాడు.


అంతేకాదు, దానం చేస్తూ ఇలా అనుకునేవాడు.

 "అంతకు ఇంత ఇంతకు ఎంతో" అని మనసులో అనుకోబోయి, పైకే అనేవాడు 


'రాజుకు ఏమిటో ఈ పిచ్చి! విపరీతంగా దానాలు చేయడం, చేస్తూ ఏదేదో మాట్లాడతాడు!' అని జనులు అనుకునే వారు. 

 

 ఈ రాజు రోజూ చేస్తున్న ఈ దానాల వల్ల రాజ్యంలో చాలామంది సోమరులు, తెలివితక్కువ దద్దమ్మలు అయ్యారు. 


అవసరంలో ఉన్నవారికి దానం చేస్తే, సత్ఫలితం ఉంటుంది కానీ అవసరం లేనివారికి కూడా దానం చేస్తే ఏమవుతుంది? అది దానం అవ్వదు! అపాత్రదానం అవుతుంది. ఉచితంగా లభించడం వలన జనాల్లో సోమరితనం వస్తుంది. స్వార్ధం పెరుగుతుంది. అదే జరిగింది ఆ రాజ్యంలో కూడా!


 ఒకరోజు అలాగే రాజుగారి కోటలో రోజూలానే దానధర్మాల కార్యక్రమం జరుగుతోంది నిర్విఘ్నంగా! 


 ప్రతి ఒక్కరికి దానం చేస్తూ, ప్రతిరోజూ లాగానే...

 " అంతకు ఇంత, ఇంతకు ఎంతో" అంటున్నాడు రాజు. అందరూ వచ్చి దానం తీసుకుని పోతున్నారు. 


 ఆరోజు ఒక సాధువు కూడా వచ్చి దానం కోసం చేతులు చాచాడు! రాజు యథాప్రకారం ఈ మాట అన్నాడు

 "అంతకు ఇంత, ఇంతకు ఎంతో..!"


 రాజు మాటలు విన్న ఆ సాధువు...

 "అంతకు ఇంత, ఇంతకు ఇంతే!" అన్నాడు


ఇంతవరకూ ఎవరూ ఏమీ అనలేదు. ఇచ్చిన దానం తీసుకుని రాజును మెచ్చుకుంటూ వెళుతున్నారు. 


 ఇప్పుడు ఈ సాధువు అన్నమాట విన్న రాజు అవాక్కయ్యాడు. 

ఆ సాధువును సాదరంగా అంతఃపురానికి ఆహ్వానించి, గౌరవ సత్కారాలు చేసి..

 " స్వామీ! నేను 'అంతకు ఇంత, ఇంతకు ఎంతో..!' అని అన్న వెంటనే మీరు ఇంతకు ఇంతేనని అన్నారు. మీరు సర్వజ్ఞులని తోచుచున్నది! ఇలా మీరు అనడానికి గల కారణం వివరించండి" అని వేడుకున్నాడు.


 అప్పుడు ఆ సాధువు మందహసం చేసి......

 "ఓ రాజా! నువ్వు పూర్వజన్మలో రైతుగా వున్నప్పుడు ఏమీ ఆశించకుండా, ఎటువంటి కోరికలు లేకుండా నీకున్నదాంట్లో దానధర్మాలు చేశావు! అందుకే నీకు ఈ రాజు జన్మ వచ్చింది. కానీ ఇప్పుడు నీకు పూర్వజన్మ జ్ఞానం ఉండడం చేత, ఆ దానం వల్ల ఈ జన్మ వచ్చింది కదా! ఇంకా చేస్తూ ఉంటే ఇంకేదో వస్తుందనే ఆశతో రోజూ దానం చేస్తున్నాను అని భావన చేస్తూ, రాజ్యపాలన విస్మరించి, అపాత్రదానాలు చేస్తూ, ప్రజలను సోమరులను చేస్తున్నావు. అందుకే నేను అలా అన్నాను. 


 రాజుగా నీ కర్తవ్యాన్ని విస్మరించి, ఇంకేదో లభించాలని తాపత్రయంతో దానాలు చేసినందువల్ల ఫలితం శూన్యం! ఏదో ఫలితం ఆశించి చేసే దానాల వల్ల పుణ్యం లభించదు. అంతేకాకుండా పాత్రనెరిగి దానం చేయాలి అంటే అవసరంలో ఉండి, అశక్తులుగా ఉన్నవారికి దానం చేస్తే ఆ దానఫలం ఉత్తమ గతులను కల్పిస్తుంది. అంతేగానీ ఇలా ఏదో ఆశిస్తూ చేస్తే ప్రయోజనం ఉండదు" అని వివరించాడు. 


విషయం తెలుసుకున్న రాజు తన కళ్ళు తెరిపించిన ఆ సాధువు కాళ్లపైన పడి క్షమాపణ కోరుకున్నాడు. 


 ఆ తరువాత రాజ్యపాలన బాధ్యతలు స్వీకరించి, ప్రజానురంజకంగా పరిపాలించి, దానధర్మాలు సక్రమంగా చేసి జన్మాoతరంలో ఉత్తమగతులు పొందాడు.


 దానం చేయడం చాలా గొప్పది కానీ అపాత్రదానం అస్సలు మంచిది కాదు. అలా చేస్తే అవి ఉచితాలు అవుతాయి.


శ్రీకృష్ణార్పణమస్తు

����������

సుధావిశ్వం




-సుధావిశ్వం





Comments


bottom of page