మానవ సంబంధాలు - కుటుంబ విలువలు
- Veluri Sarada

- 8 hours ago
- 4 min read
family emotional story Telugu, కుటుంబ విలువలు, emotional Telugu story, grandparents love story Telugu, family bonding Telugu

Manava Sambandhalu Kutumba Viluvalu - Telugu Inspirational Family Story | Mayukha
మానవ సంబంధాలు - కుటుంబ విలువలు - తెలుగు ప్రేరణాత్మక కుటుంబ కథ | మయూఖ
Published in manatelugukathalu.com on 24/05/2026
“తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు మరియు వృద్ధుల సంరక్షణ బాధ్యత పిల్లలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడని పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగులు అయితే వారికి ఇంక్రిమెంట్ కట్ చేస్తానని, సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోనని కలెక్టర్ అన్నారు,” అంటూ టీవీలో వార్తలు చదువుతోంది న్యూస్ రీడర్. పిల్లలు ఉండి కూడా అనాథలైన తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్ ని ఆశ్రయిస్తే, ఆయన పిల్లలకిచ్చిన తీవ్ర హెచ్చరిక అది.
ఈ వార్తలు వింటున్న దమయంతి నవ్వుకుంది. మరి అన్యాయం కాకపోతే పిల్లలు పేరెంట్స్ ని వదిలేస్తారా? అనుకుంది. ఎందుకంటే తన కూతురు తనని ఎంత ప్రేమగా చూసుకుంటుందో దమయంతికి తెలుసు. దమయంతికి పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే భర్త పోవడంతో కూతుర్ని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసింది. భర్త గవర్నమెంట్ ఉద్యోగి అవడంతో తనకి కారుణ్య నియామకం కింద పంచాయతీరాజ్ లో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. చిన్నతనం నుంచి కూతురు దివ్యని కంటికి రెప్పలా చూసుకుంటూ బాగా చదివిస్తోంది.
దివ్య బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఒకరోజు కాలేజీ నుంచి వస్తూనే తల్లి మెడ చుట్టూ చేయి వేసి, “అమ్మ చూడు! నీ కూతురు గొప్పతనం, మా కాలేజీలో జరిగిన డిబేట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది,” అంటూ తన మెడలో ఉన్న మెడల్ ని తల్లి మెడలో వేసింది. దమయంతి సంతోషంగా చూస్తూ, “నీకు రాకపోతే ఎవరికి వస్తాయి? ఇంతకీ టాపిక్ ఏమిటి?” అని అడిగింది.
“మానవ సంబంధాలు - కుటుంబ విలువలు” ఇది టాపిక్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. కానీ,
నేను మాట్లాడిన దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది,” అంది సంతోషంగా దివ్య.
“ఇంతకీ ఏం మాట్లాడావ్ ఏంటి?”
“మానవ సంబంధాలు అడుగంటిపోతున్నాయి. తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలేసి పిల్లలు విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్?” అని అడిగాను అంది దివ్య.
“అదేంటి? వాళ్ళ కెరీర్ కోసం విదేశాలకు వెళ్లడం తప్పంటావా?” ఆశ్చర్యంగా అడిగింది దమయంతి.
“కాదమ్మా! నేను చెప్తాను పూర్తిగా విను. మనం మన తల్లిదండ్రులను చూస్తేనే, తర్వాత తరం కూడా దాన్ని ఆచరిస్తారు. అలా కాకుండా మనమే చూడనప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు? అప్పుడు వాళ్ళు చూడలేదని మనం ఆశించకూడదు.”
“మద్యపానం, భిక్షాటన లాగే తల్లిదండ్రులను చూడకపోవడం అనేది ఒక తీవ్రమైన సమస్య అయింది. కష్టపడి కని పెంచిన తల్లిదండ్రులను వదిలేసి వారు వెళ్లిపోవడం అనేది నేడు ఫ్యాషన్ గా మారిపోయింది. అన్నీ ఉండి నా అన్న వాళ్ళు లేక కొంతమంది యాచకులుగా మారిపోతున్నారు. తల్లిదండ్రులు యంగ్‌గా ఉన్నప్పుడు పిల్లలు వెళ్లినా పర్వాలేదు, వాళ్ళు వాళ్ళ వ్యాపారాల్లో ఉంటారు.
అదే పేరెంట్స్ వృద్ధులైతే వాళ్ళని ఎవరు చూస్తారు?
ఒకవేళ పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లినా, అక్కడ పర్మనెంట్ గా ఉండిపోకుండా కొద్దికాలం ఉండి వచ్చేయాలి. వృద్ధాప్యంలో ఉన్న పేరెంట్స్ ని
ఇక్కడే ఉంచి పర్మనెంట్ గా పిల్లలు అక్కడ ఉండిపోకూడదు. తల్లిదండ్రులను అనాథ శరణాలయానికి పంపిస్తే, వాళ్ళు చివరి రోజుల్లో రక్త సంబంధీకులు లేక పరాయి వారి మధ్యే ప్రాణాలు వదలడం ఎంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి అన్నాను. దాంతో ఆడిటోరియం అంతా చప్పట్లతో మార్మోగిపోయింది.”
అంతేకాకుండా, “వయసులో ఉన్నప్పుడు కెరీర్ కోసం పరుగులు పెట్టండి. అదే టైంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా మీదేనని గుర్తించండి. వాళ్ళ వల్లే కదా మనం భూమ్మీదకి వచ్చాం. ఎంతోమంది పిల్లలు బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో పేరెంట్స్ ని వదిలేయడం మనం చూస్తున్నాం. వాళ్ళు తిని తినక మనల్ని ఇంత వాళ్ళని చేస్తే, మనం వాళ్ళకి ఇచ్చే కృతజ్ఞత ఇదేనా!” అన్నాను.
దాంతో ఆడిటోరియం అంతా చప్పట్లతో నిండిపోయింది. మా ప్రిన్సిపల్ సార్ మాట్లాడుతూ, “నా కెరీర్ కోసం నా తల్లిదండ్రులని పల్లెటూరులోనే వదిలేశాను. చివరి రోజుల్లో వాళ్ళు నన్ను కలవరించినా, నా పరిస్థితుల రీత్యా వెళ్లలేకపోయాను. ఆ బాధ ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది,” అన్నారు బాధగా.
మా అందరి చేత, “తల్లిదండ్రులని వదలం, మేం చూసుకుంటాం,” అని ప్రతిజ్ఞ చేయించారు. మేమందరం కూడా అలాగే అనుకున్నాం,” అంది దివ్య.
“మానవ సంబంధాలు అంటే నీకు ఇదే టాపిక్ తీసుకోవాలని ఎందుకనిపించింది?” అడిగింది ఆరాగా దమయంతి.
“ఎందుకంటే నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నమ్మల్ని, తాతయ్యలని పల్లెటూరులో వదిలేసి వీళ్ళు సిటీలో ఉండడం, వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అమ్మలు చీదరించుకోవడం, ‘మా ప్రాణానికి శనిలా దాపరించారు’ అని తిట్టడం జరిగేదట. దాంతో వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోయేవారుట. ‘మా నాన్నమ్మ ఉంటే ఎంతో బాగుండేది, నా పక్కనే పడుకుని నాకు కథలు చెప్పేది, అన్నం తినిపించేది, నా కబుర్లు అన్ని వినేది.
మా అమ్మ అయితే ఎప్పుడూ చదువుకోమనడం తప్ప, కబుర్లు వినేది కాదు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడూ అన్నం తినిపించలేదు. చాలా బోర్ కొట్టేది. చాలా ఒంటరితనం ఫీలయ్యేదాన్ని. నాన్నమ్మ ఉంటే ఎంత బాగుండేది అనుకునేదాన్ని. కొద్దికాలానికి నాన్నమ్మ పోయిన తర్వాత మా అమ్మ పీడ విరగడయింది’ అంది. ఆ మాటకి నేను చాలా రోజులు ఏడ్చాను,” అని నా ఫ్రెండ్ సునంద చెప్పింది. అది నా మనసులో ఉండిపోయింది. అందుకే సమయం వచ్చింది కాబట్టి ఈ టాపిక్ గురించి ప్రపంచానికి తెలియజెప్పాలని, దానితో కొంతమంది అయినా మారతారని చెప్పాను,” అంది దివ్య.
“అవును! మంచి టాపిక్ తీసుకున్నావ్. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని వదిలేస్తే ఈ ముసలివాళ్ళు చేసుకోలేక, చేతకాక ఏం అవ్వాలి? వాళ్ళని చూడవలసిన బాధ్యత పిల్లలకు ఉంటుంది,” అంది దమయంతి.
“అవునమ్మా! పిల్లలు చనిపోతే మనవలైనా చూడాలి. మనం ఒక మొక్కని నాటినప్పుడు అది చెట్టై పళ్ళు కాస్తున్నప్పుడు పళ్ళు తింటాం కానీ, ఆ చెట్టు సంగతి పట్టించుకోము. అందుకే మనం మన ఇంటి చెట్టుని తెచ్చుకుందాం అమ్మ,” అంది దివ్య.
“మన ఇంటి చెట్టు ఏమిటే?”
“ఏమిటా! నా నాన్నమ్మ తాతయ్యలని మనం తెచ్చుకుందాం. నేను స్టేజి ఎక్కి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఆచరణలో చూపాలి. వాళ్ళు ఆ పల్లెటూరిలో అనాథలుగా ఉండడం నాకు ఇష్టం లేదు. మనం వాళ్ళని ఇక్కడికి తీసుకువద్దాం,” అంది ప్రాధేయపూర్వకంగా దివ్య.
“వాళ్ళ గురించి నీకు ఎలా తెలుసు?” మాటలు తడుముకుంటోంది దమయంతి.
“15 రోజుల క్రితం నేను కాలేజీ నుంచి వస్తుంటే దూరం నుంచి కనిపించారు వృద్ధ దంపతులు మన ఇంట్లోంచి వస్తూ. వీధి చివర వాళ్ళని ఆపి అడిగితే వాళ్ళు అంతా చెప్పారు.
వాళ్ళని నువ్వు రావద్దు అన్నావని, ఫోన్ చేసినా ఒప్పుకోవట్లేదని, ‘ముసలివాళ్ళం అయిపోయాం, నా కొడుకు పోయినా నా మనవరాలిని చూద్దామని వస్తామంటే కూడా మీ అమ్మ ఒప్పుకోవట్లేదు. నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పటికి మేము ఇంట్లో ఉండకూడదని పంపించేసింది’ అంటూ రోదించారమ్మ. నాకు చాలా బాధ వేసింది.
నేను ఎప్పుడు తాతయ్య వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు పల్లెటూరు వదిలి రారు అని చెప్పేదానివి కానీ, నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడంతో విషయం తెలిసింది. ప్లీజ్ అమ్మ! పర్మినెంట్ గా తీసుకువచ్చేద్దాం. ఆ పల్లెటూరిలో వాళ్ళు అవస్థలు పడడం నేను తట్టుకోలేకపోతున్నాను,” అంటూ బతిమాలింది.
దమయంతి ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఆ రాత్రి ఆలోచించుకుంది. ‘నేను వాళ్ళని చూడకపోతే దివ్య దృష్టిలో చెడ్డదానిలా మిగిలిపోతాను, అందుకైనా తీసుకురావాలి’ అనుకుంది.
మర్నాడు పొద్దుటే, “దివ్య! బయలుదేరు, తాతయ్య వాళ్ళని తీసుకువద్దాం,” అంది పొడిగా.
ఆ మాటతో దివ్య మొహం వెలిగిపోయింది. “మా అమ్మ మంచిది, మా అమ్మకి మానవత్వం ఉంది,” అంది తల్లిని ముద్దుపెట్టుకుంటూ.
******శుభం *******
మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.









Comments