దూరమే చేరువై!
- Lalitha Sripathi

- 1 day ago
- 8 min read
తల్లి ప్రేమ, కొడుకు, కోడలు, కుటుంబ బంధాలు, వృద్ధాప్యం, ఒంటరితనం, ఉద్యోగ జీవితం, అపార్థాలు, కుటుంబ విలువలు, తెలుగు కథలు, మనతెలుగుకథలు, శ్రీపతి లలిత, emotional story, family values, senior citizens

Durame Cheruvai - Telugu Emotional Family Story | Sripathi Lalitha
దూరమే చేరువై! - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | శ్రీపతి లలిత
Published in manatelugukathalu.com on 23/07/2026
"దూరమే చేరువై!" అలాంటి హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథ. భర్తను కోల్పోయిన శశి, తన కొడుకు ఇంట్లో అనుభవించిన ఒంటరితనం, తన స్నేహితురాలు హేమ చెప్పిన జీవిత సత్యాలు, చివరకు ఒక ఫోన్ కాల్ ద్వారా మారిపోయిన ఆమె ఆలోచనలు... ఇవన్నీ ప్రతి తల్లిదండ్రి, ప్రతి కొడుకు-కోడలు, ప్రతి కుటుంబ సభ్యుడు ఒక్కసారి ఆలోచించేలా చేస్తాయి.
ఆధునిక జీవనశైలిలో కుటుంబ బంధాలు ఎలా మారుతున్నాయి? ప్రేమ దూరమైందా? లేక వ్యక్తపరిచే విధానం మాత్రమే మారిందా? అనే ప్రశ్నలకు హృద్యమైన సమాధానం చెప్పే ఈ భావోద్వేగ తెలుగు కథను తప్పకుండా చదవండి.
"పిల్లలు ఫోన్ చేయడం తగ్గిందా...?
అంటే వాళ్ల ప్రేమ కూడా తగ్గిపోయిందా...?
ఈ కథ వినాక... మీ ఆలోచనే మారిపోతుంది."
శ్రీపతి లలిత గారి దూరమే చేరువై! కథను వినండి.
“గుడ్మార్నింగ్! అబ్బాయి ఇంటినుంచి ఎప్పడు వచ్చావు? ఇంకా రెండు నెలలు ఉంటావనుకున్నాను!” పాల ప్యాకెట్ తియ్యడానికి ఫ్లాట్ తలుపు తీసిన హేమలత, అప్పుడే తలుపు తీసిన శశిరేఖని పలకరించింది.
“రాత్రి వచ్చాను, బాగా ఆలస్యమైంది అందుకే నిన్ను పిలవలేదు!” శశి గొంతు కొంత భారంగానూ, కొంత బాధగానూ ధ్వనించింది.
“సరే! టిఫిన్ ఏమీ చేసుకోకు. నేను తీసుకువస్తాను, ఇద్దరం కలిసి తిందాం!”
ఏదో అనేలోగా ఇంట్లోకి వెళ్లిపోయింది హేమ.
సరిగ్గా గంట తర్వాత బెల్ కొట్టింది. అప్పటికే స్నానం చేసిన శశి, కొంచెం తేటగా కనిపించింది. వేడి,వేడి ఇడ్లీ, చట్నీ, హేమ తెస్తే, ఇంట్లో ఉన్న కారంపొడి, శశి తీసింది.
ఇద్దరూ నెమ్మదిగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తిన్నారు.
శశి పెట్టే కాఫీ అంటే హేమకి ఇష్టం, స్ట్రాంగ్ కాఫీ కలిపి తెచ్చింది.
ఇద్దరూ కాఫీ తాగాక, “ఇప్పుడు చెప్పు, సంగతి ఏమిటీ? మూడు నెలలు ఉంటానని వెళ్లి అప్పుడే వచ్చేసావు! ఏమన్నా గొడవలు అయ్యాయా?”
“గొడవలా! గొడవలైనా బాగుండేదేమో! ఆ వంకన అయినా కొద్దిగా మాట్లాడేవారు. అసలు మాట్లాడితే కదా! శేఖర్ చనిపోయాక, అక్కడికే వచ్చేయమన్న రాహుల్ గోల పడలేక, కొన్ని రోజులు అక్కడ ఉందామని వెళ్లాను” నీరసంగా నవ్వింది శశి.
“అంటే నువ్వు వెళ్లడం వాళ్ళకి ఇష్టంలేదా?” హేమ అడిగితే, “అలా ఏం లేదు. నేను వెళ్ళగానే సంతోషంగానే అనిపించారు. ఇక్కడి నుంచి నేను చేసి తీసుకెళ్లిన పచ్చళ్ళు,పొడులు, కారాలు, స్వీట్స్ చూసి విహాన్ గంతులేసాడు. రాహుల్,ఆర్తీ కూడా, “ఎందుకమ్మా! ఇంత కష్టపడి అన్నీ చేసావు?” అని ఏదో మొహమాటానికి అన్నా, చాలా సంతోషపడ్డట్టే అనిపించింది.
నేను వెళ్ళింది శనివారం కదా! వాళ్ళకి సెలవు. నేను తీసుకెళ్లినవన్నీ వేసుకుని, బావున్నాయి అంటూ సుష్టుగా తిన్నారు. మర్నాడు ఆదివారం. నెమ్మదిగా లేచి, నేను కాఫీ పెడితే, మా అబ్బాయి, “మా అమ్మ పెట్టే కాఫీలాగా, ఏ కాఫీ షాపు వాళ్ళు పెట్టలేరు “ అంటూ పొగుడుతూ తాగాడు.
కోడలు కూడా, “కొన్ని పచ్చళ్ళు మా అమ్మ కంటే మీరే బాగా చేస్తారు అత్తయ్యా!” అని మెచ్చుకుంది. జంతికలు, సున్నుండలు, చిక్కీలు విహాన్ తిని, “ఇక్కడ షాప్‌లో అసలు బావుండవు మామ్మా!నువ్వు చేసినవి ఎంత బావున్నాయో!” అన్నాడు. శనివారం నా దగ్గరే పడుకుని కబుర్లు చెప్పాడు.
మా అబ్బాయిది మూడు బెడ్ రూమ్‌ల ఫ్లాట్ కదా, నాకంటూ రూము ఎప్పుడూ రెడీగా ఉంటుంది. సోమవారం పొద్దున్నే స్కూల్‌కి వెళ్ళాలని, మనవడు, ఆదివారం వాడి గదిలోనే పడుకున్నాడు. కొడుకు, కోడలు, ఆదివారం సాయంత్రం ఏదో పార్టీ ఉందని వెళ్లి, ఏ రాత్రి వచ్చారో కూడా నాకు తెలీదు.
ఇంక చూసుకో! సోమవారం నుంచి వాళ్ళు కనపడ్డం, వినపడ్డం, రెండూ పూర్తిగా తగ్గిపోయాయి. ఒక రెండుసార్లు మా అబ్బాయి, మరో రెండుసార్లు కోడలు, ఓ మూడు సార్లు మనవడు మాట్లాడి ఉంటారు. అది కూడా, “మా వంట మేము చేసుకున్నాం. నచ్చితే తిను! లేదా నీకు కావలిసినవి చేసుకో!” అనో, మనవడు, “నేను టెన్నిస్ క్లాస్‌కి వెళ్ళానని చెప్పు, ట్యూషన్‌కి వెళ్ళానని చెప్పు!” ఇంతే!
నేను ఇక్కడనుంచి తీసుకెళ్లినవి తినే టైం లేదు వాళ్ళకి. పొద్దున్న ఎనిమిదికి వెళ్లిన కొడుకు రాత్రి పదికి, కోడలు ఏడు గంటలకి ఇంటికి వచ్చేవారు. కోడలు వచ్చాక కూడా, ఇంకా మూడు, నాలుగు గంటలు పని, తలుపులు వేసుకుని కూర్చునేది. విహాన్ హోమ్ వర్క్ చేసుకుని “గుడ్‌నైట్ బామ్మా!” అని పడుకునేవాడు.
ఆర్తి, ఉదయం అయిదుకి లేచి, వాళ్లకు కావాల్సినవి ఏవో చేసి, ఇద్దరికీ బాక్స్‌లు సర్దేది. ఎనిమిది వరకు తను వంటింట్లోనే. ఉదయం నా కాఫీ కూడా, వాళ్ళు వెళ్ళాకే పెట్టుకోవాలి. పని అమ్మాయి వచ్చాక, అన్నీ సర్ది, నాకు ఏదైనా టిఫిన్ కావాలంటే చేసేది. కొడుకు, కోడలు అన్నాలు మానేసారు, సలాడ్లు, స్ప్రౌట్స్, గడ్డీ, గాదం.
మధ్యాహ్నం వంట నేనే చేసుకోవాలి, వాళ్ళు తినేవి నేను తినలేను.
రాత్రి నా టిఫిన్ కోసం, మా కోడలు ఇడ్లీ పిండి, దోశ పిండి తెప్పించేది. నాకేమో ఒక్కత్తికి వేసుకోవాలంటే బద్ధకం.
మనవడికి ఉదయం, మధ్యాహ్నం స్కూల్‌లోనే భోజనం. రాత్రికి వాడు మ్యాగీ,లేదా బ్రెడ్ తినేవాడు. ఎప్పుడైనా, దోస,ఇడ్లీ చేస్తే, నాతో పాటు ఒకటో,రెండో తినేవాడు.
శని, ఆది వారాలు ముగ్గురికీ సెలవలు. ఉదయం తొమ్మిదైనా లేవరు. నాకు అయిదుకే మెలకువ వచ్చి ఏమీ తోచక, స్నానం, పూజ, కాఫీ అన్నీ చేసుకుని కూర్చునేదాన్ని.
ముందు రోజు చెప్తే ఏదైనా వంట చేసేదాన్ని. ఆ రెండు రోజుల్లో పగలో,రాత్రో, స్నేహితులతో బయట భోజనాలు, షాపింగులకీ, సినిమాలకీ తిరగడం!
ఒక వారం, వాళ్ళతో వెళ్లి, తర్వాత, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పా! ఇలా అతి కష్టం మీద నెల గడిపాను.
మొన్న శుక్రవారంనాడు, మా అబ్బాయి, “శనివారం, ఆదివారం, ఏదో ట్రిప్ ఉంది, ముందే ప్లాన్ చేసుకున్నాం. రూములు బుక్ అయ్యాయి! నువ్వు ఇంట్లోనే ఉండు!” అంటే, నాకు ఒకదానికి ఏమి తోస్తుందని, వాళ్ళకి చెప్పి, బస్ ఎక్కి వచ్చేసాను. వద్దని కూడా అనలేదు” బాధగా చెప్పింది శశి.
“సరేలే! ఇప్పుడు టిఫిన్ తిన్నాం, మధ్యాహ్నం ఏదైనా తేలిగ్గా తినేద్దాం. నిన్ను సాయంత్రం ఒక చోటికి తీసుకెళ్తాను!” చెప్పింది హేమ.
ఆమె వెళ్ళగానే తలుపులు వేసుకుని, మంచం మీద వాలింది శశి.
‘ఎందుకో, కొడుకు ఇంట్లో తను పరాయిదానిలాగా అనిపించింది. అక్కడ ఉండడంవల్ల వాళ్ళకి ఉపయోగం లేకపోగా, ఇబ్బంది కలిగిందా?
వాళ్ళకి తన మీద ప్రేమ తగ్గిపోయిందా? లేక తన ఆలోచనలు తప్పా?’ అర్ధం కాలేదు.
అలసటకి కళ్లు మూతలు పడ్డాయి.
మెలకువ వచ్చేసరికి మూడు అయింది. ‘అయిదుకి ఎక్కడికో వెళ్దామంది హేమ!’ టీ తాగి తయారవడం మొదలు పెట్టింది.
సరిగ్గా నాలుగున్నరకి హేమ బెల్ కొట్టింది.
తలుపు తీసి, “కూచో! బ్యాగ్ తీసుకుని వస్తాను!”.
“మనం వెళ్ళేది మన కమ్యూనిటీలోనే! బ్యాగ్‌తో పనిలేదు. సెల్ తెచ్చుకో చాలు!”
ప్రశ్నార్ధకంగా చూస్తున్న శశిని కూర్చోమని,
“శేఖర్ పోయాక నువ్వు ఒంటరితనాన్ని కోరుకున్నావు. ఎవరం ఎంత ప్రయత్నించినా, బయటికి రావడం, నలుగురిలో కలవడం మానేసావు.
నాకు, నలభయ్యో ఏట భర్త పోయారు. రమ్యకి పదేళ్లు. ఆమె కోసం, నేను ధైర్యం కూడగట్టుకుని, బాధని మింగుకుని జీవితం కొనసాగించాను.
జంటలో ఒకరు వెళ్ళిపోతే పడే బాధ నాకు తెలుసు శశీ! అలాగని, అంతటితో జీవించడం ఆపకూడదు కదా!
మనకి నచ్చిన, చేతనైన వ్యాపకం పెట్టుకోవాలి. బతికినన్ని రోజులు బరువుగా, ఎందుకొచ్చిన జీవితం అన్నట్లు గడపకూడదు. దానివల్ల, మనిషిలో నెగటివిటీ పెరిగి, శరీర ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది.
ఇక్కడి కమ్యూనిటీలో, మనలాంటి పెద్దవాళ్లు, ఒంటరివారు, జంటలు… అందరూ ఉన్నారు.
మేమంతా ఒక గ్రూప్‌గా ఏర్పడి, వారంలో మూడు రోజులు కలుస్తాం.
సోమవారం, అందరం కమ్యూనిటీ హాల్‌లో కూర్చుని, కాసేపు క్యారమ్స్, కార్డ్స్ ఆడడమో, అక్కడ థియేటర్‌లో ఏదైనా సినిమా చూడడమో చేస్తాం.
బుధవారాలు బైటికి, ఏదైనా ఆర్ఫనేజ్, హాస్పిటల్, లేదా, పాలియేటివ్ కేర్, దగ్గరికి వెళ్లి అక్కడ తోచిన సాయం చెయ్యడమో, లేదంటే అక్కడ కాసేపు అందరితో కబుర్లు చెప్పడమో చేస్తాం. అలా చెయ్యడానికి రెండు మూడు చోట్ల, పొత్తు పెట్టుకున్నాం.
ఇంక శుక్రవారం ఉదయం, అందరం ఎవరో ఒకరి ఇంట్లో, పూజలో, పారాయణలో చేసి, అక్కడే ఏదైనా తినేసి వస్తాం. నువ్వు కూడా మాతో కలవచ్చు. ప్రతీ నెలా ఒకసారి బస్ అద్దెకి తీసుకుని, దగ్గరలో ఏదైనా గుడికి వెళ్తాం. ఈ మధ్య, కొందరు ఆడవాళ్ళం చిన్న టూర్‌లు కూడా వెళ్తున్నాం! ఇవాళ సోమవారం కదా! కింద కలుద్దాం!” అంది హేమ.
‘నేను రాను!’ అనబోయి, ‘ఒకసారి వెళ్లి వస్తే నష్టం ఏముంది?’ అనుకుని వెళ్లింది.
అందరితో కబుర్లు చెప్పుకుని, వస్తూ వస్తూ, హేమ, “ ఫుడ్ స్టాల్స్ దగ్గర్ ఆగి, పాని పూరీ తిందామా ?”.
“అవి తింటే రాత్రికి ఇంకేం తినలేం!” అంది శశి. “తినద్దు! అప్పుడప్పుడు ఇలా పిల్లలమై పోవాలి!” అంటూ పానీపూరి, రగడ ఆర్డర్ ఇచ్చింది.
అవి తిని, అరగాలి అనుకుంటూ వాకింగ్ ట్రాక్‌లో కాసేపు నడిచి ఇంటికెళ్లారు.
“థాంక్స్ హేమా! ఇంట్లోనే ఉండి అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకుండా కాపాడావు నన్ను. చాలా రోజుల తర్వాత రోజు హాయిగా గడిచింది!” స్నేహపూర్వకంగా ఆమె చెయ్యి నొక్కింది.
అలా అక్కడి గ్రూప్‌లో చేరి వారితో సరదాగా గడుపుతున్నా, శశి మనసులో అలజడి తగ్గలేదు.
తను బెంగళూరు నుంచి వచ్చి పది రోజులయింది, కొడుకు కానీ, కోడలు కానీ ఫోన్ చెయ్యలేదు. అసలు వాళ్ళకి తను ఒక దాన్ని ఉన్నట్టు గుర్తుందా?
ఉడుకుమోతుతనం, కోపం అన్నీ కలగలిపి, ఆమెని స్థిమితంగా ఉండనివ్వలేదు.
ఆ రోజు ఆదివారం. టైం పదకొండు దాటింది. వంట చెయ్యాలనిపించలేదు,ఇంట్లో కూర్చో బుద్ధి కాక హేమ ఇంటి తలుపు కొట్టింది.
తలుపు తీసిన హేమ ఏదో సీరియస్ అని గ్రహించి, “వంట చేసావా?” అడ్డంగా తల ఊపింది శశి.
“నేను వండనా? బయటికి వెళ్దామా?” అన్న హేమతో,
“నువ్వు వంట చెయ్యకు,ఏదైనా ఆర్డర్ చేద్దాం. ముందు నువ్వు కూర్చో. నా మనసులో అగ్ని పర్వతం బద్దలయ్యేలా ఉంది” శశి మాటలకి, పక్కనే వచ్చి కూర్చుంది.
“నేను వచ్చి పది రోజులయింది. రాహుల్ నుంచి ఒక ఫోన్ లేదు. ఎలా ఉన్నావని లేదు? అసలు సంగతి నాకు అర్ధమవడంలేదు. నేను ఏమైనా తప్పు చేసానా? వాళ్ళకి నా మీద అంత కోపం ఎందుకు?” కళ్ళ నీళ్లు పెట్టుకున్న ఆమెని చూసి చిన్నగా నవ్వింది హేమ.
“పోనీ నువ్వు ఫోన్ చేసావా?” అడ్డంగా తల ఊపింది. “ఎందుకు చెయ్యలేదు? చేస్తేనేగా నీకు సంగతి తెలిసేది! నువ్వు శేఖర్ చనిపోయాక ఒక షెల్ లోకి వెళ్ళిపోయావు శశీ!
ప్రస్తుతం పిల్లల ఉద్యోగాల పరిస్థితి, దాని వల్ల వాళ్ల మానసిక స్థితి, ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు.
నాకు మా అమ్మాయి అన్నీ చెప్తుంది.
ప్రస్తుతం, ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రశాంతత కరువైంది. పాత రోజుల్లో, రిటైర్ అయ్యేదాకా ఉద్యోగానికి ఢోకా లేదు, పెన్షన్ ఉంది, ప్రస్తుతం అలా కాదు.
ఇవాళ ఉన్న ఉద్యోగం రేపు ఉంటుందో, పోతుందో తెలీదు. అది పోతే, వీళ్లు తీసుకున్న అప్పులకి వాయిదాలు కట్టాలి. పిల్లల చదువుల ఫీజులు, రోజువారీ ఖర్చులకి కూడా ఇబ్బంది. అందుకని, ఆడామగా, తేడా లేకుండా, వారానికి అయిదు రోజులు ఆఫీస్‌కి వెళ్లి ఉద్యోగం చేస్తూ, కొంత డబ్బు, కష్టకాలం కోసం ఆదా చేసుకుంటున్నారు. వారికి పనిగంటలు కూడా చాలా ఎక్కువే. ఇంటికి వచ్చినా కాల్స్ అని, మీటింగులు అనీ, రాత్రి పన్నెండు దాకా పని ఉంటుంది.
మీ కోడలిని తీసుకో! రాత్రి పది దాటినా పని అన్నావు. మళ్లీ పొద్దున్నే లేచి, ఇద్దరికీ డబ్బాలు సర్దాలి. వీరికి శారీరక శ్రమ లేకపోవడంతో, మనలాగా అన్నాలు తింటే అరగడం లేదు. అందుకనే, లో కార్బ్ డైట్, స్ప్రౌట్స్, ప్రోటీన్, దాంతో వాళ్ల వంట వేరే. నీకు వచ్చిన పిండివంటలు, పచ్చళ్ళు చేసి తీసుకెళ్తే తినడానికి వాళ్ళకి టైం ఉండదు, వాళ్ళ డైట్ ప్లాన్‌లో సరిపోదు.
ట్రాఫిక్‌లో చాలా సమయం గడిపి, విపరీతంగా అలసిపోతారు. భార్యా,భర్త, కలిసి గడపాలంటే, వారానికి ఒకసారి కన్నా కుదరదు. ఉన్న కాస్త టైంలో, పిల్లవాడితో గడపాలి. వాడికి ఏదో వ్యాపకం ఉండాలని, ఆటలని, సంగీతమని ఏవో పెట్టడం. ఎప్పుడైనా సెలవు పెట్టి, ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా వెళ్ళడం, వాళ్ళకి అదే ఆటవిడుపు.
మనిద్దరం ఒకే వయసు వాళ్ళం అయినా, మా అమ్మాయి పెళ్లి త్వరగా అయింది.
నాకు వంటరితనం త్వరగా వచ్చింది. నేను గమనించిన నాలుగు సూత్రాలు చెప్తాను శశీ!
మొదటిది, మనుషులు దగ్గరగా ఉన్నంత మాత్రాన, మనసులు దగ్గర అవవు.
రెండోది, పిల్లలకి సహాయం అయినా, సలహా అయినా, వాళ్ళకి అవసరమై, వాళ్ళు అడిగినప్పుడే చెయ్యాలి, చెప్పాలి.
మూడోది, వాళ్ళ మాటల్లో, పోట్లాటల్లో కల్పించుకోకూడదు.
నాలుగోది, పిల్లల్ని పెంచే విషయంలో మన సలహాలు ఇవ్వకూడదు. మన పిల్లలకి, వాళ్ల పిల్లలకి, అన్నిటిలోనూ చాలా మార్పులు వచ్చాయి.
కన్ఫ్యూషియస్ అనే తత్వవేత్త, సుమారు 2500 సంవత్సర క్రితమే చెప్పినట్లు, ప్రేమ, గౌరవం దానంతట అది రావాలి , బలవంతంగా పొందలేము. మనుషులని నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే, అంత దూరం అవుతారు.బంధంలో వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వు, బంధించకు.
మన ఇష్టాలను పిల్లల మీద రుద్దితే, మనం వారికి బరువైపోతాము. ఎప్పుడైతే, మనం పట్టు వదులుతామో, అప్పుడే మనం వారి మనసుల్లో స్థానం పొందుతాము.
మనకంటూ ఒక వ్యాపకం, మన స్నేహితులు మనకి ఉంటే, వేరే విషయాలు ఎక్కువ పట్టించుకోము.
మనం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడలేదని బాధ పడద్దు. ఆ టైంలో వాళ్ల పరిస్థితి మనకి తెలీదు. ఒక మెసేజ్ పెట్టు, వాళ్ళు ఎప్పుడు వీలయితే అప్పుడే మాట్లాడతారు.
వాళ్ళకి బోలెడు సమస్యలు, ఉద్యోగం సమస్య, ఇంట్లో పని వాళ్ళ సమస్య, పిల్లల సమస్యలు, ఎన్నో ఉంటాయి. వాళ్ళు మాట్లాడినప్పుడే నువ్వు మాట్లాడు.
ముందు వాళ్ళు చెప్పేది విను. ఫోన్ చెయ్యలేదని, చేసినవి తినలేదని, వాళ్ళని నిందించకు. అసలే సున్నితంగా ఉన్న బంధం ఇంకా దెబ్బ తింటుంది.
ముందు, మనసులు దగ్గరయితే, ఆ దూరమే చేరువవుతుంది.
హేమ చెప్పినవి అన్నీ శ్రద్ధగా వింది శశి. ఇంతలో ఆర్డర్ చేసిన భోజనం వచ్చింది.
ఇద్దరూ తిని సర్దుతుంటే, శశి ఫోన్ మోగింది…
చూస్తే రాహుల్.
‘ఎత్తి మాట్లాడు!’ అన్నట్లు చూసింది హేమ.
‘సరే!’ అని ఎత్తింది శశి. “హలో!” అనగానే, అవతల నుంచి రాహుల్, “హలో!” అన్నాడు.
అతని గొంతు చాలా భారంగా ఉంది.
“అయ్యో! నీ గొంతు అలా ఉందేమిటి?” ఆదుర్దాగా అంది.
ఫోన్ స్పీకర్‌లో ఉన్నట్లుంది, పక్క నుంచి ఆర్తి గొంతు వినిపించింది. “అత్తయ్యా! మేము ఫ్రెండ్స్‌తో ఔటింగ్‌కి వెళ్ళాం కదా! అక్కడ అందరికీ ఫుడ్ పాయిజినింగ్ అయింది. ఒకటే వాంతులు, విరేచనాలు. నేను కొద్దిగా తక్కువ తిన్నాను, లక్కీగా విహాన్ అసలు తినలేదు.
వాడు మీరు తెచ్చిన స్నాక్స్ తెచ్చుకుని తిన్నాడు. రాహుల్, రెండు రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది” ఆర్తి చెప్తుంటే శశికి దుఃఖం ఆగలేదు.
“నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కాదా!” “నువ్వు చిన్న పిల్లవా అమ్మా! ఆ బస్సులో ప్రయాణం చేసి వెళ్ళావు, అప్పటికే చాలా అలిసిపోయి ఉంటావు. నిజానికి, ఆసుపత్రిలో ఎవరినీ ఎక్కువ సేపు ఉండనివ్వలేదు.
ఒక రోజు ఆర్తి ఉంది, అప్పుడు, విహాన్ మా స్నేహితుల ఇంట్లో ఉన్నాడు. రెండో రోజు సాయంత్రానికి పంపేసారు” అన్నాడు రాహుల్.
“నానమ్మా! నువ్వు తెచ్చిన పచ్చళ్ళు అన్నీ, నాన్న ఫినిష్ చేసేసారు,
రోజూ అవే వేసుకుని తింటున్నారు. నాకు అసలు ఉంచలేదు” విహాన్ కంప్లైంట్.
“మోషన్స్ అంటూ ఆ పచ్చళ్ళు తింటే ఇంకా ప్రాబ్లెమ్ కదా! “ శశి అంటే, “ ఏమోనమ్మా! నాకు ఆ నిమ్మకాయ, టమాటో, ఉసిరికాయ నోటికి హాయిగా అనిపించాయి”
“సరే గానీ అత్తయ్యా మీరు ఎలా ఉన్నారు! తనకి బాలేకపోవడం, నాకు సెలవ ఇయ్యలేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్నాను. రాహుల్‌కి కూడా రెండు రోజులు సెలవ ఇచ్చారు అంతే, తర్వాత ఇంటినుండి పని. ఈ హడావిడిలో మీకు ఫోన్ చెయ్యడానికి అసలు అవలేదు” పరవాలేదమ్మా ఆర్తీ! మీరు బిజీగా ఉన్నారేమోనని నేనూ ఫోన్ చెయ్యలేదు”.
“అమ్మా!” నసుగుతున్నాడు రాహుల్. “ఏంటి నాన్నా! నన్ను రమ్మంటావా?” ప్రేమగా అంది శశి.
“వద్దత్తయ్యా! నిజానికి 15 రోజుల తర్వాత, మేము వస్తున్నాం. ఒక వారం అక్కడే ఉంటాం. విహాన్‌కి సెలవులు, మేము వర్క్ ఫ్రమ్ హోమ్, మధ్యలో ఒకటి,రెండు రోజులు, సెలవ పెట్టుకుంటాం.
మీకు ఇబ్బంది లేకపోతే, కొన్ని నిమ్మకాయ, ఉసిరికాయ,టొమాటో పచ్చళ్లు కొరియర్ చేస్తారా. రాహుల్ అయితే పప్పు, పచ్చళ్లు, పెరుగన్నం మాత్రమే తింటున్నాడు” మధ్యలో విహాన్ కేక పెట్టాడు, “ నానమ్మా! నాకు ఆ క్రంచీ మురుకులు, రౌండ్ స్వేట్ కావాలి. ఇంకా చాలా కావాలి, అవి అక్కడ వచ్చినప్పుడు చేద్దువుగాని. ఇప్పుడు ఇవి పంపవా ప్లీజ్!”
శశి మనసులో కరడుకట్టిన కోపం, అశాంతి,దిగులు, ఉక్రోషం, అన్నీ మంచులా కరిగి, కళ్ళ నుంచి జారిపోయాయి.
“సరే! ఏమి కావాలో మెసేజ్‌లో పెట్టు. నేను ఇప్పుడు హేమ ఆంటీ ఇంట్లో ఉన్నాను. ఇద్దరం కలిసి మీకు కావాల్సినవి చేసి, ఎక్స్ప్రెస్ కొరియర్‌లో వేస్తాను.”
“అమ్మా! మరీ ఎక్కువ శ్రమ పడకు. నీకు ఎంత వీలైతే అంత చెయ్యి! “ ఇబ్బందిగా అన్నాడు రాహుల్.
“అత్తయ్యా! ఈయన చెప్పినట్లు ఎక్కువ శ్రమ పడకండి. బయట కొన్నవి అసలు నచ్చట్లేదు…”
“నాకు శ్రమ ఏమీ లేదమ్మా! మీరు తిని బావున్నాయి అంటే, ఆ కాస్త శ్రమ కూడా ఎగిరిపోతుంది!” ఫోన్ పెట్టేసింది.
“నీ అనుమానాలు తీరాయా!” నవ్వుతూ అన్న హేమని, “అవును ! నువ్వన్నది నిజం. దూరం అనేది మనుషులకి కాదు, మనసులకి. ఇప్పుడు పిల్లల్తో కాంటాక్ట్ పెట్టుకోవాలంటే, ఫోన్, వీడియో కాల్ ఉన్నాయి. పిల్లల ఉద్యోగ రీత్యా, రోజూ వాళ్ళని విసిగించకూడదు. మెసేజ్ చేసినా, కాల్ చేసినా, తియ్యక పోతే బాధ పడకూడదు. వాళ్ళకున్న టెన్షన్స్ కాక, మనం కొత్తవి పెట్టకుండా, మనకంటూ ఓ వ్యాపకం పెట్టుకుంటే మనకి, పిల్లలకి సుఖం. ఇప్పుడు పూర్తిగా, అర్ధమయింది.
సరే!సరే! ముందు ఇంట్లోకి పద! అన్నీ చేసి పంపాలి, మన కోసం కూడా కాసిని ఉంచుకోవాలి!” లాక్కెళ్లింది, మూసి ఉన్న, ఇంటి తలుపూ, మనసు తలుపూ తీస్తూ.
సమాప్తం
శ్రీపతి లలిత గారి కొన్ని ఇతర రచనలు:
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.










Comments