top of page
Original_edited.jpg

అమ్మ తప్పిపోయింది

  • Writer: Lalitha Sripathi
    Lalitha Sripathi
  • 15 hours ago
  • 5 min read

#SripathiLalitha, #శ్రీపతిలలిత, #అమ్మతప్పిపోయింది, #AmmaThappipoyindi, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, కొసమెరుపు

ree

Amma Thappipoyindi - New Telugu Story Written By Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 17/11/2025

అమ్మ తప్పిపోయింది - తెలుగు కథ

రచన: శ్రీపతి లలిత

టైమ్స్ అఫ్ ఇండియా మొదటి పేజీలో, ఫుల్ పేజీ ప్రకటన చూసి, చాలామంది ఆశ్చర్యపోయారు.


“సరిగ్గా ఇరవై ఐదేళ్ల క్రితం ఈ పసిపాప వాళ్ళ అమ్మ తప్పిపోయింది.

ఈ ఫోటోలోని పాప, హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 20.6.2000 న పుట్టింది.

రెండు రోజుల తరవాత పాప తల్లి తప్పిపోయింది. ఈ పాపని అమెరికాకి చెందిన ఒక జంట దత్తత తీసుకున్నారు.


తప్పిపోయిన తల్లిని వెతుక్కుంటూ, ఇప్పుడు ఆమె ఇండియాకి వచ్చింది.

ఎవరికైనా ఆ తల్లి వివరాలు తెలిస్తే, ‘సమంత ఆండ్రూస్’ ఫోన్ కి తెలపండి”. పాప ఫోటో, కింద ఫోన్ నెంబర్ వ్రాసారు. ఫొటోలో పాప, గుండ్రటి మొహం, ఉంగరాల జుట్టు, పెద్ద కళ్లతో ముద్దుగా ఉంది.


ఆ ప్రకటన ఇచ్చిన సమంత, ఏదైనా ఫోన్ వస్తుందని ఎదురు చూస్తూ, తనని దత్తతకి ఇచ్చిన హోంకి ఫోన్ చేసింది. “ప్రకటనకు ఎవరూ స్పందించలేదు” అని చెప్తే, అనుకున్నదే అయినా ఒక నిమిషం బాధపడింది.


సమంతని పెంచుకున్నది ఒక అమెరికన్ దంపతులు. పోలికలో తప్ప, ఏ విషయంలోనూ, వాళ్ళు స్వంత తల్లితండ్రులు కాదు అంటే, ఎవరూ నమ్మరు… అంత ప్రేమగా పెంచారు. అర్థంచేసుకునే వయసు వచ్చిందని అనుకున్నాక, సమంత పెంపకం గురించి చెప్పారు.

అమెరికాలో ఇలాంటి పెంపకాలు చాలానే ఉంటాయి, అందుకే సమంత పెద్ద బాధపడలేదు.


తన అదృష్టం కొద్దీ, ఇంతమంచి అమ్మానాన్నలు దొరికారు అనుకున్నా, ఎక్కడో... తన స్వంత తల్లితండ్రులు ఎవరు? ఎందుకు వదిలేసారు? తెలుసుకోవాలని అనిపించేది. సమంత అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆఫీస్ పనిమీద, ఇండియాకి వెళ్ళమంటే,

తన పుట్టుక గురించిన నిజం కూడా తెలుస్తుందని వచ్చింది. ‘సరే! ఇంకా పదిహేను రోజులు ఉంటానుగా!” అనుకుంటూ, ఆఫీస్ కి వెళ్ళింది.


సమంత సన్నగా, పొడుగ్గా, చామనఛాయతో ఉన్నా, నల్లటి పెద్ద కళ్ళు, నల్లటి ఉంగరాల జుట్టు, నీలం రంగు జీన్ ప్యాంట్, తెల్ల చొక్కా, 5’5 పొడవు ఉన్నా, హీల్స్ వేసుకుని ఇంకా పొడుగ్గా అనిపిస్తుంది. చెవులకి చిన్న సొలిటేర్ డైమండ్ దిద్దు, మెడలో కనిపించీ కనిపించని సన్నటి చైన్… అందం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉండి, ఒకసారి చూసిన వాళ్ళు, మళ్లీ తలతిప్పి చూసేటట్లుగా ఉంటుంది.


ఆఫీస్‌కి వెళ్ళేసరికి, అక్కడ ఇండియా డైరెక్టర్ ఎదురు చూస్తునారు.

ముందుగా స్టాఫ్‌తో పరిచయాలు అయ్యాక, డైరెక్టర్, వైశాలిని, సమంతకి పరిచయం చేస్తూ “ఈమె వైశాలి! నీ టీమ్ కదా, కాల్స్‌లో పరిచయమేగా! ఇక్కడ ఉన్నన్ని రోజులు, తనే నీకు హెల్ప్ చేస్తుంది” అన్నాడు.


ఆ మర్నాటినుంచి సామ్,శాలి ఆఫీస్ అవగానే, హైదరాబాద్ తిరిగి చూడడం, షాపింగ్‌కి వెళ్ళడం… అలా ఇద్దరూ కలిసి తిరిగేవాళ్ళు.


ఒక రోజు ఇద్దరూ షాపింగ్ అయ్యాక, ఆకలి వెయ్యడంతో అక్కడ క్యాంటీన్ కి వెళ్లారు. సమంత ఇక్కడి ఫుడ్ తింటాననడంతో ఇడ్లీ, దోశ తీసుకుంది శాలి.

“ఇంకో రెండురోజుల్లో వెళ్ళిపోతావుగా! వెళ్ళేలోపు మా ఇంటికి రావచ్చుగా? లంచ్ అయినా డిన్నర్ అయినా!” అన్న శాలితో


“ఓకే! డిన్నర్ కి వస్తాను!” అంది సామ్, కొత్త ప్రదేశంలో ఒక స్నేహితురాలు దొరికినందుకు సంతోషపడుతూ.


“మీ అమ్మానాన్నా ఏమీ అనుకోరుగా? నా కోసం స్పెషల్ డిన్నర్ ఏమీ వద్దు, మీరు తినేవే నేను తింటాను” మొహమాటంగా అంది సామ్.

“నో ప్రాబ్లెమ్ సామ్! మా మమ్మీ అన్ని రకాల వంటలు చేస్తుంది. నీకు ఏం కావాలో చెప్పు”

“ఏదైనా పర్వాలేదు, స్పైసీ తినలేను” చెప్పింది.

సాయంత్రం శాలి చెప్పిన అడ్రస్ కిఅక్కడకి చేరుకుంది. శాలి జాబ్ చేస్తోంది అంటే, ఒక మధ్యతరగతి అమ్మాయి అనుకుంది, కానీ ఆ ఇల్లు ఒక పోష్ ఏరియాలో, చాలా పెద్దదిగా ఉంది. ఫోన్ చేస్తే, శాలి లోపలినుంచి పరిగెత్తుకుని వచ్చింది, “స్వాగతం సమంతా!” అంటూ.


లోపల కూడా, మంచి ఫర్నిచర్ తో పెద్ద ఇల్లు. శాలి, “నీకో సర్ప్రైజ్! అమ్మా!” అనగానే ఒకావిడ వచ్చింది. పచ్చటి పసిమి, ఉంగరాల జుట్టు, నుదుట ఎర్రని కుంకుమ, ఆకుపచ్చ రంగు కాటన్ చీరకి, ఎర్ర అంచున్న నేత చీర కట్టుకుని, అందంగా, హుందాగా ఉంది. శాలి “మా అమ్మ శైలజ!” అని పరిచయం చేసింది.


ఆమెనే చూస్తూ, నమస్కారం పెడుతున్న సమంతకి, గుండె వేగంగా కొట్టుకుంది.

“నువ్వు మా అమ్మలా ఉన్నావు కదా? రోజూ నిన్ను చూస్తుంటే, మా అమ్మే గుర్తొస్తుంది, అమ్మకి కూడా నిన్ను చూపిద్దామని ఇంటికి రమ్మన్నాను”


“అమ్మా! నేను చెప్పానే సమంతా! అచ్చం నీలాగా అనిపిస్తుంది కదా! నీ కూతురంటే నమ్మేస్తారు, నీకు అమెరికాలో అక్క చెల్లెళ్లు ఉన్నారా?” సరదాగా అంది శాలి తల్లిని ఆటపట్టిస్తూ. ఉలిక్కిపడి చూసి, “నాకా… నాకు అమెరికాలో ఎవరున్నారు?” అన్నదామె ఖంగారుగా.


“నేను ఇండియాలోనే పుట్టాను శాలీ! నన్ను కన్నతల్లి… కారణమేమిటో తెలీదు కానీ, నేను పుట్టిన రెండురోజుల తర్వాత అనాథల హోమ్‌లో వదిలేసింది. నెలల పిల్లగా ఉన్నప్పుడు నన్ను దత్తత తీసుకున్న అమ్మా,నాన్న, అమెరికా తీసుకెళ్లారు” అంది సామ్, శైలజ మొహంలోకి నిశితంగా చూస్తూ.


“నిజానికి, ఇప్పుడు నేను, నా కన్నతల్లిని వెతుకుతూ వచ్చాను” శైలజ మొహంలో రంగులు మారాయి.


“అయ్యో! నిజంగా అలా వదిలేసిందా! ఆమేమి కన్నతల్లి? ఆమెని వెతకడం ఎందుకు?” కోపంగా అంది శాలి.


“మీ పెంపుడు తల్లితండ్రులు బాగా చూడరా?” ఆందోళనగా ఉంది శైలజ స్వరం.


“మా అమ్మానాన్న, నన్ను చాలా ప్రేమగా పెంచారు. కొంచెం పెద్దయ్యాక, నన్ను పెంచుకున్న సంగతి చెప్పారు. నాకే… వాళ్ళు నన్ను కన్నవాళ్లు కాదనేసరికి, దుఃఖం వేసింది. పెంచిన వాళ్ళు, అంత ప్రేమగా చూసుకున్నారు… కన్నతల్లి నన్ను ఎందుకు వదిలేసిందో తెలుసుకోవాలనిపించింది. లవ్ ఫెయిల్యూర్ అయిందా? డబ్బులేక వదిలేసిందా? నాకు తెలుసుకోవాలనిపించింది” అంది సామ్ దిగులుగా.


“ఏ తల్లీ, ఎంతో గట్టి కారణం ఉంటేతప్ప, తన కన్నబిడ్డని వదిలేయదు. నీ అదృష్టం కొద్దీ మంచి తల్లితండ్రులు దొరికారు. ఇంకా కన్నతల్లి గురించి వెతుకులాట ఎందుకు? హాయిగా మీ దేశం వెళ్ళు” కొద్దిగా గట్టిగా అన్న శైలజ మాటలకి శాలి ఆశ్చర్యపోతే, సమంతకి సమాధానం దొరికింది.


వీళ్లు మాట్లాడుతుండగా, శాలి నాన్నగారు శ్యామ్ వచ్చారు. ఆయన పెద్ద వ్యాపారవేత్త.

ఆయనకూడా సమంతని చూసి ఉలిక్కిపడ్డారు, ఆ ఉలికిపాటు సమంత గమనించింది.

శాలి, సమంతని పరిచయం చేసి, “ఇంత మంచి అమ్మాయిని వదిలేయడానికి, ఆ తల్లితండ్రుల మనసు ఎలా వచ్చిందో?” అంది.


“ఏ పరిస్థితుల్లో అలా వదిలేసారో!” అన్న శ్యామ్‌ని విచిత్రంగా చూసింది సమంత.


అందరూ కలిసి డిన్నర్ చేస్తుంటే శాలి కబుర్లు, వారిద్దరి నవ్వులు ,శైలజ ప్రేమతో చేసే వడ్డనలు… సమంతకి, స్వంత కుటుంబంతో, భోజనం చేసినట్లు అనిపించింది.

డిన్నర్ అయ్యాక, వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తే శాలి ఆశ్చర్యపోయింది.


“సామ్! నాకు తెలీకుండా ఇవన్నీ ఎప్పుడు కొన్నావు?” అంటూ.


శైలజ కూడా సమంతకి బొట్టు పెట్టి ఒక చిన్న గొలుసు ఇచ్చింది.

దానికి చిన్న ఎస్ ఆకారం లాకెట్ ఉంది.


“శాలికి ఇదే గొలుసు ఉంది. నాకు ఇంకో బిడ్డ పుడితే వెయ్యాలని చేయించాను, కానీ ఆ ప్రాప్తం లేకపోయింది. నిన్ను చూస్తే, నాకు నా కూతురిలానే అనిపించింది. నువ్వు వేసుకుంటే నాకు సంతోషం” అని ఆ గొలుసు ఇచ్చింది.


“వావ్!” అంటూ శాలి తన మెడలోని గొలుసు తీసి చూపించింది.


సమంత ఆ గొలుసు తీసుకుని, శ్యామ్ వంక చూసింది, “నీ పేరు,నా పేరు ఒకటే చిన్న స్పెల్లింగ్ తేడా! వేసుకో!” నవ్వుతూ అన్న శ్యామ్ వంక, సంతోషంగా చూసి, ఆ గొలుసు వేసుకుంది.


వెళ్ళిపోతూ, అందరినీ హగ్ చేసుకుని ‘బై’ చెప్పిన సమంతకు, శైలజని హత్తుకున్నప్పుడు కంటనీరు తిరిగింది. తన భుజం మీద శైలజ కంటినీరు పడ్డప్పుడు,

‘తను అనుకున్నది నిజమే! ఈమే నా కన్నతల్లి!’ వచ్చిన పని అయిందన్న తృప్తితో, ఆనందం కలిగింది. అందరి దగ్గరా, అమెరికాకి వస్తామన్న మాట తీసుకుని, హోటల్‌కి వెళ్ళిపోయింది.


రాత్రి, శైలజ రూమ్ లోకి వచ్చాక, “నీ కవల చెల్లి శిరీష, సమంత కన్నతల్లని, అత్యాచారానికి గురైన ఆమె, పాపని కని చనిపోతే, ఆ పాపని మీ అమ్మానాన్న ఆ హోమ్ లో ఇచ్చారని, ఆ గొలుసు శిరీషది అని చెప్పలేదే?” అన్నాడు శ్యామ్ ఆశ్చర్యంగా.


“తన తల్లిని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిన ఆ చిన్న పిల్లకి, తన కన్నతల్లి గురించిన నిజం చెప్తే తట్టుకుంటుందా? నన్ను చూడగానే, తన పోలికలు నాలో చూసి, నేనే తన తల్లిని అనుకుంది. ఒక మంచి తల్లికి పుట్టాను అని సంతోషంగా ఉంది. అలాంటిది కన్నతల్లిని గురించిన నిజం తెలిస్తే తట్టుకుంటుందా? అదృష్టవశాత్తు మంచి తల్లితండ్రులు పెంచుకున్నారు. తల్లి గురించి సమంత ఇంక బాధ పడకూడదు అనుకున్నాను. నాకు,శిరీషకి అమ్మ చేయించిన గొలుసులు అవి. శిరీష కూతురికి ఇవ్వాలనిపించి ఇచ్చాను, నేను తప్పు చెయ్యలేదుగా!” అంది శైలజ కళ్ళనీరు నిండగా.


“లేదు! తప్పిపోయిన అమ్మని, సమంతకి వెతికిచ్చావు. మన శాలికి అక్కని, మనకి ఇంకో కూతుర్ని ఇచ్చావు, శిరీషకు న్యాయం చేశావు, థాంక్యూ“ అన్నాడు శ్యామ్, శైలజ నుదిటి మీద ముద్దు పెడుతూ.


సమాప్తం

 


శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page