top of page
Original.png

భార్య - పార్ట్ 3

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #Bharya, #భార్య, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Bharya - Part 3/4 - New Telugu Story Written By Sudarsana Rao Pochampally Published in manatelugukathalu.com on 17/02/2026

భార్య - పార్ట్ 3/4 - పెద్దకథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి


జరిగిన కథ: శ్రీకంఠ, భవభూతి ఇద్దరూ విశ్రాంత ఉద్యోగులే. ఇద్దరికీ మిత సంతానమే అయినా, శ్రీకంఠకు ఇద్దరు ఆడపిల్లలైతే (శ్రావణి-చతుర), భవభూతికి ఒక కొడుకు (జయంత్), ఒక బిడ్డ (అక్షర).


శ్రీకంఠ భార్య సత్యవతితోనూ, అక్కడ భవభూతి సతీమణి భవానితోనూ ఇద్దరిద్దరే నివసిస్తున్నారు.


తమ కూతురు అక్షరను విదేశంలో ఉంటున్న ఆమె భర్త కార్తీక్ తీవ్రంగా హింసిస్తున్నాడని, శారీరక, మానసిక చిత్రహింసలకు గురిచేస్తున్నాడని కన్నీళ్లతో చెబుతారు భవభూతి దంపతులు.

శ్రీకంఠ, భద్రాచలంతో మాట్లాడి, విష్వక్సేన్ ద్వారా అక్షరను కూడా వెంట తీసుకురమ్మని చెబుదామని ప్లాన్ చేస్తాడు.

ఇక భార్య - పార్ట్ 3 చదవండి.


మాట్లాడుకుంటూనే తిరిగి తిరిగి కొన్ని కూరగాయలు తీసుకొని చీకటి పడేవరకు ఇల్లు చేరుతారు శ్రీకంఠ, భవభూతి.


ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనం చేసి ఏదో వెనుకటి ముచ్చట్లు చెప్పుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తారు అందరూ.


మరునాడు ఉదయమే లేచి స్నానాదికాలు ముగించుకొని అల్పాహారం చేసి శ్రీకంఠ, భవభూతి భద్రాచలం ఇంటికి పోతారు.


వీరి రాకకై ఎదురు చూస్తూ కుర్చీలో కూర్చొని దినపత్రిక తిరగేస్తుంటాడు భద్రాచలం.


"సుప్రభాతం," అనుకుంటూ లోనికి ప్రవేశిస్తారు శ్రీకంఠ, భవభూతి. "శుభోదయం! రండి, రండి," అని కుర్చీలోనుండి లేచి ఇరువురిని ఆహ్వానిస్తూ, "కూర్చోండి," అంటూ కుర్చీలు చూపుతాడు భద్రాచలం.


భద్రాచలం భార్య స్నేహశీలను పిలిచి భవభూతిని పరిచయం చేస్తూ అల్పాహారం సిద్ధం చేయమంటాడు. "అరరె! మీకిప్పుడాశ్రమ వద్దు. మేము ఇంటినుండి వచ్చేటప్పుడే అల్పాహారం, చాయ్ తీసుకొనే వచ్చాము. కావాలంటే మర్యాదకు అరకప్పు కాఫీ ఇవ్వమ్మా స్నేహశీలా," అని చనువుగా అంటాడు శ్రీకంఠ.


"రండి, మా ఇల్లు చూద్దురుగాని," అని లోనికి తీసుకుపోయి స్నేహితులకు ఇల్లంతా కలియదిరిగి చూపిస్తాడు భద్రాచలం. "చాలా బాగుందండి. మంచి వాస్తు పాటించినట్లున్నారు," అని భవభూతి అంటుంటే, "అవునండి," అని క్లుప్తంగా చెబుతాడు భద్రాచలం.


అందరూ ఒక ప్రత్యేక అరలో కూర్చొని, "అసలు మేము వచ్చిన విషయము సవివరంగా చెబుతా, విను," అంటూ ఒకవంక భవభూతి వైపు చూస్తూ, అతని కూతురు అక్షర, ఆమె భర్త కార్తీక్ తో పడే యాతనలన్నీ వివరిస్తూ, "అక్షరను ఎట్లైనా ఇండియాకు తీసుకురావాలి. దానికి నీ సహకారం అవసరము," అంటాడు శ్రీకంఠ.


భద్రాచలం ఇదంతా విని, "నేనేమి చేయగలనో అది మీరే దాచుకోకుండా సెలవీయండి," అని మర్యాదగా అడుగుతాడు.


"ఏమీలేదు. మీ విష్వక్సేన్, అతనికి కాబోయే ఇల్లాలు పెండ్లికి ఇండియాకు వస్తున్నారంటివి కదా? నేను చెప్పిన విషయాలన్నీ అతనికి వివరించి, అక్షర భర్త కార్తీక్ వాళ్ళు ఉంటున్న ఇంటికి పోయి పరిచయం చేసుకొని, ఏదో సాకు చెప్పి అక్షరను వాళ్ళ వెంట తీసుకురమ్మను. ఇదే మేము నీ మీద మోపే బృహత్కార్యము," అంటాడు శ్రీకంఠ.


"ఎంతమాట! నాకూ మీ ఆలోచన సబబనే తోస్తున్నది. నేనీరోజే మా విష్వక్సేన్‌కు ఫోన్ చేసి చెప్పి కార్యము సాధించమంటాను. ఇది నా స్వంత పనే అనుకుంటాను," అని భవభూతి వైపు చూస్తూ, "మీరు దిగులు పడకండి. ఆడపిల్లల బాధలేమిటో నాకు బాగా తెలుసు. మా తోబుట్టువులలో ముగ్గురు ఆడపిల్లలే. వాళ్ళకూ ఇటువంటి బాధలు తోడై అవస్థలు పడ్డవాళ్ళే. నేను తప్పక మీ ఇబ్బందులు తొలిగేటట్లు చూస్తాను," అని భవభూతి చేతిలో చేయివేసి భుజం తట్టుతాడు భద్రాచలం.


"మీ విషయాలలో నేను ఎక్కువ కల్పించుకోలేను కాని, నా భావనలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి వారిలో అన్యోన్యత లోపించడమొక కారణమైతే, అహంకారం దానికి తోడైతది. భర్తలోని సహజ క్రూరత్వం దానికి ఆజ్యం పోస్తుంది. భార్య ఎంత సర్దుకపోయే స్వభావమున్నదైనా, భర్త పెట్టే హింసలకు భరించలేని పరిస్థితిలో ఖిన్నురాలై, ఎదురించలేని స్థితిలో భార్య ఏదో అఘాయిత్యానికి కూడా పూనుకోవడము కద్దు."


"ఈ విషయాలు మా ఇంట నేననుభవించిన కాలమునాటివి. తలచుకుంటేనే మనసు గగుర్పొడిచే సన్నివేశాలెన్నో మేము చవిచూశామండి భవభూతిగారు. మించిపోయిందేమీ లేదు. మా విష్వక్సేన్‌కు కొన్ని అనుభవాల అవగాహన ఉన్నది. నా కొడుకని గొప్పలకు పోనుగాని, 'కార్యసాధనలు పట్టుపట్టరాదు, పట్టి వదలరాదు' అనే మనస్తత్వము వాడిది. రేపే మీరు వాళ్ళిక్కడికి పయనమయ్యే శుభవార్త వినవచ్చు. మీరు నిశ్చింతగా ఉండండి."


"మీ అక్షర వచ్చేవరకు మీరిక్కడే ఉండి శ్రీకంఠ ఆతిథ్యము పొందుతూ ఉండండి. ఇంకా చెప్పాలంటే మా వాణి పెండ్లి జరిగేంతవరకు ఉండి, నాలుగక్షితలు వేసి మా ఆతిథ్యము స్వీకరించిన తరువాతనే తిరుగుపయనానికి ఆలోచించండి," అంటాడు భద్రాచలం.


"మీరంత హామీ ఇచ్చిన తర్వాత నా దిగులు పటాపంచలైపోయినట్టు, నా మనసిప్పుడు తేలికగా ఉన్నది," అంటాడు కొంత నవ్వుముఖంతో భవభూతి.


"ఈ జాడ్యము అంటే భార్యలను వేధించడము, హింసించడము, అదుపులో ఉంచుకోవడము ఇవాల్టిది కాదు, కృతయుగము నుండి తరతరాల భార్యల తలరాత. జమదగ్ని రేణుకను, గౌతముడు అహల్యను దండించడము, శపించడము లాంటి ఉదంతాలు పురాణాలలో చదువుతూనే ఉన్నాము."


"మానవ సమాజములో ఇంకా 90 శాతం జనులు పూర్వాచారాలు వదలకుండా, పెళ్ళైన ఆడపిల్లలకు ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. వాళ్ళ గ్రహచారం చాలక భర్తను కోల్పోతే, ఈ కాలములో కూడా 'విధవ', 'ముండ' అని సంబోధించడము, ముత్తైదువులతో సమానంగా పేరంటాలలో పాల్గొనగూడదని, తెల్ల చీరలే ధరించాలని, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకోవద్దని, తలలో పూలు, చేతికి గాజులు, కాళ్ళకు మట్టెలు లాంటి అలంకారాలకు దూరంగా ఉండాలని, పునర్వివాహమునకు అర్హులు కారని రకరకాల నిబంధనలతో సాటి మగువను వేధించడము చూస్తున్నాము. అదియు గాక ఒకవేళ సంతానము కలుగక పోతే ఆ స్త్రీని 'గొడ్రాలు' అని, ఆమె ముఖము చూస్తేనే పాపమని, ఆమె కూడా శుభకార్యాలలో ఎదురు రాకూడదని, అట్లా వస్తే అరిష్టమని, అటువంటి దురదృష్ట మహిళలు ఆత్మన్యూనతా భావంతో కుమిలి కుమిలి ఏడ్చేటట్టు సాటి స్త్రీలే వ్యవహరించడము సంఘములో ఆవరించిన చీడ."


"పూర్వ కాలమంటే చదువు, సంస్కారము కొదవగా ఉండే."


"ఇప్పుడేమి పోయేకాలమో, చదువుకున్న ఆడపిల్లలు కూడా పెద్దలను ఎదిరించలేక ఈ దుష్ట సంప్రదాయానికే తలొగ్గుతున్నారు."


"మగపిల్లలు గూడ యుక్తాయుక్తాల విచక్షణా జ్ఞానము కోల్పోయి భార్యలను వేధించడము, హింసించడము, వరదక్షిణ బాపతు డబ్బులు తెమ్మని పోరు పెట్టడము, తల్లి, కొడుకు, అక్కాచెల్లెళ్ళు అందరూ కలిసి భార్యను హింసించడము, ఇంకా ఓ అడుగు ముందుకేసి ఇంట్లోనుండి వెళ్ళిపొమ్మనడము లేదా ప్రాణాలు కూడా తీయడము, విసిగి తామే ప్రాణాలు తీసుకునేటట్లు చేయడము రోజు ఎక్కడో ఒక దగ్గర జరుగుతున్న ఘాతుకాలు."


"మన దగ్గర చట్టాలు సరిగా లేకపోవడము, ఉన్న చట్టాలను సక్రమంగా వినియోగించలేకపోవడము,"


"సంప్రదాయాల జిడ్డు వదలకు పోవడము మున్నగు కారణాల వలన భార్య అనబడే ఇంతులు బలవుతున్నారు," అంటూ భద్రాచలం కూడా సుదీర్ఘంగా విపులీకరిస్తాడు.


"భార్య అంటే పురుషుని జీవిత భాగస్వామి, ఒక మంచి స్నేహితురాలు, ఒక గృహస్తురాలు, ఒక దేవతా స్వరూపిణి, వంశాభివృద్ధికి మూలము లాంటి అర్థాలే మరచిపోయి, భార్య అంటే ఒక ఆటవస్తువు, ఒక పని మనిషి, ఒక శయనాగార పడక ఇత్యాది భావనలతో భర్త వ్యవహరించడము గర్హనీయము, ఆక్షేపణీయము."


"స్త్రీ, మహిళ, నారి అని ఎన్ని పేర్లతో సంబోధించినా ఆడవారు ఆకాశంలో సగము. అది నిజము."


"మానవ జన్మలో స్త్రీదే ఉత్కృష్ఠమైన జన్మ. ఆమె బహురూపురాలు, అంటే దైవ సమానురాలు. ఎందుకంటే భగవంతునికి కూడా బహురూపులుంటాయి."


"ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లెగా, ఒక ఇల్లాలుగా, ఒక ముద్దులొలికే బిడ్డగా అన్ని రూపాలలో అనురాగము పంచేదే మగువ. సృష్టికి మూలం మగువ. సృష్టిని నడిపేది మగువ. సృష్టికి అందాన్నిచ్చేది మగువ, సృష్టికి ఊపిరి పోసేది మగువ. మగువ లేనిది మానవ మనుగడ లేదు. అంతేందుకు, ఏ జీవి అయినా ప్రకృతిలో ఆడ అనే పదముతోనే పరిఢవిల్లుతుంది."


"అటువంటి స్త్రీని గౌరవించుట, ఆదరించుట ప్రతి పురుషుని విధి."


వినా స్త్రీయా జననం నాస్తి


వినా స్త్రీయా గమనం నాస్తి


వినా స్త్రీయా జీవం నాస్తి


వినా స్త్రీయా సృష్టియేవ నాస్తి


యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః


యత్ర నార్యస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః క్రియాః


"ఎక్కడ స్త్రీలను పూజిస్తారో, గౌరవిస్తారో అక్కడ దేవతలుంటారు."


"అదే స్త్రీలను గౌరవించని చోట రాక్షసత్వముంటుంది."


"కాలానుగుణంగా మనుషులు మారాలి, మనస్తత్వాలు మారాలి, ఆచారాలు మారాలి, సాంప్రదాయాలు మారాలి. ముఖ్యంగా, మేము భార్యాభర్తలమైనా వివాహ బంధము ఒక్కటి చేసింది, దానికి కట్టుబడి ఉండి, జీవిత మార్గం సుగమం చేసుకుంటూ, పుత్ర పౌత్రాభివృద్ధితో, ప్రకృతి ప్రసాదించిన ఆయుష్షు ఉన్నంతవరకు సుఖ సంతోషాలతో గడుపుదామనే ధ్యాస ఉంచుకోవాలి."


"అది అధికమించిననాడు ఇలాంటి ఇక్కట్లకు గురి అవడమే కాక, సంఘములో మర్యాద కోల్పోయి దుష్టుడిలా చలామణి కావడము తథ్యము," అంటూ ముగిస్తాడు భద్రాచలం.


భద్రాచలం చెప్పడమంతా వినుకుంటూ, ఆయన చెప్పడము ముగియగానే, ఇద్దరు మిత్రులు ఏకకాలములో ఒక నిట్టూర్పు విడుస్తారు, ఆయన చెప్పిందంతా వాస్తవమే కాదా అని తలపోస్తూ.


"మీరు చెప్పినదాంట్లో లవలేశము అవాస్తవము లేదు," అంటూ శ్రీకంఠ అంటూండగానే, "అవునండి, మా గ్రహచారమే ఈ పరిస్థితికి దారి తీసింది. మా దోషమేమీ లేకున్నా ఈ రోజు పరిస్థితి మమ్ముల ఏడిపిస్తున్నది. ఇక మీమీదనే కొండంత ఆశ పుట్టుకొచ్చింది," అంటాడు భవభూతి.


"సరే భద్రాచలం, ఇక మేము పోయివస్తాము. నీ ఫోన్ కొరకు ఎదురుచూస్తూ ఉంటాము," అని లేచి భద్రాచలం చేతిలో చేయికలుపుతాడు శ్రీకంఠ.


"మీరున్నంతకాలం అప్పుడప్పుడు వచ్చి మా గృహము పావనం చేయండి. ఈసారి వచ్చేటప్పుడు మీ శ్రీమతిని కూడా తీసుకురండి," అంటూ భవభూతి భుజము మీద చేయివేసి బయటి వరకు సాగనంపుతాడు భద్రాచలం.


ఇంటికి చేరగానే ఆత్రతతో ఎదురు చూస్తున్న భవానికి విషయమంతా వివరిస్తాడు భవభూతి. భవాని కూడా సంతృప్తి చెందినదై, "ఆ దేవుని దయ!" అంటూ రెండు చేతులు ముడిచి పైకి చూస్తుంది.


ఆ రోజు రాత్రి అందరూ భోజనాలు చేసి ఏదో భారము దిగినట్టుగా అనుకొని నిమ్మళంగా నిదురపోతారు.


రెండు రోజులు గడుస్తుంది. భద్రాచలం నుండి ఏ సమాచారము తెలియక కొంత దిగులుకు లోనై భవభూతి ఉండబట్టలేక శ్రీకంఠతో, "కారణమేమై ఉండవచ్చు?" అని అడుగుతాడు. కుర్చీలోనుండి లేస్తూ, "పద, మనమే భద్రాచలం గారింటికి పోదాము, సంగతేమిటో తెలుసుకుందాము," అంటుండగానే, భద్రాచలమే వీళ్ళింటికి వస్తాడు. భవభూతికి, భవానికి ఆత్రుత ఎక్కువై, "ఏమి వార్త తెచ్చాడో?" అని భద్రాచలం వైపు చూస్తూ, "కూర్చోండి," అని కుర్చీ చూపిస్తాడు భవభూతి, శ్రీకంఠ కన్నముందే.


"అయ్యా భవభూతిగారు, మీరు నక్కను తొక్కి వచ్చినట్టున్నారు. ఇక మీ ఆవేదన తొలిగినట్టే. వచ్చే వారమే మీ అక్షరను తీసుకొని మా విష్వక్సేన్, కాబోయే మా కోడలు శంపాలత ఇండియాకు వస్తున్నారు. వాళ్ళొచ్చిన తరువాతే తెలుస్తుంది. మావాడు ఏమి మంత్రమేసి మీ అల్లుడిని వప్పించాడో," అని.



సంతోషము పట్టలేక భార్యాభర్తలిద్దరూ రెండు చేతులు జోడించి 'మీ మేలు మరువము' అంటూ, కళ్లలో నిండిన ఆనందభాష్పాలు తుడుచుకుంటారు.


పూర్వకాలంలో ఏ మహానుభావుడు ప్రవేశపెట్టాడో ఏమో కాని, ఈ వరదక్షిణలు - ఇచ్చిపుచ్చుకొనుడు - దుష్ట సంప్రదాయాలు - పనికిరాని ఆచారాలు - ఇవన్నీ ఆడపిల్లలకు శాపమై, భార్య అంటే ఒక ఆదాయ మార్గమనే భావన బలపడి, మూర్ఖపు భర్తలు వేధించి భార్యలకు బ్రతికుండగానే నరకము చూపుచున్నారు. ఇక మీ కార్తీక్ కూడా అదే కోవలోని వాడై, మీ అక్షరను కేవలము డబ్బులు తేవాలనే వేధించినట్టు తెలుస్తున్నది. మావాడేదో సర్దిచెప్పడమే కాక, కొంత బెదురుపెట్టినట్లున్నది. అప్పుడే అతడు తోవకొచ్చి, 'వీళ్ల వెంట తీసుకపొమ్మని' అన్నాడట.


'ఇంకొక మాట చెబుతున్నా... చాలా మంది ఎదుటివారి ముఖకవళికలు, వాక్చాతుర్యము, తీయని పలుకులు చూసి 'వాడెంతో మంచివాడు, బుద్ధిమంతుడు' అని మోసపోతారు. ఎట్లంటే...'


"ముఖం పద్మ దళాకారం వచశ్చందన శీతలం


హృత్కర్తరి సము-చాతి వినయం ధూర్త లక్షణం"


"సుందర ముఖ పద్మములు


నందంబగు పలుకులందు నమృత జల్లుల్


డెందంబులు చురకత్తులు


ముందుగనతివినయమొలయు మూర్ఖుల్ ధూర్తుల్."


'ఇది అంటుండగానే అక్షరాలా నిజమండీ భద్రాచలం గారూ! నేను మోసపోయిందక్కడనే. అప్పుడు నా బుద్ధి పని చేయలేదు, నా ఖర్మ!' అంటాడు భవభూతి.


పాపం, మీ అక్షర అడకత్తెరలో పోకచక్కలా నలిగి చాలా ఇబ్బంది పడినట్టున్నది. డబ్బుల కొరకు మిమ్ములను అడగలేక, భర్తకు సమాధానము చెప్పలేక.


"విధి వ్రాత ఎట్లున్నదో -


హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి


లలాట లిఖితా రేఖా పరిమాష్టుం నశక్యతే"


'మనము మానవ మాత్రులము. సహనమొక్కటే దారి,' అంటాడు భద్రాచలం.


'ఇప్పుడైతే ఆమెను ఇక్కడికి రానీయండి. ఆపైన తీరికగా ఆలోచించండి, సరేనా భవభూతిగారూ? ఇక తృప్తేనా? ఈ రెండు రోజులు ఆలస్యానికి కారణము మీ అల్లుడు కార్తీకును దారికి తేవడానికే సరిపోయింది. ఏమైతేనేమి, కార్యము సఫలమైంది కదా!' అనుకుంటూ కుర్చీలోంచి లేస్తూ, తానే అంటాడు, 'నాకు కొన్ని అత్యవసర పనులు ఉన్నవి. ఇప్పుడు కాఫీ లాంటి మర్యాదలేమి పెట్టుకోవద్దు' అని బయటికి పోయి చెప్పులు తొడుక్కుంటూ 'శ్రీకంఠా! మళ్ళీ కలుస్తాను' అంటూ వెళ్ళిపోతాడు భద్రాచలం.


వారం రోజులు శ్రీకంఠ ఇంటిలోనే మకాం వేసి, భవభూతి, భవాని అప్పుడప్పుడు భద్రాచలము ఇంటికి పోయివస్తూ కాలం గడుపుతారు, అక్షర రాక కోసం ఎదురు చూస్తూ.


వారం తరువాత ఒకరోజు తెల్లవారుఝాముననే ఎవరో తలుపు తట్టినట్టు వినబడగానే, నిద్రలోనుంచి అప్పుడప్పుడే మేల్కొంటున్న శ్రీకంఠ తలుపుతెరిచి ఆశ్చర్యానికి గురౌతాడు. 'బాగున్నారా అంకుల్?' అంటూ ముందుగానే ప్రశ్నిస్తుంది అక్షర. 'రా అమ్మా! లోనికి రా. ఇంక మీ అమ్మానాన్నలు లేవనట్టున్నది' అనుకుంటూ 'భవభూతీ! ఎవరొచ్చిన్రో చూడు' అంటూ సంతోషంగా మేల్కొల్పుతాడు శ్రీకంఠ. ఇక భవభూతి ఆనందానికి హద్దులు లేకుండా బిడ్డను అక్కునజేర్చుకొని తలపై నిమురుతూ కుశల ప్రశ్నలు వేస్తుంటాడు.


వీళ్ళ మాటలు చెవిన పడగానే ఉలిక్కిపడినట్టు లేస్తుంది భవాని. 'హమ్మ! మా అమ్మ వచ్చింది' అంటూ


ఆదరాబాదరా శిగ ముడివేసుకొని పరుగు పరుగున వచ్చి బిడ్డను కౌగలించుకుంటుంది. ఇంతలో శ్రీకంఠ భార్య సత్యవతి వస్తూ 'బాగున్నావా అక్షరా? ప్రయాణం బాగా సాగిందా? ఇప్పుడు నీవెంట ఎవరొచ్చిన్రు?' అని అడుగగానే 'విష్వక్సేనే ఇక్కడ దింపి శంపాలతతో వెళ్ళిపోయిండు. శంపాలతను వాళ్ళ తల్లిగారింటిలో దింపి వాళ్ళింటికి పోతాడట' అంటది అక్షర.


శ్రీకంఠ ఇంట్లో ఆ రోజు పండుగ వాతావరణము నెలకొంటది.


'అసలు విషయము శ్రీకంఠా! మొదలు మనము వెంటనే భద్రాచలము గారింటికి పోయి కృతజ్ఞతలు తెలియజేసి, మన అక్షరను తీసుకరాను విష్వక్సేను భరించిన విమాన వ్యయము వాళ్ళకు చెల్లించే వరకు నా మనసు కుదుట పడదు. పద, పోదాము!' అంటాడు భవభూతి. 'సరే, పోదాము పద' అని శ్రీకంఠ తయారై ఇద్దరూ భద్రాచలము ఇంటికి పోతారు.


భద్రాచలము కూడా తన ఏకైక కొడుకు రావడముతో ఎంతో సంతోషముతో ఉండి, శ్రీకంఠ, భవభూతి రాకతో 'రండి మహానుభావా! ఇప్పుడు మీ మనసు తృప్తి చెందిందా? ఏమంటుంది మీ అక్షర?' అని అడుగుతూ, వాళ్ళను కూర్చోమని కుర్చీలు చూపి, 'స్నేహశీలా! ఇప్పుడైనా మనవాళ్ళకు చాయ, పలహారము తీసుకరా' అంటూ, 'ఇప్పుడైతే ఉత్తగా పోనిచ్చేది లేదు' అని చనువు కనబరుస్తూ స్నేహితులిద్దరి వైపు చూస్తాడు భద్రాచలం.


'సరే, కానియ్యండి! మొదట నా కృతజ్ఞతలు స్వీకరించండి' అని ఒక మిఠాయి డబ్బా అందిస్తాడు భవభూతి.


స్నేహశీల తెచ్చిన ఫలహారము, చాయ ముగించుకొని 'మీ విష్వక్సేనుడేడీ?' అని అడుగుతాడు భవభూతి.


'వాడు రాత్రంతా ప్రయాణము చేసి అలసిపోయినట్టున్నాడు. మేము సాయంత్రము వస్తాము' అంటూంటే, 'పర్వాలేదు కాని, నాదొక విన్నపము ఏమిటంటే... మా అక్షరను తీసుకరావడానికైన ఖర్చులెన్నైనవో తెలిపితే ఇప్పుడే ఇచ్చి పోదామనుకున్న. సరే, సాయంత్రము మీరొస్తానంటున్నారు కదా, మేము గూడా మీతోపాటే మీ ఇంటికి వచ్చి సొమ్ము చెల్లించి పోతాము' అంటాడు భవభూతి. 'సరే, చూద్దాము. తొందరెందుకు పడుతారు? మీ వసతి ప్రకారమే కానియ్యండి. ఈ లోపల మా విష్వక్సేనును కూడా సంప్రదిస్తాను' అంటుంటేనే, 'మంచిదండీ! మీకు కోటిన్నొక్క ధన్యవాదాలు' అంటూ సెలవు తీసుకుంటారు మిత్రులిద్దరు.


ఆ రోజు సాయంత్రము రమారమి విమాన టికెట్టు వ్యయము లెక్కించుకొని భవభూతి జేబులో పెట్టుకుంటూ, 'శ్రీకంఠా! పద, భద్రాచలము గారింటికి పోదాము. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు నావల్ల ఇబ్బంది తప్పదు' అనగానే, 'మంచి ఆలోచనే వచ్చింది నీకు. మరేమిటి? మనలో మనకు ఇబ్బందేమిటి? అట్ల ఎప్పుడూ అనుకోకు' అని శ్రీకంఠ 'పద, పోదాము' అంటూ బయలుదేరుతారు.


మార్గమధ్యంలోనే భద్రాచలము విషణ్ణవదనంతో మిత్రులకెదురై, 'పదండి, మీ ఇంటికే పోదాము. నా మనసేమి బాగులేదు' అనుకుంటూ చేతి రుమాలులో కళ్ళు తుడుచుకుంటాడు భద్రాచలము.


అతని ముఖకవళికలు గమనించి శ్రీకంఠ విస్తుపోతూ, 'అదేమిటి భద్రాచలం? నీ ముఖమెందుకట్లా పాలిపోయింది? ఈ రోజు ఎంత సంతోష దినము! అంతా అగమ్యగోచరంగా ఉన్నది. సరే, పదండి, ఇంటికి పోయి మాట్లాడుకుందాము' అనుకుంటూ ముగ్గురు మిత్రులు వెనుదిరుగుతారు.


ఇంటికి చేరగానే, ఒక అరలో తలుపులు దగ్గరేసి కుర్చీలో ఇద్దరు మిత్రులను కూర్చోమని, తాను మాత్రము లోనికి పోయి వీళ్ళకు మంచినీళ్ళు తేవడానికి భార్య సత్యవతిని రెండు గ్లాసులలో నీళ్ళు ఇయ్యమంటాడు.


సత్యవతి నీళ్ళు తెచ్చుకుంటూ, 'అక్షర పొద్దుటినుండి ఏడుస్తున్నది. తాను తిరిగి కార్తీక్ దగ్గరికి ఎట్టి పరిస్థితులలో కూడా పోనంటూ కుములుతున్నది. పొద్దుటి నుండి అన్నము కూడా తినలేదు. వాళ్ళమ్మ భవాని ఎంత సముదాయించినా ఆమెకు దుఃఖము ముంచుకొస్తున్నది. పాపం, భర్త ఎన్ని ఇడుములకు గురిచేశాడో ఏమో!' అంటూ నీళ్ల గ్లాసులు భర్తకందిస్తది సత్యవతి.


వీళ్ళు లోపల మాట్లాడుకుంటుంటే బాధాతప్త హృదయుడైన భద్రాచలం, బాధనుండి ఉపశమనము పొందిన భవభూతి వింటుంటారు.


ఇంతలో శ్రీకంఠ నీళ్ళు తెచ్చి టీపాయ్ మీదపెట్టి 'తీసుకోమంటాడు' ఇద్దరిని.


భవభూతి లోపలికి పోయి బిడ్డ పరిస్థితికి కలత చెందుతూ, 'అమ్మా అక్షరా! నీ మనసులో ఉన్నట్లే చేద్దాము. నువ్వు ఏమి బెంగ పెట్టుకోవద్దు. ఆ కండ్లు తుడుచుకొని రా, భద్రాచలము అంకుల్ వచ్చిండు, నీకు పరిచయము చేస్తా' అని అక్షరను వాళ్ళు కూర్చున్న అరలోనికి తీసుకపోతాడు భవభూతి. అక్షర భద్రాచలానికి పాదాభివందనం చేస్తుంది. భద్రాచలము అక్షర తలపై చేయి పెడుతూ 'సుఖంగా ఉండమ్మా' అని దీవిస్తాడు. 'విష్వక్సేన్ అలసట తీర్చుకుంటున్నాడా అంకుల్?' అని అడుగుతుంది అక్షర, ఏమి మాట్లాడాలో ఊహకందక.


'అవునమ్మా! వాడు అలసట తీర్చుకొని తల్లితో మాట్లాడుతున్నాడు' అంటాడు భద్రాచలం, తనకూ ఏమి మాట్లాడాలో తోచని స్థితిలో.


'సరే అంకుల్' అంటూ లోపలికి వెళ్ళిపోతుంది అక్షర.


'ఇక చెప్పు భద్రాచలం! నువ్వు అంతగా మనోవ్యథ చెందడానికి అంత బలమైన కారణమేమిటి?' అంటాడు శ్రీకంఠ.


'నీకు దాచేదేమున్నది?' అని కొంత సణుగుతుంటే అది గమనించిన భవభూతి లేచి, 'నేను ఇప్పుడే వస్తా, మా అక్షరతో మాట్లాడేదున్నది' అని లోపలికి పోబోతాడు భవభూతి. 'మీరు కూడా ఉండండి భవభూతిగారూ! నా ఆవేదన వినండి' అంటూ, 'ఈ రోజు మా విష్వక్సేన్ వచ్చిండను సంతోషము ఒక గంటపాటు మాత్రమే మేమనుభవించింది. తరువాత ఒక పిడుగులాంటి వార్త, అదేమిటంటే... మా విష్వక్సేనుకు కుదిరిన శంపాలత ఇప్పుడు వీణ్ణి చేసుకోనంటున్నదట. ఆమె తండ్రి వచ్చి నా రెండుచేతులు పట్టుకొని వలవల ఏడుస్తూ 'నా దురదృష్టము నా బిడ్డ రూపున నన్ను ఏడిపిస్తున్నది. అది ఇంకెవరికో మనసిచ్చినదట. ఏమి చేయాలి? నా ఖర్మ!' అని ఆగకుండా విలపిస్తుంటే నా కండ్లు కూడా చెమ్మగిల్లాయంటే నమ్మండి. అది గాని మా విష్వక్సేన్, వాళ్ళ అమ్మ చెందిన ఆవేదన ఇంతా అంతా కాదు. నేనీ పరిస్థితిలో ఏమి చేయాలో తోచక, అక్కడ ఉండలేక మీ ఇంటి బాట పట్టిన' అని వాపోతాడు భద్రాచలం.


'మా వాడిదొకటే పొరపాటు. ఆ శంపాలత పేరు, రూపు మాత్రమే చూసి వలలో పడ్డాడు. ఆమె గుణగణాల జోలికి పోక బోల్తా పడ్డాడు. ఇంతకు ముందే నేనొక సామెత చెప్పిన కదా, ముఖం పద్మదళాకారం అని. అది చూసి మోసపోవడము మా వంతైంది.'


భద్రాచలము మాటలకు స్నేహితులిద్దరూ బాధ ప్రదర్శిస్తూ ఏకకంఠముతో 'ఇప్పుడు చింతించి ప్రయోజనము లేదు. మొదట మీ విష్వక్సేన్‌ కలత చెందకుండా ఊరడించండి. దేవుడు ఏది చేసినా మన మేలుకొరకే' అను సామెత ఊరికే పోలేదు అంటారు మిత్రులిద్దరు.


ఇంతలో అక్షర లోపలినుండి చాయ, బిస్కిట్లు తెచ్చి టీపాయ్ మీద పెట్టి, 'తీసుకోండి అంకుల్' అంటూ లోపలికి వెళ్ళిపోతుంది.


'చాయ్ తీసుకో భద్రాచలం! జరిగిపోయింది జరిగిపోయింది. ముందు కర్తవ్యమేమిటి అని నిదానంగా ఆలోచిస్తే పరిష్కారము దొరకక పోదు' అని చాయ కప్పు అందిస్తాడు శ్రీకంఠ.


ముగ్గురు స్నేహితులు కొంత సేపు మౌనంగా ఉండగా, వాళ్ళలో శ్రీకంఠ ఏదో ఆలోచనకు తట్టిన వాడిలా దిగ్గున మౌనమునుండి బయటకొచ్చి, 'మీ ఇద్దరికీ నేనొక చక్కని పరిష్కార మార్గమాలోచించి చెబుతా. కాని ఒక షరతు' అనగానే భద్రాచలము సంభ్రమముతో శ్రీకంఠ వైపు చూస్తాడు. 'దానికి రేపు మేమందరము మీ ఇంటికి వస్తాము. మీరు ఆదర్శాలను విడనాడితే నేను చెప్పే పరిష్కార మార్గము సుగమమైతది' అంటాడు. దానికి ఇద్దరూ తలలూపుతూ, 'తలకాయ పోతున్నప్పుడు చెవుల పోగులకారాట పడ్డట్టు ఆ ఆదర్శాల జోలికేమీ పోదలుచుకోలేదు. మేము ఈ ఇడుములనుండి గట్టెక్కి మా పిల్లలు సౌఖ్యంగా ఉంటే అదే చాలు. ఇక సెలవు. మీ రాకకై వేయికండ్లతో ఎదురుచూస్తాము. ఇంకొక విన్నపమేమంటే, మీరందరూ భోజనాలకే మా యింటికి రావాలి' అని చెప్పి వెళ్ళిపోతాడు భద్రాచలం, కొంత బరువు దిగిన మనసు కలవాడై.


భద్రాచలము వెళ్ళిపోగానే 'భవభూతీ! భవానిని ఇక్కడికి పిలువు. ఒక మాట చెప్పేదున్నది' అని శ్రీకంఠ అనగానే, 'ఏదో మంచి మాట చెప్పేటట్టున్నది' అనుకుంటూ లోపలికి పోయి భవానిని తీసుకవస్తాడు భవభూతి.


భవానికి వీరు ఎందుకు పిలిచినారో అర్థముకాక ప్రశ్నార్థకంగా శ్రీకంఠ వైపు చూస్తుంది.


శ్రీకంఠ అడుగుతాడు, 'భవానీ! ఇంతకు ముందు సత్యవతి నాకన్నీ చెప్పింది. దాచుకోకుండా నాకొక మాట చెప్పు. మీ అక్షర కార్తీక్ ను ఎలాగూ వద్దంటున్నది కదా? మరి ఆమె జీవితమార్గము మనమే ఆలోచించాలి. అంటే ఆమెకు మళ్ళీ పెళ్ళి చేయాలి. కాని ఇదివరకు కార్తీక్ కు అంటగట్టినటువంటి పొరపాటు మళ్ళీ చేయకూడదు.


భవభూతీ! మీరిద్దరూ సావధానంగా వినండి. ఇంతసేపు భద్రాచలము తన కొడుకు వివాహ ప్రయత్నము వికటించినట్టు చెప్పాడు కదా? ఆయన కొడుకు విష్వక్సేన్‌కు పెళ్ళైతే చేయక తప్పదు. మీరేమనుకోకుంటే నాదొక ప్రతిపాదన. ఏమీలేదు, మీ అక్షరను విడాకులు తీసుకొమ్మని, ఆమెను విష్వక్సేన్‌కు ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటె విష్వక్సేన్ ను నేను చిన్ననాటి నుండి ఎరుగుదును. చాలా బుద్ధిమంతుడు. ఆకార పుష్టి ఉన్నవాడు. ఆలోచించండి. ఈ నా ప్రతిపాదన అక్షరకు కూడా తెలియ పరుచండి. సత్యవతి కూడా మీకు తోడుగా ఉంటది' అని ముగిస్తాడు శ్రీకంఠ.


భార్యాభర్తలిరువురూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ, 'ఇదేదో బాగున్నది' అను తలంపుతో, 'మీరు చెప్పిన ఉపాయము బాగున్నది. అక్షర ఏమంటదో... మీరన్నట్లే ఈ రాత్రి ఆమెతో సత్యవతి, నేను కూర్చొని మాట్లాడుతాము' అంటుంది, శ్రీకంఠ ప్రతిపాదన అంగీకారమన్నట్లుగా ద్యోతకపరుస్తూ భవాని.


ఇంకా ఉంది..

భార్య - పార్ట్ 4 త్వరలో


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


bottom of page