అక్షరమే నా తోడు
- Madhupatra sailaja Uppaluri

- 1 minute ago
- 6 min read
అక్షరమే నా తోడు, Telugu literary story, Telugu writers' story, emotional Telugu story, Padmaja story, Telugu literature, Telugu kavithalu, Telugu sahityam, women writers Telugu, inspirational Telugu story

Aksharame Na Thodu - Telugu Emotional Story | Madhupatra Sailaja Uppaluri
అక్షరమే నా తోడు - తెలుగు భావోద్వేగ కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి
Published in manatelugukathalu.com on 26/05/2026
సాహిత్యాన్ని ప్రాణంగా భావించిన రచయిత్రి పద్మజ జీవితాన్ని ఆవిష్కరించే హృదయస్పర్శి కథే “అక్షరమే నా తోడు”. అక్షరాలను తన పిల్లలుగా భావించి, జీవితంలో ఎన్నో కోల్పోయినా సాహిత్యాన్ని మాత్రం వదలని ఓ మహత్తర వ్యక్తిత్వాన్ని ఈ కథ భావోద్వేగంగా చూపిస్తుంది. రచయిత్రి భారతితో కలిసి పాఠకుడిని కూడా ఒక అద్భుతమైన సాహిత్య ప్రయాణంలోకి తీసుకెళ్తుంది.
‘అక్షర’ అనే పేరు ఉన్న ఇంటి ముందు ఆటో దిగింది భారతి. చేతిలోని బ్యాగులో తాను రాసిన ‘అక్షరమే నా తోడు’ అనే కవితా సంపుటి, నోట్‌బుక్, ఓ పెన్ను ఉన్నాయి. భారతికి పెద్దగా శ్రమ పడకుండానే పద్మజామేడంగారి ఇల్లు దొరికింది. “హమ్మయ్య! సగం పని పూర్తయినట్లే” అనుకుంటూ కాలింగ్‌బెల్ మ్రోగించింది. ఇంటిలో నుండి దాదాపు 37 సంవత్సరాల వయసున్న యువకుడు వచ్చి తలుపు తీశాడు. “మీరు…” అంటూ ఆమెను “ఎవరు కావాలండి?” అని అడిగాడు.
“నా పేరు భారతి. పద్మజామేడంగారు లేరాండి? మీ పేరు..?” అంటూ సంశయిస్తూ అడిగింది భారతి.
“నా పేరు శేఖర్. పద్మజామేడం మా పిన్నిగారేనండి. ప్రస్తుతం ఇక్కడ ఉండటం లేదు. ఇల్లు ప్రస్తుతం మా అధీనంలో ఉంది” దర్పంగా అన్నాడు.
అదేమిటండి, ఒక టీవీ ఇంటర్వ్యూలో పద్మజామేడంగారు మాట్లాడుతూ “నాకు అక్షరం అంటే చాలా మక్కువ. అందుకే నా ఇంటికి ‘అక్షర’ అని పేరు పెట్టుకున్నాను. ఆ ఇంట్లోని ఒక్కొక్క గదికి ఒక్కొక్క కవి పేరు పెట్టి, తీర్చిదిద్దుకున్నాను. నా కలంతో శ్రీశ్రీగారి సంస్మరణగా విప్లవాత్మక పదాలతో పీడిత వర్గపు కవితను, కృష్ణశాస్త్రిగారి జయంతినాడు భావకవిత్వం వ్రాసాను.
హాలులో వివిధ కవుల చిత్రపటాలు అమర్చుకుని వారి జయంతి, వర్ధంతుల రోజులలో ఆయా కవుల పైన నేను వ్రాసిన కవితలను వారికి నైవేద్యం సమర్పించి, నివాళులు అర్పించుకుంటున్నాను” అని చెప్పారు. అలాంటి ఆవిడ “తనకెంతో ఇష్టమైన ఇంటిని వదిలి వెళ్ళిపోవటమేమిటి?”.
“ఎంతో ఇష్టంగా పద్మజగారి ఇల్లు చూడాలని వచ్చాను. నాకు పద్మజగారు కూర్చుని కవితలు, కథలు వ్రాసుకునే గదిని, వారు అమర్చుకున్న కవుల ఛాయాచిత్రాలను ఓసారి చూడాలని ఉంది. నన్ను లోపలికి రానిస్తారా?” అంటూ అడిగింది భారతి.
ఏ కళనున్నాడోగాని “రండి..” అంటూ లోపలకు ఆహ్వానించాడు శేఖర్.
ఎదురుగా ఉన్న పెద్ద హాలులో చెక్కతో చేసిన పుస్తకాల షల్ఫ్‌లు, వాటిపై శ్రీశ్రీగారు, కృష్ణశాస్త్రిగారు, ఆరుద్రగారు వంటి మహాకవుల ఛాయాచిత్రాలు అమర్చి ఉన్నాయి. ఆ కవుల చిత్రాల క్రింద ఉన్న షెల్ఫులలో వారు రాసిన రచనలు పదిల పరచబడ్డాయి. పద్మజాగారి సాహితీ హృదయానికి మనసులోనే ప్రణామాలు అర్పించుకుంది భారతి.
“ఇటు చూడండి” అంటూ శేఖర్ ఓ గదిని చూపించాడు. “మా పిన్ని మనసు ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే ఈ గదిలో కూర్చుని కవిత్వం రాసుకునేది. ఆ గది తలుపుపై ‘కృష్ణశాస్త్రి విభాగ’ అన్న పేరు అందంగా చెక్కబడి ఉంది.
ఆమె మనసు ఆవేదన, దుఃఖం, ఆవేశాలతో నిండిపోతే ఈ ప్రక్క గదిలో కూర్చుని కవిత్వం రాసుకునేది” అని మరో గదిని చూపించాడు శేఖర్.
ఆత్రుతతో “ఆ గది తలుపు పై ఏమి వ్రాస్తుందా?” అని చూసింది భారతి. రెండు పెదాల మధ్య హుక్కా గొట్టం పెట్టుకున్న శ్రీశ్రీగారి ముఖచిత్రం కింద “శ్రీశ్రీ విభాగ” అని రాసి ఉంది. ఇలా ఆ ఇంటిలోని గదులన్నింటినీ భారతికి చూపించాడు శేఖర్.
ఇంటి లోపలికి ఒక్కో అడుగు వేస్తుంటే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది భారతికి. మేడంగారు తన మనసుకు నచ్చిన విధంగా ఇంటిని అమర్చుకుని, గొప్ప సాహితీనిలయంగా తీర్చిదిద్దుకొని ఎక్కడికి వెళ్లిపోయారు?
ఆ గదులను చూసి మురిసిన మనసుతో ఉన్న భారతి “మరి మేడంగారు ఈ సరస్వతి నిలయాన్ని వదిలి ఎందుకు వెళ్లిపోయారు? ఆవిడతో మాట్లాడటానికి మీ దగ్గర ఏమైనా ఫోన్ నెంబర్ ఉందా?” అని అడిగింది.
“మా పిన్నిగారు ఎంతో ఆత్మాభిమాని. ఈ ఇల్లు మాకు ఇచ్చేసి వెళ్లిన తరువాత, మాకు ఆమె నుండి ఏ కబురు లేదు. ఆమె ఎక్కడ ఉన్నారో కూడా మాకు తెలియదు” అన్నాడు శేఖర్.
“మరి మీ బాబాయిగారు ఎక్కడ ఉన్నారు?” అని అడిగింది భారతి.
“వారు చనిపోయి రెండు నెలలు కావస్తోంది. మా పిన్నిబాబాయిలకు పిల్లలు లేరు. ఈ అక్షరాలే తన పిల్లలు అనేవారు మా పిన్నిగారు. మా బాబాయిగారు చనిపోయే ముందు వారికున్న పొలం, ఇల్లు, నగదు అన్ని మాకు చెందేలా వీలునామా రాశారు.
కానీ మా పిన్నిగారు “మీ ఆస్తులను నీ ఇష్టం వచ్చిన విధంగా ఎవరికైనా ఇచ్చేయండి. కానీ ఈ ‘అక్షర’ ఇంటిని మాత్రం నేను పోయేదాకా నా పేరు మీదే ఉండనీయండి” అని మా బాబాయితో అన్నది. అందుకే ఈ ఇంటిని మాత్రం మా పిన్ని పేరు మీదనే వీలునామా రాశాడు మా బాబాయి” అన్నాడు శేఖర్.
“మరి మీ పిన్నిగారు తనకెంతో ఇష్టమైన ఈ ఇంటిని, తనకెంతో కీర్తిని, పేరు ప్రఖ్యాతులను అందించిన ఈ ఊరిని వదిలి ఎక్కడికి వెళ్ళినట్లు?” ఎంతో ఆవేదనతో ఆవేశంగా అడిగింది భారతి.
“మేడం, మీరు మా పిన్నిగారి కోసం వచ్చి తెలుసుకున్న వివరాలు చాలు. మీరే మా పిన్నిగారు ఎక్కడ ఉన్నారో వెతికి మాకు కూడా తెలియ చెప్పండి” అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు శేఖర్.
“ఏమిటో అంతా గందరగోళంగా ఉంది. పద్మజామేడంతో నా కవితా సంపుటిని హిందీలోకి అనువాదం చేయించుకోవాలని ఎంతో ఆశతో వచ్చాను. చివరకు ఆమెను కలుసుకోకుండానే వెళ్ళిపోతున్నాను” అనుకుంటూ ఆటోలో బస్టాండ్‌కి బయలుదేరింది భారతి.
బస్సు ఎక్కి కూర్చున్న తరువాత “ఏమైనా సరే మేడం ఎక్కడున్నారో వెతికి పట్టుకోవాలి. ఆమెతోపాటు రచనలు చేసే రచయిత్రులు ఇంకా ఉన్నారు కదా! వాళ్లని అడిగితే మేడంగారి విషయమేమైనా తెలుస్తుందేమో?” అనుకుంటూ తనకు తెలిసిన మరో రచయిత్రి అనురాధగారికి ఫోన్ చేసింది భారతి.
అనురాధగారు భారతి చెప్పినదంతా విని “పద్మజగారి అనువాద రచనలు ఎంతో బాగుంటాయి. ఎందరివో కవితా సంపుటాలను ఆమె ఇతర భాషలలోకి అనువదించి వెలుగులోకి తెచ్చారు. ఆమె ఎందరో కవుల జయంతులు, వర్ధంతులను తమ ‘అక్షర’లో నిర్వహించి ఘనంగా నివాళులర్పించేవారు.
రెండు నెలల క్రితమే పద్మజగారి భర్త మరణించారు. అక్షర సేద్యంలో ఒకరికొకరు తోడునీడగా పనిచేసుకునే ఆ దంపతులలో జీవితభాగస్వామి మరణించడంతో పద్మజగారికి వెన్నెముక విరిగినట్లు అయింది. మేము దశదినకర్మకు వెళ్ళినప్పుడు “నేను ఈ ‘అక్షర’లో ఎక్కువకాలం ఉండటం సాధ్యపడదేమో?” అన్న సందేహాన్ని మాకు చెప్పారు పద్మజగారు.
“మీ ‘అక్షర’ను వదిలి మీరు ఎక్కడికెళ్తారు?” అని అడిగాను.
అన్నయ్య తనకు రాయని ఈ ‘అక్షర’ ఇంటిని గురించి గొడవ చేసి, పద్మజగారిని బాధపెట్టి, ఆమె బావగారు ఆ ఇంటిని తన పేరున రాయించుకున్నారని తెలిసింది.
“నాకు తెలిసి పద్మజగారు పుట్టింటికి అయితే వెళ్ళరు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆమె అన్నావదినలు తమ పిల్లలను పద్మజ దంపతులు దత్తత తీసుకోలేదని కోపంగా ఉన్నారు. ఆమెకు మరెవరైనా ఆత్మీయులు ఉన్నారేమో నాకు తెలియదు” అంటూ చెప్పారు అనురాధగారు.
“సరే మేడం. నేను ఎలాగైనా పద్మజగారు ఎక్కడ ఉన్నది తెలుసుకుంటాను” అని చెప్పింది భారతి.
ఒకరోజు తన స్నేహితురాలు మాళవికకు ఫోన్ చేసింది. ఒరిస్సాలోని జైపూర్‌లో (కోరాపుట్ జిల్లా) ఉంటున్న మాళవికతో తన స్నేహం ఈనాటిది కాదు. ఇద్దరూ చాలా రోజులకు కరువు తీరా మాట్లాడుకున్నారు.
మాటల మధ్యలో భారతి పద్మజగారి గురించి మాళవికతో చెబుతూ “వారితో నా కవితా సంపుటిని హిందీలోకి అనువదింపచేయాలని అనుకున్నాను. కానీ ఆమె ఎక్కడున్నారో నాకు తెలియటం లేదు. ఆమెను గురించిన విషయాలను తెలియజేసే వారు కూడా దొరకటం లేదు” అంటున్న భారతి గొంతులో ఏదో తెలియ ఆవేదనను గుర్తించింన మాళవిక “ఆమె పేరేమిటి అన్నావు?”అని అడిగింది.
“పద్మజ” అని సమాధానమిచ్చింది భారతి.
మాకు ఇక్కడ నెలకోసారి తెలుగువారి సాహిత్య ప్రోగ్రామ్స్ జరుగుతూంటాయి. కిందటి నెలలో జరిగిన కార్యక్రమంలో ఒక మేడం గారు వచ్చి శ్రీశ్రీగారి కవితలను హిందీ, ఒరియా, భాషలలో చాలా చక్కగా చదివి అర్థం కూడా చెప్పారు. ఒక్క భాషలో పట్టు సాధించడానికే కిందామీదా పడుతున్న మాకు, మూడు భాషల్లో ఆమెకు గల పటుత్వానికి మాకందరికీ ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతో విస్మయం కలిగింది.
నీకు మేమావిడతో తీయించుకున్న ఫోటోను పంపిస్తాను. “నీవు చెప్పే పద్మజగారు, ఈమె ఒకరేనేమో చూడు” అంది మాళవిక. వాట్సాప్‌లో ఫోటో చూసిన భారతికి చాలా ఆత్రుత, ఆనందం ఒకేసారి కలిగాయి.
“అవును మాళవికా! ఈవిడే పద్మజామేడం. నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలిని. మేడంగారి ఆచూకీ నాకు తెలిసింది. వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్లుగా మంచి వార్తని చెప్పావు. ఎప్పటినుంచో మీ ఊరు రమ్మనమని నన్ను అడుగుతున్నావుగా! ఈసారి తప్పక వస్తాను. నిన్ను కలిసినట్లుగానూ ఉంటుంది. మా పద్మజామేడంగారిని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే అవకాశమూ కలుగుతుంది” అంటూ ఆనందంతో చెప్పింది భారతి.
ఆ నెలాఖరుకి భర్తకు, పిల్లలకు సెలవలు కలసిరావటంతో అందరూ కలసి జైపూర్‌కి వెళ్ళారు. మరుసటి రోజే జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమానికి వెళ్ళింది భారతి. ఆ రోజు పద్మజామేడం అక్కడికి రాలేదు. కానీ కార్యక్రమ నిర్వాహకుల ద్వారా ఆమె అడ్రస్సు, ఫోను నెంబర్ తీసుకోగలిగింది భారతి. ముందుగా ఫోనులో ఆమెతో మాట్లాడి, మాళవికతో కలసి పద్మజగారింటికి వెళ్ళింది.
అదో రెండుగదులున్న చిన్న ఇల్లు. ఇంటి ముందున్న జాగాలో పెంచిన పూలమొక్కలు పరిమళాలను వెదజల్లుతున్నాయి. తాము వస్తున్న సంగతి ముందుగా ఫోనులో చెప్పటం వల్ల పద్మజగారు వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు.
“మేడం! నేను మీ విజయనగరం నుండి వస్తున్నాను. మిమ్మల్ని ఓ సాహితీ కార్యక్రమంలో కలిశాను. నా తొలి కవితా సంపుటికి ముందుమాట రాసిన అనురాధాగారు మీ గురించి చెప్పారు. అప్పటినుండి నేను మీ అభిమానిని అయిపోయాను. మన విజయనగరంలో జరిగే సాహితీ కార్యక్రమాలకు తప్పకుండా వెళ్లేదాన్ని. అక్కడ కూడా చాలామంది సాహితీ మిత్రులు మీ కవితలు, కథలు, వ్యాసాలు, హిందీ అనువాదాల గురించి చెప్పుకునేవారు.
నేను రాసిన ‘అక్షరమే నా తోడు’ కవితా సంపుటిని మీరు హిందీలోకి అనువాదం చేయాలని ఆశిస్తూ మిమ్మల్ని అడగటానికి మీ ఇంటికి వెళ్లాను. కానీ అప్పటికే మీరు ‘అక్షర’ను వదిలి ఎటో వెళ్లిపోయారని చెప్పిన మీ బావగారి అబ్బాయి శేఖర్‌గారు, మీ ఇంటిని చూడటానికి మాత్రం అనుమతించారు. ఆ ఇంటిలో తిరుగుతూ మిమ్మల్ని తలచుకుంటూ ఎంతగా అనుభూతిని చెందానో మాటలలో చెప్పలేను. కానీ అంత అపురూపంగా ఆరాధిస్తున్న ఆ సాహితీ నిలయాన్ని ఎందుకు అలా వదిలేసి వచ్చారు?.
“ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తానా?” అని ఎదురుచూస్తూ “మీరు ఎక్కడున్నారు?” అనే విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను.
“భారతీ! చూడమ్మా! మా బావగారు వాళ్లు త్వరలో ఆ ‘అక్షర’ను పడగొట్టి, అక్కడ అపార్ట్‌మెంట్ కట్టిస్తారట. నా ఊపిరి లాంటి కలల సౌధాన్ని పడగొట్టటం నేను చూడలేను. అక్కడే ఉండి ఆ ఇంటి మీద మమకారంతో, నా వాళ్ళతో పోరాడుదలచుకోలేదు.
అందుకే కాలేజిలో నా స్నేహితురాలైన రోహిణి ఇక్కడ ఉంటే మాట్లాడి, నాకేదైనా పత్రికలో ఉద్యోగం చూడమన్నాను. నాకు మూడు భాషలమీద పట్టు ఉండటంతో ఓ పత్రికవారు ఉపసంపాదకురాలిగా ఉద్యోగం ఇచ్చారు. మావారి పెన్షన్ నాకు బ్రతకడానికి సరిపోతుంది. నా అక్షరాన్ని బ్రతికించుకోవటానికి ఈ ఉద్యోగం ఎక్కువగా ఉపయోగపడుతుంది. అక్షరాలే నా పిల్లలుగా భావిస్తూ సాహిత్య సేవ చేసుకుంటున్నాను.
నువ్వు అంత దూరం నుండి నాకోసం ఇంత దూరం వచ్చావు. నీలాంటి వారి అభిమానం చాలదా నాకు? నరనరాల నింపుకున్న సాహిత్య పరిమళం ఎల్లవేళలా నాకు తోడుగానే ఉంటుంది. ఈ జన్మకిది చాలు తల్లి” అన్నారు పద్మజగారు.
“మేడం! మరి మన విజయనగరం ఎప్పటికీ రారా?” అని దిగులుగా అడిగింది భారతి.
“వస్తానమ్మా! ఆ మహాకవి శతజయంతి ఉత్సవాలకి తప్పక వస్తాను. ఇంతకీ నీ కవితా సంపుటి ఏదీ? నేను దీన్ని హిందీలోకి అనువదించి నీకు పంపిస్తాను” అన్నారు పద్మజమేడం.
“మేడం! నా కోసం ఓ కవిత చెప్తారా?” అని అడిగింది మాళవిక.
“నేను విప్లవకవి శ్రీశ్రీని కాను విప్లవగీతాలు రాసేటందుకు,
నేను భావకవి కృష్ణశాస్త్రిని కాను చల్లని వెన్నెల గీతాలు రాసేటందుకు,
నేను ప్రజాకవి కాళోజీని కాను అన్నార్తుల పట్ల కవితలల్లేందుకు
నేను మహాకవి దాశరధిని కాను ప్రజల పక్షాన పోరాటగీతాలు రాసేటందుకు
నేను నాలోనే దాచుకున్న విప్లవాగ్ని, నేను నాలో నింపుకున్న కౌముదిని
నేను నాలో ప్రజలకై చేసే పోరాటాన్ని, అణువణువునా కవితావేశాన్ని
నింపుకున్న సామాన్య జీవికను నేను” అంటూ ఆవేశంగా చెప్పారు పద్మజమేడంగారు.
“మేడం! అనర్గళంగా చాలా బాగా చెప్పారు. మరి మీరు మన ఊరు తప్పక రండి. మేం మీ కోసం, మీ సాహితీ వెలుగుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూంటాం” అంది భారతి.
“అప్పుడప్పుడు తప్పక వస్తానమ్మా. ఈ లౌకిక బంధాలను తగ్గించుకున్నాను. కానీ సాహితీ బంధువులను వదలుకోలేనుగా. వారిని కలవటానికి తప్పక వస్తాను” అన్నారు పద్మజగారు.
“నీకో విషయం చెప్పనా? ఇక్కడ నేను మూడు భాషలలో కవితలు, కథలు రాయటం హైస్కూలు పిల్లలకు వారానికి రెండురోజులు నేర్పిస్తూ వారిలో శ్రీశ్రీ, దాశరధి, కృష్ణశాస్త్రి, తిలక్‌లను గుర్తిస్తూ వారిద్వారా సాహితీ సేద్యాన పలు ఫలాలనందించే బృహత్కార్యక్రమానికి ఈ మధ్యనే శ్రీకారం చుట్టాను” అన్నారామె.
“మేడం! మీరు ఎక్కడుంటే ఆ ప్రదేశమే ఓ కవితా నిలయంగా మారుతుంది” అంటూ మేడంతో గుర్తుగా ఓ ఫోటో తీసుకుని ఇంటికి కదిలారా స్నేహితురాళ్ళు.
“మాళవికా! ఇప్పుడు నీకు అర్ధమయ్యిందా? నేను పద్మజామేడంను కలసుకోవడానికి ఎందుకు తపించానో? అక్షరమే తోడుగా పద్మజామేడంగారు ఈ ప్రపంచాన ఎక్కడైనా హాయిగా ఆనందంగా జీవించగలరు. అంత గొప్ప సాహితీమూర్తితో నా కవితలను హిందీలోకి అనువదింపచేసుకోవటం నిజంగా నా పూర్వజన్మ సుకృతమేగా” అంది భారతి.
“ఔను భారతీ! నిజమే నీ ద్వారా నేను కూడా ఆమె వ్యక్తిత్వ స్ఫూర్తిని పొందాను” అంది మాళవిక.
*****
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు. గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.






Comments