top of page
Original.png

విలువలే వారసత్వం - పార్ట్ 6


పట్టణానికి చదువుకోసం బయలుదేరుతున్న శేఖర్‌కు తల్లిదండ్రులు వీడ్కోలు పలుకుతున్న దృశ్యం.

Viluvale Varasathvam - Part 6 - Telugu Inspirational Moral Story | Manasa Reddy Chichili 

విలువలే వారసత్వం - పార్ట్ 6 - తెలుగు ప్రేరణాత్మక నీతి కథ | మానస రెడ్డి చిచిలీ

Published in manatelugukathalu.com on 06/08/2026


పేదరికం మనిషి భవిష్యత్తును నిర్ణయించదు... కష్టం, పట్టుదల, విలువలే నిజమైన విజయానికి పునాది. "విలువలే వారసత్వం - పార్ట్ 6" లో శేఖర్ తన నిరంతర శ్రమ, తల్లిదండ్రుల త్యాగం, విద్యపై అచంచలమైన నమ్మకంతో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించి అందరి ప్రశంసలు అందుకుంటాడు. సాధారణ గ్రామీణ యువకుడు తన కలలను నిజం చేసుకున్న ఈ హృదయాన్ని హత్తుకునే ఘట్టం, ప్రతి విద్యార్థికి, ప్రతి తల్లిదండ్రికి స్ఫూర్తినిచ్చే విజయగాథ. కష్టానికి ఎప్పుడూ ఫలితం ఉంటుందని, నిజమైన వెలుగు పట్టుదలతోనే లభిస్తుందని ఈ అధ్యాయం హృద్యంగా తెలియజేస్తుంది.



ఇక విలువలే వారసత్వం - పార్ట్ 6 చదవండి.


అధ్యాయం – 10: గ్రామం దాటి… కలల నగరానికి


“కలలు కనడం అందరికీ సాధ్యం. కానీ ఆ కలల కోసం ఇల్లు వదిలి ముందుకు అడుగు వేయడం ధైర్యవంతులకే సాధ్యం.”


పదవ తరగతి ఫలితాల తర్వాత రామాపురం గ్రామంలో శేఖర్ పేరు ప్రతి ఇంట్లో వినిపించింది.


“కుమ్మరి లింగయ్య కొడుకు జిల్లా ర్యాంక్ సాధించాడట!”


“ఎంత కష్టపడి చదివాడో చూశారా?”


“పేదరికం ఉన్నా పిల్లవాడిని ఎంత బాగా పెంచారో!”

అని గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.


లింగయ్య మాత్రం వినయంగా నవ్వేవాడు.

“మా బిడ్డ కష్టం చేశాడు. దేవుడు దీవించాడు అంతే.”

అని చెప్పేవాడు.


కొద్ది రోజుల తర్వాత శేఖర్‌కు పట్టణంలోని ప్రముఖ జూనియర్ కళాశాల నుంచి ప్రవేశ పత్రం వచ్చింది.


అతనికి స్కాలర్‌షిప్ కూడా మంజూరైంది.


ఆ వార్త విన్న లక్ష్మమ్మ ఆనందంతో దేవుడికి దీపం వెలిగించింది.


కానీ ఆ ఆనందం వెనుక ఒక తల్లి హృదయంలో చిన్న బాధ దాగి ఉంది.


“ఇప్పటి వరకు నా కళ్ల ముందే పెరిగిన బిడ్డ… ఇప్పుడు పట్టణానికి వెళ్లాలి.”

ఆమె మనసులో అనుకుంది.


ఆ రాత్రి కుటుంబం మొత్తం చిన్న గుడిసెలో కలిసి కూర్చుంది.


లింగయ్య మెల్లగా అన్నాడు.


“శేఖర్ బిడ్డా, పట్టణ జీవితం కొత్తది. 

అక్కడ చాలా ఆకర్షణలు ఉంటాయి. 

కానీ నువ్వు నీ లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.”


శేఖర్ తండ్రి చేతిని పట్టుకున్నాడు.


“నాన్నా, నేను ఎక్కడికి వెళ్లినా మీ విలువలు నా వెంట ఉంటాయి.”


లక్ష్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది.


“బిడ్డా, ఆకలిగా ఉన్నా సరే… 

ఎప్పుడూ నిజాయితీని వదలకూ.”


శేఖర్ తల్లి పాదాలకు నమస్కరించాడు.


“అమ్మా, మీ మాట నా జీవితానికి మార్గదర్శకం.”


పట్టణానికి వెళ్లే రోజు వచ్చింది.


లింగయ్య తన పాత సైకిల్‌పై శేఖర్‌ను బస్ స్టాండ్‌కి తీసుకెళ్లాడు.


శేఖర్ చేతిలో ఒక చిన్న బ్యాగ్.


అందులో రెండు జతల బట్టలు, కొన్ని పుస్తకాలు, తల్లి పెట్టిన కొద్దిగా ఆహారం.


బస్ రాగానే లక్ష్మమ్మ తన కొడుకును గట్టిగా హత్తుకుంది.


“జాగ్రత్తగా ఉండు బిడ్డా.”


శేఖర్ కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.


“అమ్మా, నేను త్వరలోనే మీకు గర్వకారణం అవుతాను.”


బస్ నెమ్మదిగా కదిలింది.


లింగయ్య, లక్ష్మమ్మ బస్ కనిపించకుండా పోయే వరకు అక్కడే నిలబడి ఉన్నారు.


పట్టణం శేఖర్‌కు కొత్త ప్రపంచంలా అనిపించింది.


ఎత్తైన భవనాలు.


రద్దీ రోడ్లు.


అపరిచితమైన జనసమూహం.


మొదటి రోజు హాస్టల్ గదిలో కూర్చుని అతను గ్రామాన్ని గుర్తు చేసుకున్నాడు.


తల్లి వంట.


తండ్రి కుమ్మరి చక్రం.


గుడిసె ముందు దీపం వెలుగు.


అన్నీ అతని మనసులో మెదిలాయి.


కానీ వెంటనే తండ్రి మాట గుర్తొచ్చింది.


“నా జీవితం పని, నీ జీవితం చదువు.”


ఆ మాట అతనికి బలం ఇచ్చింది.


అదే సమయంలో వరుణ్ మళ్లీ పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.


కానీ అతని సిద్ధత కంటే స్నేహితుల సరదాలే ఎక్కువ.


కొత్తగా కొంతమంది చెడు స్నేహితులు అతని జీవితంలోకి వచ్చారు.


వాళ్లు చదువు గురించి కాదు, సరదాలు, ఖర్చులు, అహంకారం గురించి మాత్రమే మాట్లాడేవారు.


ఒక రోజు వాళ్లలో ఒకడు అన్నాడు.


“వరుణ్, నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నీకు ఆస్తి ఉంది కదా!”


వరుణ్ నవ్వాడు.


“అదే నిజం. నాకు చదువు అవసరం లేదు.”


ఆ మాట అతని జీవితాన్ని మరింత ప్రమాదకరమైన దారిలోకి నెట్టింది.


పట్టణంలో శేఖర్ మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాడు.


కళాశాల, లైబ్రరీ, చదువు - ఇవే అతని ప్రపంచం.


డబ్బు ఆదా చేయడానికి హాస్టల్ భోజనం తినేవాడు.


అవసరం లేని ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడు.


ఒకసారి అతని స్నేహితుడు అడిగాడు.


“శేఖర్, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు?”


శేఖర్ చిరునవ్వుతో అన్నాడు.


“నా తండ్రి చేతులు మట్టితో నిండిపోయాయి. నా భవిష్యత్తు జ్ఞానంతో నిండాలి.”


ఆ మాట విన్న స్నేహితుడు మౌనంగా అతన్ని చూశాడు.


కాలం మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగించింది.


ఒక బాలుడు గ్రామం దాటి కలల నగరంలో తన భవిష్యత్తును నిర్మించుకుంటున్నాడు.


మరో బాలుడు తన చేతిలో ఉన్న అవకాశాలను నిర్లక్ష్యంతో కోల్పోతున్నాడు.


ఇద్దరి దారులు ఇప్పుడు స్పష్టంగా వేరుపడుతున్నాయి.


కానీ ఇంకా ఎవరికీ తెలియదు,

ఈ రెండు దారులు ఒకరోజు మళ్లీ కలుస్తాయి.


అప్పుడు కాలం ఒక గొప్ప పాఠాన్ని ప్రపంచానికి చెబుతుంది.



హాస్టల్ గదిలో రాత్రి చదువుకుంటూ స్కాలర్‌షిప్ సాధించిన శేఖర్.

అధ్యాయం – 11: కష్టం వెలిగించిన దీపం



“చీకటి ఎంత గాఢంగా ఉన్నా, కష్టపడి వెలిగించిన దీపాన్ని ఆర్పలేడు.”


పట్టణ జీవితానికి శేఖర్ నెమ్మదిగా అలవాటు పడిపోయాడు.


ఉదయం కళాశాల, మధ్యాహ్నం లైబ్రరీ, రాత్రి హాస్టల్ గదిలో చదువు - ఇదే అతని రోజువారీ జీవితం.


అతని గదిలో ఉన్న ఇతర విద్యార్థులు కొన్నిసార్లు సినిమాలకు వెళ్లేవారు, షాపింగ్‌కు వెళ్లేవారు, సరదాగా సమయం గడిపేవారు.


కానీ శేఖర్ మాత్రం ప్రతి ఖాళీ నిమిషాన్ని చదువుకే అంకితం చేశాడు.


ఎందుకంటే అతనికి తెలుసు - తన తల్లిదండ్రుల కష్టం వృథా కాకూడదని.


ఒక రోజు కళాశాలలో అంతర్గత పరీక్షల ఫలితాలు ప్రకటించారు.


శేఖర్ మళ్లీ మొదటి స్థానంలో నిలిచాడు.


ప్రిన్సిపాల్ అతన్ని కార్యాలయానికి పిలిచారు.


“శేఖర్, నీ ప్రతిభ చాలా గొప్పది. 


నీలాంటి విద్యార్థులు మా కళాశాలకు గర్వకారణం.”


అన్నారు.


తర్వాత ఒక పత్రాన్ని అతని చేతిలో పెట్టారు.


“ఇది రాష్ట్ర స్థాయి మెరిట్ స్కాలర్‌షిప్. 


ఇక నీ చదువు ఖర్చు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.”


శేఖర్ కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి.


అతనికి వెంటనే తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు.


ఆ సాయంత్రం శేఖర్ గ్రామానికి ఫోన్ చేశాడు.


లింగయ్య ఫోన్ ఎత్తగానే అతను ఉత్సాహంగా అన్నాడు.


“నాన్నా! నాకు రాష్ట్ర స్థాయి స్కాలర్‌షిప్ వచ్చింది!”


కొన్ని క్షణాలు లింగయ్య మాట్లాడలేకపోయాడు.


అతని కళ్లలో కన్నీళ్లు నిండాయి.


“నిజమా బిడ్డా?”


“అవును నాన్నా. ఇక మీపై చదువు ఖర్చు భారముండదు.”


లక్ష్మమ్మ పక్కనే నిలబడి వినుతోంది.

ఆమె ఆనందంతో దేవుడి పేరు జపించింది.


“మా బిడ్డ మా కష్టానికి వెలుగయ్యాడు.”


అంది.


అదే సమయంలో రామాపురంలో వరుణ్ జీవితం వేరే దారిలో సాగుతోంది.


అతను మళ్లీ పరీక్షలు రాసి పాస్ అయ్యాడు.


కానీ ఆ విజయం అతనిలో బాధ్యతను పెంచలేదు.


భూపతి గారు ఆనందంగా అతనికి కొత్త మోటార్ బైక్ కొనిచ్చాడు.


“ఇప్పుడైనా బాగా చదువు బాబూ.”


అని ప్రేమగా అన్నాడు.


వరుణ్ తల ఊపాడు.


కానీ అతని మనసు చదువులో లేదు.


కొత్త బైక్‌తో అతను గ్రామంలో తిరగడం మొదలుపెట్టాడు.


కొంతమంది చెడు స్నేహితులు అతని చుట్టూ చేరారు.


వాళ్లు అతని డబ్బుతో సరదాలు చేసేవారు.


ఒక రాత్రి వారు వరుణ్‌ను గ్రామం బయట ఉన్న చిన్న హోటల్‌కు తీసుకెళ్లారు.


అక్కడ మొదటిసారి అతని ముందుకు మద్యం గ్లాస్ వచ్చింది.


వరుణ్ కాసేపు సంకోచించాడు.


“ఇది అవసరమా?”


అని అడిగాడు.


ఒక స్నేహితుడు నవ్వుతూ అన్నాడు.


“ఇది సరదా మాత్రమే. ఒకసారి తాగితే ఏమీ కాదు.”


మరో స్నేహితుడు జోడించాడు.


“నువ్వు భూపతి గారి కొడుకువీ నీకు భయం ఎందుకు?”


ఆ మాటలు వరుణ్ అహంకారాన్ని తాకాయి.


అతను గ్లాస్ ని చేతిలోకి తీసుకున్నాడు.


ఆ రాత్రి అతను చేసిన ఆ చిన్న తప్పు…


తన జీవితాన్ని నెమ్మదిగా చీకటివైపు నెట్టే మొదటి అడుగు అని అతనికి తెలియదు.


పట్టణంలో శేఖర్ మాత్రం అదే రాత్రి లైబ్రరీలో కూర్చుని చదువుతున్నాడు.


అతని ముందు పుస్తకాలు తెరిచి ఉన్నాయి.


కానీ అతని మనసులో ఒకే చిత్రం.


తండ్రి మట్టితో నిండిన చేతులు.


తల్లి అలసిపోయిన ముఖం.


“నేను తప్పకుండా విజయవంతం కావాలి.”


అని తనతో తానే చెప్పుకున్నాడు.


కొన్ని నెలలు గడిచాయి.


ఇంటర్ పరీక్షలు ముగిశాయి.


శేఖర్ తన శక్తిమేరకు రాశాడు.


వరుణ్ మాత్రం చదువుకంటే స్నేహితుల సరదాలకే ఎక్కువ సమయం కేటాయించాడు.


కాలం మళ్లీ తన తీర్పు చెప్పడానికి సిద్ధమైంది.


ఒకరి కష్టం దీపంలా వెలిగుతోంది.


మరోరి నిర్లక్ష్యం చీకటిలా విస్తరిస్తోంది.

ఎందుకంటే…


మనిషి జీవితాన్ని ఒక్కరోజు మార్చదు.


ప్రతి రోజూ చేసే చిన్న నిర్ణయాలే అతని భవిష్యత్తును నిర్మిస్తాయి


రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించి కళాశాలలో అభినందనలు అందుకుంటున్న శేఖర్.


అధ్యాయం 12: వెలుగు వైపు ఒక అడుగు


“కష్టపడినవాడికి విజయం దూరంగా కనిపించొచ్చు, కానీ అది ఎప్పుడూ అతని వైపే నడుస్తూ ఉంటుంది.”


ఇంటర్ పరీక్షల ఫలితాల రోజు వచ్చింది.


పట్టణంలోని కళాశాల ప్రాంగణం విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. ప్రతి ఒక్కరి ముఖంలో ఉత్కంఠ, ఆశ, భయం కలిసిపోయాయి.


శేఖర్ నిశ్శబ్దంగా నోటీసు బోర్డు ముందు నిలబడ్డాడు.


అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది.


కొన్ని క్షణాల తర్వాత అతని కళ్లకు తన పేరు కనిపించింది.


“శేఖర్ – రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ర్యాంక్”

అతను నమ్మలేక మళ్లీ చదివాడు.


అది నిజమే.


శేఖర్ రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాడు.


కళాశాల మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది.


ప్రిన్సిపాల్ అతన్ని వేదికపైకి పిలిచారు.


“ఈ బాలుడు కేవలం మా కళాశాలకు మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రానికి గర్వకారణం.”

అన్నారు.


శేఖర్ కళ్లలో ఆనందభాష్పాలు మెరిశాయి.


అతనికి వెంటనే తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు.


అదే సాయంత్రం అతను గ్రామానికి చేరుకున్నాడు.


లింగయ్య ఇంటి ముందు చిన్న దీపం వెలుగుతోంది.


శేఖర్ దూరం నుంచే “అమ్మా! నాన్నా!” అని పిలిచాడు.


లక్ష్మమ్మ బయటకు పరుగెత్తుకొచ్చింది.


“ఏమైంది బిడ్డా?” అని


శేఖర్ ఆనందంతో అన్నాడు.


“అమ్మా, నాకు రాష్ట్ర స్థాయి ర్యాంక్ వచ్చింది!”


లక్ష్మమ్మ చేతులు వణికిపోయాయి.


ఆమె తన కొడుకును గట్టిగా హత్తుకుంది.


“దేవుడా! మా బిడ్డ కల నిజమైంది.”


లింగయ్య కళ్లలో కన్నీళ్లు నిండాయి.


“నువ్వు మా ఇంటి గర్వం బిడ్డా.”

అన్నారు.


ఆ రోజు గ్రామం మొత్తం శేఖర్ విజయాన్ని పండుగలా జరుపుకుంది.


కొద్ది రోజుల తర్వాత శేఖర్‌కు ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో ఉచిత సీటు వచ్చింది.


అతని చదువు మొత్తం స్కాలర్‌షిప్ ద్వారా జరుగుతుంది.


లింగయ్య ఆనందంతో కుమ్మరి చక్రం ముందు నిలబడి దేవుడికి నమస్కరించాడు.


“ఇప్పటి వరకు నా చేతులు మట్టిని తీర్చిదిద్దాయి. ఇక నా కొడుకు తన భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాడు.”

అని గర్వంగా అన్నాడు.


అదే సమయంలో వరుణ్ జీవితం మరింత ప్రమాదకరమైన దారిలో సాగుతోంది.


అతని చెడు స్నేహితులు ఇప్పుడు అతన్ని తరచూ మద్యం తాగించే స్థాయికి తీసుకెళ్లారు.


వరుణ్ మొదట “సరదా”గా ప్రారంభించిన అలవాటు నెమ్మదిగా అతని జీవితంలో భాగమవుతోంది.


ఒక రాత్రి అతను మద్యం తాగి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు.


భూపతి గారు గుమ్మం దగ్గరే ఎదురుచూస్తున్నాడు.


వరుణ్ తూలుతూ లోపలికి వచ్చాడు.


మద్యం వాసన గట్టిగా వచ్చింది.


భూపతిగారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.


“వరుణ్! ఇది ఏమిటి?”


వరుణ్ తలదించుకున్నాడు.


సావిత్రమ్మ భయంతో ఏడవడం ప్రారంభించింది.


“మా బిడ్డ ఇలా ఎలా మారిపోయాడు?”


భూపతి గారు కోపంతో అన్నాడు.


“ఇప్పటి వరకు నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాను. కానీ ఇకపై నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి నేను చూస్తూ ఉండను.”


వరుణ్ మాత్రం మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయాడు.


ఆ రాత్రి భూపతి గారు నిద్రపోలేకపోయాడు.


అతను మొదటిసారి తన పెంపకం గురించి ఆలోచించాడు.


“నేను నా కొడుకుకు అన్నీ ఇచ్చాను. 


కానీ బాధ్యత నేర్పలేకపోయాను.”

అని మనసులో బాధపడ్డాడు.


సావిత్రమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది.


“మనం అతన్ని చాలా గారాబంగా పెంచాం.”


భూపతి గారు నిశ్శబ్దంగా తల వంచాడు.


అదే రాత్రి శేఖర్ తన గదిలో ఇంజినీరింగ్ ప్రవేశ పత్రాన్ని చూస్తున్నాడు.


అతని కళ్లలో భవిష్యత్తుపై ఆశ ఉంది.


తల్లిదండ్రుల కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలనే సంకల్పం ఉంది.


ఒక ఇంట్లో ఆనందం కన్నీళ్లుగా మారింది.


మరో ఇంట్లో బాధ కన్నీళ్లుగా మారింది.


కాలం మళ్లీ తన సత్యాన్ని రాస్తోంది.


ఒకరి కష్టం కుటుంబాన్ని గర్వపడేలా చేస్తోంది.


మరోరి నిర్లక్ష్యం కుటుంబాన్ని బాధపడేలా చేస్తోంది.


ఎందుకంటే…


తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తి ఇవ్వగలరు.


కానీ ఆ ఆస్తిని నిలబెట్టే విలువలు నేర్పకపోతే, సంపద కూడా ఒకరోజు చేతుల మధ్య జారిపోతుంది.



అనారోగ్యంతో ఉన్న తండ్రి చేతిని పట్టుకుని సంకల్పంతో నిలిచిన శేఖర్.

అధ్యాయం - 13: కష్టాల మధ్య నిలిచిన సంకల్పం


“సంకల్పం ఉన్నవాడిని కష్టాలు భయపెట్టవు: అవే అతన్ని మరింత బలంగా తయారు చేస్తాయి.”


శేఖర్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరిన మొదటి రోజు.


విశాలమైన క్యాంపస్, ఎత్తైన భవనాలు, కొత్త ముఖాలు అన్నీ అతనికి కొత్త ప్రపంచంలా అనిపించాయి.


కానీ అతని మనసులో మాత్రం ఒకే ఆలోచన.


“నేను ఇక్కడికి సరదా కోసం రాలేదు. 


నా తల్లిదండ్రుల కలను నిజం చేయడానికి వచ్చాను.”


హాస్టల్ గదిలో అతను తన పుస్తకాలను జాగ్రత్తగా సర్దుకున్నాడు.


గోడపై చిన్న కాగితం అతికించాడు.


దానిపై ఇలా రాశాడు.


“ప్రతి రోజు ఒక అడుగు ముందుకు.”


ఆ మాట అతని జీవిత మంత్రంగా మారింది.


రోజులు గడిచాయి.


శేఖర్ చదువులో అద్భుత ప్రతిభ చూపించాడు.


ప్రొఫెసర్లు అతన్ని ప్రత్యేకంగా గుర్తించసాగారు.


అతను లైబ్రరీలో గంటల తరబడి చదువుతుండేవాడు.


కొంతమంది విద్యార్థులు అతన్ని చూసి ఆశ్చర్యపడేవారు.


“ఇంత కష్టపడటం ఎలా 


సాధ్యమవుతుంది?” అని అడిగేవారు.


శేఖర్ చిరునవ్వుతో చెప్పేవాడు.


“నా వెనుక నా తల్లిదండ్రుల కష్టం ఉంది. అది నాకు విశ్రాంతి తీసుకునే హక్కు ఇవ్వదు.”


ఒక రోజు గ్రామం నుండి ఫోన్ వచ్చింది.


లక్ష్మమ్మ గొంతు కంపిస్తోంది.


“శేఖర్ బిడ్డా… నీ నాన్నకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది.”


శేఖర్ గుండె ఒక్కసారిగా ఆగినట్టైంది.


అతను వెంటనే గ్రామానికి బయలుదేరాడు.


ఇంటికి చేరుకున్నప్పుడు లింగయ్య మంచంపై బలహీనంగా పడుకున్నాడు.


శేఖర్ కళ్లలో కన్నీళ్లు నిండాయి.


“నాన్నా…”


లింగయ్య చిరునవ్వు నవ్వాడు.


“ఏమైంది బిడ్డా? నేను బాగానే ఉన్నాను.”


కానీ శేఖర్‌కు తెలుసు,తండ్రి తన బాధను దాచిపెడుతున్నాడని.


డాక్టర్‌ను చూపించగా, ఎక్కువ కష్టపడటం వల్ల లింగయ్య ఆరోగ్యం బలహీనపడిందని చెప్పారు.


కొన్ని రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.


ఆ వార్త శేఖర్‌ను లోపల నుండి కదిలించింది.


“నా చదువు కోసం నాన్న తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేదు.”

అని బాధపడ్డాడు.


అతను లింగయ్య చేతిని పట్టుకుని అన్నాడు.


“నాన్నా, ఇక మీరు పని చేయకూడదు. 


నేను చదువుతో పాటు పార్ట్‌టైమ్ పని చేసి నా ఖర్చులు చూసుకుంటాను.”


లింగయ్య వెంటనే తల ఊపాడు.


“లేదు బిడ్డా. నీ పని చదవడం మాత్రమే. నా పని కష్టపడటం నీ భవిష్యత్తు కోసం.”


శేఖర్ కళ్లలో సంకల్పం మెరిసింది.


“అయితే నేను ఇంకా బాగా చదువుతాను నాన్నా. మీరు చేసిన ప్రతి త్యాగానికి ప్రతిఫలం ఇస్తాను.”


అదే సమయంలో వరుణ్ జీవితంలో కూడా మార్పు కోసం ఒక చిన్న ప్రయత్నం మొదలైంది.


భూపతి గారు అతన్ని పిలిచి గట్టిగా మాట్లాడాడు.


“వరుణ్, నువ్వు ఇలా కొనసాగితే నీ జీవితమే కాదు, మా కుటుంబం కూడా నాశనం అవుతుంది.”


వరుణ్ మొదటిసారి తన తండ్రి కళ్లలోని బాధను చూశాడు.


అతని మనసులో పశ్చాత్తాపం కలిగింది.


“నాన్నా, నేను మారుతాను.”

అని మాట ఇచ్చాడు.


కొన్ని రోజుల పాటు వరుణ్ నిజంగానే మద్యంకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాడు.


భూపతి గారు ఆశతో అతన్ని చూసాడు.


సావిత్రమ్మ దేవుడికి దీపం వెలిగించింది.


“మా బిడ్డ మళ్లీ మంచివాడిగా మారాలి.”

అని ప్రార్థించింది.


కానీ చెడు స్నేహితులు అంత సులభంగా విడిచిపెట్టలేదు.


ఒక సాయంత్రం వారు వరుణ్‌ను కలిశారు.


“ఏమయ్యా వరుణ్, మమ్మల్ని మర్చిపోయావా?”


అని అడిగారు.


వరుణ్ సంకోచించాడు.


“నేను ఇక ఇవన్నీ మానేయాలని నిర్ణయించుకున్నాను.”


అతని స్నేహితులు నవ్వారు.


“ఒక్కరోజులో మారిపోతావా? ఒకసారి రా, చివరిసారి సరదాగా ఉంటాం.”


వరుణ్ మనసులో యుద్ధం మొదలైంది.


ఒక వైపు తండ్రికి ఇచ్చిన మాట.


మరో వైపు చెడు స్నేహితుల ఆకర్షణ.


ఆ రాత్రి అతను తీసుకునే నిర్ణయం అతని జీవితాన్ని మరోసారి ప్రభావితం చేయబోతోంది.


పట్టణంలో శేఖర్ తండ్రి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ మరింత కష్టపడుతున్నాడు.


గ్రామంలో వరుణ్ తన జీవితాన్ని ఏ దిశలో నడిపించాలో నిర్ణయించుకోలేక తడబడుతున్నాడు.


కాలం ఇద్దరినీ పరీక్షిస్తోంది.


ఒకరిని కష్టాలతో.


మరోరిని ప్రలోభాలతో.


ఎందుకంటే…


కష్టాలను జయించినవాడు విజయం సాధిస్తాడు.


ప్రలోభాలను జయించినవాడు జీవితాన్ని గెలుస్తాడు.


గ్రామానికి తిరిగి వచ్చి పాఠశాలను ప్రారంభిస్తున్న శేఖర్ మరియు మారిన వరుణ్‌తో కూడిన ముగింపు దృశ్యం.

ముగింపు భాగం: వంశం కాదు… విలువలే వారసత్వం


ఇంజినీరింగ్ చదువులో శేఖర్ అద్భుత ప్రతిభను చూపించాడు. చివరి సంవత్సరంలో అతను జాతీయ స్థాయి సాంకేతిక పోటీలో విజయం సాధించాడు. 


ఆ విజయం అతనికి అమెరికాలోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగావకాశాన్ని తెచ్చిపెట్టింది.


ఉద్యోగ నియామక పత్రం చేతిలో పట్టుకుని శేఖర్ మొదట గుర్తుచేసుకున్నది తన తల్లిదండ్రులనే.


గ్రామానికి చేరుకున్న వెంటనే అతను లింగయ్య, లక్ష్మమ్మ పాదాలకు నమస్కరించాడు.


“నాన్నా… అమ్మా… మీ కల నిజమైంది. నాకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది.”


లక్ష్మమ్మ ఆనందంతో ఏడ్చింది. 


లింగయ్య కుమ్మరి చక్రం ముందు నిలబడి ఆకాశం వైపు చూసి అన్నాడు.


“దేవుడా, నా చేతులు మట్టిని తీర్చిదిద్దాయి. నా కొడుకు తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడు.”


అమెరికాలో శేఖర్ కష్టపడి పనిచేశాడు.

 

కొద్ది కాలంలోనే అతను ఉన్నత పదవికి చేరుకున్నాడు. మంచి జీతం, గౌరవం, సుఖసౌకర్యాలు అన్నీ అతని జీవితంలోకి వచ్చాయి.


కానీ అతను తన మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు.


ప్రతి నెలా తన తల్లిదండ్రులకు డబ్బు పంపేవాడు. గ్రామంలోని పేద పిల్లల చదువుకు సహాయం చేయడం ప్రారంభించాడు.


ఇదే సమయంలో వరుణ్ జీవితం పూర్తిగా మారిపోయింది.


మద్యం అలవాటు అతన్ని బానిసగా మార్చింది. చెడు స్నేహితులు అతని చుట్టూ తిరుగుతూ డబ్బు ఖర్చు చేయించేవారు.


భూపతి గారు ఎన్నిసార్లు మందలించినా వరుణ్ మారలేదు.


కొన్ని సంవత్సరాల తరువాత భూపతి గారు అనారోగ్యంతో మరణించాడు.


ఆస్తులన్నీ వరుణ్ చేతిలోకి వచ్చాయి.


కానీ బాధ్యత లేని చేతిలో సంపద నిలవలేదు.


వరుణ్ ఒక్కొక్కటిగా పొలాలు అమ్మాడు.


మామిడి తోటలు అమ్మాడు.


రైస్ మిల్లులు మూసేశాడు.


ఇల్లు మీద అప్పులు పెరిగాయి.


స్నేహితుల పేరుతో డబ్బు వృథా చేశాడు.


చివరకు అతని చుట్టూ ఉన్నవారందరూ దూరమయ్యారు.


సావిత్రమ్మ బాధతో రోజురోజుకు కుంగిపోయింది.


ఒక రోజు వరుణ్ తన తల్లి చేతిని పట్టుకుని ఏడ్చాడు.


“అమ్మా… నేను మా నాన్న సంపాదించినదంతా నాశనం చేశాను.”


సావిత్రమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది.


“బిడ్డా, సంపద పోయిందని బాధపడకు. 

నువ్వు మంచి మనిషిగా మారితే అదే మా కుటుంబానికి మిగిలే నిజమైన ఆస్తి” అని.


ఆ మాట వరుణ్ హృదయాన్ని కదిలించింది.


ఇరవై సంవత్సరాల తరువాత శేఖర్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు.


ఇప్పుడు అతను అమెరికాలో ఉన్నత స్థాయి ఉద్యోగి.


కానీ గ్రామానికి వచ్చినప్పుడు అతను సాధారణ తెల్ల చొక్కా, పంచె ధరించాడు.


గ్రామస్తులు అతన్ని గర్వంగా స్వాగతించారు.


“మన రామాపురం కొడుకు ప్రపంచాన్ని గెలిచాడు!”


అని ఆనందించారు.


శేఖర్ గ్రామంలో ఒక పెద్ద పాఠశాల నిర్మించాలని నిర్ణయించాడు.


పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలని సంకల్పించాడు.


కుమ్మరి కుటుంబాల కోసం ఆధునిక కుండల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు.


పాఠశాల ప్రారంభోత్సవం రోజున గ్రామమంతా అక్కడికి వచ్చింది.


శేఖర్ వేదికపై నిలబడి మాట్లాడుతున్నప్పుడు, జనసమూహం చివర ఒక బలహీనమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు.


చిరిగిన బట్టలు.


కళ్లలో పశ్చాత్తాపం.


అతడే వరుణ్.


శేఖర్ అతన్ని వెంటనే గుర్తుపట్టాడు.


వేదిక నుండి దిగివచ్చి అతని దగ్గరకు వెళ్లాడు.


“వరుణ్!”


వరుణ్ తలదించుకున్నాడు.


“శేఖర్… నువ్వు గెలిచావు. నేను ఓడిపోయాను.”


శేఖర్ మెల్లగా అతని భుజంపై చేయి వేసాడు.


“నేను నిన్ను ఓడించలేదు వరుణ్. నీ అలవాట్లు నిన్ను ఓడించాయి.”


వరుణ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.


“నాకు అన్నీ ఉన్నాయి. కానీ విలువలు లేవు. నీకు ఏమీ లేవు. కానీ విలువలే నీ సంపద.”


శేఖర్ చిరునవ్వు నవ్వాడు.


“ఇంకా ఆలస్యం కాలేదు. మనిషి మారాలని నిర్ణయించుకున్న క్షణమే అతని కొత్త జీవితం మొదలవుతుంది.”


ఆ రోజు శేఖర్ వరుణ్‌కు తన పరిశ్రమలో ఉద్యోగం ఇచ్చాడు.


“పని చిన్నది కాదు వరుణ్. 


నిజాయితీగా జీవించడం గొప్పది.”


వరుణ్ మొదటిసారి మద్యం వదిలి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు.


కొద్దికాలంలోనే అతను మారిపోయాడు.


గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.


“వరుణ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు!”


అని మాట్లాడుకున్నారు.


కొన్ని సంవత్సరాల తరువాత రామాపురం గ్రామం పూర్తిగా మారిపోయింది.


పేద పిల్లలు చదువుకుంటున్నారు.


కుమ్మరి కుటుంబాలు మంచి ఆదాయం పొందుతున్నాయి.


శేఖర్ తల్లిదండ్రులు గౌరవంగా జీవిస్తున్నారు.


వరుణ్ కూడా నిజాయితీగా పనిచేస్తూ తన జీవితాన్ని మళ్లీ నిర్మించుకున్నాడు.


పాఠశాల ముందు శేఖర్ ఒక శిలాఫలకం ఏర్పాటు చేశాడు.


దానిపై ఇలా రాసి ఉంది.


“సంపదను తల్లిదండ్రులు ఇవ్వగలరు.

కానీ సంపాదించే శక్తిని విలువలే ఇస్తాయి.

పుట్టుక మన చేతిలో ఉండదు.

భవిష్యత్తు మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది.

కష్టం చేసిన చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు.

అహంకారంతో వచ్చిన సంపద నిలవదు.

వినయంతో సంపాదించిన గౌరవం ఎన్నటికీ చెదరదు.”


లింగయ్య ఆ శిలాఫలకాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.


“నా కొడుకు కేవలం మా కుటుంబాన్నే కాదు… మొత్తం గ్రామాన్ని గెలిపించాడు.”


లక్ష్మమ్మ గర్వంగా శేఖర్ వైపు చూసింది.


వరుణ్ కూడా తలవంచి నిలబడ్డాడు.


అతనికి ఇప్పుడు అర్థమైంది.


వంశం గొప్పదైతే మనిషి గొప్పవాడు కాదు.


విలువలు గొప్పవైతేనే మనిషి గొప్పవాడు అని.


ఆ రోజు రామాపురం గ్రామం ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుంది.


ఆస్తి వారసత్వంగా రావచ్చు.


కానీ విలువలే తరాల వరకు నిలిచే నిజమైన వారసత్వం.



ముగింపు సందేశం


పేదరికం మనిషిని చిన్నవాడిని చేయదు.


అహంకారం మనిషిని చిన్నవాడిని చేస్తుంది.


కష్టం, వినయం, విద్య, తల్లిదండ్రుల నుండి వచ్చే విలువలు ఇవే నిజమైన సంపదలు.


“వంశం కాదు… 


విలువలే వారసత్వం.”


===============================

సమాప్తం


===============================


మానస రెడ్డి చిచిలీ గారి కొన్ని ఇతర రచనలు:






మానస రెడ్డి చిచిలీ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మానస రెడ్డి చిచిలీ

రచయిత్రి పరిచయం: https://manatelugukathalu.com/profile/manasa/profile

మానస రెడ్డి చిచిలీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌కు చెందిన కవయిత్రి. ఆమె రచించిన హైకూ మరియు టాంకా కవితలు Under the Basho, Mainichi Haiku వంటి అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఆమె హైకూ 2025 సంవత్సరానికి సంబంధించిన Touchstone Award కు నామినేట్ చేయబడింది. అంతేకాకుండా, ఆమె నేరుగా జపనీస్ భాషలో కూడా హైకూ రచనలు చేసారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page