top of page
Original.png

సంచారి


సంచార కమ్మరి కుటుంబంలోని పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న నారాయణ మాస్టారు.

Snchari - Telugu Inspirational Story | Bugatha Yamuna

సంచారి తెలుగు ప్రేరణాత్మక కథ | బుగత యమున

Publishes in manatelugukathalu.com on 07/08/2026


ప్రతి బిడ్డకు చదివే హక్కు ఉంది. కానీ పరిస్థితులు, పేదరికం, సంచార జీవితం కారణంగా ఎంతో మంది పిల్లలు ఆ అవకాశాన్ని కోల్పోతుంటారు. అలాంటి ఒక సంచార కమ్మరి కుటుంబం జీవితంలో ఒక ఉపాధ్యాయుడు వెలిగించిన ఆశాకిరణమే "సంచారి" కథ. బుగత యమున రచించిన ఈ హృదయాన్ని హత్తుకునే కథ చదువు కేవలం ఉద్యోగం కోసమే కాదు, జీవితాన్ని మార్చే శక్తి అని అద్భుతంగా చాటిచెబుతుంది.


నారాయణ సార్‌ బడి గంట కొట్టీండంటే బళ్లో సదువుల సందడి మొదలెట్టాల్సిందే, .. కానీ, ఆ పొద్దు పిల్లగాల్లైతే బళ్ళో కంటే బడి బయటే ఎక్కువ ఉన్నరు.. ఏమిటా అని ఆరా తీస్తే.. అసలు సంగతి బయట పెట్టిర్రు పిల్లగాళ్లు, . 


ప్రతి ఏడు లాగే ఈ ఏడు కూడాను దూరంగా ఉన్న మైదానంలో ప్రతి వర్షాకాలం రాంగనే కొన్ని గుడిసెలు వెలిసినవి. ఈనాడు బడికి రాని పిల్లగాళ్ళంతా అక్కడికే పోతారు సారూ అని చెప్పినంకనే... ఆగండ్రా ఆ గడుగ్గాయిలందరినీ నేను పోయి లాక్కొస్తా అనుకుంటూ గుడిసెలు వైపుగా బయలెల్లినాడు నారాయణ మాస్టారు…


అటుగా వస్తున్న మాష్టారిని చూసి అక్కడ ఉన్న పిల్లగాళ్ళంతా క్షణాల్లో అక్కడి నుండి ఉరికిర్రు.. అక్కడికి పోయి చూసిన మాస్టారికి అక్కడ కొందరి వ్యక్తులతో పాటుగా బడి ఈడు పిల్లలు కూడా కంట పడిన్రు... వాళ్లు కమ్మరి వృత్తిని నమ్ముకుని, ఊరూరా తిరిగే సంచార కార్మికులు. ఇనుమును కాల్చి, సుత్తె దెబ్బలతో నాగలి కర్రలు, గొడ్డళ్లు, కొడవళ్లు చేస్తూ పొట్ట పోసుకునేటోళ్లు. 


ఆ గుడిసెలలో పని చేసేటానికి వచ్చిన పెద్దోళ్లతో పాటుగా వచ్చిన చిన్న పిల్లగాళ్ళు నిక్కర్లు లేకుంట, ఒంటి నిండా బూడిదతో, ఈతకాయలు తెంపుకుంటూ, బడికి పోకుండా తిరిగేటోళ్లు. 


ఆ వాస్తవ చిత్రాన్ని చూసిన నారాయణ సారుకి మనసు విలవిలలాడింది. "ఆశల రెక్కలొచ్చే ఈ వయసులో, ఈ పిల్లలు కొలిమి తిత్తుల ఊపిరిలోనే కాలిపోవాల్నా?" అని బాధపడుతూ... బడి వైపుగా అడుగులు వేస్తూ పోయిండు.. 


ఒకరోజు నారాయణ సార్‌ నేరుగా ఆ గుడిసెల దగ్గరికి పోయిండు. పెద్ద మనిషి మల్లయ్య ఇనుమును ఎర్రగా కాల్చి దంచుతున్నాడు. సార్‌ను చూసి చేతులు తుడ్చుకుంటూ, "రండి సార్, ఇటు రండి. ఏమన్నా కొడవళ్లు కావాల్నా?" అన్నాడు. 


"కొడవళ్లు కాదు మల్లన్నా... మీ పిల్లల భవిష్యత్తును సదురుదామని వచ్చినా. ప్రతి ఏటా ఇట్లా ఊళ్లు తిరిగితే ఈ పిల్లల చదువు ఏం కావాలి? రేపు వీళ్ల బతుకులు కూడా ఇంతేనా?" అన్నాడు సార్. 


మల్లయ్య నిట్టూరుస్తూ, "మా బతుకులు ఇంతే సారూ.. ఈ ఇనుము కరిగితేనే మా కడుపు నిండేది. పిల్లల్ని బడికి పంపితే మాకు సాయం ఎవడు చేస్తాడు? గీ ఊర్లో మమ్మల్ని ఎవడుండనిస్తాడు? గీ ఊర్లోనే కాదు సారూ.. గే ఊర్లో అయినా మమ్మల్ని ఎవడుండనిస్తాడు? 


గివే సారూ మా బతుకులు.. ఒక్క ఊరిని పట్టుకు ఉండనేము.. గీ పొద్దున గీ దిక్కునుంటే మరో పొద్దునాటికి మరో దిక్కుకు పోయేటివి మా బతుకులు.. మా పిల్లగాళ్లకి సదువులేల సారూ.. !! గా మాట ఇన్సొంపుగా ఉన్నాను.. ఈ జీవితానికి జరగని మాట సారూ అది" అన్నాడు దీనంగా... 


"నువ్వు నిబ్బరంగా ఉండు మల్లన్నా. నేను చూసుకుంటా" అని నారాయణ సార్‌ ధీమా ఇచ్చిండు. 


సార్‌ ఊరి పెద్ద మనుషులైన సర్పంచ్‌ రాజిరెడ్డి, పటేల్‌ రామారావు దగ్గరికి పోయిండు. 


"సర్పంచ్‌ గారు... మన ఊరి పొలిమేరల బస చేసే కమ్మరి కుటుంబాలు గుర్తున్నాయా? వాళ్లు ప్రతి ఏటా వస్తున్నారు, పోతున్నారు. మన ఊరి రైతుల పనిముట్లన్నీ వాళ్లే చేసి ఇస్తున్నారు. 


వాళ్లకు మన ఊర్లోనే కొంచెం జాగా ఇచ్చి, చిన్న పూరి గుడిసెనైనా కట్టుకోవడానికి అవకాశాన్ని ఇస్తే ఎలా ఉంటది? వాళ్ల పిల్లలు కూడా బడికి వస్తారు. మన ఊరి వారికి పనిముట్లను అందిస్తూ అందుబాటులో ఉంటారు.. అది మంచిదే కదా" అని నచ్చజెప్పిండు. 


మొదట ఊరి పెద్దలు కొంచెం అటు ఇటుగా మాట్లాడుతూ సంశయించినా.. నారాయణ సార్‌ మాట మీద నమ్మకంతో ఒప్పుకున్నారు. ఊరి చివరన ఉన్న సర్కారు జాగాలొ ఒక రెండు సెంట్ల భూమిని ఆ కమ్మరి కుటుంబానికి కేటాయించారు. ఊరి జనమంతా కలిసి చిన్న గుడిసె లేపడానికి సాయం చేశారు. 


మల్లయ్య కుటుంబం ఆ ఊర్లోనే స్థిరపడింది. కొడుకులు ఎల్లయ్య, మల్లన్నలను నారాయణ సార్‌ బడిలో చేర్పించిండు. పొద్దున పూట పిల్లలు బడికి పోయేటోళ్లు, సాయంత్రం వచ్చి తండ్రికి కాస్త సాయం చేసేటోళ్లు. 


ఊరు తిరిగే తిప్పలు తప్పడంతో మల్లయ్య ఇంటి దగ్గరే ఇనుప సామాన్లు తయారు చేయడం మొదలుపెట్టిండు. ఊరి రైతులందరూ పొలం పనుల ముందర మల్లయ్య ఇంటికే వచ్చి సామాన్లు కొనుక్కుపోయేటోళ్లు. బతుకు బండి మెల్లగా గాడిన పడింది. 


సంవత్సరాలు గడిచాయి... పెద్ద కొడుకు ఎల్లయ్య పది క్లాస్ పూర్తి చేసి, పై చదువులు చదువుకుంటూ లోకం జ్ఞానం పెంచుకున్నాడు. బడిలో నేర్చుకున్న తెలివితో వాడికో కొత్త ఆలోచన వచ్చింది. 


ఒకరోజు రాత్రి తండ్రితో, "బాపూ... మనం ఇక్కడే కూర్చుంటే మన సామాన్లు మన ఊరి వాళ్లే కొంటున్నారు. కానీ, పక్కనున్న ఐదారు ఊర్ల రైతులకు మన గురించి తెల్వదు. నేను టౌన్‌కు పోయి పెద్ద పెద్ద అంగళ్ల ముచ్చట చూసొచ్చినా. మనం చేసే గొడ్డళ్లు, కొడవళ్లకు మంచి ఫినిషింగ్ ఇద్దాం.. నేను ఫోన్ల ద్వారా, టౌన్ల ఉన్న హోల్‌సేల్ మార్కెట్లలో మాట్లాడి మన సామాన్లను ఎక్కువ ధరకు అమ్ముతా. మన వ్యాపారాన్ని మార్కెటింగ్ చేద్దాం బాపూ!" అన్నాడు. 


కొడుకు చెప్పిన మాటలకు మల్లయ్య కండ్లు మెరిసాయి. ఎల్లయ్య అన్నట్టే చేసిండు. చదువుకున్న తెలివితో చుట్టుపక్కల మండలాలన్నింటికీ ఆర్డర్లు పంపడం మొదలుపెట్టిండు. ఒకప్పుడు ఊరు తిరిగిన కమ్మరి కుటుంబం, ఇప్పుడు ఒకే దగ్గర ఉంటూ పది ఊర్లకు సరుకు సప్లై చేసే స్థాయికి ఎదిగింది. ఇల్లు గడవడమే కష్టమైన పరిస్థితి నుండి, నలుగురికి పని ఇచ్చే స్థితికి వచ్చారు. 


అలానే సాఫీగా సాగుతున్న కాలంలో.. , ఒకరోజు సాయంత్రం... మల్లయ్య, అతని కొడుకు ఎల్లయ్య కొత్త బట్టలు, పండ్ల బుట్ట పట్టుకుని నారాయణ సార్ ఇంటికి పోయారు. 


ఎల్లయ్య, సార్ కాళ్లకు దండం పెట్టిండు. మల్లయ్య చేతులు జోడించి, కళ్లల్లో నీళ్లతో అన్నాడు, "సారూ... ఆనాడు మీరు మా గుడారం దాకా వచ్చి, మా పిల్లల చేతికి బలపం పట్టించకపోతే... ఈరోజు మేము ఇంకా ఊర్లు పట్టుకుని తిరిగేటోళ్లమే సార్. 


నా కొడుకు చదువుకున్న చదువే ఈరోజు మమ్మల్ని ఇంత పెద్దోళ్లను చేసింది. మా బతుకుల్లో వెలుగు నింపిన దేవుడు సారూ మీరు. "

అనగానే.. వాళ్ళ సంతోషానికి చదువే కారణమైనందుకు ఆనందపడుతూ.. నారాయణ సార్ ఎల్లయ్య భుజం తట్టి, "నువ్వు చదువుకున్న చదువును నీ వృత్తికి జోడించి, మీ కుటుంబాన్ని నిలబెట్టినావు చూడు... అదిరా అసలైన చదువు! చదువు అంటే నౌకరి సంపాదించడమే కాదు ఎల్లయ్యా, బతుకును మార్చుకోవడం కూడా. నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా" అన్నాడు సంతోషంతో. 


ఆ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తుంటే, కొలిమిలోంచి వచ్చే నిప్పుకణికలు గుర్తుకు వచ్చి.. ఆ ప్రకాశిస్తున్న అందమైన ఆకాశం.. ఆ కుటుంబం భవిష్యత్తు ఒకే లాగే ప్రకాశిస్తూ కనిపించాయి నారాయణ సారుకి.. 


                   సమాప్తం 


బుగత యమున గారి కొన్ని ఇతర రచనలు:



బుగత యమున గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

బుగత యమున

రచయిత్రి పరిచయం: బుగత యమున

నేను బుగత యమున,సెకండరీ గ్రేడ్ టీచర్ గా గోకవరం మండలంలో పని చేస్తున్నాను..నాకు సాహిత్యం అంటే ఎనలేని అభిమానం..ఆ అభిమానం అందించిన ప్రోత్సాహకంతోనే ముందుగా ప్రతిలిపి యాప్ లో రచనలు చేయడం మొదలుపెట్టి..సుమారు 200 వరకూ రచనలు చేసాను..అలాగే సాహితీ గోదావరి మరియు విశాఖ సంస్కృతి పత్రికలకు కూడా నేను కవితలు రాస్తూ ఉంటాను..

***


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page