ప్రమ్లోచన, మారిష, దక్షుడు

Pramlochana, Marisha, Dakshudu - Telugu Mythological Story | Bhattu Venkata Rao
ప్రమ్లోచన, మారిష, దక్షుడు - తెలుగు పౌరాణిక కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 22/09/2026
పురాణాల్లోని ఆసక్తికరమైన జన్మవృత్తాంతాలు, తపస్సు, దేవతల పన్నాగాలు ఈ కథలో అద్భుతంగా కలిసిపోతాయి. ప్రమ్లోచన, కంధుడు, మారిషల జీవితగాథ ద్వారా దక్ష ప్రజాపతి జన్మవృత్తాంతం ఎలా చోటుచేసుకుందో ఈ కథ వివరిస్తుంది. ప్రచేతసులు, చంద్రుడు, ఇంద్రుడు వంటి పౌరాణిక పాత్రలతో సాగే ఈ కథనం ప్రాచీన పురాణ సంప్రదాయాన్ని పరిచయం చేస్తుంది. వెన్నెలకంటి సూరన రచించిన ఆంధ్ర శ్రీవిష్ణుపురాణంలోని ఆధారంతో భట్టు వెంకటరావు అందించిన ఈ పౌరాణిక గాథను చదవండి.
స్వాయంభువ మనువుకు శతరూప యందు జన్మించిన ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు. ధ్రువుడి తరువాత కొన్ని వందల సంవత్సరాలకు పృథుచక్రవర్తి, అతడికి అంతర్థి, అంతర్థికి హవిర్ధానుడు, హవిర్ధానుడికి ప్రాచీనబర్హి కలిగారు. ఈ ప్రాచీనబర్హికి, సముద్రుడి కూతురైన సౌవర్ణకు, ప్రచేతసులని పిలవబడే పదకొండుగురు పుత్రులు కలిగారు. తండ్రి ఆజ్ఞను అనుసరించి వారందరూ సాగరమధ్యంలో కూర్చుని దీర్ఘకాలం ఉగ్రమైన తపస్సు చేశారు. వారికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై, భావికాలంలో ప్రజాపతిత్వాన్ని వహించగలిగే దక్షుడిని పుత్రుడిగా అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.
ప్రచేతసులు తపస్సులో మునిగివున్న కాలంలో, లోకం అరాజకంగా ఉండడం చేత, నియమాలేవీ పాటించబడక, భూమండలం అడవులతో నిండిపోయి, ఎటు చూసినా అడవి జంతువులు భయం కలిగించేవిగా మారి తిరగసాగాయి. ఆ స్థితిని చక్కదిద్దడానికై ప్రచేతసులు, వారి తపోమహిమచేత ఝుంఝూనిలాన్ని కల్పించి, భూమిని ఆక్రమించిన పెద్దపెద్ద వృక్షాలనన్నింటినీ పెకలింపజేసి, వారి కోపానలంతో భస్మీపటలం చేయసాగారు.
భూమిపై అలా అడవులు కాలిపోతుండడాన్ని చూసి తాళలేని (వృక్షాలకు అధిపతియైన) చంద్రుడు వచ్చి “మీరందరూ తపస్సులో మునిగివున్న రోజులలో భూమిపైన విచ్చలవిడిగా పెరిగి ఈ అడవులు జనులను బాధపెట్టినందుకు శిక్షించడం సమంజసమే. కానీ వాటిపై అనంతమైన ఈ కోపం ఉచితమైనది కాదు. చెట్లూ మీరు సఖ్యంగా ఉండడం పుడమిపై ప్రజల సుఖజీవనానికి ఎంతైనా అవసరం. ఆ ఆలోచనతోనే మీకు 'మారిష' అనే కన్యను కానుకగా ఇస్తున్నాను. ఈమెను మీరు పరిణయమాడండి. ఈమె వలన మీకు జన్మించే పుత్రుడు 'దక్షుడు' అనే పేరుతో ప్రజాపతి అవుతాడు!” అని చెప్పాడు.
చంద్రుడి మాటలను విన్న ప్రచేతసులు “ఎవరీ మారిష? ఈమె తల్లిదండ్రులెవరు? ఈమె కథ ఏమిటి?” తెలుసుకోవాలని ఉంది అని అడిగారు. వారికి చంద్రుడు ఇలా చెప్పాడు:
పూర్వం గోమతీనది తీరప్రాంత ప్రదేశంలో, కంధుడు అనే ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఘోర తపస్సులో నిమగ్నమైన ఆ కంధుడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు ప్రమ్లోచన అనే అప్సరసను పంపాడు. ప్రమ్లోచన కంధుడిని చేరి, సపర్యలు చేసి అతడిని మోహపరవశుడిని చేసింది. తాళలేని కంధుడు ఆమెతో సాంగత్య సుఖాన్ని కోరాడు.
“మీ అంతటి వానికి నామీద కలిగిన ప్రేమకు మీరు కోరినట్లుగా చేయడం, మీరు చెప్పినట్లుగా నడుచుకోవడమే నా పని. అందుకు భిన్నంగా చేయడానికి నేనెంతటి దానను గనుక?” అంది ప్రమ్లోచన. అలా వారిరువురి మధ్య అనురాగం స్థిరపడి నానాటికీ వృద్ధిపొందింది. కొంతకాలం గడిచాక, తాను వచ్చిన పని పూర్తయిందని నిశ్చయించుకున్న ప్రమ్లోచన, తన దారిన తాను పోదలచినదై, ఒకరోజు ఇరువురూ సరస సల్లాపములలో మునిగివున్న వేళలో సమయం చూసి “స్వామీ, నేను ఇంద్రుడి కొలువులో ఉండేదానను. ఇక్కడకు వచ్చి చాలా కాలం అయింది. ఇక సెలవిస్తే వెళతాను!” అంది.
దానికి కంధుడు “నువ్వు ఇప్పుడే కదా వచ్చింది. ఇక్కడకు వచ్చి ఎక్కువ సేపేమీ కాలేదు కదా! అప్పుడే నన్ను విడిచి వెళితే నేను ఎలా బ్రతకగలననుకున్నావు?” అన్నాడు. కంధుడి మాటలలోని కామాతురభావాన్ని గ్రహించిన ప్రమ్లోచన ఎదురు మాటాడక, మౌనంగా ఉండిపోయింది.
మరికొంత కాలం గడిచింది. ప్రమ్లోచన మరొకసారి 'ఇక వెడతానని' బయలుదేరింది.
“నీవు వచ్చి ముహూర్త కాలమైనా గడవలేదు. అప్పుడే వెళ్ళిపోతానంటావేమిటి?” అన్నాడు కంధుడు.
“నా మనసులోని కోరికలన్నింటినీ అతలాకుతలం చేసి, ఇప్పుడే వెళ్ళిపోతాను అనడం ఏమిటి? నీవు ఎన్ని మాటలైనా చెప్పు. కొత్తపూలపాన్పుపై నిన్ను నేను కలిసియుండలేనప్పుడు, ఆ మంటలమారి మన్మథుడు నన్ను ఊపిరితో ఉండనిస్తాడా?” అని తన కంగారును వ్యక్తపరిచాడు.
కంధుడి మాటలకు ఏమీ బదులు చెప్పలేక, తన ప్రయత్నాన్ని మళ్ళీ మానుకుంది ప్రమ్లోచన.
మరికొంత కాలం గడిచింది. మరోసారి ప్రమ్లోచన ఇంద్రుడి సన్నిధికి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. “ప్రశాంతమైన పరిసరాల్లో తపస్సు చేసుకుంటూ రోజులు గడుపుతున్న నా జీవితంలో, నేను కోరకుండానే ప్రవేశించి, నా మనసులో మోహబీజాన్ని నాటి, హృదయాన్ని అమితంగా ఆనందపరచి, ఇప్పుడు ఆ అంతటినీ వ్యర్థంచేసి, ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోతాననడం నీకు తగినదేనా? మనసును, హృదయాన్ని మోహంతో నింపి ఆహ్లాదపరచడం, మళ్ళీ అంతలోనే తెగతెంపుల మాటలు మాట్లాడడం నీబోటి ఆడవాళ్ళకే చెల్లుతుంది సుమా! చివరికి వ్రతం చెడినా ఫలం దక్కని చందంగా తయారయింది కదా నా పరిస్థితి!” అన్నాడు కంధుడు.
కంధుడు అలా మాట్లాడడంతో, తాను వెళ్ళిపోవడాన్ని గురించి మరింతగా మాట్లాడితే ఎక్కడ కోపం తెచ్చుకుని శపిస్తాడో అని భయపడింది ప్రమ్లోచన. అప్పటికి మళ్ళీ మౌనం వహించి ఊరుకుంది.
మరికొంత కాలం గడిచింది. ఒకనాడు సూర్యుడు అస్తమిస్తున్న వేళ, సంధ్యావందన విధులు నిర్వర్తించుకుని వస్తానని నదీతీరానికి బయలుదేరాడు కంధుడు. “ఎక్కడికి బయలుదేరారు స్వామీ!” అని అడిగింది ప్రమ్లోచన.
“ఎందుకు అలా అడుగుతున్నావు? నేను రోజూ వెళ్ళి వస్తున్నదే కదా!” అన్నాడు కంధుడు.
దానికి సమాధానంగా “నేను ఒక ప్రభాత సమయంలో రావడం నిజమే! ఇప్పుడు సాయంకాలం అవడమూ నిజమే! కానీ ఈ రెండింటి మధ్య తొమ్మిది వందల ఏడేళ్ళ ఆరు నెలల మూడు రోజుల కాలం గడిచింది ఈ రోజుతో! అది గుర్తించారా మునివర్యా?!” అన్నది చిరునవ్వు నవ్వుతూ ప్రమ్లోచన.
ప్రమ్లోచన మాటలకు ఆశ్చర్యపోయాడు కంధుడు. అవమానంతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. తేరుకుని “ఇది నిజమేనా?” అని అడిగాడు ఆమెను.
“బ్రహ్మజ్ఞానివి నీవని తెలిసి కూడా నీతో అబద్ధం చెప్పే సాహసం చేస్తానా? నేను చెప్పినదంతా నిజమే. కావలిస్తే ఒక్కసారి యోగదృష్టితో చూడు!” అని బదులిచ్చింది ప్రమ్లోచన.
తెలివిలోకి వచ్చిన కంధుడు, నిరర్థక ప్రయోజనంతో ఎంతో విలువైనదైన తపోధనాన్ని పోగొట్టుకున్నానని గ్రహించాడు. ఇదంతా ఇంద్రుడి పన్నాగమే అన్నది కూడా అర్థమైంది కంధుడికి. మరింక క్షణమైనా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళిపొమ్మన్నాడు ప్రమ్లోచనని. లేకపోతే శపిస్తానన్నాడు.
అన్నంతపనీ చేయసమర్ధుడే ఈ కంధుడు అని తెలిసిన ప్రమ్లోచన, ఆ క్షణమే కంధుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయితే అప్పటికే ప్రమ్లోచన గర్భవతి. వారికి పుట్టిన కూతురే మారిష - అని మారిష జన్మవృత్తాంతాన్ని ప్రచేతసులకు చెప్పాడు చంద్రుడు.
ప్రమ్లోచన దేవలోకానికి వెళ్ళిపోయిన తరువాత కంధుడు ఆ చోటు వదిలి పురుషోత్తమతీర్థం అనే చోటికి వెళ్ళి, దోషం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్త తపస్సులో మునిగిపోయాడు. మారిషను చంద్రుడు, వాయువు, వృక్షములు తల్లిదండ్రులై పెంచి పెద్దచేశారు. అలా ప్రకృతికి ప్రతిరూపంగా పెరిగిన మారిషను ప్రచేతసులకు ఇచ్చి పెళ్ళి చేశాడు చంద్రుడు. వారికి దక్షుడు పుత్రుడుగా కలిగి, ప్రజాపతులలో ఒకడై వర్ధిల్లాడు.
[వెన్నెలకంటి సూరన, ఆంధ్ర శ్రీవిష్ణుపురాణం, ద్వితీయాశ్వాసం, 180 నుంది 248 వరకు భాగం - ఈ వ్యాసంలో కథనానికి ఆధారం.]
(సమాప్తం)
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.







Comments