బలం

Balam - Telugu Inspirational Story | Bhattu Venkata Rao
బలం - తెలుగు ప్రేరణాత్మక కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 21/11/2026
‘బలం’ కథ ఆత్మవిశ్వాసం, సాహసం, ఎదగాలనే తపనకు అద్దం పడుతుంది. చిన్ననాటి స్నేహితుడి ధైర్యమైన మాటల నుంచి స్ఫూర్తి పొందిన గౌతమ్, జీవితంలో ఉన్నత శిఖరాలను చేరేందుకు ఎలా ముందడుగు వేశాడో ఈ కథ చెబుతుంది.
‘రేపొస్తున్నాను. ఉదయం తొమ్మిదిన్నరకు విమానం దిగుతాను’ – అని సమాచారం పంపాడు గౌతమ్. విమానాశ్రయానికి కారు వెళ్ళింది.
అరగంట ఆలస్యంగా విమానాశ్రయంలో విమానం దిగింది.
పదకొండు గంటలకు చేరవలసిన చోటికి చేరాడు గౌతమ్. గదిలో ఎవ్వరూ లేరు.
సోఫాలో కూర్చున్నాడు గౌతమ్. ఎదురుగా టీపాయ్ మీద నోట్ ఉంది. అందులో – ‘పది నిమిషాల్లో మీ ముందుంటాను.
రిలాక్స్ అవ్వండి’ – అని వ్రాసి ఉంది. టీపాయ్ మీదనే వాటర్ బాటిల్ ఉంది. సీల్ బ్రేక్ చేసి ఒక గుక్క నీళ్ళు తాగాడు.
ఒక్క నిమిషం ఆగి, సోఫాలోంచి లేచి, కొంచెం దూరంలో ఉన్న విశాలమైన అద్దాల కిటికీ వద్దకు వెళ్ళి నిలబడి, అందులోంచి చూశాడు.
ఇరవయ్యో అంతస్తులో ఉన్న ఆ అధునాతన ఆకాశహర్మ్యపు గది కిటికీ అద్దంలోంచి నగరం అంతా కనపడుతోంది.
గౌతమ్‌కు అది పూర్తిగా అపరిచిత నగరం. ఆసక్తిగా చూస్తూ నిలబడ్డాడు గౌతమ్. చూస్తుంటే సమయం గడవడం తెలియలేదు అతడికి.
ఎన్నాళ్ళుగానో అలా చూడడాన్ని తన మనసులో ఊహించుకుంటూ ఉన్నాడు అతడు. పది నిమిషాలపైన మరో రెండు నిమిషాలు గడిచిన సంగతి అతడికి తెలియలేదు.
అతడున్న గది తలుపు తెరుచుకున్న మెత్తటి ‘క్లిక్’ శబ్దానికి ఉలికిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఒక యువతి లోపలికొచ్చింది.
చేతిలో కాగితాలున్న ఫైల్ ఫోల్డర్ ఉంది. పెద్దగా మేకప్‌లో లేదామె. సింపుల్‌గా ఉంది. అందంగా ఉంది.
పెదవులపై చిరునవ్వుతో... “సారీ, రెండు నిమిషాలు ఆలస్యం అయింది!” అంది. “ఫరవాలేదు. మరో రెండు నిమిషాలు ఆలస్యమైనా గుర్తించగలిగేవాడిని కాదు.
ఈ పెద్ద అద్దాల కిటికీలోంచి కనిపిస్తున్న నగరం దృశ్యం చాలా బాగా ఉంది. పూర్తిగా అపరిచితమైన నగరం నాకిది.
చాలా అందంగా, ఆకర్షణీయంగా కనపడుతూ ఉంది ఇంత ఎత్తునుంచి చూస్తున్నప్పుడు…” అన్నాడు గౌతమ్, పెదవుల మీద కనిపించీ కనిపించని చిరునవ్వుతో.
“బహుశా అందులోనే రహస్యం దాగి ఉందనుకుంటాను!” అందామె సమాధానంగా గౌతమ్ వైపు చూస్తూ, స్నేహపూర్వకమైన చిరునవ్వుతో.
“హహహ... అవునంటారా... అపరిచితత్వంలోనే ఆకర్షణ అంతా దాగి ఉందంటారా?” అన్నాడు గౌతమ్. “ఏమో... నాకైతే ఆ దృశ్యం చాలా మామూలుగా కనపడుతుంది.
ప్రత్యేకమైన ఆసక్తిని ఏమీ అది నాలో రేకెత్తించదు. బహుశా రెండు సంవత్సరాలుగా నేను ప్రతిరోజూ చూస్తున్న దృశ్యం కావడం వలన అనుకుంటాను అలా అనిపిస్తుంది నాకు!” అందామె.
అలా అంటూనే గదిలో మరింత లోపలికి వేసి ఉన్న ఆమె టేబులు వైపుకు నడిచింది.
ఆమెను అనుసరించాడు గౌతమ్. ఆమె టేబులుకు అవతలి వైపు తన కుర్చీలో ఆమె కూర్చుంది, టేబులుకు ఇవతలి వైపు వేసున్న మూడు కుర్చీలలోని మధ్య కుర్చీలో గౌతమ్ కూర్చున్నాడు. “అలా అన్నిటి విషయంలోనూ చెప్పలేమనుకుంటాను.
హృదయానికి బాగా ఇష్టమైన దృశ్యాలు ఎన్నిసార్లు చూసినప్పటికీ అపరిచితాలంత కొత్తగానే ఎప్పుడూ కనపడతాయని నేననుకుంటాను!” అన్నాడు గౌతమ్.
“మీలోని భావుకత్వం నుంచి పుట్టినదిగా ఉన్న మీ అభిప్రాయం బాగుంది.
బాగా మాట్లాడుతున్నారు మీరు...” అందామె ప్రశంశాపూర్వకమైన చూపులతో, సహజంగానే విల్లులా ఒంపు తిరిగి అందంగా కనిపిస్తున్న ఆమె కనురెప్పలను కొంచెంగా పైకెత్తి, కళ్ళు పెద్దవి చేసి గౌతమ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ.
ఎందుచేతనో ఆమె చూసిన చూపు గౌతమ్‌లో ‘అలర్ట్ బెల్’ను మోగించింది. వెంటనే సర్దుకుని... “గుడ్ మార్నింగ్, అయామ్ గౌతమ్!” అన్నాడు చిరునవ్వును పెదవులపై నుంచి చెరగనీకుండా, ఆమె వైపు సౌమ్యంగా చూస్తూ... ‘ఇక వ్యాపారం గురించి మాట్లాడడం మొదలుపెడదామా?’ అని సూచిస్తూ.
గౌతమ్ మాటలతో ఆమె కూడా సర్దుకున్నట్లుగా అయి... “గుడ్ మార్నింగ్ గౌతమ్. నా పేరు స్పందన.
మీరు పంపిన ప్రాజెక్టు ప్రపోజల్ కంపెనీకి నచ్చింది. మీతో విషయాలన్నీ వినయంగా మాట్లాడి రెమ్యూనరేషన్ నెగోషియేట్ చేయమని కంపెనీ నన్ను నియమించింది.
ఆ వివరాలన్నీ ఈ ఫైల్లోని పేపర్లలో ఉన్నాయి. విశ్రాంతిగా కూర్చుని అందులోని వివరాలన్నీ దయచేసి చదవండి...” అని తన చేతిలో ఉన్న ఫైల్‌ను గౌతమ్ ముందుకు నెమ్మదిగా అందించింది.
గౌతమ్ ఫైల్‌ను తెరుస్తుండగా... “నా మాట నమ్మండి… ఈ నగరాన్ని మీకు ఇక అపరిచితంగా మిగలనివ్వను.
ఇక్కడ నా పని అదే!” అని గౌతమ్ వంక స్నేహపూర్వకంగా చూస్తూ, చిరునవ్వు నవ్వుతూ, తన కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయిందామె.
సరిగ్గా పదిహేను నిమిషాలు గడిచిన తరువాత స్పందన మళ్ళీ గౌతమ్ కూర్చుని ఉన్న గదిలోకి వచ్చింది. అప్పటికి గౌతమ్ ఆమె ఇచ్చిన ఫైలును చదవడం పూర్తి చేశాడు.
వచ్చి తన కుర్చీలో కూర్చున్న ఆమె వైపుకు తలెత్తి చూశాడు. “ఏమనుకుంటున్నారు మిస్టర్ గౌతమ్? ఫైల్లో వివరాలన్నీ మీకు నచ్చినట్లుగానే భావిస్తున్నాను...” అంది చిరునవ్వుతో స్పందన.
ప్రతిగా గౌతమ్ కూడా మందహాసం చేసి... “దాని గురించి మాట్లాడబోయే ముందు, సరదాగా మీకో కథ చెబుతాను స్పందనగారూ, దయచేసి వినండి. నేను ఒక చిన్న పల్లెటూరిలో పుట్టాను.
అక్కడే పెరిగాను. రెండెకరాల పొలం, ఒక చిన్న పాతకాలపు పెంకుటిల్లు ఆ పల్లెటూరిలో మా ఆస్తి. ఆ పల్లెటూర్లో మా ఇంటి పక్కనే నాకు బాగా ఇష్టమైన ఒక స్నేహితుడున్నాడు.
వాళ్ళకు మాకున్నపాటి పొలం కూడా లేదు. రెండు సెంట్ల ఖాళీస్థలంలో ఒక పూరిగుడిసె మాత్రమే వాళ్ళకు ఉంది.
పదవ తరగతిదాకా మా ఊర్లో ఉన్న బడులలోనే మా విద్యాభ్యాసం సాగింది. నేను పై చదువు కొనసాగించాను.
స్థోమత లేక వాడు చదువు మానేశాడు. వేసవి సెలవుల్లో మధ్యాహ్నం వేళల పొలాల గట్లమీద, మా ఊరిని ఆనుకుని పారుతూ ఉండే ఏటి ఒడ్డున ఇసుకలో ఎవరివీ కాకుండా పెరిగిన తాటిచెట్ల మీద మా దృష్టి పడేది.
తాటిచెట్టు ఎక్కి పైన మొవ్వులో ఉండే తాటికాయల గెలలను కొట్టి కింద పడేయడం అంత తేలికైన పని కాదు. కానీ వాడు మాత్రం ఆ పనిని చాలా సులభంగా, ఒక ఆటగా చేసేవాడు.
తాటిచెట్టు ఎక్కి కాళ్ళు దాని కాండానికి మెలేసి వెనక్కి జారి విన్యాసాలు కూడా చేసేవాడు. కింద నిలబడి చూసే నాకు చాలా భయం వేసేది.
‘మస్తుంటదిరా గౌతమ్ ఇక్కణ్ణుంచి ఏటిని, ఊరిని చూస్తుంటే…’ అనేవాడు. నేను ఆ దృశ్యాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నించేవాడిని. ఎంత ప్రయత్నించినా నా ఊహకు అది అందేది కాదు. ‘చెట్టు ఎంత ఎత్తైనదైతే దృశ్యం అంత మజాగా ఉంటదిరా...’ అనేవాడు.
తాటిచెట్టు ఎక్కి కాండం చుట్టూ కాళ్ళు మెలేసి మొవ్వు దగ్గర కులాసాగా కూర్చుని నడుముకి వెనకవైపు పెట్టుకెళ్ళిన కొడవలితో తాటికాయలున్న గెలలను కోసి కింద పడేసేవాడు.
తాటిచెట్టు ఎక్కిన ప్రతిసారీ మొవ్వులో కూర్చుని ఆ పని చేస్తూ నన్ను ఆ మాటలతో ఉడికించేవాడు. అంత ఎత్తునుంచి చుట్టూ చూస్తూ వాడు మాట్లాడిన మాటలు నా మనసులో బాగా నాటుకుపోయాయి.
కిందకి దిగివచ్చిన తరువాత ఒక్కొక్క తాటికాయను జాగ్రత్తగా కొడవలితో కొట్టి, ముంజలు బయటకు తీసి తినమని చేతికిచ్చేవాడు. వాడూ తినేవాడు. కానీ నేను తినడాన్ని చూస్తూ ‘చాలా బాగున్నాయిరా’ అని నేను మెచ్చుకుంటే చాలా ఆనందపడేవాడు.
అలా తాటిముంజలను తింటున్న ఒక సందర్భంలో ‘ఎత్తు పెరిగే కొలదీ పైనుంచి చూసినప్పుడు కళ్ళెదురుగా కనపడే దృశ్యంలో మజా పెరుగుతుందిరా గౌతమ్’ అని సరదాగా వాడు చెప్పిన మాటలు నాకు ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చాయి.
ఇప్పుడు మనం కూర్చుని ఉన్న ఈ ఇరవయ్యవ అంతస్తు కంటే ఎత్తులో, ఈ ఆకాశహర్మ్యం చివరి అంతస్తులో కూర్చుని ఈ నగరాన్ని చూస్తే ఇంకెంత బాగా ఉంటుందో చూడాలన్న కోరిక అకస్మాత్తుగా నాకు కలిగింది!” అని నవ్వుతూ తాను చెబుతున్న కథను ముగించాడు గౌతమ్.
అంతా విన్న తరువాత, ఒక నిమిషం తదేకంగా గౌతమ్ వైపే చూస్తూ కూర్చుంది స్పందన.
గౌతమ్ కూడా దృష్టి మరల్చకుండా స్పందన వైపే చూస్తూ కూర్చున్నాడు. గౌతమ్ మాటలలో భావం ఆమెకు అర్థమైంది. మందహాసం చేస్తూ “ముప్పై అంతస్తులున్న భవనం ఇది. ఈ భవనం చివరి అంతస్తులో CEO గారు కూర్చుని ఉంటారు.
అక్కడికి వెళ్ళడానికి నాకు అనుమతి లేదు. ఆ కింద 29వ అంతస్తులో Chief Technology Officer కూర్చుని ఉంటారు. అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళగలను. మీకు అంగీకారమైతే నాతో రండి!” అంది మరింక ఎక్కువేమీ మాట్లాడకుండా ఆమె.
“అలాగే స్పందనగారూ... పదండి వెళదాం. అక్కడి నుండి ఆ చివరి అంతస్తుకు CTO గారు నన్ను తీసుకెళతారు!” అన్నాడు నవ్వుతూ గౌతమ్. 29వ అంతస్తుకు వెళుతుండగా లిఫ్టులో అడిగింది స్పందన, “ఒక్కసారిగా ఇంత ఎత్తుకు ఎదిగే సాహసం చేస్తున్నారు.
మీకు భయం వేయడం లేదా?” ఆమె ప్రశ్నకు సరదాగా నవ్వి "నేను కూడా వాణ్ణి ఇలాగే అడిగేవాణ్ణి స్పందనగారూ... 'అంత ఎత్తులో పొరపాటున కాలుజారితే ఏమవుతావురా? భయం లేదా?' అని. దానికి వాడు ఒక నవ్వు నవ్వి… 'చేతులు నావి, కాళ్ళు నావి అయినప్పుడు నాకు భయమెందుకేస్తదిరా గౌతమా...' అనేవాడు.
అలా, వాడి మాటల్లోనే చెప్పాలంటే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి బుద్ధి అంతా నా ఒక్కడిదే స్పందనగారూ... మరింక నాకు భయమెందుకు చెప్పండి?" అని బదులిచ్చాడు గౌతమ్.
(సమాప్తం)
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.












Adbhutamaina kathanam mariyu spoortidayakam