బాల రాముడు

Bala Ramudu - Telugu Childrens Stories | Varalakshmi Yanamandra
బాల రాముడు - తెలుగు బాలల కథలు | వరలక్ష్మి యనమండ్ర
Published in manatelugukathalu.com on 21/11/2026
“బాల రాముడు” కథ పిల్లలకు రాముడి బాల్యంలోని సరదా సంఘటనలతో పాటు నిజాయితీ, ప్రేమ, పంచుకోవడం, తల్లిదండ్రుల మాట వినడం వంటి మంచి విలువలను పరిచయం చేస్తుంది.
సెలవులొచ్చాయంటే చాలు మిట్టు, మహి, కార్తికేయ, మహతి, మయూఖ ఐదుగురితో ఆ ఇల్లంతా ఆటలతో, పాటలతో, అల్లర్లతో సందడే సందడి! రాత్రి అయితే మాత్రం కథలు చెప్పమని ఒకటే అల్లరి, అమ్మమ్మని సతాయింపు.
రాత్రి భోజనాలు అవగానే అమ్మమ్మ చుట్టూ చేరతారు గడుగ్గాయలు. ఆరుబయట చల్లని వెన్నెలలో అరుగుమీదే వీరి కథావేదిక.
"అమ్మమ్మా! కథ చెప్పవా?" అన్నాడు మిట్టు.
"అవును అమ్మమ్మా, కథ!" అంది మహతి.
"సరే. ఈ రోజు బాల రాముడి కథ చెబుతా" అంది అమ్మమ్మ.
ఐదుగురూ అమ్మమ్మ చుట్టూ చేరారు.
"అయోధ్యలో ఒక బుజ్జి బాబు రాముడు ఉండేవాడు. వాళ్ళమ్మ పేరు కౌసల్య. చాలా మంచివాడు" అంది అమ్మమ్మ.
"మన మిట్టు కన్నా మంచివాడా?" అంది మహతి నవ్వుతూ.
"అందరికన్నా మంచివాడు! ఒకరోజు అన్నం తింటున్నాడట. అప్పుడు రాముడికి ఆకాశంలో చందమామ కనిపించింది, పట్టుకుంటే బాగుండు అనుకున్నాడు."
"చందమామా? ఎలా తెస్తాడు?" అన్నాడు కార్తికేయ ఆశ్చర్యంగా.
"అందుకే, 'అమ్మా నాకు చందమామ కావాలి!' అని ఏడ్చాడు."
"అప్పుడు ఏం జరిగింది అమ్మమ్మా?" అడిగింది మయూఖ.
"అది ఆకాశంలో ఉంటుంది, అందదు నాన్నా! అని చెప్పినా వినకుండా మీలాగే మారాం చేశాడు రాముడు. వాళ్ళ అమ్మ ఎంత బుజ్జగించినా వినకుండా కావాలని పట్టుబట్టి అన్నం తినడం కూడా మానేశాడట."
"ఏమైందమ్మమ్మా! త్వరగా చెప్పు" అని ఆత్రంగా అడిగారు.
"ఇంతలో వాళ్ళ మంత్రి సుమంతుడు ఒక అద్దం తెచ్చి, చంద్రుడు కనిపించేలా ఉంచాడు. అందులో చందమామ కనిపించింది. రాముడు నవ్వాడు. అప్పుడు ఏడుపు, అల్లరి ఆపేశాడట."
"హా హా! అద్దంలో చందమామ!" అని మయూఖ చప్పట్లు కొట్టింది. "అన్నం తిన్నాడా అప్పుడు రాముడు?" అడిగాడు మహి.
"ఆ, తినేశాడు. తమ్ముళ్ళతో కలిసి హాయిగా ఆడుకున్నాడు కూడా."
"రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు అన్నదమ్ములు. తెలుసుకదా, పోయినసారి చెప్పానుగా! వాళ్ళ నలుగురూ ఎప్పుడూ కలిసిమెలిసి ఆడుకుంటూ ఏ వస్తువునైనా అందరూ కలిసి పంచుకుంటారు.
కలిసి చదువుకునేవారు. నాన్నకు ఎదురుతిరగరట, ఎప్పుడూ గొడవ పడరు. రాముడు పెద్దవాడు కాబట్టి తన మాట అందరూ వినేవాళ్ళు."
"నేను కూడా పంచుకుంటా!" అన్నాడు మిట్టు.
"నిన్న నా చాక్లెట్ తిన్నావుగా!" అంది మహతి. "మేము కూడా మిట్టు అన్నయ్య మాట వింటాము, ఎదురు తిరగం అమ్మమ్మా" అన్నారు మిగిలిన నలుగురు (మహి, మహతి, కార్తికేయ, మయూఖ).
"అయ్యో! సారీ మహతీ. రేపు నా చాక్లెట్ నీకే!" అన్నాడు మిట్టు.
అందరూ నవ్వారు.
"చూశారా? ఇప్పుడే మీరు రాముడిలా చేశారు" అంది అమ్మమ్మ మెచ్చుకుంటూ.
"ఇంకా చెప్పు అమ్మమ్మా!" అంది మహతి.
"రాముడు ఒక్క మాట చెప్పాడంటే అదే చేసేవాడు. అబద్ధం ఎప్పుడూ చెప్పేవాడు కాదు. అందుకే అందరూ రాముడిని ఎంతో ఇష్టపడేవారు" అంది అమ్మమ్మ.
"అంటే మనం కూడా నిజమే చెప్పాలి కదా అమ్మమ్మా?" అన్నాడు కార్తికేయ.
"అవును నాన్నా. నిజం చెబితే అందరూ ప్రేమిస్తారు."
"మేము ఇక నుంచి అబద్ధం చెప్పం!" అన్నారు ఐదుగురూ ఒకేసారి.
"మేము అమ్మానాన్నల మాట వింటాం!" అంది మయూఖ.
"తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో గొడవపడం!" అంది మహతి.
"అన్నీ పంచుకుంటాం!" అన్నాడు మిట్టు.
అమ్మమ్మ నవ్వింది. ఐదుగురినీ దగ్గరకు తీసుకుంది.
"ఇప్పుడు మీరందరూ నా బుజ్జి రాముళ్ళు!" అంది.
ఆకాశంలో చందమామ కూడా నవ్వింది. మెరిసే నక్షత్రాలు కన్నుగీటాయి.
రాముడినే తలచుకుంటూ పిల్లలు హాయిగా నిద్రపోయారు.
వరలక్ష్మి యనమండ్ర ✒️
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర
పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర
కలం పేరు: లేదు
స్వస్థలం: అద్దంకి,ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని
విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.
ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు
1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి)
2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి)
3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి)
తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది.
కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం
4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి)
5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)
6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక)
(400 ఆటవెలది పద్య సంపుటీ)
7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు)
అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి.
పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు
కొన్ని సమూహాలను నిర్వహణ, కొన్ని సమూహాలలో సమీక్షణం
యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను
నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.
ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.
జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం.










Comments