సంతృప్తి గుడారాలు
- Bugatha Yamuna

- Mar 18
- 5 min read

Samtrupti Gudaralu - Telugu Moral Story| Bugatha Yamuna
సంతృప్తి గుడారాలు - తెలుగు నీతి కథ | బుగత యమున
Publishes in manatelugukathalu.com on 18/03/2026
హడావిడిగా సోమవారం నాడు ఉదయం స్కూలుకు ఆలస్యం అవుతుందనే భయంతో, బైక్‌ను జెట్ వేగంలో నడుపుకుంటూ వస్తున్న రాఘవరావు మాస్టారు స్కూల్ దగ్గరకు చేరుకునే సరికి అక్కడ అంతా గందరగోళంగా ఉంది. స్కూలుకు ఎదురుగా ఉన్న ఖాళీ మైదానంలోకి సంచార జాతి వాళ్ళు వచ్చి డేరాలు వేసుకున్నారు. అతి కష్టం మీద వారిని, వారిని చూస్తున్న ఊరి జనాన్ని తప్పించుకుని లోపలికి పోయి హాజరు వేసుకున్నాడు. కొంత సేపటి తరువాత
స్టాఫ్ రూమ్ కిటికీలోంచి వాళ్ళను చూసిన రాఘవరావు మాస్టారు, తోటి మాస్టారైన శివతో. "చూడండి మాస్టారు! ఉండటానికి ఇల్లు లేదు, సరైన బట్ట లేదు. నేల మీద పడుకుంటారు, మట్టిలో తింటారు. వీళ్ళకి అసలు రేపు ఏం జరుగుతుందో అన్న భవిష్యత్తు చింత ఉందో లేదో, కదండీ?" అని చెబుతూ జాలిపడుతూ ఉండగానే
రాఘవరావుకి బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది. "ఈ కస్టమర్ కేర్ వాడికొకడికి వేరే పనే ఉండదు" అనుకుంటూ, ఫోన్ లిఫ్ట్ చేసిన అతనికి, "సార్! మీ లోన్ ఈఎంఐ బౌన్స్ అయింది. రేపటిలోగా కట్టకపోతే పెనాల్టీ పడుతుంది," అన్న సమాచారం చెవి దగ్గర మోత మోగించింది. ఆ క్షణానికైతే రాఘవరావుకి చెమటలు పట్టి టెన్షన్‌తో బీపీ పెరిగిపోయింది.
ఎదురుగా ఉన్న శివ మాస్టారు. "ఏమైంది మాస్టారు? ఉన్న పళంగా ఎందుకలా అయిపోయారు?" అని అడగగానే, తను పేర్చుకున్న ఇటుకల కలను, అందుకోసం అతను చిక్కుకున్న ఈ ఈఎంఐ వల గురించి చెప్పేందుకు సిద్ధమై "ఏమని చెప్పను మాస్టారు? ఇద్దరి పిల్లలను పట్టుకొని అద్దె ఇళ్లను మారుకుంటూ విసిగిపోయిన నాకు సొంతిల్లే పెద్ద కల. అందుకని పట్నం శివార్లలో ఒక స్థలం కొని మూడంతస్తుల అందమైన ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టడం అంటే మాటలా? పీఎఫ్ డబ్బులు తీశాను. బ్యాంక్‌లో భారీగా హోమ్ లోన్ తీసుకున్నాను. ఇటాలియన్ మార్బుల్స్, ఫాల్స్ సీలింగ్, మాడ్యులర్ కిచెన్... ఇలా ఎక్కడా రాజీ పడకుండా ఇల్లు అయితే కట్టాను. గృహప్రవేశం కూడా ఘనంగా అయిపోయింది."
కానీ, ఇల్లు పూర్తయిన మరుక్షణం నుంచే నా జీవితంలో 'ప్రశాంతత' అనేది మాయమైపోయింది.
నెల తిరిగేసరికి ముప్పై వేల రూపాయల ఈఎంఐ కట్టాలి. దానికి తోడు ఇంటి నిర్వహణ.
ఇల్లు ఒక దేవాలయంలా, మ్యూజియంలా మారిపోయింది తప్ప, అందులో నివసించే మా మధ్య నవ్వులు కరువయ్యాయి. ఎప్పుడూ ఇంటి ఖర్చుల గురించే గొడవలు. ప్రతి చిన్న విషయానికీ ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూనే ఉంటే, వాళ్ళు బాధపడడం ఇదే మాస్టారు, నా సమస్య. ఏ మాత్రం జీతం పడడం లేట్ అయినా, ఇగోండి ఇలా బ్యాంక్ వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్. పోనీ ఈ ఈఎంఐ టైమ్ అయ్యేసరికి డబ్బులు అకౌంట్‌లో ఉంచుకుందామా అంటే వచ్చిన కొన్ని రోజులకే అన్నీ గాలి అయిపోతుంటే, ఇంకెలా దాచేది మాస్టారు?" అంటూ ఎవరి పనిలో వారు పడిపోయారు.
అలానే వారం రోజులు గడిచాయి. రాఘవరావు రోజూ బడి కిటికీలోంచి ఆ సంచార జీవులను గమనిస్తూనే ఉన్నాడు.
ఒకరోజు మధ్యాహ్నం బడిలో లంచ్ బ్రేక్. రాఘవరావు భార్య సునీత కట్టిచ్చిన క్యారేజీ తింటున్నారు.
బయట మైదానంలో ఉన్న వారు కూడా భోజనం చేస్తున్నారు. తను భోజనం తింటూనే వాళ్ళపై కూడా ఓ కన్నేశాడు. పిల్లలు, భార్యాభర్తలిద్దరితో పాటుగా కూర్చుని ఓ ఐదు కుటుంబాల వారు ఎవరి కుటుంబాలతో వాళ్లే కూర్చున్నారు. ఒకటే కంచం. అన్నంలో ఎర్రటి పచ్చడిని కలుపుకొని, ఒకరికొకరు అన్నం తినిపించుకుంటూ, పెద్దపెద్దగా నవ్వుకుంటూ, ఆ అన్నాన్ని ఫైవ్ స్టార్ హోటల్ బిర్యానీ కంటే అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు.
పిల్లలు మట్టిలో దొర్లుతూ పచ్చడి నాకుతున్నారు. అయినా వాళ్ళ ముఖాల్లో వెయ్యి వోల్టుల ఆనందం కనిపించింది.
రాఘవరావుకి ఆశ్చర్యం వేసింది. నిన్న రాత్రి తన పదేళ్ల కొడుకు డైనింగ్ టేబుల్ మీద కూర వలికించాడని రాఘవరావు వాడిని కొట్టడంతో వాడు ఏడుస్తూ పడుకోవడం గుర్తొచ్చింది.
మనసులో "నా దగ్గర లక్ష రూపాయల డైనింగ్ టేబుల్ ఉంది, కానీ నవ్వుతూ అన్నం తినే అదృష్టం లేదు. వీళ్ళ దగ్గర కనీసం కంచాలు కూడా లేవు, కానీ ఎంత ప్రశాంతంగా, ఆనందంగా తింటున్నారు?" అనుకున్నాడు.
ఆ రోజు సాయంత్రం బాగా వాన పడేలా ఉంది. ఆకాశం నల్లబడింది. రాఘవరావు బడి ముగించుకుని, బైక్ స్టార్ట్ చేస్తూ డేరాల వైపు చూశాడు.
"వాన పడితే వీళ్ళ డేరాలు తడిచిపోతాయేమో! పాపం రాత్రంతా ఎలా నిద్రపోతారో?" అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆ రాత్రికి పెద్ద గాలివాన వచ్చింది. రాఘవరావు తన మూడంతస్తుల ఇంట్లో, కిటికీలు గట్టిగా వేసుకుని, "ఎక్కడ గోడలకి చెమ్మ పడుతుందో, ఎక్కడ సీలింగ్ పాడవుతుందో" అని టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూనే ఉంటే, అతని భార్య సునీత "వర్షం వచ్చిందంటే చాలు బాల్కనీలో టైల్స్ మీద నీరు నిలిచిపోతుంది. ఈ ఇంటి సేవలు చేయలేక చస్తున్నాను బాబోయ్!" అంటూ వాపోతూనే ఉంది.
మరుసటి రోజు ఉదయం రాఘవరావు బడికి వెళ్ళాడు. "రాత్రి వానకి ఆ సంచార జీవుల డేరాలు ఎగిరిపోయి ఉంటాయి కదా! వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారో" అనే ఆలోచనతో స్కూలుకు వస్తున్న రాఘవరావుకి, ఒక పాత డోలక్ (Drum) వాయిస్తూ కూర్చున్న ఆ గుంపు నాయకుడు కనిపించాడు. పిల్లలు ఆ వాన తర్వాత వచ్చిన చల్లటి గాలికి ఆనందిస్తూ, మట్టిలో డ్యాన్స్ చేస్తున్నారు.
మిగతా వాళ్లంతా నవ్వుకుంటూనే పడిపోయిన డేరాలను మళ్ళీ కడుతున్నారు.
వాళ్ళకి నిన్నటి వాన ఒక ప్రమాదంలా కాకుండా, ఒక పండగలా అనిపించినట్టు. "ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారబ్బా" అనుకుంటూ,
అతని చదువు, అతని ఆస్తులు అన్నీ ఆ సంచార జీవుల నవ్వుల ముందు చిన్నబోయినట్టు, నేరుగా మైదానంలోకి, ఆ గుంపు నాయకుడు సింగన్న దగ్గరికి వెళ్లి,
"ఏమయ్యా సింగన్నా! రాత్రి వర్షం వచ్చింది కదా! అంతా బాగున్నారా? ఎవరికీ ఏం ప్రమాదం లేదు కదా!" అని అడిగేసరికి.
సింగన్న: "ఓ మాస్టారు గారూ! దండాలండీ. రండి సార్. ఏమనుకోకుండా, ఈ పాత కుర్చీ మీద కూర్చోండి. మా చిన్నోడు నిన్ననే ఊళ్ళోకి పోయి ఏరుకొచ్చాడు." అనగానే, రాఘవరావు కూడా చిన్నబుచ్చుకోకుండా.
ఆ విరిగిన ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్న తరువాత.
సింగన్న: "ప్రమాదమా? దేనికి మాస్టారూ? ఈ డేరా ఎగిరిపోతే, వెదురు కర్రలు పాతడానికి మాకు పట్టేది అరగంట సమయం. మా ఇల్లు ఈ మట్టిలోనే, మా బతుకు ఈ గాలిలోనే. వాన వస్తే చెట్లు తడుస్తాయి, మేమూ తడుస్తాం. అంతే కదా సారూ?" అని తడుముకోకుండా సమాధానమిచ్చాడు.
అందుకు
రాఘవరావు: "అది కాదు సింగన్నా! మీకు రేపటి గురించి చింత లేదా? మీకంటూ ఒక సొంతిల్లు లేదు, పక్కా భవనం లేదు. మీ పిల్లలకి ఆస్తిపాస్తులు లేవు. రేపు ఏమవుతుందోనన్న భవిష్యత్తు టెన్షన్ మీకు ఉండదా?" అన్నాడు.
సింగన్న తన డోలక్ పక్కన పెట్టి చిరునవ్వుతో రాఘవరావు వైపు చూస్తూ,
"మాస్టారు గారూ! మీరు చదువుకున్నోళ్ళు. మీకు అన్నీ తెలుసు. కానీ ఒక్క మాట చెప్తా వినుకోండి. మీరు 'ఇంట్లో బతకడానికి' ఇల్లు కట్టుకుని మీ ఆనందాన్ని అంతా ఆ ఇంట్లోనే బంధించేస్తారు." "మేము అలా కాదయ్యా! ఉపాధి కోసం ఊరూరా తిరుగుతాం. కనపడిన ఖాళీ స్థలమే మా ఇల్లయ్యా. మా పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటాం అయ్యా. ఇంక ఆస్తులు, పిల్లల భవిష్యత్తు అంటారా! మేము నేర్పిన పనే వాళ్ళకు భవిష్యత్తు. వాళ్ళు చేసిన శ్రమే వాళ్ళకి ఆస్తి. అది చాలయ్యా, మా బతుకులకు."
మాకు ఆస్తులు లేకపోయినా 'ఆకలి' ఉంది, 'ఆరోగ్యం' ఉంది. ఆ పూటకు గంజి దొరికితే చాలు మా ఆకలి పొట్టను నింపుకోవడానికి. మేము మా ఆనందాన్ని డేరాల్లో దాచుకోము, మా గుండెల్లో దాచుకుంటాం" అని
సింగన్న చెప్పిన మాటలు రాఘవరావు మనసులో సునామీలా రేగాయి. "నిజమే కదా! ఒక ఇల్లు అనేది చలి, ఎండ, వానల నుంచి మనల్ని కాపాడే ఒక కవచం మాత్రమే. కానీ నేను ఆ ఇంటినే దేవుడిగా మార్చేశాను. టైల్స్ పాడవుతాయని పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుకోనివ్వడం లేదు. ఈఎంఐ టెన్షన్‌తో భార్యతో ప్రేమగా మాట్లాడటం మానేశాను. ఇల్లు అందంగా ఉంది కానీ, నా మనసులో, నా కుటుంబంలో ఆనందం లేదు.
ఈ సంచార జీవులు మట్టిలో ఉన్నా, వారి మనసులు ఆకాశమంత స్వేచ్ఛగా ఉన్నాయి. నా జీవితాన్ని నేనే ఒక కాంక్రీట్ జైలుగా మార్చుకున్నాను."
రాఘవరావు కళ్ళలో కన్నీళ్లు తిరిగి, సింగన్న రెండు చేతులు పట్టుకుని,
"సింగన్నా! నువ్వు చదువుకోలేదు కానీ, ఈ చదువుకున్న వాడికి ఒక పెద్ద వేదాంతం నేర్పావు. ఇల్లు అనేది కాళ్ళు చాపుకోవడానికి తప్ప, ఆనందాన్ని కట్టిపడేయడానికి కాదని నాకు అర్థమైంది. మీ నవ్వు ముందు నా మూడంతస్తుల ఇల్లు కూడా చాలా చిన్నదిగా అనిపిస్తోంది. నేను వస్తాను సింగన్నా."
రాఘవరావు మనసులో ఉన్న ఒక పెద్ద భారం, టెన్షన్ అన్నీ ఆ క్షణంలో మాయమైపోయాయి.
ఆ రోజు సాయంత్రం రాఘవరావు ఇంటికి ముఖంలో ఎన్నడూ లేని ప్రశాంతతను నింపుకొని వెళ్ళాడు.
ఇంటికి వెళ్లి వెళ్లడంలోనే సునీత కోపంగా అరుస్తూ, "ఏవండీ! చూడండి! ఈ పిల్లలు హాల్లో క్రికెట్ ఆడి, ఆ ఖరీదైన గ్లాస్ టీపాయ్ పగలగొట్టారు! పదివేల రూపాయలు బూడిదలో పోసినట్టే! పిల్లల్ని రెండు పీకండి!" అంటూ ఉంటే,
పిల్లలు ఇద్దరూ భయంతో వణికిపోతూ మూల నిలబడ్డారు.
కానీ రాఘవరావు కోప్పడలేదు. నవ్వుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళాడు. కింద పడిన గ్లాస్ ముక్కలను జాగ్రత్తగా ఊడ్చి చెత్తబుట్టలో వేస్తూ, "పర్లేదు సునీతా! పగిలింది ఒక వస్తువే కదా, నా పిల్లల మనసు కాదు కదా! గ్లాస్ పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు, కానీ వాళ్ళ చిన్నతనం, వాళ్ళ నవ్వులు మళ్ళీ రావు. అద్దం పగిలితే మనకెందుకు బాధ? అది దానికి ఉన్న లక్షణం." అనగానే, సునీత ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది. "మీకేమైనా జ్వరమా అండీ? నిన్నటి దాకా ఒక గీత పడితేనే గోల చేసేవారు. ఈ రోజేంటండీ ఇలా మారిపోయారు?" అంది.
అందుకు
రాఘవరావు పిల్లల్ని ఇద్దరినీ దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంటూ "జ్వరం కాదు సునీతా! ఇన్నాళ్లూ నాకు పట్టిన 'ఆస్తుల జ్వరం' ఈ రోజు తగ్గిపోయింది. ఇల్లు అనేది మనం సంతోషంగా బతకడానికి, వస్తువులను కాపలా కాయడానికి కాదు. రండి, ఈ రోజు బయటికి వెళ్లి హాయిగా పానీపూరి తిందాం!"
పిల్లలు ఆనందంతో గంతేశారు. సునీత ముఖంలో కూడా ప్రశాంతమైన నవ్వు విరిసింది.
మరుసటి రోజు రాఘవరావు ఆ సంచార జీవుల గుడారాల వైపు కిటికీలోంచి చూస్తూ కృతజ్ఞతగా దండం పెట్టుకుంటూ, "ఉన్నదానిలో తృప్తి పడేవారే నిజమైన ధనవంతులు" అనుకున్నాడు.
సమాప్తం
బుగత యమున గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: బుగత యమున
నేను బుగత యమున,సెకండరీ గ్రేడ్ టీచర్ గా గోకవరం మండలంలో పని చేస్తున్నాను..నాకు సాహిత్యం అంటే ఎనలేని అభిమానం..ఆ అభిమానం అందించిన ప్రోత్సాహకంతోనే ముందుగా ప్రతిలిపి యాప్ లో రచనలు చేయడం మొదలుపెట్టి..సుమారు 200 వరకూ రచనలు చేసాను..అలాగే సాహితీ గోదావరి మరియు విశాఖ సంస్కృతి పత్రికలకు కూడా నేను కవితలు రాస్తూ ఉంటాను..
***
#BugathaYamuna, #బుగతయమున, #సంతృప్తిగుడారాలు, #SamtrupthiGudaralu #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు




Comments