సోషల్ కరెన్సీ

Social Currency - Telugu Social Story | Dr. Kiran Jammalamadaka
సోషల్ కరెన్సీ - తెలుగు సామాజిక కథ | డా: కిరణ్ జమ్మలమడక
Published In manatelugukathalu.com On 22/09/2026
దేజావు నేపథ్యంతో కథనం, భిన్న యుగాల్లో ఒకే సమస్య, స్త్రీ స్వాతంత్ర్యం పై ప్రశ్న సమాజపు ద్వంద్వ వైఖరి, మహిళా ప్రేరణ కథలు, ఆధునిక కథలు |
“సోషల్ కరెన్సీ” లైకులు, కామెంట్లు, ఫాలోవర్ల కోసం యువతలో పెరుగుతున్న మోజును ప్రతిబింబించే సామాజిక సందేశ కథ. స్వాతి ప్రయాణం ద్వారా సోషల్ మీడియాలో గుర్తింపు కోసం మన నిజమైన ప్రతిభను, విలువలను ఎలా కోల్పోతామో కథ చూపిస్తుంది. చివర్లో తన చెల్లెలి అమాయకత్వంలో తన ప్రభావాన్ని చూసుకున్న స్వాతి తీసుకున్న నిర్ణయం ఆత్మపరిశీలనకు దారితీస్తుంది. సోషల్ మీడియాను ఉపయోగించడమే కాదు, అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచింపజేసే కథ ఇది.
ఆ రోజే మొదటి రోజు. కొత్త కాలేజి, కొత్త వాతావరణం, బావుందనిపించింది డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతికి. తన ఊరికి చేరాలి అంటే ఒక అరగంట బస్సు ప్రయాణం, బస్సు వచ్చేలోపు అక్కడే వున్న ఒక చిన్న బెంచి పైన కూర్చొని టీ తాగుతూ దూరంగా వున్న కొండల నడుమ సూర్యాస్తమయాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ, ఆనందిస్తోంది స్వాతి.
"ప్రతి సాయంకాలం అస్తమించే ఆదిత్యుడు, మరో ఆరంభానికి ఆహ్వానమే!"
అనే చిన్న వాక్యం ఆమె మనసులో మెరిసింది, ఆ మెరుపు తన పెదాల వరకు చేరుకుని చిరునవ్వు రూపంలో బయటకు వచ్చింది. స్వాతి ప్రభుత్వ కాలేజీ యూనిఫాంలో నిండుగా, తైల సంస్కారం చేయబడిన కురులు, కానీ పూమొగ్గ రంగులు ఇంకా పోలేదు. ప్రసన్న వదనం అంటే ఏంటో తెలియజెప్పే ఆమె మొహం, భుజానికి ఒక జోలె సంచి దాని నిండా తన కాలేజీ పుస్తకాలు, వాటితోపాటు తను రాసుకునే కవితల డైరీ, ఇది క్లుప్తంగా స్వాతి. ఆ ప్రశాంత క్షణాన్ని భంగపరుస్తూ బిలబిలమంటూ, కొంతమంది విద్యార్థినీ విద్యార్థులు వచ్చి ఆ బస్సు స్టాప్‌ని నింపేశారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్, వాటితో వారు ప్రతి కదలికను రికార్డు చేసుకుంటూ, రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకుంటూ చాలా హుషారుగా ఉన్నారు ఆ పిల్లంతా.
వాళ్ళని గమనిస్తూనే తన ఫోన్ వైపు ఒకసారి చూసుకొంది స్వాతి, తన కీప్యాడ్ ఫోన్‌కి వున్న చిన్న స్క్రీన్ లో టైంతో పాటు తన మొహం ప్రతిబింబం, లీలగా కనపడింది. ఇదివరకు లాగా తాను తన మొహం చూసి తన మొహం తిప్పుకోలేదు, సంతృప్తిగా నవ్వుకుంది. ఆ నవ్వుకు అర్థం మనకి తెలియాలంటే స్వాతి జీవితంలోకి మనమూ తొంగిచూడాలి.
పట్టణానికి, పల్లెకు మధ్యవుండే చిన్న ఊరు స్వాతి కుటుంబానిది, దిగువ మధ్యతరగతి కుటుంబం. తండ్రి దగ్గర్లోని వర్క్‌షాప్‌లో రోజువారీ కూలీగా పనిచేస్తాడు, తల్లి చదువు అంతగా లేని గృహిణి. వారికి ఇద్దరు కూతుర్లు స్వాతి, స్వప్న. వారి జీవితంలో విలాసాలు లేకపోయినా, చిన్న చిన్న సంతోషాలతో, అనురాగంతో, వారి జీవితం సాగిపోతోంది. పెద్దమ్మాయి స్వాతి చదువులో మంచి మార్కులతో పాసయ్యేసరికి వారి జీవితాల్లో కొత్త వెలుగు నిండింది. స్వాతి తల్లిదండ్రులు తను పెద్ద చదువులు చదవాలని, పెద్ద హోదాలు పొందాలని ఆశపడ్డారు.
ఒక సాయంత్రం అమ్మానాన్న స్వాతిని పిలిచారు. ఆమె చేతిలో రంగు కాగితాలతో చుట్టిన ఒక పెట్టె ఇచ్చారు.
ఆసక్తిగా కాగితాలు తీసి చూసిన స్వాతి, లోపల ఏముందో చూసి ఆశ్చర్యపోయింది. అది నిజమా?... కలా?... అనిపించింది. అది అమ్మానాన్న ఎన్నో నెలలుగా త్యాగాలు చేసి, పొదుపు చేసి కొన్న స్మార్ట్ ఫోన్ అది. స్వాతి కళ్ళలో సన్నటి పొర, తనకి అలాంటి ఫోన్ కావాలని వున్నా, తమ కుటుంబ పరిస్థితి తనకు తెలుసుకాబట్టి, తన కోరికను గొంతు లోపలే ఉంచేసింది. కానీ పిల్లలు ఏమి కోరుకున్నా తల్లిదండ్రులకు తెలుస్తాయంట, అది నిజమేమో అని అనిపించింది స్వాతికి. అప్పటిదాకా కన్ను సరిహద్దుల్లో ఆగిన కన్నీటి ధార, ధారలుగా బయటకు వచ్చి వారి ప్రేమకు కృతజ్ఞతలు చెప్పింది.
ఆ స్మార్ట్ ఫోన్, చిన్నచిన్న కలలతో పెరిగిన స్వాతికి, తన అరచేతిలో విజ్ఞాన ప్రపంచంతో పాటు వికృతతత్వాన్ని కూడా పరిచయం చేస్తుందని ఆ క్షణం వారి ఎవరికి తెలియదు.
క్రమంగా స్వాతి ఇంటర్మీడియట్ కొత్త కాలేజీలో చేరింది. కొత్త ప్రదేశాలు, కొత్త సావాసాలతో చాలా ఆనందంగా గడపసాగింది. స్వాతి తన ఫోన్, ఇంటికి కాల్ చేయడానికి లేదా వైజ్ఞానిక వీడియోలు చూడడానికి మాత్రమే వాడేది, ఆ రోజు అనిత గురించి తెలియనంతవరకు... 'అనిత' వాళ్ళ కాలేజీలో ఆమెని ఒక మహారాణి లాగ చూస్తారు, ఆమె పరిచయం కోసం మిగతా ఆడపిల్లంతా తహతహలాడుతుంటారు, ఆమె ఎందుకు అంత ప్రసిద్ధో స్వాతికి అర్థంకాలేదు, పక్కనే వున్న నీరజని అడిగింది.
"అనితకి లక్షల్లో ఫాలోయర్స్ వున్నారులే, అందుకని ఆ పొగరంతా" అని చెప్పింది తన అసూయని కూడా జోడించి.
"ఫాలోయర్స్ అంటే? ఆమె ఏమైనా ఉద్యమకారిణా?" అడిగింది అమాయకంగా.
నవ్వాపుకుంటూ "అయ్యో పిచ్చి స్వాతి! సోషల్ నెట్‌వర్క్ లో" అని వాటి గురించి వివరించి, వెంటనే తన ఫోన్ లో ఆమె వీడియోలు చూపించింది. వాటిలో అనిత చేసిన 'డబ్ స్మాషులు', రీల్స్, సినిమా డైలాగులు, పాటలు అన్నీ చూపించింది. అవి చూసిన స్వాతి...
"ఓహ్!, ఆమె నిజంగా మంచి టాలెంట్ వుంది, చాలా బాగా పాడుతోంది పాటలు" అంది, దానికి నీరజ ఒక్క నవ్వు నవ్వి...
"అయ్యో! అది తన గొంతు కాదు, వేరేవాళ్ళ పాటకు ఈమె పెదాలు కదిలించింది" అంది.
"అదేంటి అది కూడా టాలెంటా?" అంది స్వాతి ఆశ్చర్యపోతూ.
"ఇక్కడ అలాంటివే టాలెంట్, ఎవరో చేసినదాన్ని నువ్వు మళ్ళీ చెయ్యాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంతే, ఇలాంటి అందుబాటులో వున్న టాలెంట్ అయితేనే అందరు ట్రై చేస్తారు కదా..." అని క్లుప్తంగా చెప్పింది నీరజ.
ఆ వీడియోలకు అనితకు వచ్చిన ప్రశంసలు, తనలో ఒక 'ఆశ' అనే అగ్గిని రాజేసింది. వెంటనే తను కూడా తన ఫోన్ లో నీరజ సాయంతో అన్ని సోషల్ మీడియాల్లో ఖాతాలు తెరిచింది.
ఆరోజు రాత్రి...
"వెలుగు ఉంది నాలో..., ప్రపంచం చూడకపోయినా పరవాలేదు, ప్రతిభ ఉంది నాలో, ఓ రోజు అది నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది"
అని ఒక కవిత రాసిపెట్టి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆరోజు పరీక్ష రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూసినట్టుగా అనిపించింది స్వాతికి. తెల్లవారుతుండగానే తన కవితకి కొన్ని లైకులు, బావుందని... వావ్... అని, వెరీ టాలెంటెడ్... అని రకరకాల కామెంట్స్. అంతే ఉత్సాహంతో కాలేజీకి వెళ్ళిన స్వాతి, తన సోషల్ మీడియా అకౌంట్ ని నీరజకి చూపించింది. దానికి నీరజ ఫక్కున నవ్వి "ఏంటి ఒక పది లైకులు, ఒక అరడజను కామెంట్లెకే నువ్వు మురిసిపోతున్నావ్? అనితకి లక్షల్లో వుంటాయి ఇవి. అంతెందుకు నాకే వేలల్లో ఉంటాయి, అయినా ఈ కవితలు ఎవడు చూస్తాడు?" అని తేలికగా కొట్టేసింది.
స్వాతి ఒకింత చిన్నబుచ్చుకుంది, తను ఎంతో ఆశతో వస్తే నీరజ తన ఆశలపై నీళ్లు పోసింది. అయినా తను అలానే ప్రయత్నం చేయసాగింది. ఆ లైకులు, కామెంట్లు కొద్దిగా పెరుగుతున్నాయి, కానీ ఊహించినంతగా రావటంలేదు. రోజురోజుకు స్వాతికి అసహనం ఎక్కువైపోతోంది. మొదట ఒక లైక్, కామెంట్కి సంబరపడిపోయేది, ఇప్పుడు తనకి ఇంకా కావాలి, ఇంకా... ఇంకా... కావాలి కానీ ఎలా? అదే బాధను మరలా నీరజకు చెప్పింది స్వాతి.
"అయ్యో పిచ్చి మొహమా... నీ కవితలకు అంతే విలువ వుంది కాబట్టి నీకు అంతే కరెన్సీ వొస్తోంది, జామకాయ ఎవడు వెయ్యి రూపాయలు పెట్టి కొనడు కదా, నీ కంటెంట్ విలువ పది రూపాయలే, నీకు ఇంకా సోషల్ కరెన్సీ కావాలి అంటే దేనికి డిమాండ్ ఉందో అది నువ్వు సప్లై చేయాలి" అని జ్ఞాన బోధ చేసింది నీరజ, కానీ స్వాతికి ఏమి అర్థం కాలేదు.
"సోషల్ కరెన్సీ? అదేంటి కొత్తగా" అని అడిగింది స్వాతి.
"నిజ ప్రపంచంలో నీకు కరెన్సీ - డబ్బులు ఎలాగో, సోషల్ మీడియాలో సోషల్ కరెన్సీ అలా... ఎన్ని లైకులు, కామెంట్లు, ఎంతమంది ఫాలోయర్స్ ఉంటే అంత గొప్ప, గౌరవం, గుర్తింపు. ఈ సోషల్ మీడియాలో బతకడానికి సోషల్ కరెన్సీ కావాలి."
"ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ కరెన్సీ ఎలా వొస్తుంది?" అడిగింది స్వాతి.
"ఈ కరెన్సీ సంపాదించాలి అంటే ఈ మార్కెట్ లో నువ్వు 'ఎమోషన్' అమ్మకూడదు, 'ఎంటర్టైన్మెంట్' అమ్మాలి. నీలో వుంది వెలుగు అని ఏదో అన్నవుగా" అని వేటకారం ఆడింది నీరజ.
"నీ అందం, పర్సనాలిటీ నాకు ఉంటేనా ఈ పాటికి లక్షల్లో ఫాలోయర్స్ ని మైంటైన్ చేద్దును, ఆ అనితయెంత? ఆఫ్ట్రాల్" అని ఆత్మల అంగడిలోకి ఆహ్వానం పంపింది నీరజ స్వాతికి.
"అంటే, నేను వీడియో రికార్డు చేయనా?" ఆ... లైకుల మోజులో తాను ఏమి చేయబోతోందో స్వాతికి సోయలేదు. తనకి కావాల్సింది ఒక్కటే... లైకులు, తన దృష్టి అంతా దానిపైనే ఉంది.
"అదే నేను చెప్పేది" అని చెప్పింది నీరజ.
తన కవితలకు లైకులు రాకపోవటం స్వాతి భరించలేకపోతోంది. కానీ అనితలాగా ఫోటోలు, వీడియోలు పెట్టడానికి స్వాతి మనస్సు ఒప్పుకోవటంలేదు, మధ్యేయ మార్గంగా ఏదైనా చేయాలని అనిపించింది. ఆ క్షణం తనకి తెలియకుండానే రాజీ వైపు తన తొలి అడుగు వేసింది. దాని ఫలితమే, ఆరోజు అర్థరాత్రి ఆమె పెట్టిన పోస్ట్...
"అస్పష్టత నుంచి స్పష్టత దాకా, చీకటినుండి వెలుగు దాకా మసకబారిన ఈ రూపం, త్వరలో పరిచయం?"
అని అస్పష్టంగా వున్న తన మొహం ఫోటోని పోస్ట్ చేసింది.
తెల్లవారుతూనే ఫోన్ చేసే నోటిఫికేషన్ల శబ్దాలకి ఆమెకు మెలుకువవచ్చింది. ఆమెకి అర్థమైంది, తన పోస్ట్ కు కదలిక వొచ్చింది అని. ఆమె పెట్టిన పోస్ట్ కు వొచ్చిన లైకులు చూసుకుంది, ఇప్పటిదాకా ఆమెకు వొచ్చిన అన్ని ప్రశంసల కంటే ఈ పోస్టుకే ఎక్కువ. అక్కడ రాసిన కామెంట్లను చదవటం మొదలుపెట్టింది, చాలా ఆనందపడింది. కానీ అన్ని కామెంట్ల సారాంశం ముఖపరిచయం ఎప్పుడు అని.
తన కవిత కంటే, తన మొహానికి ఎక్కువ విలువుందా అని అనిపించినా, తన సోషల్ మీడియాలో మళ్ళీ కదలిక రావటం తనలో ఒక నూతనోత్సహాన్ని నింపింది. ఆ రోజు మరలా కాలేజీలో తానే హాట్ టాపిక్. ఆ గుర్తింపుకు అలవాటుపడిన స్వాతి, మెల్లిగా తన కవితల కంటే తన మొహాన్ని అంచెలంచెలుగా చూపించసాగింది.
దానికోసం మేకప్ కిట్లు, ఫోన్ ఫిల్టర్లు అన్నీ సమకూర్చుకుంది. తనకు పదవతరగతిలో 'క్లాస్ ఫస్ట్' అని, 'టాపర్', 'మెరిటోరియస్' అనే బిరుదులూ ఉండేవి. అవి ఇప్పుడు 1m వ్యూస్ అని, 10k ఫాలోయర్స్ అని రకరకాలుగా పిలుస్తున్నారు. నిజానికి ఆ కాలేజీలో చదివిన అందరి అమ్మాయిలకు ఆ నంబర్లే వారి గుర్తింపుగా, ఒక ర్యాంకులాగ మారాయి. తనని ఇన్ఫ్లుయెన్సర్ అని, కంటెంట్ క్రియేటర్ అని, క్రియేటివ్ కంటెంట్ క్రియేటర్ లాంటి బిరుదులతో పిలుస్తూవుంటే మురిసిపోయింది, తాను సమాజాన్ని ప్రభావితం చేస్తున్నానని ఆనందించింది, తనను అందరు రోల్ మోడల్ అంటూ వుంటే ఉప్పొంగిపోయింది.
తన ఫాలోయర్స్ కూడా పెరిగారు, అనితకు తాను పోటీగా మారింది. అదే ఎదుగుదల అని అనుకుంది, మార్కుల కంటే మాస్కులు ఎక్కువ అనుకుంది. అలా కొంతకాలం తనకి సోషల్ కరెన్సీ బాగానే ముట్టడం మొదలు పెట్టింది. తగ్గుతుంది అని అనిపించినప్పుడల్లా, మెల్లిగా కళ్ళు, పెదాలు, చిరునవ్వు అంటూ రకరకాల మార్కెటింగ్ చేసుకునేది, దానితో తనకు జనాలను తన వైపు ఎలా తిప్పుకోవాలో తెలుసునని గర్వపడింది.
తను అనుకున్నట్టుగానే తనకి సోషల్ మీడియాలో, తద్వారా క్లాసులో గుర్తింపు, గౌరవం పెరిగాయి. కాలం పరిగెడుతోంది, ఆ కాలం కాలి కింద మార్కులు కాలరాసిపోసాగాయి. అమ్మ, నాన్న, చెల్లితో గడిపే సమయం కూడా స్వాతికి దొరకటం లేదు. అలానే మరికొంత కాలం గడిచింది. కాలంతో పాటే కరెన్సీ కరగటం మొదలు పెట్టింది.
మళ్ళీ లైకులు తగ్గటం, కామెంట్లు లేకపోవటం మొదలయ్యింది, మళ్ళీ తాను ఏదో కోల్పోతున్నట్టుగా అనిపించింది స్వాతికి. అనిత సోషల్ మీడియా పరిశీలనగా చూడసాగింది. అప్పుడు అర్థమైంది ఆమెకు, అందం అంటే సోషల్ మీడియా దృష్టిలో మోహంలో మాత్రమే కనపడేది కాదని, ఇంకా కిందకు వెళ్లాలని. ఆ ఆలోచన రాగానే, తను తన మొహం నుంచి మరికాస్త కిందకు వెళ్ళటం మొదలుపెట్టింది.
కవితల స్థానంలో తన ఫోటోల క్యాప్షన్స్ పెట్టటం మొదలుపెట్టింది. మొదటిసారి తను మొహం పెట్టడానికి ఆలోచించినంతగా ఇప్పుడు తను ఆలోచించటంలేదు, 'మోర్ లైక్స్-మోర్ బోల్డ్' అని, 'మోర్ లైక్స్-మోర్ టీజింగ్' అని అందరిని తనవైపు ఆకర్షించుకుంది.
అలా అని తనకి ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేదంటే, ఉంది, కానీ ఆమె దాన్ని "#బి బోల్డ్", "#ఫ్రీడమ్", "#లైవ్ బై యువర్ టర్మ్స్", "#లివ్ ఆస్ యు లైక్" అని హ్యాష్‌ట్యాగ్‌లతో సమర్థించుకుంది. ఈ ఐడియా బాగానే పనిచేసింది, తను ఎంత బోల్డ్ గా ఉంటే అంత కరెన్సీ అని అర్థమైంది స్వాతికి. మరికొంత కాలం బండి నడిచింది, ఇంక అంతా నల్లేరుపై నడకే అనేటంతలో, మరల స్పీడ్ బ్రేకర్లు, మళ్ళీ కరెన్సీ తగ్గట్డం మొదలయ్యింది.
రోజురోజుకు తన అసహనం ఎక్కువవుతోంది, కాలేజిలోను అదే మాట, ఫాలోవర్లు తగ్గిపోయారు, లైకులు తగ్గిపోయాయి అని. ఎంతమందికి సమాధానం చెప్తుంది, ఏమని సమాధానం చెప్తుంది? తను అలసిపోయింది, ఆఖరికి ఒక నిర్ణయం తీసుకుంది.
ఇంటికి వెళ్లి "టుమారో! ఇఫ్ 10k లైక్స్, లైవ్ స్ట్రీమ్ విత్..." అని చిన్న డ్రెస్ బొమ్మ కూడా పెట్టింది.
అంతే, లైకులు వెల్లువలాగా పోటెత్తాయి, సోషల్ మీడియా అంతా తన పోస్టుతో హోరెత్తిపోయింది. తను క్లాస్ లోకి వెళ్ళగానే అందరు చప్పట్లతో స్వాగతం పలికారు, తను రేపటితో ఎక్కడికో వెళ్ళిపోతుందని అందరూ ఆమెని పొగడ్తలతో ముంచెత్తారు. "ఏం తెలివే బాబు నీది, నువ్వు సరిగా ట్రై చేస్తే పెద్ద 'బిజినెస్ విమేన్' అవుతావు" అంది నీరజ.
ఎప్పుడు లేనిది అనిత వచ్చి "చెయ్యి ఇవ్వు, వీలైతే మనమిద్దరం కలిసి ఒక కోలాబ్ పోస్ట్ పెడదాం" అంది. ఆ మాట తనకి చాలా ఆనందాన్ని తెచ్చింది. తాను ఒకప్పుడు సెలబ్రిటీ లాగా చూసే అనిత ఇప్పుడు తనదగ్గరకు వచ్చింది. ప్రపంచంలో ఇంతకంటే సాధించటానికి ఏముంది అనిపించింది ఆ క్షణం స్వాతికి.
పుస్తకాలకని అడిగి తీసుకున్న డబ్బులు పెట్టి మేకప్ సామాను కొనుక్కుంది, రకరకాల హెయిర్ స్ప్రేలు, రంగులు, అలంకరణ వస్తువులు కొని ఇంటికి వచ్చింది.
తల్లిదండ్రులు పలకరించేలోపు, తన గది వైపు వెళ్ళిపోయింది. వారు కూడా చదువు ధ్యాసలో ఉందని భ్రమించారే తప్ప పెద్దగా ఆరా తీయలేదు. స్వాతి ఇంతలో తన ఫోన్ లో తన ప్రొఫైల్ చూసుకుంది, తాను అనుకున్నట్టుగానే 10k లైక్స్ వొచ్చేశాయి.
త్వరగా టైం చూసుకుంది, ఇంకో అరగంటలో లైవ్ స్ట్రీమ్ మొదలుపెట్టాలి అని కంగారుపడుతూ తన గది తలుపు తెరిచింది స్వాతి. ఆ క్షణం అక్కడ కనపడిన దృశ్యాన్ని చూసి అలా ఉండిపోయింది.
తను లైవ్ స్ట్రీమ్ చేయబోయిన చోటులో తన చెల్లి తను వేసుకోబోయిన డ్రెస్ వేసుకొని వుంది, తన పెదాలకి నీలిరంగు లిప్స్టిక్ వేసుకొని, తన మేకప్ పూసుకొని, తనలాగే పోజులు ఇస్తోంది. స్వాతి ఫోటోలు తీసుకునేటప్పుడు స్వప్న అప్పుడప్పుడు అక్కడే ఉండేది, కానీ స్వప్నని స్వాతి ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, చిన్న పిల్లే కదా అని. కానీ ఆ క్షణం స్వాతికి వొళ్ళు జలదరించింది, తన శరీరం పైన తేళ్లు, జెర్రెలు పాకుతున్నట్టు అనిపించింది. స్వప్న చెంప పగలగొడతానని దగ్గరకు వెళ్లేసరికి...
"అక్క! నేను కూడా నీలాగా అవుతా, ఇవన్నీ వేసుకుంటా" అని అమాయకంగా అడిగేసరికి తాను కొట్టాలన్న చెంపదెబ్బ తనకే తగిలినట్టు అనిపించింది.
ఇన్ఫ్లుయెన్సర్ అంటే అర్థం అప్పుడు తెలిసొచ్చింది స్వాతికి. ఇన్నాళ్లు తన నుంచి ప్రపంచాన్ని చూసింది కానీ ఈరోజు ప్రపంచం తనని ఎలా చూస్తోందో అర్థమైంది.
తాను ఇంతకాలం కంటెంట్ తయారు చేస్తున్నా అనుకుంది, కానీ సోషల్ మీడియా అనే అంగడిలో తనే అమ్ముడుపోతోందని, సోషల్ కరెన్సీ కోసం తన ఆత్మని అమ్ముకుంటోందని స్వాతికి అప్పుడు అర్థమయ్యింది. తను ఈ ప్రయాణంలో ఎంతవరకు వెళ్లిందో, తన చెల్లి మొహంలో తన మొహం చూసినప్పుడు తెలిసింది.
తన మొబైల్ ఫోన్ తనని లైవ్ స్ట్రీమ్ కి రమ్మని నోటిఫికేషన్ల రూపంలో పిలుస్తోంది.
తన చేతిలోని స్మార్ట్ ఫోన్ జారి కింద పడింది, దగ్గరకు వొచ్చిన స్వప్నని ముద్దాడుతూ, తన మొహం మీద అంటుకున్న రంగులని చెరపసాగింది, మెల్లిగా తన డ్రెస్ మార్చి మరొక డ్రెస్ వేసింది, వెళ్లి ఆడుకో అని చెప్పి స్వప్నని బయటకు పంపేసింది.
ఇప్పుడు తాను ఆ స్ట్రీమ్ చేస్తే తనకి తిరుగుండదు. మెల్లిగా కింద పడిన తన స్మార్ట్ ఫోన్ చేతుల్లోకి తీసుకుంది, తన అకౌంట్ వెళ్లి 'డిలీట్ ప్రొఫైల్' బటన్ ని ఒత్తింది.
"ఆర్ యు షూర్?" మళ్ళీ మళ్ళీ అడిగింది సోషల్ మీడియా,
"ఎస్" అని క్లిక్ చేసింది స్వాతి.
ఆమె మొట్టమొదటి సారి తన సోషల్ మీడియా జీవితాన్ని 'లాగ్ అవుట్' చేసింది.
ఇంతలో ఏదో గలగలను శబ్దం. ప్రస్తుతానికి వొచ్చిన స్వాతి, ఆ శబ్దం వైపు చూసింది. అక్కడ ఒకామె తన అవిటి చెయ్యి చూపించి చిల్లర అడుక్కుంటోంది, తన పర్సులో వున్న కొద్దిపాటి కరెన్సీలో నుంచి కొంచెం ఆమె బొచ్చెలో వేస్తుండగా స్వాతికి, ఏదో అస్పష్టమైన పోలిక గుర్తుకువచ్చి చిన్నగా నవ్వుకుంది.
ఇంతలో తన బస్సు రావడంతో బస్సెక్కి నెమ్మదిగా తన సీట్ లో కూర్చొని తన డైరీ తీసి...
"అభినందనల కోసం అమ్ముకున్న విలువల కన్నా, విలువల కోసం అభినందనలనే వదులుకోవడం మిన్న."
అని తన డైరీలో రాసుకున్న వాక్యాలను నెమ్మదిగా తన మునివేళ్లతో స్పృశించింది.
***
కిరణ్ జమ్మలమడక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr: కిరణ్ జమ్మలమడక
డా. కిరణ్ జమ్మలమడక , కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో డాక్టరేట్ పట్టా పొందారు.ప్రస్తుతం GE హైదరాబాద్ లో సీనియర్ సాఫ్ట్వేర్ మేనేజర్ గా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. "స్ప్రింగ్" అనే సంస్థ ను స్థాపించి, తద్వారా విద్యార్థులకు మోటివేషనల్, లైఫ్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూవుంటారు. పిల్లలు , పెద్దలు ప్రపంచం పట్ల సానుకూల దృక్పథం తో ముందుకు సాగాలనే ఉద్దేశం తో కథలు రాయటం కూడా మొదలుపెట్టారు. "చినుకు","ఆంధ్రభూమి", "తెలుగు వెలుగు ", "తానా","ఖమ్మం ఈస్థటిక్స్" మొదలైన ప్రముఖ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో ఈయన కథలు బహుమతి సాధించాయి. ఆ కథల్లో మిరప మొక్క , మోహపు మరకలు,ఆమె అతడిని జయించెను, యాత్ర (పిల్లల బొమ్మల పుస్తకం ) మరియు అతీతం, అస్తిత్వం అనే సైన్స్ ఫిక్షన్ (నవలలు) ప్రేక్షకాదరణ పొందాయి. మరికొన్ని కథలు అంతర్జాలం మాధ్యమం లో కూడా ప్రచురితమయ్యాయి.





Comments