top of page
Original.png

అమ్మ అలసట

అమ్మ అలసట, Bugatha Yamuna, తల్లి త్యాగం, కుటుంబ కథ, మహిళా జీవితం, తెలుగు కథ, అమ్మ ప్రేమ, సామాజిక కథ

ఉపాధి హామీ పనితో అలసిపోయిన తల్లికి కుటుంబ సభ్యులు తోడుగా నిలిచి ఆమె త్యాగాన్ని గౌరవిస్తున్న గ్రామీణ కుటుంబ దృశ్యం
ఉపాధి హామీ పనితో అలసిపోయిన తల్లికి కుటుంబ సభ్యులు తోడుగా నిలిచి ఆమె త్యాగాన్ని గౌరవిస్తున్న గ్రామీణ కుటుంబ దృశ్యం

Amma Alasata - Telugu Emotional Family Story | Bugatha Yamuna

అమ్మ అలసట తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | బుగత యమున

Publishes in manatelugukathalu.com on 29/07/2026


ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు, బయట కూలి పని... ఇవన్నీ చేస్తూ తన అలసటను ఎప్పుడూ బయటపెట్టని వ్యక్తి అమ్మ. ఆమె చేసే ప్రతి పని వెనుక ప్రేమ ఉంటుంది, ప్రతి చెమట చుక్క వెనుక కుటుంబం పట్ల అంకితభావం ఉంటుంది. "అమ్మ అలసట" కథలో బుగత యమున తల్లి పడే నిశ్శబ్ద శ్రమ, పిల్లలు దానిని గుర్తించకపోవడం, చివరకు కుటుంబంలో వచ్చిన చైతన్యాన్ని హృదయాన్ని కదిలించేలా చిత్రించారు.


ఉదయం ఆరు గంటల సమయం. పల్లెటూరి వీధిలో ఎండ అప్పుడే చురుక్కుమంటోంది. నెత్తి మీద మట్టి మోసే తట్ట, నిండా చద్దన్నం క్యారేజీ, పక్కన చిన్న కూర డబ్బాలో ఉప్పు, కారం, బెల్లం వేసి కలిపిన మామిడికాయ ముక్కలు పట్టుకుని వాకిలి ముందు నిలబడి విసుక్కుంటోంది గౌరమ్మ.


"ఏటోదినే... ఎందరు ముందు గుండా బయట పడినా నువ్వు మాత్రం బయటికి రారు మీ ఇద్దరు అక్కా చెల్లెళ్లు! ఈ పాటికి అందరూ సగం దూరం నడిసేసే ఉంటారు. రండి ఒదిన మీరిద్దరూ! ఎంత సక్కబెడతారో ఏటో గానీ, ఎంతకీ మీ ఇంట్లో పని తెమలదు."


"ఆగమ్మే గౌరీ.. మనవలు, మీ అల్లుడాలు సెలవులకు వచ్చినారు. అరుణకి వంట పనే సరిపోతుంటే, మిగిలిన పనులు నేను సర్దుకున్నా టైమ్ సరిపోతలేదు. వీళ్లా సిన్నోలూ, మా అయ్యలా మగ పిల్లలూ.. మాకు ఇంట్లో సాయం చేసే దిక్కే లేదు" అంటూ ఆదమ్మ మనవరాళ్లకు జడలు వేస్తూ చెబుతుంది.


"మీ అమ్మ మీ ఇద్దరి అక్కా చెల్లెళ్లకు ఎన్ని వంటలు నేర్పేసి పంపేసిందో గానీ వదినే.. ఎప్పుడూ వంట మాటే అంటారు. ఇద్దరు అక్కా చెల్లెళ్లు, మా ఇద్దరి అన్నదమ్ములను చేసుకుని తెగ కష్టపడిపోతున్నట్టు చెప్పుకొస్తున్నారు" అనుకుని కంగారును మింగేసి కసురుకుంటోంది గౌరమ్మ.


అప్పుడు లోపలి నుంచి ఆదమ్మ, "అమ్మే గౌరే నువ్వు పదమ్మే.. అలాగా నడుస్తూ ఉండు.. మేమొచ్చి నీలో కలిసిపోతాం" అంది.


ఆ మాటలకు గౌరమ్మకు మరింత కోపం, వెటకారం ముంచుకొచ్చాయి. "ఏమ్మా పెద్దొదినే, మీ సెల్లీ.. నువ్వు నా కంటే బేగా నడిచి గలరేటి? వాళ్లందరితో కలిసి వెళ్లిపోలేకేనేటి! మీకోసమని ఉన్నాను. రండి రండి, పోకిరీ మాటలు మానేసి తొందరగా పని తెమల్చండి. అబ్బా మాటలు భలే నేర్చినారమ్మా!" అంటూ విసుక్కుంటూ అక్కడే నెత్తి మీద ఉన్న తట్టను దించేసి, వాళ్ల అరుగు మీద కూర్చుండిపోయింది గౌరమ్మ.


కొంతసేపటి తరువాత ఉరుకులు పరుగులు పెడుతూ, ఆదరాబాదరాగా బయటికి వచ్చారు ఆదమ్మ, అరుణలిద్దరూ. వాళ్లను చూడగానే గౌరమ్మ లేచి నిలబడి, తట్టను ఎత్తుకుంటూ, "రండి రండీ! ఈ రోజు గానీ మన ముఖాన్ని ఫోన్లో తీసుకోకపోతే తిరిగి తట్టలెత్తుకుని రావడమే. పనికి రారూ ఆ పాడు మేటూ!" అని తొందరపెట్టింది.


"రాయమ్మే గౌరే.. గబగబా రెండడుగులు ఏస్తే ఆళ్లో కలిసిపోతాం" అంటూ ఆదమ్మ, అరుణ వేగంగా అడుగులు వేశారు.


కానీ, వాళ్ల కంగారు ఏమీ లాభించలేదు. వాళ్లు మట్టి పని జరిగే చెరువు గట్టు దగ్గరికి చేరుకునేసరికి, మేట్ ఫోన్లో హాజరు వేయడం పూర్తయిపోయింది. "సమయం దాటిపోయింది, ఈరోజు మీకు హాజరు పడదు, వెనక్కి వెళ్లిపోండి" అని ఖరాఖండిగా చెప్పేశాడు. చేసేదేమీ లేక ముగ్గురూ తలలపై తట్టలు ఎత్తుకుని తిరిగి ఇంటికి దారి పట్టారు.


"చూశారా! నేను మొత్తుకుంటూనే ఉన్నాను. మీ వల్ల ఈ రోజు నా కూలీ కూడా గోవిందా!" అని గౌరమ్మ ఎత్తిపొడవడం మొదలుపెట్టింది.


అప్పుడు అరుణ నిట్టూరుస్తూ, "ఏం చేయమంటావే గౌరమ్మ... ఇల్లు విడిచి రావాలంటే మాటలా? వేసవి సెలవులు కదాని పట్నం నుంచి మా పెద్ద దాని పిల్లలు, చిన్నదాని పిల్లలు, మా ముగ్గురు మగపిల్లలు అందరూ వచ్చారు. 


ఆళ్లందరికీ పొద్దున్నే టీలు, టిఫిన్లు కలిపి ఇవ్వాలి. ఆ తర్వాత కట్టెల పొయ్యి మీద మధ్యాహ్నానికి వంట చేయాలి. ఈ ఎండలకి ఆ పొయ్యి ముందు కూర్చుంటే ప్రాణం పోయినంత పనవుతోంది. పిల్లల పనులు చూసి, ఇల్లు సర్దేసరికి మాకు ఈ ఉరుకులు పరుగులు తప్పట్లేదు" అని తన బాధను వెళ్లగక్కింది.


ఆదమ్మ కూడా చెల్లెలికి వత్తాసు పలుకుతూ, "నాకైతే కూసింత అయినా రెస్ట్ ఉంటది కానీ, అరుణకి అసలు ఖాళీ ఉంటది కాదు. ఆ పొయ్యి దగ్గర వండలేక సత్తంది అనుకో యమ్మే. పోనీ గ్యాస్ మీద వంట చేసిద్దామా అంటే దగ్గర దగ్గర పదిహేను మందిమి.. పిల్లా, పెద్దా కలిపి.. 


దానిమీద రోజుకు కుంచెడు బియ్యం అన్నం ఉడికితే అది ఎన్నాళ్లు వస్తాది? తెల్లారింటికి టీ పెట్టుకోవడానికి గబుక్కున ఎవరి ఇంటి దగ్గరికి పరుగులెడతాం?" అని దానిని అలా దాచడం అంటూ ఇంట్లో వాళ్ల కష్టాలను పంచుకుంటూ ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకున్నారు.


మరుసటి రోజు ఉదయం మధ్యాహ్నానికి వంట చేయకుండానే ఉపాధి హామీ పనికి వెళ్లి, మధ్యాహ్నం ఎండను పడి ఇంటికి వచ్చింది అరుణ. అలసటతో ఒళ్లంతా హూనమైపోయినా, సెలవులకు వచ్చిన పిల్లల కోసం, ఇంట్లో వాళ్ల కోసం వంట చేయక తప్పదు. 


నేరుగా పెరట్లోకి వెళ్లి కట్టెల పొయ్యి వెలిగించింది. మండుటెండ ఒకవైపు, కట్టెల పొయ్యి సెగ మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కళ్లలోకి పొగ వెళ్లి నీళ్లు కారుతున్నాయి.


ఆ అలసటలో, ఆపసోపాలు పడుతూ కూర వండుతున్న అరుణ, పొరపాటున కూరలో ఒక గుప్పెడు కారం ఎక్కువగా వేసేసింది. వంట పూర్తయ్యాక అందరికీ ఆకులు వేసి వడ్డించింది.


కూర అన్నంలో కలుపుకుని తిన్న వెంటనే పిల్లలు, మనవళ్లు "ఉస్... ఉస్..." అంటూ కారం దెబ్బకు నోరు ఊదుకోవడం మొదలుపెట్టారు. ముఖ కవళికలు మార్చుకుంటూ, నీళ్లు తాగుతూ నానా అవస్థలు పడుతున్నారు. 


అది చూసి అరుణ మనసు చివుక్కుమంది. "అయ్యో, నా చేతులెలా వచ్చాయో, పిల్లలకి కారపు కూర పెట్టేశానే" అని మనసులో చాలా బాధపడింది.


సరిగ్గా అప్పుడే అరుణ కొడుకు కూడా అన్నం తినడానికి కూర్చున్నాడు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే వాడికి కోపం నషాళానికి అంటింది. "ఏంటమ్మా ఈ కూర? అసలు తినడానికి వీల్లేకుండా గొంతు మండిపోయేలా కారం వేసేశావు! రోజూ ఇలాగే పిచ్చి వంటలు చేస్తున్నావు, వంట చేయడం కూడా రాదా నీకు!" అని అందరి ముందూ తల్లిపై గట్టిగా అరిచాడు. 


ఆ మాటలకు అరుణ గుండె పగిలిపోయింది. కొడుకు అన్న మాటకు కన్నీళ్లు ఆపుకుంటూ తలదించుకుని నిలబడిపోయింది.


కొడుకు అరుస్తున్న మాటలు విన్న ఇంటి పెద్ద దిక్కు, ఆదమ్మ భర్త అయిన 'సత్తెయ్య' గదిలోంచి బయటకు వచ్చాడు. అరుణ పడుతున్న బాధను, ఆ పిల్లల వెటకారాన్ని ఆయన గమనించాడు. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. వెంటనే అన్నం తింటున్న పిల్లలందరినీ, అరుణ కొడుకును గట్టిగా పిలిచాడు.


"ఒరేయ్! అన్నం కంచం ముందు కూర్చుని అమ్మను పల్లెత్తి మాట అనడానికి మీకు ఎంత ధైర్యం రా?" అని గద్దించాడు సత్తెయ్య. అందరూ భయంతో సైలెంట్ అయిపోయారు.


సత్తెయ్య ఎంతో భావోద్వేగంగా వాళ్లకు బుద్ధి చెప్పడం మొదలుపెట్టాడు.


"కొడుకులారా... మీ అమ్మ, పెద్దమ్మలు ఉదయం ఐదు గంటలకే లేచి ఇల్లంతా ఊడ్చి, ఆ తర్వాత మట్టి మోసే ఉపాధి హామీ పనికి వెళ్లి మండుటెండలో వడదెబ్బ తిని వస్తారు. 


ఆ వచ్చిన అలసట తీరకముందే, మీ అందరి కడుపు నింపడానికి ఆ కట్టెల పొయ్యి ముందు కళ్లు కాలిపోయేలా వంట చేస్తారు. ఆ అలసటలో, ఆపసోపాలు పడుతూ పొరపాటున ఈరోజు కూరలో కారం వేసేసి ఉంటే... దాన్ని అర్థం చేసుకోకుండా అరుస్తారా?


రోజుకో రకం వండి పెట్టి, కమ్మగా మీకు వడ్డించినప్పుడు ఏనాడైనా సరే... 'అమ్మా! ఈరోజు వంట చాలా బాగుందే, నీ చేతులకు బంగారు గాజులు వేయాలి' అని ఏ రోజైనా పొగిడారా రా? లేదు! 


మనం బాగోలేని రోజు విరుచుకుపడి చెప్పే విషయాన్ని, బాగున్న రోజు పొగుడుతూ చెప్పాలని అనుకోం. ఇది మన స్వార్థం! కానీ, అమ్మ అలా కాదురా... వడ్డించిన తర్వాత అమ్మ తాను తినకుండా, మన అందరి ముఖాలను చూస్తూ... 'ఎవరెవరు ఎంత బాధపడుతున్నారో? అని నిశితంగా గమనిస్తూనే ఉంటుంది. 


అందరి ఆకలి తీర్చే ఆమె, మీ హావభావాల్లో దొరికిన ఆనందముతోనే తన కడుపు నిండిపోయినట్లు పొంగిపోతుంది. మీరు కారంతో ఉస్ ఉస్ మంటుంటే మీకంటే ఎక్కువ బాధ ఆ తల్లికే కలుగుతుంది.


ఈ ఇంటి కోసం, మన అందరి కోసం అమ్మ తన జీవితాన్నే ధారపోస్తోంది. కానీ, ఆ తల్లి ఏ రోజైనా... 'నేను నా చేతి గరిటను వదిలి పెడితే వీళ్ల గతి ఏమవుతుందో' అన్న ఆలోచనను తన మనసులోకి రానియలేదు... అదిరా అమ్మ మనస్తత్వం అంటే! 


అందుకే చెబుతున్నాను... రేపటి నుండి వంటగదిలో అమ్మలు అడుగుపెట్టడానికి వీల్లేదు! అమ్మ చేసే వంటను మీరే వండి, వాళ్లకు వడ్డించి, అమ్మకు విశ్రాంతిని ఇద్దురు గాని! ఇది నా ఆర్డర్!" అని గట్టిగా చెప్పి సత్తెయ్య అక్కడినుంచి వెళ్లిపోయాడు.


సత్తెయ్య చెప్పిన మాటలు విన్న మరదలు అరుణ కళ్లు చెమ్మగిల్లాయి. "నా కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్లు ఈ ఇంట్లో ఉన్నారన్నమాట! భోజనం చేసే ప్రతి వారి ముఖమును చూసి నేనేమనుకుంటున్నానో అని, నేను గమనిస్తున్న విషయం బావగారు ఇంత బాగా అర్థం చేసుకున్నారా! నా పట్ల మా బావగారి మనసులో ఇంత ఉన్నతమైన స్థానముందా!" అని ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. 


రోజు పడే కష్టం అంతా ఒక్కసారిగా మాయమైపోయినట్లు అనిపించింది అరుణకి. తన బతుకును తిరగరాసేందుకు, పిల్లలందరికీ బుద్ధి చెప్పిన బావగారికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది.


ఇదంతా పక్క గదిలో ఉండి వింటున్న సత్తెయ్య తమ్ముడు మరియు అరుణ భర్త అయిన 'గోవింద్' గుండె బరువెక్కింది. 


"అన్నయ్య చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం. నా భార్య ఇన్ని రాత్రులు, పగళ్లు ఈ కుటుంబం కోసం రక్తాన్ని చెమటగా మారుస్తున్నా... నేను ఏనాడూ ఆమె గొప్పతనమును గుర్తించలేదే" అని తనలో తానే సిగ్గుపడ్డాడు. 


ఆ క్షణమే తన భార్యకు విశ్రాంతి ఇవ్వాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు.


మరుసటి రోజు ఉదయం. ఆదమ్మ, అరుణలు ఎప్పటిలాగే ఉపాధి హామీ మట్టి పనికి పోయి, మధ్యాహ్నం అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోయారు. 


ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి ఉంది. పెరట్లో బట్టలన్నీ ఉతికి ఆరేసి ఉన్నాయి.  గోవింద్ ఆ రోజున తన పనులన్నీ మానుకొని అలాగే వంటగదిలో సెలవులకు వచ్చిన పిల్లలతో  కలిసి ఏవో పనులు పంచుకుంటూ అప్పటికే అన్నం, కూరలు వండి వడ్డించడానికి సిద్ధంగా ఉంచారు.


అరుణ కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి, తల్లి చేతిలోని సత్తు గిన్నె తీసుకుని, "అమ్మా, కాళ్లు కడుక్కుని రండి పెద్దమ్మా! నేను వడ్డిస్తాను" అని నవ్వుతూ అన్నాడు.


తమ కష్టాన్ని గుర్తించి, తమకు విశ్రాంతినివ్వడానికి ఇంట్లోని మగవాళ్లు, పిల్లలు ఇలా మారిపోవడం చూసి ఆదమ్మ, అరుణలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇన్నాళ్లు పడ్డ తమ 'అలసట' అంతా ఆ ఆనంద భాష్పాల్లో కొట్టుకుపోయింది. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా కలిసి భోజనం చేసింది.


కానీ, వీళ్ళందరూ కలిసి వండిన వంటలు మాత్రం బెడిసికొట్టేశాయి. కానీ, అమ్మ వాళ్లు మారు మాట ఆడకుండా తినడం చూసిన పిల్లలు మరోసారి వాళ్ళ ప్రవర్తనకు సిగ్గుపడి.. అమ్మల ఔన్నత్యానికి మెచ్చుకోలుగా కళ్లతోనే కిరీటాన్ని తగిలించారు.


తరువాత అరుణ కొడుకు మహేష్, మిగిలిన అన్నదమ్ములిద్దరితో, "అమ్మ పడే అలసట మనకు ఎవరికీ కనిపించని ఒక నిశ్శబ్ద త్యాగం. పొరపాట్లు జరిగినప్పుడు విమర్శించే మనం, ఆమె చేసే అంతులేని సేవను కూడా ప్రశంసించాలి. తల్లి శ్రమను గుర్తించి, ఆమెకు విశ్రాంతిని ఇవ్వడమే కుటుంబ సభ్యులుగా మనం ఆమెకు ఇచ్చే నిజమైన గౌరవం" అన్నాడు.


                   సమాప్తం 


బుగత యమున గారి కొన్ని ఇతర రచనలు:


బుగత యమున గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: బుగత యమున

నేను బుగత యమున,సెకండరీ గ్రేడ్ టీచర్ గా గోకవరం మండలంలో పని చేస్తున్నాను..నాకు సాహిత్యం అంటే ఎనలేని అభిమానం..ఆ అభిమానం అందించిన ప్రోత్సాహకంతోనే ముందుగా ప్రతిలిపి యాప్ లో రచనలు చేయడం మొదలుపెట్టి..సుమారు 200 వరకూ రచనలు చేసాను..అలాగే సాహితీ గోదావరి మరియు విశాఖ సంస్కృతి పత్రికలకు కూడా నేను కవితలు రాస్తూ ఉంటాను..

***


bottom of page