top of page
Original.png

మోనోపలి - పార్ట్ 1

13 minutes ago
7 min read

సాంస్కృతిక వేదికపై ఆత్మవిశ్వాసంతో నాట్యం చేస్తున్న యువతి, పక్కనే అసూయతో చూస్తున్న ఆధిపత్య బృందం

Monopoly - Part 1 Telugu Inspiraational Story | Sritha

మోనోపలి - పార్ట్ 1 తెలుగు ప్రేరణాత్మక కథ | శ్రిత

Published in manatelugukathalu.com on 20/09/2026


రచయిత్రి శ్రిత కలం నుంచి వచ్చిన ‘మోనోపలి - పార్ట్ 1’ సమాజంలో పాతుకుపోయిన గుత్తాధిపత్య (Monopoly) మనస్తత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించే కథ. కొత్తగా వచ్చే ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి బదులు, తమ ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందోనన్న అసూయతో కొందరు చేసే కుట్రలు గ్రామీణ, కళా రంగాల్లో ఎలా ఉంటాయో రచయిత్రి కళ్లకు కట్టారు. మర్రిచెట్టు నీడను చీల్చుకుంటూ సూర్యకాంతి కోసం తపించే చిన్న మొక్కల్లాంటి కళాకారుల పోరాటం పాఠకులను కట్టిపడేస్తుంది.



మోనోపలి - భాగం 1


అనగనగా ఒక చిన్న గ్రామం. పచ్చని చెట్లతో, చల్లని గాలులతో, అందమైన పంట పొలాలతో ఆ గ్రామం ఎంతో హాయిగా ఉండేది. గ్రామంలోని ప్రజలంతా కలిసిమెలిసి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఆనందంగా జీవించేవారు.


ఆ గ్రామంలో ఒక నాట్య విద్యాలయం ఉండేది. అక్కడ పరమేశ్వరరావు అనే నాట్యగురువు అందరికీ నాట్యం నేర్పించేవారు. ఆయన నేర్పించే నాట్యాన్ని చూసి గ్రామస్థులంతా మంత్ర ముగ్ధులైపోయేవారు. 


ఆయన సతీమణి పరిమళ కూడా ఆయనకు తోడుగా పిల్లలకు, పెద్దలకు నాట్యం నేర్పించేది.

గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ పండుగ వచ్చినా, ఆ నాట్య విద్యాలయం నుంచి ఎవరో ఒకరు వచ్చి అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చేవారు.


అదే గ్రామంలో పాకశాస్త్రంలో ప్రవీణురాలైన పావని ఉండేది. ఏ పండుగ జరిగినా, ఏ శుభకార్యం జరిగినా ఆమె ఆధ్వర్యంలో రుచికరమైన వంటకాలు తయారయ్యేవి. గ్రామంలోని మహిళలందరూ ఆమె దగ్గర వంటలు నేర్చుకుంటూ, కలిసి వండి పండుగలను మరింత ఆనందంగా చేసుకునేవారు.

ఇలా ఆ గ్రామంలో ప్రతి సందర్భం, ప్రతి సందడి, ప్రతి పండుగ ఎంతో హాయిగా సాగిపోతూ ఉండేది.


అయితే ఒకరోజు ఆ గ్రామంలోకి కొత్తగా కొంతమంది రావడం మొదలైంది.వాళ్లంతా మంచి వాళ్లే. వారిలో పాకశాస్త్రంలో ప్రవీణులు ఉన్నారు. నాట్యశాస్త్రంలో నిపుణులు ఉన్నారు. సంగీతంలో కోవిదులు ఉన్నారు. క్రీడల్లో ప్రతిభావంతులు కూడా ఉన్నారు.


మొదట్లో గ్రామస్థులు వారిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు.


“మన ఊరికి కొత్తవాళ్లు వచ్చారు. వాళ్ల ప్రతిభ కూడా మనకు ఉపయోగపడుతుంది,” అనుకున్నారు.


కానీ కొంతకాలం గడిచేసరికి పరిస్థితి మారిపోయింది.

ఎవరు ఏ రంగంలో ఉన్నా, తమ ప్రతిభను పంచుకోవడం కంటే “ఈ రంగంలో మాకు మాత్రమే ఆధిపత్యం ఉండాలి” అనే ఆలోచన మొదలైంది.


నాట్యరంగంలో పోటీ మొదలైంది.

వంటల విషయంలో పోటీ మొదలైంది.

సంగీతంలో పోటీ మొదలైంది.

క్రీడల్లో కూడా పోటీ మొదలైంది.

ఇంతకాలం కలిసి పనిచేసిన వాళ్ల మధ్యే చిన్నచిన్న విభేదాలు మొదలయ్యాయి.


అసలు సంఘర్షణ దేనికోసం?

ప్రతిభను పంచుకోవడం కోసం కాదు... ఆధిపత్యం కోసం!

మోనోపలి కోసం!


మోనోపలి - భాగం 2


ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉండేది. ఆ అమ్మాయి పేరు మయూరి. పేరుకు తగ్గట్టుగానే నాట్యంలో ఎంతో ప్రవీణురాలు. చిన్నపిల్లలంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే పిల్లలందరినీ ఒక క్లాస్‌గా చేసి నాట్యం నేర్పించడం మొదలుపెట్టింది.


మయూరి దగ్గర పిల్లలు నాట్యం నేర్చుకోవడం చూసి గ్రామంలోని మహిళలకు కూడా ఆసక్తి పెరిగింది.


“అంత పెద్ద గురువు దగ్గర నేర్చుకోలేం. మయూరి దగ్గరైతే సులభంగా నేర్చుకోవచ్చు కదా!” అని వాళ్లు కూడా ఆమె దగ్గర నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు.


ఇదంతా పరమేశ్వరరావు సతీమణి పరిమళ గమనించింది.


“సరే, నాట్యం నేర్చుకుంటున్నారు కదా!” అని మొదట అనుకున్నా, కొద్దిరోజులకు ఆమె మనసులో పోటీ భావన మొదలైంది.


“మర్రిచెట్టు నీడలో చిన్న మొక్కలు మొలకెత్తినా, అవి పెద్దగా ఎదగడం అంత సులువు కాదు. ఈ మయూరి మనకే పోటీగా వస్తుందా?” అని ఆలోచించింది.


ఇంతలో మరో అమ్మాయి క్రాంతి ఆ ఊరికి వచ్చింది. ఆమెకు వంటలంటే చాలా ఇష్టం. కొత్తకొత్త రుచులు, వైవిధ్యమైన వంటకాలతో అందరినీ ఆకట్టుకోవడం మొదలుపెట్టింది.


అదే సమయంలో సరిత అనే అమ్మాయి కూడా వచ్చింది. ఆమె ప్రతిరోజూ గుడికి వెళ్లి పూజలు చేస్తూ, మన భారతీయ సంస్కృతిని చాటిచెప్పేది. అంతేకాదు, సాయంత్రం పిల్లలకు క్రీడలు, ఆటలు, పాటలు కూడా నేర్పించేది.


ఇలా ఒక్కొక్కరు ఒక్కో రంగంలో తమ ప్రతిభను చూపిస్తూ ముందుకు సాగారు.


మొదట్లో అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ కొద్దికాలానికి ఈ ప్రతిభల వెనుక “నాకే గుర్తింపు కావాలి... నాకే ఆధిపత్యం ఉండాలి” అనే భావన నెమ్మదిగా పెరగసాగింది.


అక్కడి నుంచే మొదలైంది అసలు సంఘర్షణ...

మోనోపలి కోసం పోరాటం!


మోనోపలి - భాగం 3


ఇలా ఒక్కొక్కరూ తమ తమ కుటుంబాలతో సంతోషంగా ఉంటూ, తమకున్న ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారు.


ఒకరోజు గ్రామ పంచాయితీ తరఫున ఒక సాంస్కృతిక కార్యక్రమం ప్రకటించారు. గ్రామంలోని ప్రతిభావంతులందరూ అందులో పాల్గొనాలని ప్రకటన వచ్చింది.


అంతే! అందరూ తమ ప్రతిభను చూపించడానికి సిద్ధమయ్యారు.


ఇప్పటికే ఉన్న పరమేశ్వరరావు నృత్యమండలి సభ్యులతో పాటు, కొత్తగా ప్రారంభమైన మయూరి నృత్యమండలి పిల్లలు కూడా ప్రదర్శన ఇచ్చారు. సంగీత బృందం సరిగమప సభ్యులు కూడా తమ ప్రతిభను చాటుకున్నారు.


క్రాంతి తన స్టాల్‌లో వైవిధ్యమైన వంటకాలను పెట్టి అందరినీ ఆకర్షించింది.


అది చూసిన పావని మనసులో అలజడి మొదలైంది.


“ఇన్ని రోజులూ ఈ ఊర్లో వంట అంటే నేనే! ఎవరికేం కావాలన్నా నన్నే అడిగేవారు. ఇప్పుడు క్రాంతిని అడుగుతున్నారు. ఇది జరగడానికి వీల్లేదు. వంటంటే పావని... పావని అంటే వంట! నా సామ్రాజ్యంలోకి ఇంకెవరినీ రానివ్వకూడదు. క్రాంతిని ఎలాగైనా వెనక్కి నెట్టాలి,” అని అనుకుంది.


మరోవైపు, మయూరి నృత్యమండలిలో చిన్నపిల్లలు చేసిన అద్భుతమైన నృత్యానికి గ్రామస్థులంతా మంత్రముగ్ధులయ్యారు. “ఇంత చిన్న పిల్లల్లో ఇంత ప్రతిభా!” అంటూ మయూరిని ఘనంగా సన్మానించారు.


పరమేశ్వరరావును కూడా సన్మానించారు.


అయితే ఆ సన్మానం ఆనందం కంటే పరమేశ్వరరావు, పరిమళల మనసుల్లో అసూయను రేపింది.


“ఇన్నేళ్లు నాట్యానికి మా జీవితాలను అంకితం చేశాం. ఈ గ్రామానికి ఎన్నో సంవత్సరాలు సేవ చేశాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన మయూరి మా పేరు, మా కీర్తి, మా నాట్యసంపదను పంచుకుంటుందా?” అని వాళ్లలో ఆలోచన మొదలైంది.


ఇక సరిత పిల్లలకు క్రీడలు, ఆటలు, పాటలు నేర్పిస్తూ వారిలో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడం చూసి గ్రామస్థులు కూడా సంతోషించారు.


అది చూసిన రమణి మనసులో మరో ఆలోచన మొదలైంది.


“పిల్లలందరూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటే, గ్రామస్థులందరూ కలిసిమెలిసి ఉంటే... మన ఆధిపత్యం ఎలా నిలుస్తుంది?” అని ఆలోచించింది.


అలా పావని, పరమేశ్వరరావు, పరిమళ, రమణి, రాజారావు—అందరి ఆలోచనలూ ఒకటయ్యాయి.


“మర్రిచెట్టు నీడలో చిన్న మొక్కలు మొలకెత్తవచ్చు. కానీ అవి పెద్దవృక్షాలుగా ఎదగడం అంత సులభం కాదు. ఈ కొత్త మొక్కలు పెద్దవయ్యేలోపే వాటిని అడ్డుకోవాలి,” అని వారు నిర్ణయించుకున్నారు.


వారి లక్ష్యం గ్రామస్తుల అభివృద్ధి కాదు.

తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడమే!


ఇలా కొత్తవాళ్లను ఎదగనివ్వకుండా, వారి ప్రతిభను అణచివేయడానికి ఒక దుష్ట చతుష్టయం ఒక్కటైంది.


పరమేశ్వరరావు – పరిమళ – పావని – రమణి...

వారి వెనుక రాజారావు కూడా చేరాడు.

ఇక మొదలైంది అసలు పోరాటం...

మోనోపలి కోసం!


మోనోపలి - భాగం 4


మయూరి తనదైన రీతిలో కమ్యూనిటీ హాల్‌లో నృత్య ప్రదర్శనకు అభ్యాసం చేయించేది. పిల్లలను ఎంతో శ్రద్ధగా, ఓపికగా నాట్యం నేర్పించేది. ఆమె బృందానికి మయూరి నాట్యమండలి అని పేరు.


అదే సమయంలో పరమేశ్వరరావు తన పరమ నాట్యమండలితో అక్కడికి వచ్చి పెద్ద సౌండ్ పెట్టి నాట్యాభ్యాసం చేయించేవారు. ఆయన సతీమణి పరిమళ కూడా ఆయనకు తోడుగా ఉండేది.


ఎంత చెప్పినా వాళ్లు వినేవారు కాదు. పైగా మయూరిని ఇబ్బంది పెడుతున్నామనే భావన వాళ్లలో ఒకరకమైన ఈగో సాటిస్ఫాక్షన్‌ను కలిగించేది.


మయూరికి ఏం చేయాలో తోచేది కాదు. అయినా వెనక్కి తగ్గలేదు.


“చిన్న మొక్క పెద్ద వృక్షం కావాలంటే అంత సులువు కాదు. పెద్ద వృక్షాలతో పోటీ పడాలంటే సవాళ్లు తప్పవు,” అని తనను తాను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు సాగింది.


అదే సమయంలో సరితకు కూడా కష్టాలు మొదలయ్యాయి. ఆమె పిల్లలకు ఆటలు నేర్పే సమయానికే, పిల్లలను ఆకర్షించడానికి ఫుడ్ స్టాళ్లు పెట్టడం మొదలుపెట్టారు. పిల్లలు ఆటల్ని మరిచి ఫుడ్ స్టాళ్ల వైపు పరుగులు తీసేవారు.


క్రాంతి పరిస్థితి మరింత కష్టమైంది. పావని తన మిత్రబృందంతో కలిసి క్రాంతి వంటలు బాగుండవని, ఆమె నాణ్యత లేని పదార్థాలు ఉపయోగిస్తుందని ప్రచారం మొదలుపెట్టింది.


గ్రామాల్లో వార్తలు ఎంత వేగంగా వ్యాపిస్తాయో తెలిసిందే! క్రమంగా క్రాంతి వంటలకు ఉన్న ఆదరణ తగ్గసాగింది.


మయూరి పిల్లలతో నాట్యం చేయడం కూడా కష్టంగా మారింది. పరమేశ్వరరావు, పరిమళ తమ పరమ నాట్యమండలిలో ఉన్నవాళ్లు మయూరి నాట్యమండలిలో చేరకూడదని చెప్పడం మొదలుపెట్టారు.


మయూరి బృందానికి కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. కార్యక్రమాలు జరిగినా చివరి వరకు వారిని ప్రదర్శన చేయనివ్వకుండా అడ్డంకులు సృష్టించేవారు.


అంతేకాదు, తమ విద్యార్థుల ద్వారా మయూరి పిల్లలలో అపోహలు కలిగించే ప్రయత్నాలు కూడా జరిగాయి. మయూరి పిల్లలు నాట్యం చేస్తుంటే కొంతమంది అల్లరి చేసి వారి ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించేవారు.


అయినా మయూరి వెనక్కి తగ్గలేదు.


మరోవైపు పావని తన వంటల సామ్రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి క్రాంతి ఎదగకుండా చేయడంపైనే దృష్టి పెట్టింది. తన వ్యాపారం ఎలా అభివృద్ధి చెందాలన్నదానికంటే, ఎదుటివారి వ్యాపారం ఎలా కూలిపోవాలన్నదే ఆమె ఆలోచనగా మారింది.


గ్రామంలోని మహిళలు ఇవన్నీ చూస్తూ ఉండిపోయారు.

కానీ అందరికీ ఒక విషయం అర్థమైంది.


ఎవరైనా వేరే నృత్య బృందంలో చేరినా, పావని దగ్గర కాకుండా వేరే చోట వంటలు తీసుకున్నా, అవసరానికి ఫోన్ చేసినా—వారితో ఈ ఆధిపత్య వర్గం సరిగ్గా మాట్లాడేది కాదు. గ్రామం నుంచి వెలివేసినట్టుగా చూసేవారు.


వారి లక్ష్యం ఒక్కటే—మోనోపలీని ఎలాగైనా నిలబెట్టుకోవడం.


కానీ పాపం మయూరి, క్రాంతి, సరిత మాత్రం తమకు ఎదురవుతున్న కష్టాలను తట్టుకుంటూ, ఎలాగైనా బయటపడాలని ప్రయత్నిస్తూ తమ పోరాటాన్ని మాత్రం ఆపలేదు.


ఎందుకంటే వారికి కావలసింది ఆధిపత్యం కాదు... తమ ప్రతిభకు ఒక అవకాశం!


మోనోపలి - భాగం 5


చివరికి మరో సాంస్కృతిక కార్యక్రమం జరగబోతుందని గ్రామ పంచాయితీ ప్రకటించింది. గ్రామస్థులంతా ఆసక్తిగా ఎదురుచూశారు.


అదే సమయంలో దుష్ట చతుష్టయం మరోసారి ఒక్కటైంది.


పావని తనదైన శైలిలో పంచాయితీ సభ్యులను ఒప్పించింది.


“వంటల్లో ఇదే పెట్టాలి. అది పెడితేనే గ్రామస్థులకు నచ్చుతుంది. ఇది పెడితే ఖర్చు ఎక్కువ అవుతుంది,” అంటూ కార్యక్రమంలోని వంటల విషయంలో తన నిర్ణయాలనే అమలు చేయించింది.


పరమ నాట్యమండలి కూడా తమ నాట్య ప్రదర్శనకు సిద్ధమైంది. మయూరి నాట్యమండలి కూడా సిద్ధంగా ఉంది.


రమణి, రాజారావు తమ ఆధిపత్యం పోకూడదనే ఉద్దేశంతో మయూరికి సరైన స్థలం ఇవ్వకుండా ఎన్నో కారణాలు చెప్పారు. చివరకు గ్రామస్థులు ప్రశ్నిస్తారనే భయంతో ఆమెకు కొంత స్థలం కేటాయించారు.


వారి ఆలోచన ఒక్కటే—

“కొత్తగా వచ్చిన ఈ చిన్న మొక్కలు పెద్ద వృక్షాలుగా మారకూడదు!”


మర్రిచెట్టు నీడలో చిన్న మొక్కలు మొలకెత్తవచ్చు. కానీ దట్టమైన నీడలో సూర్యకాంతి తక్కువగా ఉండటం వల్ల అవి పెద్ద వృక్షాలుగా ఎదగడం అంత సులభం కాదు.

అయినా ఆ చిన్న మొక్కలు ఎదగాలనే ప్రయత్నాన్ని ఆపవు.


చివరికి ఆ రోజు రానే వచ్చింది.

సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమైంది.


ముందుగా మయూరి నాట్యమండలిలోని చిన్నపిల్లల ప్రదర్శన జరగాల్సి ఉంది. కానీ అది జరగనివ్వలేదు. మైకులు తీసేయడం, కార్యక్రమాన్ని ఆలస్యం చేయడం వంటి అడ్డంకులు సృష్టించారు.


తర్వాత పరమ నాట్యమండలి వంతు వచ్చింది.

పరమేశ్వరరావు ఎంతో క్రమశిక్షణతో తన విద్యార్థులతో నృత్య ప్రదర్శన చేయించారు. అందరూ చప్పట్లతో అభినందించారు.


మయూరి మాత్రం ఏం చేయాలో తెలియక నిలబడిపోయింది. పిల్లలు గాబరా పడిపోయారు.

ఆమె పరిస్థితిని చూసి పరమేశ్వరరావు, పరిమళల మనసుల్లో ఒక రకమైన ఈగో సాటిస్ఫాక్షన్ కలిగింది.


క్రాంతి కూడా తన వంటలకు ఆదరణ లేకపోవడంతో, “ఈ పోరాటం ఇక నా వల్ల కాదు,” అని పక్కకు తప్పుకుంది.


సరితకు కూడా సరైన అవకాశం దక్కలేదు. చివరకు ఆమె కూడా తన పోరాటాన్ని విరమించుకుంది.


కానీ మయూరి మాత్రం వెనక్కి తగ్గలేదు.


అదే సమయంలో పెద్ద పిల్లల నాట్య ప్రదర్శనకు మయూరి బృందాన్ని పంపారు. పరమ నాట్యమండలి పిల్లలు కావాలనే అల్లరి చేసి గందరగోళం సృష్టించారు. దాంతో మయూరి పిల్లలు భయపడి, తమ ప్రదర్శనను సరిగ్గా చేయలేకపోయారు.


“పాపం, చిన్నపిల్లలే కదా!” అని పంచాయితీ సభ్యులు నవ్వుతూ సరిపెట్టుకున్నారు.


అది చూసి మయూరి మనసు కలిచివేసింది.

అప్పుడే ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన దంపతులు అమృత, అమర్ అక్కడే ఉన్నారు. వాళ్లు ఎప్పుడూ గ్రామంలోని కార్యక్రమాలకు వచ్చి, ఎవరి ప్రతిభనైనా ఆనందంగా చూసేవారు.


అమర్ ఇంజనీర్. మయూరి ప్రదర్శన సమయంలో మైకులు ఆపేయడం, పవర్ కట్ చేయడం గమనించిన ఆయనకు విషయం అర్థమైంది. వెంటనే వెళ్లి సౌండ్, విద్యుత్ వ్యవస్థను సరిచేశారు.


ఆయన ముందు పరమేశ్వరరావు, పావని, రమణి, రాజారావు ఎవ్వరూ నోరు విప్పలేకపోయారు.


మయూరి తనలో తాను అనుకుంది—

“పిల్లలతో ఈ పెద్ద వృక్షాన్ని ఎదుర్కోవడం కష్టం. ఈసారి నేనే వేదికపైకి వెళ్లాలి.”


అని నిర్ణయించుకుని, తానే వేదికపైకి వెళ్లింది.

ఆమె అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇచ్చింది.

సభ అంతా కరతాళధ్వనులతో మార్మోగిపోయింది.


ఆ ఒక్క ప్రదర్శనతో గ్రామంలో దాగి ఉన్న మరెంతో మంది ప్రతిభావంతులకు ధైర్యం వచ్చింది.

అక్కడే ఉన్న కవిత ముందుకు వచ్చి అద్భుతంగా పాట పాడింది.

ప్రియా కూడా తనదైన ఒడిస్సీ నృత్యంతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.


గ్రామస్థులు ఆశ్చర్యపోయారు.

“మన ఊరిలో ఇంతమంది ప్రతిభావంతులు ఉన్నారా?” అని ఒకరినొకరు చూసుకున్నారు.


అది చూసిన ఆధిపత్య వర్గం మాత్రం తట్టుకోలేకపోయింది. మళ్లీ కరెంటు ఆపడం, పిల్లలతో గందరగోళం చేయించడం వంటి ప్రయత్నాలు మొదలయ్యాయి.


కానీ అప్పటికే ఒక విషయం మారిపోయింది.

ప్రతిభకు తలుపులు తెరుచుకున్నాయి.

మోనోపలి మాత్రం ఇంకా అంతం కాలేదు.


మర్రిచెట్టు నీడలో చిన్న మొక్కలు మొలకెత్తవచ్చు. కానీ వాటికి సూర్యకాంతి, స్థలం, అవకాశం దొరికితేనే అవి పెద్ద వృక్షాలుగా ఎదగగలవు.


అలాగే, ఈ గ్రామంలో కొత్తగా వచ్చిన ప్రతిభావంతులు కూడా తమకున్న ప్రతిభతో ఎదగాలంటే ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది.


అయినా మయూరి, క్రాంతి, సరిత లాంటి చిన్న మొక్కలు తమ వృద్ధిని ఆపలేదు. ఒక్కొక్కరూ తమదైన ప్రతిభతో ముందుకు సాగుతూనే ఉన్నారు.

మర్రిచెట్టు తన నీడను ఎంత విస్తరించినా, సూర్యకాంతి కోసం పైకి ఎదగాలనే ప్రయత్నాన్ని చిన్న మొక్కలు ఆపవు.


అలాగే...

మోనోపలి ఎంత బలంగా ఉన్నా, ప్రతిభను పూర్తిగా అణచివేయడం సాధ్యమేనా?


మానవుల మనసుల్లో పాతుకుపోయిన ఈ ఆధిపత్య భావన నుంచి వారిని బయటకు తీసుకురావడం అంత సులభం కాదు.


కానీ ఆ మార్పును తీసుకురావడానికి ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట నిలబడాలి.

ఆ వ్యక్తి ఎవరు?

అది కాలమే చెప్పాలి...


శుభం.



పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



***

శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:



శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page