top of page
Original.png

అడ్వకేట్ ఆవని

అడ్వకేట్ ఆవని, Shrita, లా కాలేజీ, హైకోర్టు, అడ్వకేట్ జీవితం, కోర్టు కథలు, మహిళా అడ్వకేట్, న్యాయవృత్తి, ప్రేరణాత్మక కథ

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అడ్వకేట్ ఆవని' కథలో లా కాలేజీ ముందు లా పుస్తకాలు చేతబట్టి, కోర్టు జీవితంలోని కలలు మరియు వాస్తవాల మధ్య నిలిచిన అడ్వకేట్ ఆవని
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'అడ్వకేట్ ఆవని' కథలో లా కాలేజీ ముందు లా పుస్తకాలు చేతబట్టి, కోర్టు జీవితంలోని కలలు మరియు వాస్తవాల మధ్య నిలిచిన అడ్వకేట్ ఆవని

Advocate Avani - Telugu College Memories Story | Sritha

అడ్వకేట్ ఆవనితెలుగు కాలేజీ జ్ఞాపకాల కథ | శ్రిత

Published in manatelugukathalu.com on 29/07/2026


సినిమాల్లో కనిపించే కోర్టు వాదనలు చూసి లా చదవాలనే కలలు కనే యువత ఎంతో మంది ఉంటారు. కానీ నిజ జీవితంలో ఒక అడ్వకేట్ ప్రయాణం ఎలా ఉంటుంది? లా కాలేజీ నుంచి జిల్లా కోర్టు, అక్కడి నుంచి హైకోర్టు వరకు సాగిన ఓ మహిళా అడ్వకేట్ అనుభవాలు, సవాళ్లు, విజయాలు, జీవిత పాఠాలతో కూడిన ఆత్మీయ గాథే "అడ్వకేట్ ఆవని". రచయిత్రి శ్రిత తన నిజ జీవిత అనుభవాల ఆధారంగా రాసిన ఈ కథ ప్రతి న్యాయ విద్యార్థికి, ప్రతి యువ అడ్వకేట్‌కు ఒక ప్రేరణ.


అడ్వకేట్ ఆవని
అడ్వకేట్ ఆవని

అధ్యాయం 1: అడ్వకేట్ ఆవని


లా చదవాలనే ఆలోచన చాలా మందికి ఎలా వస్తుందో తెలుసా?

సినిమాలు చూసి.


కోర్టులో హీరో ఒక్క వాదనతో కేసును తారుమారు చేయడం... ప్రత్యర్థి లాయర్‌ను మాటలతో మట్టికరిపించడం... జడ్జి వెంటనే తీర్పు చెప్పేయడం... ప్రేక్షకుల చప్పట్లు... హీరోకు పేరు, ప్రతిష్ఠ.


అలాంటి సన్నివేశాలు చూసి, "నేను కూడా లాయర్ అవ్వాలి... కోర్టులో అలా వాదించి గెలవాలి..." అని కలలు కనే వాళ్లు ఎందరో.


ఆ కలలతోనే ఆవని కూడా లా కాలేజీలో అడుగు పెట్టింది.


చదువులో ఎప్పుడూ టాపర్. తెలివి, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం... ఇవన్నీ ఆమెకు బలం. లా కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే ఒక గొప్ప క్రిమినల్ లాయర్ కావాలని నిర్ణయించుకుంది.


కానీ...

లా కాలేజీలో నేర్చుకున్న పుస్తకాల ప్రపంచానికి, నిజ జీవిత కోర్టులో కనిపించే ప్రపంచానికి చాలా తేడా ఉందని ఆమెకు అప్పుడు తెలియదు.


సినిమాల్లో రెండు గంటల్లో ముగిసే కేసులు... నిజ జీవితంలో సంవత్సరాల తరబడి సాగుతాయి.

సినిమాల్లో ఒక్క వాదనతో కేసు గెలుస్తారు... నిజ జీవితంలో ఒక్క పిటిషన్ వేయాలన్నా గంటల తరబడి ఫైళ్లు తిరగాల్సి వస్తుంది.


సినిమాల్లో జడ్జి, లాయర్, క్లయింట్ మాత్రమే కనిపిస్తారు... కానీ నిజమైన కోర్టులో క్లర్కులు, టైపిస్టులు, బెయిలిఫ్‌లు, కాపీ సెక్షన్, రిజిస్ట్రీ, తేదీలు, వాయిదాలు... ఇవన్నీ కూడా ఒక అడ్వకేట్ జీవితంలో భాగమే.


ఆవనికి ఈ నిజాలు ఒక్కొక్కటిగా తెలిసాయి.

ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు.


ఈ కథలోని అనేక సంఘటనలు, భావాలు, ఇబ్బందులు... నేను ఒక అడ్వకేట్‌గా లా చదివిన రోజుల్లో, కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన రోజుల్లో స్వయంగా ఎదుర్కొన్న అనుభవాల ఆధారంగా రాస్తున్నాను.


"అడ్వకేట్ ఆవని" ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు...

సినిమాల ప్రభావంతో లా చదవడానికి వచ్చిన ప్రతి విద్యార్థి... కోర్టులో మొదటి అడుగు వేసిన ప్రతి జూనియర్ అడ్వకేట్... తనను తాను ఈ కథలో ఎక్కడో ఒకచోట చూసుకుంటారు.


లా కాలేజీలో మొదటి రోజు విద్యార్థులతో కలిసి కూర్చున్న ఆవని
లా కాలేజీలో మొదటి రోజు విద్యార్థులతో కలిసి కూర్చున్న ఆవని

అధ్యాయం 2: లా కాలేజీలో తొలి అడుగు


ఆవని జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు అది.

ఎన్నో కలలు... ఎన్నో ఆశలు... సమాజానికి న్యాయం చేయాలనే తపన... ఒక గొప్ప అడ్వకేట్ కావాలనే లక్ష్యంతో ఆ రోజు లా కాలేజీ గేటు ముందు నిలబడి ఉంది.


"మా అమ్మాయి లాయర్ అవుతుంది!" అనే గర్వం ఆవని నాన్న కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. తన పాత బజాజ్ చేతక్ స్కూటర్‌పై తీసుకొచ్చి కాలేజీ దగ్గర దింపారు.


"బాగా చదువు... మంచి పేరు తెచ్చుకో," అని చెప్పి వెళ్లిపోయారు.


స్కూటర్ దూరంగా వెళ్లిపోతుండగా ఆవని ఒక్కసారి కాలేజీ భవనం వైపు చూసింది.


"ఇదేనా నేను కలలు కన్న లా కాలేజీ?"

మనసులో అనుకుంది.


చూస్తే మామూలు కాలేజీలాగే ఉంది. పాత భవనం... బెంచీలు... బ్లాక్‌బోర్డు... క్లాస్‌రూమ్స్... ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు.


చిరునవ్వుతో క్లాస్‌రూమ్‌లోకి అడుగుపెట్టి ఒక బెంచ్‌లో కూర్చుంది.


కొద్దిసేపటికే ఇంకొంతమంది కొత్త విద్యార్థులు వచ్చారు.

"హాయ్... నేను స్వర్ణ," అంటూ ఒక అమ్మాయి పరిచయం చేసుకుంది.


"మా ఊర్లో ఎప్పుడూ నీటి తగాదాలే. వాటిని చట్టపరంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో లా చదవడానికి వచ్చాను."


ఆవని నవ్వుతూ తల ఊపింది.


ఇంకో అమ్మాయి ముందుకు వచ్చింది.

"నా పేరు జుబేదా. మహిళల హక్కుల కోసం పోరాడాలి. అందుకే లా ఎంచుకున్నాను."


మూడో అమ్మాయి నవ్వుతూ...

"నేను శాంతి. మా నాన్న లాయర్. నాకు వేరే ఆప్షన్ లేదు... అందుకే లా," అంది.


అందరూ నవ్వేశారు.


ఇద్దరు అబ్బాయిలు కూడా పరిచయం అయ్యారు.

"నేను సుబ్రహ్మణ్యం. మంచి లాయర్ అవ్వాలి అనేది నా లక్ష్యం."


మరో విద్యార్థి సరదాగా...

"నేను ఇంకా ఏం అవుతానో తెలియదు. కానీ లా చదివితే ఏదో ఒకటి అవుతానని వచ్చాను," అన్నాడు.

అతని మాటలకు క్లాస్ అంతా నవ్వులతో మార్మోగిపోయింది.


ఇలా ఒక్కొక్కరి కలలు ఒక్కోలా ఉన్నా... అందరి గమ్యం మాత్రం ఒక్కటే—లా.


కొద్దిసేపటికి మొదటి క్లాస్ ప్రారంభమైంది.


ఆ కాలేజీలో ఎంతో మంచి అధ్యాపకులు ఉండేవారు. కర్నూలు ఉస్మానియా లా కాలేజీ అధ్యాపకులు మ బోధించేవారు. వారి బోధనలో విషయం మాత్రమే కాదు, అనుభవం కూడా ఉండేది.

సివిల్ లా చెప్పే సార్ క్లాస్‌లోకి వచ్చి బోర్డుపై పెద్ద అక్షరాలతో రాశారు…


"Law of Torts."


క్లాస్‌లో ఉన్న వాళ్లంతా ఒకరినొకరు చూసుకున్నారు.

"టార్ట్స్ అంటే ఏమిటి?"

అనే ప్రశ్న అందరి ముఖాల్లో కనిపించింది.


ఆవని కూడా అదే పరిస్థితి.


సినిమాల్లో చూసిన కోర్టు వాదనలు, హీరోల డైలాగులు గుర్తున్నాయి గానీ... "లా ఆఫ్ టార్ట్స్" అనే పదం మాత్రం ఎప్పుడూ వినలేదు.


అలా మొదలైంది ఆవని లా ప్రయాణం.


మొదటి రోజు ప్రశాంతంగా గడిచిపోయింది.

కానీ...

రెండో రోజు ఉదయం కాలేజీకి రాగానే సీనియర్ల చూపులు కొత్త విద్యార్థులపై పడ్డాయి.


కొద్దిసేపటికి...

"ఫ్రెషర్స్... ఒక్కసారి ఇక్కడికి రండి!" అని పిలిచారు.


అందరి గుండెల్లో ఒక్కసారిగా గుబులు మొదలైంది.

అయితే అది భయపెట్టే ర్యాగింగ్ కాదు.

స్నేహానికి నాంది పలికే, నవ్వులు పంచే చిన్న చిన్న సరదా ర్యాగింగ్ మాత్రమే.


ఆ ర్యాగింగ్‌తోనే లా కాలేజీలో ఆవనికి మొదటి స్నేహాలు మొదలయ్యాయి.


లా కాలేజీలో స్నేహితులతో నవ్వులు పంచుకుంటున్న ఆవని మరియు సహ విద్యార్థులు
లా కాలేజీలో స్నేహితులతో నవ్వులు పంచుకుంటున్న ఆవని మరియు సహ విద్యార్థులు

అధ్యాయం 3: ర్యాగింగ్, స్నేహాలు, మూడు సంవత్సరాల జ్ఞాపకాలు 


ఆ రోజుల్లో లా కాలేజీల్లో చిన్న చిన్న ర్యాగింగ్‌లు ఉండేవి. అయితే అవి ఈ రోజుల్లో చెప్పుకునేంత తీవ్రమైనవి కాదు. ఎక్కువగా సీనియర్లతో పరిచయం పెంచుకోవడానికి, కొత్తవాళ్లలో బెరుకు పోగొట్టడానికి చేసే సరదా ర్యాగింగ్ మాత్రమే.


మాకు ఇప్పటికీ గుర్తున్న కొందరు సీనియర్లు మురళి, గౌతమ్, శివరాం. ఇప్పుడు వాళ్లు ఎక్కడ ఉన్నారో, ఏ స్థాయిలో ఉన్నారో నాకు తెలియదు. కానీ ఆ రోజుల్లో వాళ్లే మా సీనియర్లు.


మొదటిసారి ఎదురుపడగానే నవ్వుతూ,

"సీనియర్స్ కనిపిస్తే సల్యూట్ కొట్టి 'గుడ్ మార్నింగ్ సార్' చెప్పాలి," అన్నారు.


మేమంతా ఒకరిముఖం ఒకరం చూసుకున్నాం.


లా చదవడానికి వచ్చాం... రేపు కోర్టులో న్యాయం కోసం వాదించబోతున్నాం... ఇప్పుడు సల్యూట్ కొట్టాలా?

అని మనసులో అనిపించినా, కొత్తవాళ్లం కాబట్టి వాళ్లు చెప్పినట్లు చేసేవాళ్లం.


అప్పుడు ఆవని పక్కన కూర్చున్న రాజ్యలక్ష్మి మెల్లగా, "నేను మా పల్లెటూర్లోనే ప్రాక్టీస్ చేసి పెద్ద లాయర్ అవుతాను," అంది.


ఆమె మాటల్లో ఎంత ఆత్మవిశ్వాసమో కనిపించింది. ఇప్పుడు ఆమెతో నాకు సంబంధం లేదు. తర్వాత ఆమె జడ్జిగా ఎంపికైందని ఎప్పుడో విన్నాను. అది గుర్తొస్తే ఇప్పటికీ సంతోషంగానే ఉంటుంది.


ఇంకో స్నేహితురాలు శ్రీలత మాత్రం భిన్నం.

"నేను ఎవరికి సల్యూట్ కొట్టను. సల్యూట్ లేదు... ఏమీ లేదు," అని ధైర్యంగా చెప్పేది.


ఆమె మాటలు వింటే మాకందరికీ నవ్వొచ్చేది.

కొద్దిరోజుల్లోనే అందరం కలిసిపోయాము.

అబ్బాయిలు వాళ్ల గ్రూప్... అమ్మాయిలం ఒక గ్రూప్…


క్లాసులు, లైబ్రరీ, క్యాంటీన్, నోట్స్, అసైన్‌మెంట్స్, చిన్న చిన్న వాదనలు, పెద్ద పెద్ద కలలు...

అలా తెలియకుండానే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి.


ఫ్రెషర్స్ పార్టీ జరిగింది.

ఫేర్‌వెల్ పార్టీ వచ్చింది.

కాలేజీ డే, సెమినార్లు, మూట్ కోర్టులు... ప్రతి కార్యక్రమంలో అందరం ఉత్సాహంగా పాల్గొనేవాళ్లం.


కానీ...

మూడు సంవత్సరాల చివర్లో వచ్చిన వైవా మాత్రం అందరికీ కొత్త అనుభవం.


వైవాలో ఒక కేసును మన ముందు ఉంచుతారు. దాన్ని చదివి, చట్టపరంగా విశ్లేషించి, అధ్యాపకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.


అప్పుడే వారికి మొదటిసారి ఒక విషయం అర్థమైంది.

ఒక్క వ్యక్తి ఎదుట మాట్లాడటం వేరు...

పది మంది ఎదుట నిలబడి మన వాదనను ఆత్మవిశ్వాసంగా వినిపించడం వేరు.


కాలేజీలో నేర్చుకున్న పాఠాలు ఒక వైపు...

పరీక్షలు మరో వైపు…


కానీ నిజమైన కోర్టు జీవితం మాత్రం ఇంకా ఆవని కోసం ఎదురుచూస్తూనే ఉంది.


అది ఆమె జీవితంలో మొదలుకాబోయే అసలు అధ్యాయం.


జిల్లా కోర్టులో నిజమైన న్యాయవ్యవస్థను చూసి ఆశ్చర్యపోతున్న జూనియర్ అడ్వకేట్లు
జిల్లా కోర్టులో నిజమైన న్యాయవ్యవస్థను చూసి ఆశ్చర్యపోతున్న జూనియర్ అడ్వకేట్లు

అధ్యాయం 4: కోర్టు... సినిమా కాదు!


లా పూర్తయ్యాక అందరికీ కొత్త నిబంధన ఎదురైంది.


ఒక సంవత్సరం తప్పనిసరిగా సీనియర్ అడ్వకేట్ దగ్గర అప్రెంటిస్‌షిప్ చేయాలి. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే హైకోర్టులో ఎన్రోల్మెంట్.


మొదటి రోజు...


ఆవని, స్వర్ణ, శాంతి, శ్రీలత, సుబ్రహ్మణ్యం, నషీద్ ఆఫ్సర్... అందరూ కలిసి కర్నూలు కోర్టు ఆవరణలో అడుగుపెట్టారు.


దూరం నుంచే కోర్టు భవనం కనిపించింది.


"వావ్... సినిమాల్లో చూపించేదానికంటే ఇంకా బాగుంది!" అంది స్వర్ణ.


"ఇవాళ ఏదో పెద్ద క్రిమినల్ కేసు వాదన ఉంటుంది. మనం కూడా చూస్తాం," అని ఉత్సాహంగా అన్నాడు సుబ్రహ్మణ్యం.


ఆవని కళ్లల్లో కూడా అదే మెరుపు.


"జడ్జిగారు గావెల్ కొడతారు... సార్ గట్టిగా 'యువర్ ఆనర్!' అంటారు... మనం వెనక కూర్చొని చూస్తాం..."


అంతలో శ్రీలత నవ్వింది.


"నువ్వు ఎక్కువ సినిమాలు చూశావు."


అందరూ లోపలికి వెళ్లారు.


లోపలికి వెళ్లగానే...


విరిగిన బెంచీలు...


పాత టేబుళ్లు...


ఫైళ్లతో నిండిపోయిన అల్మారాలు...


క్లర్కుల పరుగులు...


ఆవని ఒక్కసారి చుట్టూ చూసింది.


"అరే... సినిమాలో చూపించేది ఎక్కడ?"


అంతలో వాళ్ల సీనియర్ సార్ వచ్చారు.


"ఏమయ్యా... అందరూ వచ్చారా?"


"అవును సార్."


"అయితే రండి. ముందు క్లర్క్ దగ్గరకు."


సుబ్రహ్మణ్యం ఆశ్చర్యంగా అడిగాడు.


"సార్... కోర్టు వాదన ఎప్పుడు మొదలవుతుంది?"


సార్ నవ్వేశారు.


"వాదనా? ముందు పిటిషన్ ఫైల్ చేయాలి. నంబర్ రావాలి. కేసు పిలవాలి. ఆ తర్వాతే వాదన."


ఆవని మెల్లగా స్వర్ణ చెవిలో,


"సినిమాల్లో ఇవేమీ చూపించరే!" అంది.


స్వర్ణ కూడా నవ్వేసింది.


క్లర్క్ దగ్గరికి తీసుకెళ్లిన సార్ ఒక పెద్ద కట్ట ఫైళ్లు చూపించారు.


"ఇవన్నీ చదవాలి."


నషీద్ ఆఫ్సర్ కళ్లు పెద్దవయ్యాయి.


"సార్... ఇవన్నీ ఈరోజేనా?"


"కాదు... ఇది ఒక్క కేసు."


"ఒక్క... కేసా?" అందరూ ఒకేసారి అరిచారు.


సార్ నవ్వుతూనే,


"కేసు అంటే ఒక్క పేజీ అనుకున్నారా? కొన్నిసార్లు చిన్న పుస్తకం అంత ఉంటుంది."


శాంతి ఫైల్ తీసుకుని తిప్పుతూ,


"ఇది చదివేలోపు కేసే అయిపోతుందేమో!" అంది.


అందరూ గట్టిగా నవ్వేశారు.


సార్ మళ్లీ మొదలుపెట్టారు.


"గుర్తుంచుకోండి... ప్రతి తేదీ గుర్తుండాలి. ప్రతి పిటిషన్ చదవాలి. ప్రతి డాక్యుమెంట్ అర్థం కావాలి."


ఆవని మెల్లగా,


"సార్... గూగుల్‌లో వెతికేస్తే సరిపోదా?"


సార్ నవ్వి,


"గూగుల్? అది రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు ఉంది."


అందరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.


ఆ రోజుల్లో కంప్యూటర్లు కూడా చాలా అరుదు.


ఒక్క పిటిషన్ రాయాలన్నా...


ఒక్క కంప్లైంట్ తయారు చేయాలన్నా...


ప్లెయింటిఫ్ చెప్పిన ప్రతీ మాట చేత్తోనే రాయాలి.


రాసి... మళ్లీ చదివి... సరిచూసి... ఫైల్ చేయాలి.


అంతలో మరో వార్త.


"అమ్మాయిలందరూ రేపటి నుంచి చీర కట్టుకుని రావాలి."


ఆవని నోరు తెరిచింది.


"ఏమిటి?"


స్వర్ణ తల పట్టుకుంది.


"నాకు చీర కట్టడం కూడా రాదు."


శాంతి నవ్వుతూ,


"న్యాయం కోసం పోరాడతామని వచ్చాం... ముందు చీరతోనే పోరాటం మొదలైంది!"


శ్రీలత మాత్రం కుర్చీ నుంచి లేచింది.


"లేదు... మేం చీర కట్టం."


"అవును!" అని ఆవని కూడా నిలబడింది.


"ప్రాక్టీస్ చేయమంటే చేస్తాం... ఫైళ్లు చదవమంటే చదువుతాం... కానీ చీర తప్పనిసరి అంటే మాత్రం ఒప్పుకోం."


సార్ నవ్వుతూ వాళ్లందరినీ చూసి,


"సరే... సరే... అంత ఆందోళన పడొద్దు. తెల్లటి చుడిదార్ వేసుకుని వచ్చినా సరిపోతుంది."


ఒక్కసారిగా అందరి ముఖాల్లో వెలుగు.


"యెస్!" అంటూ సుబ్రహ్మణ్యం చప్పట్లు కొట్టాడు.


"అరే... మనం పెద్ద కేసు గెలిచినట్టుంది!" అని నషీద్ ఆఫ్సర్ అన్నాడు.


"ఇదే మన మొదటి విజయం!" అంటూ స్వర్ణ నవ్వింది.


శ్రీలత గర్వంగా,


"చూశారా... పోరాడితే ఫలితం ఉంటుంది."


ఆవని నవ్వుకుంది.


కొద్దిసేపటికే వాళ్లందరూ మళ్లీ ఆ భారీ ఫైళ్ల ముందు కూర్చున్నారు.


సుబ్రహ్మణ్యం నిట్టూర్చాడు.


"ఇక చదవండి."


ఆవని ఫైల్ తెరిచి నవ్వుతూ అంది...


"సినిమాల్లో రెండు నిమిషాల్లో కేసు గెలుస్తారు... నిజ జీవితంలో మాత్రం ఒక కేసు చదవడానికే రెండు వారాలు పడుతోంది!"


జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు అడ్వకేట్‌గా ఎదుగుతున్న ఆవని ప్రయాణం
జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు అడ్వకేట్‌గా ఎదుగుతున్న ఆవని ప్రయాణం

అధ్యాయం 5: జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు


రోజులు గడుస్తున్నాయి.

కేసులు చదవడం... కోర్టులో వేచి ఉండడం... సీనియర్ చెప్పిన పనులు చేయడం... ఇవే ఆవని దినచర్య.

కొన్నిసార్లు ఒక గంట... రెండు గంటలు కూర్చున్నా కేసు నంబర్ వచ్చేది కాదు.


"ఇంకా కొంచెం ఆగండి," అని కోర్టు సిబ్బంది చెప్పేవారు.


అందరు ఎదురుచూస్తూనే ఉండేవాళ్లం.


ఇంతలో సీనియర్ వచ్చి,

"ఆవని... ఈ కోర్టులో మన కేసు ఇవాళ రాదు. పక్క కోర్టుకు ట్రాన్స్‌ఫర్ అయింది. వెంటనే అక్కడికి వెళ్లి వాయిదా తీసుకురా," అని చెప్పేవారు.


చేతిలో భారీ ఫైళ్లు పట్టుకుని ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు పరుగులు తీయడం... జూనియర్ అడ్వకేట్ జీవితంలో ఇదీ ఒక భాగమని అప్పుడే ఆవని కి తెలిసింది.


సినిమాల్లో కోర్టులో కూర్చొని వాదన చేస్తే సరిపోతుంది.

నిజ జీవితంలో మాత్రం కోర్టు ఆవరణ అంతా తిరగాలి.

అలా అప్రెంటిస్‌షిప్ పూర్తయింది.


కాలం తన దారిలో నడిచింది.

ఆవని వివాహం జరిగింది.

వివాహం తర్వాత ఆమె జీవితం మరో మలుపు తిరిగింది.


కర్నూలు జిల్లా కోర్టును వదిలి, హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి వచ్చింది.


జిల్లా కోర్టుకి... హైకోర్టుకి... చాలా తేడా ఉంది.

భవనం పెద్దది కావడమే కాదు...

పని విధానం, కేసుల స్వభావం, చట్టపరమైన లోతు... అన్నీ భిన్నంగా అనిపించాయి.


"ఇక్కడే నా అసలు ప్రయాణం మొదలవుతుంది," అనుకుంది ఆవని.


ఆమె టైపింగ్ కూడా నేర్చుకుంది.

అది తెలిసిన కొందరు సరదాగా,

"నీకు టైపింగ్ బాగా వస్తోంది. ఇలా కొనసాగితే అడ్వకేట్ కంటే టైపిస్టుగానే పేరు వస్తుంది," అని ఆటపట్టించేవారు.


ఆవని మాత్రం నవ్వి ఊరుకునేది.

ఎందుకంటే తన లక్ష్యం టైపిస్టు కావడం కాదు...

మంచి అడ్వకేట్ కావడం.


హైదరాబాద్‌లో ఆవనికి శ్రీ కృష్ణారెడ్డి గారి వద్ద జూనియర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆయన టీటీడీ కౌన్సెల్‌గా వ్యవహరించేవారు.


ఆయన మొదటి రోజే ఒక విలువైన మాట చెప్పారు.

"ఏ కోర్టుకి వెళ్లినా... ఏ కేసు వాదించినా... ఫైల్ పూర్తిగా చదవకుండా కోర్టులో అడుగు పెట్టొద్దు."


ఆ మాట జీవితాంతం గుర్తుండిపోయింది.

ప్రతి ఉదయం ఎనిమిది గంటలకే ఇంటి నుంచి బయలుదేరాలి.

ఆఫీసుకు వెళ్లాలి.

ఆ రోజు కోర్టు లిస్ట్ చూడాలి.


ఏ కేసు ఏ కోర్టులో ఉందో గుర్తించాలి.

ఏ జడ్జి ముందు విచారణ ఉందో తెలుసుకోవాలి.

సీనియర్‌కు వివరాలు చెప్పాలి.


ఆ తర్వాత ఆయన చెప్పిన కోర్టుకు వెళ్లి కూర్చోవాలి.

మన కేసు పిలిచే వరకు ఎదురు చూడాలి.


పిలిచిన తర్వాత...

వాదన కావచ్చు...

వాయిదా కావచ్చు...

కొన్నిసార్లు విజయం...

మరికొన్నిసార్లు ఓటమి...

ఇవన్నీ అడ్వకేట్ జీవితంలో సహజమే.


కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమైంది.

సినిమాల్లో చూపించే ఐదు నిమిషాల కోర్టు వాదనలు...

ఒక్క డైలాగ్‌తో కేసు గెలిచే సన్నివేశాలు...

నిజ జీవితంలో ఉండవు.


ఒక కేసు వెనుక ఎన్నో రోజుల శ్రమ ఉంటుంది.

వందల పేజీల అధ్యయనం ఉంటుంది.


చట్టంలోని ప్రతి సెక్షన్‌పై అవగాహన ఉంటుంది.

ఆ రోజుల్లో నక్సలైట్ కేసుల నుంచి దేవాదాయ శాఖ కేసుల వరకు ఎన్నో రకాల కేసులు కోర్టులో వినిపించేవి.

ప్రతి కేసు ఒక కొత్త పాఠం నేర్పేది.


ఇలా...

"ఇప్పుడే నా లాయర్ జీవితం నిజంగా మొదలైంది" అనుకుంటున్న సమయంలో...

విధి మాత్రం మరో నిర్ణయం తీసుకుంది.


ఒక చిన్న సంఘటన...

ఆవని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

అడ్వకేట్‌గా ఆ మె ప్రయాణానికి... ఊహించని ముగింపును రాసింది.


హైకోర్టు కారిడార్‌లో సీనియర్ల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం పొందుతున్న ఆవని
హైకోర్టు కారిడార్‌లో సీనియర్ల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం పొందుతున్న ఆవని

అధ్యాయం 6: హైకోర్ట్ కారిడార్…


ఆవని, సుబ్రహ్మణ్యం, భాస్కర్ రెడ్డి, మంజు... నలుగురూ జిల్లా కోర్టు నుంచి కొత్తగా హైకోర్టుకు వచ్చారు.


ఫైళ్లు చేతిలో పట్టుకుని కారిడార్‌లో నడుస్తున్నారు.

అంతలో ఇద్దరు సీనియర్ అడ్వకేట్లు ఎదురుపడ్డారు.

ఒకరు నవ్వుతూ,

"ఏమండి... మీరు జిల్లా కోర్ట్ నుంచి వచ్చారట కదా?"


"అవును సార్," అంది ఆవని.


"సరే... సరే... ఇక్కడ కొంచెం కష్టమే. ఇది హైకోర్టు. ఇక్కడ ఇంగ్లీష్ బాగా రావాలి... లా బాగా తెలియాలి... డ్రెస్సింగ్ కూడా ప్రొఫెషనల్‌గా ఉండాలి... రోజూ హైకోర్టుకి రావాలంటే ఎంత కష్టమో తెలుసా?"


పక్కనే ఉన్న ఇంకో అడ్వకేట్ నవ్వుతూ,

"జిల్లా కోర్టులో ఒక పిటిషన్ వేసి, రెండు వాయిదాలు తీసుకుంటే రోజు అయిపోతుంది. ఇక్కడ అలా కాదు!" అన్నాడు.


వాళ్లు వెళ్లిపోయారు.

కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

మంజు మెల్లగా అంది...

"మనం జిల్లా కోర్ట్ నుంచి వచ్చామని ఇంత చిన్నచూపా?"


సుబ్రహ్మణ్యం నవ్వేశాడు.

"ఏముంది... జిల్లా కోర్టులో సూర్యుడే ఉదయిస్తాడు... హైకోర్టులో కూడా అదే సూర్యుడు ఉదయిస్తాడు."


అందరూ నవ్వేశారు.


భాస్కర్ రెడ్డి కూడా చమత్కరించాడు.

"అదే లా బుక్... అదే CPC... అదే CrPC... అదే Evidence Act... పుస్తకాలు మారలేదు. బిల్డింగ్ మాత్రమే మారింది!"


ఆవని చిరునవ్వు నవ్వింది.

"కొంతమంది మాటలు వింటే మన మీద మనకే సందేహం వస్తుంది."


"నిజమే," అంది మంజు.


"ఒక్కోసారి వాళ్ల మాటలు సరదాగా అనిపిస్తాయి... ఒక్కోసారి మన ఆత్మవిశ్వాసాన్నే దెబ్బతీస్తాయి."


అంతలో వెనుక నుంచి ఒక హైకోర్టు సీనియర్ అడ్వకేట్ వచ్చారు.


వాళ్ల మాటలు విన్న ఆయన నవ్వుతూ అన్నారు...

"అయ్యో... కోర్టులు రెండు... చట్టం మాత్రం ఒక్కటే. జిల్లా కోర్ట్ అయినా, హైకోర్ట్ అయినా... ఫైల్ చదవని లాయర్ ఎక్కడా నిలబడలేడు. ఫైల్ చదివిన లాయర్‌ను ఎవరూ ఆపలేరు."


ఆ మాట విన్న ఆవని మనసులోని భయం కొంత తగ్గింది.


ఆ రోజు ఆమె ఒక విషయం అర్థం చేసుకుంది.

హైకోర్టులో కూడా మంచి మనుషులు ఉంటారు. ప్రోత్సహించే సీనియర్లు ఉంటారు. చేయి పట్టి నడిపించే స్నేహితులు ఉంటారు.


ఆ స్నేహాలే...

ఆ మద్దతే...

ఆవనిని నెమ్మదిగా నిలబెట్టాయి.


కానీ...

జీవితం ఇంకా ఆమెకు ఒక పెద్ద పరీక్షను సిద్ధం చేసి ఉంచింది.

ఆ పరీక్షే...

ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పబోతోంది.


హైకోర్టులో తొలి ప్రధాన వాదనతో విజయం సాధిస్తున్న అడ్వకేట్ ఆవని
హైకోర్టులో తొలి ప్రధాన వాదనతో విజయం సాధిస్తున్న అడ్వకేట్ ఆవని

అధ్యాయం 7: ఐదు నిమిషాల వాదన... జీవితాన్ని మార్చిన రోజు


ఆ రోజు ఏదో ప్రత్యేకంగా అనిపించింది.

ఎప్పటిలాగే ఉదయాన్నే దేవుడికి దండం పెట్టుకుని, ఆశీర్వాదం తీసుకుని ఆఫీసుకు వెళ్లాను.

ఆఫీసుకు వెళ్లగానే సార్ నన్ను పిలిచారు.


"ఈ రోజు టీటీడీకి సంబంధించిన Reinstatement of Employment కేసు ఉంది. నేను అత్యవసర పనితో బయటకు వెళ్లాలి. నువ్వు కోర్టుకు వెళ్లి వాయిదా తీసుకురా."


"సరే సార్," 


ఎప్పటిలాగే ఫైల్ మొత్తం చదివింది

ఆవని కు ఒక అలవాటు ఉండేది.

ఏ కేసు అయినా చదవకుండా కోర్టులో అడుగు పెట్టేది కాదు. ముఖ్యమైన పాయింట్లన్నీ పెన్సిల్‌తో అండర్‌లైన్ చేసుకునేది. తర్వాత ఫైల్ ఇచ్చేటప్పుడు వాటిని చెరిపేయొచ్చు కాబట్టి పెన్సిల్ మాత్రమే ఉపయోగించేది.

ఆ రోజు కూడా అలాగే సిద్ధమయ్యింది.


మధ్యలో మరో కోర్టులో వాయిదా తీసుకురమ్మని ఇంకో జూనియర్ చెప్పడంతో అక్కడికి వెళ్లి పని పూర్తి చేసి తిరిగి వచ్చింది.


ఇప్పుడు ఆవని కేసు...

అది హైకోర్టు మొదటి కోర్టు.


గౌరవ న్యాయమూర్తి శ్రీ ప్రభాకర్ మిశ్రా గారి కోర్టు.

ఆ కోర్టులో ఆవని అడుగుపెట్టడం అదే మొదటిసారి.

ఎయిర్ కండీషన్డ్ కోర్టు...

నిశ్శబ్ద వాతావరణం...

అందరూ గంభీరంగా కూర్చున్నారు.


జడ్జిగారిని చూడగానే ఆవని మనసులో ఒక ఆలోచన మెరిసింది.


"ఎప్పుడో ఒక రోజు... ఇలాంటి న్యాయాసనంపై కూర్చునే అవకాశం వస్తే ఎంత బాగుంటుంది!"

కలలు కనడానికి హద్దులు ఉండవు కదా!


జడ్జి అవుతానని అనుకోవచ్చు...

దేశాధ్యక్షురాలిని అవుతానని కూడా అనుకోవచ్చు...

ఆలోచనలకు ఆకాశమే హద్దు.


ఆవని మాత్రం ప్రశాంతంగా నే వుంది.

"వాయిదా అడుగుతాను... పని అయిపోతుంది..." అనుకున్నది.


కానీ...

ఆవని ముందు ఉన్న కేసులోనే జడ్జిగారు తీవ్ర ఆగ్రహంతో మాట్లాడడం మొదలుపెట్టారు.

"Court has its own discipline. You have to follow it. You have no right to disobey the Court. If you are not prepared to argue, I will dismiss your case."


ఆ మాటలు వినగానే కోర్టు హాలంతా నిశ్శబ్దమైపోయింది.

జడ్జిగారి గంభీరమైన స్వరం ఇంకా ఆవని చెవుల్లో మార్మోగుతూనే ఉంది.


అప్పుడు అర్థమైంది...

ఎందుకు ఆయనను చాలామంది ప్రేమతో, గౌరవంతో "లయన్" అని పిలిచేవారో.


ఇప్పుడు... ఆవని

కేసు పిలిచారు.

ఆవని లేచి నిలబడినది 

నిజం చెప్పాలంటే...

కొత్తగా పెళ్లయింది.

చేతికి పెట్టుకున్న గోరింటాకు కూడా పూర్తిగా ఆరలేదు.

వృత్తిలో నాలుగు నెలల అనుభవం మాత్రమే.


"Yes, counsel?" అని జడ్జిగారు చూశారు.


"My Lord... adjournment, please."


"Adjournment? Why?"


ఒక్క క్షణం ఆలోచించింది.

సార్ చెప్పింది వాయిదా తీసుకురమ్మని.

ఆవని ధైర్యం చేసి,

"మా సార్‌కు యాక్సిడెంట్ అయింది, ఆసుపత్రిలో ఉన్నారు. అందుకే రాలేకపోయారు," అన్నది.


జడ్జిగారు వెంటనే అడిగారు.

"మరి మీరు ఎందుకు ఉన్నారు? జూనియర్ అడ్వకేట్‌ను వాయిదాలు అడగడానికి ఉంచారా? వాదించడానికి కాదా?"


ఆవని మౌనంగా నిలబడ్డది.


"ఎన్ని నెలలైంది ప్రాక్టీస్?"


"నాలుగు నెలలు, మై లార్డ్."


"అయితే ఫైల్ చదివి ఉంటావు. వాదించు."


ఆ మాటతో ఆ మె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది.


ఒకవైపు...

సార్ చెప్పింది వాయిదా తీసుకురమ్మని.

మరోవైపు...

జడ్జిగారు వాదించమంటున్నారు.


వాదించకపోతే కేసు కొట్టివేస్తానన్నారు.

అలా జరిగితే...

క్లయింట్‌కు నష్టం.


ఒక్క క్షణంలోనే నిర్ణయం తీసుకున్నది.

ఫైల్ చదివాను కదా...

అయితే వాదిస్తాను.


ప్రతివాది తరపు న్యాయవాది పేరు ఉ న్న లాయరు

ఆవని కి భయము మొదలయ్యిoది.


వాదన మొదలైంది.

సినిమాల్లో చూపించినట్లు గంటల తరబడి కాదు...

కేవలం కొన్ని నిమిషాలే.


కానీ ఆ కొన్ని నిమిషాలే ఆవని జీవితాన్ని మార్చేశాయి.

ఫైల్‌లో త ను పన్సిల్‌తో గుర్తు పెట్టుకున్న ఒక ముఖ్యమైన తేదీ గుర్తొచ్చింది.


ఆ పాయింట్‌ను కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

"మై లార్డ్, ఈ తేదీనే కీలకం. ఆ రోజే పిటిషన్ దాఖలు చేశాం. అందుకే ఉద్యోగిని తిరిగి సేవలోకి తీసుకోవాలి."

కొన్ని క్షణాలు కోర్టులో నిశ్శబ్దం.

జడ్జిగారు ఫైల్ చూశారు.

తర్వాత...

"Reinstatement Allowed."

అంతే.

ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తికి తిరిగి ఉద్యోగం వచ్చింది.

ఆవ ని జీవితంలో మొదటి ప్రధాన వాదన...

మొదటి విజయం.

బయటికి రాగానే కోర్టు బంట్రోతు నవ్వుతూ,

"అమ్మా... కేసు గెలిచావు కదా! ఏదైనా ఇవ్వాలి!" అన్నాడు.

అప్పుడే నిజంగా అర్థమైంది.

తను కేసు గెలిచింది.

మధ్యాహ్నానికే సార్ ఆఫీసుకు రమ్మని పిలిపించారు.

జరిగినదంతా వివరంగా చెప్పింది.

ఆయన ప్రశాంతంగా విన్నారు.

బయటకు వచ్చేసరికి ఇంకొన్ని ఆఫీసుల సీనియర్లు ఆమెను పిలిచి, "మా ఆఫీసులో జాయిన్ అవుతావా?" అని అడిగారు.

అది ఆవని కి వచ్చిన మొదటి ఆఫర్.

కానీ అమాయకంగా,

"లేదండి... నేను మా సార్ దగ్గరే ఉంటాను," అని వినయంగా తిరస్కరించింది.

సాయంత్రం సార్ మళ్లీ పిలిచారు.

"నువ్వు వాదించావు... గెలిచావు... చాలా బాగుంది."

ఆవని సంతోషంగా నవ్వాను.

కానీ ఆయన వెంటనే అన్నారు.

"ఒకవేళ ఓడిపోయి ఉంటే?"

ఆ ఒక్క ప్రశ్న ఆలోచింపజేసింది.

 "ఒకవేళ..."

ప్రతి అడ్వకేట్ జీవితంలో ఈ ఒక్క మాట ఎప్పుడూ ఉంటుంది.

ప్రతి కేసు ఒక రిస్కే.

కొన్నిసార్లు గెలుస్తాం...

కొన్నిసార్లు ఓడిపోతాం...

కానీ ఆ రిస్క్‌ను ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు అనేదే అనుభవం నేర్పే పాఠం.

ఆ రోజు సార్ నాకు అదే నేర్పించారు.

అయితే...

ఆ సంఘటన తర్వాత ఒక మార్పు మాత్రం స్పష్టంగా కనిపించింది.

ఇప్పటి వరకు నా చేతిలో పెద్ద పెద్ద కేసు ఫైళ్లు పెట్టిన మా సార్...

ఆ రోజు నుంచి మాత్రం చిన్న చిన్న ఫైళ్లనే ఇవ్వడం ప్రారంభించారు.

అది నాపై కోపమో, జాగ్రత్తో, లేక నన్ను మరింత అనుభవం వచ్చే వరకు కాపాడాలనే ఉద్దేశమో నాకు ఇప్పటికీ తెలియదు.

కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది.

ఆ రోజు నేను ఒక కేసు మాత్రమే గెలవలేదు... అడ్వకేట్ జీవితంలో విజయం ఎంత ముఖ్యమో, బాధ్యత అంతకంటే ముఖ్యమని కూడా నేర్చుకున్నాను.”


ముగింపు


ఈ కథ పూర్తిగా నా జీవితంలో జరిగిన అనుభవాల ఆధారంగా రాసింది.


నేను కర్నూలు లా కాలేజీలో చదివాను. నాతో కలిసి చదివిన స్నేహితులు, నా అధ్యాపకులు, నా సీనియర్లు, నా జూనియర్లు... ఈ కథ చదివితే ఎక్కడో ఒకచోట తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ కథ ద్వారా నన్ను ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే నాకు ఎంతో ఆనందం.


నా తోటి విద్యార్థుల్లో చాలామంది ఈరోజు గొప్ప అడ్వకేట్లు, న్యాయమూర్తులు, ప్రభుత్వ న్యాయవాదులు, న్యాయరంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు.


కాలం చాలా మారిపోయింది.

ఈ తరం న్యాయ విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సైబర్ లా, కార్పొరేట్ లా, లీగల్ ట్రాన్స్‌క్రిప్షన్, లీగల్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్, ఆర్బిట్రేషన్, మేధోసంపత్తి హక్కులు... ఇలా ఎన్నో రంగాలు మీ కోసం ఎదురుచూస్తున్నాయి.


నేనైతే జీవిత పరిస్థితుల వల్ల నా అడ్వకేట్ సర్టిఫికేట్‌ను ఒక మూలన పెట్టాల్సి వచ్చింది.

ఆ తప్పు మాత్రం మీరు చేయకండి.


జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి. అపజయాలు ఎదురవుతాయి. అయినా ధైర్యంగా నిలబడండి. కష్టపడండి. నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి.

ముఖ్యంగా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి.

సినిమాల్లో చూపించినట్లు కోర్టులో ఎవరూ మీకు స్క్రిప్ట్ ఇవ్వరు.


మీ వాదనను మీరే సిద్ధం చేసుకోవాలి.

మీ కేసును మీరే చదవాలి.

మీ నమ్మకాన్ని మీరే నిర్మించుకోవాలి.


అనుభవం, అధ్యయనం, నిజాయితీ, కష్టపడే తత్వం... ఇవే ఒక మంచి అడ్వకేట్‌కు అసలైన బలం.

అడ్వకసీ అనేది కేవలం ఒక వృత్తి కాదు.

అది ఒక బాధ్యత.


ఒక మనిషికి న్యాయం అందించే పవిత్రమైన సేవ.

ఈరోజు నేను కోర్టులో వాదించడం లేదు.

అదే జీవిత అనుభవాలను కథలుగా రాస్తున్నాను.

జీవితం నన్ను మరో దారిలో నడిపించింది.

కానీ న్యాయం పట్ల ఉన్న గౌరవం మాత్రం ఎప్పటికీ 

మారలేదు.


– Shrita


శుభం.


***

శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:


శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 రచయిత్రి పరిచయం: శ్రిత

శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.

ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page