శ్రావణమాసం కాస్ట్లీ శనగలు

Sravanamasam Costly Senagalu - Telugu Comedy Story | Jeedigunta Srinivasa Rao
శ్రావణమాసం కాస్ట్లీ శనగలు - తెలుగు హాస్య కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 13/09/2026
“శ్రావణమాసం కాస్ట్లీ శనగలు” కథను చదివితే కుటుంబ జీవితంలోని సరదా క్షణాలతో పాటు, ఆరోగ్యంపై శ్రద్ధ, జీవిత భాగస్వామిపై ప్రేమ, ఆపదలో ఒకరికొకరు అండగా ఉండటం వంటి విలువలు కూడా గుర్తుకు వస్తాయి. నవ్విస్తూ ఆలోచింపజేసే ఈ కథ తెలుగు పాఠకులకు మంచి కుటుంబ వినోదాన్ని అందిస్తుంది.
"ఏమండీ, రెండు కిలోల శనగలు, నాలుగు కొబ్బరికాయలు, యాభై అరటిపళ్ళు తీసుకుని రండి. రేపు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుని ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. ఇదిగో, లిస్ట్ జాగ్రత్తగా తీసుకుని రండి" అంది మాలతి.
"శ్రావణమాసం గవర్నమెంట్ వాళ్ళు రెండు సార్లు పెన్షన్ ఇస్తే బాగుండును, బస్తాలకొద్ది ఈ శనగలు కొనడం ఏమిటే, చస్తున్నాను" అన్నాడు చిరాకుగా సాయిరాం.
"శుభమా అని రేపు వ్రతం చేసుకుంటూవుంటే అశుభం మాటలు ఏమిటండి? మీ వళ్ళకాకపోతే చెప్పండి, అబ్బాయికి ఫోన్ చేసి అడిగితే అరగంటలో అన్నీ పంపిస్తాడు" అంది మాలతి.
"అలాగే, ఈ నెలకి కావలిసిన మందుల లిస్ట్ రాసిపెట్టుకున్నాను, అవికూడా నీ కొడుక్కి చెప్పి తెప్పించు చూద్దాం" అన్నాడు.
"అసలు ఇన్నాళ్లు అడగలేదు, మీకు వచ్చిన పెన్షన్ డబ్బులు, ఇంటి అద్దెలు ఏం చేస్తున్నారు? చూశారుగా ఇప్పుడు ఆడవాళ్లు ఎలా ఉన్నారో, మొగుళ్ళని నిలబెట్టి లెక్కలు అడుగుతున్నారు. మొదటి నుంచి నా డిపాజిట్ మీద నెలకు వచ్చే రెండు వేల రూపాయలతో నా ఖర్చులు నేనే పెట్టుకుంటున్నాని, మిమ్మల్ని ఏదో పూజ కోసం అడిగితే ఎక్కడలేని ఖర్చులు గుర్తుకు వస్తాయి మీకు" అంటూ దడదడలాడించింది సాయిరాంని.
"ఎరక్కపోయి అన్నానే, ఆ సంచి ఇటు ఇవ్వు బజార్ వెళ్లి అన్నీ తెస్తాను. పూజల విషయంలో మీ ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి" అని సంచి తీసుకుని బయటకు నడిచాడు.
భార్య చెప్పిన వస్తువులు అన్నీ తీసుకుని సంచి బరువుగా ఉండటంతో చేతులు మార్చుకుంటూ ఇంటికి చేరాడు. "ఏమిటి ఆయాసంగా ఉంది, ఇది ఎక్కడికి వెళ్ళింది తలుపులు వేసుకుని?" అనుకుంటూ అరుగుమీద కూర్చొని రొప్పుతున్నాడు. ఎదురింటి కొండలరావు వాకింగ్ చేస్తూ సాయిరాంని చూసి, "అదేమిటి అంకుల్, అరుగు మీద కూర్చొని ఉన్నారు, ఏమిటి రొప్పుతున్నారు? ఆంటీ పేరంటాలని పిలవడానికి వెళ్లినట్టున్నారు, మీరు మా ఇంట్లో కూర్చొండి" అన్నాడు.
"వద్దులే, ఈ శ్రావణమాసం నెలరోజులు ఇలా అరుగు మీద కూర్చోక తప్పదు. తాంబూలానికి వచ్చేపోయే ఆడవాళ్ళ మధ్యలో ఎక్కడ ఉండగలం?" అన్నాడు సాయిరాం.
"వచ్చేసారు ఇప్పుడే! చుట్టుపక్కల ఆడవాళ్ళని రేపు తాంబూలం తీసుకోవడానికి రమ్మని పిలిచి వచ్చాను" అంటూ తాళం తీసి, "ఏమిటి అలా ఉన్నారు, ఈ కాస్త పనికే అలసిపోయారా?" అంది.
లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని, "ఒకసారి బయటపెట్టిన సంచి లోపలికి తీసుకుని రా" అన్నాడు భార్యని.
"అబ్బో, బాగానే బరువు ఉంది! అలా మోసుకుని రాకపోతే ఆటోలో రావచ్చు కదా, డబ్బు ఖర్చు కోసం చూసుకుంటే ప్రాణం మీదకి వస్తుంది" అంటూ సంచిలోంచి ఒక్కొక్క వస్తువు తీసి టేబుల్ మీద పెడుతూ, "ఆవు పాలప్యాకెట్ ఏది?" అంది మాలతి.
"సరిగ్గా చూడు, పాలప్యాకెట్ ముందు కొన్నాను" అన్నాడు.
"ఇటు వచ్చి చూడండి, ఉంటే ఏది? ఏ పని శ్రద్ధగా చెయ్యరు. ఎవ్వరో చెప్పారు భర్త చేసే పుణ్యంలో భర్తకు భాగం లేదని, అంతే ఆధిపట్టుకుని ఏ పూజ చేసుకున్నా ఏడిపించేస్తున్నారు" అంది.
"మూడు వేలు ఖర్చు చేసి కొన్నాను, పాలప్యాకెట్ ఎందుకు మానేస్తాను? ఉండు, షాప్ వాడి దగ్గర వదిలేసాను ఏమో చూసి వస్తాను" అంటూ బయటకు వచ్చి, "ఇదిగో ఇటు రా" అని భార్యని పిలిచాడు.
"ఏమిటండి, దీనికి కూడా నేను ఎదురు రావాలా? చాదస్తం కాకపోతే" అంటూ బయటకు వచ్చిన భార్యతో, "నీ మొహం, నువ్వు ఎదురు రాబట్టే సంచిలోని పాలప్యాకెట్ పిల్లి లాగేసింది చూడు, కారు క్రింద నుంచి పాలు ఎలా వస్తున్నాయో" అన్నాడు.
"ఈ పాడు పిల్లిని పక్క ఇంటి వాళ్ళు పెంచుకుని మన ఇళ్ళమీదకి పంపుతున్నారు. మనం ఒక కుక్కని పెంచుకుంటే ఈ పిల్లి గొడవ వదులుతుంది, ఏమంటారు?" అంది మాలతి.
"ముందు నువ్వు శనగలు నానబెట్టుకో" అన్నాడు కొండలరావు.
మర్నాడు ఉదయం నుంచి పూజలు, గంటల చప్పుడుతో ఇల్లు హోరెత్తిపోతోంది. పట్టుచీరలు కట్టుకుని మెడ నిండా నగలతో కాళ్లకు పసుపు పారాణితో తన ఇంటికి తాంబూలం కోసం వస్తున్న కాలనీ వాళ్ళని చూసి, 'తను అక్కడ కూర్చోవడం బాగుండదు' అని మేడ మీద గదిలోకి వెళ్లి కూర్చున్నాడు.
అలా మేడమీద కూర్చొని ఉంటే ఎలా? కిందకి వచ్చి నన్ను దీవించండి అని మాలతి అరవడంతో మెల్లగా క్రిందకి వచ్చి, "దీర్ఘసుమంగళీభవ" అని అక్షింతలు వేసి, "రోజూ ఇలా దీవించుకోవచ్చుగా" అన్నాడు నవ్వుతూ.
"శనగలతో రొట్టె చేశాను, ఈ రాత్రికి టిఫిన్ ఇదే తినేసి త్వరగా పడుకోండి" అంది.
"ఉదయం నుంచి పచ్చిశనగలు తింటూనే ఉన్నాను, మళ్ళీ రాత్రికి శనగలు రొట్టె తింటే కడుపు పాడవుతుందేమో, పోనీ ఇడ్లీ వెయ్యి" అన్నాడు.
"ఇహ నాకు ఓపిక లేదు, కావాలంటే రెండు అరటిపళ్ళు తిని పడుకోండి" అని పడకగదిలోకి వెళ్ళిపోయింది.
"అబ్బా ఏమిటండి అమృతాంజనం కంపు" అంటూ విసుకుంటున్న భార్యతో, "కడుపులో నొప్పిగా ఉంది, పొట్టకి అమృతాంజనం రాసుకున్నాను" అన్నాడు కొండలరావు అసహనంగా దొర్లుతూ.
"ఉదయం నుంచి నడుం నొప్పితో చస్తున్నాను, రాత్రి కూడా సుఖంగా పడుకోనివ్వకుండా ఈ వాసనలు ఏమిటండి? నేను మేడ మీద రూంలో పడుకుంటాను" అని తలగడ తీసుకుని వెళ్ళిపోయింది మాలతి.
పక్కింట్లో నుంచి గిన్నెల చప్పుడు వినిపించి, 'అబ్బో అప్పుడే ఎనిమిది అయిిందే, మొద్దు నిద్రపోయాను' అనుకుంటూ క్రిందకి దిగి వచ్చిన మాలతికి హాలులో పేపర్ చదువుకుంటూ ఉండే భర్త కనిపించకపోవడంతో, "ఏమిటి ఈయన కూడా లేవలేదా?" అనుకుంటూ భర్త పడుకున్న గదిలోకి తొంగి చూసి, "బాబోయ్ ఏమైంది మీకు, అలా ఆయాసపడుతున్నారు?" అని పరుగున మంచం దగ్గరికి వెళ్లి చూసింది.
కొండలరావు గుడ్లు తేలేసి ఆయాసపడుతున్నాడు. "కొంపముంచుతారా ఏమిటి? నిన్ననే కదా 'దీర్ఘసుమంగళిగా ఉండు' అని దీవించారు" అంటూ ఏడ్పు మొదలుపెట్టి పక్క ఇంటి వాళ్ళను పిలిచి వాళ్ళ కారులో హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళింది.
ఎమర్జెన్సీ కేసు అంటూ ఐసీయూలోకి తీసుకుని వెళ్ళిపోయారు. బయట కుర్చీలో కూర్చొని ఏడుస్తున్న మాలతితో, "ఏమైంది ఆంటీ? నిన్న తాంబూలానికి వచ్చినప్పుడు అంకుల్ బాగానే ఉన్నారుగా" అంది సహాయంగా వచ్చిన పక్కింటి కుసుమ.
"వద్దన్నా వినకుండా ఉదయం నుంచి శనగలు నములుతూనే ఉన్నారు, రాత్రికి ఆయనకు శనగల రొట్టె ఇష్టం అని చేసి ఇచ్చాను. అర్ధరాత్రి పొట్టకి అమృతాంజనం రాసుకుంటూ కడుపులో నొప్పి అన్నారు. వారంలో ఒకసారి ఇదే తంతు ఆయనతో, అందుకే మామూలే అనుకుని నేను వేరే గదిలో పడుకున్నాను. పక్కనే ఉంటే రాత్రికి రాత్రి హాస్పిటల్‌కి తీసుకుని వచ్చేదానిని, ఇంత కొంప ముంచుకుంటారని తెలియదు" అంది.
ఐసీయూలోనుండి బయటకు వచ్చిన డాక్టర్ గారు, "ఏమిటమ్మా, శ్రావణమాసం శనగలు అన్నీ మీ వారి చేత తినిపించారా? అసిడిటీతో గుండెకు కొట్టింది. పొట్టంతా కడిగేసాము, సాయంత్రం ఇంటికి తీసుకుని వెళ్ళండి, పదిరోజులు చారన్నం మాత్రమే పెట్టండి" అన్నాడు.
సాయంత్రం నర్స్ వచ్చి, "మీ వారిని డిశ్చార్జ్ చేస్తాము, మీరు వెళ్లి బిల్లు కట్టేసి రండి" అంటూ బిల్లు చేతికి ఇచ్చింది.
"ఈ బిల్లు మాది కాదు అనుకుంటా, పదిహేను వేలు అని ఉంది" అంది మాలతి.
"మీదేనమ్మా, స్టొమక్ క్లీనింగ్‌కి ఐదు వేలు, ఐసీయూ క్లీనింగ్‌కి ఐదు వేలు, డాక్టర్ గారికి ఐదు వేలు" అంది నర్స్.
డబ్బులు కట్టి మొగుడిని విడిపించుకుని ఇంటికి వచ్చింది. "లోభికి ఎక్కువ ఖర్చు అన్నట్టుగా శనగలు తినడం వల్ల హాస్పిటల్ బిల్లు పదిహేను వేలు వదిలింది" అంది.
కొండలరావు నీరసంగా, "అసలు డెబ్బై ఏళ్ళకి నువ్వు నోములు నోచుకోవడం ఏమిటే? అందరూ పెళ్లి అయిన అయిదేళ్లలో నోచుకుంటారుగా" అన్నాడు.
"ఖర్మ, మీకు ఏమీ తెలియదు, నోములు కావు వ్రతం అంటే సత్యనారాయణస్వామి వ్రతంలా అర్థం అయిందా? ఏమిటో ఖర్మ కాకపోతే వయసులో పొట్లాడుకుని వేరే గదులలో పడుకోవడం తెలుసు, కానీ ఈ ముసలి వయసులో వేరే గదిలో పడుకుంటే ఎవ్వరికి ఏమైనా తెలియదు, తప్పు చేశాను" అంటూ మంగళసూత్రం కళ్ళకు అద్దుకుంది.
వృద్ధాప్యంలో దంపతులు ఒకరికొకరు తోడుగా ఉంటే ఆపదలో నుంచి బయటపడవచ్చు.
శుభం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


















Story is entertaining. But the main character of the story was Sairam initially but towards the end he became Kondalarao.