నిర్ణయం
- Srinivasarao Jeedigunta

- 16 minutes ago
- 6 min read
నిర్ణయం తెలుగు కథ, Telugu Stories, Emotional Telugu Story, Family Story Telugu, Father Son Story, Moral Story Telugu, Telugu Kathalu, Telugu Storytelling, Family Values, Forgiveness Story, Emotional Family Drama, Mother Love, Father Love, Gambling Addiction Story, Redemption Story, Village Story, Heart Touching Story, Mana Telugu Kathalu

Nirnayam - Telugu Family Story | Jeedigunta Srinivasa Rao
నిర్ణయం - తెలుగు కుటుంబ కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 26/06/2026
కృష్ణమూర్తి గారు ఊరిలో అందరికీ గౌరవప్రదమైన వ్యక్తి. క్రమశిక్షణ, నిజాయితీ ఆయన ప్రాణం. ఆయన భార్య మాధవి భర్త అడుగుజాడల్లో నడిచే సాధ్వి. ఆ దంపతులకు ఒక్కడే కొడుకు సుకుమార్, కానీ సుకుమార్ తండ్రికి పూర్తి భిన్నంగా తయారయ్యాడు. బాధ్యతారాహిత్యం, జూదం, సులభంగా డబ్బు సంపాదించాలనే వ్యసనాలు అతడిని తప్పుడు మార్గంలో నడిపించాయి.
మొదట్లో కృష్ణమూర్తి గారు ఎన్నో రకాలుగా నచ్చజెప్పారు, మందలించారు. కానీ సుకుమార్ ప్రవర్తన మారలేదు సరే కదా, ఒకరోజు ఇంటి పరువు తీసేలా పెద్ద తగాదా తెచ్చి, తండ్రిని ఎదురించి మాట్లాడాడు. ఆ రోజు కృష్ణమూర్తి గారి గుండె పగిలింది.
కృష్ణమూర్తి గారు రిటైరయ్యాక వచ్చిన సొమ్ముతో ఊరిలో పేద పిల్లల చదువు కోసం ఒక చిన్న ట్రస్ట్ నడిపేవాడు. ఊరిలో డబ్బున్న వాళ్ళు కొంతమంది ఈ ట్రస్ట్ కి ధనసహాయం చేసారు..
ఆరోజు పిల్లల పరీక్ష ఫీజు, యూనిఫామ్ కొనడానికి బ్యాంకు నుంచి లక్ష రూపాయలు తీసుకుని వచ్చి భార్య చేతికి ఇచ్చి జాగ్రత్తగా దాయమన్నాడు కృష్ణమూర్తి గారు.
సుకుమార్ ఆన్లైన్ జూదంలో విపరీతంగా అప్పులు చేసి, ఆ అప్పులు తీర్చకపోతే ప్రాణాలకే ముప్పు వచ్చే పరిస్థితి తెచ్చుకుంటాడు.
ఒకరోజు రాత్రి, అందరూ పడుకున్నాక సుకుమార్, తల్లి పెట్టెలో కనిపించిన ఆ ట్రస్ట్ డబ్బులు లక్ష రూపాయలు దొంగిలిస్తూ తండ్రికి దొరికిపోతాడు.
కొడుకు చేయి పట్టుకుని, వణుకుతున్న స్వరంతో "ఒరేయ్! ఇది నా సొంత డబ్బు కాదురా. ఎంతోమంది పేద పిల్లల చదువు కోసం ఊరివాళ్ళు నమ్మి దాచిన సొమ్ము. దీన్ని కూడా దొంగిలిస్తావా? ఇంత దిగజారిపోయావా? అన్నాడు.
తండ్రి చేయి విదిల్చుకుంటూ, అహంకారంతో "మీకు ఎప్పుడూ ఊరి వాళ్లే ముఖ్యం, ఈ ఇంట్లో ఉన్న కొడుకు ప్రాణాలు ముఖ్యం కాదు. అక్కడ నా ప్రాణాలు పోతుంటే ఈ కాగితపు కట్టలు పట్టుకుని ఆదర్శాలు మాట్లాడుతున్నారా? మిమ్మల్ని నమ్మి ఎవరు ఇచ్చారు? మీ రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇందులోనే తగలేశారు. కొడుకుగా నా హక్కు అడుగుతుంటే దొంగ అంటారా?" అన్నాడు సుకుమార్.
కొడుకు మాటలకు కృష్ణమూర్తికి మతిపోయింది, దానితో బీపీ పెరిగి కోపంతో ఊగిపోతూ, "ఛీ దరిద్రుడా, ఒక్కగానొక్క కొడుకువి అని గారాబం చేస్తే చదువుకోకుండా చెడు సావాసాలు నేర్చుకుని అన్నీ చెడు అలవాట్లతో బ్రష్టుడివి అయ్యింది చాలక నన్నే ఎదురిస్తావా?"
"ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువి కాదు. నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నా కంటికి కనిపించకు, నేను ఏమి చేస్తానో నాకే తెలియదు.
ఇదిగో మాధవి! నీకు ఇప్పుడే చెప్తున్నాను, నేను పోయిన తరువాత నా కర్మకాండలకి కూడా వీడు రావడానికి వీల్లేదు. వాడు ఈ గడప తొక్కితే నేను ప్రాణాలు తీసుకుంటాను," అని కొడుకు సుకుమార్ మెడ పట్టుకుని బయటకు గెంటేశాడు.
సుకుమార్ కూడా అహంకారంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.
జరుగుతున్న సంఘటనలకు మాధవి తెల్లబోయి భర్తను వారించబోయింది. కోపంలో ఉన్న కృష్ణమూర్తి భార్య వంక కోపంగా చూసి, "ఇంకో మాట మాట్లాడితే నువ్వు కూడా వాడితో పోవాల్సి వస్తుంది," అన్నాడు.
ఆమె ఒక పక్క భర్తకు చెప్పలేక, మరోపక్క కన్నప్రేమను చంపుకోలేక, రెండు చక్రాల మధ్య నలిగిపోయే ఇరుసులా మారింది ఆమె జీవితం. వంటగదిలోకి వెళ్లి కిటికీలో నుంచి కొంత డబ్బు కొడుకుకి ఇచ్చి, "మీ నాన్నా కోపం తాటాకు మంటలాంటిది, నువ్వు చెడు స్నేహాలు మానేసి కొన్నాళ్ళు మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండు," అంది.
సుకుమార్ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణమూర్తి గారి ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది. మాధవి గుండెల్లో బాధను దాచుకుని భర్తకు సేవలు చేస్తోంది. కృష్ణమూర్తి గారు పైకి కోపంగా ఉన్నా, కొడుకును గెంటేశానన్న బాధ లోపల ఆయనను తొలిచేస్తోంది.
మరోవైపు, తల్లి కిటికీలోంచి ఇచ్చిన డబ్బు, చెప్పిన మాటలు సుకుమార్ గుండెల్లో బలంగా నాటుకున్నాయి. "నా కొడుకు దొంగ కాకూడదు" అన్న తల్లి ఆవేదన, "ఇది పేద పిల్లల చదువు కోసం దాచిన సొమ్ము" అన్న తండ్రి మాటలు అతడిలో తీవ్రమైన పశ్చాత్తాపాన్ని రగిల్చాయి.
ఆ రాత్రే అతడు ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు.
జూదం, చెడు సావాసాలు పూర్తిగా వదిలేశాడు. మామయ్య రాజారావు దగ్గరికి వెళ్ళాడు. రాజారావు ఇరవై ఎకరాల ఆసామి, అక్కగారి ద్వారా జరిగిన సంగతి తెలుసుకుని తన దగ్గరికి వచ్చిన మేనల్లుడిని తన పొలం పనులలో తనకు సహాయంగా పెట్టుకున్నాడు.
రోజూ ఉదయం లేవగానే మామయ్యతో పొలానికి వెళ్లి ఒళ్ళు వంచి పనిచేయడం, సాయంత్రం ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకోవడం తప్ప, ఆన్లైన్ గేమ్ల మీద దృష్టి తప్పిపోయింది సుకుమార్ కి. అయితే చేసిన అప్పులు వదలవు కదా! ఒకరోజు అప్పులు ఇచ్చిన వాళ్ళు అడ్రస్ వెతుకుంటూ రాజారావు ఇంటికి వచ్చారు.
"ఏమయ్యా, చిన్న పిల్లాడికి ఏం చూసి అప్పు ఇచ్చారు?" అని గట్టిగా కేకలు వేశాడు రాజారావు.
"నాన్నా, మన దగ్గర డబ్బులు ఉన్నాయిగా, బావ అప్పు నువ్వు తీర్చేసేయి, ఇప్పుడు బావలో చాలా మార్పు వచ్చింది కదా," అంటున్న కూతురు రమణి వంక చూసిన రాజారావు, "మీ బావ మారాడంటావా?" అని అన్నాడు.
"నువ్వు పొలానికి వెళ్ళాక, బావ ఉదయం లేచి పొలానికి వెళ్ళిపోయాడు, ఇంతకంటే ఇంకా ఏం కావాలి నాన్న?" అంది.
“సరే, నువ్వు లోపలికి వెళ్లి కాఫీ తీసుకుని రా, ఈలోపు అప్పుల వాళ్ళ దగ్గర వున్న కాయితాలు చూసి లెక్క చూస్తాను” అన్నాడు కూతురు రమణి తో రాజారావు.
మొత్తం అప్పులు వడ్డీతో రెండు లక్షల పైన ఉండటంతో, అప్పులు ఇచ్చిన వాళ్ళతో, "ఇహ జన్మలో సుకుమార్ కి అప్పు ఇవ్వం, ఇస్తే వాటిని వదులుకుంటాము," అని కాయితం రాయించుకుని మొత్తం అప్పు తీర్చేసాడు.
"ఇంత డబ్బులు మనం ఖర్చు చెయ్యడం అవసరమా?" అని అడుగుతున్న భార్యతో, "చూడు, మా అక్క నన్ను, మా అమ్మ పోయిన తరువాత అమ్మలా చూసుకుంది.
ఆస్తి నాన్నగారి స్వంతం అవడం వల్ల పొలం మొత్తం నాకు ఇచ్చి అక్కకి కొంత డబ్బు ఇచ్చారు. అయినా అక్క నోరు తెరిచి తనకి కూడా పొలం కావాలి అని అడగలేదు, అది మా అక్కకి నా మీద ఉన్న ఆప్యాయత. ఇప్పుడు మా అక్క కొడుకు చేసిన అప్పు తీర్చడం వలన మా అక్కకి సహాయం చేసినట్టు అవుతుంది," అన్నాడు రాజారావు.
సుకుమార్ తో తల్లి అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడి ‘మామయ్యకు తలవొంపులు రాకుండా చూసుకో’ అని హెచ్చరిక చేసేది. సుకుమార్ కూడా తండ్రి ఎలా వున్నాడు అని అడిగేవాడు కాదు.
ఆ రోజు ఆదివారం, మామా అల్లుళ్ళు ఆరుబయట కుర్చీలు వేసుకుని కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు, సుకుమార్ రాజారావు తో అన్నాడు, "మామయ్యా, మన కరణం గారు తమ ఐదు ఎకరాల పొలం అమ్మకానికి పెట్టారుట, ఆ పొలం మన పొలం కి దగ్గరగా ఉంటుంది, మీరు కొనుక్కోవచ్చు కదా?" అన్నాడు.
మేనల్లుడు వంక ఒకసారి చూసి, "ఇప్పటికే ఉన్న పొలం వ్యవహారం చూసుకోవడం కష్టంగా ఉందిరా, కరణం గారి పొలం మంచిదే, ఒక పని చేస్తాను, నీ పేరు మీద కొంటాను, నీకు ఒక దారి దొరికినట్టు ఉంటుంది," అన్నాడు సుకుమార్ మొహం లో కదిలికలు గమనిస్తూ.
"నా పేరున ఎందుకు మామయ్య, అప్పులు వాళ్ళు లాక్కొని పోవడానికి? అయినా మా నాన్నే నన్ను దొంగ అన్నాడు, నువ్వు ఆదరించి భోజనం పెడుతున్నావు నాకు అది చాలు, రమణి పేరున కాని, అత్తయ్య పేరున కాని కొను," అన్నాడు.
"నా నాయనే, నీకు ఉన్న అభిమానం నా మీద మీ మామయ్యకు లేదు, నా పేరున ఒక ఎకరం పొలం కూడా లేదు," అంది అత్తయ్య.
"అంతా నీదే కదా, మళ్ళీ సెపరేట్ గా ఎందుకు?" అని నవ్వేసాడు రాజారావు.
తన భార్య లోపలికి వెళ్లిన తరువాత మేనల్లుడి వంక చూసి, "ఏమన్నావు? మీ నాన్న నిన్ను దొంగ అన్నాడు అని బాధపడుతున్నావు, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు, నువ్వు చేసిన పనికి మీ నాన్నకి కోపం రావడం తప్పంటావా? నువ్వు మీ ఇంటి నుంచి వచ్చిన తరువాత మీ నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకున్నావా?
ఎంతసేపు నువ్వు రాగానే మేము ఆదరించాము అనుకుంటున్నావే కాని, మీ నాన్న నీ గురించి ముందుగా నాకు ఫోన్ చేసి, నీ బాగు కోసమే ఇంట్లో నుంచి పంపించేసాను అని, వాడిని నీ దగ్గరికి వెళ్ళమని మీ అక్కయ్య సలహా ఇచ్చింది కాబట్టి, అది కాక నువ్వంటే వాడికి ఇష్టం కాబట్టి నీ దగ్గరికి చేరుకుంటాడు అని చెప్పాడు తెలుసా? అంతే కాదు, ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు," అన్నాడు రాజారావు.
"అవును మామయ్య, చెడు స్నేహితుల వలన చెడిపోయి ఊరిలో వాళ్ళ డబ్బులు కూడా తీసుకుని అప్పులు తీర్చుకుందాం అనుకున్నాను తప్పా, నాన్న పరువు ఏమవుతుంది అని ఆలోచించలేదు."
రమణి చెప్పింది, "మీ నాన్న నీ అప్పులు తీర్చమని మా నాన్నకు డబ్బులు పంపించారు," అని, అది నిజమేనా మామయ్యా?" అన్నాడు సుకుమార్.
"ఓహో, తన కూతురు ఆవిధంగా చెప్పింది అనుకుంటా," అనుకుని, "పోనిలేరా నీ అప్పులు తీరిపోయాయి, నీలో ఎంతో మార్పు వచ్చింది, నీ చేతి ద్వారా లక్షలు మారుతున్నా ఒక్క రూపాయి తేడా లేకుండా ఇచ్చేస్తున్నావు," అన్నాడు మేనల్లుడి భుజం తడుతూ.
ఊరిలో ట్రస్ట్ వార్షికోత్సవం జరుగుతోంది. కృష్ణమూర్తి గారు స్టేజీ మీద కూర్చుని ఉన్నారు. పేద పిల్లలకు పుస్తకాలు, యూనిఫారాలు పంచుతున్నారు. కానీ ఆయన ముఖంలో ఎప్పటిలాంటి ఉత్సాహం లేదు, కొడుకు లేడన్న వెలితి స్పష్టంగా కనిపిస్తోంది.
సరిగ్గా అప్పుడే, సభ వెనుక భాగం నుంచి సుకుమార్ నడుచుకుంటూ వచ్చాడు. పాత సుకుమార్ లా కాకుండా, ఇప్పుడు అతడి కళ్ళలో ఒక బాధ్యత, ముఖంలో హుందాతనం కనిపిస్తున్నాయి. స్టేజీ కింద నిలబడి తండ్రి వైపు చూశాడు.
కృష్ణమూర్తి గారు కొడుకును చూడగానే ఒక్కసారిగా చలించిపోయారు. కోపం స్థానంలో ఒక తండ్రి ఆరాటం కనిపించింది. సభ ముగిశాక, కృష్ణమూర్తి గారు ఇంటికి తిరిగి వచ్చారు. ఆయన వెనుకే సుకుమార్ కూడా ఇంటి గుమ్మం వరకు వచ్చాడు. తండ్రి పెట్టిన శాపం గుర్తుకొచ్చి గడప బయటే నిలబడిపోయాడు.
మాధవి కొడుకును చూడగానే కన్నీళ్లతో పరుగున వచ్చింది, కానీ భర్త భయంతో ఆగింది.
కళ్ళలో నీళ్లతో, రెండు చేతులు జోడించి సుకుమార్, "నాన్నా, నన్ను క్షమించండి, నా తప్పును తెలుసుకున్నాను, మామయ్య నన్ను మనిషిని చేసాడు, మీరు మళ్ళీ నన్ను ఆదరిస్తారని వచ్చాను. ఆరోజు నేను అహంకారంతో, వ్యసనంతో కళ్ళు మూసుకుపోయి ఆ ట్రస్ట్ డబ్బు ముట్టుకోబోయాను. కానీ మీరు నన్ను ఆపారు. నేను దొంగగా మారకుండా కాపాడారు. ఇల్లు వదిలి వెళ్ళిన రోజే జూదం ముట్టనని ప్రమాణం చేశాను," అన్నాడు.
"మామయ్య పొలంలో పనిచేసినందుకు నాకు మామయ్య ఇచ్చిన ఈ లక్ష రూపాయలు నేను మీ ట్రస్ట్ లో ఉన్న పేద పిల్లల చదువు కోసం నా వంతు సహాయంగా ఇచ్చేస్తున్నాను. ఆరోజు డబ్బు దొంగిలించబోయిన మీ కొడుకు ఈరోజు మీ ఆదర్శాల బాటలో నడవాలని వచ్చాడు నాన్నా. నన్ను మీ కొడుకుగా ఒప్పుకోకపోయినా పర్లేదు, కానీ నేను ఇప్పుడు మారిపోయాను అని మీకు చెప్పడానికే వచ్చాను," అన్నాడు సుకుమార్.
ఈ మాటలు వినగానే మాధవి ఏడుస్తూ భర్త దగ్గరకు వచ్చారు. "ఏవండీ... వాడు ఆరోజు తప్పు చేయబోయాడు, కానీ చేయలేదు. మనల్ని దేవుడే కాపాడాడు. ఈ రెండేళ్లు వాడు పడిన కష్టం, మారిన ప్రవర్తనే అందుకు సాక్ష్యం. కోపంలో మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మన ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకోకండి."
కృష్ణమూర్తి గారి కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. కోపంతో తను తీసుకున్న అనాలోచ నిర్ణయం, కొడుకు ప్రాణాల మీదకు తెస్తుందేమోనని ఈ రెండేళ్లు ఆయన అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. కానీ ఈరోజు కొడుకు నిజాయితీగా నిలబడటం చూసి ఆయన గుండె గర్వంతో నిండిపోయింది.
ఆయన నెమ్మదిగా గడప దాటి బయటకు వచ్చి, సుకుమార్ చేతిని పట్టుకుని , అతడిని గట్టిగా గుండెలకు హత్తుకున్నారు.
"నీ తప్పు తెలుసుకుని మంచి మనిషిగా నువ్వు తిరిగి రావడం నేను జీవితంలో చూసిన అతిపెద్ద విజయం. లోపలికి నడు... సాయంత్రం మీ మామయ్యా వాళ్ళు కూడా వస్తున్నారు," అన్నాడు.
సుకుమార్ తండ్రి పాదాలకు నమస్కరించి, తల్లి కన్నీళ్లు తుడిచి లోపలికి అడుగుపెట్టాడు. కోపంతో విడిపోయిన ఆ బంధం, పశ్చాత్తాపంతో మరింత బలంగా ముడిపడింది.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.











Comments