top of page
Original.png

తడిసిన వడ్లు

తడిసిన వడ్లు కథ, రైతు కథ, తెలుగు రైతు కథ, వ్యవసాయ కథ, పంట నష్టం, అకాల వర్షం, వ్యవసాయ సలహాలు, గ్రామీణ కథ, తెలుగు కథలు, రైతు జీవితం, inspirational Telugu farmer story, agriculture story Telugu.

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'తడిసిన వడ్లు' కథలో వర్షంలో తడిసిపోతున్న వడ్లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న రైతు దంపతులు, ఆశాకిరణంలా వచ్చిన వ్యవసాయ విద్యార్థిని.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'తడిసిన వడ్లు' కథలో వర్షంలో తడిసిపోతున్న వడ్లను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న రైతు దంపతులు, ఆశాకిరణంలా వచ్చిన వ్యవసాయ విద్యార్థిని.

Tadisina vadlu - Telugu Inspirational Story | Bhallamudi Nagaraju

తడిసిన వడ్లు - తెలుగు ప్రేరణాత్మక కథ | భళ్లమూడి నాగరాజు

Published in manatelugukathalu.com on 26/06/2026


జూన్ నెల మొదటి వారం... రుతుపవనాలు ఇంకా ముఖం కూడా చూపించలేదు.

మండే ఎండలతో జనం ఉక్కపోతతో బాధపడుతుంటే... యాదగిరి మాత్రం ఎండల్ని చూసి మురిసిపోతున్నాడు.


కల్లం నిండా పసుపు ఆరబోసినట్లు... బంగారు పరదా పరచినట్లు మిలమిల మెరిసిపోతున్న వడ్లు చూసి గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాడు యాదగిరి.

అప్పుడే రాంబాయమ్మ భోజనం తీసుకొని వచ్చింది. భర్త మురిసిపోవడం చూసి, "ఏటి పగటి కలల్లో ఎంకిని ఊహించుకుంటున్నావా?" అంటూ ఆటపట్టించింది.


"రాయే... అటు సూడే... పంట ఈసారి ఎలా పండిందో..." అంటూ వడ్లు చూపించి ఆనందంతో ఉప్పొంగిపోయాడు.


"పోన్లే అయ్యా... నీ కష్టం ఫలించింది... వడ్లు అమ్మి అప్పులన్నీ తీర్చేసి, ఈ ఏడు అమ్మి పెళ్లి చేసేద్దాం" అంది... ఆనందం పంచుకుంటూ.


సాయంత్రం వరకూ భలే ఎండ కాసింది. 'తేమ ఇంచుమించు ఆరిపోయింది... మరొక్క ఎండలో ఎండితే... అమ్మేసుకోవచ్చు' అని స్వగతంలో అనుకుంటూ వడ్లు మీద తాటికమ్మలు కప్పి ఇంటి దారి పట్టాడు, పడమట సూరీడు అస్తమిస్తుండగా.

రాత్రి మంచం ఎక్కి ఆశలు... ఆశయాలు... లాభనష్టాలు లెక్కలు వేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.


అర్ధరాత్రి అయింది. తెరిచి ఉన్న కిటికీలోంచి చల్లని వానజల్లులు ఒంటి మీద పడటంతో ఉలిక్కిపడి లేచాడు.


"ఓరి దేవుడో... వర్షం నాయనా... వడ్లు తడిసిపోతాయిరో" అని కేకలు వేస్తూ... తలుపు సందులో ఉన్న ములుకోల కర్ర తీసుకొని, వర్షంలో తడుస్తూనే కల్లం వైపు పరుగులు తీశాడు... వెనుకనే రాంబాయమ్మ కూడా...


అప్పటికే వడ్లు తడిసిపోయాయి...

ఇద్దరూ వర్షంలో తడుస్తూ వడ్లను చేటతో కుప్పపోస్తున్నారు, ఏడుస్తూనే...

వారి శ్రమ ఫలించడం లేదు... వరుణుడు తన జోరు పెంచాడు. భారీ వర్షానికి కల్లం నిండా వరద చేరింది...

వడ్లు కొట్టుకుపోతున్నాయి.


యాదగిరి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. అతని కన్నీరు... వర్షం నీటిలో కలిసి ఎర్రమట్టి మీద పడి రక్తంలా పారుతోంది.


అతని ఆవేదన... బాధలో అతను మాట్లాడుతున్న మాటలు విన్న రాంబాయమ్మ...

"ఊరుకో అయ్యా... ఊరుకో... మనస్సు గట్టిచేసుకో... మన ఖర్మ... ఇలా ఏడుస్తే నీ ఆరోగ్యానికి దెబ్బ" అంటూ ధైర్యం చెబుతోంది. కానీ హోరుగాలికి ఆ మాటలు అతని చెవిని తాకలేదు.


తెల్లారుతుంటే వర్షం తగ్గింది.

తడిసి ముద్ద అయిన వడ్లు చూసి యాదగిరి గుండెలు బాదుకుంటూ విలపించాడు. రాంబాయి కూడా దుఃఖం ఆపుకోలేకపోయింది.


"తడిసిన వడ్లు అధికారులు కొనరే..." అని అంటూ నేలకు తల బాదుకుంటూ బోరుమన్నాడు. అతన్ని ఊరుకోపెట్టడం రాంబాయి తరం కాలేకపోయింది.


తెల్లారేసరికి గ్రామంలో రైతులంతా తడిచిన వడ్లు చూసి విషాదంలో మునిగిపోయారు.

ప్రభుత్వాన్ని... ప్రకృతి పైన నిందలు వేస్తూ విలపిస్తున్నారు.


అప్పుడే వ్యవసాయ విద్యాలయంలో చదువుతున్న, గ్రామానికి చెందిన లక్ష్మీ పద్మజ అక్కడికి చేరుకొని వారి దుస్థితిని గమనించింది. విచారంలో మునిగిపోయిన వారిని చూస్తూ "మీరంతా ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్య తీరిపోతుందా" అని ప్రశ్నించింది.


"మరేమి చేయమంటావమ్మా... ఆరుగాలం శ్రమించిన కష్టం అంతా ఒక్క వర్షంతో నీటిపాలైంది" అని అంతా ముక్తకంఠంతో అన్నారు.


"వడ్లు తడిసిపోయినంత మాత్రాన ఎందుకూ పనికిరాకుండా పోతాయనుకోవడం వెర్రితనం...


మీరు ఆశించినంత లాభం రాకపోవచ్చు. కానీ నష్టం రాదు. మీరంతా ధైర్యంగా ఉండండి. వ్యవసాయ, మండల అధికారులతో నేను మాట్లాడతాను" అని వారికి ధైర్యం చెప్పింది.


అధికారులతో మాట్లాడి గ్రామానికి డ్రయ్యర్ యంత్రం తెప్పించింది. ఒక్కొక్కరు వినియోగించుకున్నారు. మరుసటి రోజు ఎండ కూడా బాగా రావడంతో వడ్లు మొలకలు రాకుండా కాపాడుకొని అమ్ముకోగలిగారు. కొద్దిరోజుల తరువాత

గ్రామంలో రైతులందరితో సమావేశం ఏర్పాటు చేసింది లక్ష్మీ పద్మజ.


"ఈ సమస్య ఈ రోజుతో తీరిపోయినది కాదు. ప్రకృతి వైపరీత్యాలు అనేవి చెప్పి రావు. అలాంటివి సంభవించినప్పుడు మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే నష్టాల బారినుంచి తప్పించుకోవచ్చు.


మీరంతా కొంత చందాలు వేసుకుంటే, ప్రభుత్వాన్ని కొంత సహాయం కోరి షెడ్ నిర్మించుకుందాం. వడ్లు తడిసిపోకుండా షెడ్లో ఉంచుకొని సరైన సమయంలో అమ్ముకోవచ్చు" అని ఆమె తెలపడంతో అందరూ సరే అని తలో కొంత డబ్బు ఆమెకు అందించారు. మనసులోనే రైతులంతా ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు.


***

భళ్లమూడి నాగరాజు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


భళ్లమూడి నాగరాజు
భళ్లమూడి నాగరాజు

రచయిత పరిచయం:

నా పేరు భళ్లమూడి నాగరాజు, రాయగడ ,ఒడిశా లో ఉంటున్నాను. ఇప్పటి వరకు 30కథలు వివిధ వార,మాస పత్రికల్లో ప్రచురితం అయ్యాయి సుమారు వంద కవితలు ప్రచురితం.

Telugu story, moral story Telugu, truth vs lie story, inspirational stories Telugu, social awareness story, భళ్లమూడి నాగరాజు


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page