top of page
Original.png

కల నిజమైన వేళ

కల నిజమైన వేళ, Kala Nijamaina Vela, తెలుగు కథ, చేనేత కథ, Handloom Story, నేతగాని కల, చంద్రయ్య, రమ్య, చేనేత, Handloom, Fashion Designing, NIFT, Traditional Weaving, Telangana Handloom, Inspirational Telugu Story

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'కల నిజమైన వేళ' కథలో సంప్రదాయ మగ్గంపై చేనేత నేస్తున్న తాత చంద్రయ్యకు ల్యాప్‌టాప్‌తో ఆధునిక డిజైన్లు రూపొందిస్తూ సహాయం చేస్తున్న మనవరాలు రమ్య – సంప్రదాయ చేనేతకు కొత్త జీవం పోసిన ప్రేరణాత్మక దృశ్యం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'కల నిజమైన వేళ' కథలో సంప్రదాయ మగ్గంపై చేనేత నేస్తున్న తాత చంద్రయ్యకు ల్యాప్‌టాప్‌తో ఆధునిక డిజైన్లు రూపొందిస్తూ సహాయం చేస్తున్న మనవరాలు రమ్య – సంప్రదాయ చేనేతకు కొత్త జీవం పోసిన ప్రేరణాత్మక దృశ్యం.

Kala Nijamaina Vela - Telugu Emotional Family Story | Mayukha

కల నిజమైన వేళ - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | మయూఖ

Published in manatelugukathalu.com on 26/06/2026


సిరిసిల్ల పట్టణానికి కొద్ది దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు అది. పేరు రామాపురం. ఆ ఊరి చివరి ఇంట్లోంచి ఎప్పుడూ ఒకటే లయబద్ధమైన శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అది చంద్రయ్య మగ్గం నేసే శబ్దం. చంద్రయ్యకు ఆ శబ్దమే ప్రాణం, ఆ మగ్గమే ప్రపంచం. ఆయన చేతుల్లో పడుగు, పేకలు ప్రాణం పోసుకుంటాయి.


రంగుల దారాలు రామాయణ గాథలుగా రూపుదిద్దుకుంటాయి. చంద్రయ్య నేసిన చీర కట్టుకుంటే దేవకన్య కూడా అసూయ పడవల్సిందేనని ఊళ్ళోవాళ్ళు అనుకుంటారు. ఊళ్ళో ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పంచెలు, చీరలు తీసుకువెళ్ళేవారు.


“మగ పెళ్లి వారితో మా ఊర్లో స్వయంగా మీకోసం నేసిన పంచెలు" అంటూ గొప్పగా చెప్పేవారు.


జమీందారు అంచు పంచెలు, రుద్రాక్ష అంచు పంచెలు అంటూ రకరకాల పంచెలు నేసేవాడు.


సన్నని నూలు తీసి రంగురంగుల దారాలతో మెత్తటి చీరలు నేసేవాడు. బట్టలకి ఎంతో ఆదరణ ఉండేది. ఒకసారి పక్క ఊరి జమీందారు గారికి చంద్రయ్య గురించి తెలిసి తన ఇంటికి పిలిపించుకుని, "చంద్రయ్య! నీ పనితనం గురించి నాకు తెలిసింది.


నువ్వు నేసిన పంచెలు చూశాను. పడుగు, పేకలతో సన్నని దారంతో నేసిన పంచెలు

ఎంతో బాగున్నాయి. నువ్వు నీ మగ్గం మీద ఎన్నో ప్రయోగాలు చేయగలవు, చేతిలో ఇమిడిపోయేంత మెత్తనివి నేస్తున్నావు! ఈసారి అగ్గిపెట్టెలో పట్టే పంచెలు నేసి తీసుకురా! నీ పేరు బయట ప్రపంచానికి పరిచయం చేస్తాను!" అన్నాడు జమీందారు.


చంద్రయ్య సంతోషంతో, "అలాగే అయ్యా! నా నైపుణ్యాన్ని అంతా బయటకు తీసి మెత్తటి వస్త్రాలు తయారు చేస్తాను. మీరన్నట్టుగా అగ్గిపెట్టెలో పట్టే పంచె, చీర తీసుకొస్తాను" అన్నాడు.


చంద్రయ్య గబగబా ఇంటికి వచ్చి ఈ విషయం భార్యతో చెప్పాడు. అప్పటికే ఈ వార్త ఊరంతా పాకింది. అందరూ జమీందారు గారు పిలిచారంటే చంద్రయ్య దశ తిరిగినట్టే అనుకున్నారు.


చంద్రయ్య తనకి కావలసిన ముడిసరుకు అంతా తెచ్చుకుని, ఆ పని మీదే కూర్చున్నాడు. చంద్రయ్యకు సహాయంగా భార్య గంగ, కొడుకు రమణ కూడా ఉండి సహాయం చేస్తున్నారు.


కొద్ది రోజుల్లోనే అగ్గిపెట్టెలో పట్టే సన్నని చీర, పంచె తయారుచేసి జమీందారు దగ్గరికి తీసుకువెళ్ళాడు.


మంచి రంగులతో అందమైన బోర్డర్ తో సన్నని పంచెని, అందమైన లతలతో ఉన్న చీరని చూసిన జమీందారు, "శభాష్ చంద్రయ్య! చాలా బాగా నేసావు! నీ పేరు ప్రభుత్వానికి చెప్పి నీకు బహుమతి వచ్చేటట్టు చేస్తాను" అని అప్పటికప్పుడు చంద్రయ్యకు శాలువా కప్పి, వెయ్యి రూపాయలు ఇచ్చాడు జమీందారు బహుమానంగా.


తర్వాత జమీందారు ఆ పంచెని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, ప్రభుత్వం ద్వారా కూడా సన్మానం చేయించి నగదు బహుమతి ప్రధానం చేయించాడు.


దాంతో చంద్రయ్య పేరు అంతటా మారుమ్రోగిపోయింది. రమణ కూడా ఈ వృత్తిని ఎంచుకోవాలని అనుకుని, తండ్రి దగ్గర మెలుకువలు నేర్చుకుంటున్నాడు. చంద్రయ్య దశ తిరిగింది.


రమణ డిగ్రీ చదువుకుంటూ పని నేర్చుకుంటున్నాడు.

కాలం ఇలాగే ఉంటే అనుకునేదేముంది?

****

కాలం గడుస్తోంది. కాలంతో పాటు పరిస్థితులు మారాయి, జనం యొక్క అభిరుచి మారింది. నూలు స్థానంలో పాలిస్టర్ ప్రవేశించింది. పాలిస్టర్ వస్త్రాల యొక్క ఉపయోగాల్ని ఆయా కంపెనీలు ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాయి. ప్రజలు నూలు వస్త్రాన్ని వదిలేసి పాలిస్టర్ వైపు మొగ్గుచూపారు.


చేనేతలో కూడా విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.

చేనేత స్థానంలో పవర్ లూమ్ లు వచ్చాయి. కళ స్థానంలో వ్యాపారం వచ్చింది. 


గంటల్లో వందల మీటర్ల గుడ్డను నేసే యంత్రాల ముందు నెలల తరబడి ఒకే చీరను నేసే చంద్రయ్య కళ ఓడిపోతోంది. చంద్రయ్య నేసే చీరలకు, బట్టలకు గిరాకీ తగ్గింది. కొనేవాళ్ళు ఉన్నా, దానికి సరైన రేటు ఇచ్చే వాళ్ళు కరువయ్యారు. అనాది నుంచి వస్తున్న తమ వారసత్వాన్ని వదులుకోలేకపోతున్నాడు చంద్రయ్య.

చేనేతకి ఆదరణ కరువు అవడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న రమణ ఇక ఇక్కడ ఉండడం లాభం లేదని హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రైవేట్ కంపెనీలో చేరిపోయాడు.

******

కాలం పరుగులు పెడుతుంది కానీ, చంద్రయ్య పరిస్థితిలో మార్పు లేదు. మిగిలిన వారిలా మరమగ్గాలతో కాకుండా వస్త్రాన్ని పాత పద్ధతుల ద్వారానే నేయడంతో, ఒక్కో చీర నేయడానికి చాలా కాలం పడుతోంది. దాంతో చేసిన అప్పులు కుప్పలుగా అయిపోయాయి.



ఊళ్ళో వడ్డీ వ్యాపారి భూపతి దగ్గర తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. ఊళ్ళో అప్పు ఇచ్చే నాధుడు ఒక్క భూపతే అవడంతో ఊళ్ళో నేతగాళ్లు అందరూ అక్కడే అప్పులు తీసుకుంటున్నారు. అలవాటయిన చేతివృత్తిని వదులుకోలేక,

కొత్త దారులు తొక్కలేక సతమతమవుతున్నారు నేతన్నలు.

********

కాలం గడుస్తోంది. రమణకి పెళ్ళయ్యి, అతనికి ఒక కూతురు రమ్య నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది.


కూతురు చదువు పూర్తి అవడంతో రమణ, రమ్యని పిలిచి, "రమ్య! నువ్వు ఒక సహాయం చేయాలి, మీ తాతని ఆదుకో! నేను ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసిగిపోయాను, ఇక్కడికి రమ్మంటే రాడు, ఆ నేతపని వదలడు. వృద్ధాప్యం వచ్చినా ఆ పని మానడు" అన్నాడు బాధగా.


"నేను ఏం చేయాలి నాన్న!" అంది రమ్య.


"నువ్వు చదువుకున్న చదువుకి సార్థకత చేకూర్చు. మీ తాతని మళ్ళీ నిలబెట్టు, కొడుగ్గా నేను చేయలేని పనిని నువ్వు చెయ్యి, మీ తాతకి వారసురాలు అనిపించు బిడ్డా!" అన్నాడు ప్రాధేయపూర్వకంగా.


“అలాగే నాన్న! నేను వెళ్ళి తాత పేరు నిలబెడతాను, తాతకి ఆసరా ఇస్తాను” అని ఒక నిర్ణయానికి వచ్చిన రమ్య తన తాత ఊరికి వచ్చింది. రమ్యని చూసి చంద్రయ్య ఆశ్చర్యపోయాడు.


“తాత! నీకు సహాయంగా ఉండాలని నేను వచ్చాను” అంది.


“ఈ తాత కష్టాన్ని ఆ దేవుడు తప్ప ఎవరు తీర్చలేరు” అన్నాడు నిర్వేదంగా.

“లేదు తాత! నేను చెప్పినట్టు విను” అంది ఖచ్చితంగా.  తాతకళ అంటే ఆమెకు ప్రాణం. కానీ తాత మొండితనం నచ్చదు.


“తాత! ఈ కాలంలో ఈ డిజైన్లు ఎవరు కొంటారు? కాలానికి తగ్గట్టు మనము మారాలి. సింపుల్ డిజైన్స్ తో తక్కువ ధరలో చుడీదార్ మెటీరియల్స్, చున్నీలు, కర్చీఫ్లు నేద్దాం. వాటిని ఆన్లైన్లో అమ్ముదాం” అంది.


“నా చేతులతో కళను సృష్టిస్తాను. ఈ చీరను చూడు, దీనిమీద "సీతారామ కళ్యాణం" ఘట్టాన్ని నేస్తున్నాను, ఇది పూర్తి చేయడానికి ఇంకా రెండు నెలలు పడుతుంది. దీని విలువ తెలిసిన వాళ్ళు లక్షలు ఇచ్చి కొంటారు” అన్నాడు గర్వంగా.


“ఊరుకో తాత! లక్షలు ఇచ్చి కొనేవాళ్లు ఎవరు ఉంటారు? అప్పులకు వడ్డీలు కట్టడానికి ఇంట్లో ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టావు. అప్పులు "తడిసి మోపెడు" అవుతున్నాయి.


అవి ఎప్పుడు తీరుస్తావు తాత!” అంది బాధగా రమ్య. రమ్య మాటలకి చంద్రయ్య కళ్ళు రెండు చెరువులయ్యాయి. ఆ మాటలన్నీ అక్షర సత్యాలే.


ఆతరం మనిషి ఈ తరంలో వస్తున్న ఆధునిక  పోకడలని అనుసరించలేకపోతున్నాడు.


ఒకరోజు వడ్డీ వ్యాపారి భూపతి వచ్చాడు, "ఏం చంద్రయ్య! అప్పు తీర్చే ఆలోచన ఉందా లేదా? నీ మగ్గం చప్పుళ్ళే తప్ప, నా చేతిలో కాసుల గలగలలు లేవు" అన్నాడు ఎగతాళిగా.


“గడువు ఇయ్యండి బాబు, ఈ చీర పూర్తికాగానే....”


“ఆ.. ఆ... చీర పూర్తయ్యేటప్పటికి నేను ముసలోడిని అయిపోతా. ఆ పాత కాలపు పద్ధతులతో ఏం కుస్తీ పడతావు కానీ, నా దగ్గర కూలికి వచ్చేయ్” అన్నాడు వెటకారంగా నవ్వుతూ.


చంద్రయ్య ఆ మాటలకి కుమిలిపోయాడు. దాంతో రమ్యకి ఆవేశం వచ్చి, “మా తాత గురించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదు, వెళ్ళు, నీ అప్పు నెల రోజుల్లో తీరుస్తా” అంది ఆవేశంగా.


చంద్రయ్య మనవరాలి వైపు తిరిగి, “లక్ష రూపాయలు ఒక నెలలో ఎలా అప్పు తీరుస్తాం?


ఎక్కడ నుంచి తేగలం తల్లి” అన్నాడు బేలగా.


“తెస్తాను తాత! నీ కళని, నా చదువుని కలిపి ఓ దారి వెతుకుతాను" అంటూ లాప్టాప్ ముందు కూర్చుని, తన స్నేహితులతో మాట్లాడి, ఆన్లైన్ మార్కెటింగ్ పద్ధతులు అవగాహన చేసుకుంది. ప్రణాళిక సిద్ధం చేసుకుని, “తాత! నువ్వు నీ చీర నేసుకో కానీ, ఒక గంట నాకు చిన్న చిన్న డిజైన్లు నేయడం నేర్పించు" అంది రమ్య.


చంద్రయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో సిల్క్, కాటన్, నూలు కొనుక్కొచ్చింది. తాత నేర్పుతుంటే రమ్య ప్రయోగాలు చేయడం మొదలెట్టింది. పక్షులు, పువ్వులు డిజైన్లను తీసుకుని వాటికి ఆధునిక రంగులు అద్దింది. చేనేత బట్టతో మొబైల్ పర్సులు, చేతిరుమాళ్ళు, లాప్టాప్ స్లీవ్ లు, చిన్నపిల్లలకి డ్రెస్సులు, మనీ పర్సులు వంటివి డిజైన్ చేసింది. దేని ప్రత్యేకత దానికి ఉండేలా చూసుకుంది.


చంద్రయ్య ఇదంతా చూస్తూ,"ఇదేంటి రమ్య! చీరను ఇలా ముక్కలుగా చేస్తున్నావ్! మన కళను అవమానిస్తున్నావ్"అన్నాడు బాధగా.


"లేదు తాత! చీర కట్టని వాళ్లకి కూడా మన చేనేతను పరిచయం చేస్తున్నాను" అంది ఆత్మస్థైర్యంతో.


రమ్య తాను తయారుచేసిన వస్తువులను అందంగా ఫోటోలు తీసి"నేత గాని కల"అనే పేరుతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీలను ప్రారంభించింది.


ఆ పేజీలలో మామూలు ఫోటోలే కాదు, ప్రతి ఫోటో కింద "తన తాత గురించి,

చేనేత చరిత్ర గురించి, ఆ డిజైన్ వెనక స్ఫూర్తి గురించి, ఆ దారాలకి అంటుకున్న నేతన్నల చెమట చుక్కల గురించి" ఎంతో ఆర్ద్రంగా రాసింది.


మొదట స్పందన నెమ్మదిగా వచ్చింది కానీ, రమ్య రాసిన కథనాలకి అందరూ కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఒక వారం తర్వాత ఒక మొబైల్ పర్సు కోసం ఒక ఆర్డర్ పెట్టారు. రమ్య ఆర్డర్ ను ప్యాక్ చేసి, దానితో పాటు చిన్న ఉత్తరం జత చేసింది. "కృతజ్ఞతలు, మీరు కొన్నది ఒక వస్తువుని కాదు, అంతరించిపోతున్న ఒక కళకు ఊపిరి పోశారు" అని రాసింది. ఆ ఆర్డర్ తీసుకున్న ఆ కస్టమర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.


ఆర్డర్ మీద ఆర్డర్లు రావడం మొదలు పెట్టాయి.


పని ఒత్తిడి తట్టుకోలేక ఖాళీగా ఉన్న కొంతమంది నేత పని వారిని కూడా తీసుకుని గడువు లోపలే కస్టమర్లకి సరుకు డెలివరీ చేయడం చేస్తోంది.


చంద్రయ్య కళ్ళముందే ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. ఏ నేత కార్మికులైతే కూలి పనులకు వెళ్తున్నారో వాళ్ళు మళ్లీ తమ కులవృత్తిని గౌరవంగా చేపట్టారు.


ఇదంతా చూస్తున్న భూపతికి కడుపు మండింది. తన దగ్గర పనిచేసే వాళ్లు ఆ పని వదిలేసి రమ్య దగ్గర పనికి చేరి, వాళ్ళ ఆర్థికంగా బాగుపడడం చూసి తట్టుకోలేక రమ్యని బెదిరించాడు.


దాంతో చంద్రయ్య కోపంతో కర్ర తీసుకొని, "నా మనవరాలి జోలికొస్తే ప్రాణం తీస్తాను. అది నా కళకు ప్రాణం పోసింది. నువ్వు నెత్తురు తాగే జలగవి. పో ఇక్కడి నుంచి" అని అరిచాడు.


చంద్రయ్య లో ఎప్పుడూ అంత కోపాన్ని చూడని భూపతికి భయం వేసి వెళ్ళిపోయాడు.


నెల రోజుల తర్వాత రమ్య కార్మికులను అందరిని తీసుకుని భూపతికి వడ్డీతో సహా లక్ష రూపాయలు ఇచ్చి, "ఇంకెప్పుడు మా వాళ్ళ జోలికి రాకు" అని వార్నింగ్ ఇచ్చి వచ్చేసింది.


కొన్ని నెలల తర్వాత చంద్రయ్య వేసిన"సీతారామ కళ్యాణం చీర"ఫోటో తీసి,

దాని వెనుక చంద్రయ్య కష్టాన్ని, అతని కలను వివరిస్తూ

సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఆ పోస్టు ఢిల్లీలోని నేషనల్ హ్యాండ్లూమ్ మ్యూజియం వాళ్ళ దృష్టికి వెళ్లింది.


ఎవరు ఊహించనంత రేటు పెట్టి వాళ్లు ఆ చీరని తీసుకున్నారు. ఆఖరి సారిగా ఆ చీరను చేతితో తడుముతూ, "నా కల నెరవేరింది రమ్య! నేను కోరుకున్నది డబ్బును కాదు, నా కళకు సరైన గౌరవాన్ని. ఈరోజు అది దక్కింది. దీనికి అంతటికీ కారణం నువ్వే తల్లి!" అన్నాడు ఎంతో తృప్తిగా చంద్రయ్య.


చంద్రయ్య పేరు దేశమంతా మారుమోగిపోయింది. తాత, మనవరాలు “పాత తరం అనుభవాన్ని, కొత్త తరం ఆలోచనలను జోడించి చేనేతకు కొత్త బ్రాండ్ ఇమేజ్ ని సృష్టిస్తున్నారు”.


******శుభం *******


మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):




మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page