top of page
Original.png

అమ్మ మనసు

2 minutes ago
4 min read

అమ్మ మనసు తెలుగు కథ – కూతురు రాణితో పాటు ఆపదలో ఉన్న పిల్లలను రక్షించేందుకు ధైర్యంగా పోరాడిన వీరమ్మ

Amma Manasu - Telugu Social Story | Sudhavishwam Akondi

అమ్మ మనసు - తెలుగు సామాజిక కథ | సుధావిశ్వం ఆకొండి 

Published in manatelugukathalu.com on 24/10/2026


అమ్మ మనసు అనేది మాతృప్రేమ, ధైర్యసాహసాలు, మానవత్వం గురించి తెలిపే హృదయాన్ని కదిలించే తెలుగు కథ. సుధావిశ్వం రచించిన ఈ కథలో, తన కూతురితో పాటు ఆపదలో ఉన్న ఎంతోమంది పిల్లలను రక్షించేందుకు వీరమ్మ చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.


అమ్మ అంటేనే ప్రేమకు మరో రూపం. పిల్లలు తమ చేష్టలతో ఎంత బాధపెట్టినా కూడా అమ్మకు ఎంత సహనం ఉంటుందో, పిల్లలకు ఏదైనా ప్రమాదం కలుగుతుందనుకున్నప్పుడు అంత రౌద్రం వస్తుంది. 


సాధ్యాసాధ్యాలు చూడదు, కేవలం ప్రమాదం నుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలనే చూస్తుంది అమ్మ మనసు. అలాంటి ఒక అమ్మ కథే ఇది!


"వీరమ్మా! రేపు నువ్వొచ్చేటప్పుడు పాలకూర తీసుకురా, అది ఎక్కువగా తినాలని చెబుతున్నారు డాక్టర్లు," అంది నాగలక్ష్మి.


"అలాగేనమ్మా! నా కూతురు రాణి బాగా చదువుతుందా? అయ్యగారు ఏమన్నారు?" అని అడిగింది వీరమ్మ.


"ఎన్నిసార్లు చెప్పాలి నీకు... అయ్యగారు, అమ్మగారు అని అనొద్దని! రాణి అసలు పెద్ద కుటుంబంలో పుట్టాల్సిన పిల్ల. 


అందానికి అందం, చదువులో సరస్వతి. ఎంత చక్కగా చదువుతుందో! క్లాస్‌లో అదే ఫస్ట్, వచ్చే సంవత్సరం టెన్త్‌లో కూడా అదే ఫస్ట్ వస్తుంది," అన్నాడు అటుగా వచ్చిన ప్రకాశం.


"మీరు ఎంతో సాయం చేయబట్టి కానీ... యాక్సిడెంట్ అయి కాలు సరిగ్గా పనిచేయని మా ఆయనకు ఒక మార్గం చూపారు, నా కూతురిని చదివిస్తున్నారు. 


నాకు కూరగాయలు అమ్ముకుని సంపాదించుకునే మార్గం చూపారు. మీ చల్లని దీవెనల వల్ల నా బంగారు రాణి గొప్ప చదువులు చదివి, గొప్పగా అయితే ఇంకా కావాల్సింది ఏముంది?" అంది మనసంతా కృతజ్ఞతతో నిండగా.


"సరే, ఎప్పుడూ ఉండేదే కానీ... ఇదిగో ఇవ్వాళే చకినాలు చేశాను, కొన్ని తీసుకెళ్లు! మళ్లీ లేట్ అయితే వెళ్లడం కష్టం. పోనీ రాణిని ఇక్కడే ఉంచమంటే వినవు. 


మా వాడు తీసిచ్చిన ఫోన్ జాగ్రత్తగా పెట్టుకో! ఎలా వాడాలో చెప్పింది గుర్తుంది కదా? ఇంటికి చేరగానే ఫోన్ చెయ్యి. జాగ్రత్తగా వెళ్లండి," అంది నాగలక్ష్మి.


"అలాగేనమ్మా! నేనెంతో పుణ్యం చేసుకుని ఉంటాను, అందుకే మీలాంటి వాళ్ల ఆత్మీయత దొరికింది," అంది ఆనందంగా.


రాణి వెళ్లి తన ఫ్రెండ్, నాగలక్ష్మి మనవరాలైన రమకి చెప్పి వచ్చి, తల్లితో బయలుదేరింది.

వీరమ్మ ఆ పట్టణానికి దగ్గర్లోనే ఉన్న ఊళ్లో ఉంటుంది. 


వీళ్లది సన్నకారు రైతు కుటుంబం. ఉన్న కొద్ది పొలంలో పంటలు సరిగ్గా పండక ఆటో తోలేవాడు వీరమ్మ భర్త రాజయ్య. 


ఉన్న ఒక్కగానొక్క కూతురిని బాగా చదివించాలనేది వాళ్ల కోరిక. అటువంటి టైంలో రాజయ్యకు యాక్సిడెంట్ అయి ఒక కాలు సరిగ్గా పనిచేయకుండా అయిపోయింది.


అదే ఊరిలో ప్రకాశం టీచర్‌గా చేసేవాడు. వాళ్లది మంచి కలిగిన కుటుంబమే, పొలాలు బాగానే ఉన్నాయి. అవి కౌలుకు ఇచ్చారు. 


పిల్లలు చదువుకుని పట్నంలో స్థిరపడ్డారు. అప్పుడే పదవీవిరమణ చేశాడు ప్రకాశం. అవన్నీ అమ్మేసి తమ దగ్గరకు వచ్చేయమని పిల్లలు పోరు పెట్టారు, కానీ అమ్మేయడానికి మనసు ఒప్పలేదు.


ఆ సందర్భంలోనే రాజయ్యకు యాక్సిడెంట్ అవ్వడం, వాళ్ల నాన్న ఇంతకుముందు తమ పొలం చూసేవాడు అనే కారణం వల్ల కొంత, రాజయ్యకు అక్కడే చిన్న దుకాణం పెట్టించి, తన పొలాల కౌలుదారులపై అజమాయిషీ చేసే పని అప్పజెప్పాడు ప్రకాశం. 


తమ పొలంలో కూరగాయలు పండిస్తూ, అవి రోజూ గంపలో పెట్టుకుని పొద్దున్నే ఇక్కడికి వచ్చి, వీళ్లకు కావాల్సినవి ఇచ్చి, మిగతావి అదే కాలనీలో అమ్మేసుకుని వెళ్తుంది వీరమ్మ. 


ఇక్కడ ఉన్న హైస్కూల్లో చదువుతున్న రాణిని తీసుకుని ఇంటికి వెళ్తుంది బస్సులో. రాణిని వీళ్లే చదివిస్తున్నారు. కొడుకూ, కోడలూ కూడా ఏమీ అభ్యంతరం చెప్పలేదు.


ప్రతిరోజు లాగే వీరమ్మ కూతురుతో ఈరోజూ వెళ్తుంటే... ఓ లారీలో వెళుతూ ముందుగా కూర్చున్న తమ ఊరి వాడైన నాగరాజు కనబడ్డాడు. 


అప్పుడే అతడూ చూశాడు. లారీ ఆపి డ్రైవర్‌తో ఏదో మాట్లాడి, "అక్కా! ఇంటికే పోతున్నావా? మేము అటునుంచే పోతున్నాం. మీరిద్దరూ ఎక్కండి, ఊళ్లో దింపి మేము పోతాం," అన్నాడు.


ముందు వైపు నలుగురు పెద్దవాళ్లు కూర్చోవచ్చు. అందులో డ్రైవర్, నాగరాజు కాకుండా ఇంకో అతను ఉన్నాడు.


"ఇరుక్కుని కూర్చోవాలి, వద్దులే! మేము బస్సులో వెళ్తాం," అంది వీరమ్మ.


"ఏం పర్వాలేదు, రా అక్కా! బస్సు వాళ్లు స్ట్రైక్ చేస్తున్నారట, ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు. నేనున్నా కదా! ఎందుకు భయం? ఎంతసేపు... ఒక రెండు గంటలు సర్దుకుని కూర్చుంటే దిగిపోతావు," అంటూ చెప్పాడు.


స్ట్రైక్ అనగానే కొంచెం భయం వేసి, సరేనని బయలుదేరింది. నాగరాజు చివరగా కూర్చున్నాడు. నాగరాజు పక్కన వీరమ్మ, రాణి, ఇంకో అతను కూర్చున్నారు. కాసేపు గడిచింది, ఆ మాట ఈ మాట చెబుతున్నాడు నాగరాజు.


"వెనకాల ఏం సామాను ఉంది? ఎక్కడికి పోతున్నారు? నువ్వు లారీ దాంట్లోనే పని చేస్తున్నావని విన్నాను, ఇందులోనే చేస్తున్నావా నాగరాజూ?" అని అడిగింది వీరమ్మ.


"మాది పెద్ద ఎక్స్‌పోర్ట్ బిజినెస్ అక్కా! విదేశాల్లోకి కూడా సప్లై చేస్తుంటాం. మా బాస్ వాళ్లు ముంబైలో ఉంటారు, ఈ లారీలు సరిగ్గా పోతున్నాయా లేదా అని నేను చూస్తుంటాను," అని చెప్పాడు.


డ్రైవర్‌కి, రాణికి మధ్యలో కూర్చున్నవాడు మాటిమాటికి రాణిపై వాలిపోవడం కొద్దిసేపటికి వీరమ్మ గమనించింది. రాణి చాలా ఇబ్బందిగా కూర్చుంది. వాడు ఇంకా వాలుతూ రాణి తొడలపై తల పెట్టుకున్నాడు పడుకున్నట్టు!


అది చూసి, "లే! లేరా!" అంది.


అయినా వాడు వెకిలి నవ్వులు నవ్వుతూ అలాగే చేస్తున్నాడు. డ్రైవర్ కానీ, నాగరాజు కానీ పట్టించుకోవట్లేదు. నాగరాజు జోగినట్టు నటిస్తున్నాడు, డ్రైవర్ ఇటు చూడనట్టున్నాడు.


"లారీ ఆపరా!" అంటే వినడం లేదు. ఇక గట్టిగా అరిచింది. అప్పుడు లారీ ఆపాడు.

"ఏంటి? ఏమైంది అట్లా అరుస్తున్నావు? పాపం నాగరాజుకు తెలిసినదానివి అని ఎక్కించుకుంటే..." అన్నాడు డ్రైవర్ కోపంగా.


"మేము దిగిపోతాం! ఆపేయ్!" అంది తీవ్రంగా.

"సరే మీ ఇష్టం, దిగండి!" అన్నాడు డ్రైవర్.


అప్పుడు నాగరాజు అప్పుడే మెలకువ వచ్చినవాడిలా... "ఏమైంది అక్కా?" అన్నాడు.

"మేము దిగిపోతాంరా! వీడు రాణిపైన పడుతున్నాడు."


దానికి వాడు నవ్వి... "ఇంత చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేస్తున్నావు. ఈ లారీ బిజినెస్ ఇక్కడి ఏరియాకి ఓనర్ ఇతను. ఇతను ఇష్టపడ్డాడంటే మీ దశ తిరిగినట్టే. ఇంకా ఏం కష్టపడతావు? నీ కూతురుని అప్పజెప్పు," అన్నాడు వెకిలిగా.


మాట్లాడకుండా లారీ దిగి, కూతురిని దింపుకోబోతోంది. ఇంతలోనే లారీ కదిలింది. రాణి ఏడుస్తోంది నిస్సహాయంగా.


వీరమ్మకు ఏడుపు వస్తోంది, ఏం చేయాలో తోచట్లేదు. అప్పుడు మెరుపులా ఆలోచన వచ్చింది. నాగలక్ష్మి చెప్పింది గుర్తొచ్చి ఫోన్ చేసి విషయం చెప్పింది. తాను ఏ దారిలో ఉందో లొకేషన్ పంపింది... తాను నేర్చుకుంది గుర్తుచేసుకుంటూ!


ఆ తర్వాత నెమ్మదిగానే వెళ్తున్న లారీ వెంట పడింది. వీరమ్మ ఎవరికో ఫోన్ చేయడం చూసి వాళ్లు మళ్లీ ఆపారు. అక్కడ ఆ రోడ్డున ఎవరూ లేరు, అదీ వాళ్ల ధీమా!


నాగరాజూ, డ్రైవర్ కిందకు దిగారు.


"దాని ఫోన్ విరగొట్టండిరా! లేదంటే ఫోన్ చేస్తుంది," అని అరిచాడు ఓనర్ అన్నవాడు.

రాణి స్కూల్ బ్యాగ్ తన చేతిలోనే ఉంది. గబగబా బ్యాగ్ లోపలికి చూసింది. లెక్కల కోసం ఉపయోగించే వృత్తలేఖిని (Compass) కోసం బాక్స్ మూత తీసి చేతిలోకి తీసుకుంది.


వాళ్లు దగ్గరకు రాగానే ఎక్కడ దొరికితే అక్కడ ఆ వృత్తలేఖినితో గాట్లు పెట్టింది. వాళ్లు మొత్తుకున్నారు, అయినా తమాయించుకుని తమ వద్దనున్న కత్తులు తీసి బెదిరించారు. ఫోన్ లాక్కోడానికి చూస్తుంటే కిందకు జారి ఎక్కడో పడిపోయింది అది.


దానికోసం వెతుకుతున్నారు. ఆ మూడోవాడు కూడా దిగి చూస్తుండగా, రాణి నెమ్మదిగా కిందకు దిగి తల్లి వద్దకు వచ్చింది. లారీకి అటువైపు వాళ్లు చూడకుండా నక్కి వెళ్లడానికి చూస్తుంటే ఏదో శబ్దం వినబడింది. జాగ్రత్తగా విన్నారు.


కప్పి ఉన్న లారీ సామానులో నుంచి మూలుగులు వినబడ్డాయి మళ్లీ! ఏంటో చూద్దామని అదే వృత్తలేఖినితో ఆ దళసరి ప్లాస్టిక్‌ను కోసింది. చూస్తే అందులో చాలామంది పిల్లలు స్పృహ లేకుండా, మత్తుమందు ప్రభావంలో ఉన్నారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి టీనేజ్ పిల్లల వరకు ఉన్నారు.


అది చూసి... 'ఈ రాక్షసుల నుంచి ఎలాగైనా ఆ పిల్లల్ని రక్షించాలి' అనుకుంది ఆమెలోని అమ్మ మనసు! కూతురికి కూడా ధైర్యం చెప్పి, అక్కడే పడి ఉన్న ఏదో దుడ్డుకర్ర చేతికిచ్చింది.


ఇద్దరూ చెరోవైపు నుంచి వెళ్లి దాడి చేశారు వాళ్లపై. రాణి ఆ దుడ్డుకర్రతో చితక్కొట్టింది! మొదట్లో వచ్చిన భయం ఎగిరిపోయింది రాణిలో. 


ప్రకాశంగారు తనకు, వాళ్ల మనవరాలికి చెప్పిన ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి వీరవనితల కథలు గుర్తొచ్చాయి. రోజూ దుర్గాదేవి స్తోత్రం చేయించేది గుర్తొచ్చింది. అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలో గుర్తొచ్చి వాళ్లను వీరబాదుడు బాదింది.


తన కూతురి వద్దనుంచి ముందే తీసుకున్న వృత్తలేఖినితో వాళ్ల చేతి నరాలు గురి చూసి గాట్లు పెట్టింది వీరమ్మ. 


అది చూసి ఒకడు కత్తితో వెనుకనుంచి వీరమ్మ భుజంపై గుచ్చాడు. పరుగెత్తుకెళ్లి రాణిని పట్టుకోబోయాడు. అప్పుడు ఎక్కడలేని తెగింపుతో పరుగెత్తి అదే వృత్తలేఖినితో వాడి వీపులో గుచ్చింది కసిగా! వాడు కింద పడిపోయాడు. మిగతా ఇద్దరు అంతకుముందే పడిపోయారు.

ఒక్కసారి కూతురిని హత్తుకుని కింద పడిపోయింది వీరమ్మ.


అమ్మ కోసం ఏడుస్తూనే ప్రకాశం వాళ్లకు కాల్ చేస్తూనే ఉంది రాణి. ఇంతలో పోలీసుల బలగాలు వచ్చాయి... పోలీస్ అధికారి అయిన ప్రకాశంగారి అబ్బాయి నేతృత్వంలో!

ఆ పిల్లలందరూ రక్షింపబడ్డారు, అందరినీ సురక్షితంగా వాళ్ల వాళ్ల ఇళ్లకు చేర్చారు పోలీసులు. 


వీరమ్మను హాస్పిటల్లో చేర్చారు, పెద్ద ప్రమాదం తప్పింది. గాయానికి కట్టుకట్టి మందులిచ్చారు.


పిల్లలను ట్రాప్ చేసి, దొంగిలించి, విదేశాలకు అమ్ముకుంటున్న ఒక పెద్ద ముఠా గుట్టు రట్టయింది. అందరినీ పట్టుకున్నారు పోలీసులు, వాళ్లకు తగిన శిక్ష పడింది.


ప్రభుత్వం నుంచి ప్రశంసలు, బహుమతులు లభించాయి వీరమ్మకు. తన కూతురినే కాకుండా అందరి పిల్లల్నీ కాపాడింది వీరమ్మ అని ప్రశంసలు వెల్లువెత్తాయి. 


మీడియాలో, అన్ని వార్తల్లో ఆవిడ పేరు మారుమోగిపోయింది. ప్రతి ఒక్కరూ ఆమెలోని అమ్మ మనసుకు జోహార్లు అర్పించారు!


- శుభం -

- సుధావిశ్వం

  


సుధావిశ్వం

-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page