top of page
Original.png

ఆనందీ!!

3 hours ago
7 min read

ఆనందీ కథలో తల్లిదండ్రుల ప్రేమను, తన ఆశయాలను కాపాడుకుంటూ విడిపోయిన కుటుంబాన్ని ఏకం చేసిన యువతి ఆనందీ, భావోద్వేగంతో కలుసుకున్న సోదరుడు సురేష్, సోదరి సుధ.

Anandee - Telugu Family Story | A. Sandhyarani Siripragada

ఆనందీ!! - తెలుగు కుటుంబ కథ | ఏ. సంధ్యారాణి సిరిప్రగడ

Published in manatelugukathalu.com on 23/10/2026


“ఆనందీ!!” ఏ. సంధ్యారాణి సిరిప్రగడ రచించిన హృదయాన్ని హత్తుకునే తెలుగు కుటుంబ కథ. తల్లిదండ్రులపై ప్రేమ, కుటుంబ బంధాలు, త్యాగం, మహిళా సాధికారతతో పాటు తన వైద్య విద్యా కలలను సాకారం చేసుకోవాలనే యువతి సంకల్పాన్ని ఈ కథ అందంగా ఆవిష్కరిస్తుంది.


"మమ్మీ.. మమ్మీ.." అంటూ కిచెన్‌లోకి వచ్చి, ఇడ్లీకి పచ్చడి చేస్తున్న లక్ష్మిని వెనుక నుంచి వాటేసుకుంది ఆనందీ.


"ఏంటే!? ఇంత ప్రేమ వచ్చింది, పొద్దున్నే!"

"నాకు తెల్లవారుజామున ఒక విచిత్రమైన కల వచ్చింది మమ్మీ!"


"అవునా... ఏంటా కల?"


"చాలా రోజుల తర్వాత తాతయ్య కలలోకి వచ్చాడు, నేను పెళ్లికూతురి గెటప్‌లో ఉన్నాను. నాకు పెళ్లి జరుగుతోంది, తాతయ్య ఎంతో సంతోషంగా నన్ను దీవిస్తున్నాడు."


"విచిత్రమే! నీకు నిజంగా కల వచ్చిందా!? లేకపోతే నీకు పెళ్లి చేయమని మాకు సిగ్నల్ ఇస్తూ అలా చెప్తున్నావా?" కొంటెగా నవ్వుతూ అడిగింది లక్ష్మి.


"పోమ్మా! అప్పుడే నాకు పెళ్లేంటి? నా చదువు పూర్తయ్యే వరకు డాడీ నాకు పెళ్లి చేయరు," బుంగమూతి పెట్టి ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పింది ఆనందీ.


"మరింకే! మర్చిపో."


"సరే మమ్మీ. నీకు చెప్పా కదా, రేపు సంహిత పెళ్లి. ఈ రోజు సంగీత్ ఉంది, నన్ను సంగీత్‌లో పాటలు పాడమంది, కాబట్టి వచ్చేసరికి లేట్ అవుతుంది. డాడీకి కూడా చెప్పు, లేకపోతే కంగారుపడతారు."


"సరే అలాగే! పాటలు బాగా పాడు, వీడియోస్ తీసుకుని నాకు పంపించు!" కూతురికి ఇడ్లీ ప్లేటు, మంచినీళ్ల బాటిల్ అందిస్తూ చెప్పింది లక్ష్మి.


"ఓకే మమ్మీ," అంటూ గబగబా తినేసి కాలేజీకి వెళ్ళిపోయింది ఆనందీ.


లక్ష్మి-సురేష్ దంపతులకు ఆనందీ మూడో కూతురు. సురేష్ ఐఏఎస్ ఆఫీసర్. పెద్ద కూతురు అతిథి, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ భర్త, ఇద్దరు పిల్లలతో ఆస్ట్రేలియాలో ఉంటుంది. 


రెండో కూతురు నిధి, ఫ్యాషన్ డిజైనర్; పోయిన సంవత్సరమే పెళ్లయింది, ఇప్పుడు గర్భవతి. ఆమె అమెరికాలో ఉంటుంది. 


ఇద్దరు కూతుళ్లకు మంచి సంబంధాలు తెచ్చి పెళ్లిళ్లు చేశారు. పెద్దల్లుడు రిషి, AI సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్; రెండో అల్లుడు డాక్టర్ ధీరజ్, న్యూరాలజిస్ట్.


లక్ష్మికి సంగీతం, నృత్యం అంటే చాలా ఇష్టం, కానీ తను నేర్చుకోలేకపోయింది. 


అందుకే చిన్నప్పటి నుంచే ముగ్గురు కూతుళ్లకు కర్నాటిక్ సంగీతం, భరతనాట్యం నేర్పించింది. 


ఆనందీ మాత్రమే శ్రద్ధగా నేర్చుకుని పాటలు, డాన్స్ ప్రోగ్రామ్‌లు ఇస్తూ, పోటీలలో పాల్గొంటూ ఫస్ట్ ప్రైజులు గెలుచుకునేది. కూతురు పాటలు పాడుతుంటే, నృత్యం చేస్తుంటే సంతోషంతో ఉప్పొంగిపోతుంది లక్ష్మి.


రాత్రి 9 గంటలయింది. భోజనాలు చేసి, హాలులో కూర్చుని ఆనందీ కోసం ఎదురుచూస్తున్నారు లక్ష్మి, సురేష్ దంపతులు.


పిల్లల క్షేమసమాచారాల గురించి, పొద్దున ఆనందీ చెప్పిన విచిత్రమైన కల గురించి మాట్లాడుకుంటున్న లక్ష్మి, సురేష్‌లకు... చాలా వేగంగా వచ్చి ఇంటిముందు కారు ఆగిన శబ్దం వినిపించింది.


సురేష్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడైన చిదంబరం కారు దిగి, హడావుడిగా ఇంట్లోకి వచ్చాడు.


ఏమీ అర్థం కాని లక్ష్మి, సురేష్‌లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.


"సురేష్! ఇది చిన్న విషయం కాదు, కానీ నీ సహాయం కావాలి. అనుకోకుండా ఒక సమస్య వచ్చింది. మా అన్నయ్య వియ్యంకుడు, సుప్రీంకోర్టు జడ్జి... రేపు ఆయన నాలుగో కుమారుడి పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. చివరి నిమిషంలో అమ్మాయికి, అబ్బాయికి గొడవ జరిగి, అమ్మాయి పెళ్లి రద్దు చేసుకుని వెళ్ళిపోయింది..."


"అయితే..?"


"చాలా మంచి సంబంధం రా! అబ్బాయి ఐపీఎస్ ఆఫీసర్, ఢిల్లీ ఇంటెలిజెన్స్‌లో ఉద్యోగం. ఇప్పుడు వాళ్ల కుటుంబానికి ప్రెస్టీజ్ సమస్య. 


రేపు ఎంతోమంది హైకోర్టు జడ్జీలను, లాయర్లను, మన రాష్ట్ర ముఖ్యమంత్రినీ, మంత్రులనూ పెళ్లికి ఆహ్వానించారు. 


అలాగే ఢిల్లీ రిసెప్షన్‌లో కూడా ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జీలు, ఎంతోమంది మంత్రులు, ఐపీఎస్ ఆఫీసర్లు... ఇలా అందరూ వచ్చే ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి ఈ పెళ్లి ఆగిపోవడం వాళ్లకు అసలు ఇష్టం లేదు," అని చెప్పుకొస్తూ కొంచెం గుటకలు మింగాడు చిదంబరం.


"సరే! నేనేం చేయాలి?"


"అదేరా... ఆనందీని... ఆ... అబ్బాయికి..." భయం భయంగానే చెప్తూ ఆగాడు చిదంబరం.


"లేరా... పైకి లే! ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నా చేతిలో చచ్చిపోతావ్‌రా! బయటికి పో!" ఆవేశంగా అన్నాడు సురేష్.


అసలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే భర్తను ఇంత కోపంలో చూసి కొంచెం ఆశ్చర్యపోయినా, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ చిదంబరాన్ని చూసి వస్తున్న నవ్వును ఆపుకుంది లక్ష్మి.


"ఆగరా... ఎందుకంత కోపం!? నేను చెప్పేది పూర్తిగా విను," వెనక్కి జరుగుతూ తడబడుతూ అన్నాడు చిదంబరం.


"ఏంట్రా... నువ్వు ఇంకా చెప్పేది, నేను వినేది! నా కూతురికి మొన్న మొన్ననే 18 ఏళ్లు నిండాయి. చిన్న పిల్లరా అది! డాక్టర్ కావాలనే కలతో కష్టపడి చదువుతోంది. ఎవరికో సమస్య వచ్చిందని నా కూతురిని ఇచ్చి పెళ్లి చేయమంటావా! ఇంపాజిబుల్... అది జరగని పని! ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో!" చిదంబరాన్ని చేయి పట్టి లాక్కెళ్తూ గుమ్మం దగ్గర వదిలేశాడు సురేష్.


అప్పుడే ఎదురుపడింది ఆనందీ.


"లక్ష్మీ... ఆనందీని లోపలికి తీసుకెళ్లు," అంటూ... "చిదంబరం, నువ్వు వెళ్ళిపో. ఈ విషయంలో ఇంకా మాట్లాడేది ఏమీ లేదు, వెళ్లు," అని స్నేహితుడికి నెమ్మదిగా చెప్పాడు. కూతురిని చూశాక ఆవేశం మాయమైంది సురేష్‌కి.


ఇక చేసేదేమీ లేక చిదంబరం వెనుతిరిగాడు.


రాత్రి 11 గంటలయింది.


టింగ్.. టాంగ్! టింగ్.. టాంగ్!

"ఏవండీ... కాలింగ్ బెల్ మోగుతోందండి," మంచి నిద్రలో ఉన్న లక్ష్మి లేచి భర్తను కూడా లేపింది.


"ఇంకెవరు! ఆ చిదంబరమే అయి ఉంటాడు. అంత నచ్చచెప్పినా మళ్లీ వచ్చాడు. వాడికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే! ఆ డ్రాలో గన్ను ఉంది తీసుకో లక్ష్మీ."


"అయ్యో! గన్ ఎందుకండి? వద్దు!" గాబరా పడుతూ అంది లక్ష్మి.


"వాడిని చంపేస్తా ఈరోజు! అభం శుభం తెలియని నా చిట్టి తల్లికి అప్పుడే పెళ్లి చేయమని అడుగుతున్నాడు," అంటూ బెడ్‌రూమ్ తలుపు తీసుకుని, హడావుడిగా కిందికి వచ్చి, చాలా కోపంగా తలుపులు తెరిచి, ముందుకు రెండు అడుగులు వేసి... హఠాత్తుగా మళ్లీ వెనక్కి రెండు అడుగులు వేసి తుళ్లి పడబోయిన సురేష్‌ని పడకుండా ఆపి పట్టుకుంది వెనుక నుంచి వచ్చిన లక్ష్మి.


ఎదురుగా ఎర్రని పట్టుచీర కట్టుకుని, నిండైన అలంకరణతో, నిమ్మపండు రంగులో మెరిసిపోతున్న మహిళను చూడగానే అకస్మాత్తుగా "వదినగారూ...!" అని పలికింది లక్ష్మి.


కళ్లలో నీళ్లు, భయం భయంగా చూపు, లోపలికి రావాలా వద్దా అనే సంశయంతో ఎదురుగా నిలుచున్న తన చెల్లెలిని చూసి... కలా! నిజమా! అనే అనుమానంతో నిశ్చేష్టుడై చూస్తూ నిలుచున్నాడు సురేష్.


ముందుగా తేరుకున్న లక్ష్మి, "రండి వదినగారూ!" అంటూ పిలుస్తూ, ఇంకా షాక్‌లో ఉన్న భర్తను లోపలికి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. కాలింగ్ బెల్ శబ్దానికి ఇంట్లో ఉన్న పనివాళ్లు కూడా నిద్ర లేచి వచ్చి, జరిగేదంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.


"రండమ్మా... ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇంకా సంశయం ఎందుకు?" అంటూ సుధను లోపలికి తీసుకొచ్చాడు చిదంబరం.


లోపలికి వచ్చింది కానీ ఏం చేయాలో అర్థం కాలేదు, పలకరించే ధైర్యం కూడా లేదు. 30 ఏళ్లుగా దూరంగా ఉన్నందుకు తన అన్నయ్య ఎలా స్పందిస్తాడో అని ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంది సుధ.


ముందుగా సురేష్‌కి మంచినీళ్లు అందించింది లక్ష్మి.


"ఏం లేదు వదినగారూ, కొంచెం బీపీ డౌన్ అయినట్టుంది... అంతే," అంటూ తన పైట చెంగుతో భర్త నుదుటిపై చెమటలను తుడుస్తూ అంది లక్ష్మి.


నీళ్లు తాగాడు కానీ, ఎదురుగా ఉన్న తన చెల్లెలిని చూసి అతివేగంగా కొట్టుకుంటున్న తన గుండెను, నీరసించి పోయిన తన శరీరాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోతున్నాడు సురేష్.


"లక్ష్మీ... నేను చెప్పాను కదమ్మా, వీళ్ల అబ్బాయిదే పెళ్లి ఆగిపోయింది..." అంటూ వెంటనే సురేష్ వైపు చూస్తూ, "అదే... అదే... మీ బావగారు బయట కారులో కూర్చున్నారు," అన్నాడు చిదంబరం.


"అరే... ఇప్పుడురా చెప్పేది!" అంటూ ఒక్క ఉదుటున లేచి బయటకు పరిగెత్తాడు సురేష్.


'మెల్లగానండి, మెల్లగా!' అంటూ వెనుక నుంచి లక్ష్మి అరుపులు వినిపించాయి సురేష్‌కి.


కారులో వెనుక సీటులో కూర్చుని ఉన్న తన బావ జస్టిస్ విశ్వనాథ్‌ను, కారు డోర్ తీసి, "రండి బావగారూ, లోపలికి రండి," అని ఆహ్వానించాడు సురేష్.


మారు మాట్లాడకుండా వెంటనే కారు దిగి లోపలికి వచ్చాడాయన.

అందరూ సోఫాలో కూర్చున్నారు. చాలా గంభీరంగా ఉన్నాయి అందరి ముఖాలు. లక్ష్మి అందరికీ మంచినీళ్లు అందించింది.


ముందుగా గొంతు సవరించుకున్న విశ్వనాథ్, సురేష్ వైపు చూస్తూ... "చూడండి సురేష్, నాకు తెలుసు... గత 30 ఏళ్లుగా మీరు మీ చెల్లెలి కోసం వెతుకుతున్నారు. 

ఆమెను చూడాలని, ఆమెతో సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలని ఆశపడుతున్నారు. 


ఈ రోజు నా అవసరానికి మీకు ఎదురుపడ్డాము. ఇది నా స్వార్థం అనుకున్నా నాకు నష్టం లేదు. మీ అమ్మాయి ఆనందీని నా కొడుకు పృథ్వీరాజ్‌కి ఇచ్చి పెళ్లి చేయాల్సిందిగా అడుగుతున్నాను."


అందరూ మౌనంగా వింటున్నారు. సురేష్ తన చెల్లెలి వైపు ఒకసారి చూసి తలదించుకున్నాడు.


"సార్! ఇఫ్ యు డోంట్ మైండ్... అసలు మీరు ఇన్నేళ్లు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? కొంచెం చెప్తారా ప్లీజ్!" అడిగాడు చిదంబరం.


"బహుశా అప్పుడు సురేష్ హైదరాబాదులో చదువుకుంటున్నారేమో. వీళ్ల ఊరి గవర్నమెంట్ స్కూల్లో టీచరుగా ఉద్యోగం చేస్తున్న నేను, ఇంటర్ సెకండియర్ చదువుతున్న సుధ ఒకరినొకరు ఇష్టపడ్డాము. 


సుధ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఈ విషయం తెలుసుకున్న వీళ్ల నాన్నగారు... 'బతకలేని బడిపంతులుకి నా కూతురిని ఇస్తానా?' అని ఊరందరి ముందు నన్ను అవమానించారు. 


అంతే కాకుండా నాపై లేనిపోని నిందలు మోపి, ఆయనకున్న అధికారంతో స్కూల్ నుంచి నన్ను సస్పెండ్ చేయించారు, నా ఉద్యోగం తీయించేశారు. ఊరి నుంచి వెళ్ళిపోతున్న నాతో సుధ కూడా వచ్చేసింది. 


మళ్లీ ఆ ఊరిలో అడుగు పెట్టొద్దని, వీళ్ల కుటుంబానికి దూరంగా ఉండాలని అనుకున్నాము," తన ప్రేమకథ చెప్తూ, సురేష్ వాళ్ల నాన్నగారి మీద ఇంకా కోపం పోలేదు అన్నట్టుగా చెప్పాడు విశ్వనాథ్.


పైన ఫస్ట్ ఫ్లోర్‌లో రేలింగ్ దగ్గర నిల్చొని ఇదంతా చూస్తూ వింటోంది ఆనందీ.

ఏనాడూ తన తండ్రిని ఇంత నిస్సహాయ స్థితిలో చూడలేదు ఆనందీ. చెల్లెలంటే తన తండ్రికి ఎంత ప్రేమో చిన్నప్పటి నుంచి చూస్తోంది. 


వెతకని ఊరు లేదు, బాధపడని రోజు లేదు. 'నేను కనుక ఆ సమయంలో ఊరిలో ఉండి ఉంటే తండ్రికి ఎలాగైనా నచ్చజెప్పేవాడిని, ఇలా జరగనిచ్చేవాడిని కాదు... నా చెల్లెలిని దూరం చేసుకునేవాడిని కాదు' అని బాధపడుతూ ఉంటాడు. 


ప్రతి సంవత్సరం చెల్లెలి పుట్టినరోజు నాడు గుడిలో పూజలు, పేపర్లో ప్రకటనలు జరుగుతూనే ఉంటాయి. ఇన్నేళ్ల తర్వాత చెల్లెలిని చూసి ఆనందించాలో, లేక బావగారి ప్రతిపాదనని ‘కాదు’ అనాలో ఎటు తేల్చుకోలేక... కాదంటే మళ్లీ చెల్లెలు దూరం అవుతుందేమో అనే బాధలో, ఆలోచనలతో సతమతమవుతున్న తండ్రిని చూసి తట్టుకోలేకపోతోంది ఆనందీ.

ఇక తనే ఒక నిర్ణయం తీసుకోవాలని ముందడుగు వేసింది.


కిందికి వచ్చి వాళ్లకు నమస్కారం చేసి, "నాకు ఈ పెళ్లి ఇష్టమే!" దృఢ నిశ్చయంతో చెప్పింది ఆనందీ.


ఒక్కసారిగా లక్ష్మి, సురేష్ ఉలిక్కిపడ్డారు.


ఎన్నో ఏళ్ల తర్వాత తన ఎదురుగా ఉన్న చెల్లిని మనస్ఫూర్తిగా పలకరించలేదు, ఆనందంగా ఆలింగనం చేసుకోలేదు; చెల్లెలి కోసం కూతురి జీవితాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నాడు సురేష్.


"కానీ నాదొక కండిషన్!" మెల్లిగా చెప్పింది ఆనందీ.


"ఏంటమ్మా చెప్పు... ఏంటి నీ కండిషన్?" అడిగాడు విశ్వనాథ్.


"మా ఇద్దరి అక్కల పెళ్లిళ్లు అయిపోయిన తర్వాత నేనొక నిర్ణయం తీసుకున్నాను. నేను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా అమ్మానాన్నలను ఒంటరిగా వదిలేసినవాళ్లం అవుతాం. 


అందుకే నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా మా అమ్మానాన్నలతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. నా భర్త నాతో ఉన్నా సరే, లేదంటే మా ఇంటికి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉన్నా సరే... నేను మాత్రం మా అమ్మానాన్నలను వదిలి వెళ్ళను.


అలాగే నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, నేను కచ్చితంగా MBBS పూర్తి చేయాలి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు నేను చెప్పలేను. నా కలలు పూర్తి చేసుకునే స్వాతంత్ర్యం నాకు కావాలి. 


కాబట్టి నేను పెళ్లి చేసుకున్న తర్వాత మీతో పాటు మీ ఇంటికి రాలేను. ఇది మీకు ఓకే అయితే ఈ పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు," అని తన మనసులోని మాటను అందరితో పంచుకుంది ఆనందీ.


ఆనందీ మాటలు విన్న లక్ష్మి, సురేష్‌లకు గుండె బరువెక్కింది. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. చిన్నపిల్ల, ఏమీ తెలియని వయసు అని అనుకుంటున్న వాళ్లకు, తమ కూతురి మనసులో ఇన్ని ఆలోచనలు ఉన్నాయని, ఇంత పెద్ద మనసుతో ఆలోచిస్తుందని వాళ్లు అసలు ఊహించలేదు. 


ఒక రకంగా వాళ్లు ఎన్నో ఏళ్లుగా మదనపడుతూ ఉన్నారు... ముగ్గురు కూతుళ్లు అత్తవారింటికి వెళ్ళిపోతే అప్పుడు తమ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ భయపడుతూ ఉంటారు. 


ఈ విషయంలో ఎన్నోసార్లు చర్చ జరిగినప్పుడు తమ పెద్ద కూతుళ్లు ఇద్దరూ, 'నాన్న రిటైర్మెంట్ అవ్వగానే మా ఇంటికి వచ్చి ఉండండి, మేమున్నాం కదా' అంటారు. కానీ 'మీతో నేను ఉంటాను, మిమ్మల్ని వదిలిపోను' అని చిన్న కూతురు చెప్తోంది.

లక్ష్మి వెళ్లి కూతురిని దగ్గరకు తీసుకుంది.


రెండు నిమిషాలు టైమ్ తీసుకుని వెళ్లి ఒక ఫోన్ కాల్ మాట్లాడి వచ్చారు విశ్వనాథ్.

"పృథ్వీ ఒప్పుకున్నాడు. నా ముగ్గురు కొడుకులనూ, కోడళ్లనూ అడిగాను, వాళ్లకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. సుధా... నువ్వేమంటావ్ మరి?" అడిగాడు ఎదురుగా కూర్చున్న భార్యను.


ఒక నిమిషం ఆలోచించిన సుధ ఆనందీ వైపు చూసి, "పిల్లల్ని కంటావా అమ్మ? ఏం అభ్యంతరం లేదుగా?" అని అడిగింది.


"తప్పకుండా అత్తయ్యా! ఎలాంటి అభ్యంతరం లేదు," చిరునవ్వుతో చెప్పింది ఆనందీ.


సుధ వెంటనే లేచి ఆనందిని కౌగిలించుకుంది.


"చిన్నదానివైనా రెండు కుటుంబాలను ఏకం చేస్తున్నావు. 


జీవితంలో నువ్వేం సాధించాలనుకున్నా నీకు తోడుగా ఉంటాము. కానీ పండుగలకీ, ఫంక్షన్లకీ ఒక రెండు రోజులు వచ్చి పోతూ ఉండు... అంతే చాలు!" అని చెప్పి, వెంటనే వెళ్లి సురేష్ కాళ్లపై పడింది.


"నన్ను క్షమించు అన్నయ్యా, ఇన్నేళ్లుగా నీకు దూరంగా ఉన్నాను... నిన్ను చాలా బాధపెట్టాను," అంటూ ఏడుస్తున్న చెల్లెలిని పైకి లేపి, కన్నీళ్లు తుడుస్తూ దగ్గరకు తీసుకున్నాడు సురేష్.


ఆనందంతో సురేష్‌కి మాటలు కూడా రావట్లేదు. అమాయకురాలు అనుకున్న తన చిన్న కూతురు త్యాగం చేసి అందరి మనసులో పెద్దపీట వేసుకుని కూర్చుంది, అందనంత ఎత్తులో నిలిచింది.


"ఓకే... ఓకే, అందరూ రిలాక్స్ అవ్వండి. టైమ్ పన్నెండు దాటింది. రేపటికి మనం చాలా పనులు చేసుకోవాలి. ఏం సురేష్, ఇప్పటికైతే ఒప్పుకున్నావు కదా... 'ఆనందీ-పృథ్వీరాజ్' పెళ్లికి!" నవ్వుతూ స్నేహితుడిని అడిగాడు చిదంబరం.


సురేష్ తన స్నేహితుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు.


- సమాప్తం -

***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


ఏ. సంధ్యారాణి సిరిప్రగడ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





ఏ. సంధ్యారాణి సిరిప్రగడ

నా పేరు ఏ. సంధ్యారాణి సిరిప్రగడ.


నేను చదువుకుంది బీకాం., ఎంబీఏ., ఎల్ఎల్ బి.

ఇంజనీరింగ్, ఎంబీఏ, & ఎంసీఏ కాలేజిలలో అసోసియేట్ ప్రోఫేసర్‌గా చేశాను. అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశాను. మాసపత్రికలు, ఆన్లైన్ పత్రికలు, వేరువేరు పోటీల కోసం, సామాజిక మాధ్యమాల గ్రూపుల కోసం ఇప్పటివరకు మొత్తం దాదాపు 40 కథలు, 20 కవితలు వ్రాసాను. 2011 నుంచీ 2014 వరకు ఆంధ్రభూమి దినపత్రికలో 'రాణి సంధ్య' పేరుతో 18 వ్యాసాలు అచ్చయ్యాయి.  2025లో జెవి పబ్లికేషన్స్ వారి 'ధీర' పుస్తకంలో నావి నాలుగు కథలు అచ్చయ్యాయి. వివిద పోటీలలో ప్రథమ, ప్రోత్సాహక బహుమతులు అందుకున్నాను. ఒక పోటీ కోసం మినీ నవల కూడా వ్రాసాను. నవల వ్రాయాలని కోరిక ఉంది. కథలు, కవితలు, వ్యాసాలు వ్రాయడమే కాకుండా నాకు పాటలు పాడడం, చిత్రలేఖనం చాలా ఇష్టం. నా స్వస్థలం, నివాసం హైదరాబాదు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page