top of page

శిశిరంలో వసంతం

#Sisiramlo Vasantham, #శిశిరంలోవసంతం, #Mayukha, #మయూఖ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Sisiramlo Vasantham - New Telugu Story Written By Mayukha

Published In manatelugukathalu.com On 01/06/2025

శిశిరంలో వసంతం - తెలుగు కథ

రచన: మయూఖ

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



అరుంధతి ఆలోచనలు కూతురు చుట్టూ తిరుగుతున్నాయి. తను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే, నీ కర్మ నువ్వు అనుభవించు అని వెళ్ళిపోతుందా! అనుకుంటూ బాధపడుతోంది 62 ఏళ్ళ అరుంధతి. 


అరుంధతికి చిన్నతనంలోనే భర్త పోయాడు. గవర్నమెంట్ లో చిన్న ఉద్యోగం చేసేవాడు. దాంతో అరుంధతికి కారుణ్య నియామకం కింద రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డు అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. అరుంధతి టెన్త్ వరకు చదువుకుంది. 


అప్పటికే కూతురు ఐదో క్లాసు చదువుతోంది. కూతుర్ని తీసుకుని తను పనిచేస్తున్న ఊరికి వచ్చి, అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది. కూతురు శిరీష కూడా బాగా చదివేది. తల్లి సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేవరకు గేటు దగ్గరే ఎదురు చూస్తూ ఉండేది. రాత్రి కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు భోజనాలు చేసేవారు.

 

కాలం గడుస్తోంది. శిరీష డిగ్రీ వరకు వచ్చింది. అరుంధతి ప్రైవేట్ గా బిఏ పాస్ అయింది. జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ వచ్చింది. ఆఫీసులో లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పనిచేసేది. తోటి పిల్లలతో తన కూతురు సమానంగా ఉండాలని ఆ వచ్చిన జీతంతోటే చిట్టీలు వేసి బంగారం చేయించేది. 


ఆఫీసులో అందరూ డిగ్రీ అయిన తర్వాత బిఈడి చేయించమన్నా, కూతురికి ఇష్టమని ఎమ్మెస్సీ లో జాయిన్ చేసింది. సిటీలో హాస్టల్లో పెట్టింది. 


తలకు మించిన భారమైనా కూతురు కోసం భరించింది. శిరీష ఒకరోజు ఒక అబ్బాయిని తీసుకుని ఇంటికి వచ్చింది. "అమ్మ! ఇతను కిషోర్, నా క్లాస్మేట్. మేము ఇద్దరం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. "


"అదేమిటే! వాళ్ల గురించి ఏమీ తెలీదు. పెళ్లంటే మాటలా! అతను ఎటువంటివాడో, వాళ్ల కుటుంబం ఎటువంటిదో తెలియకుండా అప్పుడే పెళ్లి అంటావేం. మనకా మగదక్షత లేదు. వెనక ముందు చూడొద్దా!"అంది ఆందోళనగా. 


శిరీషకి ఇప్పుడే పెళ్లి చేయడం అరుంధతికి ఇష్టం లేదు. ఉద్యోగం వచ్చిన రెండు మూడు సంవత్సరాల తర్వాత చేద్దాం అనుకుంది. కూతురు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. 


"అందుకే అమ్మ! సంబంధం నేనే తెచ్చుకున్నాను. నువ్వు వచ్చి వాళ్లతో మాట్లాడు. వాళ్ల వాళ్లు అందరూ మంచివాళ్లే. నువ్వేం కంగారు పడకు". అని చెప్పి సిటీ కి వెళ్ళిపోయింది. 

ఆఫీస్ కి వెళ్లి కొలీగ్ తాయారు తో చెబితే"నువ్వు ఇప్పుడే శిరీష్ కి పెళ్లి చేయను అన్నావు కదా! మళ్లీ ఇప్పుడేంటి" అంది. 


కూతుర్ని బయట పెట్టుకోవడం ఇష్టం లేక "ఎప్పటికైనా చేయాలి కదా! మంచి సంబంధం వచ్చింది. చేసేద్దామని అనుకుంటున్నాను. రేపు ఆదివారం నువ్వు, మీ ఆయన రండి. ముగ్గురం వెళ్లి వాళ్ళ వాళ్ళతో మాట్లాడదాం" అంది అరుంధతి. 


సిటీకి వెళ్లి కూతుర్ని తీసుకుని పెళ్లి వారింటికి వెళ్లారు. ఇల్లు పెద్దది. స్థితి మంతుల్లాగే ఉన్నారు. వాళ్లకి ఒక కూతురు, ఒక కొడుకు. కూతురుకి పెళ్లయి అమెరికాలో ఉందిట. 


పెళ్ళికొడుకు తండ్రి ఓ చిన్న కాంట్రాక్టర్. వీళ్ళని చూసి సాదరంగా ఆహ్వానించారు. "మాకు కట్నాలు ఏమి వద్దు. పెళ్లి గ్రాండ్ గా చేయండి"అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి. 


ఆ ఇంటిని చూసిన తర్వాత కూతురు అదృష్టానికి పొంగిపోయింది కానీ, అదే సమయంలో డబ్బు గురించి ఆందోళన చెందింది అరుంధతి. 


ఆఫీస్ వాళ్ళ సహాయం, చిట్టీలు కట్టిన డబ్బు, పీఎఫ్ విత్ డ్రా చేసి మొత్తానికి పెళ్లి ఘనంగా చేసింది. చీర, సారె అన్ని ఘనంగా పెట్టింది. 


మొదటి పండక్కి శిరీషే తల్లి నడిగి బైక్ కొనిపించింది. కిషోర్ అరుంధతి పరిస్థితి తెలిసి వద్దన్నా, మా అమ్మ నాకు కాక ఇంకెవరికి పెడుతుంది" అని వద్దంటున్న అతన్ని, వారించింది. 


పెళ్లయిన రెండు మూడేళ్లకి శిరీష కిషోర్ అమెరికా వెళ్లిపోయారు. బాధపడుతున్న అరుంధతితో "అమ్మ! నిన్ను వదలం, మేము కొంచెం సంపాదించుకున్న తర్వాత రెండు మూడేళ్ళ కి మళ్లీ వచ్చేస్తాం. " అని తల్లిని సముదాయించింది. 


ఆఫీసులో అందరూ ఒక్కగానొక్క పిల్లని అమెరికా పంపుతున్నావేం? వెళ్లిన వాళ్ళు మళ్ళీ వస్తారా? అన్నా, మౌనంగా ఉండిపోయింది. ఈలోగా అరుంధతిని పాస్పోర్ట్ కి, వీసా కి అప్లై చేసుకోమని చెప్పింది. 


రెండేళ్ల తర్వాత శిరీష నెల తప్పడంతో అరుంధతి లీవ్ పెట్టుకుని పురుడు పోసి ఐదో నెల వరకు అక్కడ ఉండి వచ్చింది. 


కూతురు వెళ్ళిన పిల్ల మళ్లీ రాలేదు. అరుంధతి రకరకాల సెలవులు పెట్టుకుని వెళ్తూ వస్తూ ఉండేది. 


శిరీష వస్తానని చెప్పిన మూడు సంవత్సరాలు ఎప్పుడో దాటిపోయాయి. ఆఫీసులో అందరూ గుసగుస లాడుకున్నారు. "శిరీష అరుంధతి రిటైర్మెంట్ టైంకేనా వస్తుందా!” అనుకున్నారు. 


అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్ టైం కి వచ్చి అరుంధతిని సంతోషపెట్టింది. అరుంధతికి పట్టపగ్గాలు లేవు. ఆఫీసులో అందరికీ మనవరాలుని, కూతుర్ని పరిచయం చేసి పెద్ద పార్టీ ఇచ్చింది. 


శిరీష వచ్చిన వారం తర్వాత నెమ్మదిగా తల్లితో చెప్పింది. "అమ్మ! నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నాకు ఇవ్వమ్మా! నీకు మాత్రం ఎవరున్నారు? నేను తప్ప. పిల్ల పెద్దది అవుతుంది కదా! చదువులకి ఎక్కువ ఖర్చు అవుతుంది. నాకు గ్రీన్ కార్డు వచ్చింది కాబట్టి నిన్ను పెర్మనెంట్ గా తీసుకెళ్ళిపోతాను. నా దగ్గరే ఉంచుకుంటా. నేను ఇక్కడికి వద్దామంటే అక్కడంత జీతాలు రావు, అక్కడ సౌకర్యాలకి అలవాటు పడ్డ వాళ్ళం. ఇక్కడ ఉండలేం. అందుకని " అంది శిరీష. 


"అవును తన అన్న దాంట్లో తప్పేముంది? నన్ను కూడా తీసుకువెళ్తా అంటోంది. మారు ఆలోచన లేకుండా అరుంధతి డబ్బంతా ఇచ్చేసింది. నెలవారి పెన్షన్ నాకు చాలు” అనుకుంది. 

*****

శిరీష అమెరికా వెళ్లి నెలలు గడుస్తున్నా కానీ అరుంధతిని రమ్మని ఏ ఫోను లేదు. అరుంధతికి జ్వరం వస్తే చుట్టుపక్కల వాళ్లే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. వారం రోజులపాటు వాళ్లే దగ్గరుండి ఆదుకున్నారు. జ్వరం తర్వాత అరుంధతి మానసికంగా కృంగిపోయింది. ఈమధ్య శిరీష నుంచి ఫోన్ రావట్లేదు. ఏమై ఉంటుంది అనుకుంటూ, తనే ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసింది. దాంతో అరుంధతి ఆశలు ఆవిరైపోతున్నాయి. 

మనశ్శాంతిగా ఉంటుందని గుడికి వెళితే, శిరీష ఫ్రెండ్ కమల కనిపించింది. కమల చెప్పిన మాటలు విని అరుంధతి గుండె బద్దలైంది. 


శిరీష అమెరికాలో ఇల్లు కొనుక్కున్నట్టు, ఇండియా కి రాను. ఒక్కతే కూతురు అన్నప్పుడు మా అమ్మే అర్థం చేసుకొని తన భవిష్యత్తు తను చూసుకోవాలి. ‘అయినా ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత తమని చూడాలని ఏ తల్లిదండ్రులు అనుకోకూడదు అంది’ అని కమల చెప్పింది. ఆ మాటలకి అరుంధతి గుండె బద్దలైంది. 

****

మగ తోడు లేకపోయినా దాన్ని ఎంత చదివించాను ప్రతి విషయంలోనూ దాని వెన్నంటి ఉన్నాను అనుకుంటూ ఒక రకమైన నైరాశ్యం లో పడిపోయింది. 


గుండెల మీద తన్నింది. కన్నతల్లి అనే మమకారం లేకుండా ఇంత కృతఘ్నత గా ఉంటుందా! చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతోంది అరుంధతి. 

****

ఇక్కడ ఉండటం ఇష్టం లేక అనాధ శరణాలయానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది. "కూతురు ఉండి తన అనాధయింది. ". 


పాత పెట్టెలు అన్ని సర్దుతుంటే పెట్టె లో అడుగున ఒక స్థలం డాక్యుమెంటు కనిపించింది. అరుంధతి భర్త ఎప్పుడో కొన్న స్థలం డాక్యుమెంట్ అది. ఇంతవరకు తనకి గుర్తు రాలేదు. దాన్ని తీసుకుని మంగతాయారు భర్త దగ్గరకు తీసుకువెళ్లింది. స్థలాన్ని అమ్మటానికి నిశ్చయించుకుంది. 


స్థలం అమ్మితే 20 లక్షల వరకు వస్తాయని తెలిసింది. దాంతో ఒక మంచి ఆలోచన వచ్చింది. తన ఆఫీసులో రిటైర్ అయిన ఎంప్లాయిస్ తో మాట్లాడి వారిని సభ్యులుగా చేసి "హ్యాపీ హోమ్"ఏర్పాటు చేసింది. రిటైర్ అయిన వాళ్ళు, సింగిల్ గా ఉన్నవాళ్లు ఇందులో జాయిన్ అవ్వచ్చు. పని వాళ్ళని, ఆఫీసు స్టాఫ్ ని పెట్టి అవసరమైన వాళ్ళకి కేర్ టేకర్స్ ని కూడా ఏర్పాటు చేసింది. 


కొద్దికాలంలోనే"హ్యాపీ హోమ్"మంచి పేరు తెచ్చుకుంది. 

అరుంధతి ఒకరోజు రిజిస్టర్ చూస్తుంటే ఒక పేరుని చూసి ఆశ్చర్యపోయి, క్లర్క్ ని పిలిచింది. "ఈవిడ ఎవరు? ఈవిడ వివరాలు చెప్పు. ఒకసారి నా దగ్గరకు తీసుకురా"


"అలాగే మేడం, అమెరికా నుంచి వచ్చారుట. ఎవరూ లేరు ట. భర్త పోతే ఇండియా వచ్చేసారుట. అనాధట. ఆవిడని ఇప్పుడే తీసుకువస్తాను" అంటూ వెళ్లి ఐదు నిమిషాల్లో సన్నగా, చామన చాయ రంగులో, ఎంతో దైన్యాన్ని నింపుకున్న మొహంతో ఒక మహిళను వెంటబెట్టుకుని వచ్చింది. 


ఆ స్త్రీ తల వాల్చుకునే "నేను ఎవరూ లేని అనాధ అని, మీ హోమ్ గురించి తెలిసి వచ్చాను" అంటూ చేతులు జోడించి కళ్ళ నీళ్లు పెట్టుకుంది. 

అరుంధతి లేచి ఆ స్త్రీ దగ్గరకు వచ్చి "నువ్వు శిరీష కదా!” అంది ఆశ్చర్యంగా. 


అప్పుడు తలెత్తింది ఆమె. "అమ్మ! నువ్వా! నాకు తెలియకుండానే నీ ఆసరా కోసం వచ్చాను" అంది ఏడుస్తూ. 


"అసలు ఏమైంది? అల్లుడు, మనవరాలు ఎక్కడ? నిన్ను ఇలా అనాధల ఎందుకు వదిలేసారు?"


"చెబుతానమ్మ! నేను నీకు చేసిన ద్రోహం మళ్లీ నాకే చుట్టుకుంది చేసిన పాపం ఊరికే పోదు అంటారు" అంటూ చెప్పడం మొదలెట్టింది. 


పాపాయి ఐదో క్లాస్ చదువుతోంది. అంతవరకు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు కార్ యాక్సిడెంట్ లో పాపాయికి దెబ్బలు తగిలి కాలు ఫ్రాక్చర్ అయింది. నేను ఉద్యోగానికి సెలవు పెట్టి దాన్ని చూసుకోవాల్సి వచ్చింది. అది ఎప్పటికీ కోలుకోక పోవడంతో ఉద్యోగానికి రిజైన్ చేశాను. కాలుకి ఫిజియోథెరపీలు చేస్తూ ఇంట్లోనే ఉండిపోయాను. 


తర్వాత అది రికవరీ అయింది కానీ నాకు మళ్ళీ ఉద్యోగం రాలేదు. అది పెద్దదయింది డిగ్రీ అయ్యి జాబ్ చేస్తోంది. అంతా బానే ఉంది అనుకునే టైం కి ఆయనకి బీపీ పెరిగి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. దాంతో నేను ఒంటరి అయిపోయాను. అది ఆఫీసులో పనిచేసే అమెరికన్ ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అమెరికన్ సిటిజెన్ కదా! ఇండియాలో పుట్టిన నేనే తల్లిని వదిలేసినప్పుడు దానిని అనుకోవడం అనవసరం. దేవుడు నాకు ప్రాయశ్చిత్తం చేశాడు" అంటూ తల్లిని పట్టుకుని రోదించింది. 


"బాధపడకు, ఆకు రాలే వయసులో ఉన్న నాకు మళ్ళీ వసంతంలా నా జీవితంలో ప్రవేశించావు. నేనే కాదు ఈ హ్యాపీ హోమ్ అంతా నీకు అండగా ఉంటుంది. ఇది మన అందరిదీ. " అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుంది అరుంధతి. 



 సమాప్తం


మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments


bottom of page