స్మార్ట్ ఫోన్
- Veluri Sarada

- May 1
- 3 min read
#SmartPhone, #స్మార్ట్ఫోన్, #Mayukha, #మయూఖ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Smart Phone - New Telugu Story Written By Mayukha
Published In manatelugukathalu.com On 01/05/2025
స్మార్ట్ ఫోన్ - తెలుగు కథ
రచన: మయూఖ
డిగ్రీ చదువుతున్న రాజేష్ కి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇంట్లో ఒకటే స్మార్ట్ ఫోన్ ఉండడంతో రాజేష్ తమ్ముడు సునీల్ కి చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే సునీల్ కి కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సునీల్ ఇంటర్ చదువుతున్నాడు కానీ ఒకటే ఫోన్ ఉండటంతో పెద్దవాడైన రాజేష్ వాడుకుంటున్నాడు.
వీళ్ళ ఇబ్బందిని గమనించి పక్కింటి సుందరం తన దగ్గర ఉన్న పాత ఫోను సునీల్ కి ఇచ్చాడు. సునీల్ తండ్రి రామచంద్రం చిన్న కొట్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. పిల్లలు ఇద్దరికీ సరస్వతీ కటాక్షం ఉన్నా, లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుకి ఒకింత ఇబ్బందిగానే ఉంది.
అభిమాన ధనుడైన రామచంద్రం ఇతరులను సహాయం అడగడానికి మొహమాటపడుతూ ఉంటాడు. కానీ రామచంద్రం కుటుంబానికి ఉన్న మంచి పేరును బట్టి అందరూ ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటారు.
సునీల్ క్లాసులో పిల్లలందరికీ పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు ఉన్నాయి. సుందరం ఇచ్చిన ఫోన్ పాతది అవడంతో డిస్ప్లే సరిగ్గా కనిపించట్లేదు. చదువుకుంటున్నాడు గాని సునీల్ కి ఫోన్ తో ఇబ్బందిగానే ఉంది.
***
అర్ధరాత్రి అయింది. సునీల్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు. సెల్ఫోన్ షాపు దగ్గర ఆగాడు, షాపు షట్టర్ సగానికి తెరిచి ఉంది. లోపలికి వెళ్ళాడు. ఎవ్వరూ లేరు. నెమ్మదిగా అటు ఇటు చూసి, తనకి కావలసిన ఫోన్ తీసుకుని గుండెలు అదురుతుంటే బయటకు వచ్చేసాడు. చిత్రంగా ఎవ్వరూ అక్కడ లేరు. తనని ఎవరు చూడలేదని కన్ఫర్మ్ చేసుకుని నెమ్మదిగా ఇంటికి వచ్చాడు. దొంగతనం తప్పని తెలుసున్నా, తప్పని పరిస్థితులలో చేయవలసి వచ్చింది అనుకున్నాడు.
అలారం మోగింది. ఉలిక్కిపడి లేచాడు. ఇదంతా కలా! అనుకుని అన్న రాజేష్ కి చెప్పాడు. ఇటీవల లాంచ్ అయిన కొత్త ఫోను గురించి చెప్పి, దాని రేటు మరి ఎక్కువగా ఉంది అన్నాడు. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో లేవు ఈ మధ్యన వచ్చిన ఫోన్లు అనుకున్నారు ఇద్దరు.
రాజేష్ ఫోన్ల యొక్క ఎక్కువ రేటు గురించి కంపెనీల దృష్టికి తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో అన్ని ప్రసిద్ధి చెందిన స్మార్ట్ ఫోన్ల బ్రాండ్లను టాగ్ చేస్తూ తన తమ్ముడి లాంటి ఎన్నో వేల మందికి స్మార్ట్ ఫోన్ల యొక్క అవసరాన్ని గురించి, కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసెస్ గురించి ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కి మిలియన్ లైక్స్ వచ్చాయి.
ఈ విషయం తెలుసుకున్న ఒక ఫోన్ కంపెనీ రీజనల్ మేనేజర్ రాజేష్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు.
రాజేష్ చెప్పాడు "మా తమ్ముడు లాంటి చాలామంది పిల్లలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఆన్లైన్ క్లాసులకి రెండు ఫోన్లు కొనలేక ఇబ్బంది పడుతున్నారు. మీరు సహృదయంతో వారి బాధని అర్థం చేసుకుని ఆ రేటు కొంచెం తగ్గిస్తే మీకు సేల్స్ పెరుగుతాయి. వాళ్ల అవసరాన్ని తీర్చినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఒక ఫోన్ కొంటే దానికి టెంపర్ గ్లాస్, బ్యాక్ కవర్, ఇంటర్నెట్ కోసం ప్రతి నెల రీఛార్జీలు ఇవన్నీ ఒక సామాన్య మానవుడికి తన తాహుతికి మించిన ఖర్చులే. అందుకే సార్! ఫోన్ రేటు తగ్గిస్తే బాగుంటుంది" అన్నాడు.
"చూడు రాజేష్ ఇది నా చేతుల్లో లేదు. నేను మా సీఈఓ కి మెయిల్ పెడతాను. నువ్వు చెప్పిన విషయాలన్నీ. " అన్నాడు మేనేజర్.
***
కొన్ని రోజులు తర్వాత రాజేష్ కి ఒక కొరియర్ వచ్చింది. ఏమి బుక్ చేయలేదు ఏమిటా అని రాజేష్ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. దాంట్లో ఒక ఫోను, ఒక లెటర్ ఉన్నాయి. తను ఏ కంపెనీ ఆర్ఎం తో మాట్లాడాడో ఆ కంపెనీ సీఈవో నుంచి వచ్చిన లెటర్ అది.
"మిస్టర్ రాజేష్ మీ వల్లనే స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై మధ్యతరగతి ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకున్నాము. మీరు ఇచ్చిన సూచనలకు మా కృతజ్ఞతలు. మేము తరువాత లాంచ్ చేసే మొబైల్ ని మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండేటట్లుగా రేటు ఫిక్స్ చేస్తాము. మీరు ఇచ్చిన సూచనకి కృతజ్ఞతగా ఒక మొబైల్ పంపుతున్నాము. మీకు బహుమతిగా.. "
ఉత్తరం చదవడంతో ఎగిరి గంతేశాడు రాజేష్. తనలాంటి మధ్య తరగతి ప్రజలకి అందుబాటులోకి ఒక ఫోను వస్తున్నందుకు, అది కూడా తన ద్వారానే వస్తున్నందుకు చాలా సంతోషపడ్డాడు. సంతోషంతో అన్నదమ్ములు ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ కంపెనీ సీఈఓ కి కృతజ్ఞతలు తెలుపుతూ మెయిల్ పెట్టాడు రాజేష్.
సమాప్తం
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.




Comments