దేవుడు మళ్లీ పుట్టేడు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 1
- 5 min read
#DevuduMalleePuttadu, #దేవుడుమళ్లీపుట్టేడు, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Devudu Mallee Puttadu - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 01/05/2025
దేవుడు మళ్లీ పుట్టేడు - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
అగ్రహారం గ్రామం నాగరిక ప్రపంచానికి దూరంగా నిరక్షరాస్యత అపరిశుభ్రత దెయ్యాలు భూతాలు చెడుపు చిల్లంగి చేతబడులు వంటి మూఢ నమ్మకాలతో సరైన వైద్యం లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇంగ్లీష్ వైద్యం చేయించుకుంటే గ్రామ దేవతకు కోపం వస్తుందని ఎంత ప్రాణాంతక రోగమైనా వైద్య పరిజ్ఞానం లేని నాటు వైద్యం తావీజులు మంత్రించిన విభూతితో బతుకులు
బలి పెడుతున్నారు అమాయక జనం.
ఊళ్లో రైతుకూలీ జనం కులవృత్తుల వారు నివసిస్తున్నారు. ఓట్ల కోసం ఆర్భాటాలతో వచ్చే రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత ఇటు చూడరు. మౌలిక వసతులు అసలుండవు.
కమ్మరి పనులు చేసుకునే కంసాలి అప్పలస్వామి కొడుకు దేవుడు పనుల్లో తండ్రికి సాయం చేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు.
ఒకరోజు తండ్రీ కొడుకులు పోట్లాడుకుని దేవుడు ఊరు విడిచి ఎటో వెళిపోయాడు. చాలా రోజుల వరకూ వెతికినా దేవుడి జాడ తెలియలేదు.
ఎవరో ఒకరోజు రైలు పట్టాల మీద గుర్తు పట్టలేని కుళ్లిన శవం ఉందని అక్కడ దొరికిన బట్టల్ని బట్టి దేవుడే రైలు కిందపడి సచ్చి పోయాడని నిర్ధారణ కొచ్చారు గ్రామస్థులు.
*
తండ్రితో తగవు పడి వచ్చిన దేవుడు పట్నమెళ్లాలని హైదరాబాదు వెళ్లే రైలెక్కేసాడు. ట్రైను టిక్కెట్ లేదని రైల్వే పోలీసులు జైల్లో వేసారు.
జైల్లో రకరకాల నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న నేరగాళ్లతో పరిచయం ఏర్పడింది దేవుడికి.
జైలు నుంచి బయట పడిన తర్వాత జైల్లో కలిసిన మిత్రులతో జల్షాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలు జేబు కత్తిరింపులు మొదలెట్టాడు. హిందీ నేర్చుకుని ట్రైన్లలో సూట్ కేస్ బంగారు వస్తువుల దొంగతనాలు ప్రారంభించాడు.
ఆ సమయంలో ఒక దొంగ బాబాతో పరిచయమేర్పడి బాబా వేషంలో అమాయక జనాన్ని ఎలా టోకరా కొట్టించాలో కిటుకులు నేర్చుకున్నాడు.
చిల్లర దొంగతనాలతో జల్షాలకు కావల్సిన డబ్బులు సమకూరనందున తనూ బాబా అవతారం ఎత్తాలనుకున్నాడు.
ఇద్దరు చిల్లర కేటుగాళ్లతో సంప్రదించి తన పథకం అమలు పరిచాడు. బాబా వేషానికి కావల్సిన కాషాయ వస్త్రాలు మిగతా వస్తువులు సమకూర్చుకుని సిటీ మురికి వాడల్లో మాటల మాంత్రికుడిగా తావీజులు మంత్రాల పోగులు అమ్ముతు సంపాదన మొదలెట్టాడు.
పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే పల్లె గ్రామాలు అనువుగా ఉంటాయని పథకం ఆలోచించాడు. నాటువైద్యానికి అవసరమైన తైలాలు వనమూలికలు రకరకాల చెట్ల వేళ్ళు రాగి రేకులు తాళపత్రాలు సమకూర్చుకున్నాడు.
*
అగ్రహార గ్రామ పొలిమేరల్లో గుబురుగా పెరిగిన చింత చెట్టు కింద చిదానంద స్వామి బాబా కాషాయ వస్త్రాల్లో నల్లగా పెరిగిన గెడ్డం నెత్తి మీద జడల జుత్తు ముఖాన విభూతి ముద్రలు మెడలో రుద్రాక్ష మాలలతో పులి చర్మం మీద పద్మాసనంలో కమండలం మీద చెయ్యి ఉంచి ధ్యాన ముద్రలో ఉండగా కాషాయ వస్త్రదారులైన ఇద్దరు శిష్యులు కసివింద తుప్పలతో పరిసరాలు శుభ్రం చేస్తున్నారు.
పుట్టి పెరిగిన ఊరైనందున దేవుడు ఉరఫ్ చిదానందస్వామికి అక్కడి పరిసరాలు పరిస్థితులు తెల్సినవే.
ఉదయమే పట్నానికి పాలు కూరగాయలు ఇతర వస్తువులు పట్టుకెళ్లే జనానికి ఊరి బయట బాబా గార్నీ శిష్యులను చూసి ఆశ్చర్యమేసింది.
ఇంకేముంది, ఎవరో గొప్ప మహత్తు ఉన్న బాబా గ్రామంలో ప్రబలుతున్న దీర్ఘ రోగాలు బాలింతల శిశు మరణాలు రైతుల ఆత్మహత్యలు రోడ్డు ప్రమాదాలకు కారణం ఊరికి ఏవో దుష్టశక్తులు శని పట్టి అనర్థాలు కలుగుతున్నాయని తెలిసి ఉపశమనానికి సాధువు బాబా వచ్చారన్న కబురు ఊరంతా గుప్పుమంది.
ఊరి పెద్దలందరూ సమావేశమై చెరువు గట్టున ఉన్న చింత తోపుకి బయలుదేరారు. ఊరి కరణం, మున్సబు, గుడి పూజారి, దివాణం గారు మిగత మోతుబరులు గుంపుగా రావడం చూసిన దేవుడు తన శిష్య బృందానికి ఎలా యాక్టు చెయ్యాలో చెప్పి తను ధ్యానంలో కూర్చున్నాడు.
వచ్చిన గ్రామ పెద్దలు వినయంగా చేతులు కట్టుకుని బాబా గారి ఎదుట నిలబడి వారి ముఖ కవళికల్నీ ధ్యాన ముద్రను చూసి స్వామి వారు బెండపూడి సాధువు బాలయోగిలా ఉన్నారని కొందరు, సచ్చిపోయిన మన ఊరి దేవుడే ఊరిని బాగు సెయ్యడానికి బాబా అవతారంలో వచ్చిండని ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు.
ఇంతలో బాబా గారి శిష్యబృందం కలగచేసుకుని గ్రామ పెద్దలకు నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి స్వామి వారి మహత్యం గురించి దండకం మొదలెట్టారు.
బాబా గారి పేరు చిదానందస్వామి అని, కాలజ్ఞానం తెల్సిన మహా యోగని, వారికి కాశీలో అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్టు ఉందనీ, రోజూ కాశీకి వచ్చే తెలుగు భక్తులకు భోజన సదుపాయం కల్గిస్తూ సంవత్సరాని కొకసారి అన్నదాన ట్రస్టుకు ధనసహాయం విరాళాల కోసం కాశీ నుంచి రామేశ్వరం వరకు దేశ యాటన చేస్తూ ప్రయాణంలో పీడిత ప్రజలకు వారి మహత్తుతో ఉచితంగా రోగాలను నయం చేసి వైధ్యసాయం చేస్తారని, మార్గమధ్యంలో మీ ఊరి ప్రజలకు పట్టిన అరిస్టాల్ని వారి కాలజ్ఞానంతో తెలుసుకుని ఈ ప్రాంతానికి వచ్చారు.
స్వామి వారు కొద్దిసేపటి రోజులు మాత్రమే ఈ ప్రాంతంలో ఉంటారు. వారు ఎవరితో మాట్లాడరు. సంజ్ఞల ద్వారానే భక్తుల బాధలు తెలుసుకుని వైద్యం చేస్తారు.స్త్రీలకు స్వామి దర్శనానికి అనుమతి లేదు. కుటుంబ సబ్యుల ద్వారా ఆడవారి బాధలు తెలుసుకుని తగిన మందులు ఉచితంగా ఇస్తారు. రోజుకు కొద్ది గంటలు మాత్రమే సందర్సకులకు అనుమతి ఉంటుంది.
ఇలా చిదానందస్వామి గొప్పతనాన్ని ఏకరువు పెట్టారు శిష్య బృందం. వెంటనే గ్రామపెద్దలు కలగచేసుకుని స్వామి వారికి కావల్సిన ఫలహారం ఆవు పాలు ఏర్పాటు చేసి ధ్యానానికి విడిదికి కుటీరం బందోబస్తు చేసారు.
కుటీరం ముందు చలవ పందిరి భక్తులు రావడానికి క్యూ లైను, కమ్మరి అప్పలస్వామి చేత పెద్ద ఇనుప హుండీ తయారు చేయించి పందిరి కింద పెట్టారు.
ప్రయాణ బడలికలో ఉన్న స్వామి వారికి విశ్రాంతి అవసరమని శిష్యులు చెప్పగా చిదానంద స్వామి వారు కుటీరంలో కెళ్లారు.
అగ్రహారం గ్రామ పొలిమేరలో ఎవరో గొప్ప సాధువు వచ్చారని వారి దర్సనంతో వారిచ్చే మూలికలు తావీజులు మంత్రించి ఇచ్చిన పోగులతో ఎంత మొండి జబ్బులైనా నయమై పోతాయని చుట్టుపట్ల గ్రామాల్లో పాకింది.
తండోప తండోపాలుగా ప్రజలు నడిచి సైకిలు ఎడ్లబళ్ల మీద అగ్రహారం చేరుకుంటున్నారు. జన సందోహం పెరిగింది. భక్తులు బాబా దర్సనానికి వరుసలు కట్టేరు. తాత్కాలికంగా సైకిల్ పంక్చర్ షాపులు టీ బడ్డీలు కిళ్లీ షాపులు ప్రారంభమయాయి.
బాబా దర్సనాని కొచ్చే సందర్సకులు వరుసలు కట్టి దర్శనం చేసి డబ్బులు లేకుండా వారిచ్చే ఆయుర్వేద మందులు మంత్రించిన పోగులు తావీజులతో సంతృప్తి చెంది పందిర్లో
ఉన్న అన్నదాన హుండీలో కరెన్సీ నోట్లు వేస్తున్నారు.
*
ఇలా వెనుక బడిన గ్రామీణ ప్రాంతాల్ని ఎన్నుకుని వారి అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని అక్కడవసతి ఏర్పాటు చేసుకుని అన్నదాన విరాళాల రూపంలో డబ్బు సంపాదించి ఏ పెద్ద పట్నంలోనో విలాస జీవితం గడిపి డబ్బు అయిపోగానే మళ్లా బాబా అవతారమెత్తి దేశ యాటనకు బయలుదేరుతారు దేవుడి శిష్య బృందం.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Bình luận