లోగుట్టు పెరుమాళ్లు కెరుక
#లోగుట్టు పెరుమాళ్లు కెరుక, #LoguttuPerumalluKeruka, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నైతికకథలు

Loguttu Perumallu Keruka - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 01/05/2025
లోగుట్టు పెరుమాళ్లు కెరుక - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పూర్వకాలంలో పెరుమాళ్లు అనే భక్తుడు ఉండేవాడు. అతను ఊరూరా తిరిగి, దేవుడి మహిమలనుగురించి కథలు చెబుతూ వుండటం, ప్రజలకు వేదాంతం బోధిస్తూ వుండటం పనిగా పెట్టుకున్నాడు. అతను గొప్పభక్తుడని అందరూ నమ్మేందుకు తగినట్టుగా పెరుమాళ్లు గెడ్డం పెంచి, కావి గుడ్డ లు కట్టుకునేవాడు. రుద్రాక్షమాలలూ అవ్వీ వేసుకొనేవాడు. ఊరూరా తిరిగి ఉపన్యసించేవాడు.
"అన్నలారా, అక్కలారా, తల్లులారా, తండ్రులారా! ఎల్లప్పుడూ సత్యమే పలకండి. ఎవళ్ళనూ మోసంచేయకండి. పుణ్యకార్యాలు చేసి తరించండి. నీ సొము నా సొమ్ము అనే భేదబుద్ధి పెట్టుకోకండి. కర్మ, అనగా పని చేయటమే మన వంతు. ఫలం పెరుమాళ్లకే వదిలివేయండి. దానధర్మాలు విరివిగా చేయండి. ఇదే మానవులకు ముక్తిమార్గం..” అని యీ విధంగా పెరుమాళ్లుస్వామి ఉపన్యాసం ఇస్తూవుంటే, విన్నవాళ్లకు వళ్లు జలదరిం చేది. 'ఈ లోకమెందుకు, ఈ సంసార మెందుకు?' అని వాళ్లకు వైరాగ్యం కలిగేది. అందుచేత అనేకమంది వెంటనే ఆయనకు శిష్యులైపోయేవారు.
శిష్యులు ఎక్కువగా చేరి, వాళ్లకు తన మీద బాగా భక్తి కుదిరిన తరువాత అతను పూజలకూ, అభిషేకాలకూ, ఆరాధనలకూ డబ్బు తెమ్మనేవాడు. ఇలా వసూలయిన ధనంతో పిట్టకయినా తెలియకుండా ఒక బరువయిన బంగారు విగ్రహం చేయించి దాచుకొన్నాడు. పెరుమాళ్లు వేసే పై వేషం చూచి, శిష్యులంతా 'స్వామివారు నిజంగా మహాను భావుడు, ఈ ప్రపంచంలో ఆయనకు ఏమి కావాలె? ఇటువంటి సద్గురువు దొరకటం మన పూర్వపుణ్య విశేషం' అని వాళ్ళలో వాళ్లు ఆనందించేవారు.
త్వరలోనే స్వామివారి కీర్తి కుగ్రామాలకు కుడా పాకిపోయింది. ఎక్కడపడితే అక్కడనే యెంతోమంది ధనవంతులు ఆయన శిష్యులుగా చేరి ముక్తిమార్గంకోసం ఆశ్రయించేవారు.
అందరూ, 'మా ఇంటికి రండి' అంటే 'మా యింటికి రండి' అని పోటీలుపడి గురువుగారిని భిక్షకు పిలిచే వారు. ఎవళ్లమటుకి వాళ్లకే ముందుగా మోక్షమార్గం తెలుసుకోవాలని కోరిక. ఆ పోటీలో ఏ ఒక్క శిష్యుణ్ని కాదనటానికి స్వామి మనస్సొ ప్పేదికాదు. ఐతే, అందరి ఇళ్ళకూ వెళ్లి శిష్యులందరినీ సంతోష పెట్టడానికి ఆయనకు కాలం చాలేది కాదు.
అయినా, పెరుమాళ్లుస్వామి ఎన్నో గ్రామాలు తిరిగారు. ఎంతోమంది శిష్యుల దగ్గర వంతుల ప్రకారం భిక్షలు ఆరగిం చారు. వాళ్లను సంతోష పెట్టి, ముక్తిమార్గం చూపించారు.
చివరకు ఒకనాడు, స్వామికి భిక్ష చేయటం ఒక పేదశిష్యుని వంతు వచ్చింది. స్వామివారు వస్తాననటమే చాలు, గిన్నే ముంతా తాకట్టు పెట్టయినా సరే చేయాలిసిందే కాని, 'నావల్ల కాదు' అనటం సిగ్గుచేటు, పైగా పాపం చుట్టుకుంటుంది- అని ఆ శిష్యుడూ, అతని భార్యా నిశ్చ యించుకొన్నారు.
అనుకున్నట్టుగా భిక్షజరిగింది. "శిష్యా ! అనేకచోట్ల భిక్ష జరిగింది. కాని, నీ మోస్త రుగా ఎవళ్ళూ చేయలేకపోయారు. కాని, నీవు పేదవాడివని విన్నామే? ఇంతచక్కగా ఎలా చేశావో?" అన్నారు స్వామి.
దానికి బదులుగా "స్వామీ! అంతా పెరు మాళ్ళుకెరుక!!” అని మాత్రం శిష్యుడు. జవాబు చెప్పి వూరుకొన్నాడు.
'సరి, మనంబోధించిన వేదాంతం వీడికి బాగా తల కెక్కింది ' అని స్వామి మన స్సులో సంతోషించాడు. " శిష్యా! నీ గురు భక్తికి మా ఆత్మ చాలా ఆనందించింది. మరి నాలుగురోజులు యిక్కడనే వుండి, నిన్ను తరింపజేసి మరీ వెళతాము ” అని స్వామి సెలవిచ్చారు.
'ఈ పేదవాడిమీద నేమిటి, స్వామికి యింత అభిమానం కుదరట మేమిటి? ఇందులో ఏదో విశేషం ఉండితీరాలి' అని ధనవంతులైన తక్కిన శిష్యులు అందరూ ఆశ్చర్యపోయారు.
అయితే, స్వామియిచ్చిన ఆజ్ఞకు ఈ పేద శిష్యుడికి మాత్రం గుండెలో రాయి పడింది. మొదటిరోజు భిక్షకే, ముంతా మూకుడూ తాకట్టుపెట్టవలసి వచ్చె. ఇంకా నాలుగురోజు లుంటానంటున్నాడు స్వామి. ఏం చేయాలి ? -
పేదశిష్యుడు ధైర్యంతో స్వామి ఆజ్ఞను శిరసావహించాడు. ఉపన్యాసంలో చెప్పిన స్వామివారి బోధలన్నీ ఈ శిష్యునికి బాగా జ్ఞాపకమున్నాయి."నీదీ నాదీ అనే భేదబుద్ధి పనికిరాదు. కర్మ, అనగా పనిచేయటమే మనవంతు. ఫలం పెరుమాళ్లుకే వదిలే యండి..." అని చెప్పిన మాటలు మనస్సులో గుర్తు వుంచుకున్నాడు. పేదశిష్యుని యింట్లో పెరుమాళ్లుస్వామికి నాలుగురోజులూ చాలా గొప్పగా భిక్ష జరిగింది. స్వామి శిష్యునిభక్తికి మెచ్చుకొని, ఎక్కువగా దీవించాడు. అయితే, స్వామికి ఏదో సందేహం కలిగినట్టు కనపడేవాడు.
ప్రతిరోజునా, శి ష్యుణ్ని దగ్గరికి పిలిచి, "శిష్యా, నీవు పేదవాడివని విన్నామే? ఇంత వైభవంగా ఎలా భిక్షచేయగలుగు తున్నావు?” అని ఆశ్చర్యంతో అడిగేవాడు.
అలా అడిగినప్పుడల్లా శిష్యుడు "స్వామీ, అంతా పెరుమాళ్లు కెరుక!” అని మాత్రం సమాధానం చెప్పి వూరుకొనేవాడు.
అయిదు రోజులూ అయిన తరవాత స్వామివారు మరొక గ్రామానికి మకాం మారుద్దామని ఏర్పాటు చేసుకొన్నారు. వెళ్లే ముందు పేదవాడైన ప్రియశిష్యుణ్ని బాగా దీవించి, ముక్తిమార్గానికి కావలసిన మర్మాలు అన్నీ చెప్పారు. శిష్యుడు మళ్లీ ఒక్కసారి "స్వామీ, అంతా పెరుమాళ్ళు కెరుక!” అని చెప్పి గురువు గారివద్ద సెలవు తీసుకొన్నాడు.
స్వామివారు కొత్త మకాం చేరుకునే లోపల రహస్యంగా ఒకసారి విగ్రహంతీసి చూచుకొన్నాడు. చూచేసరికి ఏమున్నది!- అరవీసె బంగారపు విగ్రహమూ అయిదు తులాల బరువయినా లేదు, లోపలంతా గుల్లయిపోయి వుంది!!
పెరుమాళ్ళు పేదశిష్యుణ్ని మనస్సులో తలుచుకొని " శిష్యా! లక్షలాది జనానికి వేదాంతంబోధించాను. కాని నేను తరించే మార్గం కనుక్కోలేకపోయాను. ఈ నాటికి నువ్వు బయలుదేరి నా కళ్ళకు పట్టిన మాయ పొర తుడిచివేశానోయ్ ! " అని అంటూ, కుప్పగా కూలబడిపోయాడు.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.





Comments