అత్యంత విలువైనది
- Srinivasarao Jeedigunta

- 5 hours ago
- 4 min read

Athyantha Viluvainadi - Telugu Inspirational Story | Jeedigunta Srinivasa Rao
అత్యంత విలువైనది - తెలుగు ప్రేరణాత్మక కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 30/04/2026
“నా వయసు 70… ఇంకా తల్లిదండ్రులను పోషిస్తున్నాను”
ఈ మాటలు ఎంత ప్రభావం కలిగించాయో శ్రీనివాసరావు జీడిగుంట గారి అత్యంత విలువైనది కథలో తెలుసుకోండి.
సాయంత్రం అలా నాంపల్లి వెళ్లి ఫర్నిచర్ షాపులో కుర్చీలు చూసి, ‘రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీనికంటే మా ఎర్రగడ్డలోనే చౌక’ అనుకుంటూ, ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు శ్రీరామ్. ఓలా ఆటో బుక్ చేసి ఐదు నిమిషాలలో వస్తుంది అని తెలిసి, చెరుకు బండి వాడి దగ్గర స్టూల్ మీద కూర్చుని, ఒక గ్లాసు షుగర్ కేన్ జ్యూస్ ఇమ్మన్నాడు.
ఇంతలో ఓలా డ్రైవర్ నుంచి ఫోన్. "సార్, ఆటో బుక్ చేశారు కదా. ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకండి, మీరు ఎక్కడికి వెళ్లాలి?" అన్నాడు.
"మీతో వచ్చిన తలనొప్పి ఇదే! ఎక్కడికి వెళ్లాలో చెప్తే గానీ రావా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటీపీ నంబర్‌లో తెలుస్తుందిగా ఎక్కడికి వెళ్లాలో. త్వరగా రా!" అన్నాడు శ్రీరామ్.
"సార్, నా వయసు డెబ్భై ఏళ్లు. నేను నాంపల్లిలోనే తిరుగుతూ ఉంటాను. ఎక్కువ దూరం సవారీ ఒప్పుకోను. నా వయసు రీత్యా వాళ్లని సరిగ్గా తీసుకుని వెళ్లలేకపోతే, వాళ్ల ప్రాణానికీ, నా ప్రాణానికీ ప్రమాదం ఎందుకు? అని ముందే ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుంటాను. అంతే సార్," అన్నాడు.
డెబ్భై ఏళ్లు అని వినగానే, శాంతంగా "మరి ఎందుకు ఈ వయసులో ఆటో నడపడం? నాంపల్లిలోనే నడుపుతా అంటే ఎలా?" అని అడిగాడు శ్రీరామ్.
"నిజమే సార్. ఈ వయసు ఇంట్లో విశ్రాంతిగా ఉండేది. అయితే నేను నా తల్లిదండ్రులను, భార్యను పోషించాలి. అందుకే కష్టపడుతున్నాను," అన్నాడు. మాట తీరు చూస్తే ముస్లింలా ఉన్నాడు అనిపించి, "మీకే డెబ్భై అంటే, మీ తల్లిదండ్రులు ఉన్నారు అంటే నమ్మలేకపోతున్నాను," అన్నాడు షుగర్ కేన్ జ్యూస్ తాగుతూ.
"నా అదృష్టం సార్, నన్ను కన్న తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం. మీరు నాతో చాలా సేపు మాట్లాడారు. కృతజ్ఞతలు మీకు. నేను మిమ్మల్ని ఎర్రగడ్డ దాకా తీసుకొని వెళ్లలేను. మీరు వేరే ఆటో బుక్ చేసుకోండి," అనడంతో "సరే, మీ బుకింగ్ కాన్సిల్ చేసి వేరే బుక్ చేసుకుంటాను," అన్నాడు శ్రీరామ్.
బుక్ చేసిన పది నిమిషాలకు ఓలా డ్రైవర్ నుంచి ఫోన్. అతని కంఠం వినగానే, "అరె! మళ్ళీ ఇందాకటి డ్రైవర్ లైన్‌లో ఉన్నాడే!" అనుకుని, "మళ్ళీ మీకే బుకింగ్ వచ్చిందా? మీరు తప్ప ఓలా వాళ్లకు ఆటో డ్రైవర్లు లేరా?" అన్నాడు.
"ఈ రోజు రంజాన్ పండుగ. సార్! మా వాళ్ళు ఆటోలు నడపరు. అందుకే మళ్ళీ నాకే, మీ బుకింగ్ వచ్చింది. సరే, మీ దగ్గరికి వస్తాను. నేనే మెల్లగా డ్రైవింగ్ చేసి, తీసుకొని వెళ్తాను. మీకు కంగారు లేదంటే," అన్నాడు.
"రండి, పరవాలేదు," అని పక్కనే ఉన్న షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని ఆటో కోసం చూస్తున్నాడు శ్రీరామ్.
శ్రీరామ్ ఎదురుచూస్తుండగానే ఆటో వచ్చి ఆగింది. తెల్లని గడ్డం, ముడతలు పడిన ముఖం, కానీ కళ్లలో ఒక రకమైన ప్రశాంతత. అతనే ఆ 70 ఏళ్ల వృద్ధుడు. శ్రీరామ్ ఆటో ఎక్కగానే, ఆయన చాలా మెల్లగా, జాగ్రత్తగా ఆటోను రోడ్డు మీదకు తీశారు.
దారిలో శ్రీరామ్ అడిగాడు, "చాచా, ఈ వయసులో తల్లిదండ్రులను సాకడం అంటే మామూలు విషయం కాదు. వాళ్లకి ఎన్ని ఏళ్లు ఉంటాయి?"
ఆయన నవ్వుతూ, "అల్లా దయ వల్ల మా అమ్మకు 90, నాన్నకు 95 ఏళ్లు సార్. భార్యకు ఒంట్లో బాగుండదు. పిల్లలు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఉన్నంతలో ఈ ముగ్గురినీ గౌరవంగా చూసుకోవడమే నా పండుగ," అన్నారు.
ఆ మాటలు శ్రీరామ్ మనసును కలిచివేశాయి. నాంపల్లిలో ఫర్నిచర్ ధరలు ఎక్కువ అని కక్కుర్తిపడ్డ తను, ఎదురుగా జీవిత పోరాటాన్ని ఇంత నిలకడగా సాగిస్తున్న మనిషిని చూసి ఆశ్చర్యపోయాడు.
ఎర్రగడ్డ చేరుకోగానే మీటర్ మీద 180 రూపాయలు అయింది. శ్రీరామ్ ఆటో దిగి, తన దగ్గరున్న 500 రూపాయల నోటును ఆయన చేతిలో పెట్టాడు. ఆయన చిల్లర తీయబోతుంటే, శ్రీరామ్ 'వద్దు' అన్నట్టుగా చేయి అడ్డుపెట్టాడు.
"వద్దు చాచా, ఉంచుకోండి! ఇది మీ కష్టానికి కాదు... మీలోని ఆ గొప్ప సంస్కారానికి నా చిన్న కానుక. మీ ఇంట్లో వాళ్లకు స్వీట్లు తీసుకువెళ్లండి. ఇందాక కొన్న బిస్కెట్ ప్యాకెట్ కూడా మీ కోసమే, తీసుకోండి," అని ప్రేమగా అందించాడు.
ఆ వృద్ధుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. "చాలా ధన్యవాదాలు సార్! ఈ రోజు రంజాన్ పండుగ పూట ఒక మంచి మనిషిని కలిశాను," అంటూ దీవించి వెళ్లిపోయారు.
శ్రీరామ్ ఇంటి వైపు నడుస్తుండగా, అతని మనసులో నాంపల్లి ఫర్నిచర్ ధరల గురించిన ఆలోచన లేదు. యాక్సిడెంట్‌లో చనిపోయిన తల్లిదండ్రులే కనిపిస్తున్నారు. కళ్లలో నుంచి నీరు ఆగకుండా వస్తోంది.
కళ్ళు తుడుచుకుంటూ వచ్చిన భర్తను చూసిన శ్రీరామ్ భార్య కంగారుగా "ఏమైంది అండీ? ఒంట్లో బాగాలేదా?" అంటూ చెయ్యి పట్టుకుని చూసింది.
"మనసు బాగోలేదు. ఇన్నాళ్లు చనిపోయిన తల్లిదండ్రుల తిథి నాడు గుర్తు చేసుకుని, గుడి దగ్గర కూర్చుని ఆడుకుంటున్నవాళ్లకు పది రూపాయలు వేసి బాధ్యత అయిపోయింది అనుకున్నాను. బ్రతికి ఉండగా తల్లిదండ్రులను బాగా చూసుకుంటే చాలు, పోయిన తర్వాత వారి పేరు మీద డబ్బులు ఖర్చు అనవసరం అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు జరిగిన అనుభవం, తల్లిదండ్రుల సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతం అని తెలిసింది," అంటూ భార్యకు ఆటో అతని గురించి చెప్పాడు.
"నేను అత్తమామలు పోయిన దగ్గర నుంచి మీకు ఆచారం ప్రకారం చేయవలసిన క్రియలు చేయాలని చెప్పినా, నాస్తిక పుస్తకాల ప్రభావంతో ఉన్నారు. చివరికి మా అమ్మ తిథి గురించి కూడా అనవసర ఖర్చు అని మా తమ్ముడిని ఆక్షేపించేవారు," అంది.
"నెత్తిన కళ్లు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. ఈ రోజు ఒక ముసలి తన తల్లిదండ్రులను కళ్లలో పెట్టుకొని చూసుకుంటూ నాకు గుణపాఠం నేర్పించాడు.
ఇక నుంచి మా తల్లిదండ్రుల తిథి శాస్త్రోక్తంగా చేస్తాను. అంతేకాదు, ఎంతోమంది దిక్కులేని తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉన్నారు. వాళ్లకు ప్రతి నెలా చేతనైన సేవ చేస్తాను," అన్నాడు తల్లిదండ్రుల ఫొటో దగ్గర నిలబడి.
"అవును, మనం మన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటే, మనం తల్లిదండ్రులం అయ్యాం కాబట్టి మన పిల్లల ప్రేమ మనకు దొరుకుతుంది. మనల్ని బట్టే పిల్లలు మంచి చెడు నేర్చుకుంటారు," అంది శ్రీరామ్ భార్య.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










Comments