top of page
Original.png

అమ్మ కోసం ఆగిన రైలు

Mother Emotional Story Telugu, Telugu Moral Stories, Railway Station Story Telugu

అమ్మ కోసం ఆగిన రైలు
అమ్మ కోసం ఆగిన రైలు

Amma Kosam Agina Railu - Telugu Inspirational Story | Jeedigunta Srinivasa Rao

అమ్మ కోసం ఆగిన రైలు - తెలుగు ప్రేరణాత్మక కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 25/05/2026

“టికెట్ తెస్తానన్న కొడుకు… తిరిగి రాలేదు!” 

శ్రీనివాసరావు జీడిగుంట గారి అమ్మ కోసం ఆగిన రైలు కథను చదవండి. ​

అది 'మల్లెటూర్' అనే ఒక చిన్న రైల్వే స్టేషన్. రోజూ  కొన్ని రైళ్లు క్రాసింగ్ కోసం అక్కడ ఆగి వెళ్తూవుంటాయి. ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కువ ఆగడం, చిన్న స్టేషన్ అవడంతో కాఫీ, టీ లాంటి అమ్మకాలు కూడా జరిగేవి కావు.


స్టేషన్ ఊరికి దూరంగా ఉండటంతో, ఆ స్టేషన్ కి స్టేషన్ మాస్టర్ గా వచ్చిన కరుణాకర్ తన ఫ్యామిలీని పట్టణంలోనే ఉంచి, తను ఒక్కడు స్టేషన్లోనే ఉంటూ, టైం దొరికినప్పుడు తనే వంట చేసుకుని, అక్కడే పనిచేస్తున్న హెల్పర్‌ రమణకి కూడా భోజనం పెట్టేవాడు. వాళ్లిద్దరూ ఒకరికి ఒకరు తోడు.


స్టేషన్ శుభ్రపరచడానికి ఒక స్వీపర్ కావాలని పై అధికారులను ఎన్నిసార్లు అడిగినా, "మీ స్టేషన్ వల్ల గవర్నమెంట్‌కి ఏమీ ఇన్‌కమ్ లేదు. అందుచేత మీ దగ్గర ఉన్న హెల్పర్‌తో స్టేషన్ శుభ్రపరుచుకోండి" అని సమాధానం వచ్చేది. 


మరి ఇన్‌కమ్ లేని ఈ స్టేషన్ ఇంక ఎందుకు ఉంచారో తెలియక, "అంతా మన ఖర్మ" అనుకునేవాళ్లు కరుణాకర్, రమణ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ.


ఒకరో ఇద్దరో ఊరినుంచి వచ్చి ఏదో ఒక ట్రైన్ ఎక్కి వెళ్లడం తప్ప, బెంచీలు అన్నీ ఖాళీగా కనిపిస్తూ వుంటాయి.

ఉదయం వచ్చిన పాసెంజర్ ట్రైన్ నుంచి ఒక పెద్దావిడ, ఆవిడ కొడుకు అనుకుంటా, రైలు దిగి ప్లాట్‌ఫారం మీద ఉన్న బెంచి మీద కూర్చుని ఉన్నారు.


వారిద్దరినీ చూసిన స్టేషన్ మాస్టర్, "వీళ్ళు రైలు దిగి ఇక్కడే ఎందుకు కూర్చొని ఉన్నారు?" అనుకుని, వారి దగ్గరికి వెళ్లి "మీ టికెట్స్ ఏవి?" అని అడిగాడు.


ఆ కుర్రాడు తన మాసిపోయిన ప్యాంటులో నుంచి రెండు టికెట్స్ తీసి చూపించాడు. టికెట్స్ చూసిన కరుణాకర్ "ఈ ఊరేనా మీది?" అన్నాడు. 


"కాదు సార్, మేము బెంగళూరు వెళ్లే పాసెంజర్ ఎక్కాలి," అన్నాడు ఆ కుర్రాడు. 


"అయితే వచ్చి టికెట్స్ తీసుకోండి," అని చెప్పి కరుణాకర్ సిగ్నల్ కోసం ఆగివున్న ట్రైన్‌కి సిగ్నల్ ఇవ్వడం కోసం తన గదిలోకి వెళ్ళాడు.


​"అమ్మా, ఇక్కడే కూర్చో. సిటీకి వెళ్లడానికి టికెట్లు తెస్తాను," అని చెప్పి వెళ్లిన సీతమ్మ కొడుకు వెంకట్ సాయంత్రం అవుతున్నా తిరిగి రాలేదు. 


చీకటి పడుతోంది. స్టేషన్ మాస్టర్ కరుణాకర్ గారు టీ గ్లాసుతో తన గదినుంచి బయటకు వచ్చాడు. "అరే, ఏమిటి ఈ పెద్దావిడ ఇంక ఇక్కడే ఉంది? ఆ అబ్బాయి ఎక్కడకి వెళ్ళాడు?" అనుకుంటూ సీతమ్మ కూర్చుని ఉన్న బెంచి దగ్గరికి వెళ్లి, 


​"ఎవరమ్మా మీరు? ఇంకా ఇక్కడే ఉన్నారు?" అని అడిగాడు. 


ఆవిడ అమాయకంగా, "మా వాడు టికెట్ కోసం వెళ్ళాడు బాబు, వస్తాడు," అంది. 


కానీ ఆమె చేతిలో ఉన్న ఒక చిన్న సంచి తప్ప ఏమీ లేవు. కరుణాకర్ కి విషయం అర్థమైపోయింది. కొడుకు ఆమెను వదిలించుకున్నాడని గ్రహించిన ఆయన మనసు ద్రవించింది. చేతిలో ఉన్న టీ గ్లాస్ ఆమెకు ఇచ్చి, "మీ అబ్బాయి వచ్చేలోపు ఈ టీ తాగండి. ఉదయం నుంచి అలానే ఉన్నారు," అన్నాడు.


"వద్దు సార్, మా అబ్బాయి నాకోసం ఏదైనా తెస్తాడు. ఇద్దరం కలిసి తింటాం. వెర్రికుంక.. టికెట్ కోసం లైన్లో ఇంతసేపు నుంచున్నాడు అనుకుంటా," అంది.


“అమ్మా, ఈ స్టేషన్లో టికెట్స్ నేనే ఇస్తాను. అన్నీ నేనే. ఈ స్టేషన్‌కి స్టేషన్ మాస్టర్‌ని. మీ అబ్బాయి ఊర్లోకి వెళ్లాడేమో. నేను మీ అబ్బాయి లాంటి వాడినే. ముందు ఈ టీ తాగండి, నీరసంగా కనిపిస్తున్నారు," అన్నాడు.

చీకటి పడుతున్న కొద్దీ కొడుకు రాకపోవడంతో తన పరిస్థితి అర్థం అయింది సీతమ్మకి. "తనని తనే పోషించుకోలేని కొడుకు, తల్లిని నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు," అనుకుంది.


"ఉన్న ఊరిలో కూలీకి వెళ్లి నాలుగు రూపాయలు తెచ్చేవాడు. ఈ మధ్య పని దొరకడం లేదు అని ఇంట్లోనే ఉంటున్నాడు. అటువంటిది ఎక్కడికి వెళ్లాలి అనుకున్నాడో ఏమో, ఇలా వాడు నన్ను ఈ ఊరిలో వదిలేసి వెళ్లిపోయాడో," అనుకుంటూ మెల్లగా నడుచుకుంటూ స్టేషన్ మాస్టర్ ఉన్న గది దగ్గరికి వెళ్ళింది.


స్టవ్ మీద ఉప్మా చేసుకుంటున్న కరుణాకర్ కి, తన వెనుక ఎవరో నిలబడి ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగాడు.


"మీ అబ్బాయి వచ్చాడా అమ్మా?" అన్నాడు సీతమ్మ గారిని చూసి. 


"వాడు నన్ను వదిలి చాలా దూరం వెళ్లినట్టున్నాడు. నాకు ఎవ్వరూ తెలియదు. మా ఊరు వెళ్లడానికి ఏ బండి ఎక్కాలో, అసలు నేను ఎందుకు బతకాలో తెలియడం లేదు," అంది ఏడుస్తూ. 


"అయ్యో పాపం, ఈ పెద్దావిడకి ఎంత కష్టం వచ్చింది. ఆ కొడుకు కూడా తల్లిని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అంటే, అతను ఎంతటి దీనావస్థలో ఉన్నాడో," అనుకుని, "మీ అబ్బాయి వచ్చే అంతవరకు ఈ స్టేషన్లో ఉండండి. మీకు ఒక చిన్న గది ఇస్తాను. రేపు మా హెల్పర్‌ని పంపించి ఒక వారం రోజులకి సరిపడే వంట సామాన్లు తెప్పించి ఇస్తాను. చూద్దాం, ఈలోపు మీ అబ్బాయి వస్తాడేమో," అన్నాడు.


"ఏమిటి బాబు వండుకుంటున్నావు? నువ్వు కూడా ఒంటరి వాడివేనా?" అంది.


"లేదమ్మా, నాకు అందరూ పట్నంలో ఉన్నారు. ఉద్యోగం ఈ అడవిలో అవ్వడంతో ఇక్కడ ఉంటున్నాను. మా అమ్మ వంట చేస్తూ ఉండగా చూసి నేర్చుకున్నాను. అలా కూర్చోండి, ఉప్మా చేస్తున్నాను తిందురు గాని," అన్నాడు.


"నువ్వు ఇలా రా నాయనా, ఆడదానిని నేను ఉండగా నువ్వు చెయ్యి కాల్చుకోవడం ఏమిటి?" అంటూ చనువుగా మాట్లాడింది. 


ట్రైన్ వచ్చే టైం అవడంతో సిగ్నల్ ఇవ్వడానికి వెళ్ళాడు కరుణాకర్.


గుంటూరు వెళ్లే పాసెంజర్ భారంగా వచ్చి స్టేషన్లో ఆగింది. "ఇక్కడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రాక కోసం ఈ పాసెంజర్ నాలాగే పడుండాలి," అనుకున్నాడు కరుణాకర్. తన గదిలోనుంచి గుప్పుమని సువాసన రావడంతో, "ఎంతైనా ఆడవాళ్ల వంట మహత్యం," అనుకుని సిగ్నల్‌ని గమనించమని హెల్పర్‌ రమణకి చెప్పి తన గదివైపు వెళ్ళాడు.


అప్పటికే నలుగురు పాసెంజర్స్ తన గది ముందు నిలబడి ఉండటం చూసి, "ఏం కావాలి? టికెట్స్ కి ఆ కిటికీ దగ్గరికి రండి," అన్నాడు. 


"టికెట్స్ కాదు సార్, టిఫిన్ అమ్ముతారా అని వచ్చాము. మా ప్రయాణం అర్ధరాత్రి వరకు ఉంది. ఏదైనా తినటానికి దొరుకుతుంది అని వంటల వాసనకి ఇటు వచ్చాము," అన్నాడు. వాళ్లలో ఒక ఆడకూతురు చిన్న పిల్లాడిని ఎత్తుకుని ఉంది.


"బాబు, ఈ స్టేషన్లో క్యాంటీన్ లేదు. ఆవిడ మా అమ్మగారు. మాకోసం వంట చేస్తోంది," అన్నాడు కరుణాకర్. 


"పిల్ల ఆకలితో ఏడుస్తోంది సార్." "సరే పదవే, నీళ్లు తాగిద్దువు గాని," అన్నాడు ఒకతను.


వాళ్ళని చూడగానే జాలివేసి లోపలికి వెళ్లి ఒక పేపర్ ముక్కలో ఒక గరిటెడు ఉప్మా వేసి తీసుకొని వచ్చి, పిల్లాడిని ఎత్తుకుని ఉన్న ఆమె చేతికి ఇచ్చి, "ఇది తినిపించు. పిల్లలతో ప్రయాణంలో ఏదైనా తినడానికి తెచ్చుకోవాలి కదా," అన్నాడు కరుణాకర్. 


గోడకి ఆనుకొని కూర్చుని అంతా గమనిస్తున్న సీతమ్మ, "బాబు, ఈ మూల నుంచి ఆ మూల వరకు స్టేషన్ ఉంది కదా. కొద్దిగా టీ, నీళ్లు, బిస్కట్స్ అమ్ముకునే ఏర్పాటు చేసివుంటే బాగుండేది కదా," అంది.


ఉప్మా నోట్లో వేసుకోగానే గతించిన తన తల్లి వంట గుర్తుకు వచ్చింది కరుణాకర్ కి. "ఉప్మా చాలా బాగుంది అమ్మా. మీరు కూడా తినండి," అన్నాడు సీతమ్మతో. 


"ముందు నువ్వు, నీ దగ్గర ఉన్న కుర్రాడు కడుపు నిండా తినండి. నాకు చివరిలో గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి, మరగబెట్టి పల్చగా చేసుకుంటాను. మీకు తెలుసో లేదో, ఉప్మా ఎప్పుడు కొద్దిగా పల్చగా ఉంటేనే రుచి," అంది.


మరుసటి రోజు నుండి సీతమ్మ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయడం మొదలుపెట్టింది. ప్లాట్‌ఫారమ్ పక్కన పిచ్చి మొక్కలు తీసేసి, రమణకి చెప్పి అందమైన పూల మొక్కలు నాటింది.


కరుణాకర్ సీతమ్మ గారితో అన్నాడు, "స్టేషన్ రూపం మార్చేసారు. మీకు శ్రమ అనుకోకపోతే చిన్న క్యాంటీన్ నడిపితే నాలుగు రూపాయలు మీకు మిగులుతాయి. పాసెంజర్స్ కి తినడానికి అలవాటు పడతారు. స్టేషన్ కళకళలాడుతూ ఉంటుంది," అన్నాడు.


కరుణాకర్ చూపించిన గదిలో కొన్ని రకాల పిండివంటలు, వేడి వేడి టీ చేసి ప్యాసింజర్ రైలు వచ్చే సమయంలో టేబుల్ మీద పెట్టుకుని ప్రయాణికులకు తక్కువ ధరకు అమ్మడం ప్రారంభించింది.


​ఆమె చేతి వంటలో 'అమ్మ ప్రేమ' ఉందో ఏమో.. మెల్లమెల్లగా ఆ స్టేషన్ కి ఒక గుర్తింపు రావడం మొదలైంది.

ఒక రోజు రైల్వే డివిజనల్ మేనేజర్ (DRM) స్పెషల్ ట్రైన్‌లో ఆ మార్గంలో వెళ్తూ, ఇంజిన్ సమస్య వల్ల మల్లెటూర్లో ఆగాల్సి వచ్చింది. ఆకలితో ఉన్న అధికారులకు కరుణాకర్ సీతమ్మ గారితో చెప్పి పూరీ కూర, ఉప్మా, అల్లం టీ చేయించి డివిజనల్ మేనేజర్ గారికి, ఆయనతో వచ్చిన ఇద్దరు ఆఫీసర్‌‌స్‌కి పెట్టాడు. ఆ రుచికి, ఆమె చూపే ఆదరణకు వారు ముగ్ధులయ్యారు.


కరుణాకర్ సీతమ్మ కథను అధికారులకు వివరించారు. ఆమె ఒంటరిగా ఆ స్టేషన్‌ను ఎలా నందనవనంలా మార్చిందో చూపించారు. అధికారులు ఆశ్చర్యపోయారు. "ఒక సామాన్య మహిళ ఇంత నిబద్ధతతో పనిచేస్తుంటే, వ్యవస్థ ఎందుకు సహకరించకూడదు?" అని ఆలోచించారు.

మల్లెటూర్ స్టేషన్‌ను 'ఆదర్శ గ్రామీణ స్టేషన్'గా గుర్తించారు.

సీతమ్మ వంటకాలకు ప్రత్యేకంగా ఒక 'అమ్మా క్యాంటీన్' కేటాయించారు. టీవీలో న్యూస్ కవర్ అవ్వడంతో ప్రయాణికులు 'అమ్మా క్యాంటీన్‌లో తినాలి' అనే కోరికతో మల్లెటూర్ స్టేషన్లో దిగి, తృప్తిగా తినేవాళ్లు.

ప్రయాణికుల రద్దీ పెరగడంతో, అక్కడ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఆగాలని ఆర్డర్స్ వచ్చాయి.

కొన్ని ఏళ్ల తర్వాత.. మల్లెటూర్ ఇప్పుడు ఒక మేజర్ జంక్షన్ లా మారిపోయింది. సీతమ్మ ఇప్పుడు కేవలం ఒక వృద్ధురాలు కాదు, ఆ స్టేషన్‌కు ఆత్మ. ఎంతో మంది అనాథ మహిళలకు ఆమె ఉపాధి కల్పిస్తోంది.

ఒక రోజు, బాగా చితికిపోయిన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి ఆ ప్లాట్‌ఫారమ్ మీద దిగాడు. అతడు మరెవరో కాదు, తనను వదిలేసి బతకడం కోసం ఎడారి దేశంకి వెళ్లి, వాళ్ళ చేతిలో నానా కష్టాలు పడి రోడ్డున పడ్డాడు. ప్రభుత్వం సహాయంతో కొంతమంది జనంతో తను కూడా స్వంత దేశం చేరుకున్నాడు. 


తన తల్లి చేతిలో ఉన్న విద్యతో మల్లెటూర్లో ఎక్కడో అక్కడ ఉండేవుంటుంది అని స్టేషన్లో దిగి, తన తల్లిని వదిలేసిన బెంచి వైపు నడిచాడు.


విచిత్రం! ఒక టేబుల్ మీద రకరకాల తిండి వస్తువులు పెట్టుకుని, చుట్టూ జనంతో ఉన్న తల్లిని ఆశ్చర్యంతో తల్లి దగ్గరికి వెళ్లి "అమ్మా!" అన్నాడు.


సీతమ్మ అతడిని చూసింది. చింపిరి జుట్టు, నలిగిపోయిన బట్టలతో నీరసంగా కనిపించిన కొడుకుని గుర్తించి, ఆవిడలోని తల్లి హృదయం ద్రవించి, "నువ్వు టికెట్ తెస్తానని వెళ్లి చాలా సేపు అయిందిరా నాయనా. ఏమైనా తిన్నావో లేదో," అంటూ పేపర్ ప్లేట్‌లో నాలుగు పూరీలు, కూర వేసి కొడుక్కి అందించింది, కళ్లల్లో నీళ్లతో.


ఇంతలో అక్కడికి వచ్చిన కరుణాకర్ సంగతి తెలుసుకుని, "ఒకరు కలవడం, ఒకరు విడిపోవడం అంటే ఇదే అనుకుంటా. నాకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఈ నెలాఖరుకి వెళ్ళిపోవాలి," అన్నాడు.


“అబ్బాయి, నువ్వు కూడా మీ అమ్మగారికి సహాయంగా ఉండి ఈ స్టేషన్‌ని మీ సొంత ఇల్లు చూసుకున్నట్టు చూసుకోండి. కొత్తగా వచ్చే స్టేషన్ మాస్టర్ గారికి మీ విషయం చెప్పి మరీ పంపిస్తున్నారు పై ఆఫీసర్స్. నాకు నా కుటుంబంతో కలిసి ఉండటానికి అవకాశం వచ్చింది," అన్నాడు.


"ఇప్పుడు, తింటే మల్లెటూర్ స్టేషన్లో భోజనం తినాలి" అని పేరు పడింది.


జీవితంలో దెబ్బ తిన్నప్పుడు చేయూత ఇచ్చేవాళ్లు ఉంటే ఎన్నో జీవితాలు బాగుపడతాయి కదా.


శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):






జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page