top of page
Original.png

గాంధీ సత్రం లెక్కల మాస్టారు

గాంధీ సత్రం లెక్కల మాస్టారు, తెలుగు గురువు కథ, స్ఫూర్తిదాయక కథ, తెలుగు విద్యా కథ, గురువు గొప్పతనం, విద్యార్థి విజయం, రౌతు శ్రీనివాసరావు, తెలుగు జ్ఞాపకాలు, తెలుగు కథలు, Mana Telugu Kathalu

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'గాంధీ సత్రం లెక్కల మాస్టారు' కథలో పల్లెటూరి పాఠశాలలో లెక్కల మాస్టారు ఒక చిన్న విద్యార్థిని ప్రోత్సహిస్తున్న దృశ్యం, గురువు మార్గదర్శకత్వంతో విజయవంతమైన జీవితాన్ని సూచించే 'గాంధీ సత్రం లెక్కల మాస్టారు' కథ చిత్రం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ 'గాంధీ సత్రం లెక్కల మాస్టారు' కథలో పల్లెటూరి పాఠశాలలో లెక్కల మాస్టారు ఒక చిన్న విద్యార్థిని ప్రోత్సహిస్తున్న దృశ్యం, గురువు మార్గదర్శకత్వంతో విజయవంతమైన జీవితాన్ని సూచించే 'గాంధీ సత్రం లెక్కల మాస్టారు' కథ చిత్రం.

Gandhi Sathram Lekkala Mastaru - Telugu Emotional Story | Routhu Srinivasa rao

గాంధీ సత్రం లెక్కల మాస్టారు తెలుగు భావోద్వేగ కథ | రౌతు శ్రీనివాసరావు

Publishes in manatelugukathalu.com on 12/07/2026


జీవితంలో కొన్ని విజయాలు మన ప్రతిభ వల్ల వస్తాయి. కానీ కొన్ని విజయాలకు కారణం మనపై నమ్మకం ఉంచిన ఒక గురువు. చిన్న పల్లెటూరిలో సాధారణ విద్యార్థిగా ప్రారంభమైన ప్రయాణం, గురువుల మార్గదర్శకత్వంతో ఎలా జీవితాన్ని మార్చిందో ఎంతో ఆత్మీయంగా చెబుతుంది "గాంధీ సత్రం లెక్కల మాస్టారు". బాల్య జ్ఞాపకాలు, విద్య విలువ, గురు-శిష్య బంధం, అనుభవాల సారం కలిసిన ఈ కథ ప్రతి పాఠకుడి హృదయాన్ని తాకుతుంది.


ఈ రోజు కూడా మామూలుగానే సాయంత్రం ఆఫీసు పని ముగించుకొని నెమ్మదిగా గోశాల వైపు చేరుకున్నాను. ఇంట్లో మా శ్రీమతికి ఈ రోజు రావడం కుదరలేదు. నేను మాత్రం ఎప్పటిలాగే నాకు ఎంతో ఇష్టమైన ఆ స్థలంలో కూర్చున్నాను. చల్లని గాలి ముఖాన్ని తాకుతోంది. ఎదురుగా కొండపై వెలసిన అప్పన్న స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేశాను. 


పది నిమిషాలు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా కూర్చున్నాను. కానీ ప్రకృతికి ఒక విచిత్రమైన శక్తి ఉంది. మనం మరచిపోయిన జ్ఞాపకాలను కూడా నెమ్మదిగా మన ముందుకు తీసుకొస్తుంది. అలా నా బాల్యం కళ్లముందు నిలిచింది.


మాది ఆంధ్రప్రదేశ్ చివరనున్న ఒక చిన్న పల్లెటూరు. మామిడి తోటలు, పచ్చని పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, అమాయకమైన మనుషులు. ఉదయం లేచి యూనిఫాం వేసుకొని బడికి వెళ్లడం... ఇంటికి వచ్చాక బ్యాగును ఒక మూల విసిరేసి సాయంత్రం వరకు ఆడుకోవడం... తర్వాత స్నానం చేసి ఎర్రబల్బు వెలుతురులో చదువుకోవడం. 


అప్పట్లో కరెంట్ కూడా సరిగా ఉండేది కాదు. ఒకే దీపం చుట్టూ నలుగురం కూర్చుని చదివేవాళ్లం. ఒకడు బిగ్గరగా చదివితే, ఇంకొకడు రాసుకునేవాడు. పుస్తకాల కంటే జీవితమే మాకు ఎక్కువ పాఠాలు చెప్పింది.


ఇప్పటి పిల్లల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఏసీ బస్సులు, ఏసీ తరగతి గదులు, స్మార్ట్ బోర్డులు, Audio/Video పద్ధతిలో బోధన... అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం కొరవడుతోంది. అదే స్వతంత్రంగా ఆలోచించే శక్తి. Exams లో జవాబులను బాగా రాస్తారు. కానీ జీవితంలో ఒక కొత్త ప్రశ్న ఎదురైతే ఒక్కసారిగా ఆగిపోతారు. ఎందుకంటే వారికి నేర్పింది సమాధానాలు మాత్రమే... ఆలోచించడం కాదు.


మా ఆఫీసులో కొత్తగా చేరుతున్న పిల్లలు కూడా అలాగే ఉంటున్నారు. అందరూ ఇంజినీర్లు, Graduates, తెలివైనవాళ్లే... కానీ ఉద్యోగంలో అవసరమయ్యే జ్ఞానం, పరిస్థితులను అర్థం చేసుకునే సామర్థ్యం, నిర్ణయం తీసుకునే నైపుణ్యం లేదు. వాళ్లు నా పిల్లల్లాగే అనిపిస్తారు. అందుకే వారితో సరదాగా మాట్లాడుతాను. చిన్న చిన్న అనుభవాలు పంచుకుంటాను. 


ఉద్యోగ జీవితంలో మొదటి కొన్ని రోజుల్లో మంచి గురువు దొరికితే అది జీవితాంతం ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతాను. ఈ రోజు ఒక అబ్బాయి SSC లో సెలెక్ట్ అయ్యాడు. NOC కావాలి అని ఎంతో గాబరా పడుతున్నాడు. చిరునవ్వుతో అన్ని చేసి పెట్టాను. చిన్న సంతృప్తి కలిగింది. అప్పుడే నాకు మా గాంధీ సత్రం లెక్కల మాస్టారు గుర్తొచ్చారు. నిజానికి ఈ కథానికకు ఆయనే మూలం.


తెల్లవారుజామునే లేచి, గబగబా బ్రష్ చేసుకొని, చిన్న సంచిలో పుస్తకాలు పెట్టుకొని, నాన్నగారి సైకిల్ తీసుకొని ట్యూషన్కు వెళ్లేవాడిని. గంట తర్వాత తిరిగి వచ్చి సైకిల్ నాన్నగారికి ఇచ్చేసి, యూనిఫాం వేసుకొని స్కూలుకు బయలుదేరేవాడిని. 


స్కూల్లో మొదటి గంట, రెండో గంట, Prayer... తర్వాత Newspaper లోని ముఖ్యమైన వార్తలు చదవడం. పాఠాలు మాత్రమే కాదు; క్రమశిక్షణ, బాధ్యత, పొదుపు, పరిశుభ్రత, సమాజం పట్ల బాధ్యత కూడా మాకు అక్కడే నేర్పించారు. మాస్టారు చెప్పినది నోట్స్ రాసుకొని, ఇంట్లో చదివి పరీక్ష రాస్తే 70, 80, 90 మార్కులు వచ్చేవి. అవే మాకు గొప్ప విజయాలు.


అప్పుడు 'మా బడి' కూడా ప్రతి ఇంటికీ వచ్చేది కాదు. ఎవరి ఇంటికైనా వస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి చదివి, ముఖ్యమైన విషయాలు నోట్స్ రాసుకునేవాళ్లం. ఎవ్వరూ "ఇలా చదువు... అలా చదువు..." అని వెనకపడలేదు. అందుకే మేమే నేర్చుకున్నాం. మేమే ఆలోచించాం. మేమే ఎదిగాం. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మున్సిపల్ పాఠశాలలో చదివాను. 


వర్షాకాలంలో పైకప్పు కారేది, చలికాలంలో చల్లని గాలులు వణికించేవి. దుమ్ము, మట్టి, ఎండ, వాన... ఇవన్నీ మా రోజువారీ జీవితంలో భాగమే. అవే మా సహచరులు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అనిపిస్తుంది... బహుశా ఆ ప్రకృతే మా శరీరానికి రోగనిరోధక శక్తిని ఇచ్చింది. ఆ కష్టాలే మా మనసుకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ స్వేచ్ఛే మా ఆలోచనలకు రెక్కలు ఇచ్చింది.


ఈరోజు సాంకేతికత ఎంతో ముందుకు వెళ్లింది. పిల్లలకు సౌకర్యాలు పెరిగాయి. అది మంచిదే. కానీ వాటితో పాటు ప్రశ్నించే మనసు, స్వతంత్ర ఆలోచన, ప్రకృతితో అనుబంధం, జీవితాన్ని అర్థం చేసుకునే జ్ఞానం కూడా పెరగాలి. ఎందుకంటే... పుస్తకాలు చదువు నేర్పిస్తాయి... ప్రకృతి జీవితం నేర్పిస్తుంది... గురువులు దారి చూపిస్తారు... అనుభవం మనిషిని తయారు చేస్తుంది.


కథలో ముందుకు వెళ్దాం... 


ఐదో తరగతి పూర్తయ్యాక ఆరో తరగతికి పాఠశాలలో చేరాను. అప్పటివరకు నా ప్రపంచం చాలా చిన్నది. ఉదయం స్కూల్కు వెళ్లడం... మధ్యాహ్నం ఆటలతో కాలక్షేపం... సాయంత్రం బెల్ కొట్టగానే పుస్తకాల సంచి భుజాన వేసుకుని బజారులో నడుచుకుంటూ ఇంటికి రావడం. దారిలో కనిపించే నాటుబండ్ల వెంట పరుగులు, దుమ్ములో దొర్లే ఆటలు... ఇంటికి వచ్చాక అమ్మ మందలింపులతో చేతులు కాళ్లు కడుక్కోవడం, స్నానం చేసి గంటసేపు చదవడం—అదే నా దినచర్య. 


మా అమ్మకు నా చదువుపై అపారమైన ఆశ. "బాగా చదవాలి... మంచి మార్కులు తెచ్చుకోవాలి" అని ఎప్పుడూ చెప్పేది. కానీ మార్కుల వెనుక దాగి ఉన్న నా సామర్థ్యాన్ని గుర్తించినవారు మాత్రం ఇంకా నా జీవితంలోకి రాలేదు.


మొదటి యూనిట్ టెస్ట్... మామూలు మార్కులు. రెండో యూనిట్ టెస్ట్... మళ్లీ మామూలే. నా మదిలో కనిపించని ఆలోచనలు ఉండేవి. ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు, సిల్వర్ డబ్బాలు తెచ్చుకునే "క్లెవర్ బ్యాచ్". మిగిలిన వాళ్లు మరో బ్యాచ్. నేను ఆ రెండింటి మధ్యలో ఎక్కడో. మూడో యూనిట్ టెస్ట్ వచ్చింది. 


ఎప్పటిలాగే పరీక్ష రాశాను. ఫలితాలు ఇచ్చే రోజు క్లాసులో ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఎప్పుడూ ఎక్కువ మార్కులు తెచ్చుకునే వాళ్లందరికీ లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయి. నా పేరు పిలిచారు. "రావు... నీకు ఇరవై మూడున్నర మార్కులు / 25."


ఒక్కసారిగా క్లాస్ మొత్తం నిశ్శబ్దమైంది. నా చెవులే నన్ను నమ్మలేదు. నేనూ ఆశ్చర్యంతో మాస్టారు దగ్గరకు వెళ్లాను. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆయన నన్ను దగ్గరకు పిలిచారు. నా వీపు మీద చేయి వేసి మెల్లగా అడిగారు.


"రావు... నువ్వు బాగా రాయగలవు. మరి ఇంతకాలం ఎందుకు దాచుకున్నావు?"


నేను అమాయకంగా తల వంచి, "తెలియదు సార్... చదివాను... రాశాను..." అన్నాను.


అప్పుడు ఆయన చెప్పిన మాటలు ఈరోజుకీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి.


"నీ నాన్నగారితో నాకు మంచి పరిచయం ఉంది. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకం నీ మీద కూడా ఉంది. నువ్వు ఇంకా చాలా దూరం వెళ్లగలవు. రేపటి నుంచి నా దగ్గర ట్యూషన్కు రా. నిన్ను నేను చదివిస్తాను."


ఆ మాటల్లో ఆజ్ఞ లేదు... ఆప్యాయత ఉంది. బోధ లేదు... ఆశీర్వాదం ఉంది. అది ఒక గురువు తన శిష్యుడిపై ఉంచిన విశ్వాసం.


మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకే సైకిల్ తొక్కుకుంటూ గాంధీ సత్రం మాస్టారు ఇంటి ముందు నిలబడ్డాను. ఆ రోజు నుంచి నేను కూడా "క్లెవర్ బ్యాచ్"లో చేరిపోయాను. కానీ నిజానికి నేను చేరింది ఒక బ్యాచ్లో కాదు... ఒక గురువు హృదయంలో.


టెన్త్ క్లాస్ వరకు గురువుల పర్యవేక్షణలో క్రమశిక్షణగా చదివాను. మా ఊరిలో టెన్త్ పాస్ అయిన కొద్దిమందిలో ఫస్ట్ క్లాస్ సాధించిన వారిలో నేనూ ఒకడిని. ఆ విజయం వెనుక టీచర్ల ఆశీర్వాదం స్పష్టంగా కనిపించేది.


అయితే జీవితం ఎప్పుడూ ఒకే దారిలో నడవదు. కాలేజీలో చేరేసరికి కొత్త లోకం చేరువైంది. కొత్త స్నేహాలు... కొత్త ఆకర్షణలు... చేతిలో ఒక రూపాయి, రెండు రూపాయలు ఉంటే చాలు అనిపించే వయసు. ఆ ఉత్సాహం నన్ను మరో దారిలోకి తీసుకెళ్లింది...


కళాశాలలో చేరిన తొలి రెండు మూడు నెలలు నా జీవితంలో ఒక విచిత్రమైన కాలం. చదువుకోవడానికి కాలేజీకి వెళ్తున్నాననే భావన తప్ప, ఎలా చదవాలి? ఏ పుస్తకాలు కొనాలి? పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి? అనే అవగాహన అసలు ఉండేది కాదు.


మా ఊరు ఓ చిన్న పల్లెటూరు. నాన్నగారు కొన్న సైకిల్ మీద ప్రతిరోజూ కాలేజీకి వెళ్లేవాడిని. రెండు మూడు నెలల తర్వాతే విశాఖపట్నంలోని గుప్తా పుస్తకాల దుకాణానికి వెళ్లి టెక్స్ట్ బుక్స్ కొనుక్కొన్నాను. అప్పటివరకు చేతిలో పుస్తకాలు కూడా లేవు. కాలేజీకి వెళ్లి వచ్చేవాడిని గానీ, చదువు మాత్రం గమ్యం లేకుండా సాగేది.


అప్పుడే నా జీవితంలో మరో గురువు అడుగుపెట్టారు— లెక్కల అధ్యాపకులు లక్ష్మణరాజ్ మాస్టారు.


ఆయన క్లాస్లో అడుగుపెడితే క్రమశిక్షణకు మరో రూపం కనిపించేది. మమ్మల్ని ఎప్పుడూ గారాబంగా చూడలేదు. కఠినంగా ఉండేవారు. కానీ కొద్దికాలానికే తెలిసింది— ఆ కోపం మమ్మల్ని భయపెట్టడానికి కాదు, భవిష్యత్తును తీర్చిదిద్దడానికి.


ఆ రోజు నుంచే నాలో ఒక నిర్ణయం పుట్టింది. "ఈ గురువుగారి దృష్టిలో మంచి విద్యార్థిగా నిలవాలి" అని.


అప్పుడు నా జీవితంలో వచ్చిన మార్పు మాటల్లో చెప్పలేనిది. ప్రతి సబ్జెక్టుకూ ప్రత్యేక నోట్స్ తయారు చేసుకోవడం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్... మాస్టారు చెప్పిన ప్రతి మాటను అక్షరాలా రాసుకునేవాడిని.


ఈ రోజు పిల్లలకు ఉన్న డిజిటల్ క్లాసులు, వీడియో లెక్చర్లు, ఆన్లైన్ కోచింగ్లు, ఐఐటీ స్థాయి శిక్షణలు... అవన్నీ అప్పట్లో మాకు ఉండి ఉంటే, నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను— ఐఐటీ బొంబాయిలో సీటు సంపాదించే సామర్థ్యం మా తరంలో చాలామందికి ఉండేది. అది అతిశయోక్తి కాదు. మా మీద నాకు ఇప్పటికీ ఉన్న విశ్వాసం.


ఎందుకంటే మా తరం పిల్లలకు మట్టి వాసన తెలుసు. కష్టపడి పనిచేయడం తెలుసు. ఓర్పు తెలుసు. ధైర్యం తెలుసు. కానీ అవకాశాలు తక్కువ... Guidance కూడా తక్కువ.


ఆ రోజుల్లో మాస్టారు చెప్పిందే మా ప్రపంచం. ఆయన బోధనే మా పాఠ్యపుస్తకం. బయట ప్రపంచంలో ఇంకెవరెవరు ఎలా బోధిస్తున్నారో మాకు తెలియదు. పరీక్షలో ఉత్తీర్ణులవ్వడం, మంచి మార్కులు తెచ్చుకోవడం— అంతే మా లక్ష్యం. అప్పట్లో శ్రీకాకుళం పాలిటెక్నిక్లో సీటు సంపాదించాను. జీవితం నెమ్మదిగా సాగిపోయింది.


ఇక్కడే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో ఏదో ఒక దశలో సరైన గురువు దొరికితే... ఆ గురువు కరుణ లభిస్తే... ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. అదే విధి (Destiny) అని నేను నమ్ముతాను.


కాలం మారింది. సాంకేతికత వచ్చింది. అవకాశాలు పెరిగాయి. కానీ ఒక విషయం మాత్రం ఎప్పటికీ మారదు.


గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు... జీవితాన్ని చూపించే దారి చూపేవాడు.


మనకు మంచి మాట చెప్పిన ప్రతి వ్యక్తి గురువే. మనలో ఆత్మవిశ్వాసం నింపిన ప్రతి ఒక్కరూ గురువులే. అందుకే భారతీయ సంస్కృతిలో గురువును దైవంతో సమానంగా భావించారు.


The great A. P. J. Abdul Kalam Sir, పుస్తకాలు చదివి, ప్రసంగాలు విని జీవితాన్ని మార్చుకున్నవారు ఎందరో. అలాగే Ramakrishna Paramahamsa బోధనలు, అనేక మహనీయుల జీవితాలు మనకు మార్గదర్శకాలుగా నిలిచాయి. వారందరూ మన గురువులే.


జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక గురువు దొరకకపోవచ్చు. కానీ special touch మాత్రం ఎక్కడో ఒకచోట తప్పకుండా దొరుకుతుంది. దానిని వెతికి పట్టుకోవాలి. అదే మన భవిష్యత్తును మార్చుతుంది.


మా కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ. Private రంగంలో అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఎంతో మంది ప్రతిభావంతులు ఉపాధ్యాయులుగా, రాజకీయ నాయకులుగా తమ జీవితాలను గడిపారు. మా కాలంలో "ఈ చదువులు మాకొద్దు", "ఈ చరిత్ర ఏ సిరాతో" వంటి సినిమాలు గొప్పగా ఆడాయి. కారణం... అప్పట్లో అన్ని రంగాల్లో అవకాశాలు చాలా తక్కువ. కానీ నేటి తరానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం, ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమలు, స్టార్టప్లు—ప్రపంచమే మీ ముందుంది.


అవకాశాలు ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మంచి గురువును వెతుక్కోవాలి. మంచి అలవాట్లను అలవరచుకోవాలి. తాత్కాలిక ఆకర్షణల కంటే శాశ్వతమైన విజయాన్ని ఎంచుకోవాలి.


ఈ కథను నేను రాస్తున్నది అనుభవాన్ని చెప్పుకోవడానికి కాదు. గురువు విలువను గుర్తు చేయడానికి. ఒక మంచి మాట, ఒక మంచి మార్గదర్శి— ఒక మనిషి జీవితాన్నే మార్చగలదని చెప్పడానికి.


ఇంతవరకు నా ప్రయాణంలో నాతో కలిసి నడిచిన గురువులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు లెక్కలు మాత్రమే నేర్పలేదు... జీవితాన్ని లెక్కపెట్టడం కూడా నేర్పించారు.


ఇప్పుడు సమయం ఏడైంది... "జాగ్రత్తగా వెళ్లు బాబూ..." అని ఇప్పటికీ చెబుతున్నట్టే అనిపిస్తుంది.


మీకు తెలుసు కదా… ఆ అప్పన్నబాబు, మా నాన్న, నాతో వస్తారని.


స్కూటర్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరాలి. ఇంటికి చేరుకున్నాక అదే గది... అదే మంచం... రేపు మళ్లీ ఉద్యోగ బాధ్యతలు ఎదురుచూస్తున్నాయి. ఆ అనుభూతే నా బలం... అదే నా ఆశీర్వాదం.


...ఉంటాను మరి..


 మీ.. ఆర్.ఎస్. రావు


***************************************


రౌతు శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: రౌతు శ్రీనివాసరావు

నా పేరు రౌతు శ్రీనివాసరావు. నేను భారతీయ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. కవితలు, కథలు చదవడం, రచించడం నా అభిరుచులు. సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ, నా మనోభావాలను చిన్న చిన్న కథానికలుగా, కవితలుగా మలచే ప్రయత్నం చేస్తున్నాను. నా రచనలను చదివి మీ విలువైన అభిప్రాయాలు, ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page