పార్వతీశం ప్రాయశ్చిత్తం
- Nayana kasthuri

- 53 minutes ago
- 4 min read

Parvathesham Prayaschittam - Telugu Family Story | Nayana kasthuri
పార్వతీశం ప్రాయశ్చిత్తం - తెలుగు కుటుంబ కథ | నయన కస్తూరి
Published in manatelugukathalu.com on 26/08/2026
“పార్వతీశం ప్రాయశ్చిత్తం” ఒక ఆధ్యాత్మిక, కుటుంబ విలువలు మరియు నైతిక సందేశాన్ని అందించే హృద్యమైన తెలుగు కథ. దైవ విశ్వాసం అంటే కేవలం పూజలు చేయడం మాత్రమేనా? మన ప్రయత్నంతో పాటు దైవకృపకు కూడా స్థానం ఉందా? అనే ఆలోచనలను ఈ కథ ముందుకు తీసుకువస్తుంది.
ప్రమోషన్ రాకపోవడంతో నిరాశకు గురైన పార్వతీశం, తన భార్య లక్ష్మి భక్తిని ప్రశ్నిస్తాడు. అయితే పిల్లల భవిష్యత్తు, వారి పరీక్షా ఫలితాల సందర్భంలో అతనిలో మొదలైన ఆత్మపరిశీలన అతని ఆలోచనలను మార్చుతుంది. ఒక ఆధ్యాత్మిక అనుభవం ద్వారా అహంకారం నుంచి భక్తి వైపు, నిర్లక్ష్యం నుంచి విశ్వాసం వైపు పార్వతీశం చేసే ప్రయాణమే ఈ కథలోని ప్రధానాంశం.
మన ప్రయత్నాలను ఎప్పుడూ వదులుకోకుండా, అదే సమయంలో మనకంటే గొప్ప శక్తిపై విశ్వాసాన్ని కూడా కలిగి ఉండాలనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.
వీధి తలుపు బెల్ మోగింది. "ఇగో వచ్చే... ఒక్క నిమిషం..." అంటూ చేస్తున్న పనిని వదిలి, వెళ్లి తలుపు తీసింది లక్ష్మి.
తలుపు తియ్యగానే కనిపించిన భర్త పార్వతీశాన్ని చూసి, "వచ్చారా! రండి! మంచినీళ్లు తెస్తా." అని వంటింట్లోకి వెళ్ళింది లక్ష్మి.
మంచినీళ్ల గ్లాసు అందిస్తూ, భర్త మొహంలోకి చూసింది. భర్త ఎందుకో ఉదాసీనంగా ఉండటం గమనించింది లక్ష్మి. "ఏమిటండీ, ఇవ్వాళ డల్ గా ఉన్నారు? వంట్లో ఏమైనా నలతగా ఉందా ఏమిటీ?" అంటూ భర్త నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. వేడిగా ఏమీ లేదు.
"ఏమీ లేదులేవే. కొంచెం కాఫీ ఇయ్యి. తల నొప్పీగా ఉంది." మాటలో విసుగు ధ్వనించింది.
"అలాగేనండీ, ఇప్పుడే తెస్తా!" అంటూ కాఫీ కలుపుకు రావడానికి వెళ్ళింది, "ఎందుకబ్బా ఈయన అలా ఉన్నారు?" అని ఆలోచిస్తూ. ఆవిడకు పొద్దున్న భర్త ఆఫీసుకు వెళ్తున్నప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
భర్త ఆఫీసుకు వెళ్తున్నప్పుడు "ఏవండీ, ఈ రోజేగా మీ ప్రమోషన్ రిజల్ట్స్ తెలిసేది? దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళండి. మీకు ప్రమోషన్ రావాలని." అంది భర్తతో.
"అబ్బ! నాకలాంటివేమీ చెప్పకు. నేను ఇంటర్వ్యూ బాగా చేస్తే వస్తుంది. అంతేకానీ దేవుడికి దండం పెట్టుకుంటే మనమేమీ కష్టపడకపోయినా వస్తుందా?" అంటూ భార్య ఇచ్చిన లంచ్ బాక్స్ బ్యాగ్ లో పెట్టుకున్నాడు.
"అయ్యో రామా అది కాదండీ..." అంటూ ఏదో చెప్పబోతుంటే "సరెలేవే! నువ్వు రోజూ రామాలయానికీ వెళ్లి, ప్రదక్షిణాలు చేస్తున్నావుగా! అవి చాలవా? ఇక నేను వెళ్ళొస్తా!" అని ఆఫీసుకు బయలుదేరాడు.
"అలా పొద్దున్న వెళ్లిన పార్వతీశం ఇప్పుడు డల్ గా వచ్చారంటే...? ఆయనకు ప్రమోషన్ వచ్చి ఉండదు పాపం!" లక్ష్మి గ్రహించింది.
"ఇదుగోండి, చక్కటి చిక్కటి కాఫీ... తాగండి!" అని భర్త చేతికిచ్చింది.
ఆయన కాఫీ తాగుతూ, "లక్ష్మీ! ప్రమోట్ అయిన వాళ్ల లిస్ట్ వచ్చిందే. అందులో నా పేరు లేదు." చెప్పాడు నీరసంగా.
"అయ్యో! అవునా?" అని తన సానుభూతిని వ్యక్త చేసి, వెంటనే భర్త మనసుని మరలించడానికి "పోనీలెండి, బాధపడకండి. మనకేది మంచిదో అదే ఇస్తాడు దేవుడు. నెక్స్ట్ టైం వస్తుంది లెండి. రాత్రి ఫలహారం ఏమి చెయ్యను చెప్పండి?" అంది భర్తతో.
"నాకసలే మనసు బాగా లేకపోతే ఏం చేయను అంటావేమిటే? నాకేమీ వద్దు."
"అదేమిటండీ! మరీ చిన్నపిల్లాడిలా మాట్లాడతారు? లేవండి కాసేపు టీవీ చూసుకోండి."
"నీకు మతుండే మాట్లాడుతున్నావా? టీవీ చూడగలనా ఇప్పుడు నేను? భక్తి ఛానల్ చూడమంటావా? మీ దేవుడు ఏం చేశాడు? ఊరికే రోజూ గుడికి పోయి, గంటలు గంటలు ప్రదక్షణాలు చేశావు. ఏం ఒరిగింది?" తన లోపలున్న కోపాన్ని వెళ్లగక్కాడు.
"భగవంతుడా ఆయన మాటలు పట్టించుకోకు. ఆయనను క్షమించు" అని ప్రార్థిస్తూ తన పనిలో పడింది లక్ష్మి.
పార్వతీశం, వెంకటలక్ష్మి దంపతులకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అపర్ణ, అవినాష్ వాళ్ళ పేర్లు. వారిద్దరూ కవల పిల్లలు. పిల్లలిద్దరూ దైవ ప్రసాదం అని లక్ష్మి అనుకుంటే, పార్వతీశం అది తన నిర్వాకం మాత్రమే అనుకుని దేవుళ్ల పేర్లు కాకుండా తనకిష్టమైన పేర్లే పెట్టుకున్నాడు పిల్లలకు. అపర్ణ డాక్టర్ పరీక్షకు, అవినాష్ ఇంజనీరింగ్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారు. ఇద్దరూ తెలివైన పిల్లలే. కష్టపడి చదువుతారు.
దానితో పాటు తల్లి దైవానుగ్రహం కోరుతూ పూజలూ, ఉపవాసాలూ చేస్తూ, పిల్లల ప్రయత్నాలకు తన వంతు సహకారం తాను చేస్తూ ఉంటే, పార్వతీశం మాత్రం "తన పిల్లలిద్దరి తెలివితేటల మీద అపార నమ్మకంతో వాళ్ళు ఫ్రీ సీట్లే కొడతారు" అన్న ధీమాతో ఉన్నాడు.
పరీక్షలు రానే వచ్చాయి. అపర్ణ, అవినాష్ ఇద్దరూ బాగా రాశారు. కానీ వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంది. దైవ దర్శనాలు, స్తోత్ర పారాయణాలు లక్ష్మి పెంచేసింది.
"ఎందుకు లక్ష్మి, అంత టెన్షన్ పడతావు? వాళ్ళు బాగానే రాశారుగా. తప్పకుండా మంచి ర్యాంకే వస్తుంది వాళ్ళకి" అని ధీమాగా పలికాడు భర్త.
"ఏవండీ, మీరేమనుకోకపోతే ఒకటి అడుగుతాను. మీ ప్రమోషన్ ఇంటర్వ్యూ మీరెంత బాగా చేశారు! కానీ ఏమైంది? దైవకృప ఉండాలి దేనికైనా. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదండీ?" అన్న భార్య మాటలకి నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. మదిలో కొంచెం కంగారు మొదలైంది. ఆలోచిస్తూ పడుకున్నాడు. కొంచెం సేపటికి నిద్రలోకి జారుకున్నాడు.
కొంచెం సేపటికి ఎంతో దేదీప్యమానమైన ఆకారం కళ్ళముందు కదిలి కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళ ముందున్న ఆకారం నుదిటి మీద దివ్య నామంతో వెంకటేశ్వరస్వామి వారి లాగా గోచరించి, లేచి నిలబడి అప్రయత్నంగా రెండు చేతులూ భక్తితో జోడించాడు. స్వామి ముఖం మీద చిరునవ్వు మెరిసింది.
"ఏమి కావాలో కోరుకో పార్వతీశం!" అని అడుగగా పార్వతీశం స్వామిని ఏదో అడగబోతూ, భార్య మాటలు గుర్తుకొచ్చి, "స్వామీ మాకు ఏది మంచిది అని, మీరు భావిస్తే అదే ప్రసాదించండి" అని భక్తితో కోరాడు.
స్వామి "తధాస్తు" అని పలుకుతూ అదృశ్యమయ్యాడు. పార్వతీశం అద్వితీయమైన ఆనందంతో నిద్రలోకి జారుకున్నాడు.
ఆ రోజు తెల్లవారేసరికి ప్రకాశవంతమైన ముఖంతో లేచిన భర్తను చూసి, "అబ్బో ఏమిటో ఈయన ముఖం ఈరోజింత వెలిగిపోతోంది!! కారణమేమిటో?" అని కాఫీ కలిపే ప్రయత్నంలో పడింది.
"లక్ష్మీ! రేపేగా పిల్లల ఎంట్రన్స్ ఫలితాలు వచ్చేది? ఈ రోజు వెంకటేశ్వరస్వామి గుడికి వెళదాము అందరం కలిసి." అని పార్వతీశం అనేసరికి, "అబ్బో! మీరేనా అనేది? సరేనండి! తప్పకుండా వెళదాము స్వామి దర్శనానికి." అంది లక్ష్మి ముఖం నిండా సంతోషం నింపుకుని భర్త తన తప్పుకు ప్రాయశ్చిత్తము మొదలుపెట్టాడని గ్రహించి.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
నయన కస్తూరి గారి కొన్ని ఇతర రచనలు:
నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నయన కస్తూరి
నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక విషయాలు రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.









Comments