top of page
Original.png

వినాయక వనం

3 hours ago
3 min read

మట్టి వినాయక విగ్రహాల్లో విత్తనాలు నాటి, మొక్కలు పెంచుతూ కరువు గ్రామాన్ని పచ్చని వినాయక వనంగా మార్చిన పద్మ మరియు గ్రామ ప్రజలు.

Vinayaka Vanam - Telugu Social Message Story | Sanka Sobharani

వినాయక వనం - తెలుగు సామాజిక సందేశాత్మక కథ | సంకా శోభారాణి

Published in manatelugukathalu.com on 22/10/2026


పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ, మహిళా నాయకత్వం ప్రాముఖ్యతను చాటిచెప్పే స్ఫూర్తిదాయక తెలుగు కథ “వినాయక వనం”. S. శోభారాణి రచించిన ఈ కథ ప్రకృతిని కాపాడితే గ్రామ భవిష్యత్తును ఎలా మార్చవచ్చో తెలియజేస్తుంది.


ఆ ఊరి పేరు మధురవాడ. ఒకప్పుడు పాడి పంటలతో, పచ్చని చెట్లతో, పచ్చని వాతావరణంతో కళకళలాడే నందనవనంలా ఉండేది.


గత 5 సంవత్సరాల నుండి ఆ గ్రామంలో వర్షాలు పడక, పంటలు పండక తినడానికి తిండి, తాగడానికి నీరు కరువొచ్చింది.


ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతుల నిమజ్జనంతో చెరువు పూర్తిగా పాడైపోయింది. నీళ్లన్నీ నల్లగా మారి చెరువు దుర్గంధం వెదజల్లుతోంది. ఆ ఊరి ప్రెసిడెంట్ చలమయ్య చూస్తూ ఊరుకోవడం తప్ప దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చలమయ్య పదవీకాలం పూర్తికావస్తోంది.


ఆ ఊరికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. ఈసారి ప్రెసిడెంట్ పదవికి రిజర్వేషన్ కోటాలో లేడీకి ఇవ్వడం జరిగింది.


మధురవాడలో ఉన్న ప్రజలందరికీ అక్షరజ్ఞానం అంతంత మాత్రమే. ఆ ఊరిలో సూరి అనే కుమ్మరి ఉన్నాడు.


అతని కూతురు పద్మ స్వశక్తితో ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి వెళ్లి డిగ్రీ వరకు చదువుకుంది.


ఊరి జనం అంతా కలిసి సూరి ఇంటికి వెళ్లి పద్మను ఊరి ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.


ఆ నాటి నుండి పద్మ ఆ ఊరి అభివృద్ధి కోసం రేయింబవళ్లు శ్రమిస్తోంది. చెరువు పూడిక తీయించింది, కానీ వర్షాలు పడక నీరు అరకొరగా ఉన్నది.


ఊరిలో చెట్లు పెంచకపోగా, ఉన్న కొన్ని చెట్లు వంటచెరకుగా, ఇంటి నిర్మాణాలకు తలుపులు, గుమ్మాలుగా, మరికొన్ని కరెంట్ తీగలకు అడ్డు వచ్చాయని కొట్టేయడంతో ఆ ఊరు పచ్చదనాన్ని కోల్పోయింది.


వర్షఋతువు తోక ముడిచింది. పద్మ ఆలోచించింది. ఒక పథకం వేసింది.


చవితి రానే వచ్చింది. 5 సంవత్సరాల క్రితం వరకు వినాయకచవితి రంగురంగుల పెద్ద వినాయకుళ్లతో, డిజె సౌండ్స్‌తో, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో 10 రోజులు ఉత్సవాలు ఘనంగా జరిగేవి.


కానీ గత ఐదు సంవత్సరాలుగా ఆ ఊరిలో వర్షాలు పడక కరువు కాటకాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.


నాటి నుండి ఆ ఊరిలో వినాయక ఉత్సవాలు బంద్ అయ్యాయి. ఈ సంవత్సరం కొత్తగా ఎన్నికైన పద్మ ఊరిజనాన్ని రచ్చబండ వద్దకు పిలిచి ఈసారి వినాయక ఉత్సవాలు నిర్వహించాలని చెప్పింది.


ప్లాస్టర్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలతో పూజ చేయాలని, కాలుష్యం ఉండదని అందరినీ ఒప్పించింది.


అందరూ చెరువుగట్టుకు వెళ్లి చెరువులో మట్టి తెచ్చి, పిల్లలు అందరి చేత మట్టి వినాయకుడి తయారీ మొదలుపెట్టింది.


పద్మ తండ్రి సూరి నేతృత్వంలో పిల్లలు మట్టి వినాయకుడి ప్రతిమలు తయారు చేశారు. ప్రతి వినాయకుని ప్రతిమ అడుగు భాగంలో వేప, రావి, ఉసిరి, మామిడి, మర్రి మొదలైన చెట్ల విత్తనాలను అద్ది ఇంటింటికీ ప్రతిమలు పంచింది.


రంగులు లేవు, లైట్లు లేవు, ఆర్భాటాలు అసలే లేవు. వినాయక ఉత్సవాలు ముగింపుకు వచ్చాయి. కానీ అందరిలోనూ ఒకే ప్రశ్న—ఇన్ని వినాయక విగ్రహాలను ఎలా నిమజ్జనం చేయాలి? ఊరి ప్రెసిడెంట్ పద్మ వచ్చింది.


“ఎవరి విగ్రహాన్ని వారు ఊరి చివర ఉన్న పది ఎకరాల బీడు భూమిలో పాతిపెట్టాలి. ఈసారి నిమజ్జనం చేయడం లేదు, పదండి!” అంటూ అందరినీ ఊరిచివరకు తీసుకువెళ్లింది.


పిల్లలతో పాటు పెద్దలు కూడా రెండు అడుగుల దూరంలో గుంతలు తవ్వారు. వినాయక విగ్రహాలను పాతిపెట్టారు. బడి పిల్లల బడికి అటునుండే వెళ్లాలి.


ప్రతిరోజు పిల్లలు సాయంత్రం వేళ సరదాగా వినాయక విగ్రహాలకు నీళ్లు పోస్తూ చిన్న చిన్న మొక్కలను ఐదు సంవత్సరాలకు ఏపుగా పెంచి పచ్చని వాతావరణంతో మధురవాడ కలకళలాడుతూ, పాడి పంటలతో విలసిల్లుతోంది.


ఆ వనానికి 'వినాయక వనం' అని పేరు పెట్టారు. వర్షాలు బాగా కురవడంతో చెరువుకు జలకళ వచ్చింది.


వర్షపు నీరు నిల్వ ఉండి అనావృష్టి వచ్చినప్పుడు వాటి ద్వారా నీటి నిల్వలు పెరిగి వినియోగించుకునేలా ప్రతి ఇంటిలో బట్టలు ఉతికే నీరు, స్నానపు నీరు వృథా కాకుండా ఊరి మధ్యలో పెద్ద నిల్వనీటి గుంత ఏర్పాటు చేసి, అందరి ఇళ్లల్లో నీరు ఆ గుంతలోకి చేరేవిధంగా అండర్‌గ్రౌండ్ పైపులు వేసి ఆ ఊరికి జలసిరి తెప్పించింది ప్రెసిడెంట్ పద్మ.


ఆ ఊరికి ఇప్పుడు ఆదర్శగ్రామంగా 'వినాయక వనం' గురించి వేనోళ్ల పొగడటం మొదలుపెట్టారు.


కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆదర్శ గ్రామంగా అవార్డుతో పాటు వినాయక వనం అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి ప్రభుత్వ సహాయం తోడవుతుందని సభాపూర్వకంగా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు.


ప్రెసిడెంట్ పద్మకు అవార్డుతో పాటు గ్రామ ప్రజల సమక్షంలో శాలువాతో సత్కరించారు. ఊరి ప్రజలందరూ "వినాయక వనానికి జై" అంటూ జయజయధ్వానాలు చేశారు.


ప్రతి ఏడూ వినాయక విగ్రహాలను విత్తనాలతో పాతడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు వినాయక వనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.


సమాప్తి


*** 


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



సంకా శోభారాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



గంటి ఆశ పద్మిని

పరిచయం: నా పేరు సంకా శోభారాణి.

నేను చిన్ననాటినుండి మా నాన్నగారితో కలిసి రేడియో వినే  అలవాటు ఉండేది.

ఆ అలవాటు నుండి  రేడియోలో కవితలు, కథానికలు రాసి రెమ్యునిరెషన్

తీసుకునే స్థాయికి వచ్చాను. నాకు రేడియోలో RJ గా చేయాలనే కోరికతో తెలుగు NRI ఆన్లైన్ రేడియో లో 7సంవత్సరాలు నుండి rj గా చేస్తూ ఆ రేడియోలో 25 నిమిషాల  నిడివిగల   లైవ్ నాటికలు రచించి, నిర్వహించి, పాత్రధారిగా చేశాను. గణేష్ కర్నూలు  పత్రికలో రోజు కవిత పబ్లిష్ అవుతుంది. సాహితీ సదస్సులలో పాల్గొంటూ 200లకు పైగా సన్మానాలు పొందాను. నిత్య అక్షర సాధకురాలు జాతీయ అవార్డ్, స్త్రీశక్తి, కధామంజరి, ఇలా అవార్డ్స్

రావడం జరిగింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page