పార్సెల్ పర్వం
- Nayana kasthuri

- 2 days ago
- 5 min read
పార్సెల్ పర్వం, ఆన్‌లైన్ షాపింగ్ కథ, అమెజాన్ పార్సెల్స్, ఫ్లిప్‌కార్ట్ డెలివరీ, తెలుగు కుటుంబ కథ, మధ్యతరగతి జీవితం, పొదుపు అలవాట్లు, కుటుంబ విలువలు, అవసరమైన కొనుగోళ్లు, నయన కస్తూరి

Parcel Parvam - Telugu Emotional Family Story | Nayana kasthuri
పార్సెల్ పర్వం - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | నయన కస్తూరి
Published in manatelugukathalu.com on 09/07/2026
ఆన్‌లైన్ షాపింగ్ మన జీవితాన్ని ఎంతో సులభతరం చేసినప్పటికీ, అవసరానికి మించిన కొనుగోళ్లు సమయం, డబ్బు, ఇంటి స్థలం మాత్రమే కాదు, కుటుంబ సభ్యులపై అదనపు భారాన్ని కూడా మోపుతాయి. ముఖ్యంగా ఉద్యోగాల్లో బిజీగా ఉండే పిల్లలు, వారి కోసం ఇంట్లో ఉండే వృద్ధ తల్లిదండ్రులు ఎదుర్కొనే చిన్న చిన్న ఇబ్బందులు చాలాసార్లు మన దృష్టికి రావు. హాస్యాన్ని జోడిస్తూ, కుటుంబ అనుబంధాలను హృద్యంగా ఆవిష్కరిస్తూ, ప్రణాళికాబద్ధమైన కొనుగోళ్లు ఎంత అవసరమో చెప్పే ఆలోచింపజేసే కుటుంబ కథే "పార్సెల్ పర్వం". ఈ కథ ప్రతి కుటుంబానికి ఒక చిన్న సందేశాన్ని, పెద్ద పాఠాన్ని అందిస్తుంది.
మధ్యాహ్న భోజనం చేసి, అప్పుడే మంచి నిద్రలోకి జారుకున్న సీతమ్మగారికి డోర్ బెల్ మోగిన చప్పుడు వినిపించి, మెలకువ వచ్చి, కళ్ళు తెరిచి చూసింది. పక్కనే భర్త పరబ్రహ్మంగారు గురకపెడుతూ మంచి నిద్రలో ఉన్నారు.
‘పాపం! ఆయన మంచి నిద్రలో ఉన్నారు. ఇక ఆయన్నేమి లేపుతాను? నేనే పోయి చూడాలి ఎవరొచ్చారో...! ఆ... అన్నయ్య వస్తానని అన్నాడు. ఒకవేళ అన్నయ్య వచ్చాడేమో’ అనుకునే సరికి ఉన్న నిద్రమత్తు వదిలి, ఆ వయసులో కాళ్ళ నొప్పులు ఉన్నా, ఉత్సాహంగా ముందుకు అడుగులు పడ్డాయి వీధి తలుపు తెరవడానికి.
తలుపు తీయగానే అన్నయ్యే వచ్చాడనుకుని, "రా అన్నయ్యా, లోపలికి రా!" అని పిలవబోయి, ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, టక్కున నోట్లోని మాటలను నోటిలోనే మింగేసి, "నువ్వా బాబూ! మళ్ళీ పార్సెల్ వచ్చిందా? సరిపోయింది. ఇంకా మా అన్నయ్య అనుకున్నా! ఇలా ఇయ్యి బాబూ, ఇయ్యి" అంటూ నీరసంగా చేయి చాచింది పార్సెల్ తీసుకోవడానికి.
“ఓటీపీ చెప్పండి మేడమ్!" అంటూ పార్సెల్ ఉన్న చేయి వెనక్కి తీసుకున్నాడు డెలివరీ బాయ్.
"ఓటీపీ లేకపోతే ఇవ్వవా ఏంటి అబ్బాయ్? నా దగ్గర ఏ నంబరూ లేదు. మా కోడలు ఆఫీస్‌కు వెళ్ళింది. అడ్రస్ మాదే ఉంది కదా? మరి ఇవ్వడానికి ఏమైంది ఇప్పుడు?" దబాయించజూసింది సీతమ్మ.
"అడ్రస్ ఉన్నా ఓటీపీ చెప్పాలి మేడం! లేకపోతే నేను ఇవ్వలేను మేడం!" అంటూనే కోడలు శైలజకు ఫోన్ చేసి, ఓటీపీ తెలుసుకుని, పార్సెల్ సీతమ్మకు ఇచ్చి వెళ్ళిపోయాడు.
ఆవిడ అది తీసుకుని కొడుకు రూమ్‌లోని అల్మారాలో పెడుతుంటే, అక్కడ పది పార్సెల్స్ దాకా ఓపెన్ చేయకుండా పడి ఉన్నాయి. "ఈ రోజుకి ఇది అయిదో పార్సెల్. కావాల్సినవీ అక్కర్లేనివీ అన్నీ ఆర్డర్ చేసుకుంటారు. వాటిని ఓపెన్ చేసి వాటి మొహం చూడటానికి కూడా వాళ్ళకు ఓపిక, సమయం ఉండవు.
ఇద్దరికీ డ్రెస్సుల మీద డ్రెస్సులు. రకరకాల చెప్పులు, ఖరీదైన బూట్లు, ఆర్టిఫీషియల్ జ్యువలరీ ఇలా ఒకటి కాదు. పెళ్ళివారి ఇల్లులాగా బోలెడు పెట్టెలు, ప్యాకెట్స్ ఇంటినిండా. వాటిలో సగం నచ్చక, సగం పట్టక రిటర్న్ పెట్టి, డెలివరీ బాయ్ వచ్చినప్పుడు ఇచ్చేయమని హాల్లోని సోఫాలో పడేస్తారు. అవసరం లేనివి ఎందుకు ఆర్డర్ చేసుకుంటారో ఆవిడకు ఎంత ఆలోచించినా అర్థం కాదు.
రాజమండ్రి వాస్తవ్యులైన పరబ్రహ్మంగారు, సీతమ్మగారి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు రాజా. కోడలు శైలజ. ఇద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు. ప్రభుత్వ ఉద్యోగి అయిన పరబ్రహ్మంగారు ఈ మధ్యనే రిటైర్ అయి, భార్యతో సహా కొడుకు దగ్గరకు వచ్చేసారు.
కొడుకు, కోడలూ వారిని అభిమానంగానే చూసుకుంటారు. కాకపోతే వాళ్ళకు ఇబ్బంది కలిగిస్తున్న విషయం ఒకటుంది. కొడుకు, కోడలు ఆఫీస్ కి వెళ్ళాక, ఇంటికి వచ్చే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొదలుకొని రకరకాల పార్సెల్స్‌కు తలుపు తెరవడం, ఓటీపీలు చెప్పడం, పార్సెల్స్ అందుకోవడం, వాటిని లోపల పెట్టడం.
ఇదే వాళ్ళను కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. వాళ్ళ గది నుండి వీధి తలుపు దాకా డెలివరీ బాయ్ ఎక్కడ వెళ్ళిపోతాడేమో అని ఆ వయసులో రోజుకు పది పదిహేను సార్లు కంగారుగా నడవడం అనేది వాళ్ళ శరీరానికి బాధ కలిగించే విషయమే.
అందుకే ఆవిడకు ఆ విషయం వంటబట్టడం లేదు. సీతమ్మగారు అలా అనుకోవడంలో తప్పేమీ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే పరబ్రహ్మంగారు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఆవిడ బాత్రూముకు వెళ్లాల్సి వస్తే వస్తుంది తంటా!
ఒకరోజు ఆవిడ స్నానానికి వెళ్లారు. భర్త బయటకు వెళ్లారు. అప్పుడే కరెక్ట్‌గా గుమ్మం ముందు వెలుస్తాడు డెలివరీ బాయ్ చేతిలో పార్సెల్‌తో. ఇక బాత్రూంలో ఉన్న సీతమ్మగారికి ఒకటే కంగారు.
"వస్తున్నా. ఒక్క నిమిషం! వచ్చేస్తున్నా! ఆయన ఇప్పుడే బయటకు వెళ్లారు. స్నానం కూడా సరిగ్గా చేయనివ్వరు కదా?"
ఇంతలోనే డోర్ బెల్ మళ్ళీ మోగింది. "వచ్చే... వచ్చే! కాసేపు ఆగు నాయనా...!" అంటూ పరుగులాంటి నడకతో వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా పెద్ద పార్సెల్‌తో డెలివరీ బాయ్ ప్రత్యక్షం. "వస్తున్నా కదా బాబూ! నేనేమైనా చిన్నపిల్లనా పరిగెత్తుకుని రావడానికి? లోపల నుండి రావాలి కదా? సరే, లోపల పెట్టు" అంది.
"ఓటీపీ చెప్పండి" అడిగాడు డెలివరీ బాయ్.
"ఇదిగో మా కోడలిని అన్ని ఓటీపీలు పేపరులో రాయమన్నా. చూడండి, ఏ ఓటీపీయో! తీసుకుని మా పార్సెల్ ఇవ్వండి. అవతల నాకు బోలెడు పనుంది" అని తొందరపెట్టి పార్సెల్ తీసుకుని తలుపేసింది.
ఇలా చాలా సార్లే జరిగింది. ఒకసారి సీతమ్మగారు ఇంటి పనీ, వంటపనీ చూసుకుని దేవుడి పూజకు కూర్చున్నారు.
అయిదు నిమిషాలు పూజ చేసుకుందో లేదో మళ్ళీ "డింగ్ డాంగ్" అని డోర్ బెల్ మోగింది. పాదాల్లో ఆనకాయలు ఉండటంతో పాదాలు కింద పెట్టగానే పాదాల్లో విపరీతమైన నొప్పి. ఆ నొప్పితోటే కుంటుకుంటూ వెళ్లి పార్సెల్ తీసుకుంది. ఎలాగో పూజ ముగించి భర్త రాక కోసం ఎదురుచూస్తున్నారు పేపర్ చదువుతూ.
అప్పుడు వచ్చారు పరబ్రహ్మంగారు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. సీతమ్మగారు వడ్డిస్తుంటే పరబ్రహ్మంగారు భోజనం చేయడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఇంకో పార్సెల్ వచ్చింది. వెళ్లి తెచ్చుకున్నారు సీతమ్మ. భోజనం అయిన తర్వాత కాసేపు కునుకు తీద్దామని ఇద్దరూ మంచమెక్కారు.
ఇంకో పార్సెల్ బెల్ కొట్టి సీతమ్మగారిని నిద్రలేపింది. ఆవిడ మోయలేక మోయలేక తోసుకుని తీసుకొచ్చి లోపల పెట్టింది. ఇలా రాత్రి దాకా పార్సెల్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు తీసుకుంటారు. ఇదీ వారి ఉద్యోగం ప్రతిరోజు.
"ఏమి కొంటారు సీతా రోజూ? ఇన్ని పార్సెల్స్ వస్తాయి?" అని పరబ్రహ్మంగారు సందేహం వెలిబుచ్చారు ఆ రోజు.
"ఏమోనండీ! నాకేం తెలుస్తుందని నన్నడుగుతున్నారు?" అని సీతమ్మగారి సమాధానం.
"ఏమో, కోడలు పిల్ల కదా ఎక్కువ ఆర్డర్ ఇచ్చేది. ఆడవాళ్లకు ఆడవాళ్లకు ఏమైనా తెలుస్తాయేమోనని" అని భార్యను ఉడికించడానికి అన్నారు.
"నాకేమీ తెలీదండోయ్! ఏనాడూ నేను శైలూని అడిగింది లేదు, ఆమె నాకు చెప్పింది లేదు. మీరు అడిగి చూడలేకపోయారా? మీకు అన్నీ బాగుంటాయేమో, పార్సెల్స్ విప్పి చూపించేదేమో!" అని సీతమ్మగారు వెటకారం వెళ్లగక్కారు.
"అలాగేలేవే, అడుగుతాను నాకేమైనా భయమా?" అని పరబ్రహ్మంగారు పౌరుషం ప్రదర్శించారు.
ఒకరోజు రాత్రి భోజనాలు చేస్తుండగా "ఒరేయ్ రాజా! ఇవ్వాళ వచ్చిన అమెజాన్ పార్సెల్స్ మీ రూంలో అల్మారాలో పెట్టాము. చూసుకున్నారుగా?" అని పరబ్రహ్మంగారు కొడుకును అడిగారు.
"చూస్తాములే నాన్నా" అన్నాడు రాజా అన్నంలో పచ్చడి కలుపుకుంటూ.
"పెద్ద పెద్ద బాక్సులు వచ్చాయిరా! ఒకసారి చూసుకుంటే బాగుంటుందేమో" అని సీతమ్మగారు వదలలేదు.
"రాజా! థర్డ్ బెడ్రూంలో డంప్ చేసినట్లున్నాయి బోలెడు పార్సెల్స్! ఇంకా ఓపెన్ కూడా చేసినట్లు లేదు. ఒకసారి చూసుకుంటే బాగుంటుందేమో!" అని నెమ్మదిగా అన్నారు పరబ్రహ్మంగారు.
"మామయ్యగారూ, చూసి ఒకరోజు సర్దేస్తాను. ఈ వారం కాస్త బిజీగా ఉండటం మూలంగా చేయలేకపోయాము. అన్నీ సర్దేస్తా రేపో, ఎల్లుండో!" అని మామగారికి చెప్పింది.
"సరేనమ్మా, నన్ను సాయం చేయమంటే చేద్దామని..." మామగారి బుజ్జగింపు.
"రోజూ పార్సెల్స్ వస్తుంటే ఏమున్నాయో ఏమి లేవో కూడా తెలియదేమో..." అని సీతమ్మగారు అనబోతుంటే, "సరే అత్తమ్మా! రేపు ఆదివారం అన్నీ సర్దుదాం" అంది శైలజ.
ఆదివారం పొద్దున్న కాఫీ, టిఫిన్స్ తిన్నాక, "ముందు వంటింటి సామాను సంగతి చూద్దామా శైలూ?" అని అత్తగారు అడగగా, "సరే అత్తమ్మా పదండి" అని ఇద్దరూ పార్సెల్స్ అన్నీ ముందేసుకుని కూర్చున్నారు.
"శైలూ! నువ్వేమీ అనుకోనంటే నీకో మాట చెప్పనా?" అని అత్తమ్మ అడిగింది.
"అయ్యో! నేనేమనుకుంటాను? చెప్పండత్తమ్మా!" అని అడిగింది శైలజ.
"ఏమిటంటే శైలూ! మనం ట్రాఫిక్ లోనూ, పొల్యూషన్ లోనూ బయటకు వెళ్లకుండా మనకేదైనా కావాలంటే ఆర్డర్ చేసిన వెంటనే తెచ్చి మన గుమ్మంలో పెట్టేస్తున్నారు. నిజమే కాదనను శైలూ!"
"అవును కదా అత్తమ్మా? కరెక్ట్ గా చెప్పారు. వానలో అయినా, ఎండలో అయినా, చలిలో అయినా ఏది ఆర్డర్ చేసినా, ఆఖరికి కొండ మీది కోతినైనా నిమిషాల్లో తెచ్చి చేతిలో పెడతారు..." అని శైలూ చెప్పుకుంటూ పోతోంది.
"కానీ నువ్వొకటి ఒప్పుకోవాలి శైలూ! ఇక్కడ చూడు. ఎన్ని జీలకర్ర ప్యాకెట్లు ఉన్నాయో, ఎన్ని మిరియాల ప్యాకెట్లు ఉన్నాయో, ఎన్ని పల్లీ ప్యాకెట్లు ఉన్నాయో, ఎన్ని కందిపప్పు ప్యాకెట్లు ఉన్నాయో! ప్రతి నెలా మనకు ఎన్ని కావాలో అన్నే కొనుక్కోవాలి" అని అత్తగారు కలుగజేసుకుని చెప్తుంటే, ఆవిడకేసి చూస్తూ వింటోంది శైలజ.
"అది కాదు అత్తమ్మా, ఒక వస్తువుకే అయితే డెలివరీ చార్జీలు ఎక్కువేస్తాడు. అందుకని ఎలాగూ వాడుకుంటాం కదా అని తీసుకుంటున్నాను. అందుకని ఇలా అవుతోంది" అంది శైలజ.
“నా తలకాయ! లాభం గూబల్లోకి వచ్చినట్లు, వాటిలో సగం పురుగులు పట్టి పోతున్నాయి.
నా మాట విను శైలూ! హాల్లోనూ మీ ఇద్దరి డ్రెస్సులు, దుప్పట్లు, ప్యాంట్లు ఇంకా ఏవో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి తీయి, వాడుకుందాము."
“అబ్బా సరేలేవే అమ్మా! తీస్తుందిలే! తనకీ టైం ఏది? చూస్తూనే ఉన్నావు కదా" అని భార్యకు ఎక్కడ కోపం వస్తుందో అని వెనకేసుకొచ్చాడు.
“సరేలే శైలూ, ఇలా వస్తువులు వృధా కాకుండా ఉండాలంటే నెలకు ఏవి ఎంత కావాలో లిస్ట్ రాసుకుని ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు. వచ్చాక ఒక్కసారి సర్దుకుంటే సరిపోతుంది. అస్తమానం పార్సెల్స్ సర్దుకోనక్కర్లేదు. వస్తువులు కూడా వృధాగా పోవు. వచ్చే నెల ఒక్కసారి అలా తెప్పించి చూడు, నీకే తేడా తెలుస్తుంది" అని కోడలికి నచ్చచెప్పజూసింది సీతమ్మగారు.
శైలూకు ఆ ప్యాకెట్లు చూసి అప్పటికే తల దిమ్మతిరిగి, అత్తగారి మాటలు నిజమనిపించాయి. "అలాగే అత్తమ్మా! మీరు చెప్పినట్లే చేస్తాను. ముందుగా ఉన్నవన్నీ వాడి, అవి అయిపోయాకే కొంటాను అత్తమ్మా!" అని హామీ ఇచ్చింది.
హామీ ఇవ్వడమే కాక అలాగే చేసింది. సర్దుడు పనీ తగ్గింది, నెలవారీ ఖర్చులూ తగ్గాయి. అత్తమామలూ సంతోషించారు. ఇక వారికి పార్సెల్ పర్వము ముగిసింది.
ఈ కథ మీకు నచ్చిందా?
మీ ఇంట్లో కూడా ఇలాంటి "పార్సెల్ పర్వం" ఎప్పుడైనా జరిగిందా? మీ అనుభవాన్ని కామెంట్‌లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని తెలుగు కథల కోసం manatelugukathalu.com ను సందర్శించండి.
------సమాప్తం------
నయన కస్తూరి గారి కొన్ని ఇతర రచనలు:
నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నయన కస్తూరి
నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక విషయాలు రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.








Nice
అవును. ఈ మధ్య online కొనుగోళ్లు ఎక్కువైపోయాయి . అవసరం వున్నా లేకున్నా కొనేయడం. రిటర్న్ పాలసీ వున్నవస్తువులు ఐతే కొనేయడం, సూట్ కాలేదని ఇచ్చేయడం. పాపం ఇంట్లో వున్న పెద్దవారికి ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకొంటీ వాయనం తరహాలో అయిపోయింది.పెద్దవాళ్ళ పరిస్థితిని చాలా చక్కగా చూపించేరు నయన కస్తూరి గారు .
ఆన్లైన్ షాపింగ్ లో పడిపోతున్న యువత మరి దాని పర్యవసానం ఇంట్లొ ఉన్న పెద్దవాళ్ళపై ఎలాపడుతుంది అన్న విషయం చక్కని కథ రూపంలో చెప్పేరు నయన గారు. అభినందనలు.