ఇల్లు
- Nayana kasthuri

- Jun 21
- 5 min read
ఇల్లు, తెలుగు కుటుంబ కథ, తల్లి ప్రేమ, కుటుంబ బంధాలు, emotional Telugu story, family relationship story, mother sacrifice, Telugu short story, family values, elderly loneliness, Telugu literature, inspirational family story, mother emotions, Telugu emotional story, Mana Telugu Kathalu

Illu - Telugu Emotional Story | Nayana kasthuri
ఇల్లు - తెలుగు భావోద్వేగ కథ | నయన కస్తూరి
Published in manatelugukathalu.com on 21/06/2026
ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు... మనల్ని అర్థం చేసుకునే మనుషులు ఉన్న చోటే నిజమైన ఇల్లు.
భర్త కోసం, పిల్లల కోసం జీవితమంతా అంకితం చేసిన ఒక తల్లి... అదే ఇంట్లో తనను ఎవరూ పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది?
"ఇల్లు" కథ ఆధునిక కుటుంబాల్లో నెమ్మదిగా పెరుగుతున్న భావోద్వేగ దూరాన్ని అద్దంలా చూపిస్తుంది. ప్రేమ ఉంది... కానీ సమయం లేదు. బాధ్యతలు ఉన్నాయి... కానీ పలకరింపు లేదు. చివరకు ఒక తల్లి తీసుకున్న నిర్ణయం అందరికీ జీవిత పాఠంగా మారుతుంది.
ప్రతి కుటుంబం చదవాల్సిన హృదయాన్ని తాకే కథ.
అది ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని ఒక ఫ్లాట్. మరీ పెద్దదేమీ కాదు. అందులో నివసించే వేణుమాధవ్ గారి కుటుంబ సభ్యులు ఏమి చేస్తున్నారో చూద్దాం పదండి!
మొదటిగా ఆ కుటుంబ యజమాని అయిన వేణుమాధవ్ గారిని కలుద్దాం. అయితే ఆయన మనం పిలిచినా మనకేసి కన్నెత్తి చూసే స్థితిలో కూడా లేరనుకోండి. ఎందుకంటే ఆయన ఒక కథ రాయడంలో మునిగిపోయి ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా చేసి ఆయన ఈ మధ్యనే రిటైర్ అయి, తరచూ కథలు రాస్తూ ఉంటారు. సాధారణంగా ఆయన స్త్రీలు, వారి కుటుంబ సమస్యల మీద ఎక్కువగా కథలు అల్లుతారు. ప్రస్తుతం రాస్తున్న కథ కూడా ఇంచుమించుగా అలాంటిదే. ఆ కథ ఆయన మొదలెట్టి రెండు రోజులైంది. ఎలాగైనా ఇక ఈ రోజు దీనిని ముగించాలి అని గట్టి పట్టు మీద ఉన్నారు. స్నానం చేసి పూజ చేసుకుని కూర్చున్నారు కథ రాయడానికి.
‘ఏవండీ, ఏమి చేస్తున్నారు? కాఫీ కావాలా వద్దా? ఇందాకటి నుండి నా మట్టుకు నేను చెవి కోసిన మేకలా అరుస్తూనే ఉన్నా మీ మట్టుకు మీరు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు’ అంటూ కొంచెం గట్టిగానే పిలిచారు వంటింట్లోంచి ఆయన భార్య గిరిజ గారు.
భర్త నుండి సమాధానం రాకపోయేసరికి, ఆవిడే బయలుదేరారు చేతిలో కాఫీ గ్లాసుతో. హాల్లో కనిపించకపోయేసరికి బెడ్రూంలో ఉన్నారేమోనని వెళ్లిన గిరిజ గారికి వంచిన తల ఎత్తకుండా సీరియస్‌గా రాసుకుంటున్న భర్తను చూసేసరికి ‘ఇదా సంగతీ! మళ్ళీ కథలో పడ్డారన్నమాట. ఇక ఈయనకు కొంప కాలిపోతున్నా కనిపించదులే’ అనుకుంటూ, ఆయన చేతికి గ్లాసు అందించింది.
మళ్ళీ ఆయన పనిలో పడిపోయారు కాఫీ తాగుతూ. ‘ఆడవాళ్ళ సమస్యల గురించి రాస్తారు కానీ వారి బాధలు అర్థం కావు’ అనుకుని వాపోతూ పిల్లల కోసం చూశారు.
‘ఈ పిల్లలెటు పోయారో! సెలవు రోజు కూడా కంటికి కనపడితే ఒట్టు. ఏరా రవీ! ఒసేయ్ కవితా! ఏమి చేస్తున్నారు? ఈ రోజు శనివారం కదా! రోజూ ఇద్దరూ ఆఫీసుకీ పొద్దున్న పోయి రాత్రికి వస్తారు. సెలవు రోజైనా కాస్త అమ్మతో నాలుగు మాటలు మాట్లాడవచ్చు కదా!’ అంటూ ఆప్యాయంగానే నొచ్చుకుంటూ పిల్లల గదిలోకి వెళ్ళింది.
రవి సెల్‌లో మాట్లాడుతూ ‘మాట్లాడద్దు కాల్‌లో ఉన్నా’ అని సైగ చేశాడు. కానీ గిరిజ గారికి తెలుసు, వాడు వాడి గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడని.
మనసు చిన్నపుచ్చుకుని కూతురి దగ్గరకు వెళ్ళింది. పక్క రూంలో కవిత లాప్‌టాప్ పెట్టుకుని బిజీగా వేళ్ళను టకటక డాన్స్ ఆడించేస్తోంది. దగ్గరకు రాబోతున్న అమ్మకు కాసేపు ఆగు అన్నట్టుగా సైగ చేసింది. మొహంలో కొంచెం విసుగు కూడా కనిపించి అర్థమైంది కూతురు ఆన్‌లైన్ షాపింగ్‌లో బిజీ అని. మనసుకి బాధ కలుగగా వంటింట్లోకి వెళ్ళి స్టవ్ మీది కూరను కలపసాగింది.
వేణుమాధవ్, గిరిజ గారలకు ఒక కొడుకు, ఒక కూతురు. అవునండీ రవి కొడుకు. వాడికన్నా రెండేళ్లు చిన్నది కూతురు కవిత. భర్త ఆఫీసు పనులతో బిజీగా ఉండటం వలన గిరిజగారే పిల్లలిద్దరినీ ముద్దుముచ్చట్లు తీరుస్తూ ఎంతో శ్రద్ధ, ప్రేమలతో పెంచి పెద్దచేసింది. వాళ్ళు చక్కగా చదువుకుని ఇంజనీరింగ్ పూర్తిచేసుకుని, మంచి ఉద్యోగాలు సంపాదించుకుని ఇద్దరూ, వాళ్ళ జీవితాలతో వాళ్ళు బిజీ అయిపోయారు. తల్లీ, తండ్రి వాళ్ళ ఆలోచనలలో కనుమరుగైపోయారు. వాళ్ళ వివాహ విషయాల్లో కూడా ఇద్దరూ వారికి వారే జీవిత భాగస్వాములను ఎన్నుకుని, తల్లితండ్రులకు తెలియజేశారు.
ఒక త్రీ-బెడ్రూమ్ ఫ్లాట్‌లో కలిసి నివసిస్తున్న ఆ కుటుంబంలోని నలుగురూ ఎవరి లోకంలో వారు బ్రతుకుతున్నారు. తండ్రి తన వ్రాతలలో తాను మునిగిపోయి, పిల్లల బాధ్యతలు తీరిపోయినట్టే అనిపించి, భార్యకు ఈ వయసులో తన తోడు చాలా అవసరమని మర్చిపోయి, తన వ్యాపకంలో తాను మునిగిపోయాడు.
తన కుర్చీ, టేబుల్, పేపర్, పెన్ మాత్రమే ఆయన సహవాసులు. ఆయన గది మాత్రమే ఆయన ఇల్లు అనుకుంటారు. ఇక పిల్లల సంగతి సరేసరి. తమ కొత్త స్నేహాలు, కొత్త అలవాట్లు, కొత్త కొత్త జీవితాలు, స్వాతంత్రాలు, కొత్త కొత్త కలలు వాళ్ళను చాలా బిజీగా చేసేయి. ఎంత బిజీ అంటే, అందులో పడి వాళ్ళు తల్లి మనసును గుర్తించడమే మర్చిపోయారు. వాళ్ళ గదులే ఇప్పడు వాళ్ళకి ఇల్లు.
ఇక గిరిజ గారికి మాత్రం తన కుటుంబం తప్పితే వేరే ప్రపంచం లేకపోవడం వలన, ఇప్పటికీ వారే తన సర్వస్వం అనుకోవడం వలన, వారు తనను నిర్లక్ష్యం చేస్తే కలిగే బాధను తట్టుకోలేకపోతోంది. తమ ఇంట్లో తన ఇల్లు అనదగ్గది తమ వంటిల్లు మాత్రమే అని తెలుసుకుంది. ఎక్కువ సమయం వంటింట్లోనే గడుపుతుంది ఏదో ఒకటి సర్దుకుంటూ.
ఆ రోజు రాత్రి, మర్నాడు పొద్దున్నకి టిఫిన్ ఏమీ చెయ్యాలో ఆలోచించడం మొదలుపెట్టింది. రవ్వ ఇడ్లీ చేసి చాలా రోజులైంది, రేపు పిల్లలకి రవ్వ ఇడ్లీ, అందులోకి పల్లీ చట్నీ చేస్తా! అయినా ఒకసారి ఆయనను అడిగి వస్తా అని భర్త దగ్గరికి వెళ్ళింది. ఆయన ఇంత లావు పుస్తకం చదివేసుకుంటున్నారు సీరియస్‌గా.
‘ఏవండీ... ఏవండీ... ఏవండీ’ అని మూడుసార్లు పిలిచింది. ఆయన పుస్తకంలోంచి తల తిప్పలేదు. ఈయన ధోరణి ఇంతే ఇక మారదు అని తనలో తనే గొణుక్కుని, ‘ఏవండోయ్, మిమ్మల్నే’ అని భుజం మీద చెయ్యేసి, కుదిపి పిలిచింది.
ఆయన ఉలిక్కిపడి, ‘ఏమిటే, ఏం కావాలి నీకు?’ అని విసుక్కున్నారు.
‘అబ్బే! నాకేం అక్కర్లేదు కానీ, రేపు మీకు టిఫిన్లోకి ఏమీ కావాలి మహాశయా సెలవీయండి’ అన్నారు.
‘ఏదో ఒకటి చెయ్యవమ్మా! దానికి నన్ను డిస్టర్బ్ చేస్తావు’ అని మొహంకేసి చూడకుండానే అరిచారు.
‘అయితే సరేలెండి’ అని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది.
కొడుకునైనా అడుగుదామని కొడుకు దగ్గరికి వెళ్ళింది. కొడుకు యథాప్రకారం లాప్‌టాప్‌లో తలపెట్టుకుని కుస్తీ పడుతున్నాడు. ‘ఏమిటమ్మా’ అని కూడా పలకరించలేదు అమ్మని. ‘ఒరేయ్ రేపు రవ్వ ఇడ్లీ చేసి పెట్టనా బ్రేక్‌ఫాస్ట్‌లోకి?’ అని అడిగింది అభిమానంగా.
‘అమ్మా! నేనిప్పుడు బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడుకుందాము’ అన్నాడు. తన మాట వాడు అసలు విననే లేదని అర్థమైంది ఆవిడకు.
అక్కడి నుండి హాల్‌లో టీవీ చూస్తున్న కూతురి దగ్గరకు వెళ్ళి అడిగింది. ‘నీకు రవ్వ ఇడ్లీ చేయడం వచ్చా? బాగా చేయగలిగితే చెయ్యి’ అంటూ మళ్ళీ టీవీ చూడటంలో లీనమైంది.
కూతురి మాటలకు గిరిజ మనసు చివుక్కుమంది. తన రెండు చేతులకేసి చూసుకుంది. ‘ఎంతమందికి ఎన్ని రకాల వంటలు, పిండివంటలు వండి, వడ్డించి మెప్పించిన చేతులివి’ అని నిశ్శబ్దంగా నిట్టూర్చి, తన ఇంట్లోకి వెళ్లి, రవ్వ ఇడ్లీకి అన్నీ రెడీ చేసి పడుకుంది.
వొళ్లంతా నొప్పులు, కొంచెం జ్వరము కూడా రావడంతో రోజూలాగా పొద్దున్నే లేవలేకపోయింది గిరిజ గారు. పిల్లలూ భర్త లేచారు, ఎవరి పనులు వారు కావించుకున్నారు, స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు.
‘నాకు అమ్మ చేస్తుందిలే మీరు తిని వెళ్ళండి’ అన్నారు వేణుమాధవ్ గారు. పిల్లలిద్దరూ ఆఫీసుకి టైం అవడంతో వెళ్ళిపోయారు.
కాసేపటికి, ‘అయ్యో లేట్ అయింది, లేవలేకపోయా, పిల్లలేం తింటారు’ అనుకుంటూ కంగారుగా లేచింది గిరిజ. పిల్లలు లేరు, వెళ్ళిపోయినట్టున్నారు, ఆయనేమీ చేస్తున్నారో అనుకుంటూ ఆయన గదిలోకి వెళ్ళింది. ఆయన న్యూస్ పేపర్ చదవడంలో లీనమై ఉన్నారు.
‘ఏవండీ టిఫిన్‌కి వస్తారా? పిల్లలూ వెళ్ళిపోయారా?’ అంటూ నీరసంగా అడిగింది.
‘వెళ్ళకుండా ఉంటారటే? నువ్వు పడుకున్నావని! నాకు కాస్త టిఫిన్ పడేయ్’ అన్నారు.
‘పది నిమిషాల్లో పెట్టేస్తా’ అంటూ లేని ఓపిక తెచ్చుకుని వంటింట్లోకి వెళ్ళింది. వొళ్ళు నొప్పులు తగ్గడానికి డోలో మాత్ర మింగి పని మొదలుపెట్టింది. వాళ్ళ ముగ్గురిలో ఎవరు తనకేసి చూసినా, వాళ్ళు గ్రహించేవారు తనకు ఒంట్లో బాగాలేదని. చూస్తేగా, అని నిట్టూర్చింది.
సాయంకాలానికి జ్వరం పెరిగి పడుకునే ఉంది గిరిజ సోఫాలో. కవిత వచ్చింది ఆఫీస్ నుండి. పడుకుని ఉన్న అమ్మని చూసి...
‘అమ్మా, నీ పనే బాగుందే! పొద్దున్న మేము వెళ్ళినప్పుడూ పడుకునే ఉన్నావు, మేము వచ్చేటప్పుడు కూడా దొర్లుతున్నావు.’
‘నాకు ఒంట్లో బాగాలేదే’ అని చెప్తున్నా వినిపించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది.
గిరిజ ఎలాగో ఉప్మా చేశాననిపించి అందరికీ పెట్టింది. తను తినలేదు. అయినా, ఎవరూ పట్టించుకోలేదు. ‘తిన్నావా, తినలేదా’ అని ఎవరూ అడగలేదు. అదే తనైతే వాళ్ళను ఎలాగ చూసుకుంటుంది ఇప్పటికి కూడా?
ఏవో ఆలోచనలు గజిబిజిగా గిరిజను చుట్టుముట్టాయి. ప్రస్తుతానికి ఎవరికీ తన సహాయం అక్కర్లేదు. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకదగ్గ సమర్థులు. ‘నేను ఎవరికి సహాయమవసరమైతే వారికే నా శక్తిని, నా సమయాన్ని ఉపయోగిస్తా’ అని ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చింది.
తను ఒక అనాథాశ్రమంలో చేరి, అనాథలకు ఏదైనా సర్వీస్ చేయబోతున్నట్టు, ఎప్పుడైనా వారికి తన అవసరం ఉందనిపిస్తే తాను వస్తానని, మరునాడే భర్త, పిల్లలకు తన నిర్ణయాన్ని తెలిపింది. వాళ్ళు గిరిజ గారి నిర్ణయం విని మాటలుడిగి నిలబడిపోయారు.
***
నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నయన కస్తూరి
నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్ హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక విషయాలు రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.






కస్తూరి గారు,
మన సమాజంలో ఉండే ప్రతి ఇంట్లో ప్రతి నిత్యం జరిగే విషయాలకు అద్దం పట్టేరు మీ కథతో. ఐతే ఆవిడ చెప్ప పెట్టకుండా, information ఏదీ వదలకుండా వెళ్ళిపోయి ఉంటే ఇంకా బావుండేది.
Bavundi chalaa
"ఈ కథ చాలా బాగా రాశారు. కథనం ఆసక్తికరంగా ఉంది, పాత్రల భావోద్వేగాలు చక్కగా వ్యక్తమయ్యాయి. చివరి వరకు చదివేలా ఆకట్టుకుంది. రచయితకు అభినందనలు."
Very well Written ma'am
Beautifully written 👏