కాలువ గట్టు
Kalava Gattu - Telugu Social Family Story | Bugatha Yamuna
కాలువ గట్టు - తెలుగు కుటుంబ సామాజిక కథ | బుగత యమున
Publishes in manatelugukathalu.com on 21/09/2026
కాలువ గట్టు గ్రామీణ వాతావరణంలో సాగే బాల్య స్నేహం, తల్లి ప్రేమ, పిల్లల అల్లరి, ప్రమాదం చుట్టూ అల్లుకున్న హృద్యమైన కథ. చేపలపై ఆసక్తితో కుమార్ చేసిన సాహసం అతడిని అనుకోని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఆ సమయంలో తేజా చూపించిన స్నేహం, ధైర్యం కుమార్‌కు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవంగా మారుతుంది. పిల్లలకు జాగ్రత్త, స్నేహం, తల్లిదండ్రుల ప్రేమ విలువను గుర్తుచేసే కథ ఇది.
తూరుపు కొండల మధ్య నుండి మెల్లగా పైకి ఎగురుతున్న సూర్యుడిని చుట్టుముట్టేసిన మబ్బులు ఆ ప్రాంతాన్ని అంతటినీ పొద్దుగాలనే నిద్రను పులుముకున్న ఆహ్లాదకరమైన ప్రాంతంగా మార్చేశాయి.
"ఒరేయ్ కుమార్... లేరా బాబూ... తెల్లారి చాలా సేపయింది... బయట ఏం జరుగుతుందో చూడు" అంటూ నిద్రలేపిన తేజాతో...
బద్ధకంగా లేస్తూ... "ఒరేయ్ నువ్వారా? ఇంత చీకటిలో ఎక్కడికి వెళ్ళడానికిరా? మా అమ్మ నిన్ను చూసిందో... మనిద్దరినీ కట్టి మరీ కొడుతుంది. నువ్వు మెల్లగా మా అమ్మకు కనిపించకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో... నేను తెల్లవారగానే వచ్చేస్తాను... అంటూ దుప్పటి లాక్కుంటున్న స్నేహితుడి ముఖాన్ని గడియారం వైపు తిప్పి... "చూడరా టైమ్ ఎంత అయిందో!! నీకు మత్తు నిద్ర వదలకపోతే ఇంకా తెల్లారనట్టేనా? నువ్వు ముందు రా రా బయటికి..." అంటూ లాక్కుపోతున్న తేజాతో...
"ఒరేయ్ ఆగరా..! మా అమ్మ ఎక్కడుందో చూసొస్తాను" అన్న కుమార్కు, "మీ అమ్మ ఇక్కడ ఉంటేగా అసలు... మీ అమ్మ ఎక్కడుందో నాకు తెలుసు... నేను చూపిస్తా... నాతో రా..!" అని బయటికి తీసుకుపోయేసరికి అక్కడ వేచి ఉన్న అద్భుత ప్రపంచం కుమార్కు సాదర స్వాగతం పలికింది.
మురికి లేకుండా కడిగేసిన రోడ్డుపై అక్కడక్కడా బురదతో పెయింటింగ్ వేసిన చెప్పుల గుర్తులు, అక్కడక్కడా గాలికి ఎగిరివచ్చిన తాటిమట్టలు, జీబు సెంకులు, తడిసి నానిపోయి ముక్కలుముక్కలుగా పడి ఉన్న చిన్న చిన్న పుల్లలు ఎంతో ఆహ్లాదంగా కనిపించాయి. ఆ ప్రకృతి దృశ్యం కుమార్ కళ్ళను కట్టిపడేయడంతో... "ఒరేయ్ తేజా వర్షం పడిందారా!! పదరా కాలువ గట్టు దగ్గరికి తొందరగా... మా అమ్మ చూడక ముందే ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం" అనుకుంటూ పరుగులంకించారు.
ఆ ప్రదేశమంతా ఊరి జనంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా నిండిపోయింది. మగవారు కాలువలో దిగి వలలు వేసి చేపలు పడుతుంటే... ఆడవారు, పిల్లలంతా సందడిగా చూస్తున్నారు. వాళ్లందరినీ తప్పించుకొని వీళ్లిద్దరూ ముందుకు వెళ్ళేసరికి... మళ్ళీ చినుకులు మొదలవడంతో చూస్తున్న వారంతా మెల్లగా ఇళ్ళ వైపు పరుగులు తీశారు. కానీ, అక్కడే నిలబడి చూస్తున్న కుమార్ను... ఒరేయ్ కుమార్ రా రా... మీ అమ్మ అదిగో... చూసిందంటే మనిద్దరికీ తొక్క తీస్తుంది. మీ అమ్మ వెళ్ళక ముందే మనమే ఇంటికి వెళ్ళిపోదాం అంటున్న తేజాతో...
"ఒరేయ్ నువ్వాగరా?! మనం ఆ చెట్టు చాటుకి వెళ్ళి దాక్కుందాం... మా అమ్మ వెళ్ళే వరకూ... పద పదా..!" అని తల్లి దేవికి కనిపించకుండా దాక్కున్నారు.
అప్పటి నుంచి ఇద్దరూ అక్కడే ఉన్నారు. ఇంటికి వెళ్లిన దేవి అక్కడ లేని కుమార్ కోసమని గొడుగు పట్టుకొని ఊరంతా వెతుకుతుంది. కానీ, కాలువ గట్టు వైపుకి పోలేదు. ఎందుకంటే తను అక్కడి నుంచే వచ్చింది కదా! అక్కడకి తను వచ్చి ఉంటే తనకీ కనిపించి ఉండేవాడు కదా! అనుకుని ఆ చోట తప్ప అన్ని చోట్లా వెతుకుతూ ఉంది.
మధ్యాహ్న సమయం అయ్యేసరికి... చేపలు పట్టే వాళ్ళంతా కొంచెం విరామం ఇస్తూ వలలు గట్టు పై ఆరబెట్టి ఇంటికి పోయేటప్పుడు... అందరి బుట్టల్లో వేసిన చేపలు ఎగిరిపోకుండా చూసినందుకు కుమార్కు, తేజాకు పిత్తన పరిగెలను ఇస్తే... వాటిని పట్టుకొని ముచ్చట పడిపోతూ ఇంటికి పోయిన కుమార్... కుళాయి నీటితో నింపి ఉన్న పెద్ద డ్రమ్లో ఆ చేపలను పెంపకానికి వదిలి... వాటి మేత కోసమని నూకలు వెతుకుతూ వంట గదిలో ఉన్న సామాన్లను తనిఖీ చేస్తుండగా... బయట అన్ని చోట్లా కొడుకు జాడను వెతుక్కుంటూ వచ్చిన దేవి చూసింది.
కట్టలు తెంచుకున్న కోపంతో విరుచుకుపడుతూ... ఏడ్చుకుంటూ... "ఏరా కుమార్... నీకోసం నేనెక్కడెక్కడ వెతకనురా! ఇలా నువ్వు కూడా మీ నాన్న లాగే నన్ను దుఃఖ పెడితే ఎలారా! మీ నాన్న ఒక కొడుకు ఉన్నాడని కూడా పట్టించుకోకుండా వదిలిపోయాడు. నువ్వా ఇలా ఇంటి పట్టున చేరకుండా చేపలు పిచ్చి పట్టి తిరుగుతున్నావా?" అంటూ వీధిలోకి లాక్కొచ్చి అక్కడ ఉన్న వారందరికీ చెప్పుకుంటూ చీపురు కట్ట తిరగేసి కొట్టింది.
దేవి అలా బాధపడడం చూసిన పెద్ద వాళ్లందరూ కుమార్కు మరి కొంచెం ఎక్కువ చివాట్లు పెట్టగా... వాడి తోటి పిల్లలందరూ "ఒరేయ్! వీడు ఈ పిత్తన పరిగెల కోసమని ఇన్ని దెబ్బలు కాశాడురా... నేను పెద్ద చేపలు తీసుకు వచ్చాను కాబట్టి మా అమ్మ నన్నేమి అనలే"దని పక్కింటి రాజు గాడు, వాళ్ళ మిత్రులు గేలి చేశారు.
వాళ్ళ మాటలనే చెవికెక్కిించుకున్న కుమార్ పౌరుషంగా పెద్ద చేపలు పట్టేందుకు బయలుదేరుతూ... తోడుగా తేజాను తీసుకుపోవడానికని వాళ్ళింటికి పోయాడు. అనుకున్నట్టుగానే మిత్రుడిని తీసుకొని కాలువ గట్టు దగ్గరకు పోయారు.
కొంత సేపటి వరకూ గేలంతో పట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఒక్క చేప కూడా పడలేదు. ఇంక లాభం లేదని అక్కడ పరిచి ఉన్న వలలలో ఒకదానిని తీసుకుని కాలువలోకి దిగుతుండగా... "ఒరేయ్ కుమార్ వద్దురా... కాలువ ఈడ్చుకుపోతది... నేను చెప్పింది వినరా..." అంటుంటే...
"ఒరేయ్ తేజా... ఆ రాజు గాడు వాళ్ళు మన కంటే మూడేళ్ళే పెద్దైనా పెద్ద చేపలు పట్టుకొచ్చారు... మనం పట్టలేమా" అంటూ తర్కంగా నీటిలోకి దిగాడు. తేజా మాత్రం భయపడుతూనే... "ఒరేయ్ నా మాట వినకుండానే దిగుతున్నావ్... ఇదిగో ఈ కర్రను నీకు పక్కగానే ఉంచుతాను... నిన్ను కాలువ నీరు లాక్కుపోతుందన్నపుడు ఈ కర్రను గట్టిగా పట్టేసుకోయే" అని సలహా చెప్పాడు.
కొంత సేపటికి ప్రవాహానికి ధీటుగా నిలబడ్డ కుమార్ను ఒక్కసారిగా జోరుగా వచ్చిన కాలువ లాక్కుపోగా కుమార్ కర్రను అందుకోలేకపోయాడు. ఆ ప్రవాహంతో పాటే గట్టుపైన ఉన్న తేజా పరిగెడుతూ... కర్రను కుమార్కు అందించి... మిత్రుడిని మెల్లగా బయటికి లాగాడు.
బయటికి లాగి, మిత్రుడి చెంపపై చెళ్లుమనిపించి... "ఒరేయ్ వద్దన్నాను కదరా...! నీకు ఏమైనా అయితే మీ అమ్మ ఏమైపోతుందిరా... నేనేమైపోతానురా..." అని గట్టిగా కుమార్ను హత్తుకున్నాడు.
కుమార్కు మాత్రం ఆ రోజు నుండి చేపల పిచ్చి దిగింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన భయం నుండి తేరుకోలేకపోతున్నాడు. అప్పుడే అక్కడకు ఇద్దరినీ తిట్టుకుంటూ వస్తున్న కుమార్ తల్లి దేవి, తేజా తల్లిదండ్రులు వీళ్లిద్దరినీ ఇలా చూసినందుకు ఒక వైపు భయపడినా, మరో వైపున ఆనందపడ్డారు.
సమాప్తం
బుగత యమున గారి కొన్ని ఇతర రచనలు:
బుగత యమున గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: బుగత యమున
నేను బుగత యమున,సెకండరీ గ్రేడ్ టీచర్ గా గోకవరం మండలంలో పని చేస్తున్నాను..నాకు సాహిత్యం అంటే ఎనలేని అభిమానం..ఆ అభిమానం అందించిన ప్రోత్సాహకంతోనే ముందుగా ప్రతిలిపి యాప్ లో రచనలు చేయడం మొదలుపెట్టి..సుమారు 200 వరకూ రచనలు చేసాను..అలాగే సాహితీ గోదావరి మరియు విశాఖ సంస్కృతి పత్రికలకు కూడా నేను కవితలు రాస్తూ ఉంటాను..
***












Comments