తాత పెంచిన మనవరాలు
- Ch. Pratap

- 21 hours ago
- 5 min read

Thatha Penchina Manavaralu - Telugu Emotional Story| Bugatha Yamuna
తాత పెంచిన మనవరాలు - తెలుగు భావోద్వేగ కథ | బుగత యమున
Publishes in manatelugukathalu.com on 21/03/2026
ఓ వేసవికాలం రాత్రి, పనిలో పరుగులాట పూర్తయిన తరువాత, విశ్రాంతి సమయం నడవలో నవారు మంచం వేసి సాదర స్వాగతం పలికేసరికి, హమ్మయ్యా అని ఓ నిట్టూర్పును విడిచి మంచం మీద చతికిల బడ్డాడు గోపాలం.
తాతయ్యకు చెంబుడు నీళ్లను తీసుకొచ్చి ఇచ్చిన ఈశ్వరి, "తాతయ్యా బాగా అలసిపోయావా? నేను నీకు కాళ్ళు పట్టేదా?" అని ఆప్యాయతతో అడిగిన రెండు ప్రశ్నలకు, అలసట మొత్తం ఆవిరైపోయి, అతని ముఖం నిండా అనురాగం నిండిపోయి, "నా తల్లే! నా అమ్మే! ఈ తాతకి కాళ్ళు పట్టేస్తావెంటమ్మా నువ్వు!"
అంటూ ముఖం నిండా ముద్దులు పెట్టి గుండెలకు హద్దుకొని, "నువ్వే కాలు పట్టక్కర్లేదు. ఆ మాట అన్నావు, అదే నాకు చాలు తల్లీ! పోయి, ఆడుకో," అని అంటున్న గోపాలంతో.
"నేను పడతానులే తాతా! నువ్వు పడుకో ముందు!" అని బలవంతంగా అతడిని పడుకోమని కాళ్ళు పట్టడం మొదలుపెట్టిన ఈశ్వరితో.
"తల్లీ! నీకు ఈ తాతంటే చాలా ఇష్టం కదమ్మా! పెద్దయిన తరువాత ఈ తాతని పెంచుతావు కదమ్మా!" అని అడగగానే..
"తాతా! నేను పెద్దయిన తరువాత నిన్ను బాగా చూసుకుంటానులే, కానీ...
ఇప్పుడొక మంచి కథ చెప్పు తాతా నాకు," అని అడుగుతున్న ఈశ్వరితో.
"ఓసి గడుగ్గాయి దానా! కథ కోసమా నాకు కాళ్ళు పడతానన్నావు?" అన్నాడు గోపాలం.
"పో తాతా! నేను నిజంగానే నువ్వు అలసిపోయావని కాళ్ళు పడుతున్నాను.
నీకు నేను కాళ్ళు పట్టినప్పుడల్లా నాకు నువ్వో మంచి కథ చెప్పడం అలవాటు కదా! అందుకే అడిగినాను తాతా. నీకు అలసటగా ఉంటే చెప్పొద్దులే," అని అనగానే.
"అలాగే తల్లీ! చెప్తాను కానీ...
నీకు అమ్మమ్మంటే ఇష్టమా? నేనంటే ఇష్టమా? చెప్పు!" అని అడిగిన గోపాలంతో.
"నాకు నువ్వంటేనే ఇష్టం తాతా," అంటున్న ఈశ్వరి నెత్తిపై రెండు మొట్టికాయలు పెట్టి, "పొద్దున్న నేనంటే ఇష్టమన్నాది. ఇప్పుడు నువ్వంటేనే ఇష్టమని అంది. దీని మాటలు నమ్మగూడదయ్యా. దీనివన్నీ బొల్లి బొల్లి కబుర్లే," అంటూ గోపాలానికి తన భార్య సత్తెమ్మ చెప్తుండగా, మూతి ముడుచుకున్న ఈశ్వరిని చూసి, గోపాలం, "నువ్వుండవే! నీవే బొల్లి కబుర్లు. నా బంగారు తల్లి నీలాగా అబద్ధాలు చెప్పేదే? నువ్వు ముందు ఇక్కడినుంచి పోయి, ఆ కంది కాయలు ఉడకబెట్టి ఒలుచుకొనిరావే పో!" అని అక్కడి నుంచి భార్యను తరిమికొట్టేసిన తరువాత, "అనగనగా ఒక రాజు," అని కథను మొదలుపెడుతూ ఉన్న గోపాలంతో, "తాతా! ఎప్పుడూ ఆ ఏడు చేపల కథేనా? అది కాకుండా వేరే ఏదైనా కథ చెప్పు తాతా!" అనడిగింది ఈశ్వరి.
"అలా అయితే మరి ముగ్గురు రాణుల కథ చెప్పేదా?" అన్నాడు గోపాలం. అందుకు కూడా అడ్డంగా తలను ఊపుతూ, "వద్దు తాతా...
ఇప్పటి వరకూ చెప్పని కథ ఏదైనా చెప్పు తాతా," అంది ఈశ్వరి.
"ఇదేంటే నా బంగారు తల్లీ! ఇంత ఇరకాటంలో పడేసావు. ఏ కథ చెప్పినా, 'ఇది చెప్పేసినదే' అనే అంటావు," అని అంటూ.
"సరే, కొత్త కథ చెబుతానులే, చక్కగా వినుకో మరే!" అంటూనే.
అనగనగా ఇద్దరు చిరకాల మిత్రులు. అందులో ఒకడు లక్ష్మయ్య, మరొకడు సోమయ్య. ఈ ఇద్దరూ చిన్ననాటి మిత్రులు, మేనత్త మేనమామల పిల్లలు కూడాను.
విడదీయలేని స్నేహం ఆ ఇద్దరిదీ. పక్క పక్క ఊర్లలో పెరిగినా కలిసే పెరిగారు. ఓ సంధ్య వేళకు ఒకరి ఊరిలో పబ్బం గడిపితే, మరో సంధ్య వేళకు మరొకరి ఊరిలో పబ్బం గడిపేవారు ఇద్దరూ. అలాగే పెరుగుతూ పెద్దయ్యారు. పెళ్ళిళ్ళయ్యాయి. ఏనాడు ఒకరిని మరొకరు ఒక మాట అనుకున్నది లేదు, ఆడుకున్నది లేదు.
ఆ ఇద్దరి పిల్లలు కూడా పుట్టి పెద్దవారవుతున్నారు. సోమయ్యకు ముగ్గురు మగ బిడ్డలతో పాటు ఆడబిడ్డలు ముగ్గురు. లక్ష్మయ్యకు ఐదుగురు మగ బిడ్డలతో పాటు ఒక ఆడబిడ్డ. పిల్లల బాధ్యతల్లో పడిన ఈ ఇద్దరి మధ్య మునుపటి లాగా రాకపోకలు తగ్గాయి. చెట్టా పట్టాలు కట్టుకొని తిరిగిన స్నేహం కాస్త పండగ పబ్బాలకు కలుసుకునేలా మారిపోయింది.
అందుకు ఆ ఇద్దరూ చాలా బాధ పడేవారు. కానీ ఏం చేస్తారు? "పెళ్లి, పిల్లలు అయినాక, వారి కోసమే కదా బతకాలి," అని సర్ది చెప్పుకునేవారు ఇద్దరు కలిసినప్పుడల్లా.
ఇదిలాగే సాగుతున్న కొన్ని రోజుల నాటికి, లక్ష్మయ్య, సోమయ్య ఇంటికి పెద్ద మనుషులతో కలిసి వెళ్ళాడు. లక్ష్మయ్య పెద్ద కొడుకు రాంబాబుకి, సోమయ్య కూతురు పుష్పకు పెళ్లి చేసేందుకు మాటాడిపోవడానికి. ఆనాడు సోమయ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది కానీ, సోమయ్య కొడుకులకు దగ్గర సంబంధం ఇష్టం లేక, సోమయ్యపై రుసరుసలాడినా పట్టించుకోకుండా, సోమయ్య సంబంధం ఖాయం చేసుకున్నాడు. అనుకున్నట్టుగా ఇద్దరికీ పెళ్లి చేసేసి వియ్యంకులైపోయారు సోమయ్య, లక్ష్మయ్యలు. కూతురుని చూసే వంకతో సోమయ్య, పొలం పనికి పోయి అటు నుంచి అటే లక్ష్మయ్య ఇంటికి పోయి, దగ్గర దగ్గరలోనే కలుస్తూ వచ్చేవాడు లక్ష్మయ్యను.
అలాగే రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. లక్ష్మయ్య, సోమయ్యలు తాతలు కూడా అవ్వబోతున్నారు. సోమయ్య కొడుకుకి అప్పటికే కూతురు పుట్టడంతో, కూతురికి అయినా కొడుకు పుడతాడేమో అని ఆశతో ఎదురుచూస్తుంటే, అటు లక్ష్మయ్య ఇంటి వారసుడు పెద్ద కొడుకుకి పుడతాడు అని ఎదురుచూస్తూ ఉండగా, పుష్ప కడుపున పండంటి ఆడపిల్ల పుట్టి అందరి ఆశలను అడియాశలు చేసింది. "పోనీలే ఈసారి కాకపోతే మళ్ళీసారికైనా వారసుడు పుట్టకుండా పోతాడా?" అని సర్ది చెప్పుకొని సంతోషపడ్డారు అందరూ.
అలాగే రోజులు గడుస్తున్నాయి. మళ్ళీ నెల తప్పింది పుష్ప. మళ్ళీ వారసుని కోసమని ఎదురుచూస్తున్న లక్ష్మయ్యకు మళ్ళీ చుక్కెదురై, మూల నక్షత్రంలో పుట్టిన ఓ ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్ల జాతకం తన కుటుంబం మొత్తానికి కీడు చేస్తుందని పంతుళ్ళ ద్వారా తెలుసుకున్న లక్ష్మయ్య ఆ పిల్ల తన ఇంట్లో పెరిగేందుకు ఇష్టపడలేదు సరికదా! ఎవరికైనా పెంపకానికి ఇచ్చేయమని రాంబాబు, పుష్పలతో వాదనకు దిగాడు. స్నేహితుడు మాట్లాడిన ఆ మాటలు సోమయ్యను చాలా బాధపెట్టాయి. తండ్రి మాటకు ఎదురుతిరగలేని రాంబాబు ఏమి చెయ్యలేక నిస్సహాయంగా నిల్చొని ఉండిపోతే, బిడ్డను వదులుకోలేనని తెగేసి చెప్పిన పుష్ప, పుట్టింటికి బిడ్డలిద్దరిని తీసుకు వచ్చేసింది.
పుష్ప పుట్టింటికి తీసుకు పోయిన బిడ్డలను చూడడానికి రాంబాబు చాటు మాటున అయితే వచ్చేవాడు కానీ, తనతో పాటు పెళ్ళాం, పిల్లల్ని తీసుకుపోవడానికి ధైర్యం చేసేవాడు కాదు. పుష్ప పుట్టింటికి వచ్చిన నాటి నుంచి సోమయ్య, లక్ష్మయ్యల మధ్య మాటల్లేవు. సోమయ్య ఇంట్లో చూస్తే ఉమ్మడి కుటుంబం కావడంతో, సోమయ్య కోడళ్లు పుష్పను ఏదో ఒక మాట అంటూ బాధపెడుతుంటే, కొడుకులు వద్దంటూ ఉండగా 'సంబంధం చేశాడు' అని సోమయ్యపై ఎగిరిపడుతూ ఉండడం వలన సోమయ్య నిస్సహాయుడిగా మారి, లక్ష్మయ్యను కలిసి మాట్లాడటానికి పోయాడు.
ఇంటికి వచ్చిన సోమయ్యను మర్యాదగానే చూసుకున్నా, పిల్లను ఇక్కడ పెంచుకునేందుకు వారు ఇష్టపడడం లేదని తెలుసుకున్న సోమయ్య, ఆ సమస్యకు పరిష్కారం చెబుతూ, "ఆ పిల్ల మా ఇంట్లో పెరుగుతుంది. మీరు నా కూతుర్ని ఇంటికి తీసుకురండి," అని చెప్పి వచ్చేయగా, మరుసటి రోజు రాంబాబు తల్లితో పాటు పుష్పను, పెద్ద కూతుర్ని తీసుకుపోయేందుకు వచ్చాడు.
అప్పటికే ఆడపడుచుగా అందరి దెప్పిపొడుపులను, చీదరింపులను భరిస్తూ వచ్చిన పుష్ప, మనసును దిటవు చేసుకుని, అత్తారింటికి కూతుర్ని వదిలి బయలుదేరింది.
అని చెప్పుకుంటూ పోతున్న తాతయ్యను ఆపి, ఈశ్వరి, "తాతా! అలా వెళ్ళిపోయింది మా అమ్మే కదా? ఆ వదిలేసిన ఆడపిల్లను నేనే కదూ?" అని అడుగుతున్న ఈశ్వరితో ఉద్వేగం ఆపుకుంటూ, గోపాలం, "నువ్వు కాదే నా బంగారు తల్లీ! నిన్ను ఎవరైనా వదులుకుంటారేంటి? నా వరాల మూట! అది కథే నా బంగారం."
"నువ్వు నాకు, మీ అమ్మమ్మకి తోడుంటావని వదిలి వెళ్ళమని మీ అమ్మని బతిమాలితే, నిన్ను మా దగ్గర వదిలేసి పోయింది మీ అమ్మ! అంతేనే నా తల్లి," అని చెప్పి మనవరాలి నుండి తప్పించుకుపోయిన కన్నీళ్లను దేవుడి పాదాభిషేకం కోసమని దాస్తూ, తీసుకు వెళ్ళి దేవుని గదిలో కన్నీటిని ధారాపాతంగా వదిలివేసి, బోరున ఏడుస్తూ తిరిగి ఈశ్వరి కంట్లో పడ్డాడు గోపాలం.
మోకాలిపై కూర్చొని బోరున ఏడుస్తున్న తాత మెడను చుట్టేసిన ఈశ్వరి, "నువ్వు ఏడొద్దు తాతా!
ఇప్పుడు తమ్ముడు పుట్టేసాడు కదా! అక్కడ ఉన్న వాళ్లందరికీ అమ్మ మీద కోపం పోయి ఉంటుందిలే. అమ్మని బాగా చూసుకుంటారులే. ఇక నేను మీ దగ్గరే సంతోషంగా ఉంటాను. నిన్ను, అమ్మమ్మను అసలు దుఃఖపెట్టనే దుఃఖపెట్టను. ఒట్టు తాతా! ఇక నుంచి చాలా బుద్ధిగా చదువుకుంటాను తాతా! నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. ఆ ఇంటికి అస్సలు వెళ్ళను," అని ముద్దు పెట్టి తాతకు ముద్దు మాటలతో ప్రమాణం చేస్తూ మాట ఇచ్చింది.
ఈశ్వరి జాడ తగిలితే మాకు కూడా కీడు తగులుతుందేమో అని భయపడిన కొడుకులు, కోడళ్లను కూడా వేరు కాపురం పెట్టించేసి, సోమయ్య "నా కడుపునే మరో కూతురు పుట్టింది" అనుకుంటూ, మనవరాలిని అల్లారు ముద్దుగా పెంచుతూ మంచి చదువులు చదివించాడు.
తాతకు తెలియని వయసులో ఇచ్చిన మాట ప్రకారమే ఈశ్వరి కూడా బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించి తాతయ్య, అమ్మమ్మల పేరు నిలబెట్టింది. ఆ మనవరాలి ప్రగతిని చూసి మురిసిపోతూ సోమయ్య, లక్ష్మయ్య ముందే "నా మనవరాలు అదృష్ట జాతకురాలు" అని గర్వంగా చెప్పుకున్నాడు. ఈశ్వరి తాతా అమ్మమ్మల పెంపకంలో పెరిగి మంచి పేరు సంపాదించుకొని, పెద్ద మనసు చేసుకొని, వద్దన్న వారిని కూడా తన వారే అని స్వీకరించి, అందరికీ ఆత్మీయతను పంచుతూ, అందరిలో మంచి మనిషియై కీర్తి ప్రతిష్టలతో ఎదిగిపోయింది.
సమాప్తం
బుగత యమున గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: బుగత యమున
నేను బుగత యమున,సెకండరీ గ్రేడ్ టీచర్ గా గోకవరం మండలంలో పని చేస్తున్నాను..నాకు సాహిత్యం అంటే ఎనలేని అభిమానం..ఆ అభిమానం అందించిన ప్రోత్సాహకంతోనే ముందుగా ప్రతిలిపి యాప్ లో రచనలు చేయడం మొదలుపెట్టి..సుమారు 200 వరకూ రచనలు చేసాను..అలాగే సాహితీ గోదావరి మరియు విశాఖ సంస్కృతి పత్రికలకు కూడా నేను కవితలు రాస్తూ ఉంటాను..
***
Telugu Emotional Stories, Family Stories Telugu, Grandfather Granddaughter Story, Telugu Moral Stories, Heart Touching Telugu Stories, Village Stories Telugu, #BugathaYamuna, #బుగతయమున, తాత పెంచిన మనవరాలు, Thatha Penchina Manavaralu, తాత మనవరాలు కథ |




Comments