top of page
Original.png

మన ఉద్దేశ్యం మారుతోందా

Telugu moral story, కుటుంబ కథ, గ్రామీణ కథ, Telugu emotional story, social awareness story Telugu, పెళ్లి కథ, Telugu village stories

పెళ్లి వేడుకలో విమర్శలు వింటూ ఆలోచనలో మునిగిపోయిన గిట్టయ్య–సంతాలమ్మ దంపతులను చూపించే భావోద్వేగ తెలుగు గ్రామీణ కథ పోస్టర్.
పెళ్లి వేడుకలో విమర్శలు వింటూ ఆలోచనలో మునిగిపోయిన గిట్టయ్య–సంతాలమ్మ దంపతులను చూపించే భావోద్వేగ తెలుగు గ్రామీణ కథ పోస్టర్.

Mana Uddesam Maruthondaa? - Telugu Moral Story | Kondeti Prakash

మన ఉద్దేశ్యం మారుతోందా? - తెలుగు నీతి కథ | కొండేటి ప్రకాష్

Published In manatelugukathalu.com On 28/05/2026


పెళ్లిళ్లు అనేవి ఆనందం, ఆశీర్వాదాల పండుగలు…

కానీ ఈరోజుల్లో అక్కడ ప్రేమకన్నా విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయా?

గిట్టయ్య–సంతాలమ్మ అనుభవం మన సమాజపు మారుతున్న మనస్తత్వాన్ని ప్రశ్నిస్తుంది.

మనుషుల ఉద్దేశ్యాలపై ఆలోచింపజేసే హృదయస్పర్శి కథ ఇది.


జంగమెట్ల అనే ఊరిలో గిట్టయ్య, ఆయన భార్య సంతాలమ్మ తమ ముగ్గురు పిల్లలతో నివసించేవారు. ఒక రోజు పక్క ఊరిలో ఉండే తన సమీప బంధువు ఒకరు వాళ్ళ ఇంటికి వచ్చి, "తమ కొడుకు పెళ్లి వచ్చే బుధవారం ఉంది, మీరు కుటుంబ సమేతంగా వచ్చి నూతన వధూవరులను దీవించి వెళ్లవలసింది" అని పెళ్లి కార్డు ఇచ్చి ఆహ్వానం పలికాడు. ఆ పెళ్లి కార్డు తీసుకున్న గిట్టయ్య దంపతులు, బుధవారం తప్పకుండా పెళ్లికి వెళ్లాలని అనుకున్నారు.


అటు చూసి ఇటు చూసేలోపే మంగళవారం వచ్చింది. భార్య సంతాలమ్మ గిట్టయ్యతో, "ఏమయ్యా, రేపు బుధవారం పక్క ఊరిలో పెళ్లి ఉంది కదా! ఉత్త చేతులతో ఎలా పోవాలి? పావలా, బేడా తీసుకొని పోవాలి కదా! బస్ చార్జీలు, కట్నం డబ్బులు... చేతిలో అన్నీ నాలుగు పైసలు ఉండాలి కదా పిల్లలతో వెళ్తున్నప్పుడు" అన్నది.


ఆర్థికంగా గిట్టయ్య కుటుంబం అంతంత మాత్రంగానే ఉన్నది. భార్య చెప్పిన మాట విన్న గిట్టయ్య, ఎవరి దగ్గరైనా రెండు రోజుల కూలీ పని ఒప్పుకొని డబ్బులు తెస్తా అనుకుని రంగయ్య పటేల్ దగ్గరికి వెళ్ళాడు. గిట్టయ్యను చూసిన రంగయ్య పటేల్, "ఏమిరా గిట్టయ్య! ఇటు వచ్చినావ్?" అని అడిగాడు.


"ఏమీ లేదు పటేల్, రేపు మా చుట్టాల పిల్లగాని పెళ్లి ఉంది. ఆ పెళ్లికి వెళ్ళాలంటే చేతిలో రూపాయి బిల్లా లేదు. మీ వ్యవసాయం పని ఏమైనా ఉందో ఏమో అని వచ్చాను. పని ఉంటే ఇవాళ, రేపు మధ్యాహ్నం వరకు పని చేసుకొని పెళ్ళికి పోయిద్దాము అనుకుంటున్నా" అన్నాడు.


గిట్టయ్య మాటలు విన్న రంగయ్య పటేల్, "సరే, పొలం దగ్గర నీళ్ళ పైపు వేయడానికి గాతు తీయాలి. ఒక్కడి వల్ల కాదు, కానీ ఇంకొకరిని నీ జతకు తీసుకొని రమ్మని" చెప్పి, మూడు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు. డబ్బుల అవసరాన్ని బట్టి ఆ పనికి గిట్టయ్య తన భార్యను జతకు తీసుకొచ్చాడు. ఆ రోజు సాయంత్రం వరకు చేశారు. తెల్లారి మధ్యాహ్నం వరకు పైపుల గాతు పని పూర్తి చేసుకొని, రంగయ్య పటేల్ దగ్గర మూడు వేల రూపాయలు తీసుకొని ఇంటికి వచ్చిన గిట్టయ్య దంపతులు, తమ ముగ్గురు పిల్లలను తీసుకొని పెళ్ళికి బయలుదేరి వెళ్ళారు. గంటలోపే పక్క ఊరిలో ఉన్న ఫంక్షన్ హాల్‌కి చేరుకున్నారు.


ఫంక్షన్ హాల్ చేరుకున్న గిట్టయ్య దంపతులు, తమ ముగ్గురు పిల్లలు జరుగుతున్న పెళ్లిని చూసి చాలా సంతోషపడ్డారు. ఆ పెళ్లి ఎంతో హంగు ఆర్భాటాలతో జరుగుతోంది. పెళ్లి మండపంలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటున్నారు. స్టేజ్ మీదకు వెళ్లి నూతన దంపతులను దీవించి, ఫోటో దిగి, భోజనం చేశారు. ఆ సమయంలో పిల్లలు ఆడుకుంటున్నారు. పొద్దు గ్రుంకి చీకటి పడుతుండగా, గిట్టయ్య తన భార్య సంతాలమ్మ, ముగ్గురు పిల్లలను తీసుకొని బస్ ఎక్కి ఇంటికి చేరుకున్నారు.


ఇంటికి చేరుకున్నాక, వాకిట్లో చాప వేసుకుని కూర్చున్న గిట్టయ్య దంపతులు పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. సంతాలమ్మ పెళ్లి జంట గురించి చెబుతూనే... "అయినా ఏమయ్యా! పెళ్లిలో ఎక్కడ చూసినా ముచ్చట్లే. మనకు ముందు, వెనుక కూర్చున్న వాళ్లంతా పెళ్లి ఏర్పాట్ల మీద పడి ఏడుస్తున్నారు. పక్కనే కూర్చున్న ముసలమ్మ అయితే... గారెల్లో ఉప్పు తక్కువని, కూరలో ముక్కలు ఉడకలేదని వడ్డించే వాళ్ళను తిడుతూనే ఉంది. పెళ్లి అందం కంటే వారి విమర్శలే నా చెవుల్లో ఎక్కువగా మారుమోగుతున్నాయి." అన్నది.


అప్పుడు గిట్టయ్య ఒక నిట్టూర్పు విడిచి ఇలా అన్నాడు: "చూశావా సంతాలమ్మ! మనం రూపాయి లేకపోయినా కష్టపడి కూలి చేసి మరీ పెళ్లికి వెళ్ళాం. ఎవరైనా పెళ్లికి పిలిస్తే వెళ్ళి నూతన దంపతులను మనస్ఫూర్తిగా దీవించాలి అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళాక అందరూ ఆ ఉద్దేశ్యాన్ని మర్చిపోయి, ఇలా తప్పులు వెతకడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం ఆ ఎండలో కష్టపడి సంపాదించిన దానికంటే, అక్కడ విన్న విమర్శలే నా మనసుకు భారంగా అనిపిస్తున్నాయి. నిజంగా మనుషుల ఉద్దేశ్యం మారిపోతోంది కదా!" అన్నాడు బాధగా. ఆ మాటలకు సంతాలమ్మ ఆలోచనలో పడింది.


***

కొండేటి ప్రకాష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

 ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


పేరు: కొండేటి ప్రకాష్

జిల్లా: నల్లగొండ

తెలంగాణ

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page