top of page
Original.png

భక్త అంబరీషుడు - పార్ట్ 1

8 hours ago
3 min read

ఏకాదశి వ్రతం ఆచరిస్తున్న భక్త అంబరీషుడు శ్రీమన్నారాయణుని భక్తితో పూజిస్తున్న దృశ్యం

Baktha Ambareeshudu - Part 1 - Telugu Devotional Story |Sudhavishwam Akondi

భక్త అంబరీషుడు - పార్ట్ 1 - తెలుగు భక్తి కథ | సుధావిశ్వం ఆకొండి 

Published in manatelugukathalu.com on 22/11/2026


ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందిన మహాభక్తుడు అంబరీషుని పౌరాణిక కథ ఇది. కార్తీక మాసంలో చదివే ఈ కథ భక్తి, నియమనిష్ఠ, ధర్మాచరణ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది.


కార్తీక మాసంలో ఏకాదశి వ్రతం యొక్క మహాత్మ్యం అంబరీషుని వృత్తాంతం ద్వారా తెలుసుకుందాం. 


ఏకాదశి వ్రతం చేసి, ఎవ్వరూ పొందలేని విధంగా ఆ పరమాత్ముని అనుగ్రహాన్ని పొంది, చివరకు ఆయన వద్దకే చేరుకున్న మహనీయుడు అంబరీషుడు.


ఈ కథను భాగవతంలో అద్భుతంగా వివరించారు వేదవ్యాసులవారు. శ్రీశుకుల వారి ద్వారా విన్న పరీక్షిత్తు అంబరీషుని భక్తికి ప్రభావితుడై, తనలోని భక్తివిశ్వాసాలను మరింత పెంచుకుని తరించాడు. 


తెలుగులో పోతన గారు సామాన్యులకు కూడా మనసుకు హత్తుకునేలా వివరించారు.


అందరూ చదువుకోవడానికి వీలుగా ఈ అంబరీషుని కథ కార్తీక పురాణంలో కూడా ఉంది. కార్తీక మాసంలో చదువుతూ ఉంటారు. 


అసలు పద్దెనిమిది పురాణాల్లో కార్తీక పురాణం అనేది లేదు కానీ, సామాన్యులు కూడా ప్రత్యేకంగా ఇప్పుడు చదవాలని నియమం పెడితే, చదివి అందరూ తరిస్తారని పెద్దలు పూర్వం మహాత్ముల చరిత్రలు ఏరి కూర్చి కార్తీక పురాణంగా పెట్టారు.


ఈ అంబరీషుని వృత్తాంతం భాగవతంలో ఉన్నా, కార్తీక పురాణంలో భాగంగా కార్తీక మాసంలో చదువుకుంటూ ఉంటారు.


ఒక తపస్వి క్రోధాగ్ని నుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కానిది. ఆఖరుకు పరమేశ్వరుడు కూడా ఆ శాపాన్ని అనుభవిస్తాడు. తాను నిర్ణయం చేసిన శాసనాన్ని తానే ఆచరించి చూపిస్తాడు పరమాత్మ.


అటువంటి తపస్వి యొక్క క్రోధాగ్ని నుంచి తప్పించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చూస్తే, ఒక్క ఈ అంబరీషుడే ఉన్నాడని చెప్పవచ్చు! అంతటి మహాత్ముడు ఆయన.


ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అంబరీషుడు గొప్ప చక్రవర్తిగా పేరు పొందాడు. గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా భక్తితో భగవంతుని అనుగ్రహాన్ని పొంది, ఆయన వద్దకు ఎలా చేరుకోవచ్చు అనడానికి ఒక గొప్ప ఉదాహరణ ఈయన జీవితం.


ఈ అంబరీషుని గుణాల్ని చాలా గొప్పగా చెప్పారు భాగవతంలో..!

ఇతని చిత్తము, అంటే మనసు ఎప్పుడూ కూడా ఆ శ్రీహరి యందే ఉండేది. ఏది తిన్నా, ఏమి మాట్లాడినా ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుని వైపే మళ్ళేది ఆయన మనసు. 


ఎవరితో ఏ మాటలు మాట్లాడినా చివరకు ఆ స్వామి దయ గురించిన మాటలు మాత్రమే వచ్చేవి. చక్రవర్తిగా పరిపాలన చేస్తున్నా ఆ శ్రీహరి ఆజ్ఞ మేరకు చేస్తున్నాను అని అనుకునేవాడు.


రాజోచితమైన ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా అంతా ఆ శ్రీహరి కృపగా భావించేవాడు. 


భాగవతులను గౌరవించేవాడు. అంతటి మహాభక్తుడైన అంబరీషునిపై ప్రీతి కలిగిన పరమాత్మ ఆయన వద్దకు రక్షణగా ఉండమని సుదర్శన చక్రాన్ని పంపుతాడు. అయినా ఏమాత్రం గర్వం లేకుండా భక్తితో జీవనం కొనసాగిస్తున్నాడు ఆ అంబరీషుడు.


ఇటువంటి జీవితం గడుపుతున్న అంబరీషుడు తనకు తగిన భార్యను పొందాడు. ఇద్దరూ భక్తితో ఆ పరమాత్మను చేరుకోవాలని ఒకరికొకరు సహకారం చేసుకుంటూ తమ ధర్మాన్ని పాటిస్తున్నారు.


ఒకసారి అంబరీషుడు ప్రతి సంవత్సరం ఏకాదశి వ్రతం చేయాలని నిర్ణయించుకుని, భార్యతో కలిసి కార్తీక మాసంలో ఏకాదశి వ్రతం మొదలుపెట్టాడు.


ఏకాదశి వ్రతం తొలి ఏకాదశి నుంచి మొదలుపెట్టి, సంవత్సరం అంతా చేసి పూర్తి చేసుకోవచ్చు! కార్తీక మాసంలో కూడా మొదలుపెట్టి పూర్తి చేయవచ్చు! దశమి నాటి రాత్రి ఏదో కొద్దిగా ఫలహారం చేసి, ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి, లక్ష్మీనారాయణులను అర్చించాలి. 


ఆ రోజంతా స్వామి నామస్మరణతోనే ఉండాలి. ఆ మరునాడు ద్వాదశి ఘడియలు వెళ్లిపోకముందే పారణ చేయాలి. అంటే తినేయాలి. 


ఇది ఈ వ్రత నియమం.


అంబరీషుడు ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం ఉండి, స్వామి పూజ చేసుకుని, ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకముందే పూజ పూర్తిచేసి, బ్రాహ్మణ సమారాధన చేసి, అందరికీ అన్నసంతర్పణ చేసి, ఆ తర్వాత తాను భుజించాలి అనే నియమం పెట్టుకుని వ్రతం మొదలుపెట్టాడు. 


ఆ సమయంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యంలో ఉంటూ, స్వామి స్మరణలో గడపాలి. అలా ఏడాది అంతా చేయాలి అని అనుకుని మొదలుపెట్టాడు అంబరీషుడు.


అలా ఒకసారి నియమ నిష్ఠలతో చక్కగా వ్రతం పూర్తిచేశాడు. సంవత్సరకాలం పూర్తి అయ్యింది. చివరి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి, స్వామిని మనసారా అర్చించుకున్నాడు.


ద్వాదశి నాడు ఎంతోమందికి వారు సంతృప్తి చెందేటట్టుగా భోజనాలు పెట్టాడు. ఎందరో భాగవతులు వచ్చి, భోజనం స్వీకరించి, ఆ దంపతులను ఆశీర్వదించి, వెళుతున్నారు. 


సామాన్యులు సైతం భోజనాలు చేసి తృప్తిగా వెళ్ళారు. ఇక అందరూ అయిపోయారని నిర్ణయించుకుని, తాను భోజనానికి కూర్చోవడానికి ఉద్యుక్తుడయ్యాడు అంబరీషుడు.

అప్పుడు...


సశేషం...శ్రీకృష్ణార్పణమస్తు 🙏🙏🙏🙏🙏 సుధావిశ్వం







📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  


సుధావిశ్వం

-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page