top of page
Original.png

సద్గతి


గ్రామాభివృద్ధి కోసం తన ఆస్తిని అంకితం చేసిన అనసూయమ్మను స్మరించుకుంటూ స్వగ్రామానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్న నిరంజన్

Sadgati Telugu Family Story | Ganti Subrahmanya Sarma  

సద్గతి - తెలుగు కుటుంబ కథ | గంటి సుబ్రహ్మణ్య శర్మ

Published in manatelugukathalu.com on 25 /08/2026


“సద్గతి” గంటి సుబ్రహ్మణ్య శర్మ రచించిన హృదయస్పర్శి సామాజిక విలువల కథ. ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఒంటరితనాన్ని అనుభవించిన అనసూయమ్మ తన జీవితాంతం మానవత్వం, దానధర్మం, క్రమశిక్షణ, స్వగ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుంది. విదేశాల్లో స్థిరపడిన కొడుకు నిరంజన్, కూతురు వనజలకు ఆమె ఎప్పుడూ తన వద్దకు రావాలని బలవంతం చేయదు. అయితే మరణానికి ముందు ఆమె రాసిన వీలునామా కుటుంబాన్నే కాకుండా మొత్తం గ్రామాన్ని ఆశ్చర్యపరుస్తుంది. కౌలుదారుల హక్కులు, గ్రామ పంచాయితీ అభివృద్ధి, పనివారి సంక్షేమం కోసం తన ఆస్తిని పంచిన అనసూయమ్మ దూరదృష్టి నిరంజన్ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. స్వగ్రామం, స్వదేశం, మానవతా విలువల గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ కథ “సద్గతి” పాఠకుడిలో ఆత్మపరిశీలనను కలిగిస్తుంది.


తెల్లవారక ముందే నిద్రలేచి రాత్రి ఫ్రిజ్ లో ఉన్న పాలను స్టౌ మీద పెట్టి, స్నానాదికాలు కావించి, దీపాలు పెట్టి, తులసిని పూజించాక, చిన్న విభూతి బొట్టు పెట్టుకుని పెద్ద ఇత్తడి గ్లాసులో ఫిల్టర్ కాఫీ తాగాక కానీ, అనసూయమ్మ గారి దినచర్య ప్రారంభం కాదు. ఆ తర్వాత లంకంత మండువా ఇంటి అరుగుమీద పడకకుర్చీలో కూర్చొని రామాయణమో, భారతమో చదువుతూ ఉంటే, పాలేరు రాము, పనిమనిషి రత్తాలు, వచ్చి వారివారి పనులలో దిగుతారు.


కొంచెంసేపు గడిచాక వంటావిడ నాగలక్ష్మి తాను వస్తూనే తెచ్చిన ఆకుకూరలు, కాయగూరలు చూపించి ఆ రోజు వంటకు ఏంకావాలో కనుక్కొని వంట చేసి పెడుతుంది. అంతేకాక, సాయంత్రం అల్పాహారం కూడా సిద్ధం చేసి, మిగిలిన పనులన్నీ పూర్తయ్యాక సరిగా పది గంటలకు భోజనం పెట్టి, తాను తిని, తగులూ మిగులు పాలేర్లకు సర్ది వెళ్ళిపోతుంది. భోజనం తర్వాత మరలా పుస్తక పఠనం, నిద్ర. అనంతరం రెండుగంటల వేళ టీ పెట్టుకోవడం, తాగడం, మరలా చదవడం లేదా రేడియో వినడం, టీవీ చూడటం లాంటివి ఆవిడ దినచర్య.

భర్త గోవిందరావు జీవించిన కాలంలో వారిరువురి వైభోగం చూసి అందరూ చాలా సంతోషించేవారు.


ఒకే కొడుకు నిరంజన్, కూతురు వనజ కూడా తాము సంపన్నులమనే భేషజాలు లేకుండా నలుగురితోనూ స్నేహితంగా ఉండేవారు. భర్త ఆర్మీ ఉద్యోగి కావడంతో ఎక్కువగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ దూరంగా ఉంటే కుటుంబం, పిల్లల బాధ్యతలు అనసూయమ్మగారి వంతు. ఐనా ఎక్కడా ఏ లోటూ లేకుండా పిల్లలను పెంచి, విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దడం కోసం ఆవిడ పడ్డ కష్టం ఊరికే పోలేదు.


కొడుకు నిరంజన్ నావీ అధికారి గానూ, కూతురు వనజ డాక్టరు గా అవతరించడంతో వారిరువురి వివాహాలు కూడా జరిగాయి. ఇద్దరు మనుమరాళ్లు కొడుకుకి, ఒక మనవడు కూతురికి పుట్టడంతో అనసూయమ్మ ఆనందానికి అవధుల్లేవు. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా! భర్త గోవిందరావు ఆర్మీ ఉద్యోగం అనంతరం వేరే ఉద్యోగం చేసుకుంటూ ఉన్న సమయంలో గుండెపోటుతో మరణించడం అనసూయమ్మగారిని బాగా కుంగదీసింది. ఐనా తాను పెరిగిన వాతావరణం, సమాజంలో అణగారిన వర్గాల మధ్య తిరిగిన తల్లిదండ్రుల పెంపకం అనసూయమ్మ గారి మనసు నిండా మానవత్వానికి, సామాజిక చైతన్యానికి ఎప్పుడూ పెద్ద పీట వేస్తూ ఉండేవి.


“నా రాత అంతే రాశాడు ఆ భగవంతుడు,” అనుకుంటూ తనకు తాను సర్ది చెప్పుకుంటూ డెబ్బయ్యో పడిలోకి ప్రవేశించినా మితాహారంతోనూ, సాధ్యమైనంతగా దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తూ దానధర్మాలతో జీవితం నెట్టుకుంటూ ముందుకు నడుస్తోంది. ప్రతీ వారం, లేదా వారానికి రెండుసార్లు కూతురు, కొడుకుల ఫోన్ పలకరింపులు కూడా ఆమె ఆరోగ్యానికి ఊతమిస్తాయి.


భర్త పింఛను, ఇతర సౌకర్యాలు, పసుపు కుంకుమ ద్వారా వచ్చిన 10 ఎకరాల మాగాణి, మరో రెండు ఎకరాల కొబ్బరి, కోకో తోటలు కాకుండా, ఆర్మీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాల పొలం కూడా, అనసూయమ్మ గారిని ఆ గ్రామంలో “జమీందారిణి” గా ఒక సమున్నత స్థానాన్ని కట్టబెట్టాయి.


పొలం మొత్తం కౌలు రైతులకు ఇవ్వడం, వారుకూడా ఎప్పుడూ ఏ కారణాలతోనూ కౌలు సొమ్ము బాకీపడకుండా తెచ్చి చేతిలో పోస్తూ ఉండడం కూడా ఆ “జమీందారీ” ని స్థిరం చేశాయి. ఉన్న ఒక్క కొడుకు జర్మనీలోనూ, కూతురు అమెరికాలోనూ స్థిరపడినా సంవత్సరానికి ఒకసారి వారిరువురూ ముందుగా సంప్రదించుకుని భార్యాపిల్లలను తీసుకుని ఇంటికి వచ్చి గడిపే ఆ నెలరోజులు, అనసూయమ్మ గారింటిలో పండగ వాతావరణమే.


ఇద్దరు మనుమరాళ్లకి, ఒక్కగానొక్క మనుమడికి తెలుగు ఆచారాలు నేర్పించడం, పిండివంటలు, ఇంకా వారికి ఇష్టమైన చిరుతిండీ అన్నీ కూడా ఇంట్లో చేయించడం, వెళ్ళేటపుడు అందరికీ భారీగా నగదు, కానుకలు పెట్టి పంపడం, తీరా వెళ్ళాక కంటనీరు పెట్టుకోవడం అలవాటయింది.


పేరుకి మాత్రమే అందరూ వున్నా, భోగభాగ్యాలు విడువకున్నా, లంకంత దాబాయిల్లు, పనిమనుషులు, వంటమనిషి, 17 ఎకరాల పొలం, తోటలు అన్నీ కూడా అనసూయమ్మగారిని “ఒంటరి” అనే భావన నుంచి దూరం చేయలేకపోయాయి.


కొడుకు జర్మనీకి రమ్మన్నా, కూతురు అమెరికాకు తీసుకువెడతానన్నా “నా కెందుకమ్మా ఈ 70 ఏళ్ల వయసులో జర్మనీలు, అమెరికాలు? ఏదో ఇక్కడే ఈ కౌలురైతులు, పాడిపంటలు, పొలాలు, బ్యాంకు ఖాతాలు, అన్నీ జాగ్రత్తగా అజమాయిషీ చేసుకోమని, చెప్పి వెళ్లిన మీ నాన్న మాట ప్రకారం, ఇక్కడే ఈ శేష జీవితం అంతా. ప్రతీ వారం మీరు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే నాకు అదే చాలు” అనే ఆమె మాటలు, వారికి మారుమాట లేకుండా చేసేవి.


“మీరుకూడా వచ్చి ఈ ఆస్తిపాస్తులు, వీటి అజమాయిషీ వ్యవహారాలు అన్నీ చూసుకొంటే నాకు అదే పెద్ద సంతోషం” అనే ఆమె ప్రశ్నకు, కొడుకు, కూతురు చిరునవ్వే సమాధానంగా వినిపించకపోయినా, కనిపించేది.


ఇక ఇది పనికాదని కొడుకు, కూతురు మనుమలు అందరి సమక్షంలో “పోనీ ఈ ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి మీరిద్దరూ చేరోసగం పిల్లల ఖర్చుల కోసం తీసుకోమన్నపుడు” కూడా అదే చిరునవ్వు సమాధానమయ్యేది.


ఐనా రేపు ప్రయాణం అనగా నిరంజన్ “అమ్మా నువ్వు ససేమిరా విదేశం రానంటావు, మేము ఆ దేశంలో అన్నీ ఏర్పాటు చేసుకున్నాము, ఈ ఆస్తిపాస్తులు, డబ్బు, ఇల్లు, పొలాలు, ఈ కౌలు వ్యవహారాలు చూసుకుంటూ మేము ఇక్కడ ఉండడం వీలు కాదు కదా, చెల్లాయితో కూడా మాట్లాడిన తర్వాత నేను నీకు ఈ విషయం చెపుతున్నాను. నువ్వే నీకు ఎలా బాగుంటుందో అలాగే చేయి. కానీ నాతో కానీ చెల్లితో కానీ నువ్వు వస్తే మాకు ఇంకా సంతోషం” అన్న కొడుకు మాటలకు కూడా, తల్లి చిరునవ్వే సమాధానం అయింది.


అంతా సవ్యంగా మరో ఆరు నెలలు గడిచిపోయాయి. అలాంటి తరుణంలో నిరంజన్ కి ఫోన్ వస్తే “ఈ కొత్త ఫోన్ నంబర్ ఎవరిదో” అనుకుంటూనే మాట్లాడాక తెలిసింది, అది గ్రామ పంచాయితీ అధ్యక్షుడు ఫోన్ అని, “తల్లి అంత్యకాలం సమీపిస్తోందని, ఆఖరు ఘడియలలో దగ్గర వుంటే మంచిది కదా” అని.


వెంటనే ముందు చెల్లాయికి, బావకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అందరూ ఉన్నపళంగా లేచి వచ్చారు. అనసూయమ్మ గారు ఆఖరిదశలో వున్నా కూడా, ఆవిడ పరిమితాహారం, క్రమశిక్షణ, చీకుచింతాలేని జీవన శైలి వల్ల అందరినీ గుర్తించగలిగింది. చిట్టచివరిగా కూతురుని, కొడుకుని, మనవళ్లని ఆప్యాయంగా చూసుకుంటూ, కొడుకు పోస్తున్న తులసి తీర్థంతో “ఆఖరిగుటకే కాక శ్వాసకూడా” తీసుకుంది.


అవసరాలు, అవకాశాలు, వివాహం ద్వారా వచ్చిన పరిచయాలు, అన్నీ కూడా ఆఖరి సమయంలో తల్లికి అవసరమైనంత దగ్గరగా లేమే అనే దుఃఖం నిరంజన్ కి, వనజకి ముంచుకు వచ్చింది. ఐనా చేసేదేమీ లేక యధావిధిగా భక్తిశ్రద్ధలతో అన్ని కార్యక్రమాలు ముగించాక గ్రామంలో వైకుంఠ సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అదికూడా పూర్తి అయ్యాక భారమైన మనసుతో వచ్చి తల్లి పడక్కుర్చీలో సేదతీరుతూ ఉండగా, గ్రామ పంచాయితీ అధ్యక్షుడు సుందరం, మిగిలిన ఇతర సభ్యులు, గ్రామస్తులు వచ్చి పలకరించసాగారు.


“బాబూ! కొంతకాలం విశ్రాంతి తీసుకొని తిరిగి వెడితే బాగుంటుందేమో, ఇక్కడి వ్యవహారాలు కూడా పూర్తిగా ఆకళింపు చేసుకోవాలి కదా” అనే మాటలకు తేరుకుని “అదేనండి, అమ్మ చెప్పినంత సేపు నేను, చెల్లి ఇద్దరూ కూడా అసలు పట్టించుకోలేదు, ఇపుడు ఇవన్నీ చక్కదిద్దాలంటే నాకేమీ పాలుపోవడం లేదు” అంటుంటే “బాధ పడకండి బాబూ, తల్లిగారి కార్యక్రమాలన్నీ భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు, ఆ తల్లికి పూర్తి సద్గతి కలగడానికి, కొడుకుగా మీ బాధ్యత నెరవేర్చారు, ఇంకా ఏంకావాలి” అంటూఉంటే బాధ కలిగింది.


“ఇగో బాబూ, అమ్మగారు ఈ కవర్ మీకు ఇచ్చారు,” అని ఒక పెద్ద కవర్ చేతిలో పెట్టాడు.


ఆశ్చర్యంగా అనిపించినా అందరి సమక్షంలోనే ఆ కవర్ తెరిచి చూస్తే, అందులో అనసూయమ్మ గారు వ్రాసిన ఆఖరు ఉత్తరం, లేదా మరణానికి ముందు పూర్తి విచక్షణతో వ్రాసిన “మరణ శాసనం” (వీలునామా) ఉంది. ఆనందాశ్రువులతో అందలి వివరాలను చెల్లి, బావగార్ల సమక్షంలోనూ, ఇతర గ్రామస్తులు, గ్రామ పంచాయితీ అధ్యక్షుడి ముందు చదివి నిరుత్తరుడయ్యాడు నిరంజన్.


అందులోని వివరాల ప్రకారం భూములన్నీ కౌలుదారులకు వారి జీవితకాలహక్కులే కాకుండా శాశ్వత వారసత్వపు హక్కులు కల్పించడం, బ్యాంకులోని కోట్లాదికి పైగా ఉన్న చరాస్తి గ్రామ పంచాయతీ అభివృద్ధికి, లంకంత ఇల్లు కూడా పంచాయితీ స్వాధీనానికి, ఒక పూర్తి స్థాయి అతిథి గృహ నిర్మాణానికి, దాని నిర్వహణకి సంబంధించిన హక్కులు గ్రామ పంచాయతీకి చెందజేశారు.


బ్యాంకులో ఉన్న మిగిలిన సొమ్ములోనుండి ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఇంటిలోని పనివారికి, వంటమనిషికి, మిగిలిన సొమ్ము మొత్తం కొడుకుకి, కూతురికి సమానంగా చెందజేశారు. ప్రతీ సంవత్సరం కొడుకు, కూతురు, మనుమలు అంతా వచ్చి నెల రోజుల పాటు వుండడం కోసం అతిథి గృహం కేటాయింపు ఏర్పాటు, ఆ తర్వాత దాని సంరక్షణ విధి, వినియోగాల బాధ్యతలను గ్రామ పంచాయతీకి అప్పగించడం కూడా నిరంజన్ కి ఆశ్చర్యం కలిగించింది.


తల్లి ముందు చూపు, తాను చివరివరకూ గడిపిన ఇల్లు, పొలాలు, పనిమనుషులు, కౌలుదారుల పట్ల ఆమె దూర దృష్టి, ఉదారత, వాటన్నిటినీ మించి గ్రామాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు గమనిస్తే ఎందుకో ఒక్కసారి “తిరుపతి స్వామికి సామాన్య భక్తులు అందించే విరాళాలు, వాటికి లభించే సౌకర్యాలు” జ్ఞప్తికి వచ్చాయి.


తల్లి ఉదాత్తతకు, ఆమె పెద్ద మనసుకు నిరంజన్ దంపతులు మాత్రమే కాకుండా చెల్లాయి, బావగారితో కలిసి గ్రామస్తులంతా ఆనందపడుతుంటే, నిరంజన్ కి ఆశ్చర్యం కూడా కలిగింది. ఏదో పొట్ట చేత్తో పట్టుకొని గ్రామాంతరం, దేశాంతరాలు పట్టి పోతూవుంటే అక్కడ ఎంత అభివృద్ధి చెంది, ఎన్ని సిరిసంపదలు సంపాదించినా ఆ మనుష్యులు ఎప్పటికీ మనవారు కాదు, విదేశీయులే కదా అనిపించింది.


“మన మనుషులు” అంటే ఎలా ఉంటారో అనే విషయానికి ప్రత్యక్ష నిదర్శనం, తాను, తనతల్లి నివసించే గ్రామ ప్రజలే అనుకున్న తరుణంలోనే, నిరంజన్ కి “జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపీ గరీయసీ” అనే కవి వాక్యం స్ఫురణకు వచ్చింది. అపుడే నిశ్చయించుకున్నాడు, ఎలాగైనాసరే, భార్యాపిల్లలను ఒప్పించి, ఉద్యోగంలో కూడా “ఇంటినుండే పనిచేయడానికి, తన జర్మనీ యాజమాన్యం అంగీకరిస్తే, కొనసాగించాలని, లేదా వేరొక ఉద్యోగం సంపాదించుకోవాలని”.


ఆ ఆలోచన కాస్త ఊరటనిచ్చినా, తాను తనచెల్లి, తమతల్లిని ఆవిడ జీవిత కాలంలో ఎంతలా కోల్పోయారో తలచుకుంటే, స్థిరంగా ఉండలేకపోతున్నాడు. “గ్రామ స్వరాజ్యమే దేశ భవిష్యత్తు, సంపద అని తనతల్లి తనకంటే ముందే భావించి జీవించడమే కాకుండా, ఆచరించి చూపించిన అదే బాటలోనే తానూ నడవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అంతకంటే “సద్గతి” అనసూయమ్మగారికి ఇంకేముంటుంది?

***

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


గంటి సుబ్రహ్మణ్య శర్మ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

గంటి సుబ్రహ్మణ్య శర్మ

రచయిత పరిచయం:

గంటి సుబ్రహ్మణ్య శర్మ, ఆంధ్ర ప్రదేశ్ న్యాయ శాఖలో 34 సంవత్సరాలు ఉద్యోగం చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.  ఉద్యోగం చేస్తున్న సమయంలోనే, న్యాయ శాఖలో పని చేసిన అనుభవంతో, అమలాపురం లో తొలిసారిగా ఏర్పాటైన సాయంకాల న్యాయ కళాశాలలో, గౌరవ జిల్లాకోర్టు రాజమహేంద్రవరం వారి అనుమతి పొంది, బీ ఎల్ పట్టా సాధించారు.  అనంతరం మరలా వారి అనుమతి తోనే ఎల్ ఎల్ ఎమ్ కూడా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ గా పూర్తి చేసారు. అదేవిధంగా హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ నుండి “సైబర్ లా” లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేసారు.  కాకినాడ, రాజమండ్రి కోర్టులలోనూ, అమరావతి, హైకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.  ప్రస్తుతం అమరావతి హై కోర్టు బార్ అసోసియేషన్ లో జీవితకాల న్యాయవాద సభ్యులుగా ఉన్నారు.

ఉద్యోగంలోనూ, ఆ తరువాత కూడా వివిధ సామాజిక, రాజకీయ అంశాలపై వ్యాసాలు రాస్తున్నారు.  న్యాయ సలహాలు కూడా ఇస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page