top of page
Original.png

పశ్చాత్తాపం

పశ్చాత్తాపం, తెలుగు భావోద్వేగ కథ, తల్లిదండ్రుల కథ, పిల్లల కలలు, పేరెంటింగ్, మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కథ, తెలుగు ప్రేరణాత్మక కథ, కుటుంబ కథ, కొత్త ప్రియాంక కథ

www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ ప్రేరణాత్మక తెలుగు కథ 'పశ్చాత్తాపం' కథలో కొడుకు ఫోటోను గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న తండ్రి, పక్కనే విద్యార్థులకు పుస్తకాలు మరియు సంగీత వాయిద్యాలు అందజేస్తున్న దృశ్యంతో 'పశ్చాత్తాపం' తెలుగు భావోద్వేగ కథ చిత్రం.
www.manatelugukathalu.com లో ప్రచురింపబడ్డ ప్రేరణాత్మక తెలుగు కథ 'పశ్చాత్తాపం' కథలో కొడుకు ఫోటోను గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న తండ్రి, పక్కనే విద్యార్థులకు పుస్తకాలు మరియు సంగీత వాయిద్యాలు అందజేస్తున్న దృశ్యంతో 'పశ్చాత్తాపం' తెలుగు భావోద్వేగ కథ చిత్రం.

Paschatthapam - Telugu Inspirational Story | Bhanupriya

పశ్చాత్తాపం - తెలుగు ప్రేరణాత్మక కథ | భానుప్రియ

Published In manatelugukathalu.com On 12/07/2026


ప్రతి తల్లిదండ్రికీ తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కల ఉంటుంది. కానీ ఆ కలలు పిల్లల ఇష్టాలను, వారి ప్రతిభను, వారి ఆనందాన్ని మింగేస్తే? ఒక తండ్రి తన నెరవేరని ఆశయాన్ని కొడుకుపై బలవంతంగా రుద్ది, చివరికి జీవితాంతం మరచిపోలేని పశ్చాత్తాపాన్ని ఎలా మిగుల్చుకున్నాడో హృదయాన్ని కదిలించే విధంగా చెబుతుంది "పశ్చాత్తాపం". పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి తల్లిదండ్రి, ప్రతి యువకుడు తప్పక చదవాల్సిన భావోద్వేగ కథ.


వేకువ కొత్త రూపాన్ని సంతరించుకుని ఉదయించగా, సూర్యకిరణాలు చెంపను తడమడంతో భారమైన మనసుతో, అలసిన కళ్ళతో మేల్కొన్నాడు కుమార్. గుడికి వెళ్ళి అర్చన, అభిషేకం ముగించుకొని, ప్రతి సంవత్సరం మాదిరిగానే విద్యార్థులందరికీ వారికి ఇష్టమైన బట్టలు, స్వీట్లు, వస్తువులు సిద్ధం చేసుకుని పంచుతుండగా... చివరగా ఒక విద్యార్థి, "ఏమిటి సార్! ఈ రోజు విశేషం? మాకు మీరు ఉచితంగా నచ్చిన చదువు చెప్పడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. దానితో పాటు ఈ రోజు మాకు ఇష్టమైన వస్తువులను ఇవ్వటానికి కారణం ఏమిటి?" అని అడిగాడు. 


కుమార్ ఒక చిరునవ్వు నవ్వి, "నువ్వు కొత్తగా వచ్చావు కదా! కొత్తగా వచ్చిన వారికి తెలియని నా కథ వినిపిస్తాను" అని ఊపిరి గట్టిగా పీల్చుకొని చెప్పడం మొదలుపెట్టాడు. 


"ఇది నా మూర్ఖత్వానికి, నా మొండితనానికి బలైన నా బిడ్డ కథ" అంటూ కుమార్ గత జ్ఞాపకాలలోకి జారుకున్నాడు.

*******************


"ఒరేయ్ మొద్దు, దున్నపోతా, గాడిద, అడ్డగాడిద! ఎంతసేపు నిద్రపోతావురా! సూర్యుడు వచ్చి చాలాసేపు అయ్యింది. లేరా లే మొద్దు!" అని గట్టిగా అరుస్తున్న కుమార్ను చూసి, "ఏంటండీ మీరు! అలా తిడుతున్నారు? ఏ తప్పు చేశాడు వాడు? రాత్రి చాలా లేటుగా నిద్రపోయాడు. కాసేపు పడుకోనియ్యండి" అని వత్తాసు పలుకుతున్న భార్యను పట్టించుకోకుండా, "ఏం ఘనకార్యాలు చేశాడు నీ కొడుకు అంత లేటుగా పడుకోవడానికి? ఈ సంవత్సరం కూడా నాలుగు సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. అయినా కూడా వాడు మారకుండా ఆ దిక్కుమాలిన గిటార్ చేతిలో పట్టుకొని పూనకం వచ్చినట్టుగా పాటలు పాడుతూ, గెంతుతూ పిచ్చి పట్టినట్టుగా ఉన్నాడు. వాడి కోతి చేష్టలు మరీ ఎక్కువయ్యాయి" అని గట్టిగా అరుస్తుండగా... 


"ఏంటి నాన్న! మావి పిచ్చి చేష్టలు కావు. మేము ఒక పెద్ద మ్యూజిక్ ఆల్బమ్ చేసి ఒక గొప్ప స్థాయికి రావాలని మా కోరిక" అని సంజయ్ అనగానే... "అబ్బా! ఈ దిక్కుమాలిన బ్యాండ్ మేళానికి స్థాయి ఒకటి! ఈసారి ఎలాగైనా పరీక్షల్లో పాస్ అయ్యి నా కోరికైన సివిల్స్ సాధించాలి. అది నేను సాధించలేకపోయాను, నా కొడుకైనా నా కలను నెరవేర్చాలని నా కోరిక. ఎలాగైనా నువ్వు సివిల్స్కు ప్రిపేర్ అవ్వాల్సిందే" అని కుమార్ అన్నాడు. 


"లేదు నాన్న! నాకు చదువు పైన అసలు ఆసక్తి ఉండటం లేదు. అయినా మీ ఆశయాలన్నీ నాపైన రుద్దితే ఎలా? నా బాధను అర్థం చేసుకోండి" అని సంజయ్ ఎంత చెప్తున్నా అతని మాటలు వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కుమార్. 


"ఏంటమ్మా ఇది? నా ఇష్టంతో పని ఉండదా? నాకు కోరికలు ఉండవా? నేను పోయిన సంవత్సరమే నాకు ఈ చదువులు వద్దు అని చెప్పాను. కానీ నాన్న కోసం బలవంతంగా చదువుతున్నాను. అయినా నన్ను ఆయన అర్థం చేసుకోవడం లేదని" బాధపడుతున్న కొడుకు సంజయ్ను, "నేను నాన్నతో ఒకసారి మాట్లాడతాను, నువ్వు బాధపడకు" అంటూ ఓదారుస్తుంది తల్లి అరుణ.


మరుసటి రోజు ఉదయం, "చూడు సంజయ్! ఈసారి పరీక్షల్లో నువ్వు పాస్ అయితే, నువ్వు కోరుకున్నట్టుగానే నీ మ్యూజిక్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. కానీ ఈ పరీక్షలు మాత్రం పాస్ అవ్వు" అని తండ్రి చెప్పగానే హుషారుగా గెంతుతాడు సంజయ్. 


"మ్యూజిక్ కోసం నేను ఎంతైనా కష్టపడతాను నాన్న" అని సంజయ్ రాత్రింబవళ్లు కష్టపడి, ఎంతో మానసిక వేదనకు గురై పరీక్షలు పూర్తి చేసి ఉత్తీర్ణత సాధిస్తాడు. 


పరీక్షలు అవ్వగానే తండ్రి కుమార్, "ఇదిగో సంజయ్! సివిల్స్ కోచింగ్కు అప్లై చేశాను. నువ్వు ఇప్పటి లాగే అంతే కష్టపడి చదవాలి" అని చెప్పగానే ఒక్కసారిగా సంజయ్ కలలు తన మదిలో కుప్పకూలిపోయాయి.


"ఏంటి నాన్న ఇది? నువ్వు చెప్పినట్టుగానే నేను ఈ పరీక్షలు పాస్ అయ్యాను. మ్యూజిక్కు వెళ్ళొచ్చు అని నువ్వే చెప్పావు కదా! మరి ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు?" అనగానే, "నువ్వు ఎన్నైనా చెప్పురా! నేను కలలు కన్న సివిల్స్ నువ్వు సాధించాలి, అంతే!" అంటూ, "మేము బతికి ఉండాలంటే నువ్వు మా ఆశలని నెరవేర్చాలి" అని కరాఖండిగా చెప్పడంతో సంజయ్ ఎంతో మనోవేదనకు లోనవుతాడు.


ఇక తప్పదని, తప్పనిసరి పరిస్థితులలో అటు తనకు ఇష్టమైన మ్యూజిక్ను వదలలేక, ఇటు తన తండ్రి కలలుకన్న ఆశయం కోసం చదవలేక ఎంతో మానసిక క్షోభకు లోనవుతాడు. ప్రతిరోజూ బాధపడుతూ... ఇటు ఇష్టమైన మ్యూజిక్ను వదులుకున్నానని, అటు నాన్న కోసం చదవాలని ఆలోచనలతో ఆ మానసిక ఒత్తిడిని తట్టుకోలేక సంజయ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయి, ఒకరోజు కింద పడిపోతాడు.


సంజయ్ను హాస్పిటల్లో చేర్పించగా, అతడు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యాడని, కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు చెప్పగానే సంజయ్ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు.


సంజయ్ దగ్గరికి ఎవరు వెళ్లినా, "నా గిటార్ తెచ్చారా? షో కోసం ప్రాక్టీస్ చేయాలి. లేదు లేదు, నేను చదువుకోవాలి, బుక్కు తీసుకురండి, నాన్న ఆశయాన్ని నిలబెట్టాలి" అని పదేపదే అంటూనే ఉన్నాడు.


కొడుకు పరిస్థితి చూసిన తండ్రి కుమార్, "అయ్యో! ఎంత పెద్ద తప్పు చేశాను. వాడిని ఎంతో మనోవేదనకు గురి చేశాను. నా ఆశయాన్ని వాడిపై రుద్ది ఇంత బాధ పెట్టాను" అని నెత్తి బాదుకుంటూ ఏకధాటిగా ఏడుస్తాడు. 


కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయి, తన కొడుకును కోల్పోయే స్థితి వస్తుంది.


తన కొడుకు చనిపోయినప్పటి నుంచి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, "నా లాగా, నా కొడుకు లాగా ఎవరూ అవ్వకూడదు" అనే నిర్ణయం తీసుకుంటాడు. 


అందుకే వాడి పేరు మీద ఈ సంస్థ స్థాపించి, ఎవరికి ఇష్టమైన పనిని వారు ఎంచుకొని ఆ రంగంలో ముందుకు సాగిపోయేలా చేస్తున్నాడు. 


"నా కొడుకు కళ్ళలో ఆనందం చూడలేకపోయాను. ఇప్పుడు మీరందరూ మీరు అనుకున్న రంగాలలో శిక్షణ పొంది ఆనందంగా ఉంటే, మీ కళ్ళలోని ఆనందాన్ని చూసి నా కొడుకు ఆత్మ శాంతిస్తుందని ఎంత కష్టమైనా ఈ పని చేస్తున్నాను."

"మీరు కూడా భవిష్యత్తులో ఎవరినీ నొప్పించకుండా ఉండాలి" అంటూ తన కంటి నుండి ధారాళంగా వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ, సంజయ్ ఫోటోను గుండెలకు హత్తుకొని జ్ఞాపకాల ఒడిలో నిట్టూరుస్తాడు.


***

భానుప్రియ గారి కొన్ని ఇతర రచనలు:


భానుప్రియ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 

రచయిత్రి పరిచయం:

నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page