అసలైన బంధం
- Kottha Priyanka
- Sep 20
- 3 min read
#Bhanupriya, #భానుప్రియ, #AsalainaBandham, #అసలైనబంధం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Asalaina Bandham - New Telugu Story Written By Bhanupriya
Published In manatelugukathalu.com On 20/09/2025
అసలైన బంధం - తెలుగు కథ
రచన: భానుప్రియ
"తన అనురాగంతో, ప్రేమతో నిత్యం సుధలోలికిస్తూ నా జీవితాన్ని అమృతమయం చేసిన నా సహధర్మచారిని నా భార్య సుధ.. తనేరా" అని చిరునవ్వుతో కాఫీ అందిస్తున్న సుధను, వారి ఇద్దరి పిల్లలను పరిచయం చేస్తాడు మధు, తన స్నేహితుడైన మోహన్ కి.
"చూడముచ్చటైన మీ కుటుంబానికి, అనురాగానికి ఎలాంటి దిష్టి తగలకుండా జాగ్రత్తగా ఉండురా" అంటూ మోహన్ చెప్పగా..
'నిజంగా మోహన్ అన్నయ్య చెప్పినట్లుగా మా అనోన్య దాంపత్యానికి ఎవరి దిష్టి అయినా తగిలిందా! మధు రెండు రోజుల నుంచి పిల్లలతోనూ నాతోనూ సరిగ్గా కలవడం, మాట్లడటం లేదని, ' వంట పని చేసుకుంటూ మనసులో మదనపడుతుంది సుధ.
పని ఒత్తిడిలో ఉన్నాడేమో లే అని మరోవైపు తన మనసుకు తానే సర్ది చెప్పుకుంది.
అలా ఓ వారం రోజులు గడిచాక మధు రోజు సాయంత్రం ఆఫీసు అయిపోయాక ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరిని కలుస్తున్నాడు! అని తెలుసుకున్న సుధ, ఒక్కసారిగా బాధపడుతూ, ‘మధు రోజు రోహిణిని కలుస్తున్నాడా! రోహిణి మళ్లీ మధు జీవితంలో ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేనేం చేయాలి’ అని ఆలోచిస్తూ రోహిణి స్నేహితురాలిని మాలినిని కలుసుకొని ప్రాధేయపడగా అసలు విషయం చెప్పసాగింది మాలిని.
"చూడండి సుధ గారు.. మధు మొదట ప్రేమించింది రోహిణిని. కానీ రోహిణి తనకు చెప్పకుండానే వేరే అతనిని పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు మళ్లీ ‘నా తప్పు తెలుసుకున్నాను నాకు మధు కావాలి’ అంటూ ఇక్కడికి వచ్చింది. నేను ఎంత చెప్పినా వినకుండా మధును కలుసుకొని మధును అతి కష్టంగా, ఎన్నో విధాలుగా ప్రాధేయపడి అతను ఒప్పుకోకపోయే సరికి చేతికి గాయం చేసుకొని చనిపోతాను అని బెదిరించడంతో సున్నితమైన మనసు గల మధు, రోహిణిని ఒప్పుకోక తప్పలేదు. ఇదంతా మీకు నేను చెప్పానని రోహిణి కి తెలియవద్దు. " అని మాట తీసుకుంటుంది మాలిని.
ఈ విషయం తెలుసుకున్న సుధ. ‘ఏం చేయాలి.. ఇప్పుడు నా జీవితం నడి సంద్రంలో నావలా అయింద’ని మదన పడుతూ, తన బాధ పిల్లల ముందు బయటపడకుండా జాగ్రత్త పడుతుంది. ఆలోచించి, ఆలోచించి మధును రోహిణి అనే మాయ నుంచి వాస్తవానికి తీసుకురావాలని తన కన్నీటిని తుడుచుకుంటూ ‘నా జీవితాన్ని నేనే సరిదిద్దుకుంటా’ అని సుధ గుండె నిండా ధైర్యాన్ని నింపుకొంది.
ఉన్నట్టుండి రెండు రోజుల తర్వాత మధు ఆరోగ్యం పాడవడంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళగా వారం రోజులపాటు మధు రెస్టు తీసుకోవాలని డాక్టర్ తో చెప్పిస్తుంది సుధ.
రెండు రోజుల తర్వాత రోహిణి హాస్పిటల్ కి వచ్చి మధును కలుసుకొని "ఏమైంది మధు? నీకు" అంటూ బాధపడుతుంది.
"నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ సుధ నిన్ను చూస్తే అంతా తెలిసిపోతుంది వెళ్ళిపో” అని అంటుండగానే, రానే వస్తుంది సుధ.
"ఎప్పటికైనా అసలు విషయం తెలియాలి కదా మధు" అంటూ పొగరుతోనే "నేను మధు కు ఒకప్పుడు ప్రేయసిని. ఇప్పుడు కాబోయే భార్యను" అని రోహిణి చెప్పగా కన్నీరుతో అలాగే నిలబడిపోతుంది సుధ.
"నేను నా మధును చూసుకుంటా”నని, సుధ ఆడే నాటకం తెలియక రోహిణి పొగరుతో సమాధానం చెప్తుంది.
రెండు రోజులపాటు కంటిమీద కునుకు లేకుండా సపర్యలు చేయడంతో పాటు, మధు మందులు ఖర్చుల లిస్టును చూసి అవాక్కైపోయిన రోహిణి, "మధు నన్ను క్షమించు.. అర్జెంటుగా నేను మా ఊరికి వెళ్లాల్సి ఉంది. కాబట్టి నిన్ను చూసుకోలే”నంటు వెళ్లిపోగా, సుధ హాస్పిటల్ కి వచ్చి మధును పసిపిల్ల వాడిలాగా అన్ని సపర్యలు చేసి ఇంటికి తీసుకు వెళుతుంది.
ఇంటికి తీసుకువెళ్లిన మధుకు “మీకు డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. దానికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుంద”ని చెప్పడంతో, “నేను ఆఫీసులో అడిగి లోన్ తీసుకుంటా’నని మధు చెప్పాడు.
మధుకు జాబ్ కూడా లేకుండా చేసి, కొన్ని కోట్ల రూపాయలు తారుమారయ్యాయని దీనికి బాధ్యత మధు వహించాలని ఆఫీస్ వాళ్లతో మాట్లాడి చెప్పిస్తుంది సుధ.
ఇదంతా విన్న మధు ఒక్కసారిగా తలపట్టుకొని ‘ఉన్న ఉద్యోగం పోయి, అప్పు కట్టాలి. ఆపరేషన్ కి డబ్బులు కావాలి. ఇదంతా ఎలా..’ అంటూ మనసులో అనుకొని, ‘రోహిణి ఉంది కదా తను అంతా చూసుకుంటుంది’ అని రోహిణి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ “ఇప్పుడు నువ్వే నన్ను కాపాడాలి” అంటాడు.
"నేనేం చేయ్యను మధు.. నాకు కావలసింది నువ్వు. కానీ నీ రోగం, నీ అప్పు కాద”ని తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది రోహిణి.
అది విన్న మధు ఒక్కసారిగా “ఎంత మోసం రోహిణి.. నన్ను ఎంతో ప్రేమించే నా సుధను కాదని, మా అనురాగానికి మారుపేరైన పిల్లలను కూడా మరిచిపోయి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఎంత పెద్ద తప్పు చేశాను. నేను పెద్ద మూర్ఖుడిని” అని మోకాళ్లపై ఏడుస్తూ తనను తాను కొట్టుకుంటుండగా..
"ఏమండీ.. మీరు ఎందుకు బాధపడుతున్నారు. నీ ప్రేమ పొందలేని తను బాధపడాలి. మీరేం తప్పు చేయలేదు. పదండి మన ఇంటికి" అని మధు చెయ్యి పట్టుకొని అంటుంది సుధ.
“నన్ను క్షమించు మధు.. ఈ రోహిణి మాయలో పడి నీ మనసును, మన మనువును, మన బంధాన్ని, పిల్లల మమతానురాగాలను మరిచి నీ మనుసుకు చాలా పెద్ద గాయం చేసాను. నన్ను క్షమించు” అంటూ సుధ కాళ్ళను పట్టుకోపోగా “ఏంటండీ మీరు చేస్తుంది ఏంటి” అని పైకి లేపి పశ్చాతాపపడుతున్న మధుకు "చూసావా మధు! ఈ రోహిణి కి నీ ప్రేమ కాదు కావల్సింది. నీవు మంచి ఉద్యోగంతో, భార్యా పిల్లలతో ఎనలేని సంతోషాన్ని పొందుతున్నావని అవన్నీ తను అనుభవించాలనే ఆరాటమే కానీ నిజమైన ప్రేమ కాదు. అందుకే నేను రోహిణి మోసాన్ని బయట పెట్టాలని మిమ్మల్ని తిరిగి పాత మధును చేయడం కోసం నేను ఈ నాటకాన్ని ఆడక తప్పలేదు. నన్ను క్షమించండి" అంటూ చేతులు జోడించి ఏడుస్తున్న సుధను పిల్లలను దగ్గరికి తీసుకొని ఇంటికి చేరుకుంటారు సుధలొలికే వారి పాత జ్ఞాపకాలతో..
***
భానుప్రియ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/priyanka
నేను కొత్త ప్రియాంక (భానుప్రియ) హైదరాబాద్ ఆరు సంవత్సరాల నుంచి కవితలు రాయడం ప్రారంభించినాను. తర్వాత కథలు రాయడం మొదలుపెట్టాను. ఒక మంచి కవయిత్రిగా రచయిత్రిగా నాకంటూ సాహితీ సామ్రాజ్యంలో ఒక పేజీ ఉండాలని , సమాజాన్ని జాగృతి పరిచే విధంగా నా కలం సాగిపోవాలనే తలంపుతో ముందుకు సాగిపోతున్నాను.🙏
Comments