మీ బావ బంగారం
మీ బావ బంగారం, Telugu Stories, Telugu Family Story, Emotional Telugu Story, Telugu Kathalu, Heart Touching Telugu Story, Family Relationship Story, Father Daughter Story, Son In Law Story, Telugu Moral Stories, Elderly Parents Story, Telugu Audio Stories, Telugu Inspirational Story, Telugu Life Lessons, Family Values Telugu

Mee Bava Bangaram - Telugu Family Story | Jeedigunta Srinivasa Rao
మీ బావ బంగారం - తెలుగు కుటుంబ కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
Published In manatelugukathalu.com On 17/06/2026
"కొడుకు అమెరికాలో ఉన్నాడు... అల్లుడు మాత్రం గుండెల్లో నిలిచిపోయాడు!"
“వారానికి రెండు రోజులు దోశలు వేయాల్సిందే అంటారు. చూడండి, ఈ దోశల పెనం పెచ్చులు ఊడిపోయి ఎలా ఉందో! కొత్తది కొనమంటే వినరు కదా” అని భార్య కావేరి అంటుంటే, "నీ మొహం, పెనం బాగానే ఉంది, నువ్వు రుబ్బిన దోశల పిండిలో దోషం" అన్నాడు నోట్లో దోశ ముక్క వేసుకుని నములుతూ ప్రభాకరం.
"ఒకసారి ఇలా వచ్చి దోశ చిరగకుండా వేసి చూపించండి. అలా వేయగలిగితే ఈ నెల పాలవాడి బిల్లు నేనే కడతాను" అంది.
"మామూలుగా దోశ ముక్కలు చేసుకుని తినాలి. అదేమిటో నువ్వు, ముక్కలైన దోశ చేయడంలో నీకు సాటి ఎవ్వరూ రారు" అంటూ వంటగదిలోకి వచ్చి స్టవ్ మీద ఉన్న పెనం వంక చూసి, "అసలు ఈ పెనం తోముతున్నారా లేదా?" అన్నాడు.
"ఇప్పుడు తెలిసిందిగా, ఈ రోజు మార్కెట్‌కి వెళ్లి మంచి దోశ పెనం కొనుక్కురండి" అంది.
"ముందు ఈ పేపర్ చూడు, మన దేశాధినేత పొదుపు చేయండి అని అంటున్నారు. ఇక కొత్తగా కొనేవి లేవు, ఉన్నవాటితో గడుపు" అన్నాడు భార్యతో ప్రభాకరం.
***
"ఏమిటి, పప్పు వడ్డించకుండా కూర వేశావు?" అన్నాడు కంచం లో చూస్తూ.
"పొదుపు, ఇక నుంచి ఏదో ఒక ఐటమ్ చేస్తాను, మాట్లాడకుండా తినండి" అంది కావేరి.
"బాగానే ఉంది నీ పొదుపు, పప్పులేని భోజనం ఎలాగే?" అంటున్న భర్త వంక చూసి, లోపల నుంచి దోసకాయ పప్పు తీసుకుని వచ్చి భర్త కంచంలో వేసి, "తెలిసిందా? ఇప్పుడు సాయంత్రం వెళ్లి కావాల్సిన వస్తువులు కొనుక్కుని రండి. పొదుపు, మన దగ్గర దుబారా చేయడానికి ఎక్కువ ఏముంది కనుక?" అంది.
ఇలా జరుగుతోంది ఈ భార్యాభర్తల సంబంధం. ఆవిడకు డెబ్బై ఐదు, ఆయనకు ఎనభై ఏళ్లు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ప్రభాకరం రిటైర్ అయిన దగ్గర నుంచి ప్రతి చిన్న పనికి భార్య మీద ఆధారపడతాడు. పిల్లలు ఎలాగో దూరంగా ఉన్నారు, ఈయనే చిన్నపిల్లాడు అనుకుని ఏదీ లోటు లేకుండా చూసుకుంటోంది కావేరి.
ఈ దంపతులకు ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు. ఆడపిల్లకు పెళ్లి చేసి, మొదటి అంతస్తులో వాటా ఇచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. కొడుకు అమెరికాలో ఉండటంతో, అల్లుడూ కూతురు తమని కనిపెట్టుకుంటారు అనుకున్న ప్రభాకరం ఆశ నిరాశ అయ్యింది. అల్లుడి తండ్రీ తల్లీ కూడా వచ్చి మొదటి అంతస్తులో స్థిరపడటం ప్రభాకరంకి నచ్చలేదు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టుగా, ఆస్తి రాసిచ్చిన తరువాత అనుకుని లాభం ఏముంది?
అప్పటికీ కూతురు, తండ్రికి ఇష్టం అయిన వంకాయ కూర, దోసకాయ ముక్కల పచ్చడి చేసి, అత్తగారు చూడకుండా తీసుకుని వచ్చి ఇచ్చేది.
కరెంటు బిల్లులు అన్నీ తెచ్చి వాచ్‌మన్ ప్రభాకరంకి ఇచ్చేవాడు. "ఏమిటే కావేరి, అమ్మాయి వాళ్ల కరెంటు బిల్లు ఐదు వేలు వచ్చింది! వంట కూడా కరెంటు స్టవ్ మీద చేసుకుంటారా?" అని అడిగాడు భార్యని.
"మొన్న అమ్మాయి అంది, వాళ్ల అత్తగారు ఏసీ లేందే ఉండలేరుట, ఇరవై నాలుగు గంటలు ఏసీ, దానికి తోడు ఫ్యాన్ వేసుకుంటుందిట. పోనీలేద్దురూ, ఆ కరెంటు బిల్లు వాళ్లకి పంపకుండా మీరే కట్టేసేయండి. ఎంతైనా కూతురు అల్లుడు" అంది కావేరి.
"పొరపాటు చేశాను అనుకుంటా. ఎవరినీ నెత్తిమీద పెట్టుకోకూడదు. పెద్దవాళ్లం ఉన్నాము కదా అని బాధ్యత మన మీద వదిలేస్తారు" అన్నాడు.
"అబ్బాయి ఉద్యోగం వలన వేరే దేశంలో ఉన్నాడు. అదృష్టకొద్దీ అమ్మాయి అల్లుడు ఈ ఊరిలోనే ఉద్యోగం కావడంతో మన దగ్గర ఉంటున్నారు. పోయిన తర్వాత ఇల్లు రాసి ఇస్తే ఏం సుఖం? ఇప్పుడు మన కళ్లముందే ఉన్నారు. మనవళ్లు ఇద్దరూ మనతోనే ఉంటున్నారు, అనవసరంగా డబ్బుల గురించి ఆలోచించక హాయిగా ఉండండి" అంది కావేరి.
"సరేలే, అమ్మాయికి అల్లుడికి ఖర్చు పెట్టడానికి బాధపడటం లేదు, వాళ్ల అమ్మకి కూడా పెట్టాలి కదా?" అని అంటున్న భర్తతో, "ఒకసారి మన కోడలు తల్లిదండ్రులు కూడా మన గురించి ఇలా అనుకుంటే మీకు ఎలా ఉంటుంది?" అంది కావేరి. "నిజమే నువ్వు చెప్పింది, పెద్దావిడ కొడుకు దగ్గర కాకుండా ఎక్కడికి వెళ్తుంది?" అన్నాడు.
రోజులు గడుస్తున్నాయి. భర్త అదివరకులా హుషారుగా ఉండకపోవడం చూసి, ఒక రోజు అమెరికాలో ఉన్న కొడుక్కి ఫోన్ చేసి, "అబ్బాయి, మీ నాన్నగారు రోజురోజుకీ చిక్కిపోతున్నారు. డాక్టర్ గారికి చూపిస్తే పెద్ద వయసు కదా అని బలం కోసం టాబ్లెట్ రాసిచ్చాడు. ఎందుకైనా మంచిది ఒకసారి నువ్వు వచ్చి వెళ్లు" అంది.
"నేను వస్తే నాన్నకి బలం ఎలా వస్తుంది అమ్మా? ఇక్కడ పరిస్థితులు బాగుండలేదు, నువ్వే బావగారి సహాయం తీసుకుని మేనేజ్ చేయాలి" అనడంతో ఏమనాలో తెలియక ఊరుకుంది.
ఆ రోజు రాత్రి పెందలాలే భోజనం చేసి పడుకున్న ప్రభాకరం అర్థరాత్రి లేచి, "ఇదిగో కావేరి, నాకు గుండెల్లో నొప్పిగా ఉంది, కొద్దిగా మజ్జిగలో పంచదార వేసి ఇస్తావా? బహుశా ఎసిడిటీ ఏమో" అన్నాడు.
"ఏమీ తినలేదుగా, ఎసిడిటీ ఎలా వచ్చింది? ఉండండి, అమ్మాయికి ఫోన్ చేస్తాను" అని కావేరి కూతురికి ఫోన్ చేసింది. ఫోన్ అల్లుడు తీసుకోవడంతో విషయం చెప్పింది.
"నేను మీ అమ్మాయి కిందకి వస్తున్నాము, మా మామయ్యగారికి చొక్కా వేసి రెడీ చేయండి, హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం" అని ఫోన్ పెట్టేశాడు.
అల్లుడు, కూతురు వస్తుండగానే సైరన్ మోగించుకుంటూ అంబులెన్స్ రావడం, జాగ్రత్తగా ప్రభాకరాన్ని అంబులెన్స్ లో ఎక్కించి అపోలో హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. ప్రభాకరం స్థితి చూసి ఎంజియోగ్రామ్ చేసి, ప్రస్తుతానికి రెండు స్టంట్స్ వేసి, "రెండు మూడు రోజులలో బైపాస్ చేయాలి. ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది, ఎందుకంటే బాగా వయసు వచ్చింది కదా" అనడంతో.
ప్రభాకరం అల్లుడు తన కార్డు మీద నాలుగు లక్షలు హాస్పిటల్ వారికి కట్టి, "కంగారు పడకండి అత్తయ్యగారు, మామయ్యకు విల్ పవర్ ఎక్కువ, ఏమీ కాదు" అన్నాడు.
విషయం బావమరిదికి ఫోన్ చేసి చెప్పాడు. "మీరు జాగ్రత్తగా చూసుకోండి బావా, నేను వెంటనే బయలుదేరి రావాలి అంటే కష్టం, వీలు చూసుకుని వస్తాను" అన్నాడు.
మొత్తానికి ఆపరేషన్ విజయవంతంగా అయ్యింది, ప్రభాకరం అల్లుడే మొత్తం ట్రీట్‌మెంట్ ఖర్చు పెట్టాడు. "మామయ్యగారు, ఇక భయం లేదు, మీరు పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు" అన్నాడు. "నా కొడుకు వచ్చేదాకా నాకు ఏమీ కాదు అల్లుడు. ట్రీట్‌మెంట్ కి ఎంత డబ్బులు అయ్యాయో, మీరు రేపు నా చెక్కు తీసుకుని వెళ్లి బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకోండి" అన్నాడు ప్రభాకరం.
"డబ్బులు మావి అయినా మనవే కదా మామయ్యగారు, మా అమ్మకి ఎలా ఖర్చు పెడతానో మీకైనా అలాగే ఖర్చు పెడతాను. మీరు ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఉండాలి, అదే చాలు మాకు. మూడు రోజుల నుంచి మా అమ్మ కూడా అత్తయ్యగారి దగ్గరే ఉంది" అన్నాడు.
కళ్లు మూసుకొని ఆలోచనలో పడ్డాడు. 'అమ్మాయి కరెంటు బిల్లు ఎక్కువ వస్తోంది, అల్లుడి తల్లి వేరు, అల్లుడు వేరు అనుకున్నాను ఇన్నాళ్లు, దగ్గర ఉన్న వీళ్లని కాదని అమెరికాలో ఉన్న కొడుకు కోసం ఆస్తులు దాచడం ఏమిటో? బుర్ర తక్కువ పని చేశాను ఇన్నాళ్లు' అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయాడు.
ఎవరిదో తెలిసిన కంఠం వినిపించడంతో కళ్లు తెరిచిన ప్రభాకరంకి ఎదురుగా కొడుకు, కోడలు, మనవరాలు కనిపించడంతో ఎప్పటిలాగా హుషారుగా లేవబోయాడు. "అలా మీరు లేవకూడదు నాన్న, గండం గడిచింది. ఇక నుంచి అయినా ఆ సాంబార్ గారెలు తినడం మానేస్తే మీ మనవరాలు పెళ్లి కూడా చూస్తారు" అన్నాడు ప్రభాకరం కొడుకు.
"నేను పెళ్లే చేసుకోను" అంటున్న మనవరాలి చెయ్యి పట్టుకుని, "నేనూ చిన్నప్పుడు పెళ్లి చేసుకోను అన్నాను, కానీ మీ బామ్మని చూడగానే పెళ్లి చేసుకున్నాను" అన్నాడు ప్రభాకరం.
"డాడీ, మేము బయలుదేరి అమెరికా వెళ్ళాలి. ఒక చిన్న విషయం, నాకు మీ ఆస్తి ఏమీ వద్దు, అది బావగారికి ఇచ్చేయండి, ఇదిగో నా అంగీకారం లెటర్" అన్న కొడుకుని చూసి, "అవునురా, మీ బావ బంగారం, అతను టైముకి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లకపోతే నాతో నువ్వు మాట్లాడే అవకాశం ఉండేది కాదు. అంతా నీ ఇష్టప్రకారం చేస్తాను, కానీ నువ్వు వారానికి ఒకసారి అయినా వీడియో కాల్ చేసి మాట్లాడాలి" అన్నాడు కొడుకు చెయ్యి పట్టుకుని.
అవును, వృద్ధాప్యంలో తాతా బామ్మలకు పిల్లల మాటలే టానిక్. అవకాశం ఉన్నప్పుడల్లా తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉండాలి.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.










Comments