top of page
Original.png

తెలియనితనం



Teliyanithanam - Telugu Family Story | Jeedigunta Srinivasa Rao

తెలియనితనం - తెలుగు కుటుంబ కథ | జీడిగుంట శ్రీనివాసరావు | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

Published In manatelugukathalu.com On 11/05/2026


“నగ కంటే గొప్పది… నమ్మకం!” 

ఆ విషయం తెలియనితనం కథలో తెలియజెబుతారు శ్రీనివాసరావు జీడిగుంట గారు.  


​సుబ్బరామయ్య, సుందరిలకు కళ్యాణ్ ఒక్కగానొక్క కొడుకు. సుందరి తండ్రిది జమీందారీ కుటుంబం.. ఆయనకు ఒక్కగానొక్క కూతురు సుందరి అవ్వడంతో, తరతరాల నుంచి వస్తున్న కాసులపేరు సుందరికి ఇచ్చి, "అమ్మాయి, ఇది మనం మెడలో వేసుకుని తిరగడానికి కాదు. మా తాతగారి నుంచి లక్ష్మీదేవి విగ్రహానికి ఈ హారం వేసి ఉండేది. తరాలు మారినా లక్ష్మీదేవితో పాటు ఈ హారం కూడా వారసులకి వస్తోంది."


"నాకు మగ సంతానం లేకపోవడంతో, ఇప్పుడు ఈ హారంతోపాటు మహాలక్ష్మి విగ్రహం కూడా నీకు ఇస్తున్నాను. నీ తరువాత నీ కోడలికి, ఆ తరువాత వాళ్ళ వారసులకి చెందాలి. ఎటువంటి పరిస్థితిలోనూ ఈ హారం చెయ్యి జార్చుకోకు," అన్నాడు.


అప్పటి నుంచి పూజా గదిలో లక్ష్మీదేవికి హారం అలంకరించి పూజలు జరుపుతూ ఉండేది సుందరి.


కళ్యాణ్ కి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ముంబైలో ఉద్యోగం రావడంతో, సుబ్బరామయ్య గారు, ఆయన భార్య కూడా కొడుకుతో పాటు ముంబై వెళ్ళిపోయారు. కొడుక్కి సంబంధాలు వెతకడం సుబ్బరామయ్య గారికి ముంబైలో అతి కష్టంగా ఉంది.


"ఏమండీ! అబ్బాయి వారంలో నాలుగు రోజులు క్యాంపు అని బయటకి వెళ్తున్నాడు. వచ్చిరాని హిందీలో పక్కన ఉన్న అమ్మాయిని అడిగితే, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి అన్ని క్యాంపులు ఉండవు అంది. ఎందుకైనా మంచిది, ఒకసారి వాడిని అడిగి చూడండి," అంది సుందరి.


"ఒరేయ్ కళ్యాణ్! నువ్వు ప్రతీ వారం క్యాంపులంటూ తిరుగుతున్నావు. ప్రతి రోజూ ఎవరో ఒకరు కాలింగ్ బెల్ నొక్కి మరాఠీలో మాట్లాడి ఏదో అడుగుతారు. ఎందుకొచ్చిన క్యాంపుల ఉద్యోగం? కొద్దిగా నిలకడగా ఉండే ఉద్యోగం చూసుకో. అయినా మన ఊరిలో యాభై ఎకరాల పొలం, కొబ్బరి తోట పెట్టుకుని ఎందుకురా ఈ ఉద్యోగం?" అన్నాడు.


"తాతముత్తాతల ఆస్తి అనుభవిస్తూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు నాన్న. మిమ్మల్ని నెల రోజుల్లో మరాఠీ భాష నేర్చుకో అనే కోర్సులో జాయిన్ చేస్తాను. అప్పుడు మీకు మాట్లాడటానికి ఇబ్బంది ఉండదు. నేను ముంబైలో ఉన్నంతవరకు మీరు నాతో ఉండాల్సిందే కదా?" అన్నాడు కళ్యాణ్.


ముంబైలో సెటిల్ అయిన తెలుగు కుటుంబంలో కొన్ని సంబంధాలు వచ్చినా, "ప్రతిదీ నచ్చలేదు" అని అంటున్నాడు కొడుకు. 


"ఇలా అయితే పిల్లాడు పాడైపోవడానికి అవకాశం ఉంది," అని ఒకరోజు సుబ్బరామయ్య గారు కొడుకుతో చెప్పారు. "మేము మన ఊరికి వెళ్లి, మనవాళ్లలో మంచి సంబంధం చూసి నీకు కబురు చేస్తాను. ఎలాగూ పొలం కౌలుకి ఇచ్చే పని కూడా ఉంది. అందుకే మాకు టికెట్స్ కొను," అన్నాడు.


"పెళ్లి అని నా వెనుక పడ్డారేమిటి నాన్న? సరే, మీ ఇష్టం. అలాగే వెళ్ళండి," అన్నాడు.


 కళ్యాణ్ కూడా తండ్రి రమ్మనగానే విజయవాడ వచ్చి పెళ్లి చూపులకి వెళ్ళేవాడు. ప్రతిసారీ ఏదో వంక చెప్పి ముంబై వెళ్ళిపోయేవాడు. 


సుందరికి కొడుకు వ్యవహారం మీద అనుమానం వచ్చి, "మంచి, అందమైన ఆస్తి గలిగిన అమ్మాయిలు కూడా నచ్చకపోవడం ఏమిటి?" అని కొడుకుని నిలదీసింది.

తల్లి ప్రశ్నల వర్షానికి, "అమ్మా, నిజం చెబుతున్నాను. నాతో పాటు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే నాన్న అంటే భయంతో విషయం చెప్పలేక, పెళ్లిచూపులకి వచ్చి 'నచ్చలేదు' అంటున్నాను," అన్నాడు.


"మనది జమీందారీ వంశం. మరి నువ్వు చేసుకుందాం అనుకున్న అమ్మాయి కులగోత్రాలు ఏమిటి?" అంది. 


"ఇప్పుడు ఇంకా జమీందారులు ఎక్కడ ఉన్నారు అమ్మా? చాదస్తం కాకపోతే! నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి మన కులంకి చాలా దూరం. పేరు రాధిక. బాగుంటుంది, మంచి తెలివితేటలు కలిగింది. నాతో సమానంగా జీతం వస్తోంది," అన్నాడు.


"కొంపముంచావు కదరా! మనకి డబ్బు లేకపోతే కదా నువ్వు ఉద్యోగం చేస్తున్న అమ్మాయి అని వేరే కులం నుంచి చూసుకోవాలా? మీ నాన్న ససేమిరా ఒప్పుకోరు. నువ్వు కూడా పిచ్చవేషాలు మాని, మన కులంలోనే నీకు నచ్చిన అమ్మాయిని చూసుకో," అంది.


"కుదరదమ్మా, మేమిద్దరం బాగా దగ్గర అయ్యాము," అన్నాడు. ఎప్పుడు వచ్చారో సుబ్బరామయ్య అంతా విని, "సుందరం! నువ్వు వాడిని వదిలి ఒకసారి పైన గదిలోకి రా," అంటూ మెట్లు ఎక్కి వెళ్ళిపోయాడు.


"మీ నాన్న అంతా విన్నారు అనుకుంటా. అసలే నరసింహ అవతారం! ఒక్కగానొక్క కొడుకువి అని గారంబంగా పెంచినందుకు మాకు లేనిపోని దుఃఖం తెచ్చిపెట్టావు కదరా?" అంటూ మెట్లు ఎక్కి పైకి వెళ్ళింది.


"విన్నట్టు ఉన్నారుగా? మనకి ఆస్తులు ఉన్నాయి. ఒక్కడే కొడుకు. ఎందుకు పెద్ద చదువులు?" అంటే విన్నారా? ఇంజనీర్‌ని చేసారు. ఇప్పుడు మనకే ప్రమాదం తెచ్చిపెట్టాడు," అంది భర్తతో.


"జరగాల్సిన దాని గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అన్నాడు సుబ్బరామయ్య.


"ఇన్నాళ్ళూ నా అభిప్రాయం లెక్క చేయకుండా మీదే పైచేయి అన్నారు. ఇలాంటి విషయంలో నాకెందుకు పెత్తనం?" అంది సుందరి.


"సరే అయితే విను. 

ఒకటి: మనం ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే, వాడు మనల్ని వదిలి వెళ్ళిపోతాడు. వాడి ప్రేమ అలాంటిది. రెండు: చుట్టాలు ఏమనుకుంటే ఏమిటి అనుకుని, మనమే ఒప్పుకుని నాలుగు అక్షింతలు వేస్తే, మన అబ్బాయి మనతో కలిసి ఉంటాడు," అన్నాడు.


"ఒప్పుకుని పెళ్లి చేసి, ఆ అమ్మాయి వండిపెట్టే తిండి ఎలా తింటామండీ?" అంది. 


"ముంబైలో ఉన్నప్పుడు నువ్వు తిన్న హోటల్‌లో వంటవాళ్ళు మన కులం వాళ్ళు కాదు. మన ఇంటికి వచ్చిన పిల్ల మన పిల్లే అనుకోవాలి. అయినా మనం ఇంకా ఎన్నేళ్లు బతుకుతామని పట్టింపు?" అన్నాడు.


ముంబైలోనే పెళ్లి అనేసరికి చుట్టాలు రాలేదు. వచ్చిన నాలుగు కుటుంబాలకి పట్టుచీరలు పెట్టడంతో, మామూలుగానే ఉండి వెళ్ళిపోయారు.


"అబ్బాయి, కోడలిని మన ఊరి వాళ్ళకి పరిచయం చెయ్యాలి. ఎంతైనా మనం ఊరిలో పెద్ద కామందులం. ముందు మేము వెళ్లి రిసెప్షన్‌కి అరేంజ్ చేసి నీకు చెప్తాను. నువ్వు కోడలిని తీసుకుని రా," అని చెప్పి సుబ్బరామయ్య, సుందరి విజయవాడ వచ్చేసారు.


రిసెప్షన్‌కి ఊరూరూ వచ్చేసింది. ధనికులు, పేదలు అనే తేడాలేకుండా భోజనం పెట్టాడు సుబ్బరామయ్య.


రెండవ రోజు కోడలిని పూజ గదిలోకి పిలిచి, మహాలక్ష్మి విగ్రహం, వజ్రాల హారం గురించి చెప్పి, 


హారాన్ని రాధికకి ఇస్తూ, "అమ్మా, ఇది మా అత్తగారు నాకు ఇచ్చారు. ఇది కేవలం బంగారం కాదు, మన కుటుంబ గౌరవం. దీన్ని జాగ్రత్తగా చూసుకో," అని చెబుతాడు. మళ్ళీ కళ్యాణ్, తల్లిదండ్రులు తన భార్యతో పాటు ముంబై చేరుకున్నాడు.


రాధిక, తన తండ్రి చేసే బట్టల వ్యాపారంలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయినట్టు తెలుసుకుంటుంది. కళ్యాణ్‌కి తన తండ్రి అప్పుల విషయం చెప్పి, "మామయ్య గారిని అడిగి ఒక ఇరవై లక్షలు మా నాన్నగారికి ఇస్తే, అప్పులు తీర్చుకుని, వ్యాపారం కుదుట పడగానే మన డబ్బులు మనకి ఇస్తారు," అంది.

"మీ నాన్న కోసం మా నాన్నని నేను డబ్బులు అడగలేను. వాళ్ళు మన పెళ్ళికి అంగీకారం ఇచ్చి, పెళ్లి చేసి మనతో ఉంటున్నారు, అది చాలు. నువ్వు మీ నాన్నగారిని వేరే చోట అప్పు తీసుకోమను. ఒక ఐదు నెలలు నీ జీతం మీ నాన్నగారి అప్పులు తీర్చడానికి ఉపయోగించు," అన్నాడు.


"సరే అయితే, నువ్వు మీ నాన్నగారి నుంచి అవసరం పడినా డబ్బులు తీసుకోలేవా? రేపు నేను మా ఊరు వెళ్లి ఏదో విధంగా మా నాన్నకి అప్పుల బాధ తొలగిస్తాను," అంది రాధిక.

 

అత్తగారు ఇచ్చిన ఆ వారసత్వపు హారాన్ని తనతో తీసుకుని వెళ్లి తండ్రికి ఇచ్చేస్తుంది. "నాన్న, ఇది కుదువ పెట్టి అప్పులు తీర్చేయండి. కళ్యాణ్‌కి నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను," అంది తండ్రితో.

అబ్బాయి! "మహాలక్ష్మి మెడలో వజ్రాల హారం కనిపించడం లేదు. మీ ఆవిడ తీసి దాచిందా?" అని కొడుకుని అడిగింది సుందరి. "అది ఎందుకు దాస్తుంది అమ్మా? అయినా ఎల్లుండి ఊరి నుంచి రాగానే అడుగుతాను. నీకు ఏదో కొంప మునిగి పోతున్నట్టు అప్పగింతలు పెట్టేసి, ఇప్పుడు నన్ను అడిగితే ఎలా?" అన్నాడు. కాని మనసులో, 'కొంపదీసి భార్య తన తండ్రి అప్పు తీర్చడానికి హారం అమ్మేస్తుందా? అలా జరిగితే తరతరాల నుంచి వస్తున్న సెంటిమెంట్ దెబ్బ తిని, తల్లిదండ్రులతో గొడవ అవుతుంది' అనుకున్నాడు.


కోడలు వచ్చిన తరువాత విషయం తెలుసుకొని మొదటిసారి కోపంతో ఊగిపోతాడు సుబ్బరామయ్య.


​"ఆ హారం తరతరాల నుంచి వస్తోంది. మా వంశ గౌరవానికి చిహ్నం. దాన్ని మాకు చెప్పకుండా మీ నాన్నకి ఎలా ఇస్తావు? మా ఇంట్లో వస్తువుల మీద నీకు హక్కు ఉంది కానీ, వాటిని అమ్మేసే అధికారం లేదు. ఇది పద్ధతి కాదు. నీకు డబ్బే కావాలనుకుంటే నన్ను అడిగితే కోటి రూపాయలైనా ఇచ్చేవాడిని. ఇదిగో, ఈ చెక్కు తీసుకుని వెళ్లి వెంటనే హారం విడిపించి తీసుకుని రా! ఏమిటిరా అలా వెర్రి చూపులు చూస్తూ నుంచున్నావు? నువ్వు కూడా నీ భార్యతో వెళ్ళు!" అని అరిచాడు.


సుందరి కూడా కోడలి తండ్రిని నానా మాటలు అంది.


​రాధికకి ఆ మాటలు తూటాల్లా తగిలాయి. ఆమె అహంకారం దెబ్బతింది. ఆమె అందరి ముందు అరిచింది: 

​"ఏంటి.. ఒక పాత బంగారు గొలుసు గురించి నన్ను ఇంత మాట అంటారా? నా తండ్రి కష్టం ముందు మీ పాత ఇనుము ముక్క ఎంత? మీరంతా కలిసి నన్ను దొంగలా చూస్తున్నారు."


​"కళ్యాణ్, చూడు! నీ ఇంట్లో వాళ్లు నన్ను ఎలా అవమానిస్తున్నారో! వీళ్లతో ఉంటే నేను మనిషిని కాను, కేవలం ఒక పనిమనిషిని మాత్రమే. ఈ క్షణమే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదంటే నేనే చచ్చిపోతాను," అంది రాత్రి భర్తతో.


తెల్లవారకముందే "తలుపు కొడుతున్నారెవరో చూడు," అన్నాడు కళ్యాణ్ భార్యతో. బద్ధకంగా లేచి వెళ్ళింది రాధిక. "తల్లిదండ్రులని చూసి రండి," అంది. రాధిక తండ్రి కూతురు చెంపలు వాయించడం, "ఎందుకు నాన్న కొడుతున్నారు?" అని రాధిక మాటలు విని పరుగున బయటకు వచ్చాడు కళ్యాణ్.


"ఎందుకు నాన్న నన్ను కొడుతున్నావు? నీ కోసం నేను నగ తాకట్టు పెడితే వీళ్లు నన్ను ఎంత మాటలన్నారో?" అని ఫిర్యాదు చేయబోతున్న కూతురు వంక గంభీరంగా చూసి, అప్పుడే బెడ్ రూమ్ తలుపు తీసుకుని వస్తున్న సుబ్బరామయ్య గారిని చూసి, ఆయన దగ్గరికి వెళ్లి వియ్యంకుడి దగ్గర తల దించుకుని నిలబడ్డాడు.

"బావగారు! మా అమ్మాయి నేను పడుతున్న కష్టం తెలుసుకుని నా కోసం ఏదో ఒకటి చెయ్యాలని తరతరాలుగా వస్తున్న మీ ఇంటి హారాన్ని, మీతో చెప్పకుండా తీసుకురావడం చాలా పెద్ద తప్పు చేసింది. అయితే నేను కూడా ఈ హారం మా అమ్మాయిది అనుకుని, అల్లుడిని సంప్రదించి తీసుకుని వచ్చింది అనుకున్నాను."


​రాధిక ఏదో చెప్పబోతుంటే, ఆయన ఆపుతూ..

​"పెద్దవాళ్లు ఇంట్లో ఉండగా, నువ్వు సొంతంగా తీసుకున్న ఈ నిర్ణయం నాకు సహాయం చేసినట్టు లేదు. నన్ను అందరి ముందు అవమానపరిచినట్టు ఉంది. నా అప్పు తీర్చడానికి నీకు మీ ఇంటి హారం కనిపించింది కానీ, మీ ఇంటి గౌరవం కనిపించలేదా? నీకు కష్టం వస్తే చెప్పుకోవడానికి నీ అత్తమామలు పరాయివాళ్లా? ఈ రోజు వాళ్లు నిన్ను మందలించారంటే, అది నీ మీద ఉన్న అధికారంతో కాదు.. నువ్వు దారి తప్పుతున్నావన్న బాధతో!"


"బావగారు, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. త్వరలోనే మా ఆవిడ పేరున ఉన్న రెండు ఎకరాల పొలం అమ్మి మీకు సొమ్ము అందజేస్తాను. మా అమ్మాయిని క్షమించండి," అన్నాడు రాధిక తండ్రి. 


 అప్పుడు సుబ్బరామయ్య గారు కలగజేసుకుని, "పోనీలే బావగారు, ఆ హారం విలువ తను డబ్బుతో కొలిచిందే తప్ప, అది మాకు ఆస్తులకన్నా ఎక్కువ అని తెలియక చేసింది. చిన్నపిల్ల, తెలియనితనం. మా అమ్మాయి అయినా ఇదే పనిచేసేది. 

"నేను కూడా శాంతంగా సర్దిచెప్పకుండా కొద్దిగా కఠినంగా మాట్లాడాను. మీకు ఇచ్చిన డబ్బులు నావి కాదు, మనవి. అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయపడకపోతే ఇంకా బంధుత్వాలు ఏమిటి బావగారు? మీరు పొలం అమ్మకండి. మీరు కొద్దిగా వ్యాపారంలో తేరుకున్న తరువాత మీ అమ్మాయికి ఇవ్వండి," అన్నాడు. 


"లేదు బావ గారూ! అది తెలియక చేసిన తప్పు కాదు, బాధ్యత తెలియక చేసిన పని. నగను విడిపించడానికి మీరు డబ్బు ఇచ్చి ఉండొచ్చు, కానీ అది తిరిగి మీ ఇంట్లో చేరడానికి కారణం నా కూతురు కాదు, మీ పెద్ద మనసు."

తండ్రి మాటలతో రాధిక కళ్ళు తెరుచుకున్నాయి. తన అత్తమామలు తనని ఎందుకు తిట్టారో ఆమెకు ఇప్పుడు స్పష్టంగా అర్థం అయ్యింది. అది తనను తక్కువ చేయడానికి కాదు, తనను ఆ ఇంటి మనిషిగా భావించి, తప్పు చేసినప్పుడు సరిదిద్దే హక్కు తీసుకున్నారని తెలుసుకుంటుంది.


​రాధిక నెమ్మదిగా మామగారి దగ్గరకు వెళ్లి, "నన్ను క్షమించండి మామగారు. నాన్న అప్పు తీర్చడం నా బాధ్యత అనుకున్నాను కానీ, ఈ ఇంటి కోడలిగా నాకున్న పరిమితుల్ని మర్చిపోయాను. మీరు నన్ను మందలించింది నా మంచికే అని ఇప్పుడు అర్థమైంది," అని వినయంగా అంటుంది.


మామగారు చిరునవ్వుతో ఆ హారాన్ని రాధికకి ఇచ్చి, "ఇది నగ కాదు రాధికా , నమ్మకం. ఇక మీదట మన ఇంట్లో ఏ సమస్య వచ్చినా అందరం కలిసి మాట్లాడుకుందాం. ఇంతకీ మమ్మల్ని వెళ్ళమంటావా?" అన్నాడు. 


"వెళ్ళండి మామయ్యగారు. మమ్మల్ని కూడా తీసుకుని. కొన్నాళ్ళు మన ఊరిలో ఉండి తిరిగి వద్దాము," అంది రాధిక.


అందరూ నవ్వుకుంటూ ఉంటే, "పదండి అన్నయ్యగారు, భోజనం వడ్డిస్తాను," అంది సుందరి.


  శుభం


జీడిగుంట శ్రీనివాసరావు గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):





జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page