top of page
Original.png

సిరి దా వచ్చినను వచ్చును, పోయినను పోవును


బోడాల వద్ద లక్ష్మీదేవి చెన్నయ్యను పిలుస్తున్న దృశ్యం
బోడాల వద్ద లక్ష్మీదేవి చెన్నయ్యను పిలుస్తున్న దృశ్యం

Siri da Vachhinanu Vachhunu Poyinanu Povunu - Telugu Folk Moral Story | Kasivarapu Venkatasubbaiah

సిరి దా వచ్చినను వచ్చును, పోయినను పోవును - తెలుగు పల్లె నీతి కథ | కాశీవరపు వెంకటసుబ్బయ్య

Published In manatelugukathalu.com On 14/05/2026

కాలితో డబ్బును తన్నిన చెన్నయ్యకు లక్ష్మీదేవి ఇచ్చిన శాపం! 

ఆ శాపమేమిటో ‘సిరి దా వచ్చినను వచ్చును, పోయినను పోవును’ కథలో కాశీవరపు వెంకట సుబ్బయ్య గారు చక్కగా వివరించారు. 


అలిదెన గ్రామంలో చెన్నయ్య అనే చిన్నకారు రైతు ఉండేవాడు. అతనికి ఊరికి దూరంగా బోడాలకు (బోడి కొండలు) అవలి వైపు ఐదెకరాల మాగాణి భూమి ఉంది. ఊరిలో చౌడుమిద్దె, ఊరికి ఆనుకొని వామి, కళ్ళందొడ్డి, కాడి ఎద్దులు, రెండు పాడి ఎనుములు ఉన్నాయి. చెన్నయ్యకు భార్య బోడమ్మ, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 


చెన్నయ్య సాదాసీదా జీవితం గడుపుతూ, ఉన్నంతలో తృప్తిగానే బతికేవాడు. పల్లెలో గౌరవంగా ఉంటూ, మంచివాడనిపించుకుంటూ ఉండేవాడు. ప్రతిరోజు చెన్నయ్య తన రెండు ఎద్దులను కాడిమానుకు ఇరువైపులా కట్టుకొని, కాడిమానుకు మడక తగిలించుకొని తన పొలానికి పోయి దుక్కి దున్ని, విత్తనం విత్తి, నీరు పారగట్టి సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు. 


ప్రతిరోజు బోడాలు దాటి పొలం దగ్గరకు పోయి వస్తుండేవాడు. ఆ బోడాలపైన బోడమ్మ దేవతకు చెందిన చిన్న దేవాలయం కూడా ఉంది. చెన్నయ్య పొలానికి పోయేటప్పుడు, వచ్చేటప్పుడు బోడమ్మ దేవతకు భక్తిపూర్వకంగా మ్రొక్కేవాడు.


ఒక రోజు చెన్నయ్య పొలం పని చూసుకొని, కాడి కట్టుకొని ఇంటికి వస్తుంటే, బోడాల దగ్గరకు వచ్చేసరికి "ఒరే చెన్నయ్య! నేనొస్తరా! నేనొస్తరా! నేనొస్తరా!" అనే పిలుపు వినపడింది. 


చెన్నయ్య వెనక్కి తిరిగి చూస్తే ఏమీ కనిపించేది కాదు. ఏదోలే అనుకొని సాగిపోయేవాడు చెన్నయ్య. బోడాలు దాటగానే పిలుపు వినిపించేది కాదు. అలా ప్రతిరోజూ పొలం పని ముగించుకుని బోడాల దగ్గరకు వచ్చేసరికి మళ్లీ పిలుపు వినిపించేది. బోడాలు దాటగానే పిలుపు వినపడేది కాదు. ఒక రాత్రి నిద్రపోయే ముందు చెన్నయ్య ఆలోచించాడు: "బోడాల దగ్గరకు వచ్చేసరికి వినబడే ఆ పిలుపు ఏమిటి? ఎవరు పిలుస్తున్నారు? ఎందుకు పిలుస్తున్నారు? తిరిగి చూస్తే ఎవరూ కనిపించడం లేదు. ఈసారి పిలిస్తే, ఎవరో ఒకరిని అడగాలి, ఎందుకో కనుక్కోవాలి." అనుకుంటూ నిద్రపోయాడు చెన్నయ్య.


మరుసటి రోజు చెన్నయ్య పొలం పని అయిపోగానే బయలుదేరి బోడాల దగ్గరకు రాగానే మళ్లీ అదే పిలుపు వినిపించింది. ఈసారి చెన్నయ్య ధైర్యం చేసి అడిగాడు: "ఎవరమ్మా నీవు? ఎందుకు నా వెంట వస్తాను అంటున్నావు?" అడిగాడు.


"ఒరే చెన్నయ్యా! నేను లక్ష్మిదేవిని రా! నీ పాలిట ఉన్నాను రా! అందుకే వస్తాను అంటున్నావు రా! నా మాట విని నన్ను తీసుకుని పోరా చెన్నయ్యా. నేను ఈ బోడాల వద్దనే కోలరాయిని ఆనుకొని ఉన్నాను రా! తీసుకు పోరా చెన్నయ్యా!" అని పలికింది.


"అమ్మా లక్ష్మీ మాతా! నిన్నెలా  తీసుకుని పోవాలమ్మా?" అని అడిగాడు చెన్నయ్య.


"నేను బోడాల సమీపాన ఉన్న కోలరాయి దగ్గర ఉన్నాను. పున్నమి రాత్రి మొదటి ఝామున నిండు బిందె నీళ్లు చల్లి, ముగ్గు వేసి, పసుపు కుంకుమ పెట్టి, పూలతో అలంకరించి, తాంబూలం పెట్టి, టెంకాయ కొట్టి తవ్వితే పది చెంబుల నీళ్లు పట్టే అండా నిండా బంగారు నాణేలు, ఆభరణాలు కనిపిస్తాయి. 


తీసుకుని పోయి ఇల్లు శుద్ధి చేసి ఈశాన్య మూల పెట్టి అవసరానికి వాడుకో! నీవు ధనవంతుడివి అవుతావు. ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జరిగిపోవాలి. నీ భార్య బోడమ్మకు కూడా చెప్పవద్దు. బోడమ్మ దేవతపై ప్రమాణం చేసి చెప్పు చెన్నయ్యా!" అని శ్రీలక్ష్మిదేవి చెప్పింది.


"అలాగే చేస్తానమ్మా! బోడమ్మ దేవత సాక్షిగా ఎవరికీ చెప్పను తల్లీ!" అని చెన్నయ్య భక్తి ప్రపత్తులతో పలికాడు.


"అయితే చెన్నయ్యా! నీ దగ్గర శాశ్వతంగా నేను ఉండాలంటే నీవు కొన్ని నియమాలు పాటించాలి. నీవు నీతి నిజాయితీగా ఉండాలి. న్యాయంగా, ధర్మంగా జీవించాలి. అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకోవాలి. కరుణ, దయ కలిగి ఉండాలి. అహంభావం, అహంకారం పెరిగి, కోపతాపాలతో ధనాన్ని కాలితో తన్నినా, విసిరివేసినా అప్పుడూ నేనుండను. ఈ విషయం ఎప్పుడూ మదిలో పెట్టుకుని మసలుకోవాలి." అని శ్రీలక్ష్మిదేవి వివరించి చెప్పింది.


"అలాగే అమ్మా! నీవు చెప్పినట్లే తుచ తప్పకుండా నడుచుకుంటాను తల్లి!" అని వినయపూర్వకంగా నమస్కరించాడు చెన్నయ్య.


అమ్మవారు చెప్పినట్టు చేసి, ధనంతో ఉన్న అండాను తీసుకొచ్చి, శుద్ధి చేసిన ఇంట్లో ఈశాన్య మూలన పెట్టి, పూజించి వినియోగించసాగాడు చెన్నయ్య.


అప్పటి నుండి చెన్నయ్య పట్టిందల్లా బంగారమే అయ్యేది. ఏది చేసినా, ఏమి చేసినా లాభసాటి అయ్యేది. 


అచిరకాలంలోనే ఊరిలోకెల్లా పెద్ద ధనవంతుడయ్యాడు. ఆ ఊరికి పెద్ద మనిషి అయ్యాడు. అందరూ రుణ సహాయం కోసం చెన్నయ్య దగ్గరకే వచ్చేవారు. తన దగ్గరకు వచ్చినవారికి లేదనకుండా, కాదనకుండా ధనసహాయం చేసేవాడు. ఊరిలో జరిగే ఉత్సవాలకు భారీ విరాళాలు, జాతర్లకు చందాలు ఇచ్చేవాడు. 


ఆలయాల్లో నిత్యనైవేద్యానికి, పూజాకైంకర్యాల ఖర్చులు, పూజారులకు జీతభత్యాలు భరించేవాడు. పేదలకు నిత్యాన్నదాన సత్రం నడిపేవాడు. వస్త్రదానం చేసేవాడు. పరదేశీయులకు, సన్యాసులకు సత్రాలు, సావిళ్ళు కట్టించాడు చెన్నయ్య.


తన ఇద్దరు కొడుకులకు అందమైన భవంతులు కట్టించాడు. కూతుర్లను ధనవంతుల కుటుంబాలకు భారీ కట్నకానుకలు ఇచ్చి కోడళ్ళుగా చేశాడు. కొడుకులకు గొప్ప ఇళ్ళ నుంచి కోడళ్ళను తెచ్చుకున్నాడు. కోడళ్ళు ఎనలేని సంపదను, భూములను కట్నం కింద తెచ్చారు. వందలాది ఎకరాల మాగాణి భూమిని కొన్నాడు. వందలాది ఎకరాల పండ్ల తోటలు కొన్నాడు.


సుఖంగా ఏండ్లకేండ్లు గడచిపోయాయి. కాలక్రమేణా చెన్నయ్యలో అహంభావం, అహంకారం పొడచూపాయి. కోపం, తాపం, మదం, మాత్సర్యం చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరిని చులకనగా చూడడం మొదలు పెట్టాడు. దగ్గరకు వచ్చినవారిని అవమానిస్తున్నాడు. అప్పు తీసుకున్నవారిని సమయానికి ఇవ్వకపోతే బండబూతులు తిడుతున్నాడు. 


అతని ప్రవర్తనకు ప్రజలందరూ విసుక్కుంటున్నారు. ఏవగించుకుంటున్నారు. భరించలేక పోతున్నారు. రోజురోజుకూ చెన్నయ్య పాశవికంగా, పైశాచికంగా, క్రౌర్యంగా ప్రవర్తించసాగాడు.


ఒక రోజు చెన్నయ్య దగ్గర అప్పు తీసుకున్న ఒకడు సమయానికి సొమ్ము సర్దుబాటు కాక సగం సొమ్మునే తెచ్చి ఇచ్చాడు. చెన్నయ్య ఉగ్రుడై మండిపడి సొమ్మును వాడి ముఖం మీదే విసిరి కొట్టాడు. విసిరి కొట్టిన సొమ్ము ఎగిరొచ్చి చెన్నయ్య దగ్గరగా పడింది. "తీసుకుపో" అని ఆ ధనాన్ని కాలితో తన్నాడు.


అంతే! ఆ రాత్రి చెన్నయ్యకు శ్రీలక్ష్మి కలలో కనిపించి, "చెన్నయ్యా! నేను చెప్పిన అన్ని నియమాలు తప్పావు. చివరికి కాలితో కూడా తన్నావు. ఇంకా నీ ఇంట్లో ఉండకుండా పోతున్నాను రా! అవమానించబడిన చోట నేను ఉండను రా!" అని అదృశ్యమైపోయింది శ్రీమహాలక్ష్మి.


ఆ రోజు నుంచి చెన్నయ్య సంపద క్రమేణా తరుగుతూ వచ్చి, సంవత్సరం తిరిగే లోపల చెన్నయ్య ముందున్న స్థితికి వచ్చాడు.


కూతుర్లు ధనవంతుల ఇళ్లకు కోడళ్ళుగా పోయారు కాబట్టి రక్షింపబడ్డారు. కొడుకులు కోడళ్ళు కట్నం కింద తెచ్చిన ధనం, ఆభరణాలు, భూములు ఉండడం వలన "గ్రుడ్డి కన్నా మెల్ల మేలు" అన్నట్లు అయ్యారు. 


ఇక మనవళ్లు, మనవరాళ్లు అప్పటికే బాగా చదువుకోవడం వలన మంచి ఉద్యోగాలు సంపాదించి, దురదృష్టానికి దూరమయ్యారు.


చెన్నయ్య పశ్చాత్తాపపడి, భగవంతుని ధ్యానిస్తూ, ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపాడు.

'ధనం పెరిగితే మదం పెరుగును' అన్నదానికి చెన్నయ్య జీవితమే నిదర్శనం.


                           ----------


కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):







కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

YouTube Playlist Link:


పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.

పుట్టింది  1960లో.

చదివింది డిగ్రీ.

నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.

అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.

భార్య - కళావతి.

సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .

కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక

మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ

రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,

'పినాకిని కథలు' కథల సంపుటి.

రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.

సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.

పెన్నోత్సవం 2004.

జార్జి క్లబ్ వారు,

ప్రొద్దుటూరు నాటక పరిషత్.

యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.

స్నేహం సేవా సమితి.

కళా స్రవంతి.

తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.

NTR అభిమాన సంఘం.

తెలుగు రక్షణ వేదిక 

వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.

గోదావరి పుష్కర పురస్కారం.

కృష్ణా పుష్కర పురస్కారం.

స్వామి క్రియేషన్స్.

కృష్ణదేవరాయ సాహితీ సమితి.

భానుమతి స్వరం మీడియా.

కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page