top of page
Original.png

హితుడు


రోడ్డు పక్కన చిరునవ్వుతో షూ పాలిష్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తున్న సాధారణ వ్యక్తి.

Hithudu - Telugu Emotional Story | Routhu Srinivasa rao

హితుడు తెలుగు భావోద్వేగ కథ | రౌతు శ్రీనివాసరావు

Publishes in manatelugukathalu.com on 07/08/2026


మనిషి గొప్పతనం అతని వృత్తిలో కాదు, అతని హృదయంలో ఉంటుంది. రోడ్డు పక్కన షూ పాలిష్ చేస్తూ జీవనం సాగించే ఒక సాధారణ వ్యక్తి, తన చిరునవ్వుతో, ఆప్యాయతతో, సేవాభావంతో ఎంతమందిని సంపాదించుకున్నాడో చెప్పే హృద్యమైన జీవనానుభవం ఇది. "హితుడు" కథ మనకు డబ్బుకంటే మనుషులే గొప్ప సంపద అని, నిజమైన గౌరవం ప్రేమతో సంపాదించుకోవచ్చని గుర్తు చేస్తుంది.


ఈ రోజు సాయంత్రం ఆఫీస్ ముగించుకుని ఇంటికి బయలుదేరాను.


బూట్లకు బాగా దుమ్ము పట్టేసింది. దారిలో ఒక షూ పాలిష్ చేసే వ్యక్తి కనిపించడంతో, "సరే, పాలిష్ చేయించుకుందాం" అనుకుని స్కూటర్ ఆపాను.


నెమ్మదిగా ఆయన నన్ను ఒకసారి చూశాడు. కానీ నేను స్కూటర్‌ను ఆయన షాప్ ముందు కొంచెం దగ్గరగా పెట్టడం వల్ల దిగడానికి ఇబ్బంది పడుతుంటే, వెంటనే ఎంతో ఆప్యాయంగా...


"సార్... మీరు దిగొద్దు. షూ ఇవ్వండి... నేను పాలిష్ చేసి ఇస్తాను." అన్నాడు.


ఆ "సార్" అనే పిలుపులో ఒక గౌరవం ఉంది... అది డబ్బు సంపాదించడం కోసం మాట్లాడిన మాటలా అనిపించలేదు. మనసుతో పలికిన మాటలా అనిపించింది.


నేను షూ తీసి ఇచ్చాను. "ఎంతయ్యా?" అని అడిగాను.


"నలభై రూపాయలు సార్..." అన్నాడు. షూ పాలిష్ చేస్తుండగా, నాకు ఉన్న అలవాటు ప్రకారం...


"ఏవూరయ్యా... మీది?" అని అడిగాను.


"బొబ్బిలి సార్..." అన్నాడు.


బొబ్బిలి అనగానే నాకు కూడా ఒక అనుబంధం గుర్తొచ్చింది.


"అరే... మా అమ్మవారి ఊరు కూడా బొబ్బిలే..." అన్నాను.


అంతే... ఇద్దరం మాటల్లో పడ్డాం.


ఆయన పక్కనే ఎవరో స్పోర్ట్స్ బూట్లు రిపేర్ చేయించడానికి పెట్టారు. బాగా చిరిగిపోయి ఉన్నాయి.


"ఇవి కూడా రిపేర్ చేస్తావా?" అని అడిగాను.


"కొంతమంది అడుగుతారు సార్... చేయగలిగితే చేస్తాను..." అన్నాడు.


అంతలో ఒక చిన్న సంఘటన గమనించాను. ఒక పాప... మూడు, నాలుగు సంవత్సరాలు ఉంటుందేమో... తన అమ్మానాన్నల చేతులు పట్టుకుని, నెమ్మదిగా ముద్దు ముద్దుగా నడుస్తూ...


ఆ పాపను చూడగానే ఆయన ముఖంలో చిరునవ్వు మరింత పెరిగింది.


"ఏమ్మా... వాకింగ్ వెళ్తున్నారా?... డీమార్ట్‌కి వెళ్తున్నారా?" అంటూ ఎంతో ప్రేమగా పలకరించాడు.


ఆ పాప కూడా ఆయనను చూసి నవ్వింది.


అది చూసి నాకు ఆశ్చర్యమేసింది.


"వీళ్ల మధ్య ఇంత ఆప్యాయత ఎలా వచ్చింది?" అనిపించింది.


కొద్దిసేపు గమనించాను...


అక్కడికి వచ్చేవాళ్లు... వెళ్లేవాళ్లు... చాలామంది ఆయనను పేరుపేరునా పలకరిస్తున్నారు.


ఒక ఇంటి మనిషిలాగా, ఒక సన్నిహితుడిలాగా.


ఆయన కూడా, అందరితో అంతే ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు.


ఇంకొద్దిసేపటికి మరో సంఘటన.


ఆయన పక్కనే ఒక చిన్న స్టూల్ ఉంది.


ఒక వృద్ధుడు కర్ర పట్టుకుని నెమ్మదిగా వచ్చాడు.


వచ్చి ఎంతో ప్రేమగా...


"డాడీ... స్టూల్ ఇవ్వు" అన్నాడు.


ఆయన వెంటనే...


"రండి నాన్న... కూర్చోండి..." అంటూ స్టూల్ ముందుకు జరిపాడు.


ఆ వృద్ధుడు కూడా ఎలాంటి సంకోచం లేకుండా కూర్చున్నాడు.


ఆ దృశ్యం చూసి నా మనసులో ఒక ఆలోచన మెదిలింది.


ఈ మనిషి సంపాదించేది డబ్బు మాత్రమే కాదు... అంతకుమించి మనుషులను కూడా.


అక్కడ ఆయన కూర్చున్నది రోడ్డు పక్కనే.


ఒక పెద్ద గొడుగు...


చిన్న ఫ్లెక్సీ షీట్ కింద పనిముట్లు...


పక్కనే టీ షాపు...


మురుగు వాసన...


అదే ఆయన సామ్రాజ్యం.


కానీ, ఆ చిన్న ప్రపంచంలోకి వచ్చిన ప్రతి మనిషినీ చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నాడు.


ఆయన చేతులు బూట్లను పాలిష్ చేస్తున్నాయి...


కానీ ఆయన మాటలు మనుషుల హృదయాలను పాలిష్ చేస్తున్నాయి.


ఇంతలో ఇద్దరు యువకులు స్కూటర్‌పై వేగంగా వచ్చి చిన్నగా ఢీకొని కింద పడిపోయారు.


చుట్టూ చాలామంది చూస్తున్నారు.


కానీ ఎవరూ ముందుకు వెళ్లలేదు.


ఈయన మాత్రం నా షూను పక్కన పెట్టేసి...


ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పరుగెత్తాడు.


వాళ్లను లేపాడు.


దుమ్ము దులిపాడు.


"ఏమీ కాలేదుగా... నెమ్మదిగా వెళ్లండి బాబూ..." అంటూ ధైర్యం చెప్పాడు.


వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ నా దగ్గరకు వచ్చి...


"సారీ సార్..." అని చెప్పి, మళ్లీ నా షూ పాలిష్ చేయడం మొదలుపెట్టాడు.


ఆ క్షణంలో నాకు అనిపించింది...


ఇతను షూ పాలిష్ చేసే మనిషి మాత్రమే కాదు...


మనుషుల మనసులను గెలుచుకున్న మనిషి.


ఆ రోజు ఆయన నా బూట్ల మీదున్న దుమ్మును మాత్రమే తుడవలేదు...


నా మనసులో ఉన్న కొన్ని అపోహలను కూడా తుడిచేశాడు.


కొంతమంది వృత్తితో గొప్పవాళ్లు అవుతారు...


కొంతమంది హృదయాలతో పని చేస్తారు...


ఆయన రెండో కోవకు చెందిన మనిషి.


ఆయన చేసిన పాలిష్ బూట్ల మీద మెరుపు తీసుకొచ్చింది...


కానీ ఆయన వ్యక్తిత్వం నా ఆలోచనలకు మెరుపు తీసుకొచ్చింది.


అప్పుడే నాకు అర్థమైంది...


ఆయన మాత్రం...


చేతులతో బూట్లు పాలిష్ చేస్తూ... హృదయాలతో మనుషులను సంపాదించుకున్న నిజమైన "మనిషి".


అప్పుడు నాకు అర్థమైంది... ఎంత తృప్తిగా జీవిస్తున్నాడు ఈ మనిషి అని.


ఉన్నత స్థాయిలో ఉండడం వేరు... ఉన్నతంగా జీవించడం వేరు. కోట్ల ఆస్తి ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, భారీ వేతనం ఉండొచ్చు. కానీ టెన్షన్ కూడా నీతో పాటు నడుస్తుంటే, స్వేచ్ఛ నీకు లేకపోతే, ప్రశాంతత దూరమైతే... వాటి విలువ ఏముంటుంది?


మాటల మధ్యలో ఆయన పిల్లల గురించి కూడా అడిగాను. ఇద్దరు చిన్న పిల్లలు... ఒకరు ఎనిమిదో తరగతి, ఇంకొకరు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. నేను చెప్పాను...


"నీకు ప్రభుత్వం నుంచి సహాయం ఉంటుంది. పిల్లలకు ఉచిత విద్య కూడా లభిస్తుంది. కానీ వాళ్లను మాత్రం కష్టపడి చదివించు. అదే నీ అసలు సంపద."


ఆయన జీవితం చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపించింది. పెద్ద పెద్ద వాళ్లతో తిరిగే మనిషి కాదు. కానీ ఎప్పుడూ నవ్వుతూ, దిల్‌దార్‌గా, ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా జీవిస్తున్నాడు. అలాంటి తండ్రి దగ్గర పెరిగే పిల్లల్లో కూడా అదే మనస్తత్వం వస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. కష్టాన్ని తట్టుకునే గుణం వస్తుంది. ప్రకృతి మధ్యలో, పల్లె వాతావరణంలో పెరిగిన పిల్లలకు జీవితం అంటే ఏమిటో చిన్నప్పుడే అర్థమవుతుంది.


పాలిష్‌కు యాభై రూపాయలు అయితే, నేను వంద రూపాయలు ఇచ్చి,


"మళ్లీ వచ్చినప్పుడు నీ దగ్గరే పాలిష్ చేయించుకుంటాను."


అని చెప్పాను.


ఆయన కళ్లలో కనిపించిన ఆనందం... ఆ వంద రూపాయల విలువ కాదు. తన పనిని గౌరవించారని వచ్చిన తృప్తి.


నెమ్మదిగా స్కూటర్ స్టార్ట్ చేసి వస్తుంటే, ఎప్పుడో నాకంటే ముందే రిటైర్ అయిన ఒక సహోద్యోగి చెప్పిన మాట గుర్తొచ్చింది.


"జీఎం అయినా అరవై ఏళ్లకే రిటైర్. ప్యూన్ అయినా అరవై ఏళ్లకే రిటైర్. కానీ ఆ తర్వాత చూస్తే, ప్యూనే ఆరోగ్యంగా ఉంటాడు. పెద్దగా టెన్షన్ లేకుండా తన పని చేసుకుంటూ, నవ్వుకుంటూ తిరుగుతాడు. జీఎంకి మాత్రం జీవితాంతం టెన్షన్లు, బీపీలు, గుండె శస్త్రచికిత్సలు."


అప్పుడు నవ్వేసినా... ఈరోజు ఆ మాటల్లో ఎంత నిజం ఉందో అర్థమైంది.


భగవంతుడు కూడా జీవితాన్ని ఎంత విచిత్రంగా సమతుల్యం చేస్తాడో అనిపించింది. సుఖాలు ఇస్తే, ఎక్కడో ఒకచోట భారం పెడతాడు. కష్టాలు ఇస్తే, వాటిని భరించే ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు.


అక్కడే ఒక రిటైర్ అయిన పెద్దాయన వచ్చి,


"బాబూ... ఇక్కడ కూర్చోవచ్చా?"


అని అడిగాడు.


ఆ గొంతులో ఉన్న ఆర్ద్రత... నాకు చాలా సేపు మర్చిపోలేకపోయాను.


ఆయనకు కావలసింది డబ్బు కాదు.


మాట్లాడే మనిషి.


పలకరించే మనిషి.


అంతే.


ఈ ప్రపంచం ఇప్పుడు ఆధునికత వైపు పరుగు పెడుతోంది. పట్టణాల్లో ముసలివాళ్లు అయ్యాక, వాళ్లని పట్టించుకునే సమయం ఎవరికీ ఉండదు.


అదే పల్లెటూరులో అయితే...


చెట్టు కింద కూర్చుంటారు.


రామ మందిరంలో కూర్చుంటారు.


చెరువు గట్టు మీద కూర్చొని నీళ్లను చూస్తారు.


వర్షం పడుతుంటే ఆనందిస్తారు.


వరదలు వస్తే ఆ ప్రవాహాన్ని చూస్తూ ప్రకృతితో గడుపుతారు.


ప్రకృతితో కలిసి జీవిస్తారు.


పంచభూతాలతో కలిసి శ్వాసిస్తారు.


అందుకే వాళ్ల ముఖాల్లో ఒక ప్రశాంతత ఉంటుంది.


ఇప్పుడు పట్టణాల్లో సాయంత్రం అంటే పార్క్‌కి వెళ్లడం... లేదంటే ఏదైనా సొసైటీలో కాసేపు నవ్వుకోవడం. అంతే.


మనిషికి మనిషి దూరమైపోయాడు.


ఒకప్పుడు బంధువులు దగ్గర దగ్గరగా ఉండేవారు.


స్నేహితులు దగ్గరగా ఉండేవారు.


ఊరంతా ఒక కుటుంబంలా ఉండేది.


ఇప్పుడు ఉద్యోగాల కోసం, డబ్బు కోసం, అవకాశాల కోసం...


మనిషి చెట్టుకొకడు, పుట్టకొకడు అయిపోయాడు.


అందరూ పరిగెడుతున్నారు.


కానీ ఎందుకు పరిగెడుతున్నారో చాలామందికి తెలియడం లేదు.         అలా వెళ్తూ, కొద్దిసేపటికి కూరగాయలు కొనడానికి స్కూటర్ ఆపాను. ఎర్ర దుంపలు, ఆగాకర కాయలు కొన్నాను. ఆకు కూరలు కొన్నాను. నేను స్కూటర్ మీద నుంచే అడుగుతాను. ఆమెకు అలవాటు. నన్ను చూడగానే రెండు కట్టలకు బదులు మూడు కట్టలు ఇస్తుంది. ఆమె పెద్ద బొట్టు పెట్టుకుని, నవ్వుతూ పలకరిస్తుంది. ఒక తల్లి భావన...


కానీ, ఇంకో వ్యక్తి... దుంపలు అమ్మే పెద్దాయన... మంచి కాయలు పక్కన పెట్టి, చిన్నవి, నాసిరకమైనవి నాకు వేయడం చూశాను. మంచి సరుకు ఎప్పుడైనా అమ్మవచ్చు అనే ఆలోచన.


అప్పుడు అనిపించింది... ఉద్యోగంలో టెన్షన్ ఒకటి. వ్యాపారంలో టెన్షన్ ఇంకొకటి. మనిషి ఎక్కడ ఉన్నా, ఇంకా ఇంకా సంపాదించాలనే ఆరాటం ఉంటే, మనసుకు విశ్రాంతి ఉండదు.


ఏదేమైనా, ప్రభుత్వం ఈ చిరు వ్యాపారస్తులకు ఒక గొడుగు, తాగునీరు, ఆరోగ్య పరీక్షలు, బీమా, భోజనశాల వంటివి సక్రమంగా సమకూరిస్తే బాగుంటుందని అనిపించింది.


ఈ భగవంతుడు ప్రపంచాన్ని ఎలా సమతుల్యం చేస్తున్నాడో ఆశ్చర్యంగా ఉంటుంది. తినడానికి అన్నీ ఉన్నవాడికి ఆరోగ్యం ఉండదు. తినడానికి సరిగా లేనివాడికి ఆరోగ్యం బాగుంటుంది. డబ్బు ఉన్నవాడికి ప్రశాంతత ఉండదు. ప్రశాంతంగా ఉన్నవాడికి డబ్బు తక్కువగా ఉంటుంది. ఇలా ఒక సమతుల్యతలోనే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడేమో అనిపిస్తుంది.


కానీ ఇవన్నీ చాలామందికి చివరి మలుపు దగ్గరే అర్థమవుతాయి. అప్పటికే కాలం చాలా దూరం వెళ్లిపోయి ఉంటుంది.


ఏదైనా... జీవితం క్షణభంగురం.


స్వచ్ఛంగా జీవించగలిగితే... స్వేచ్ఛగా గాలి పీల్చగలిగితే... మనసు ప్రశాంతంగా ఉంటే... అదే నిజమైన సంపద.


చివరికి మనమందరం కాలచక్రంలో కలిసిపోవాల్సిందే. ఈ శరీరం ఇక్కడే మిగిలిపోతుంది. మనతో వచ్చేది మనం చేసిన మంచి మాత్రమే... అందుకే, ప్రేమను పంచు... చిరునవ్వులు పూయించు.


అందుకే... మంచిగా ఆలోచిద్దాం. మంచిగా జీవిద్దాం. మన వల్ల ఇంకొకరి ముఖంలో చిరునవ్వు పూయిస్తే... అదే జీవితానికి అర్థం. నీలో ఉన్న ఆ పరమాత్మ ఆనందిస్తారు.


సెలవు... ఉంటానండి...


 మీ.. ఆర్.ఎస్. రావు


***************************************


రౌతు శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రౌతు శ్రీనివాసరావు

రచయిత పరిచయం: రౌతు శ్రీనివాసరావు

నా పేరు రౌతు శ్రీనివాసరావు. నేను భారతీయ రైల్వేలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. కవితలు, కథలు చదవడం, రచించడం నా అభిరుచులు. సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ, నా మనోభావాలను చిన్న చిన్న కథానికలుగా, కవితలుగా మలచే ప్రయత్నం చేస్తున్నాను. నా రచనలను చదివి మీ విలువైన అభిప్రాయాలు, ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏

bottom of page