స్పష్టాస్పష్టం

Spashtaspashtam - Telugu Comedy Love Story | Bhattu Venkata Rao
స్పష్టాస్పష్టం - తెలుగు హాస్య ప్రేమ కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 21/09/2026
స్పష్టాస్పష్టం భట్టు వెంకటరావు రాసిన సరదా గ్రామీణ ప్రేమకథ.
సీతాలు, రాంబాబు మధ్య జరిగిన చిన్న సంఘటన ఎలా పెద్ద అపార్థంగా మారిందో ఈ కథలో హాస్యభరితంగా చూపించారు. కోపం, స్నేహం, ప్రేమ, గ్రామీణ జనాల తీర్పు కలిసి కథను ఆసక్తికరంగా నడిపిస్తాయి.
చివర్లో వచ్చే మలుపు కథకు మరింత వినోదాన్ని జోడిస్తుంది.
(1)
మంచు తెరల్లోంచి చూస్తున్నట్లుగా, కొన్ని సన్నివేశాలు కనిపిస్తూనే ఉన్నట్లుంటాయి, కానీ పూర్తిగా కనపడవు. అర్థమవుతూనే ఉన్నట్లుంటాయి, కానీ పూర్తిగా అర్థం కావు.
(2)
మట్టి కడవ చేత్తో పట్టుకుని చెరువు దగ్గరికి నీళ్ళ కోసం వచ్చిన సీతాలుని, ఆమె నీళ్ళకొచ్చే సమయం తెలిసి అప్పటిదాకా చెరువు గట్టునున్న రావిచెట్టు మొదలు చాటున మాటేసి నిలబడున్న రాంబాబు, ఒక్కసారిగా బయటికొచ్చి గభాల్న చెయ్యి పట్టుకున్నాడు.
ఎడం చేతి వాటంది సీతాలు. ఎడంచేతిలోనే ఉంది కడవ కూడా. చేతిలో ఉన్న కడవను ఏత్తి రాంబాబు నెత్తినేసి కొట్టింది. దెబ్బకు మట్టి కడవ ముక్కలైంది. రాంబాబు తల బద్దలైనంత పనైంది.
"అబ్బా... చచ్చానుగదే... ఎంత దెబ్బ కొట్టావే?" అని పెడబొబ్బలు పెడుతూ అక్కడి నుండి పరుగెత్తి వెళ్ళిపోయాడు రాంబాబు.
(3)
"అదేందే... అట్టా బాదేసావూ... ఇంకొంచెమైతే కన్నుబోయేదంట! మరీ అంత కోపమైతే ఎట్టాగే? అయినా మీ ఇద్దరికీ మంచి స్నేహమే కదా!" అడిగింది రత్తాలుని నాగమ్మత్త. పాలెంలో ఆమెను ఎరుగని వాళ్ళు లేరు. అందరికీ ఆమె నాగమ్మత్తే.
"స్నేహమా... ఆ… ఉంటే? అట్టా యాడబడితే ఆడ ఎట్టాబడితే అట్టా వచ్చి చెయ్యట్టుకుంటాడా?" అంది సీతాలు కోపంగా.
"సరేలేమ్మా... రాంబాబింక నీ మొగం చూడనంటన్నాడంట!" అంది నాగమ్మత్త.
"చూడకపోతే పోనీ..." అని విదిలించుకుని విసురుగా వెళ్ళిపోయింది సీతాలు.
(4)
"అదిగాదురా... నీయేపు నుంచి గూడా తప్పుళ్ళా... తెలిసిన పిల్లేగదా అని అట్టా పబ్లిగ్గా చెయ్యట్టుకుంటే ఎట్టా! ఏ ఆడపిల్ల ఊరుకుంటదీ?" అన్నాడు ఎంకయ్యమామ.
ఈయన కూడా పాలెంలో చాలా మందికి ఎంకయ్యమామే!
"ఏదో సరదాకి చేసా మావా..." అన్నాడు రాంబాబు. చెరువు గట్టున కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరూ.
"ఇప్పుడు సరదా తీరుళ్ళా..." అన్నాడు ఎంకయ్యమామ.
"ఆ బాగానే తీరింది... బొప్పితో ఒదిలిపోయింది, బద్దలుగాలా…" నసిగాడు రాంబాబు.
"ఇప్పుడు ఏడుస్తావుందంట... అయ్యో తొందరపడి కొట్టానే అనీ… ఏడుస్తా ఉందంటరా..." అని జాలిగా సాగదీసాడు ఎంకయ్యమామ.
"ఏడుస్తావుందా? యాడవనీ... ఎంతైనా యాడవనీ... దాని ఏడుపుతో రాలే కన్నీళ్ళతో ఈ చెరువంతా నిండనీ... నిండి పొంగనీ... పొంగి ఊర్లో పడి ఊరంతా మునగనీ... జనం అల్లాడిపోనీ... ఏమైనా గానీ... దాని మొహం మాత్రం ఈ జన్మలోనే కాదు మామా... ఇంకో జన్మలో కూడా చూడను" అన్నాడు నిశ్చయంగా రాంబాబు.
(5)
అంత నిశ్చయంగా, నిర్ణయంగా చెప్పిన రాంబాబు, నెల రోజులు తిరక్కుండానే పెళ్ళిపీట మీద కూర్చున్నాడు. పక్కన పీట మీద సీతాలు కూర్చుని ఉంది.
అదెట్లా జరిగిందయ్యా అంటే...
ఆ తరువాత ఓ పది రోజులకి, రోజూ మల్లేనే నీళ్ళకడవతో చెరువు దగ్గరికెళ్ళిన సీతాలు, కడవను నీళ్ళల్లో ముంచుతూ, ఒక్కసారిగా చెరువులో పడిపోయింది. పక్కన మరొకామె ఉండి కేకలెయ్యడంతో నలుగురూ వచ్చి నీళ్ళలోంచి సీతాలుని బయటికి తీసారు గాని, ఆ రోజు ఒంటరిగా ఉండుంటే, సీతాలు పని అయిపోయుండేదే!
అయితే, చెరువు నుంచి నీళ్ళు తేవడం సీతాలుకి కొత్త పనేమీ కాదు కదా! రోజూ చేసేదే కదా! మరి ‘సీతాలు చెరువులో ఎలా పడింది?’ అన్న ధర్మసందేహం పాలెంలో జనం అందరికీ కలిగింది.
"ఏముందీ... తూలి పడుండొచ్చులే!" అన్నారు కొందరు.
"తూలూ గాదు ఏం గాదు. అది కావాలనే చెరువులో పడిపోయింది!" అన్నారు మరి కొందరు.
"చా... అదెందుకు కావాలని పడిద్ది? దానికేమన్నా పిచ్చా?" అని తర్కించారు, పైవాళ్ళు పోగా మిగిలిన కొందరు.
"కాదులే... ఆడ కోపంలో అట్టా బాదేసినా... ఆ కోపం దిగిపోయాక దిగులట్టుకోకుండా ఎట్లాగుంటది? సీతాలుకి రాంబాబంటే ఎంత ఇదో ఎవరికి తెల్దు?" అన్నారు అందరూ.
అలా పాలెంలో కొన్ని రోజుల పాటు జనాల మధ్య జరిగిన తర్జభర్జనల ఫలితంగా, సీతాలు ఇంక మీదట ఎప్పుడూ నీళ్ళకెళ్ళి చెరువులో తూలి పడిపోకుండా ఉండాలంటే, సీతాలుని రాంబాబు పెళ్ళి చేసుకోవడం ఒక్కటే పరిష్కార మార్గం అని పాలెంలో అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయపడిన మీదట...
రాంబాబుకు మరింక మాట్లాడేందుకు ఏమీ లేకుండా పోయింది. ఆ తరువాత పది రోజులు గడవక ముందే, అప్పటికప్పుడు కొట్టి తెచ్చిన తాటాకులతో కప్పిన పెళ్ళిపందిరి, ఆ పందిట్లో మామిడాకుల తోరణాలతో కొబ్బరాకుల పెళ్ళి మండపం, ఆ మండపంలో ఎప్పటియ్యో వందలేళ్ళ క్రితంవి వెడల్పాటి పెళ్ళి పీటలు సిద్ధమయ్యాయి. ఇంత జరిగాక కూడా మగబెట్టు పోయి, "నువ్విట్టారారా రాంబాబూ ఒకపాలి…" అని పిలిచి, ఎవరూ చూడకుండా చాటుగా తీసుకెళ్ళి, పెళ్ళికూతురు ముస్తాబులో సీతాలుని చూపించాడు ఎంకయ్యమామ.
పూల జడ, పట్టు చీరలో సినిమాస్టారులా మెరిసిపోతున్న సీతాలుని, అలా చాటు నుంచి చూసిన తరువాత, మరొక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళి పెళ్ళిపీట మీద కూర్చున్నాడు రాంబాబు.
అయితే 'తానంటే అంత ఇష్టం ఉన్న సీతాలు, ఆ రోజు ఎందుకంత కోపంగా బుర్ర బద్దలయేలా కొట్టింది?' అనే ప్రశ్నకు మాత్రం సమాధానం, ఎంత ఆలోచించినా, అతడి మగమస్తిష్కానికి దొరకలా.
సమాప్తం
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.





Comments