మాస్టారు హితబోధ
- Nallabati Raghavendra Rao

- May 12
- 6 min read

Mastaru Hithabodha | Telugu Emotional Story | Nallabati Raghavendra Rao
మాస్టారు హితబోధ | తెలుగు భావోద్వేగ కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు
Published in manatelugukathalu.com on 12/05/2026
“పిల్లలు చెప్పేది నిజమా అబద్ధమా అని అనుమానించే తల్లిదండ్రులు…
ఒక గురువు చెప్పిన మాటతో ఎలా మారిపోయారో తెలుసా?
చిన్నారి చింటూ చివర్లో చెప్పిన ఒక్క మాట… మీ హృదయాన్ని కదిలిస్తుంది…”
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ఆసక్తికరమైన ‘మాస్టారు హితబోధ’ కథను వినండి.
చింటూకు ఎనిమిది సంవత్సరాలు. గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుతున్నాడు. ఫోర్త్ క్లాస్. తండ్రి వివేకానంద, తల్లి రుక్మిణి.
చింటూ రెగ్యులర్ గానే స్కూల్‌కి వెళ్తాడు.. కానీ అప్పుడప్పుడు బద్ధకిస్తుంటాడు కూడా. అలాంటప్పుడు వివేకానంద చాలా ప్రయత్నం చేస్తాడు.. అయినా చింటూ వెళ్లనని మొండికేసి పడుకుంటాడు.
ఆరోజు.. స్కూల్ టైము కావస్తున్నా తల్లి ఎంత లేపినా చింటూ మత్తుగా పడుకుని లేవటం లేదు. తండ్రి వివేకానంద..... "సాయంత్రం సినిమాకు తీసుకెళ్తానని, బొమ్మలు కొని పెడతానని, స్వీట్లు కొని పెడతానని..." చాలా ప్రయత్నించాడు, అయినా కుదరలేదు.
తల్లి రుక్మిణి కొడుకు దగ్గరకు వచ్చి... "నాయనా చింటూ! నీకు బెల్లం గారెలు అంటే ఇష్టం కదా. రేపు చేసి పెడతాను, నిదురలేచి స్కూల్‌కి వెళ్ళు..." అంటూ తెగ బ్రతిమలాడింది.
చింటూ మత్తు నిద్రలోంచి ఇంకా తేరుకోలేదు.
ఇద్దరూ కలిసి చింటూని స్కూల్‌కి పంపించడం ఎలా....? తండ్రి ఒక ప్లాన్ వేశాడు. స్కూలు టీచర్‌తో ఫోనులో మాట్లాడినట్లు నటించి ఇలా అన్నాడు..
"చింటూ.. ఈరోజు స్కూల్లో ఒక అబ్బాయిది బర్త్‌డే అట. స్వీట్లు, బొమ్మలు గట్రా పంచి పెడుతున్నారట. పద.. నేను బండి మీద తీసుకెళ్లి నిన్ను దిగబెడతాను." అన్నాడు.
"నాన్నా1 నిజంగానేనా.." అన్నాడు మత్తుగా పడుకున్న చింటూ..
ఈసారి వివేకానంద నిజంగానే స్కూల్ టీచర్ నారాయణమూర్తి గారికి ఫోన్ చేశాడు... నారాయణమూర్తి గారు నిజంగానే ఈరోజు స్కూలు సెలవు అని చెప్పి.. 'చింటూ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడానికి తాను వస్తున్నాను...' అంటూ కాసేపటికి వచ్చారు.
"వివేకానంద గారు.. మీ చింటూ వారం క్రితం స్కూల్లో ఏం చేశాడో మీకు చెప్పాడా? నేను కొన్ని పుస్తకాల కోసం స్టూలు ఎక్కి చూస్తుండగా.. ఆ స్టూలు విరిగిపోయింది. చింటూ ఒక్కడే అక్కడ ఉన్నాడు. కంగారు పడకుండా ఎవరికీ చెప్పకుండా స్కూల్ పక్కనే నివసిస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్ గారిని తీసుకొచ్చాడు.. ఆయన ప్రథమ చికిత్స చేశాడు. మీకు చెప్పాడా ఈ విషయం?" అడిగాడు నారాయణమూర్తి గారు.
వివేకానంద ఆశ్చర్యపడి లేదు అని చెప్పాడు.
"మరొక విషయం వింటే మీరు మరీ సంతోషపడతారు. మొన్న ఆగస్టు 15. సాయంత్రం జాతీయ జెండా తెగిపోయి సైడ్ కాలవలో పడిపోయింది.. మన చింటూ వెంటనే దానిని తీసి పక్కనే ఉన్న కుళాయి దగ్గర శుభ్రం చేసి తెచ్చి నాకు ఇచ్చాడు. పోనీ ఈ విషయం అయినా మీకు చెప్పాడా?.."
వివేకానంద మరింత ఆశ్చర్యపడుతూ లేదని తల అడ్డంగా ఊపాడు.
"దీన్ని బట్టి ఆలోచిస్తే తన గొప్ప చెప్పుకునే మనస్తత్వం కలిగినవాడు కాదు మీ చింటూ. గొప్పలు, పొగడ్తలు అవసరం లేని నిదానమైన ఆలోచనా సరళి అతనికి ఉంది. ఎటొచ్చి ఈ విషయం వెనుకనున్న తల్లిదండ్రులు, గురువులు మిగిలిన సమాజం గుర్తించగలగాలి... అలా అయితే చింటూ పెద్దయ్యేసరికి సమాజానికి ఉపయోగపడే మనిషిగా తయారవుతాడన్న మాట!"
నేను మీకు చెప్పేది ఏమిటి అంటే... పిల్లలు చెప్పినది ప్రతిదీ అబద్ధమని పెద్దవాళ్ళు అనుకుంటే వాళ్ళ మనోభావం దెబ్బతింటుంది. పైగా ప్రతిసారి వాళ్ళని బెదిరిస్తున్నట్టు ఏవో తాయిలాలు పెడతాం అన్నట్టు.. ఏవో నాటకాలు ఆడినట్టు పెద్దవాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది కూడా ఎంతమాత్రం కరెక్ట్ కాదు.
మనం వాళ్ళ పట్ల నిజాయితీగా ప్రవర్తిస్తూ పోతూ ఉంటే.. వాళ్ళు కూడా నిజాయితీగా బ్రతకడం నేర్చుకుంటారు. ఈ కాలంలో పిల్లలంటే పిల్లలు కాదండి.. పిడుగులు.. మహా తెలివైనవాళ్ళు. నేను ఫోన్లో మాట్లాడకుండా మీ ఇంటికి ఎందుకు వచ్చానంటే.."
"మీ చింటూని తక్కువగా అంచనా వేయొద్దు.. మీ మనస్తత్వాలు కూడా చింటూ పట్ల సానుకూలంగా మార్చుకుని.. తదనుగుణంగా నడుచుకోమని చెబుదామని వచ్చాను".
అంటూ చెప్పి నారాయణమూర్తి గారు వెళ్ళిపోయారు.
అంతా విన్న చింటూ తల్లిదండ్రులు.. మత్తులోంచి అప్పుడే మెలకువ వచ్చి మంచం మీద కూర్చున్న చింటూ దగ్గరకు వెళ్లి ప్రేమగా తనివితీరా ముద్దుపెట్టుకున్నారు.. తల్లిదండ్రుల ప్రేమానురాగాలకు చింటూ పరవశించిపోయాడు, మనసు ఆనందంతో లేడిపిల్లలా గంతులేసినట్లు అయిపోయింది.
ఆ తల్లిదండ్రుల మనసులు కూడా ఆనందంతో పరవశించిపోయాయి.
"నాయనా చింటూ... మీ మాస్టారు ఇక్కడికి వచ్చి ఇప్పుడే చెప్పారురా. ఈరోజు సెలవేనట. నాకు తెలియక నిన్ను వెళ్ళమన్నానురా. సరే.. ఈరోజు ఎగ్జిబిషన్‌కి వెళ్లి నీకు కావలసినవి కొనిపెడతాం... నీకు ఏం కావాలో చెప్పు?" అంటూ ప్రేమగా అడిగారు.
"అంతేకాదు నాయనా! అందరి తల్లిదండ్రుల్లాగే మేము కూడా ప్రవర్తించాము."
"పిల్లల పట్ల పెద్దవాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలో ఈ రోజు మీ మాస్టారి ద్వారా గ్రహించాము."
"ముఖ్యంగా నిన్ను ప్రేమగా చూసుకుంటూ, నువ్వు చెప్పేది"
నమ్ముతూ, నీతో సంతోషంగా ఉంటాం. మా మాట నమ్ము.
ఇంకెప్పుడూ నిన్ను అనుమానించినట్టు చూడము."
అంటూ ఆ తల్లిదండ్రులు ఇద్దరూ.. చింటూని ఎత్తుకొని
ముద్దాడారు.. చాలా అభిమానంగా.
చింటూ చాలా ఆనందంగా ఒక్కసారిగా పైకి లేచి తల్లిదండ్రులు ఇద్దరిని ఒకేసారి వాటేసుకున్నాడు.
"నిజంగా కొనిపెడతాము.. ఏమికావాలో చెప్పు నాయనా?"
అంటూ చాలా ప్రేమగా ఓ స్నేహితుడు మాదిరిగా అడిగారు.. మళ్ళీ.
చింటూ పులకించిపోయాడు.
"నాకు.. ఈ అమ్మనాన్న కావాలి.. ఇంకేమీ వద్దు!"
అన్నాడు ముద్దుముద్దుగా.
ఈసారి ఆ తల్లిదండ్రులు చింటూని చూసి.. పరవశించిపోలేదు.. అతని ముఖంలో ఒక అద్భుతమైన వెలుగు వాళ్ళిద్దరికీ కనబడింది.... దాన్ని చూస్తూ అలా ఉండిపోయారు.
తాము చింటూ భవిష్యత్తు పట్ల చాలా బాధ్యతాయుతంగా
ఉండాలని కూడా నిర్ణయించుకున్నారు.
సమాప్తం
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి కొన్ని ఇతర రచనలు:
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు









Comments